• facebook
  • whatsapp
  • telegram

స్థానిక స్వపరిపాలన: వివిధ కమిటీలు - సిఫారసులు

ప్రజలే పాలకులై.. స్థానిక నాయకులై!


ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తూ, పాలనలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచుతూ దేశాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు స్థానిక సంస్థలు అత్యంత కీలకమని అనేక కమిటీలు పేర్కొంటున్నాయి. అవసరమైన అధికారాలు, విధులు, నిధులు సమకూరిస్తే ప్రజాస్వామ్యానికి ప్రత్యక్ష వేదికలైన గ్రామాల్లో సమస్యల పరిష్కారం వేగంగా జరుగుతుందని చెబుతున్నాయి. దాంతోపాటు అధికార వికేంద్రీకరణకు అనేక సూచనలు చేశాయి. ఆ కమిటీలు, అవి చేసిన సిఫారసుల గురించి పోటీ పరీక్షార్థులు అవగాహన పెంచుకోవాలి.

 

 

బల్వంతరాయ్‌ మెహతా కమిటీ (1957): సమాజ అభివృద్ధి పథకం (సీడీపీ), జాతీయ విస్తరణ సేవా కార్యక్రమం (ఎన్‌ఈఎస్‌ఎస్‌) పథకాల పనితీరుపై అధ్యయనం చేసేందుకు 1957, జనవరి 16న బల్వంతరాయ్‌ మెహతా కమిటీని జాతీయ అభివృద్ధి మండలి (ఎన్‌డీసీ) ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ‘ప్రజాస్వామ్య వికేంద్రీకరణ - ప్రజల భాగస్వామ్యం’ అనే మౌలికాంశాలతో మూడంచెల పంచాయతీ వ్యవస్థను సిఫారసు చేస్తూ 1957, నవంబరు 24న ఒక నివేదిక సమర్పించింది. 1958, జనవరిలో ఎన్‌డీసీ దాన్ని ఆమోదించింది.

సిఫారసులు: *మూడంచెల పంచాయతీరాజ్‌ వ్యవస్థ 1) దిగువ స్థాయి - గ్రామ పంచాయతీ 2) బ్లాకు/మధ్య స్థాయి - పంచాయతీ సమితి 3) ఉన్నత/జిల్లా స్థాయి - జిల్లా పరిషత్‌.

* గ్రామ పంచాయతీకి ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు.

* బ్లాకు/మధ్యస్థాయి సభ్యులను వివిధ గ్రామ పంచాయతీల సభ్యులు ఎన్నుకోవాలి.

* జిల్లా/ఉన్నత స్థాయిలో సభ్యులను బ్లాకు స్థాయి సభ్యులు ఎన్నుకోవాలి. 

* స్థానిక సంస్థలకు రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా స్వతంత్ర ప్రాతిపదికపై ఎన్నికలు.

* పంచాయతీ సమితికి కార్యనిర్వాహక అధికారాలు, జిల్లా పరిషత్‌కు సలహా, పర్యవేక్షక అధికారాలు.  

* స్థానిక సంస్థలకు అయిదేళ్లకోసారి క్రమం తప్పకుండా ఎన్నికలు.

* జిల్లా పరిషత్‌కు ఛైర్మన్‌గా కలెక్టర్‌.

* భవిష్యత్తులో చేపట్టబోయే అభివృద్ధి పథకాలన్నీ స్థానిక సంస్థల ద్వారానే నిర్వహించాలి.

* స్థానిక సంస్థలు సమర్థంగా పనిచేసేందుకు అవసరమైన ఆర్థిక వనరులు, అధికారాలను కల్పించాలి.

మూడంచెల పంచాయతీరాజ్‌ విధానాన్ని అమలు చేసిన తొలి రాష్ట్రం రాజస్థాన్‌. 1959, అక్టోబరు 2న రాజస్థాన్‌లోని నాగోర్‌ జిల్లా సికార్‌ ప్రాంతంలో తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ఈ విధానాన్ని ప్రారంభించారు. ‘‘నేడు ప్రారంభిస్తున్న స్థానిక స్వపరిపాలనా సంస్థలు భారత ప్రజాస్వామ్యానికి ప్రాతిపదికగా పనిచేస్తాయి. జాతి నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తాయి. భవిష్యత్తు నాయకత్వానికి పాఠశాలలుగా తోడ్పడతాయి’’ అని ఆ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. 

* మూడంచెల పంచాయతీరాజ్‌ విధానాన్ని అమలు చేసిన రెండో రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌. 1959, నవంబరు 1న ‘శంషాబాద్‌’ గ్రామంలో అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి దాన్ని ప్రారంభించారు.

 

అశోక్‌ మెహతా కమిటీ (1977): స్థానిక స్వపరిపాలనను మరింత పటిష్ఠపరిచేందుకు, అవసరమైన విధానాలను అధ్యయనం చేసేందుకు జనతా ప్రభుత్వం 1977, డిసెంబరు 12న అశోక్‌ మెహతా కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో నంబూద్రిపాద్, ఎం.జి.రామచంద్రన్‌ సభ్యులు. ప్రజాస్వామ్య వికేంద్రీకరణ విధానాలను అధ్యయనం చేసిన ఈ కమిటీ 1978, ఆగస్టు 21న 132 సిఫారసులతో నివేదిక సమర్పించింది.

సిఫారసులు: * రెండంచెల పంచాయతీరాజ్‌ విధానం. 1) బ్లాకు స్థాయి - మండల పరిషత్‌ 2) జిల్లా స్థాయి - జిల్లా పరిషత్‌

* మండల పరిషత్‌ అతికీలకమైన అంచెగా కొనసాగాలి. దీనిలో 15,000-20,000 వరకు జనాభా ఉండాలి.

* గ్రామ పంచాయతీలను రద్దు చేసి, వాటి స్థానంలో ‘గ్రామ కమిటీ’లను ఏర్పాటు చేయాలి.

* అభివృద్ధి పథకాల అమలు విషయంలో గ్రామ పంచాయతీని యూనిట్‌గా కాకుండా సబ్‌ యూనిట్‌గా ఏర్పాటు చేయాలి.  

* స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ప్రత్యక్షంగా పాల్గొనాలి. స్థానిక సంస్థల పదవీ కాలం నాలుగేళ్లు.

* పంచాయతీరాజ్‌ వ్యవస్థల పర్యవేక్షణకు పంచాయతీరాజ్‌ మంత్రి నియామకం.

* స్థానిక స్వపరిపాలనా సంస్థలకు క్రమం తప్పకుండా ఎన్నికలు నిర్వహించాలి. షెడ్యూల్డు కులాలు, తెగ (ఎస్సీ, ఎస్టీ)లకు వారి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు.

* బలమైన కారణం లేకుండా స్థానిక సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయకూడదు. ఒకవేళ రద్దు చేస్తే ఆరు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలి.

* మండల పరిషత్‌ అధ్యక్ష ఎన్నిక ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా జరగాలి. జిల్లా పరిషత్‌ అధ్యక్ష ఎన్నిక మాత్రం పరోక్షంగానే ఉండాలి.

* స్థానిక సంస్థలు ప్రభుత్వ నిధులపై ఆధారపడకుండా పన్నులు విధించి, స్వతంత్రంగా నిధులు సమకూర్చుకునే అవకాశం కల్పించాలి.

* స్థానిక సంస్థల ఎన్నికలు సమర్థంగా నిర్వహించేందుకు స్వయంప్రతిపత్తి ఉన్న ఎన్నికల కమిషన్‌ ఉండాలి.

* అర్హుడైన న్యాయాధికారి అధ్యక్షతన ‘న్యాయ పంచాయతీ సంస్థల’ను ఏర్పాటుచేసి, వాటిని గ్రామ పంచాయతీల నుంచి వేరు చేయాలి.

* సామాజిక, ఆర్థికాభివృద్ధి కోసం కేటాయించిన నిధులు ఖర్చు చేసిన విధానంపై సామాజిక తనిఖీ (సోషల్‌ ఆడిట్‌) ఉండాలి.

* ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల ఏర్పాటుకు కావాల్సిన మౌలిక సదుపాయాలను మండల పరిషత్‌లు కల్పించాలి.

‘‘స్థానిక స్వపరిపాలనా సంస్థలు విఫలమైన భగవంతుడు కాదు, వాటికి సరైన నిధులు, విధులు సమకూరిస్తే విజయవంతంగా పనిచేస్తాయి’’ అని అశోక్‌ మెహతా కమిటీ పేర్కొంది. ఈ కమిటీ సిఫారసులను 1979లో జరిగిన రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో చర్చించారు. మొరార్జీ దేశాయ్‌ ప్రభుత్వం పతనం కావడంతో మొత్తం సిఫారసులు అమల్లోకి రాలేదు. కొన్ని రాష్ట్రాలు మార్పులు, చేర్పులతో కొన్నింటిని అమలు చేశాయి.

* మండల పరిషత్‌ వ్యవస్థను అమలు చేసిన తొలి రాష్ట్రం కర్ణాటక. 1985, అక్టోబరు 2న అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

* మండల పరిషత్‌ వ్యవస్థను అమలు చేసిన రెండో రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌. 1986, జనవరి 13న నాటి ముఖ్యమంత్రి ఎన్‌.టి.రామారావు  ప్రారంభించారు.

 

దంతెవాలా కమిటీ (1978): ‘బ్లాకు’ స్థాయి ప్రణాళికీకరణపై అధ్యయనం కోసం దంతెవాలా కమిటీని 1978లో జనతా ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

సిఫారసులు: * ‘బ్లాకు’ను ఒక యూనిట్‌గా తీసుకుని ప్రణాళికా రచన చేయాలి.

* మాధ్యమిక స్థాయిలో ‘బ్లాకు’ వ్యవస్థకు ప్రాధాన్యం ఇవ్వాలి.

* జిల్లా స్థాయి ప్రణాళికా రూపకల్పనలో కలెక్టర్‌దే కీలకపాత్ర.

* గ్రామస్థాయిలో సర్పంచ్‌ పదవికి ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నిక.

 

సీహెచ్‌ హనుమంతరావు కమిటీ (1984): ఇందిరాగాంధీ ప్రభుత్వ కాలంలో ‘జిల్లా స్థాయి’ ప్రణాళికీకరణపై అధ్యయనం చేసేందుకు 1984లో సీహెచ్‌ హనుమంతరావు కమిటీని ఏర్పాటు చేశారు.

సిఫారసులు: * జిల్లా స్థాయిలో జిల్లా ప్రణాళికా బోర్డులను ఏర్పాటు చేయాలి.

* జిల్లా ప్రణాళికా సంఘానికి కలెక్టర్‌ లేదా మంత్రి అధ్యక్షత వహించాలి.

* జిల్లా స్థాయిలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు సమన్వయకర్త కలెక్టర్‌.

 

జి.వి.కె.రావు కమిటీ (1985): రాజీవ్‌గాంధీ ప్రభుత్వ కాలంలో ప్రణాళికా సంఘం ‘గ్రామీణాభివృద్ధి, పేదరిక నిర్మూలన, పరిపాలనా ఏర్పాట్లు’ అనే అంశాలను అధ్యయనం చేసేందుకు 1985లో జి.వి.కె.రావు అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసింది.

సిఫారసులు: * బ్లాకు వ్యవస్థ, బీడీఓ పదవుల రద్దు.

* జిల్లా అభివృద్ధి అధికారి (డీడీఓ) పదవి ఏర్పాటు.

* జిల్లా స్థాయి యూనిట్‌లకు ప్రణాళిక విధుల బదిలీ.

* జిల్లా స్థాయిలో నైష్పత్తిక ప్రాతినిధ్యంతో కూడిన ఉప కమిటీల ఏర్పాటు.

* స్థానిక సంస్థలకు నిర్ణీత పదవీకాలం ప్రకారం ఎన్నికలు.

‘‘భారతదేశంలో ఉద్యోగస్వామ్యం కారణంగా పరిపాలనా స్ఫూర్తి దెబ్బతింటోంది. ఇది పంచాయతీరాజ్‌ వ్యవస్థను బలహీనపరచింది. దీంతో ప్రజాస్వామ్యం వేళ్లూనుకున్న వ్యవస్థగా కాకుండా, వేర్లు లేని వ్యవస్థగా మారింది’’ అని జి.వి.కె.రావు కమిటీ ఆక్షేపించింది.

 

ఎల్‌.ఎం. సింఘ్వీ కమిటీ (1986):  ‘ప్రజాస్వామ్యం, అభివృద్ధి సాధనకు పంచాయతీరాజ్‌ సంస్థల పునర్నిర్మాణం’ అనే అంశంపై అధ్యయనం చేయడానికి రాజీవ్‌గాంధీ ప్రభుత్వం 1986లో ఎల్‌.ఎం.సింఘ్వీ కమిటీని ఏర్పాటు చేసింది.

సిఫారసులు: * స్థానిక స్వపరిపాలనా సంస్థలకు రాజ్యాంగ హోదా కల్పించాలి. 

* గ్రామీణ పరిపాలనలో ‘గ్రామసభ’కు ప్రాధాన్యం, ప్రత్యక్ష ప్రజాస్వామ్య వేదికగా గుర్తింపు ఇవ్వాలి.

* కొన్ని గ్రామాల సమూహాన్ని కలిపి న్యాయ పంచాయతీలుగా ఏర్పాటు చేయాలి.

* స్థానిక స్వపరిపాలనా సంస్థల ఎన్నికల వివాదాల పరిష్కారం కోసం న్యాయ ట్రైబ్యునల్స్‌ ఉండాలి.

* స్థానిక స్వపరిపాలనా సంస్థలకు క్రమం తప్పకుండా, సకాలంలో ఎన్నికలు నిర్వహించాలి. ఇందుకోసం స్వయంప్రతిపత్తి ఉన్న ఎన్నికల సంఘం ఏర్పాటు చేయాలి.

* స్థానిక స్వపరిపాలనా సంస్థల అభివృద్ధికి అవసరమైన ఆర్థిక వనరులను, అధికారాలను, విధులను కేటాయించాలి. ఇందుకోసం రాష్ట్రస్థాయిలో రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయాలి.

 

పి.కె.తుంగన్‌ కమిటీ (1988):  స్థానిక స్వపరిపాలనను పటిష్ఠ పరిచేందుకు అవసరమైన సిఫారసులు చేసేందుకు రాజీవ్‌గాంధీ ప్రభుత్వం 1988లో అప్పటి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి పి.కె.తుంగన్‌ అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసింది.

సిఫారసులు: * స్థానిక స్వపరిపాలనా సంస్థలకు రాజ్యాంగ హోదా, దేశంలో మూడంచెల పంచాయతీరాజ్‌ వ్యవస్థ ఏర్పాటు చేయాలి.

* జిల్లా పరిషత్‌కు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈఓ) గా కలెక్టర్‌ ఉండాలి.

* స్థానిక సంస్థల పదవీకాలం నిర్దిష్టంగా అయిదేళ్లు.

* జనాభా ఆధారంగా వివిధ వర్గాలకు రిజర్వేషన్లు అమలు చేయాలి.

* జిల్లా ప్రణాళికా అభివృద్ధికి ఏజెన్సీగా జిల్లా పరిషత్‌ ఉండాలి.

 

వి.ఎన్‌.గాడ్గిల్‌ కమిటీ (1988): రాజీవ్‌గాంధీ ప్రభుత్వ కాలంలో స్థానిక స్వపరిపాలనపై అధ్యయనం కోసం 1988లో వి.ఎన్‌.గాడ్గిల్‌ అధ్యక్షతన కమిటీ ఏర్పాటైంది.

సిఫారసులు: * స్థానిక సంస్థలకు రాజ్యాంగ హోదా ఇవ్వాలి. ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు, మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి.


రచయిత: బంగారు సత్యనారాయణ 
 

Posted Date : 11-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌