• facebook
  • whatsapp
  • telegram

ప్రపంచ సూచికల్లో భారతదేశం

ప్రపంచ నవకల్పన సూచిక - 2017

           ప్రపంచ ఆనంద సూచిక 2016లో మన దేశం 118వ స్థానంలో ఉంది. అయితే ప్రభుత్వం, వ్యాపారంలో నమ్మకం లేకపోవడం, ఉద్యోగ అసంతృప్తి, సామాజిక ప్రోత్సాహం కొరవడటం, తగ్గుతున్న జీవన ప్రమాణ సూచికలు లాంటివి సూచికలో దిగజారడానికి కారణమయ్యాయి.
   * ఐక్య రాజ్య సమితి సస్టెయినబుల్ (Sustainable) డెవలప్‌మెంట్ సొల్యూషన్స్ నెట్‌వర్క్ ప్రచురించే ఈ నివేదికను ప్రప్రథమంగా 2012, ఏప్రిల్ 1న విడుదల చేశారు. తర్వాత 2013, 2015, 2016, 2017లలో ఆనంద సూచిక నివేదిక వెలువడింది. 2017 నివేదికలో భారతదేశం 155 దేశాల్లో 122వ స్థానంలో నిలిచింది. నార్వే, డెన్మార్క్, ఐస్‌లాండ్ మొదటి మూడు స్థానాల్లో, టాంజానియా, బురుండీ, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ చివరి మూడు స్థానాల్లో నిలిచాయ.

 

ప్రపంచ నవకల్పన సూచిక - 2017

      ప్రపంచ నవకల్పన సూచిక (Global Innovation Index - GII)లో భారత్ 127 దేశాల్లో 60వ స్థానంలో నిలిచింది. స్విట్జర్లాండ్, స్వీడన్, నెదర్లాండ్స్ మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. బ్రిక్స్ దేశాల్లో చైనాకు 22వ స్థానం దక్కింది. రష్యా 45వ స్థానంలో నిలిచింది. దక్షిణాసియా, మధ్య ఆసియా దేశాల్లో భారతదేశం మెరుగైన స్థానంలోనే ఉంది. 2016లో భారతదేశం 66వ స్థానంలో నిలిచింది. ఈ సూచికను 2007 నుంచి విడుదల చేస్తున్నారు. దీన్ని కార్నెల్ యూనివర్సిటీ, INSEAD, ప్రపంచ మేధోహక్కుల సంస్థ (WIPO) సంయుక్తంగా ప్రచురిస్తున్నాయి. చివరి మూడు స్థానాల్లో నిలిచిన దేశాలు టోగో, గునియా, యెమెన్.
 

ప్రపంచ ఆకలి సూచిక - 2017 (Global Hunger Index - GHI)

       అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధనా సంస్థ (IFPRI) 2006 నుంచి ప్రపంచ ఆకలి సూచికను ప్రచురిస్తోంది. 'ఆకలి - అసమానతలు' అనే నినాదంతో 2017లో నివేదికను విడుదల చేశారు. 119 దేశాల్లో భారతదేశం 100వ స్థానంలో ఉంది. సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ చివరి స్థానంలో నిలిచింది. 2030 నాటికి ప్రపంచస్థాయిలో 'Zero hunger' స్థాయికి చేరడం ప్రధాన లక్ష్యం. 2016లో భారతదేశం 97వ స్థానంలో ఉంది. పిల్లల్లో పౌష్టికాహార లోపం, ఎత్తుకు తగ్గ బరువు లేకపోవడం, శారీరక వయసుకు తగిన బరువు లేకపోవడం, శిశుమరణాలు లాంటి అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ సూచికను రూపొందిస్తారు. పాకిస్థాన్ మినహా నేపాల్, మయన్మార్, బంగ్లాదేశ్, శ్రీలంక లాంటి పొరుగు దేశాలు భారత్ కంటే మెరుగైన స్థితిలో ఉండటం గమనార్హం.
 

ప్రపంచ పోటీతత్వ సూచిక (Global Competitiveness Index 2017-18)

         2004 నుంచి ప్రపంచ ఆర్థిక ఫోరం దీన్ని నివేదిక రూపంలో వెలువరిస్తోంది. స్థూల ఆర్థిక చలాంకాలు, సూక్ష్మ ఆర్థిక వ్యాపార అంశాలతో ఈ సూచికను రూపొందిస్తారు. ఇందులో వివిధ దేశాలకు సూచికను, ర్యాంకులను ఇస్తారు. ఈ సూచిక వివిధ దేశాల ఆర్థిక సౌభాగ్యాన్ని, సామర్థ్యాన్ని సూచిస్తుంది. 2016లో 39వ స్థానంలో ఉన్న భారత్ ప్రస్తుతం 137 దేశాల్లో 40వ స్థానంలో ఉంది. ప్రపంచ ఆర్థిక ఫోరం 12 కేటగిరీల్లో అంశాలను పోటీతత్వంలో ప్రాతిపదికగా తీసుకుంటుంది. స్విట్జర్లాండ్, అమెరికా, సింగపూర్ మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. బ్రిక్స్ దేశాల్లో బ్రెజిల్, దక్షిణాఫ్రికా కంటే భారత్ ముందుంది. ఇండియా ప్రధానంగా 12 కేటగిరీల్లో అవస్థాపనా సౌకర్యాలు, ఉన్నత విద్య, శిక్షణ, సాంకేతిక సన్నద్ధత లాంటి అంశాల్లో మెరుగ్గా ఉంది.
 

ప్రపంచ ప్రతిభా పోటీ సూచిక (Global Talent Competitiveness Index - 2017)

       గ్లోబల్ ఇండెక్స్ ఆఫ్ టాలెంట్ కాంపిటీటివ్ ఇండెక్స్ (GTCI)లోని 118 దేశాల్లో భారత్ 92వ స్థానం పొందింది. ఈ ర్యాంకులను INSEAD గ్లోబల్ బిజినెస్ స్కూల్ Adecco గ్రూప్, మానవ మూలధన నాయకత్వ సంస్థ (HCLI), సింగపూర్ సంస్థలు రూపొందించాయి. స్విట్జర్లాండ్, సింగపూర్, ఇంగ్లండ్ మొదటి 3 స్థానాల్లో ఉన్నాయి. 2016లో భారత్ 89వ ర్యాంకు సాధించింది. అలాగే గ్లోబల్ సిటీస్ టాలెంట్ పోటితత్వ సూచికను ప్రథమంగా ప్రవేశపెట్టారు. 46 నగరాల్లో కొపెన్‌హగెన్, జ్యూరిచ్, హెల్సింకి మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి.
 

ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ కరప్షన్ పర్‌సెప్షన్స్ సూచిక - 2016

        ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ 1996 నుంచి కరప్షన్ పర్‌సెప్షన్స్ సూచికను (CPI) విడుదల చేస్తోంది. ప్రైవేట్ వ్యక్తుల ప్రయోజనాల కోసం పబ్లిక్ పవర్‌ను దుర్వినియోగం చేయడాన్నే అవినీతిగా CPI పేర్కొంది. 176 దేశాల్లో అవినీతి సూచికకు కొలమానంగా '100' నుంచి '0' విలువలను ప్రాతిపదికగా తీసుకున్నారు. కొలమానంలో '100' అనేది very clean ను సూచిస్తే '0' అనేది అత్యంత అవినీతిని సూచిస్తుంది. ఈరకంగా చూసినప్పుడు కొలమానంలో '90' విలువతో డెన్మార్క్, న్యూజిలాండ్ సంయుక్తంగా 1వ స్థానంలో అంటే వెరీ క్లీన్ దేశాలుగా గుర్తింపు పొందాయి. తర్వాతి స్థానంలో ఫిన్లాండ్ నిలిచింది.
 భారతదేశం '40' విలువతో 79వ స్థానంలో ఉంది. అత్యంత అవినీతిమయ దేశంగా '10' విలువతో సోమాలియా 176వ స్థానంలో ఉంది. తర్వాత దక్షిణ సూడాన్, ఉత్తర కొరియా దేశాలున్నాయి.

 

ప్రపంచ సంపద నివేదిక - 2017

      గడిచిన 12 నెలల్లో 9.9% వృద్ధితో 2017 నాటికి అయిదు లక్షల కోట్ల డాలర్ల స్థాయికి భారత సంపద వృద్ధి చెందుతుందని క్రెడిట్ సూస్ (Credit Suisse) పరిశోధన సంస్థ అంచనా వేసింది. 451 బిలియన్ డాలర్ల సంపదతో భారతదేశం ప్రపంచ సంపద వృద్ధిలో 8వ స్థానంలో ఉంది.
     21.3% వృద్ధితో 2017 నాటికి 2,45,000 మిలియనీర్లు ఉంటారని, 56% వృద్ధితో బిలియనీర్ల సంఖ్య 42 కు చేరుతుందని పేర్కొంది. 2022 నాటికి 3,72,000 మిలియనీర్లు అవతరిస్తారని క్రెడిట్ సూస్ అంచనా. సగటు సంపద 2017 నాటికి 5,980 డాలర్లు ఉంటుందని పేర్కొంది. జనాభాలో 92% సంపద 10,000 డాలర్లలోపు ఉంటుంది. మొత్తం ప్రపంచ సంపద 280 ట్రిలియన్ల డాలర్లుగా క్రెడిట్ సూస్ అంచనా వేసింది. సంపద వృద్ధిలో కెనడా, ఆస్ట్రేలియా, ఇటలీ, భారత్ తర్వాతి స్థానంలో ఉన్నాయి. జనాభా 1% ఉన్న సంపన్నుల చేతిలో 60% సంపద భారత్‌లో కేంద్రీకృతం కావడంతో ఆదాయ అసమానతలో ప్రపంచంలో 2వ స్థానంలో ఉంది.

 

ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచిక (World Press Freedom Index - 2017)

     Reporters without Borders (Reporters Sans Frontiers) అనే సంస్థ ఈ సూచికను విడుదల చేస్తుంది. ఐక్య రాజ్యసమితి జనరల్ అసెంబ్లీ మే 3వ తేదీని ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవంగా ప్రకటించింది. 180 దేశాల్లో అత్యంత స్వేచ్ఛను కల్పిస్తున్న దేశాల్లో పైనుంచి ఇండియా 136వ స్థానంలో ఉంది. 2016లో 133వ స్థానంలో నిలిచింది.
    నార్వే, స్వీడన్, ఫిన్లాండ్ మొదటి 3 స్థానాల్లో ఉన్నాయి. తుర్క్‌మెనిస్థాన్, ఎరిట్రియా, ఉత్తర కొరియా చివరి స్థానాల్లో ఉన్నాయి.

 

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంక్ (Ease of Doing Business - 2017-18)

     ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ - 2018 నివేదికలో 190 దేశాల్లో భారతదేశం 100వ స్థానంలో ఉంటుందని అంచనా వేసింది. అంతకుముందు సంవత్సరం 130వ స్థానంలో ఉన్న ఇండియా ఒకేసారి రికార్డు స్థాయిలో 30 స్థానాలు అధిగమించి 100వ స్థానం చేరడం విశేషం. ప్రపంచ బ్యాంకు తీసుకున్న 10 సూచికల్లో భారత్ 8లో మెరుగ్గా ఉంది. జూన్ 2016 నుంచి జూన్ 2017 కాలాన్ని దీనికోసం పరిగణనలోకి తీసుకున్నారు. న్యూజిలాండ్, సింగపూర్, డెన్మార్క్ మొదటి 3 స్థానాల్లో ఉండగా వెనెజులా, ఎరిట్రియా, సోమాలియా చివరి 3 స్థానాల్లో నిలిచాయి. 2003 నుంచి భారతదేశం దాదాపు 37 సంస్కరణలను ప్రవేశపెట్టగా, గడచిన 4 సంవత్సరాల్లోనే దాదాపు 18 సంస్కరణలను వేగంగా అమలు చేశారు.
 

 సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ సూచిక (Sustainable Development Goals Index - 2017)

         2016లో 110వ ర్యాంక్‌లో ఉన్న భారత్ 2017లో 157 దేశాల్లో 116వ స్థానంలో ఉంది. కొనసాగించగలిగే అభివృద్ధి లక్ష్యాలైన 17 లక్ష్యాలను పరిగణనలోకి తీసుకుని ఈ నివేదికను రూపొందించారు. స్వీడన్, డెన్మార్క్, ఫిన్లాండ్ మొదటి 3 స్థానాల్లో ఉన్నాయి. 2015లో ఐక్య రాజ్య సమితి సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ సదస్సులో 2015 30 మధ్య ప్రపంచ దేశాల్లో 17 లక్ష్యాలను సాధించాలని నిర్ణయించారు. ఆ లక్ష్యాలకు అనుగుణంగా సాధించిన ర్యాంకులను ప్రకటిస్తున్నారు. అంతకు ముందు మిలీనియం అభివృద్ధి లక్ష్యాల కంటే (MDGS) ఇవి విస్తృతమైనవి. ‘Transforming our World-2030 Agenda for Sustainable Development’ అనే నినాదంతో పేదరికం, ఆకలి, ఆరోగ్యం, విద్య, వాతావరణ మార్పులు, లింగ సమానత, నీరు, పారిశుద్ధ్యం, శక్తి వనరులు, పర్యావరణం, సాంఘిక న్యాయం, ఆర్థికవృద్ధి, వ్యవస్థాపూర్వక, నవకల్పన, పారిశ్రామికాభివృద్ధి, వినియోగం, ఉత్పత్తి బాధ్యత, నగరాలు, కమ్యూనిటీల అభివృద్ధి, లక్ష్యాల సాధనలో భాగస్వామ్యం లాంటి లక్ష్యాలతో వివిధ దేశాల అభివృద్ధిని అంచనా వేస్తున్నారు.
                        విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విశ్వాస సూచిక (FDI Confidence Index - 2017)
     ఎ.టి. కెర్నె (Kearney) నివేదిక ప్రకారం FDI విశ్వాస సూచికలో భారత్ 8వ స్థానంలో ఉంది. అమెరికా, జర్మనీ, చైనా తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. 31% సంస్థల సర్వే ప్రకారం రానున్న 3 సంవత్సరాల్లో పెట్టుబడుల అనుకూల దేశంగా భారత్ ముందుంటుందని అంచనా. 70% సంస్థలు భారత్ FDI లకు ఉత్సాహంతో ఉన్నారు. దేశంలో ఉన్న రాజకీయ, ఆర్థిక, వ్యాపార అనుకూల వాతావరణం ఇందుకు దోహదం చేసింది. రక్షణ, టెలికాం, బ్రాడ్‌కాస్టింగ్ రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా నిబంధనలను సడలిస్తున్నారు.


ప్రపంచ ప్రయాణ, పర్యటక పోటీతత్వ సూచిక (Global Travel & Tourism Competitiveness Index (TTCI) - 2017)

      2015లో 52వ స్థానంలో ఉన్న భారత్ 2017లో 136 దేశాల్లో 40వ స్థానానికి చేరుకుంది. స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ మొదటి 3 స్థానాల్లో ఉన్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ప్రయాణ, పర్యటక రంగం 7.6 ట్రిలియన్ల డాలర్లను అందిస్తోంది. ప్రపంచ జీడీపీలో 10.2% అందిస్తోంది. 292 మిలియన్ల ఉద్యోగాలను సృష్టిస్తోంది. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదలో భాగంగా గుర్తించిన ప్రదేశాల్లో పర్యటకులను ఆకట్టుకునే ప్రయత్నంలో భారత్ తన ర్యాంకును మెరుగుపరచుకుంటోంది. ప్రతి పదిమందిలో ఒకరు పర్యటక రంగం ద్వారా ఉపాధి పొందుతున్నారు. భారతదేశం ఇన్‌క్రెడిబుల్ ఇండియా నినాదంతో ముందుకెళుతోంది. ప్రపంచ ఆర్థిక ఫోరమ్ ఈ నివేదికను వెలువరిస్తోంది. ప్రపంచ పర్యటక, ప్రయాణ మండలి (WTTC) 2016 - 2026 అంచనాల ప్రకారం భారతదేశం ప్రపంచ మొదటి 10 పర్యటక ప్రదేశాల జాబితాలోకి చేరవచ్చని భావిస్తున్నారు.

ఆర్థిక స్వేచ్ఛా సూచిక (Index of Economic Freedom-2017)

     అమెరికాకు చెందిన హెరిటేజ్ ఫౌండేషన్ విడుదల చేసిన సూచికలో 180 దేశాల్లో ఇండియా 143వ ర్యాంకులో ఉంది. హాంకాంగ్, సింగపూర్, న్యూజిలాండ్ మొదటి 3 స్థానాల్లో ఉన్నాయి.
    ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్, ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్, ఎకనమిక్ ఇంటెలిజెన్స్ యూనిట్స్ రూపొందించిన 10 సూచికల సహాయంతో ఈ ర్యాంకులు ప్రకటించారు. క్యూబా, వెనెజులా, ఉత్తర కొరియా చివరి స్థానాల్లో ఉన్నాయి. నేపాల్, శ్రీలంక, పాకిస్థాన్, భూటాన్, బంగ్లాదేశ్ భారత్ కంటే ముందున్నాయి. 2016లో ఇండియా 123వ స్థానంలో ఉంది.

     లింగ అసమానత సూచిక (Global Gender Gap Index-2017)

   2017లో లింగ అసమానత సూచికలో మన దేశం 144 దేశాల్లో 108వ స్థానంలో నిలిచింది. 2016లో 87వ స్థానంలో ఉండటం విశేషం. స్త్రీ, పురుషుల మధ్య అసమానతలో ప్రధానంగా విద్య, ఆరోగ్యం, ఆర్థిక అవకాశాలు, రాజకీయ సాధికారిత లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రపంచ ఆర్థిక ఫోరం ఈ నివేదికను రూపొందించింది. ఐస్‌లాండ్, నార్వే, ఫిన్లాండ్ మొదటి 3 స్థానాల్లో ఉన్నాయి. ఈ దేశాల్లో లింగ అసమానత అత్యల్పంగా 0 - 1 మధ్య ఉంది. భారత్ ఆరోగ్య సూచికలో 141వ స్థానంలో, ఆర్థిక ప్రాతినిధ్యం, అవకాశాల్లో 139వ స్థానంలో నిలిచింది.
                               

 ప్రపంచ శాంతి సూచిక (Global Peace Index - GPI)

     ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎకనమిక్స్ అండ్ పీస్ వెలువరించే ఈ నివేదికలో 163 దేశాల్లో ఇండియా 137వ స్థానంలో నిలిచింది. 2016లో మన దేశం 141వ స్థానంలో ఉంది. ఐస్‌లాండ్, న్యూజిలాండ్, పోర్చుగల్ అత్యంత శాంతియుత వాతావరణ పరిస్థితులు ఉన్న మొదటి 3 దేశాలుగా స్థానం సంపాదించుకున్నాయి. ఇరాక్, అఫ్గానిస్థాన్, సిరియా దేశాల్లో అత్యంత అశాంతియుత వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. మధ్య ఆసియా, ఉత్తర ఆఫ్రికాల్లో అత్యంత దారుణమైన అశాంతియుత వాతావరణ పరిస్థితులు ఉన్నట్లు ఈ నివేదిక వెల్లడించింది.

Posted Date : 02-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌