• facebook
  • whatsapp
  • telegram

బీమా వ్యాపారం

అనుకోని కష్టంలో ఆదుకునే హస్తం!

 


  ఆదాయాన్ని ఆర్జించే వ్యక్తి హఠాత్తుగా మరణిస్తే, ఆధారపడిన కుటుంబం అస్తవ్యస్తం కాకుండా భరోసాగా నిలుస్తుంది జీవిత బీమా. కష్టపడి కూడగట్టుకున్నఆస్తులు, సమకూర్చుకున్న వస్తువులు, వాహనాలు అనుకోని ప్రమాదాల్లో దెబ్బతిన్నా, పనికి రాకుండా పోయినా ఆ నష్టాన్ని పంచుకొని ఆదుకుంటుంది సాధారణ బీమా. ఆధునిక కాలంలో సాధారణ వ్యక్తులు అందుకోలేనంతగా పెరిగిపోయిన వైద్య వ్యయాలను భరించి బాధలను తీరుస్తుంది ఆరోగ్య బీమా. అందరి జీవితాల్లోనూ, ఆర్థిక వ్యవస్థలోనూ అత్యంత కీలకమైన భాగంగా మారిన ఈ ఇన్సూరెన్స్‌ రంగం పరిణామక్రమం, దీనికి సంబంధించి ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు అందిస్తున్న సేవలు, ప్రధాన కంపెనీలు, పథకాల వివరాలను పోటీ పరీక్షల కోణంలో అభ్యర్థులు తెలుసుకోవాలి. 

 


   బీమా ఒక సాంఘిక భద్రతా సౌకర్యం. మనిషి జీవితంలో కొన్ని విపత్తులు సంభవిస్తూ ఉంటాయి. వాటివల్ల వ్యక్తికి ప్రాణనష్టం, ఆరోగ్య నష్టం లేదా ఆస్తి నష్టం జరగవచ్చు. అలాంటి నష్టభయాన్ని ముందుగా బీమా చేయించుకుంటే ప్రమాదం/నష్టం ఏర్పడినప్పుడు బీమా చేసిన సంస్థ వ్యక్తికి లేదా వ్యక్తి కుటుంబానికి బీమా ద్వారా హామీ ఇచ్చిన మొత్తాన్ని చెల్లిస్తుంది. నష్టభయాన్ని బీమా చేసేందుకు బీమా సంస్థకు ఆ వ్యక్తి ఒకేసారి లేదా కొన్ని వాయిదాల్లో కొంత రుసుము చెల్లించాలి. దీన్ని ప్రీమియం అంటారు. ఆ రకంగా బీమా చేయించుకున్న వ్యక్తికి, బీమా చేసిన వ్యాపార సంస్థకు మధ్య ఒప్పందాన్ని తెలియజేసే పత్రాన్నే బీమా పాలసీ అంటారు.

 


భారతదేశంలో బీమా వ్యాపారం - పరిణామక్రమం: భారతదేశంలో బీమాకు పెద్ద చరిత్ర ఉంది. ప్రాచీన కాలంలో మనుస్మృతిలో దీని ప్రస్తావన ఉంది. యాజ్ఞవల్కుడి ధర్మశాస్త్రం, కౌటిల్యుడి అర్థశాస్త్రంలోనూ పేర్కొన్నారు. ద్రవ్య వనరులను సమీకరించి అగ్నిప్రమాదం, వరదలు, అంటువ్యాధుల వ్యాప్తి, కరవు సమయాల్లో పంచిపెట్టడం గురించి ఈ గ్రంథాల్లో రాశారు. నౌకా వ్యాపార రుణాలు, రవాణా సౌకర్యాల ఒప్పందాలు వంటివి బీమాకు సంబంధించిన తొలి రూపాలు కావచ్చు. కాలక్రమేణా ఇతర దేశాలు, ముఖ్యంగా ఇంగ్లండ్‌ నుంచి ఆధునిక బీమా విధానాలను భారతదేశం అనుసరించింది. మన దేశంలో 1818లో మొదటిసారిగా కలకత్తాలో ఓరియంటల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ అనే ఆధునిక జీవిత బీమా సంస్థను స్థాపించారు. ఆ తర్వాత 1829లో ‘మద్రాస్‌ ఈక్విటబుల్‌’ అనే జీవిత బీమా వ్యాపారాన్ని మద్రాస్‌ ప్రెసిడెన్సీలో ఏర్పాటు చేశారు. 1870లో బాంబే మ్యూచువల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ సొసైటీ మొదటి భారతీయ జీవిత బీమా సంస్థను నెలకొల్పింది. 1897లో ఎంపైర్‌ ఆఫ్‌ ఇండియా, 1906లో మద్రాస్‌ యునైటెడ్‌ ఇండియాను స్థాపించారు.

 


బీమా వ్యాపారం క్రమబద్ధీకరణ: 1912 వరకు భారతదేశంలో బీమా వ్యాపారంపై ఎలాంటి ప్రభుత్వ నియంత్రణ లేదు. 1912లో అప్పటి ప్రభుత్వం లైఫ్‌ ఇన్సూరెన్స్‌ చట్టాన్ని ప్రవేశపెట్టింది. ప్రావిడెంట్‌ ఫండ్‌ చట్టం కూడా చేసింది. 1938లో సమగ్ర లైఫ్‌ ఇన్సూరెన్స్‌ చట్టం వచ్చింది. 1999లో ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ చట్టం అమల్లోకి వచ్చింది.

 


బీమా రకాలు: 1) జీవిత బీమా, 2) సాధారణ బీమా (లేదా) జీవితేతర బీమా

 


జీవిత బీమా: ఇది ప్రాణనష్టానికి సంబంధించింది. జీవిత బీమా చేయించుకున్న వ్యక్తి తన పాలసీ కాలం పూర్తయ్యేలోపు చనిపోతే వ్యక్తి బీమా చేసిన మొత్తాన్ని, బీమా సంస్థ ఆ వ్యక్తి కుటుంబానికి చెల్లిస్తుంది. చనిపోక ముందే పాలసీ కాలం పూర్తయితే, చెల్లించిన ప్రీమియం మొత్తానికి కొంత బోనస్‌ రూపంలో కలిపి వ్యక్తికి చెల్లిస్తుంది.

 


సాధారణ బీమా: ఒక వ్యక్తికి ప్రమాదవశాత్తు శరీరంలో ఒక భాగం లేదా కొన్ని భాగాలు పనిచేయని పరిస్థితి ఏర్పడవచ్చు. వ్యక్తులు వాడే వాహనాలు ప్రమాదం వల్ల దెబ్బతినవచ్చు. అగ్నిప్రమాదం వల్ల ఆస్తి నష్టం కలగవచ్చు. దొంగతనం వల్ల వస్తువులు కోల్పోవచ్చు. అలాంటి సందర్భాల్లో వ్యక్తులకు నష్టం జరిగితే పొందే బీమా సౌకర్యాన్ని సాధారణ బీమా అంటారు. అగ్నిప్రమాద బీమా, నౌకా బీమా, మోటారు బీమా, ఆరోగ్య బీమా వంటివన్నీ సాధారణ బీమా వ్యాపారానికి చెందుతాయి.

 


జీవిత బీమా వ్యాపారం జాతీయం: 1956, జనవరి 19న మన దేశంలో పనిచేస్తున్న జీవిత బీమా కంపెనీలన్నింటినీ ప్రభుత్వ యాజమాన్యంలోకి తీసుకొస్తూ పార్లమెంటు ‘లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా’ చట్టాన్ని ఆమోదించింది. 1956, సెప్టెంబరు 1 నుంచి ఎల్‌ఐసీ ప్రభుత్వ రంగ సంస్థగా పనిచేయడం ప్రారంభించింది. 1956లో 154 భారతీయ సంస్థలు, 16 విదేశీ సంస్థలు, 75 ప్రావిడెంట్‌ ఫండ్‌ సంస్థల (మొత్తం 245)ను జాతీయం చేశారు.

 


సాధారణ బీమా వ్యాపారం జాతీయం: భారతదేశంలో మొదటి సాధారణ బీమా సంస్థ 1850లో కలకత్తాలో ఏర్పాటైన ట్రియెటాన్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ. 1906లో ఏర్పడిన యునైటెడ్‌ ఇండియా (మద్రాస్‌), నేషనల్‌ ఇన్సూరెన్స్‌ కో-ఆపరేటివ్‌ అస్యూరెన్స్‌ కూడా సాధారణ బీమా సంస్థలే. 1972లో జనరల్‌ ఇన్సూరెన్స్‌ బిజినెస్‌ చట్టాన్ని ఆమోదించారు. 1973, జనవరి 1న జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాను నెలకొల్పారు. అప్పటివరకు దేశంలో పనిచేస్తున్న 107 సాధారణ బీమా సంస్థలన్నింటినీ జాతీయం చేశారు. సాధారణ బీమా వ్యాపారం చేస్తున్న సంస్థలను ప్రస్తుతం నాలుగు సంస్థలుగా విభజించారు. అవి 1) యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీ (మద్రాసు) 2) న్యూ ఇన్సూరెన్స్‌ కంపెనీ (బొంబాయి) 3) నేషనల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ (కలకత్తా) 4) ఓరియంటల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ (దిల్లీ).

 

 

ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఐఆర్‌డీఏఐ):  దేశంలో 1991లో ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల రెండో దశలో బీమా వ్యాపారంలోకి ప్రైవేటు, విదేశీ సంస్థలను అనుమతించాలని కేంద్రం నిర్ణయించింది. దీనివల్ల ఈ రంగంలో పోటీ, సామర్థ్యం పెరుగుతుందని భావించింది. 1993లో ఆర్‌.ఎస్‌.మల్హోత్ర అధ్యక్షతన కమిటీని నియమించింది. 1994లో ఈ కమిటీ నివేదిక సమర్పించింది. దేశంలోని కార్పొరేట్‌ సంస్థలను బీమా రంగంలోకి అనుమతించాలని, విదేశీ సంస్థల భాగస్వామ్యానికి సమ్మతించాలని మల్హోత్ర కమిటీ సిఫార్సు చేసింది. ఈమేరకు కేంద్రం 1999లో ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్‌ అథారిటీ చట్టం చేసింది. 2000, ఏప్రిల్‌లో ఐఆర్‌డీఏఐ సంస్థను నెలకొల్పింది. దీని ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లో ఉంది. ప్రస్తుత ఛైర్మన్‌ దెబాశీష్‌ పాండా.


ఐఆర్‌డీఏఐ లక్ష్యాలు: 1) బీమా పాలసీదార్ల ప్రయోజనాలు కాపాడటం 2) బీమా వ్యాపారాన్ని క్రమబద్ధం చేయడం, ప్రోత్సహించడం 3) సక్రమమైన పద్ధతిలో వృద్ధి చెందే విధంగా చర్యలు తీసుకోవడం


భారతదేశంలో బీమా సంస్థలు: 2020, మార్చి 31 నాటికి భారతదేశంలో 69 సంస్థలు బీమా వ్యాపారం నిర్వహిస్తున్నాయి. ఐఆర్‌డీఏఐ 2021-22 నివేదిక ప్రకారం 24 జీవిత బీమా సంస్థలున్నాయి. ఇందులో ప్రభుత్వ రంగంలో ఒకటి (ఎల్‌ఐసీ), ప్రైవేటు రంగంలో 23 ఉన్నాయి. 


* సాధారణ బీమా సంస్థలు 25 ఉండగా, అందులో ప్రైవేటు రంగంలో 21, ప్రభుత్వ రంగంలో 4 ఉన్నాయి. ఇవేకాకుండా ప్రత్యేకంగా ఆరోగ్య బీమా సంస్థలు 7, ప్రత్యేక బీమా సంస్థలు 2, పునఃబీమా సంస్థలు 11 ఉన్నాయి. అన్నిరకాలు కలిపి 69 బీమా సంస్థల్లో 8 ప్రభుత్వ రంగంలో, 61 ప్రైవేటు రంగంలో ఉన్నాయి.

 


ప్రభుత్వ రంగంలో ఉన్న బీమా సంస్థలు


* జీవిత బీమా సంస్థ ఒకటి ఉంది. 1) ఎల్‌ఐసీ


* సాధారణ బీమా సంస్థలు నాలుగు ఉన్నాయి. 1) నేషనల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ 2) ఓరియంటల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ 3) యునైట్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీ 4) న్యూ ఇండియా అస్యూరెన్స్‌ కంపెనీ.


* ప్రత్యేక బీమా సంస్థలు రెండు ఉన్నాయి. 1) అగ్రికల్చర్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ 2) ఎక్స్‌పోర్ట్‌ క్రెడిట్‌ గ్యారెంటీ కార్పొరేషన్, 


* పునఃబీమా సంస్థలు ఒకటి ఉంది. 1) జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా.

 


భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ): ఎల్‌ఐసీని 1956, సెప్టెంబరు 1న స్థాపించారు. 1956లో 5 జోన్లు, 33 డివిజన్లు, 240 శాఖలు ఉన్నాయి. ఇందులో 89,000 మంది ఏజెంట్లు పని చేసేవారు. 2017 నాటికి 8 జోన్లు, 113 డివిజన్లు, 2048 శాఖలు ఉండగా 11,63,604 మంది ఏజెంట్లు పనిచేస్తున్నారు. ప్రధాన కార్యాలయం ముంబయి. ప్రస్తుత ఛైర్మన్‌ సిద్ధార్థ మొహంతి.

 


జీవిత బీమా పాలసీలు - రకాలు: వీటిని 6 రకాలుగా వర్గీకరించారు. 1) మనీ బ్యాక్‌ పాలసీ 2) టర్మ్‌ పాలసీ 3) పూర్తి జీవితకాల పాలసీ 4) ఎండోమెంట్‌ పాలసీ 5) యూనిట్‌ అనుసంధానం చేసిన పాలసీ 6) బృంద బీమా పాలసీ

 


ఆరోగ్య బీమా:  2020, మార్చి 31 నాటికి ఐఆర్‌డీఏఐ కింది 7 ఆరోగ్య బీమా సంస్థలకు లైసెన్స్‌ మంజూరు చేసింది. వీటిని స్టాండ్‌ అలోన్‌ ఆరోగ్య బీమా సంస్థలు అంటారు. అవి 1) స్టార్‌ హెల్త్‌ అండ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ 2) హెచ్‌డీఎఫ్‌సీ - ఎర్గో హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ 3) మాక్స్‌బూపా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌

 


4) రెలిగేర్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ 5) సిగ్మా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ 6) ఆదిత్య బిర్లా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ 7) రిలయన్స్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ లిమిటెడ్‌

 


వ్యవసాయ బీమా: మన దేశంలో 2003 నుంచి వ్యవసాయ బీమా అమల్లో ఉంది. 2016లో ఏర్పాటుచేసిన ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన దీన్ని పర్యవేక్షిస్తుంది. వ్యవసాయ బీమా కంపెనీ మూలధనంలో నాబార్డ్‌ వాటా 30%, జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ వాటా 35% ఉంది.

 


డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ అండ్‌ క్రెడిట్‌ గ్యారంటీ కార్పొరేషన్‌: దీన్ని 1978లో ప్రారంభించారు. బ్యాంకు డిపాజిట్లకు భద్రత కల్పించి బ్యాంకింగ్‌ వ్యవస్థపై విశ్వాసం కలిగించడం దీని ప్రధాన ఉద్దేశం. 

 


ప్రభుత్వ మద్దతుతో నడుస్తున్న బీమా పథకాలు:


1) ప్రధానమంత్రి జన్‌ ఆరోగ్య యోజన: 2017లో దీన్ని ప్రవేశపెట్టారు. 2008లో ప్రారంభించిన రాష్ట్రీయ స్వాస్థ్య బీమా పథకం ఇందులో విలీనమైంది. 2018, సెప్టెంబరులో రాంచీలో ప్రారంభించిన ఆయుష్మాన్‌ భారత్‌ దీనిలో ఒక భాగం. ఈ పథకంలో కుటుంబానికి సంవత్సరానికి రూ.5 లక్షల మొత్తానికి ఆరోగ్య బీమా ఉంటుంది.


2) ఆమ్‌ ఆద్మీ బీమా యోజన: 2007, అక్టోబరు 2న ప్రారంభించారు. 18-59 ఏళ్ల మధ్య ఉన్నవారు అర్హులు. గ్రామాల్లో భూమి లేని కుటుంబంలో ప్రధాన పోషకుడికి వర్తిస్తుంది. సాధారణ మరణానికి రూ.30 వేలు, ప్రమాద మరణం లేదా శాశ్వత అంగవైకల్యం అయితే రూ.75 వేలు, పాక్షిక వైకల్యానికి రూ.37,500 బీమా వర్తిస్తుంది. వార్షిక ప్రీమియం రూ.200. ఈ ప్రీమియాన్ని కేంద్ర, రాష్ట్రాలు సమానంగా భరిస్తాయి.


3) ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన: ఇది జీవిత బీమా పథకం. 2015, మే 9న నాటి ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రారంభించారు. 18 - 50 ఏళ్లవయసు వారు అర్హులు. ఏ కారణంతో అయినా మరణించిన వారికి రూ.2 లక్షలు బీమా చెల్లిస్తారు. వార్షిక ప్రీమియం రూ.436. పొదుపు ఖాతా నుంచి ఈ ప్రీమియం మినహాయించిన వారికి వర్తిస్తుంది.


4) ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన: ఇది ప్రమాద బీమా పథకం. 2015, మే 9న ప్రారంభించారు. 18 - 70 ఏళ్ల వారికి వర్తిస్తుంది. పొదుపు ఖాతా ఉన్నవారు అర్హులు. వార్షిక ప్రీమియం రూ.20. ప్రమాద మరణం లేదా శాశ్వత అంగవైకల్యానికి రూ.2 లక్షలు చెల్లిస్తారు. పాక్షిక వైకల్యానికి రూ.లక్ష ఇస్తారు.

 


బీమా రంగ అభివృద్ధి - ప్రమాణాలు:  


* ప్రపంచంలో అతి పెద్ద బీమా సంస్థ అయిన స్వీస్‌కీ నివేదిక ప్రకారం ప్రపంచ బీమా వ్యాపార విపణిలో భారత్‌ వాటా 1.69% అని అంచనా.


* జీవిత బీమా వ్యాపార గణాంక వివరాలున్న 88 దేశాల్లో భారత్‌ 10వ స్థానంలో ఉంది. ప్రపంచ జీవిత బీమా విపణిలో భారత్‌ వాటా 2.73%. 


* ప్రపంచంలో మొత్తం బీమా ప్రీమియంలో జీవిత బీమా వాటా 35%, జీవితేతర బీమా వాటా 53.68%.


* భారత్‌లో బీమా ప్రీమియం పరిమాణంలో జీవిత బీమా వాటా 35%, జీవితేతర బీమా వాటా 25%.అంటే ప్రపంచంలో జీవితేతర ప్రీమియం అధికంగా ఉంటే, భారత్‌లో మాత్రం జీవిత బీమా ప్రీమియం ఎక్కువగా ఉంది.


బీమా రంగం సంభావ్యత, పనితీరు మదింపునకు రెండు ప్రమాణాలు పాటిస్తారు. 


1) బీమా చొరబాటు: ఒక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి, బీమా ప్రీమియంల నిష్పత్తిని బీమా చొరబాటు అంటారు. ప్రస్తుత బీమా చొరబాటు 4.57 శాతం.


2) బీమా సాంద్రత: మొత్తం జనాభాకు, ప్రీమియంతో ఉన్న నిష్పత్తిని బీమా సాంద్రత అంటారు. దీన్ని అమెరికా డాలర్లలో తెలియజేస్తారు. ప్రస్తుతం బీమా సాంద్రత 91 డాలర్లు.

 


రచయిత: ధరణి శ్రీనివాస్‌
 

Posted Date : 10-07-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌