• facebook
  • whatsapp
  • telegram

అంతర్జాతీయ కూటములు

ప్రపంచంలోని వివిధ దేశాలు తమ స్వయం ప్రతిపత్తిని కాపాడుకుంటూ, అంతర్జాతీయ సహకారం కోసం కూటములుగా ఏర్పడి పరస్పరం సహకరించుకుంటున్నాయి. తద్వారా ఆర్థిక, రాజకీయ, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో, దౌత్యపరంగా లబ్ధి పొందుతున్నాయి. ఇలాంటి అంతర్జాతీయ కూటములపై పోటీపరీక్షార్థులకు అవగాహన అవసరం.


కామన్వెల్త్‌ దేశాధినేతల కూటమి (Commonwealth Heads of Government Meeting - CHOGM)
పూర్వం ఉన్న బ్రిటిష్‌ వలస రాజ్యాల కూటమినే ‘‘కామన్వెల్త్‌’’గా పేర్కొనేవారు. ఇది 1931లో ‘లండన్‌’ కేంద్రంగా ఏర్పడింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఆసియా, ఆఫ్రికా, పశ్చిమార్ధగోళంలోని అనేక వలస రాజ్యాలు బ్రిటిష్‌ పాలన నుంచి విముక్తి పొందాయి. వీటిలో అనేక దేశాలు ‘‘కామన్వెల్త్‌ కూటమి’’లో చేరాయి. దీంతో ‘‘కామన్వెల్త్‌ ఆఫ్‌ నేషన్స్‌’’ పరిధి విస్తరించింది.
* ఆసియా నుంచి కామన్వెల్త్‌ ఆఫ్‌ నేషన్స్‌లో చేరిన మొదటి దేశం భారత్‌ (స్వాతంత్య్రానంతరం). 1947లో భారత్, పాకిస్థాన్‌లు; 1948లో శ్రీలంక (అప్పటి సిలోన్‌) ఈ కూటమిలో చేరాయి.
* కామన్వెల్త్‌ ఆఫ్‌ నేషన్స్‌కు అధికారిక రాజ్యాంగం లేదు. ఇంగ్లిష్‌ అధికారిక భాష. సభ్యదేశాల మధ్య పరస్పర సహకారాన్ని సాధించడం, శిఖరాగ్ర సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడం దీని లక్ష్యం. ఈ కూటమికి బ్రిటిష్‌ రాజు/ రాణి అధిపతిగా వ్యవహరిస్తారు. ప్రతి రెండేళ్లకోసారి దీని సమావేశాలు జరుగుతాయి.
* ఆఫ్రికా, ఆసియా, అమెరికా, యూరప్, పసిఫిక్‌ ప్రాంతాల్లో ఉన్న అనేక పెద్ద, చిన్న, ధనిక, పేద దేశాలకు ఈ కూటమిలో సభ్యత్వం ఉంటుంది. అంతర్జాతీయంగా ఈ కూటమి తీసుకునే నిర్ణయాలకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. ప్రస్తుతం ఇందులోని సభ్యదేశాల సంఖ్య 54.
* ఆఫ్రికా ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న దేశాలు 19. అవి: 
బోట్స్‌వానా, కామెరూన్, గాంబియా, ఘనా, కెన్యా, కింగ్‌డమ్‌ ఆఫ్‌ ఎస్వటిని, లెసోతీ, మలావి, మారిషస్, మొజాంబిక్, నమీబియా, నైజీరియా, రువాండా, సీషెల్స్, సియొర్రాలియోన్, దక్షిణాఫ్రికా, ఉగాండా, టాంజానియా,జాంబియా.
* ఆసియా ప్రాంతం నుంచి 8 దేశాలు భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, మలేసియా, బ్రూనై, మాల్దీవులు, సింగపూర్, శ్రీలంక
* కరేబియన్, అమెరికా నుంచి 13 దేశాలు ఆంటిగువా - బార్బుడా, బహమాస్, బార్బడోస్, బెలీజ్, కెనడా, డొమినికా, గ్రెనడా, గయానా, జమైకా, సెయింట్‌ లూసియా, సెయింట్‌ కిట్స్‌ అండ్‌ నెవిస్, సెయింట్‌ విన్సెంట్‌ అండ్‌ ద గ్రెనడైన్స్, ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో
* యూరప్‌ ప్రాంతం నుంచి 3 సైప్రస్, మాల్టా, బ్రిటన్‌ 
* పసిఫిక్‌ ప్రాంతం నుంచి 11 ఆస్ట్రేలియా, ఫిజి, కిరిబటీ, నైరు, న్యూజిలాండ్, పపువా న్యూ గినియా, సమోవా, సోలోమాన్‌ దీవులు, టోంగా, తువాలు, వనౌటు. 


ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ది పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్‌ కంట్రీస్‌ (OPEC) 
* వీశినిదిను 1960, సెప్టెంబరులో ఇరాక్‌ రాజధాని ‘బాగ్దాద్‌’లో నెలకొల్పారు. దీని స్థాపనలో ఇరాన్, ఇరాక్, కువైట్, సౌదీ అరేబియా, వెనిజులా దేశాలు కీలకపాత్ర పోషించాయి. ఇది 1961 నుంచి అమల్లోకి వచ్చింది.
* ప్రపంచవ్యాప్తంగా చమురు ఉత్పత్తిలో దాదాపు 3వ వంతు భాగాన్ని ‘OPEC’  సభ్యదేశాలే ఉత్పత్తి చేస్తున్నాయి. ప్రపంచంలోని మొత్తం చమురు నిల్వల్లో సుమారు 70 శాతం ఈ దేశాలే కలిగి ఉన్నాయి.
* సభ్యదేశాల మధ్య సమన్వయాన్ని సాధించడం, అంతర్గత చమురు ధరల స్థిరీకరణ, పెట్రోలియం విధాన రూపకల్పన, ఎగుమతులకు అనుసరించాల్సిన విధానాలను రూపొందించడం OPEC  లక్ష్యాలు.
* దీని ప్రధాన కార్యాలయం వియన్నా (ఆస్ట్రియా)లో ఉంది. అధికార భాష ఇంగ్లిష్‌.
* ప్రస్తుతం దీనిలోని సభ్యదేశాల సంఖ్య 13. అవి:  అల్జీరియా, అంగోలా, కాంగో, ఈక్వటోరియల్‌ గినియా, గాబన్, ఇరాన్, ఇరాక్, కువైట్, లిబియా, నైజీరియా, సౌదీ అరేబియా, వెనిజులా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌.
* 2019, జనవరి 1న ‘ఖతార్‌’ దేశాన్ని  వీశినిది కూటమి నుంచి తొలగించారు.

 

ఆసియా - పసిఫిక్‌ ఎకనామిక్‌ కోఆపరేషన్‌ (APEC) 
* 1989లో అప్పటి ఆస్ట్రేలియా ప్రధాని బాబ్‌ హాక్‌ ‘వివిధ దేశాల మధ్య స్వేచ్ఛా, మార్కెట్‌ అనుకూల దేశాల ఆర్థిక సంబంధాల సమన్వయానికి శాశ్వతమైన సంస్థను ఏర్పాటు చేయాలని’ ప్రతిపాదించారు.
* దీనిపై పసిఫిక్‌ ఎకనామిక్‌ కోఆపరేషన్‌ కౌన్సిల్‌ చర్చలు జరిపి 1989 నవంబరులో ‘ఆసియా పసిఫిక్‌ ఎకనామిక్‌ కోఆపరేషన్‌’’ (APEC)ను ఏర్పాటు చేసింది. దీని మొదటి సమావేశం ఆస్ట్రేలియాలోని కాన్‌బెర్రా నగరంలో జరిగింది. ఇందులో పసిఫిక్‌ దేశాలైన ఆస్ట్రేలియా, కెనడా, జపాన్, న్యూజిలాండ్, అమెరికాతో పాటు, అప్పటి ఏసియాన్‌ సభ్యదేశాలైన ఇండోనేసియా, మలేసియా, థాయ్‌లాండ్, సింగపూర్, రిపబ్లిక్‌ ఆఫ్‌ కొరియా, బ్రూనై మొదలైన దేశాలు పాల్గొన్నాయి.
* 1991లో దక్షిణ కొరియాలోని ‘సియోల్‌’లో జరిగిన సమావేశంలో చైనా, తైవాన్‌ దేశాల సభ్యత్వాన్ని ఆమోదించారు.
* సభ్యదేశాల మధ్య ఆర్థిక, సాంకేతిక సహకారం; స్వేచ్ఛా వాణిజ్యాన్ని అభివృద్ధి చేయడం; ప్రైవేట్‌ పెట్టుబడులను ప్రోత్సహించడం ఎపెక్‌ లక్ష్యం.
* దీని ప్రధాన కార్యాలయం ‘సింగపూర్‌’లో ఉంది. అధికారిక భాష ‘ఇంగ్లిష్‌’. సభ్యదేశాల సంఖ్య 21. దీనిలో భారత్‌కు సభ్యత్వం లేదు.
* తిశినిది దేశాల కూటమికి ప్రపంచ జనాభాలో 45%, ప్రపంచ వాణిజ్యంలో 46%, అంతర్జాతీయ అభివృద్ధిలో 70% వాటా ఉంది. ఏటా సభ్యదేశాల వాణిజ్య మంత్రుల మంత్రిత్వ సమావేశం జరుగుతుంది.


షాంఘై సహకార సమాఖ్య (SCO) 
* చైనా, సోవియట్‌ రిపబ్లిక్‌ దేశాల మధ్య సరిహద్దు వివాదాల పరిష్కారానికి 1996లో ‘షాంఘై సహకార సమాఖ్య’ను ఏర్పాటు చేశారు. ఇది ఆసియా ఖండంలో ఏర్పడిన ప్రాంతీయ భద్రతా గ్రూప్‌గా పేరొందింది. 
* దీనిలోని సభ్యదేశాలు 8. అవి: భారత్, రష్యా, చైనా, పాకిస్థాన్, కజికిస్థాన్, కిర్గిస్థాన్, తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్‌. పరిశీలక హోదాలో ఉన్న దేశాలు: ఆఫ్గనిస్థాన్, బెలారస్, ఇరాన్, మంగోలియా.

 

హిందూ మహాసముద్ర తీరప్రాంత దేశ సహకార సమాఖ్య [Indian Ocean Rim Association for Regional Co-operation (IOR-ARC)] 
* హిందూ మహాసముద్ర ప్రాంతంలో వాణిజ్యపరమైన సహజ వనరుల వైజ్ఞానిక అభివృద్ధికి వ్యూహాలను రూపొందించడం దీని ప్రథమ కర్తవ్యం. ఇది ప్రపంచంలోనే కొత్తగా ఆవిర్భవించిన అతిపెద్ద ప్రాంతీయ (ఆర్థిక) సహకార సమాఖ్య.
* ఇది 1997లో ఏర్పడింది. భారత్‌ సహా ఇందులోని మొత్తం సభ్యదేశాల సంఖ్య 19. 


ఇస్లామిక్‌ దేశాల సమాఖ్య  (OIC) 
* 1971లో ముస్లిం దేశాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో మొరాకోలోని ‘రాబట్‌’లో 24 ఇస్లాం దేశాలకు చెందిన అధినేతలు సమావేశమయ్యారు. అదే ఏడాది మేలో సౌదీ అరేబియాలోని ‘జెడ్డా’లో ‘ఇస్లామిక్‌ దేశాల సమాఖ్య’ని అధికారికంగా  స్థాపించారు.
* 1972లో దీని చార్టర్‌ను ఆమోదించారు. ఇందులో మొత్తం 57 సభ్యదేశాలు ఉన్నాయి. ప్రధాన కార్యాలయం జెడ్డా. అధికార భాషలు అరబిక్, ఇంగ్లిష్, ఫ్రెంచ్‌.
* సభ్యదేశాల మధ్య సంఘీభావాన్ని పెంపొందించడం; ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక, వైజ్ఞానిక రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించడం; జాతి వివక్షతను తొలగించడానికి ప్రయత్నించడం; పౌరహక్కుల కోసం పోరాడుతున్న వారికి మద్దతు ఇవ్వడం మొదలైనవి OIC లక్ష్యాలు.


ఆఫ్రికన్‌ యూనియన్‌ (African Union)
* 1963లో వలస పాలన నుంచి విముక్తి పొందిన దేశాలతో ‘‘ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఆఫ్రికా యూనియన్‌’’ (OAU) ఏర్పడింది. అప్పటి ఘనా దేశాధ్యక్షుడైన ‘‘క్వామిక్వైయా’’ దీని ఏర్పాటుకు విశేష కృషి చేశారు. రువాండా దేశంలో జరిగిన జాతుల పోరాటాలను, ఆఫ్రికా దేశాల మధ్య ప్రారంభమైన అంతర్గత పోరాటాలను నియంత్రించడంలో OAU విఫలమైంది.
* 2002, జులై 9న దక్షిణాఫ్రికాలోని ‘డర్బన్‌’లో జరిగిన సమావేశంలో 'OAU' ను ‘‘ఆఫ్రికన్‌ యూనియన్‌’’ (AU)గా మార్చారు.
* సభ్యదేశాల మధ్య ఉమ్మడి మార్కెటింగ్‌ విధానాలను అమలు పరచడం, ఉమ్మడి బ్యాంకింగ్‌ సేవల నిర్వహణ, స్వావలంబన, పరస్పర సహకారాన్ని పెంపొందించడం దీని ప్రధాన లక్ష్యాలు.
* AUకు తొలి ఛైర్మన్‌గా అప్పటి దక్షిణాఫ్రికా అధ్యక్షుడు థాబో ఎంబెకీ వ్యవహరించారు.
* ఆఫ్రికన్‌ యూనియన్‌లో ప్రస్తుతం 55 సభ్యదేశాలు ఉన్నాయి. దీని ప్రధాన కార్యాలయం అడీస్‌ అబాబా (ఇథియోపియా)లో ఉంది.
* ఆఫ్రికన్‌ యూనియన్‌లో ప్రధాన విభాగం ‘శాంతి భద్రతల మండలి’  (Peace and Security Council). దీనికి 15 సభ్యదేశాలు రొటేషన్‌ పద్ధతిలో ప్రాతినిధ్యం వహిస్తాయి.
* దీనిలోని మరో ప్రధాన విభాగం “New Partnership for Africa’s Development (NEPAD)”. అంతర్జాతీయ పెట్టుబడులకు తగిన భద్రతను కల్పించడం దీని ప్రధాన లక్ష్యం.

Posted Date : 03-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌