• facebook
  • whatsapp
  • telegram

 ద్రవ్యోల్బణం

ఏ సందర్భంలో..


 సాధారణ ధరల స్థాయిలో నిర్విరామంగా, స్థిరంగా పెరుగుదల ఏర్పడే పరిస్థితిని ద్రవ్యోల్బణం అంటారు. ఇది వస్తు, సేవల ధరల పెరుగుదలను సూచిస్తుంది. వస్తు, సేవలకు ఉన్న అత్యధిక డిమాండ్‌ వల్ల ద్రవ్య విలువ తగ్గి, ధరలు పెరిగితే దాన్ని ద్రవ్యోల్బణం అంటారు. వస్తు, సేవల ఉత్పత్తి కంటే డిమాండ్‌ ఎక్కువై ధరలు పెరగడాన్ని ద్రవ్యోల్బణం అంటారు.

 వస్తు, సేవల ఉత్పత్తి రేటు కంటే ధరల పెరుగుదల రేటు ఎక్కువగా ఉంటే ద్రవ్యోల్బణం అనొచ్చు.

 అభివృద్ధిని కోరే ఆర్థికవ్యవస్థలో ధరల స్థిరీకరణ అంటే వస్తు, సేవల రేట్లలో తీవ్రమైన హెచ్చుతగ్గులు ఉండకూడదు. ధరల్లో స్వల్ప పెరుగుదల ఆర్థికాభివృద్ధికి అన్ని విధాల శ్రేయస్కరం. స్వల్పంగా పెరిగే ధరల వల్ల ఉత్పత్తిదారులకు లాభాలు, శ్రామికులకు ఎక్కువ వేతనాలు లభిస్తే; అధిక వినియోగం వల్ల ఆర్థికాభివృద్ధి జరుగుతుంది.

 ధరల పెరుగుదల 1.5 శాతం రేటు ఉంటే అది స్వల్పం అని, సంపూర్ణ ఉద్యోగిత, ఆర్థికాభివృద్ధిని సాధించేందుకు అది అవసరమని కొంతమంది ఆర్థిక రంగ నిపుణులు భావించారు. 2% కంటే ఎక్కువ రేటు ధరల పెరుగుదలను ద్రవ్యోల్బణంగా పేర్కొన్నారు.

 ద్రవ్యోల్బణాన్ని నిర్ణయించడంలో కాలం ఒక ముఖ్య అంశం. ఆయా పరిస్థితులను అనుసరించి కాలాన్ని మూడు నుంచి పన్నెండు నెలల వరకు పరిగణించాలి.


రకాలు


పాకుతున్న ద్రవ్యోల్బణం creeping inflation: ధరల పెరుగుదల  ఏడాదిలో 3 శాతానికి మించకుండా ఉంటే దాన్ని ‘పాకుతున్న ద్రవ్యోల్బణం’ అంటారు. దీన్ని ఆచార్య కెంట్‌ ప్రతిపాదించారు.


నడుస్తున్న ద్రవ్యోల్బణం walking inflation : ధరల పెరుగుదల  ఏడాదిలో 3 నుంచి 4% మధ్యలో ఉంటే దాన్ని నడుస్తున్న ద్రవ్యోల్బణం అంటారు. 


పరిగెత్తే ద్రవ్యోల్బణం Running inflation: ధరల పెరుగుదల ఏడాదిలో 10 శాతం వరకు ఉంటే దాన్ని పరిగెత్తే ద్రవ్యోల్బణం అంటారు.


దూకుతున్న ద్రవ్యోల్బణం/ అతి తీవ్రమైన ద్రవ్యోల్బణం Galloping inflation Hyper inflation: ధరల పెరుగుదల చాలా ఎక్కువ స్థాయిలో ఉంటే దాన్ని దూకుతున్న ద్రవ్యోల్బణం అంటారు. ఏడాదిలో ధరల పెరుగుదల 100% వరకు ఉండొచ్చు.


గుణాత్మక ద్రవ్యోల్బణం Quality theory of inflation: వ్యాపారి వస్తువులను అమ్మడం ద్వారా సేకరించిన కరెన్సీని తర్వాతి కాలంలో మార్పు చేసుకోవాలనే అంచనాపై (Quality theory of infiation) ఆధారపడిన ధరల పెరుగుదలను ‘గుణాత్మక ద్రవ్యోల్బణం’ అంటారు.


పరిమాణాత్మక ద్రవ్యోల్బణం Quantity theory of inflation ): ద్రవ్య సప్లయ్, చలామణి, ద్రవ్య మారకాల సమీకరణంపై ఆధారపడిన ధరల పెరుగుదలను పరిమాణాత్మక ద్రవ్యోల్బణం అంటారు.


రంగాల సంబంధిత ద్రవ్యోల్బణం sectoral inflation : ఉత్పత్తి రంగంలోని ఒక తరహా పరిశ్రమలో తయారైన వస్తు, సేవల ధరలు పెరగడాన్ని రంగాల సంబంధిత ద్రవ్యోల్బణం అంటారు. ఉదాహరణకు ముడిచమురు ధర పెరిగితే, దాన్ని ఉపయోగించే ఇతర పరిశ్రమల ఉత్పత్తుల ధరలు కూడా పెరుగుతాయి.


ధర శక్తి నిర్ణాయక ద్రవ్యోల్బణం pricing power inflation: పారిశ్రామిక, వ్యాపార సంస్థలు తమ లాభాలను పెంచుకోవడానికి వాటి ఉత్పత్తి, అమ్మకం ధరల్ని పెంచడాన్ని ‘ధర శక్తి నిర్ణాయక ద్రవ్యోల్బణం’ అంటారు. 


 ధరను నిర్ణయించే అధికారం ఉన్న పరిమితస్వామ్య సంస్థలు తమ లాభాలను పెంచుకోవడానికి వస్తువుల ధరల్ని పెంచొచ్చు. ఈ విధమైన ద్రవ్యోల్బణాన్ని ‘పరిమితస్వామ్య ద్రవ్యోల్బణం’ Oligopolistic inflation   లేదా పాలిత ద్రవ్యోల్బణం admiministered inflation  అంటారు.


కోశ సంబంధ ద్రవ్యోల్బణం fiscal inflationi: ప్రభుత్వం సేకరించిన రాబడి కంటే ఎక్కువ వ్యయం చేయడం వల్ల ఏర్పడే ద్రవ్యోల్బణం. ప్రభుత్వ బడ్జెట్‌ లోటు వల్ల కలిగే ధరల పెరుగుదలను కోశసంబంధ ద్రవ్యోల్బణంగా పేర్కొంటారు.


పాక్షిక ద్రవ్యోల్బణం semi inflation : సంపూర్ణ ఉద్యోగిత స్థాయి చేరడానికి ముందే కొన్ని రకాల ఉత్పత్తి సాధనాల కొరత వల్ల ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. దీనివల్ల ధరలను పెంచాలి. ఇలాంటి ద్రవ్యోల్బణాన్ని పాక్షిక ద్రవ్యోల్బణం అంటారు.


మిశ్రమ ద్రవ్యోల్బణం mixed inflation : యాజమాన్యం కార్మికుల వేతనాలను పెంచితే, ఉత్పత్తి వ్యయాలు పెరిగి ధరలు పెరుగుతాయి (ఇది వ్యయప్రేరిత ద్రవ్యోల్బణం). అంటే డిమాండ్‌ పెరగటం వల్ల ఉత్పత్తి వ్యయాలు అధికమై ధరలు పెరుగుతాయి. ఇవన్నీ ఒకదానిపై మరొకటి ఆధారపడి ధరల పెరుగుదలకు కారణమవుతాయి. దీన్నే ‘మిశ్రమ ద్రవ్యోల్బణం’ అంటారు.


వ్యవస్థాపూర్వకమైన ద్రవ్యోల్బణం: పురోగమిస్తున్న రంగాల్లో డిమాండ్‌ పెరగడం వల్ల ధరలు అధికంకావొచ్చు. క్షీణిస్తున్న రంగాల్లో ఉత్పత్తి వ్యయాలు పెరగడం వల్ల ధరలు పెరగొచ్చు. ఈ రెండూ కలిసి ఉండటాన్ని ‘వ్యవస్థాపూర్వక ద్రవ్యోల్బణం’ అంటారు. దీన్ని థియోడర్‌ షుల్జ్‌ ప్రతిపాదించారు.


బహిరంగ ద్రవ్యోల్బణం: అధిక ధరల నియంత్రణకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోతే ఆ పెరుగుదల బహిర్గతంగా కనిపిస్తుంది.


అణచివేసిన/ మరుగునపడిన ద్రవ్యోల్బణం: ఇందులో ధరలు పెరిగినట్లు బయట కనిపించదు. ప్రభుత్వం ధరల పెరుగుదలపై నియంత్రణ విధించడమే ఇందుకు కారణం. 


 రాబర్ట్‌ జె గార్డన్‌ వర్గీకరణ


ఈయన ద్రవ్యోల్బణాన్ని మూడు రకాలుగా విభజించారు. దీన్నే ‘త్రికోణ నమూనా’ ( triangle model)  అంటారు. అవి:


డిమాండ్‌ ప్రేరిత ద్రవ్యోల్బణం Demand  pull inflation


 వస్తు, సేవల సప్లయ్‌ కంటే డిమాండ్‌ ఎక్కువగా ఉన్నప్పుడు ధరలు పెరుగుతాయి. దీనివల్ల డిమాండ్‌ ప్రేరిత ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. ఇది ప్రభుత్వ, ప్రైవేట్‌ వ్యయం కారణంగా సమష్టి డిమాండ్‌లో కలిగే పెరుగుదల వల్ల ఏర్పడే ద్రవ్యోల్బణం. 


 అధిక డిమాండ్, అనుకూల మార్కెట్‌ పరిస్థితులు పెట్టుబడిని ప్రోత్సహించి, హెచ్చురేటు ఆర్థికవృద్ధికి సహాయపడతాయి. అయితే తగ్గుతున్న ద్రవ్య విలువ పొదుపు కంటే వ్యయాన్ని ప్రోత్సహించి, పెట్టుబడిని క్షీణింపజేస్తుంది.


 వనరులను సంపూర్ణంగా ఉపయోగించినా లేదా డిమాండ్‌లో వచ్చే వేగవంతమైన పెరుగుదలకు అనుగుణంగా ఉత్పత్తిని పెంచే అవకాశం లేనప్పుడు వస్తు, సేవల సప్లయ్‌లో కొరత ఏర్పడుతుంది. దీంతో ధరల స్థాయి పెరిగి, ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది.


వ్యయప్రేరిత ద్రవ్యోల్బణం Cost push inflation )


 వివిధ ధరల స్థాయుల వద్ద ఒక ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి చేసిన వస్తు, సేవల విలువలను సమష్టి సప్లయ్‌ తెలుపుతుంది. ఉత్పత్తి వ్యయంలో పెరుగుదల వల్ల వస్తు, సేవల సమష్టి సప్లయ్‌లో వచ్చే తగ్గుదల కారణంగా ‘వ్యయప్రేరిత ద్రవ్యోల్బణం’ ఏర్పడుతుంది.


 ఉద్యోగులు అధిక వేతనాల కోసం పట్టుబట్టడం, యజమానులు ఎక్కువ లాభాల కోసం వస్తువుల రేట్లను పెంచడం వల్ల వ్యయాలు పెరిగి వ్యయప్రేరిత ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. 


 ఇలాంటి స్థితిని విల్లార్డ్‌ తోర్ప్, రిచర్డ్‌ క్వాంట్‌ అనే ఆర్థికవేత్తలు నవ ద్రవ్యోల్బణంగా పేర్కొన్నారు. వీరి ప్రకారం వేతనాల్లో పెరుగుదల, లాభాల కోసం అధిక మార్కప్‌ ధరలు వ్యయప్రేరిత ద్రవ్యోల్బణానికి ప్రధాన కారకాలు.


 శక్తిమంతమైన ఉద్యోగ సంఘాలు - ప్రత్యేకించి పారిశ్రామిక దేశాల్లోని ఉద్యోగ సంఘాల వృద్ధి కారణంగా ద్రవ్యోల్బణం చోటు చేసుకుందని కొంతమంది ఆర్థికవేత్తల అభిప్రాయం. 


 ఉద్యోగులు వారి ఉత్పాదకత విలువ కంటే ఎక్కువ శాతం జీతాన్ని డిమాండ్‌ చేయడం వల్ల వేతనాలు పెరిగి, ఉత్పత్తి వ్యయం అధికమవుతుంది. ఈ కారణంగా తిరిగి యజమానులు సమాంతరంగా వస్తు ధరలను పెంచుతారు. ఫలితంగా నిజవేతనాలు తగ్గుతాయి. ఈ ప్రక్రియ ఫలితంగా ఉత్పత్తి-వ్యయాలు పెరిగి వ్యయప్రేరిత ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది.


 ఉత్పత్తికారకాల ధర పెరుగుదల వల్ల సమష్టి సప్లయ్‌ తగ్గి ( Supply Shock inflation ) ఈ రకమైన ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. అంటే ఉత్పత్తికారకాల ధరలు అనేవి పెరుగుదల ఉత్పత్తి వ్యయాన్ని పెంచి, ధరల పెరుగుదలకు దారితీస్తాయి.


 వస్తు, సేవల ఉత్పత్తికి అయ్యే వ్యయం పెరగడం వల్ల ద్రవ్యోల్బణ పరిస్థితులు ఏర్పడితే, దాన్ని ‘వ్యయప్రేరిత ద్రవ్యోల్బణం’ అంటారు. దీన్నే ‘సప్లయ్‌ ప్రేరిత ద్రవ్యోల్బణం’ అని కూడా అంటారు.


అంతర్లీన ద్రవ్యోల్బణం Bullt in inflation )  :  వేతనాలు పెరగాలనే కార్మికులు, ఉద్యోగుల ఆశలు (Expectactions) ద్రవ్యోల్బణానికి ప్రేరణ ఇస్తాయి. దీన్ని ‘ధర/ వేతన విస్ఫోటనం’ అంటారు. ఈ విధమైన ధర/ వేతన పెరుగుదల వ్యయం వినియోగదారుడిపై పడుతుంది. అంతర్లీన ద్రవ్యోల్బణం గతకాలపు పరిస్థితులను ప్రతిబింబిస్తాయి. అందుకే దీన్ని Hangover inflation  అని కూడా అంటారు.


ప్రముఖుల అభిప్రాయాలు


ఆర్థికవేత్తల అభిప్రాయం ప్రకారం, సంపూర్ణ ఉద్యోగిత తర్వాత ద్రవ్య పరిమాణంలో వచ్చే పెరుగుదల వల్ల ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది.


జె.ఎం.కీన్స్‌: ‘‘సంపూర్ణ ఉద్యోగిత స్థాయి వద్ద ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా ఉండటం వల్ల ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది’’. కీన్స్‌ దృష్టిలో సంపూర్ణ ఉద్యోగిత నిరంతరం కొనసాగదు. ఆర్థిక వ్యవస్థలో అల్ప ఉద్యోగిత ఉన్న కాలంలోనే ద్రవ్య సప్లయ్‌ క్రమంగా పెరుగుతున్న కొద్దీ సమష్టి డిమాండ్‌ అధికమై, ఆదాయ ఉద్యోగిత స్థాయి పెరుగుతుంది. ఒక దశ దాటాక కొన్ని ప్రతిబంధకాల కారణంగా ధరల స్థాయి క్రమంగా అధికమై, సంపూర్ణ ఉద్యోగితను చేరేవరకు పెరుగుతూ ఉంటుంది. ఈ విధంగా పూర్తి స్థాయిలో ద్రవ్యోల్బణం ఏర్పడకముందు ఉండే స్థితిని జె.ఎం.కీన్స్‌ ప్రతిబంధక ద్రవ్యోల్బణం లేదా అపరిపూర్ణ ద్రవ్యోల్బణంగా పేర్కొన్నారు. ఒకవేళ సంపూర్ణ ఉద్యోగిత తర్వాత ద్రవ్యసప్లయ్‌ మరింత పెరుగుతుంటే వస్తు ఉత్పత్తి మారదు. కానీ ద్రవ్య సప్లయ్‌ ఎంత అనుపాతంలో పెరుగుతుందో ధరలు కూడా అదే అనుపాతంలో పెరుగుతాయి. ఇలాంటి స్థితిని వాస్తవ/ నిజ ద్రవ్యోల్బణంగా పేర్కొన్నాడు. ఆర్థిక వ్యవస్థలో అవసరానికి మించి లేదా అధిక డిమాండ్‌ ఫలితంగా ద్రవ్యోల్బణం ఏర్పడుతుందని ఈయన పేర్కొన్నారు.


మిల్టన్‌ ఫ్రైడ్‌మన్‌: ‘‘అధిక మొత్తం ఉన్న ద్రవ్య పరిమాణం అత్యల్ప వస్తు పరిమాణంపై స్వారీ చేసేదే ద్రవ్యోల్బణం. ద్రవ్యోల్బణం అనేది ఎల్లప్పుడూ ఎక్కడైనా ద్రవ్యార్థిక దృగ్విషయం.’’


 వస్తు ఉత్పత్తి పరిమాణం కంటే ద్రవ్య పరిమాణంలో వచ్చే వేగవంతమైన పెరుగుదల ద్రవ్యోల్బణానికి కారణమవుతుంది. 


‘ధరల్లో ఏర్పడే నిరంతర పెరుగుదలే ద్రవ్యోల్బణం.’’  - హెచ్‌.డబ్ల్యూ.జాన్సన్‌


సాధారణ ధరల స్థాయి క్రమానుగతంగా పెరగడం వల్ల ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది.’’ - ఎఫ్‌.ఎస్‌.భ్రూమన్‌


ద్రవ్యోల్బణ స్థితిలో ద్రవ్య విలువ తగ్గి, ధరలు పెరుగుతాయి.’’ - జి.ఎఫ్‌.క్రౌథర్‌


తక్కువ వస్తువు రాశిని హెచ్చు ద్రవ్యరాశికి బదిలీ చేయడమే ద్రవ్యోల్బణం.’’ -హ్యూ డాల్టన్‌


రచయిత

బండారి ధనుంజయ

విషయ నిపుణులు 

Posted Date : 23-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌