• facebook
  • whatsapp
  • telegram

తెలంగాణ సాహిత్య చరిత్ర

మూడు భాషల ప్రగతికి ఎనలేని సేవలు!

తెలుగు భాషా వికాసం, సాహితీ రచన, అభ్యుదయ భావాల వ్యాప్తిలో తెలంగాణ ప్రాంత కవుల కృషి  అనన్యసామాన్యం. శాతవాహనుల కాలం నుంచే ఈ గడ్డపై సాహిత్య కృషి మొదలై నిర్విరామంగా  కొనసాగుతోంది. ఆధునిక యుగం కవులు కూడా ఈ ఒరవడిని అందిపుచ్చుకుని, తెలుగు భాష   అభివృద్ధికి విశేష కృషి చేశారు. సాహితీ ప్రక్రియలో పలు ప్రయోగాలకు నాంది పలికారు. జనంలో చైతన్యం, అనుభూతిని పెంచే విధంగా రచనలు చేశారు. సమాజ పరిస్థితులను వివరిస్తూనే, లోపాలను ఎండగట్టారు. చరిత్రను, సంస్కృతిని గ్రంథస్థం చేయడం నుంచి సినిమా పాటల రచన వరకు అన్నింటా తెలంగాణ భాగస్వామ్యాన్ని సమున్నతంగా నిలబెట్టారు. అలాంటి మహామహులైన ఆధునిక తెలంగాణ కవుల గురించి పరీక్షార్థులు తెలుసుకోవాలి. తమ రచనలతో జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న కవులు, వారి రచనలు, ప్రత్యేకతలపై అవగాహన పెంచుకోవాలి.


ఆధునిక కవులు తెలంగాణ సాహిత్యాభివృద్ధికి పాటుపడ్డారు. తెలుగు, సంస్కృతం, ఉర్దూ భాషల అభివృద్ధికి ఎనలేని సేవ చేశారు. తమ రచనల ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేశారు. వివిధ అవార్డులు పొంది తెలుగు వారి గౌరవాన్ని జాతీయ స్థాయిలో వ్యాపింపజేశారు.


విప్లవ కవులు: ఈ తరహా కవుల్లో అల్లం రాజయ్య ముఖ్యులు. ‘కొమురం భీం’ (నవల), ‘గాయపడ్డ ఉదయం’ లాంటి గ్రంథాలు రచించారు. యస్‌.వి.సత్యనారాయణ రచన ‘విప్లవ శంఖం’. ఎన్‌.గోపి ‘మైలురాయి’ (1987) అనే గ్రంథాన్ని రచించారు.


శేషాద్రి రమణ కవులు: దూపాటి శేషాచార్యులు (1890-1940), దూపాటి వెంకటరమణాచార్యులు (1893-1963)లను శేషాద్రి రమణ కవులు అని పిలుస్తారు. వీరు రామప్ప, పాకాల, కొలనుపాక శాసనాలను రచించారు. వసు చరిత్ర వ్యాఖ్య, ఆంధ్ర పదవిధానము, రెడ్డి కుల నిర్ణయ చంద్రిక, మేదినీ హారావళీ, నిఘంటు వివరణము లాంటి గ్రంథాలు రచించారు. 1931లో అఖిలాంధ్ర చారిత్రక సమ్మేళనం నిర్వహించారు. సురవరం ప్రతాపరెడ్డి రచించిన గోలకొండ కవుల సంచికకు వీరు పూర్వకవి పరిచయం సమకూర్చారు. 


డాక్టర్‌ సింగిరెడ్డి నారాయణరెడ్డి: ఈయన ‘సినారె’గా సుపరిచితులు. 1931, జులై 29న ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని హనుమాజీపేటలో జన్మించారు. సంప్రదాయ కవిత్వంతో పాటు ఆధునిక కవిత్వం, గేయాలు రచించిన ప్రసిద్ధ కవి. గొప్ప రచనలెన్నో చేశారు. విశ్వంభర, కర్పూర వసంతరాయలు, ముఖాముఖి, కలం సాక్షిగా, భూగోళమంత మనిషి, నాగార్జున సాగరం, మధ్యతరగతి మందహాసం, సమదర్శనం, ప్రపంచ నదులు, మట్టి మనిషి, ఆకాశం మొదలైన గ్రంథాలు రచించారు. ‘విశ్వంభర’ కావ్యానికి 1988లో జ్ఞానపీఠ్‌ బహుమతి లభించింది. 1992లో భారత ప్రభుత్వం పద్మభూషణ్‌ బిరుదు ఇచ్చింది. ఈయన రచించిన ‘మంటలూ- మానవుడూ’ కావ్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు  దక్కింది. సినారె ఉర్దూ ప్రక్రియ అయిన గజల్‌ను తెలుగులోకి మొదటిసారిగా ప్రవేశపెట్టారు. అనేక సినిమాలకు పాటలు రాశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగు శాఖలో ఆచార్యులుగా పనిచేశారు. కొంతకాలం అధికార భాషా సంఘం అధ్యక్షులుగా ఉన్నారు. అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి, తెలుగు విశ్వవిద్యాలయానికి వైస్‌ ఛాన్సలర్‌గా విధులు నిర్వహించారు. ఆంధ్ర సారస్వత పరిషత్తుకు చాలాకాలం అధ్యక్షుడిగా వ్యవహరించారు.


సామల సదాశివ: హిందూస్థానీ సంగీతాన్ని తెలుగు వారికి పరిచయం చేసిన మొదటి రచయిత ఈయన. 1928, మే 11న ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా దహెగావ్‌లో జన్మించారు. మీర్జాగాలిబ్, ఉర్దూ సాహిత్య చరిత్ర, ఉర్దూ కవుల కవితా సామగ్రి తదితర గ్రంథాలు రచించారు. యాది, మలయ మారుతాలు, సంగీత  శిఖరాలు లాంటి వ్యాస సంకలనాలు రచించారు.


దిగంబర కవులు: దిగంబర కవుల్లో ముఖ్యమైన వారు చెరబండరాజు. ఈయన వందేమాతరం, పల్లె పిలుస్తుంది, జ్వాలాముఖి తదితర గ్రంథాలు రచించారు. మరో కవి నిఖిలేశ్వర్‌ ‘మీ అందరికీ సలామ్‌ వాలేకుమ్‌’, ‘మరోభారతం’ తదితర రచనలు చేశారు. చేతనావర్థ కవి అయిన పేర్వారం జగన్నాథం ‘గరుడ పురాణం’, ‘వృషభ పురాణం’ అనే కవితా సంపుటాలు రచించారు.


దళిత బహుజన కవులు - రచనలు


1) పులిపాటి గురుస్వామి - జీవిగంజి


2) గోపగాని రవీందర్‌ - అంకురం


3) దొడ్డి రామ్మూర్తి - బొక్కెన లొల్లి


4) కందుకూరి దుర్గ - ఇసుక గొంతులు


5) హరగోపాల్‌  - మూలకం


6) ఎం.వెంకట్‌ - ఎన (1999)


7) వేముల ఎల్లయ్య -  కక్క, సిద్ధి


తాత్విక కవులు: ఈ తరహా కవుల్లో మందడి కృష్ణారెడ్డి - బానిస (నవల), బోయ జంగయ్య - జాతర, సుంకిరెడ్డి నారాయణరెడ్డి - తోవ ఎక్కడ (1994) లాంటి రచనలు చేశారు.


అభ్యుదయ కవులు: ఇలాంటి కవుల్లో ఆవుల పిచ్చయ్య వెట్టిచాకిరీ అనే గ్రంథాన్ని రచించారు. కాంచనపల్లి   చిన వెంకటరమణారావు అరుణ రేఖలు రచించారు.


జ్ఞానపీఠ అవార్డు గ్రహీతలు: సి.నారాయణరెడ్డి జ్ఞానపీఠ అవార్డు పొందిన తొలి తెలంగాణ కవి. ఈయన రచించిన విశ్వంభర గ్రంథానికి 1988లో ఈ అవార్డు పొందారు. మరో కవి రావూరి భరద్వాజ ‘పాకుడురాళ్లు’ అనే రచనకు 2012లో జ్ఞానపీఠ అవార్డు అందుకున్నారు.


 

మరికొందరు కవులు: పరుశురామ పంతుల లింగమూర్తి - సీతారామాంజనేయ సంవాదం 

 * మల్లికార్జున సిద్ధయోగి - గౌడ పురాణం (ద్విపద)                 

 *  ప్రెగడరాజు చెన్నకృష్ణ కవి - సావిత్రి చరిత్ర (సువ్వీ ఛందస్సులో) 

 * సిరిప్రగడ ధర్మన్న - నల చరిత్ర (తెలంగాణలో శృంగార నైషథం లాంటిది) 

 *  కాణాదం పెద్దన సోమయాజి - ముకుంద విలాసం (ప్రబంధం). అభినవ పెద్దనగా ప్రసిద్ధి చెందారు. 

 * మరిగంటి నరసింహాచార్యులు - తాలారిక నందిని పరిణయం 

 * బుక్కపట్నం కిరిటీ వెంకటాచార్యులు - అచలాత్మజా పరిణయం 

 *  ధర్మపురి శేషాచల కవి - నరసింహ శతకం  

 * నందిని సిధారెడ్డి - గోదావరి లోయ (1981)

నమూనా ప్రశ్నలు

1. గోలకొండ కవుల సంచికకు పూర్వకవి పరిచయాన్ని సమకూర్చినవారు?

1) రామకృష్ణ శర్మ      2) రామానుజరావు  

3) వెంకటకవులు      4) శేషాద్రి రమణ కవులు


2. ఉర్దూ ప్రక్రియ అయిన గజల్‌ను తెలుగులోకి మొదటిసారిగా ప్రవేశపెట్టినవారు ఎవరు?

1) సి.నారాయణ రెడ్డి       2) సామల సదాశివ   

3) రామానుజరావు      4) రమణాచార్యులు


3. హిందుస్థానీ సంగీతాన్ని తెలుగువారికి పరిచయం చేసిన మొదటి రచయిత ఎవరు?

1) రమణాచార్యులు      2) గోవిందాచార్యులు  

3) సామల సదాశివ      4) చందాల కేశవదాసు


4. జ్ఞానపీఠ అవార్డు పొందిన తొలి తెలంగాణ కవి ఎవరు?

1) భరద్వాజ      2) సి.నారాయణ రెడ్డి  

3) కృష్ణమాచార్యులు    4) రంగాచార్యులు

5. కిందివారిలో దిగంబర కవి కానివారు ఎవరు?

1) బోయ జంగయ్య      2) నిఖిలేశ్వర్‌  

3) చెరబండ రాజు      4) పేర్వారం జగన్నాథం 


6. ‘యాది’ గ్రంథ రచయిత ఎవరు?

1) అల్లం రాజయ్య      2) సామల సదాశివ  

3) పులిపాటి గురుస్వామి       4) హరగోపాల్‌


7. నారాయణరెడ్డి రచించిన ఏ గ్రంథానికి జ్ఞానపీఠ అవార్డు లభించింది?

1) విశ్వంభర    2) కర్పూర వసంతరాయలు  

3) సమదర్శనం   4) ముఖాముఖి


8. ‘కక్క’ గ్రంథ రచయిత ఎవరు?

1) దొడ్డి రామ్మూర్తి      2) వేముల ఎల్లయ్య  

3) ధర్మకవి      4) రవీందర్‌


9. కిందివారిలో తెలుగు అధికార భాషా సంఘం అధ్యక్షులుగా పనిచేసినవారు?

1) రామకృష్ణ శర్మ      2) శేషాచార్యులు  

3) సి.నారాయణ రెడ్డి    4) అల్లం రాజయ్య


10. జ్ఞానపీఠ అవార్డు పొందిన పాకుడురాళ్లు గ్రంథ రచయిత ఎవరు?

1) రావూరి భరద్వాజ        2) నారాయణ రెడ్డి 

3) మరిగంటి నరసింహాచార్యులు  4) చినవెంకటరామారావు


11. బానిస నవల రచయిత ఎవరు?

1) ఎం.వెంకట్‌     2) మందడి కృష్ణారెడ్డి   

3) ఆవుల పిచ్చయ్య      4) నిఖిలేశ్వర్‌


12. కిందివాటిలో చెరబండ రాజు రచన కానిది?

1) వందేమాతరం    2) పల్లె పిలుస్తుంది   

3) జ్వాలాముఖి      4) మరోభారతం


సమాధానాలు: 1-4; 2-1; 3-3; 4-2; 5-1; 6-2; 7-1, 8-2; 9-3; 10-1; 11-2; 12-4.


రచయిత: మూల జితేందర్‌రెడ్డి 

Posted Date : 05-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌