• facebook
  • whatsapp
  • telegram

అంత‌ర్జాతీయ సంబంధాలు

వివిధ దేశాల మధ్య ఏర్పడిన రాజకీయ, ఆర్థిక, సామాజిక, విదేశాంగ సంబంధాలను ‘అంతర్జాతీయ సంబంధాలు’ అంటారు. ప్రస్తుత కాలంలో వీటి ప్రాధాన్యం ఎంతో పెరిగింది. ప్రపంచ రాజకీయాల్లో చేపట్టాల్సిన మార్పులు, చేర్పులకు ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.
* అంతర్జాతీయ సంబంధాలు అనే పదాన్ని మొదటిసారిగా జెర్మీ బెంథామ్‌ అనే రాజనీతి తత్త్వవేత్త ప్రాచుర్యంలోకి తెచ్చారు.
* క్రీ.శ.1648లో జరిగిన ‘వెస్ట్‌ ఫేలియా’ సంధిని అంతర్జాతీయ సంబంధాలకు మూలంగా పేర్కొంటారు. దీని ద్వారా యూరప్‌ ఖండానికి చెందిన స్వతంత్ర దేశాలు తమ దౌత్యవేత్తల ద్వారా ప్రపంచశాంతి స్థాపనకు ముందుకొచ్చాయి.
* మానవజాతి మనుగడను మలుపుతిప్పిన ‘సాంస్కృతిక పునరుజ్జీవనం’ ఫలితంగా వివిధ దేశాల మధ్య ఉండే ప్రాంతీయ సంబంధాలు ‘అంతర్జాతీయ దౌత్య సంబంధాలు’గా ఆచరణలోకి వచ్చాయి.
* 191418 మధ్య జరిగిన మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత అంతర్జాతీయ సమాజం ఒక నిర్దిష్ట రూపాన్ని సంతరించుకుంది.
* ప్రపంచ రాజకీయ సమస్యల పరిష్కారానికి ముఖ్య సాధనంగా అంతర్జాతీయ సంబంధాలు ఏర్పడ్డాయని మార్గెంథో, థామ్సన్‌ పేర్కొన్నారు.
* ‘అంతర్జాతీయ సంబంధాలు’ అనే అంశాన్ని 1919లో తొలిసారిగా ఒక అధ్యయన అంశంగా ‘వేల్స్‌’ విశ్వవిద్యాలయంలో ప్రవేశపెట్టారు. వీటి అధ్యయనం కోసం ‘ఉడ్రో విల్సన్‌’ పేరుతో ఒక ప్రత్యేక పీఠాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని అధిష్ఠించిన తొలి వ్యక్తి ఆల్ఫ్రెడ్‌ జమరిన్‌.
* 1919లో అమెరికాలోని జార్జిటౌన్‌ విశ్వవిద్యాలయంలో; 1924లో సదరన్‌ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో; 1923లో పారిస్‌ విశ్వవిద్యాలయంలో ఇలాంటి పీఠాలను ఏర్పాటు చేశారు.

 

నానాజాతి సమితి పాత్ర
* ప్రపంచ దేశాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు ఏర్పడిన మొదటి అంతర్జాతీయ సంస్థ నానాజాతి సమితి.
* 1920లో 24 సభ్యదేశాలతో ఇది ఏర్పడింది.
* బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ దేశాలు ఇందులో సభ్యులుగా చేరాయి. కానీ అమెరికా, కెనడా దేశాలు సభ్యత్వం పొందలేదు.

 

ప్రాధాన్యతకు కారణాలు
* రాజకీయ సార్వభౌమత్వం ఉన్న స్వతంత్ర రాజ్యాల ఆవిర్భావం.
* రెండో ప్రపంచ యుద్ధానంతరం ప్రపంచవ్యాప్తంగా వచ్చిన మార్పులు.
* వలసవాదం, సామ్రాజ్యవాదం అంతరించడం.
* అభివృద్ధి చెందుతున్న మూడో ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలు.
* ప్రపంచంలోని ప్రతి దేశం తన అస్తిత్వాన్ని నిలుపుకునేందుకు ప్రయత్నించడం.
* ఉగ్రవాదం, పేదరికం, పర్యావరణ సమస్యలను ఎదుర్కోవడానికి అవసరమైన వ్యూహం కోసం.
* నూతన అంతర్జాతీయ సంస్థల ఆవిర్భావం.
* అగ్రరాజ్యాల వ్యూహాలు, సైనిక విధానాలు.
* ప్రపంచ దేశాల్లో మారుతున్న వైఖరులు.
* అమెరికా, సోవియట్‌ రష్యాల మధ్య జరిగిన ప్రచ్ఛన్నయుద్ధం ముగింపు.
* సోవియట్‌ రష్యా విచ్ఛిన్నం, అమెరికా అగ్రరాజ్యంగా అవతరించడం.


మొదటి ప్రపంచ యుద్ధ ప్రభావం
* మొదటి ప్రపంచయుద్ధం తర్వాత ప్రపంచ దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొల్పాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.
* ప్రపంచంలో శాంతి, సామరస్యాలను పరిరక్షించాల్సిన ఆవశ్యకతను అన్ని దేశాలు గుర్తించాయి.
* యుద్ధం ప్రపంచ మానవాళిపై తీవ్ర ప్రభాం చూపింది.
* అగ్రరాజ్యాల సామ్రాజ్యకాంక్ష ప్రస్ఫుటమైంది.
* అపారమైన ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది.
* యుద్ధంలో గెలిచిన, ఓడిన దేశాల ఆర్థిక పరిస్థితి ప్రమాదంలో పడింది.
* ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడిన బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా దేశాలు తమ ప్రాబల్యాన్ని పెంచుకున్నాయి.
* వివిధ దేశాలు ఏర్పర్చుకున్న ‘రహస్య కూటముల’ వల్ల జరిగిన నష్టాలు ప్రపంచ రాజ్యాలకు అర్థమయ్యాయి.
* యుద్ధాన్ని ఒక ఉన్నతమైన ఆదర్శంగా, జాతీయ పరిశ్రమగా భావించిన జర్మన్లు తీవ్ర సంక్షోభానికి కారణమయ్యారు. యుద్ధానంతరం అపార నష్టానికి, అవమానాలకు గురయ్యారు.
* ఒకే జాతి, ఒకే రాజ్యం అనే సిద్ధాంతం ప్రాతిపదికగా యూరప్‌ దేశాల పునరేకీకరణ జరిగింది.
* అంతర్జాతీయ రాజకీయాల్లో జాతీయవాదం వ్యాప్తిచెంది, ప్రజాస్వామ్య సిద్ధాంతాల ప్రాబల్యం పెరిగింది.
* అప్పటి అమెరికా అధ్యక్షుడైన ఉడ్రో విల్సన్‌ ప్రతిపాదించిన 14 సూత్రాలు ప్రపంచ దేశాల్లో ఆదరణ పొందాయి. ఆ సూత్రాల్లో ఒకటైన జాతుల స్వయం నిర్ణయాధికార సిద్ధాంతం నూతన జాతీయ రాజ్యాల ఆవిర్భావానికి పునాదులు వేసింది.
* బ్రిటన్‌ విదేశాంగ విధానంలో గణనీయమైన మార్పులు వచ్చాయి.


వర్సయిల్స్‌ సంధి (1919, జనవరి 18)
* పారిస్‌ నగర శివార్లలోని ‘వర్సయిల్స్‌’ రాజభవన ప్రాకారంలో మొదటి ప్రపంచ యుద్ధానికి ముగింపు పలుకుతూ ఓ సమావేశం జరిగింది. ఇందులో యుద్ధానంతర పరిస్థితులను సమీక్షించి, సుస్థిర శాంతిస్థాపన కోసం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో 70 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో యుద్ధంలో ఓడిపోయిన దేశాలపై గెలుపొందిన దేశాలు అవమానకరమైన షరతులు విధించాయి.
* ‘ఓడిపోయిన వారి నెత్తిన గెలిచిన వారు షరతులు విధించడం సహజమే. కానీ, ఈ సమావేశంలో విధించిన షరతులు ఆధునిక చరిత్రలో లేవు’ అని ఇ.హెచ్‌.కార్‌ అనే రాజనీతిజ్ఞుడు వ్యాఖ్యానించారు.


రెండో ప్రపంచ యుద్ధ ప్రభావం
* 1939, సెప్టెంబరు 1న పోలెండ్‌పై జర్మనీ దాడి చేయడంతో రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. 1945 ఆగస్టు 6, 9 తేదీల్లో జపాన్‌లోని హిరోషిమా, నాగసాకి నగరాలపై అమెరికా అణుబాంబులు ప్రయోగించడంతో జపాన్‌ లొంగిపోయింది. దీంతో రెండో ప్రపంచయుద్ధం ముగిసింది. ఈ యుద్ధం అంతర్జాతీయ సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. వాటిలోని ముఖ్యాంశాలు.
* ఈ యుద్ధం వల్ల ప్రపంచంలోని అనేక దేశాలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రభావితమయ్యాయి.
* అక్షరాజ్యాలపై మిత్రరాజ్యాలు విజయం సాధించడంతో ప్రపంచవ్యాప్తంగా నూతన రాజకీయ మార్పులు సంభవించాయి.
* మిత్రరాజ్యాలు యుద్ధకాలంలో ప్రదర్శించిన సమన్వయం, సమైక్యతలను యుద్ధానంతరం ప్రదర్శించలేదు.
* అమెరికా - సోవియట్‌ రష్యాల మధ్య ప్రచ్ఛన్నయుద్ధం ప్రారంభమై ప్రపంచంలో మరోసారి శాంతికి విఘాతం కలిగే పరిస్థితులు ఏర్పడ్డాయి.
* అమెరికా - సోవియట్‌ రష్యాలు అగ్రరాజ్యాలుగా అవతరించి, సైనిక కూటముల ఏర్పాటుకు శ్రీకారం చుట్టాయి.
* ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోని వివిధ వలస పాలిత దేశాల్లో జాతీయోద్యమాలు ఊపందుకున్నాయి. ఆ ఖండాల్లో నూతనంగా స్వాతంత్య్రం పొందిన అనేక దేశాలను సోషలిస్టు భావాలు ఆకర్షించాయి.
* ప్రపంచీకరణ విధానాల ఫలితంగా వివిధ దేశాల మధ్య అంతరాలు తగ్గాయి.
* ప్రపంచ దేశాల మధ్య సమాచార, సాంకేతిక పరిజ్ఞానం, వస్తుసేవలు, పెట్టుబడుల అనుసంధానత పెరిగింది.
* బహుళజాతి సంస్థలు అవతరించి, ప్రాబల్యంలోకి వచ్చాయి.
* అలీన విధానం అనేక దేశాల విదేశాంగ విధానంగా అవతరించింది.


అంతర్జాతీయ సంబంధాలు - కీలక ఘట్టాలు
వెస్ట్‌ ఫేలియా సంధి (1648): ఇది ప్రొటెస్టెంట్లు, కేథలిక్‌లకు మధ్య జరిగిన శాంతియుత సంధి. దీని ప్రకారం హాలెండ్, స్విట్జర్లాండ్‌లు స్వతంత్ర గణతంత్ర రాజ్యాలుగా గుర్తింపు పొందాయి. ఈ సంధి ఫలితంగా ఇంగ్లండ్, ఫ్రాన్స్, స్వీడన్‌లు అగ్రరాజ్యాలుగా అవతరించాయి.
యుటెరిచ్‌ సంధి (1713): * ఈ సంధి వల్ల ‘శక్తి సమతౌల్యం’ ప్రధాన సిద్ధాంతంగా అవతరించింది. దీని అమలుకు ఇంగ్లండ్‌ - ఆస్ట్రియాలు నాయకత్వం వహించాయి. ఫ్రాన్స్‌ తీవ్ర నష్టానికి గురైంది. ప్రష్యా ఏకీకరణకు బలమైన పునాది పడింది. ప్రష్యా ఏకీకరణ జరిగి, ‘ఫ్రెడరిక్‌ ది గ్రేట్‌’ నాయకత్వంలో శక్తిమంతమైన రాజ్యంగా అవతరించింది. 
వియన్నా కాంగ్రెస్‌ (1815): * మెటర్నిక్, టెల్లిరాండ్‌ అనే ఇద్దరు వ్యక్తుల వ్యూహం వియన్నా కాంగ్రెస్‌గా చరిత్రలో నిలిచిపోయింది. దీని ద్వారా ఫ్రాన్స్, దాని పొరుగు దేశాల మధ్య రక్షణరేఖను ఏర్పర్చారు. పోలెండ్‌ను ప్రష్యా, ఆస్ట్రియా, రష్యాలు తమలో తాము విభజించి పంచుకున్నాయి.
క్రిమియా యుద్ధం (1854-56): * కాన్‌స్టాంటినోపుల్‌పై ఆధిపత్యం కోసం ఈ యుద్ధం జరిగింది. ఇందులో రష్యాపై బ్రిటన్, ఫ్రాన్స్‌ దేశాలు ఉమ్మడిగా పోరాడి విజయం సాధించాయి. రష్యా ఓడి నష్టపోయింది.


ఫ్రాంకో - ప్రష్యన్‌ యుద్ధం (1870 - 71)
* ఈ యుద్ధం ప్రష్యా, ఫ్రాన్స్‌కు మధ్య జరిగింది. ఇందులో ఫ్రాన్స్‌ ఓడింది. బిస్మార్క్‌ నాయకత్వంలో ప్రష్యా శక్తిమంతమైంది. యూరప్‌లో జర్మనీ అగ్రరాజ్యంగా అవతరించింది. ఫ్రాన్స్‌ ప్రాబల్యం తగ్గింది.

 

నమూనా ప్రశ్నలు
1. అంతర్జాతీయ సంబంధాలు అనే పదాన్ని మొదటిసారిగా ప్రాచుర్యంలోకి తెచ్చిన రాజనీతి తత్వవేత్త ఎవరు?
1) జెర్మీ బెంథామ్‌       2) జీన్‌బోడిన్‌ 
3) అరిస్టాటిల్‌       4) హెచ్‌.జె.లాస్కి


2. 1919లో ఏ విశ్వవిద్యాలయం అంతర్జాతీయ సంబంధాలను ఒక అధ్యయన అంశంగా ప్రవేశపెట్టింది?
1) పారిస్‌ విశ్వవిద్యాలయం 
2) సదరన్‌ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం 
3) ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం 
4) వేల్స్‌ విశ్వవిద్యాలయం


3. 1920లో ఏర్పడిన ‘నానాజాతి సమితి’లో సభ్యత్వం లేని దేశాన్ని గుర్తించండి.
1) బ్రిటన్‌        2) అమెరికా 
3) ఫ్రాన్స్‌        4) జర్మనీ


4. యుద్ధాన్ని ఒక ఉన్నతమైన ఆదర్శంగా, జాతీయ పరిశ్రమగా భావించిన ఏ దేశస్థులు మొదటి ప్రపంచ యుద్ధానంతరం అవమానాలకు గురయ్యారు?
1) అమెరికా        2) జపాన్‌         3) జర్మనీ        4) ఇటలీ


5. అమెరికా మాజీ అధ్యక్షుడు ఉడ్రో విల్సన్‌ ప్రతిపాదించిన సూత్రాలు ఎన్ని?
1) 12      2) 14      3) 21      4) 41 


6. ‘జాతుల స్వయం నిర్ణయాధికార సిద్ధాంతాన్ని’ ప్రతిపాదించింది ఎవరు?
1) విన్‌స్టన్‌ చర్చిల్‌       2) జార్జి వాషింగ్టన్‌ 
3) ఉడ్రో విల్సన్‌         4) అడాల్ఫ్‌ హిట్లర్‌


7. ‘ఓడిపోయిన వారి నెత్తిన గెలిచినవారు షరతులు విధించడం సహజమే, కానీ వర్సయిల్స్‌ సంధి సమావేశంలో విధించిన షరతులు ఆధునిక చరిత్రలో లేవు’ అని వ్యాఖ్యానించిన రాజనీతి తత్వవేత్త ఎవరు?
1) ఈ.హెచ్‌.కార్‌    2) రాబర్ట్‌ హాక్‌         3) జీన్‌ బోడిన్‌       4) థామస్‌ హాబ్స్‌


8. అంతర్జాతీయ సంబంధాలపై రెండో ప్రపంచయుద్ధ ప్రభావాన్ని గుర్తించండి.
1) అలీన విధానం అనేక దేశాల విదేశాంగ విధానంగా రూపొందింది.
2) ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోని వలసపాలిత దేశాల్లో జాతీయోద్యమాలు ప్రారంభమయ్యాయి.
3) బహుళజాతి సంస్థలు అవతరించి, ప్రాబల్యంలోకి వచ్చాయి.
4) పైవన్నీ 


9. 1648లో జరిగిన ఏ సంధి ఫలితంగా హాలెండ్, స్విట్జర్లాండ్‌లు స్వతంత్ర గణతంత్ర రాజ్యాలుగా అవతరించాయి?
1) వెస్ట్‌ ఫేలియా సంధి            2) యుటెరిచ్‌ సంధి  
3) ఫ్రాంకో సంధి         4) వర్సయిల్స్‌ సంధి


సమాధానాలు: 1-1, 2-4, 3-2, 4-3, 5-2, 6-3, 7-1, 8-4, 9-1.

Posted Date : 24-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌