• facebook
  • whatsapp
  • telegram

భారత ప్రజా ప్రాతినిధ్య చట్టాలు

భారత ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951

ఈ చట్టంలో చట్టసభలకు పోటీచేసే అభ్యర్థుల అర్హతలు, అనర్హతలు, ఎన్నికల నిర్వహణ, ఎన్నికల సంబంధమైన వివరాలు, ఇతర అంశాలు ఉన్నాయి. ఇందులోని కీలకమైన సెక్షన్లు, వాటి వివరణ.

సెక్షన్‌ 8(3): 

* నేరం రుజువై రెండేళ్ల జైలుశిక్షకు గురైన వారు ఎన్నికల్లో పోటీ¨కి అనర్హులు. వీరు జైలు  నుంచి విడుదలైన తర్వాత కూడా ఆరేళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేయకూడదు.

సెక్షన్‌ 8(4): 

* ఏ చట్టసభ సభ్యుడినైనా దిగువ న్యాయస్థానం ‘దోషి’గా నిర్ధారించినప్పుడు, వారు దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ హైకోర్టులో అప్పీలు చేయొచ్చు. 

* దిగువ న్యాయస్థానం తీర్పు వెలువరించిన తేదీ నుంచి 3 నెలల వరకు సంబంధిత సభ్యుడికి అనర్హత వేటు నుంచి మినహాయింపు ఉంటుంది (ఉన్నత న్యాయస్థానంలో అప్పీలు చేసుకోవడానికి వీలుగా). 

* ఆ వ్యక్తి ఉన్నత న్యాయస్థానంలో అప్పీలు చేసుకున్నాక, అది పెండింగ్‌లో ఉన్నంతకాలం అనర్హత వేటు నుంచి రక్షణ పొందుతాడు.

సెక్షన్‌ 29 (A): రాజకీయ పార్టీల నమోదు.

సెక్షన్‌ 29 (B): విరాళాల స్వీకరణకు రాజకీయ పార్టీలకు అనుమతి.
సెక్షన్‌ 29 (C): రాజకీయ పార్టీల విరాళాలపై ధ్రువీకరణ.

సెక్షన్‌ 62 (5): చట్టసభల్లో సభ్యుడిగా కొనసాగాలంటే వారికి ఓటు హక్కు ఉండాలి. 

సెక్షన్‌ 75(A): ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు తమ ఆస్తులు, అప్పుల వివరాలను ధ్రువీకరించి, ప్రకటించాలి.

సెక్షన్‌ 77: ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ఎన్నికల వ్యయంపై పరిమితులు.

సెక్షన్‌ 78: ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు ఎన్నికలు ముగిసిన 30 రోజుల్లోగా ఎన్నికల వ్యయం వివరాలను ఆయా జిల్లాల ఎన్నికల అధికారులకు సమర్పించాలి.

సెక్షన్‌ 80 (A): పార్లమెంట్, రాష్ట్రశాసనసభల ఎన్నికల పిటిషన్లపై విచారణ చేసే అధికారం హైకోర్టుకు ఉంటుంది.

సెక్షన్‌ 102: ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులకు సమానమైన ఓట్లు వచ్చినప్పుడు, హైకోర్టు పర్యవేక్షణలో లాటరీ ద్వారా ఎన్నిక ఫలితాన్ని నిర్ణయిస్తారు.

సెక్షన్‌ 116 (A): ఎన్నికల వివాదాలపై హైకోర్టు వెలువరించిన తీర్పును సుప్రీంకోర్టులో అప్పీలు చేయొచ్చు.
సెక్షన్‌ 123: అవినీతి చర్యలకు పాల్పడిన వారు ఎన్నికల్లో పోటీచేయడానికి అనర్హులు.
సెక్షన్‌ 125(A): ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు తప్పుడు అఫిడవిట్లను సమర్పిస్తే వారు శిక్షార్హులు అవుతారు.
సెక్షన్‌ 126: ఎన్నికల ప్రచార గడువు ముగిసిన తర్వాత బహిరంగ సభలు నిర్వహించడం నేరం.
సెక్షన్‌ 126(A): ఎన్నికలు జరిగే తేదీకి 48 గంటల ముందు ఆ ప్రాంతాలలో సభలు,సమావేశాలునిర్వహించడం;దృశ్య,శ్రవణ సాధనాల ద్వారా ప్రచారం చేయడం నిషేధం.

సెక్షన్‌ 128: ఎన్నికల ప్రకియలో రహస్య ఓటింగ్‌ విధానాన్ని ఉల్లంఘించినవారు శిక్షార్హులు అవుతారు.
సెక్షన్‌ 134(A): ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల ఏజెంట్లు, పోలింగ్‌ ఏజెంట్లు, కౌంటింగ్‌ ఏజెంట్లుగా వ్యవహరిస్తే శిక్షకు గురవుతారు.
సెక్షన్‌ 134(B): ఎన్నికల సమయంలో పోలింగ్‌ ౠత్‌ల వద్ద ఆయుధాలతో సంచరించడం నేరం.
సెక్షన్‌ 146: రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 103 ప్రకారం పార్లమెంట్‌ సభ్యులను అనర్హులుగా ప్రకటించే సందర్భంలో రాష్ట్రపతి; ఆర్టికల్‌ 192 ప్రకారం శాసనసభ్యులను అనర్హులుగా ప్రకటించే సందర్భంలో గవర్నర్‌ కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చే సూచనలను తప్పనిసరిగా పాటించాలి.

సెక్షన్‌ 158: ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు తాము చెల్లించిన ‘డిపాజిట్‌’ (ధరావత్తు)ను తిరిగి పొందాలంటే పోలైన మొత్తం ఓట్లలో 1/6వ వంతు చెల్లుబాటయ్యే ఓట్లు పొందాలి. లేకపోతే డిపాజిట్‌ కోల్పోతారు.
సుప్రీంకోర్టు తీర్పులు
* ‘‘శిక్షకు గురైన ప్రజాప్రతినిధులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులు. హైకోర్టులో అప్పీలు పెండింగ్‌లో ఉందనే కారణంతో చట్టసభల సభ్యుల అనర్హతకు వాయిదా కల్పిస్తున్న ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 8(4) రాజ్యాంగ విరుద్ధం’’ - సుప్రీంకోర్టు

* క్రిమినల్‌ నేరాల్లో దోషులుగా నిర్ధారణై, రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలుశిక్షకు గురైన పార్లమెంట్‌ లేదా రాష్ట్రాల శాసనసభల సభ్యులు తక్షణమే అనర్హులవుతారని 2013లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.

* క్రిమినల్‌ కేసుల్లో రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ శిక్షకు గురైన ప్రజాప్రతినిధులుపై తక్షణమే అనర్హత వేటు పడుతుందని 2013లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే డా.మన్మోహన్‌సింగ్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం దీనిపై ఒక బిల్లును రూపొందించింది. ఇది పార్లమెంట్‌లో ఆమోదం పొందలేదు.

* దీంతో ఈ బిల్లుకు ప్రత్యామ్నాయంగా 2013, సెప్టెంబరు 24న ‘ఆర్డినెన్స్‌’ జారీకి అప్పటి కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

* దీని ప్రకారం, దోషులుగా నిర్ధారణ అయిన చట్టసభల సభ్యులు 90 రోజుల్లోగా ఉన్నత న్యాయస్థానాల్లో అప్పీలు చేసుకోవచ్చు. అక్కడి నుంచి ‘స్టే’ తెచ్చుకుంటే అనర్హత వేటు నుంచి తప్పించుకోవచ్చు.
* ఈ ఆర్డినెన్స్‌పై తీవ్ర విమర్శలు రావడంతో ఆర్డినెన్స్‌తో పాటు సంబంధిత బిల్లును మన్మోహన్‌సింగ్‌ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. 

ప్రజాప్రాతినిధ్య (సవరణ) చట్టం, 2013

* ఈ చట్టం ప్రకారం, ఇతర దేశాల పౌరసత్వం స్వీకరించకుండా భారతదేశం బయట (విదేశాల్లో) నివసిస్తున్న భారతీయులు ఆన్‌లైన్‌లో లేదా ఇతర ఎలక్ట్రానిక్‌ విధానంలో ఓటుహక్కును వినియోగించుకోవచ్చు. ఇది 2011, ఫిబ్రవరి 10 నుంచి అమల్లోకి వచ్చింది.

ప్రజాప్రాతినిధ్య (సవరణ, ధ్రువీకరణ) చట్టం, 2013
* ఓటర్ల జాబితాలో పేరు ఉన్న వ్యక్తి పోలీసు కస్టడీలో లేదా జైలులో ఉంటే, ఆ కారణంతో తన ఓటుహక్కు కోల్పోడు. జైలులో ఉన్నవారి ఓటుహక్కును తాత్కాలికంగానే నిలిపివేస్తారు. ఓటరుగా వారి గుర్తింపు కొనసాగుతుంది.
* పబ్లిక్‌ ఇంట్రెస్ట్‌ ఫౌండేషన్‌ జు( యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు విచారణ సందర్భంగా రాజకీయ నేతల అనర్హత అంశంపై అధ్యయనం చేసి, నివేదికను సమర్పించాలని సుప్రీంకోర్టు ‘లా కమిషన్‌ ఆఫ్‌ ఇండియా’ను కోరింది.
* ఇది ‘ఎలక్టోరల్‌ డిస్‌క్వాలిఫికేషన్స్‌’ అనే పేరుతో కీలకమైన సిఫార్సులు చేసింది. అవి:
*  అఫిడవిట్లలో తప్పుడు సమాచారం ఇచ్చేవారిని అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు భావించాలి. వారికి రెండేళ్లకు తగ్గకుండా జైలు శిక్ష విధించాలి.
* ఎన్నికల నామినేషన్‌ను పరిశీలించే సమయానికి ఏడాది ముందు నమోదైన అభియోగాల ఆధారంగా సదరు అభ్యర్థిపై అనర్హత వేటు వేయకూడదు.
* అభియోగాలపై విచారణ చేపట్టిన ట్రయల్‌ కోర్టు సంబంధిత చట్టసభ సభ్యుడిపై శిక్ష ఖరారు చేస్తే, అది పూర్తయ్యే వరకు లేదా ఆరేళ్ల వరకు సదరు వ్యక్తి ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా ప్రకటించాలి.
* పదవిలో కొనసాగుతున్న పార్లమెంట్, శాసనసభ్యులపై నమోదయ్యే అభియోగాలపై రోజువారీ విచారణ చేపట్టి,సంవత్సరంలోపు దాన్ని పూర్తి చేయాలి.
రాజ్యాంగ సమీక్ష కమిషన్‌ సిఫార్సులు

* జస్టిస్‌ ఎం.ఎన్‌.వెంకటాచలయ్య నేతృత్వంలోని రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్‌ చట్ట

సభల సభ్యుల అర్హతలు, అనర్హతలపై కొన్ని సిఫార్సులు చేసింది. అవి:
* అయిదేళ్ల వరకు జైలుశిక్ష విధించే నేరాభియోగం ఎదుర్కొంటున్నవారు పార్లమెంట్, రాష్ట్రశాసనసభల ఎన్నికల్లో పోటీచేయకుండా నిరోధించాలి.
* హత్య, అత్యాచారం, అక్రమ రవాణా లాంటి తీవ్ర నేరాలకు పాల్పడిన వారిని ఎన్నికల్లో పోటీచేయకుండా శాశ్వతంగా నిరోధించాలి.
రెండో పరిపాలనా సంస్కరణల సంఘం సిఫార్సులు
* వీరప్ప మొయిలీ నేతృత్వంలోని రెండో పరిపాలనా సంస్కరణల సంఘం ప్రజాప్రతినిధుల అనర్హతలకు సంబంధించి ముఖ్య సిఫార్సు చేసింది. 

అది: తీవ్రమైన నేరాలు, అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని అనర్హులుగా ప్రకటిస్తూ ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్‌ 8ని సవరించాలి.
సభ్యత్వం కోల్పోయిన వారు
రషీద్‌ మసూద్‌: కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఈయన ఉత్తర్‌ ప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. మెడికల్‌ సీట్ల కేటాయింపులో అవినీతికి పాల్పడినట్లు నేరం రుజువు కావడంతో అనర్హతకు గురయ్యారు. ఈయన పార్లమెంట్‌ నుంచి అనర్హతకు గురైన తొలి వ్యక్తి.
లాలూ ప్రసాద్‌యాదవ్‌: ఆర్‌జేడీ పార్టీకి చెందిన ఈయన బిహార్‌ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. పశుగ్రాస కుంభకోణంలో నేరం రుజువు కావడంతో అనర్హత వేటు పడింది. ఈయన పార్లమెంట్‌ నుంచి అనర్హతకు గురైన రెండో వ్యక్తి.
జయలలిత: ఏఐఏడీఎంకే పార్టీకి చెందిన జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే నేరం రుజువు కావడంతో ఈమె తన శాసనసభ్యత్వాన్ని (ఎంఎల్‌ఏ), తత్ఫలితంగా ముఖ్యమంత్రి పదవిని కోల్పోయారు.
రాహుల్‌ గాంధీ: 2019 నాటి పరువునష్టం కేసులో ఈయనకు రెండేళ్లు శిక్ష విధిస్తూ సూరత్‌ కోర్టు తీర్పునిచ్చింది. దీంతో ఈయన తన ఎంపీ పదవిని కోల్పోయారు. ఈయన కాంగ్రెస్‌ తరఫున వయనాడ్‌ నియోజక వర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు.
అనర్హతకు గురయ్యే సందర్భాలు
చట్టసభల సభ్యులు/ ప్రజాప్రతినిధులు కింది సందర్భాల్లో అనర్హతకు గురువుతారు.
* కులం, మతం, వర్గం, ప్రాంతం, భాష ప్రాతిపదికగా ఓట్లను అభ్యర్థించడం.
* ఎన్నికల నిర్వహణ సమయంలో పోలింగ్‌ ౠత్‌ను ఆక్రమించడం, ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడం.
* వివిధ వర్గాల ప్రజల మధ్య భావోద్వేగాలను ప్రేరేపించి, అల్లర్లను ప్రోత్సహించడం.
* ఆహార ఔషధ కల్తీ నిరోధక చట్టం కింద శిక్షకు గురైనప్పుడు. 
* ఎన్నికల వ్యయం పరిమితికి మించి  చేసినప్పుడు
* ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసే విధంగా లంచం ఇవ్వడం.

* ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ (IPC)లోని సెక్షన్ల ప్రకారం క్రిమినల్‌ నేరం నిరూపితమైనప్పుడు.

* ఎన్నికల వ్యయానికి సంబంధించిన లెక్కలను నిర్ణీత గడువులోగా సమర్పించడంలో విఫలమైనప్పుడు.

* నిమ్నవర్గాలకు చెందిన వారిపట్ల అనుచితంగా ప్రవర్తించి, అస్పృశ్యత నేరనిషేధ చట్టం ప్రకారం శిక్షకు గురైనప్పుడు.

* చట్టసభకు ఎనికైన సభ్యుడికి ఎన్నికైన తేదీ నాటికి తగిన అర్హతలు లేవని రుజువైనప్పుడు.

* ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు రుజువైనప్పుడు.
 

Posted Date : 12-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌