• facebook
  • whatsapp
  • telegram

అంతర్జాతీయ సంస్థలు

ప్రపంచ దేశాల మధ్య సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక సహకారాన్ని సాధించేందుకు, విశ్వమానవాళి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు, మానవ హక్కుల పరిరక్షణకు, పర్యావరణాన్ని కాపాడేందుకు వివిధ అంతర్జాతీయ సంస్థలను స్థాపించారు. ఇవి ప్రపంచ దేశాల మధ్య సమన్వయాన్ని సాధించేందుకు నిరంతరం కృషి చేస్తున్నాయి.


యూనివర్సిటీ ఫర్‌ పీస్‌
* ప్రపంచ దేశాల మధ్య నిరాయుధీకరణను సాధించడం, వివిధ దేశాల మధ్య తలెత్తే సమస్యలను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించడం, అంతర్జాతీయ సంబంధాలను మెరుగుపరచడం దీని ప్రధాన లక్ష్యాలు.
* 1980లో కోస్టారికా కేంద్రంగా యూనివర్సిటీ ఫర్‌ పీస్‌ను నెలకొల్పారు. ఇది మానవ హక్కులు, శాంతి, విద్య మొదలైన అంశాలపై విశేష పరిశోధనలు నిర్వహిస్తోంది.


బ్రెట్టన్‌ ఉడ్స్‌ కవలలు
* 1944, జులై 22న యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికాలోని న్యూహాంప్‌షైర్‌ రాష్ట్రంలోని బ్రెట్టన్‌ ఉడ్స్‌ నగరంలో  UN Monetary and Financial Conference జరిగింది. ఇందులో ప్రపంచబ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థలను ఏర్పాటు చేసే ఒప్పందం కుదిరింది.
* వీటిని బ్రెట్టన్‌ ఉడ్స్‌ కవలలు అంటారు.


ప్రపంచ బ్యాంక్‌ (World Bank) 
ఇది రెండు విభాగాలను కలిగి ఉంది.
*  International Bank for Reconstruction and Development (IBRD)
* International Development Association (IDA) 

* వీటికి అనుబంధంగా మరో 3 ప్రత్యేక విభాగాలున్నాయి. అవి:
* International Finance Corporation (IFC)
* Multilateral Investment Guarantee Agency (MIGA)
* International Centre for Settlement of Investment Disputes (ICSID) 

* అభివృద్ధి చెందిన దేశాల నుంచి ఆర్థిక వనరులను సమీకరించి, అభివృద్ధి చెందుతున్న దేశాలకు అవసరమైన సహకారాన్ని అందించేందుకు ప్రపంచబ్యాంక్‌ కృషి చేస్తోంది. దీని ప్రధాన కార్యాలయం వాషింగ్టన్‌ డి.సి.లో ఉంది.


అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (International Monetary Fund)
* అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌)ను 1944, జులై 22న స్థాపించారు. ఇది 1945, డిసెంబరు 27 నుంచి అమల్లోకి వచ్చింది. అంతర్జాతీయ ద్రవ్య, ఆర్థిక స్థిరత్వాన్ని సాధించడం, అంతర్జాతీయ వాణిజ్యాభివృద్ధితో పాటు మెరుగైన ఉపాధి అవకాశాలను పెంపొందించడం, వాస్తవ ఆదాయవృద్ధికి ప్రణాళికలు రూపొందించడం, సభ్యదేశాల్లో ఉత్పత్తి వనరుల పెరుగుదలకు కృషి చేయడం దీని ముఖ్య ఉద్దేశాలు. ఐఎంఎఫ్‌ ప్రధాన కార్యాలయం వాషింగ్టన్‌ డి.సి.లో ఉంది.


ప్రపంచ వాణిజ్య సంస్థ  (World Trade Organisation) 
* ప్రపంచ దేశాల మధ్య స్వేచ్ఛాయుత వాణిజ్యాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో 1948లో GATT (General Agreement on Tariffs and Trade) ఏర్పడింది. ఇది 1995, జనవరి 1న ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO)గా అవతరించింది.
* వస్తువులు, సేవలు, ఇతర విషయాల్లో సభ్యదేశాల మధ్య స్వేచ్ఛా, వాణిజ్య నిబంధనలను వర్తింపజేయడం, అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య అభివృద్ధిని, ఆర్థికపరమైన సంస్కరణలను ప్రోత్సహించడం దీని లక్ష్యం. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం జెనీవా (స్విట్జర్లాండ్‌)లో ఉంది.


ఇంటర్‌ పోల్‌ (International Criminal Police Organisation) 
* 1914లో మొరాకోలోని మాంటెకార్లో వద్ద మొదటి అంతర్జాతీయ క్రిమినల్‌ పోలీస్‌ కాంగ్రెస్‌ సమావేశం జరిగింది. ఇందులో బెల్జియం దేశానికి చెందిన ప్రిన్స్‌ ఆల్బర్డ్‌ - I ఇంటర్‌పోల్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.
* ఇంటర్నేషనల్‌ క్రిమినల్‌ పోలీస్‌ కమిషన్ (ICPC) వియన్నా (ఆస్ట్రియా)లో 1923లో 20 సభ్యదేశాలతో ప్రారంభమైంది.
* 1930లో  ICPC  సెక్రటేరియట్‌ను వియన్నాలో ఏర్పాటు చేశారు.
* 1956లో జరిగిన 25వ సమావేశంలో ఇంటర్నేషనల్‌ క్రిమినల్‌ పోలీస్‌ కమిషన్‌ (ICPC)ను ఇంటర్నేషనల్‌ క్రిమినల్‌ పోలీస్‌ ఆర్గనైజేషన్‌ (ICPO) గా మార్చారు. దీని సంకేతాన్ని  INTERPOL గా గుర్తించారు.
* ఇంటర్‌పోల్‌కు 1996లో ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో పరిశీలక హోదాను కల్పించారు.
* ఇంటర్‌పోల్‌ ప్రధాన కార్యాలయం లయోన్స్‌ (ఫ్రాన్స్‌)లో ఉంది. దీని అధికారిక భాషలు: ఇంగ్లిష్, ఫ్రెంచ్, స్పానిష్, అరబిక్‌. 

 

అంతర్జాతీయ నేర న్యాయస్థానం (International Criminal Court) 
* యుద్ధ నేరాలపై విచారణ జరిపే లక్ష్యంతో 2002, జులై 1న అంతర్జాతీయ నేర న్యాయస్థానాన్ని (ఐసీసీ) ఏర్పాటు చేశారు. మానవ సమూహాల పట్ల ఘోరమైన నేరాలు, యుద్ధనేరాలపై విచారణ జరిపే అధికారం దీనికి ఉంది.
* హత్యలు, చిత్రహింసలు, అత్యాచారాలతో సహా మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడేవారు, దేశాధినేతలు మొదలు సామాన్య పౌరుల వరకు ఎవరిపైనైనా విచారణ జరిపే అధికారం దీనికి ఉంది.
* ఐసీసీ ఏర్పాటును సమర్థించిన దేశాల్లోని కోర్టులు విచారణ జరపలేని, తీవ్రనేరాలకు సంబంధించిన కేసుల్ని దీనికి నివేదించొచ్చు. వాటిపై ఐసీసీ విచారణ చేపడుతుంది.
* 1998, జులైలో రోమ్‌ నగరంలో జరిగిన సమావేశంలో ఐసీసీ ఏర్పాటుకు సంబంధించిన ఒప్పందంపై 139 దేశాలు సంతకాలు చేశాయి. ఐసీసీ అమల్లోకి రావాలంటే వీటిలోని 60 దేశాలు గెజిట్‌ నోటిఫికేషన్‌ను వెలువరించాలని నిర్దేశించారు.
* 2002, జూన్‌ నాటికి 66 దేశాలు రోమ్‌ ఒప్పందాన్ని ధ్రువీకరించాయి. 2002, జులై 1 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. దీని ప్రధాన కార్యాలయం ది హేగ్‌ (నెదర్లాండ్స్‌)లో ఉంది.


యునైటెడ్‌ నేషన్స్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ ట్రేడ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ 
* 1964, డిసెంబరు 30న  United Nations Conference on Trade and Development - UNCTAD ని ఏర్పాటుచేశారు. ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ సమావేశంలో తీర్మానం ద్వారా దీన్ని నెలకొల్పారు. యూఎన్‌ఓ సభ్యదేశాలన్నీ దీనికి ప్రాతినిధ్యం వహిస్తాయి. 
* ఈ సంస్థ ప్రతి నాలుగేళ్లకోసారి సభ్యదేశ రాజధానిలో సమావేశమవుతుంది. దీని ప్రధాన కార్యాలయం జెనీవా (స్విట్జర్లాండ్‌)లో ఉంది.


లక్ష్యాలు:
* అంతర్జాతీయ వాణిజ్యాన్ని ప్రోత్సహించడం.
* అభివృద్ధి చెందుతున్న వర్ధమాన దేశాల్లో త్వరితగతిన ఆర్థిక ప్రగతికి కృషి చేయడం.
* అభిలషణీయమైన వాణిజ్యాభివృద్ధి విధానాలను రూపొందించి అమలు చేయడం.
* వాణిజ్యానికి సంబంధించి వివిధ యూఎన్‌ఓ సంస్థలను సమన్వయపరచడం.
* ప్రభుత్వాల వాణిజ్యాభివృద్ధి విధానాలను, వివిధ ప్రాంతీయ, ఆర్థిక సంస్థలను సమన్వయపరచడం. 


ఇంటర్నేషనల్‌ ఎనర్జీ ఏజెన్సీ 
* 1973లో అరబ్‌ దేశాలు చమురు ఎగుమతిని ఆపేయడంతో వాటి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఫలితంగా అనేక దేశాలు సమస్యలను ఎదుర్కొన్నాయి.
* దీంతో చమురును అత్యధికంగా దిగుమతి చేసుకునే (OECD - ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఎకనామిక్‌ కో ఆపరేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌) దేశాలన్నీ 1974లో పారిస్‌ (ఫ్రాన్స్‌)లో ఇంటర్నేషనల్‌ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ)ను ఏర్పాటు చేశాయి.
* శక్తి (ఎనర్జీ)కి సంబంధించి ఏర్పడే సంక్షోభాలపై సభ్యదేశాల మధ్య సమన్వయం సాధించడం, చమురు సరఫరాలోని అవరోధాలను అధిగమించడం ఈ సంస్థ లక్ష్యాలు.


ఇంటర్నేషనల్‌ కమిటీ ఆఫ్‌ ది రెడ్‌క్రాస్‌ (ICRC)
* 1859లో ఆస్ట్రియా, ఫ్రాన్స్‌ దేశాల మధ్య సాల్‌ఫెరినో యుద్ధం జరిగింది. ఇందులో గాయపడిన సైనికులకు స్విట్జర్లాండ్‌ దేశానికి చెందిన మానవతావాది జీన్‌ హెన్రీ డ్యునాంట్‌ అత్యవసర సహాయ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈయన కృషి ఫలితంగా 1864లో ఇంటర్నేషనల్‌ కమిటీ ఆఫ్‌ది రెడ్‌క్రాస్ (ICRC) అమల్లోకి వచ్చింది.
* హెన్రీ డ్యునాంట్‌ 1862లో ఎ మెమొరీ ఆఫ్‌ సాల్‌ఫెరినో గ్రంథాన్ని రాశారు. ఇందులో ప్రపంచంలోని అన్ని దేశాల్లో వాలంటరీ రిలీఫ్‌ సొసైటీలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.
* 1864లో జరిగిన జెనీవా సదస్సులో మిత్రుడైనా, శత్రువైనా యుద్ధంలో గాయపడిన వారికి సహాయం అందించాలని ఇందులో పాల్గొన్న అనేక దేశాలు తీర్మానించాయి.
* రెడ్‌క్రాస్‌ ప్రాయోజిత దేశాల్లో క్రిస్టియన్‌ దేశాలు రెడ్‌క్రాస్‌ను అదే పేరుతో పిలుస్తుండగా, ముస్లిం దేశాలు రెడ్‌ క్రీసెంట్‌ పేరుతో పిలుస్తున్నాయి.
* 1917, 1944, 1963లో  ICRC కి నోబెల్‌ శాంతి బహుమతి లభించింది.
* దీని ప్రధాన కార్యాలయం జెనీవా (స్విట్జర్లాండ్‌)లో ఉంది.


లక్ష్యాలు: 
* అంతర్గత హింస నియంత్రణకు కృషి చేయడం.
* యుద్ధంలో క్షతగాత్రులైన బాధితులకు సహాయం అందించడం.
* మానవతావాదాన్ని ప్రవచించే సిద్ధాంతాల అమలుకు కృషిచేయడం.

Posted Date : 20-04-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌