• facebook
  • whatsapp
  • telegram

ద్రవ్యోల్బణం

నడక మంచిదే.. దూకితేనే ప్రమాదం!

వస్తువుల ధరలు పెరిగిపోయి.. డబ్బు విలువ, ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయే పరిస్థితిని ద్రవ్యోల్బణం అంటారు. అంటే చేతిలో డబ్బులున్నా ఆ మేరకు సంతృప్తి ఉండని విచిత్ర పరిస్థితి. ఒక దేశ ఆర్థిక వ్యవస్థ, ప్రజల జీవనం ఏవిధంగా సాగుతోందో చెప్పే కీలక సూచిక ఇది. అందుకే రిజర్వు బ్యాంకుతో పాటు కేంద్ర ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని నియంత్రణలో ఉంచేందుకు తంటాలు పడుతుంటాయి. ద్రవ్యోల్బణం నడక స్థాయిలో ఉంటే ప్రమాదం లేదు. కానీ దూకుడుగా అదుపు తప్పితే ప్రజల జీవనాన్ని ఆగం చేసి, ఆర్థిక అస్థిరతను సృష్టిస్తుంది. ఈ అంశాల గురించి పరీక్షార్థులు వివరంగా తెలుసుకోవాలి. ద్రవ్యోల్బణంలో రకాలు, వాటికి కారణాలు, అదుపుచేసే పద్ధతులపై తగిన పరిజ్ఞానాన్ని పెంచుకోవాలి.


సాధారణంగా ధరల పెరుగుదలను ద్రవ్యోల్బణం అంటారు. కానీ వాస్తవానికి వస్తుసేవలకు ఉన్న అత్యధిక డిమాండ్‌ వల్ల ద్రవ్య విలువ తగ్గి ధరలు పెరిగితే దాన్ని ద్రవ్యోల్బణం అంటారు. ద్రవ్యోల్బణం ఒక స్థూలమైన జాతీయ సమస్య. ఇది వివిధ వర్గాల ప్రజలపై భిన్న ప్రభావాలు చూపి ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి దశ స్థాయులను ప్రభావితం చేస్తుంది.

నిర్వచనాలు:

అధిక కరెన్సీ నోట్లను జారీ చేయడమే ద్రవ్యోల్బణం - హట్రే

తక్కువ వస్తురాశిని ఎక్కువ ద్రవ్యం తరమడమే ద్రవ్యోల్బణం - డాల్టన్‌

ధరల స్థాయి పెరిగి ద్రవ్య విలువ తగ్గడమే ద్రవ్యోల్బణం - క్రౌధర్‌ 

నిలకడగా, నిరంతరంగా ధరల స్థాయిలో వచ్చే పెరుగుదలే ద్రవ్యోల్బణం - షాపిరో

ద్రవ్యోల్బణ సంబంధిత భావనలు అయిదు ఉన్నాయి. అవి 

1) సాధారణంగా ధరల తగ్గుదలను ‘ప్రతిద్రవ్యోల్బణం’ అంటారు. 

2) ద్రవ్యోల్బణ రేటులో తగ్గుదలను ‘డిజ్‌ఇన్‌ఫ్లేషన్‌’ అంటారు.

3) నియంత్రించడానికి వీలుకాని ద్రవ్యోల్బణ విస్ఫోటకాన్ని ‘హైపర్‌ ఇన్‌ఫ్లేషన్‌’ అంటారు. 

4) ద్రవ్యోల్బణం పెరుగుతున్న నిరుద్యోగిత, తక్కువ స్థాయి ఆర్థిక వృద్ధి రేటు మిశ్రమ స్థితిని ‘స్టాగ్‌ఫ్లేషన్‌’ అంటారు.

5) ప్రతి ద్రవ్యోల్బణ ఒత్తిడిని తగ్గించడానికి ధరలు పెంచే ప్రయత్నాన్ని ‘రిఫ్లేషన్‌’   అంటారు.


ద్రవ్యోల్బణ స్థాయి: కొందరు ఆర్థిక శాస్త్రవేత్తలు ఏటా 1.5% మేర ధరల పెరుగుదల స్వల్పమని, అది సంపూర్ణ ఉద్యోగిత, ఆర్థికాభివృద్ధి సాధించేందుకు అవసరమని భావించారు. అందుకే 1.5% రేటు కంటే ఎక్కువ రేటు ధరల పెరుగుదలను ద్రవ్యోల్బణంగా నిర్ణయించారు. ద్రవ్యోల్బణాన్ని నిర్ణయించడంలో కాలం ముఖ్యాంశం. ఆయా పరిస్థితుల్ని అనుసరించి కాలాన్ని 3 నుంచి 12 నెలల వరకు పరిగణించాలి.


ద్రవ్యోల్బణ రకాలు: ఆర్థికవేత్తలు స్థూలంగా ఆరు రకాలుగా వర్గీకరించారు. అవి 

1) రేటు ఆధారిత ద్రవ్యోల్బణం 

2) ద్రవ్యం, ద్రవ్య ప్రసార వేగం ఆధారిత ద్రవ్యోల్బణం 

3) కీన్స్‌ ఆర్థికవేత్త ప్రకారం ద్రవ్యోల్బణం 

4) ధరల నియంత్రణ స్థాయి ఆధారిత ద్రవ్యోల్బణం 

5) రాబర్ట్‌ జె.గార్డెన్‌ ప్రకారం ద్రవ్యోల్బణం  

6) ఇతర ద్రవ్యోల్బణాలు.


పాకే, నడిచే, పరిగెత్తే ద్రవ్యోల్బణాలు: ఏటా ధరల స్థాయిలో పెరుగుదల అతి తక్కువగా ఉంటే దాన్ని పాకే ద్రవ్యోల్బణం అంటారు. కెంట్‌ ప్రకారం సంవత్సరానికి 3% కంటే తక్కువగా ధరలు పెరిగితే అది పాకే ద్రవ్యోల్బణం అవుతుంది. సంవత్సరంలో ధరల పెరుగుదల 3% నుంచి 4% మధ్యలో ఉంటే దాన్ని నడిచే ద్రవ్యోల్బణం అంటారు. సంవత్సరంలో ధరల పెరుగుదల 10% వరకు ఉంటే దాన్ని పరిగెత్తే ద్రవ్యోల్బణం అంటారు. చాలా ఎక్కువ స్థాయిలో ధరల పెరుగుదల ఉంటే దాన్ని దూకుతున్న ద్రవ్యోల్బణం అంటారు. అదుపులేని స్థాయిలో ధరలు పెరగడాన్ని హైపర్‌ ద్రవ్యోల్బణం అంటారు. ఇందులో పెరుగుదల 100% కూడా ఉండవచ్చు. 


ద్రవ్య ద్రవ్యోల్బణం: ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సప్లయి అధికమవడం వల్ల, డిమాండ్‌ ఎక్కువై ధరలు పెరిగితే ఏర్పడే ద్రవ్యోల్బణం.


ధరల ద్రవ్యోల్బణం: ఆర్థిక వ్యవస్థలో ధరలు పెరిగినప్పుడు ధరలు ఇంకా పెరగ వచ్చని ప్రజలు భయపడి వచ్చిన ద్రవ్యాన్ని వచ్చినట్లే ఖర్చు పెట్టడం వల్ల ద్రవ్య ప్రసార వేగం పెరుగుతుంది. దీంతో మరింతగా ధరలు పెరిగితే దాన్ని ధరల ద్రవ్యోల్బణం అంటారు.


పాక్షిక ద్రవ్యోల్బణం: ఆర్థిక వ్యవస్థలో సంపూర్ణ ఉద్యోగితా స్థాయి చేరడానికి ముందు కొన్ని ఉత్పత్తి కారకాల కొరత వల్ల ఉత్పత్తి వ్యయం పెరిగి ధరలు పెరిగితే దాన్ని పాక్షిక ద్రవ్యోల్బణం లేదా సెమీ ద్రవ్యోల్బణం అంటారు.


వాస్తవిక ద్రవ్యోల్బణం: ఆర్థిక వ్యవస్థలో సంపూర్ణ ఉద్యోగితా స్థాయికి చేరిన తర్వాత సమష్టి డిమాండ్‌ పెరిగితే ధరలు పెరగడాన్ని వాస్తవిక ద్రవ్యోల్బణం అంటారు. దీన్ని నిజ ద్రవ్యోల్బణం అని కూడా అంటారు.


హైపర్‌ ద్రవ్యోల్బణం: ద్రవ్య ప్రసార వేగం పెరగడం వల్ల ధరలు అధికంగా పెరగడాన్ని హైపర్‌ ద్రవ్యోల్బణం అంటారు.


బహిరంగ ద్రవ్యోల్బణం: ధరల పెరుగుదల నియంత్రణకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల ధరలు పెరిగితే దాన్ని బహిరంగ ద్రవ్యోల్బణం అంటారు.


అణచివేసి ఉన్న ద్రవ్యోల్బణం: రేషనింగ్, ధరల నియంత్రణ లాంటి ప్రభుత్వ విధానాలతో ధరల పెరుగుదలను అణచిపెడతారు. ప్రభుత్వం ఈ నియంత్రణల్ని ఎత్తివేస్తే ధరలు పెరుగుతాయి. దీనిని అణచివేసి ఉన్న ద్రవ్యోల్బణం అంటారు.


డిమాండ్‌ ప్రేరిత ద్రవ్యోల్బణం: సమష్టి సప్లయి కంటే సమష్టి డిమాండ్‌ ఎక్కువగా ఉన్న కారణంగా ధరలు పెరిగితే దాన్ని డిమాండ్‌ ప్రేరిత ద్రవ్యోల్బణం అంటారు. వినియోగ వ్యయం, పెట్టుబడి వ్యయం, ప్రభుత్వ వ్యయం పెరుగుదల దీనికి కారణం కావచ్చు.


వ్యయప్రేరిత ద్రవ్యోల్బణం: ఉత్పత్తి వ్యయాలు పెరిగిన కారణంగా ధరల స్థాయి పెరిగే స్థితి.


ఉదా: శ్రామికుల వేతనాలు పెరగడం వల్ల ధరలు పెరిగితే అది వేతన ద్రవ్యోల్బణం అని, లాభాలు పెరగడం వల్ల ధరలు పెరిగితే లాభప్రేరిత ద్రవ్యోల్బణం లేదా మార్క్‌అప్‌ ద్రవ్యోల్బణం అని, ముడిపదార్థాల కొరత వల్ల ధరలు పెరిగితే ముడిపదార్థాల ప్రేరిత ద్రవ్యోల్బణం అని అంటారు.డిమాండ్, వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణాలు ఒకేసారి సంభవిస్తే అది మిశ్రమ ద్రవ్యోల్బణం అని చార్లెస్‌ షుల్జ్‌ పేర్కొన్నారు.


అంతర్లీన ద్రవ్యోల్బణం: వేతనాలు పెరగాలనే కార్మికులు, ఉద్యోగుల డిమాండ్లు ద్రవ్యోల్బణాన్ని ప్రేరేపిస్తాయి. దీనివల్ల వ్యయం పెరిగి ధరలు పెరిగితే అంతర్లీన ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. దీన్నే ‘హ్యాంగోవర్‌ ఇన్‌ఫ్లేషన్‌’ అంటారు.


రంగాల సంబంధిత ద్రవ్యోల్బణం: ఉత్పత్తి రంగంలోని ఒక తరహా పరిశ్రమలో తయారైన వస్తుసేవల ధరలు పెరగడాన్ని రంగాల సంబంధిత ద్రవ్యోల్బణం అంటారు.


ఉదా: ముడిచమురు ధర పెరిగితే దాన్ని ఉపయోగించే ఇతర పరిశ్రమల ఉత్పత్తుల ధరలన్నీ పెరుగుతాయి.

ధరశక్తి నిర్ణాయక ద్రవ్యోల్బణం: పారిశ్రామిక, వ్యాపార సంస్థలు తమ లాభాలు పెంచుకోవడానికి వాటి ఉత్పత్తి, అమ్మకపు ధరలు పెంచడాన్ని ధరశక్తి నిర్ణాయక ద్రవ్యోల్బణం అంటారు. దీన్నే పరిమితస్వామ్య ద్రవ్యోల్బణం, పాలిత ద్రవ్యోల్బణం అని కూడా అంటారు.

కోశ సంబంధిత ద్రవ్యోల్బణం: ప్రభుత్వ రాబడి కంటే ఎక్కువ వ్యయం చేయడం వల్ల ఏర్పడే ద్రవ్యోల్బణం. ప్రభుత్వ బడ్జెట్‌ లోటు వల్ల కలిగే ధరల పెరుగుదల కోశ సంబంధ ద్రవ్యోల్బణంగా చెప్పవచ్చు.


ద్రవ్యోల్బణ విరామం: జె.ఎం.కీన్స్‌ ‘హౌ టు పే ఫర్‌ ది వార్‌’ అనే గ్రంథంలో దీనిని పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థలో చేస్తారనుకునే వ్యయం, మొత్తం ఉత్పత్తి విలువ కంటే ఎక్కువగా ఉంటే వాటి మధ్య వ్యత్యాసాన్ని ద్రవ్యోల్బణ విరామం అంటారు. సంపూర్ణ ఉద్యోగితా స్థాయి వద్ద ఉన్న జాతీయ ఆదాయ స్థాయి కంటే వినియోగం, పెట్టుబడి కలిపి ఎక్కువ ఉంటే ఇది ఏర్పడుతుంది. సంపూర్ణ ఉద్యోగితా స్థాయి వద్ద ఉన్న జాతీయ ఆదాయ స్థాయి కంటే సమష్టి డిమాండ్‌ ఎక్కువగా ఉంటే ద్రవ్యోల్బణ విరామం ఏర్పడుతుంది. పొదుపు పెంచడం, ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించడం, పన్నులు పెంచడం లాంటి చర్యలతో ఈ స్థితిని తొలగించొచ్చు. దీర్ఘకాలంలో ఉత్పత్తి పెంచడం ద్వారా తగ్గించొచ్చు.


ద్రవ్యోల్బణానికి కారణాలు: ముఖ్యంగా రెండు కారణాలున్నాయి. 

1) డిమాండ్‌ వైపు కారణాలు 

2) సప్లై వైపు కారణాలు


డిమాండ్‌ వైపు కారణాలు: సమష్టి డిమాండ్‌ పెరగడం వల్ల ముఖ్యంగా ప్రభుత్వ వ్యయం పెరగడం, లోటు విత్తాన్ని అవలంబించడం వల్ల ధరలు పెరుగుతాయి. 

వాటికి కారణాలు:- 

1) ప్రభుత్వ వ్యయం పెరగడం 

2) లోటువిత్తం 

3) జనాభా పెరుగుదల 

4) ప్రజల వినియోగం పెరుగుదల 

5) సులభ ద్రవ్యవిధానం 

6) ఎగుమతులు పెరగడం 

7) ద్రవ్య సరఫరా పెరగడం


సప్లై వైపు కారణాలు: ఉత్పత్తి వ్యయాలు పెరగడం ద్వారా ఆశించిన స్థాయిలో ఉత్పత్తి పెరగక సరఫరా తగ్గి ధరలు పెరుగుతాయి. వాటికి కారణాలు- 

1) వ్యవసాయ రంగంలో అస్థిర వృద్ధి 

2) నిత్యావసర వస్తువుల దాచివేత

 3) ప్రభుత్వ వ్యవసాయ ధరల విధానం 

4) పాలిత ధరలు పెరగడం 

5) ఉత్పత్తి కారకాల సప్లై కొరత 

6) అధిక వేతన రేట్లు 

7) అధిక పన్నురేట్లు


ఆర్థికవ్యవస్థపై ద్రవ్యోల్బణ ప్రభావం:  

1) ఉత్పత్తిపై ప్రభావం 

2) పంపిణీపై ప్రభావం 

3) ప్రభుత్వ కార్యకలాపాలపై ప్రభావం 

4) విదేశీ చెల్లింపుల శేషంపై ప్రభావం 

5) ఆర్థిక అసమానతల పెరుగుదల 

6) ఆర్థికాభివృద్ధికి ఆటంకం 

7) సాపేక్ష ధరల్లో మార్పులు


ద్రవ్యోల్బణ నివారణ చర్యలు:  ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు రిజర్వు బ్యాంకు, ప్రభుత్వం సంస్థాగత చర్యలు తీసుకుంటాయి. రిజర్వు బ్యాంకు తీసుకునేవి ద్రవ్యపరమైన చర్యలు కాగా, ప్రభుత్వం తీసుకునేవి కోశపరమైన చర్యలు.


ద్రవ్యపరమైన చర్యలు: ద్రవ్యోల్బణాన్ని నివారించడానికి రిజర్వు బ్యాంకు రెండు రకాల చర్యలు  పాటిస్తుంది. అవి.. 


ఎ) పరిమాణాత్మక పరపతి నియంత్రణ చర్యలు: 

1) బ్యాంకు రేటు పెంపు 

2) నగదు నిల్వల నిష్పత్తి (సి.ఆర్‌.ఆర్‌.) పెంపు 

3) చట్టబద్ధ ద్రవ్యత్వ నగదు నిల్వల నిష్పత్తి (ఎస్‌.ఎల్‌.ఆర్‌.) పెంపు 

4) రెపో రేటు పెంపు 

5) రివర్స్‌ రెపో రేటు పెంపు 

6) బహిర్గంగ మార్కెట్‌లో ప్రభుత్వ సెక్యూరిటీల అమ్మకం


బి) గుణాత్మక పరపతి నియంత్రణ చర్యలు:  

1) మార్జిన్లు పెంచడం 

2) డౌన్‌ పేమెంట్‌ను పెంచడం 

3) వాయిదాల సంఖ్యలు పెంచడం 

4) వినియోగదారుడికి పరపతిపై గరిష్ఠ పరిమితి విధించడం


కోశ చర్యలు: ఇవి కేంద్ర ప్రభుత్వం చేపట్టే చర్యలు. 

1) ప్రభుత్వ అభివృద్ధేతర వ్యయాన్ని తగ్గించడం 

2) ప్రైవేటు పెట్టుబడిదారులకు పన్ను ప్రోత్సాహకాలు ఇవ్వడం 

3) లోటు విత్తాన్ని వదలి మిగులు బడ్జెట్‌ను అనుసరించడం  

4) ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యావసర సరకులు అందించి ధరల్ని నియంత్రించడం 

5) సరఫరాను పెంచేలా దిగుమతుల్ని అనుమతించడం 

6) ధరల విధానం ద్వారా ధరలపై గరిష్ఠ పరిమితి విధించడం 

7) ఆదాయ విధానం ద్వారా హేతుబద్ధమైన వేతనాలు, జీతాలు, పింఛన్లు నిర్ణయించడం. ద్రవ్యోల్బణ కాలంలో రుణగ్రహీతలు, వ్యాపారులు, ఉత్పత్తిదారులు, వాటాదారులు, అంచనా వ్యాపారం చేసేవారు, బ్లాక్‌ మార్కెటింగ్‌ చేసేవారు లాభపడతారు. రుణదాతలు, వినియోగదారులు, స్థిర ఆదాయం పొందేవారు, వేతనాలు పొందేవారు, పింఛనుదారులు, స్థిరమైన భాటకాన్ని పొందే భూస్వాములు నష్టపోతారు.

 


 

రచయిత: ధరణి శ్రీనివాస్‌


 

 

Posted Date : 18-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌