• facebook
  • whatsapp
  • telegram

ప్రపంచ ప్రధాన ప్రకృతి సిద్ధ మండలాలు

అక్కడ ఏడాదంతా ఎండ.. వాన!

  అక్కడ రాత్రి, పగలు సమానం. ఏడాదంతా వేడి. అత్యధిక వర్షపాతం. వేసవికాలం మాత్రమే ఉంటుంది. సూర్యకిరణాలు నేలను తాకవు. గడ్డి మొలవదు. అయినా అంతా పచ్చగానే ఉంటుంది. రుతువులు లేవు. సంవత్సరమంతా ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తూనే ఉంటాయి. పక్షులు, కోతులు వంటివి తప్ప పెద్ద పెద్ద మాసాంహార జంతువులు ఉండవు. అదే భూమధ్యరేఖా మండలం. అనేక వాతావరణ విశేషాల సమాహారం. ఆ వివరాలను పరీక్షల కోణంలో అభ్యర్థులు తెలుసుకోవాలి.

 

  ఒక ప్రదేశ సహజ వృక్షసంపద విస్తరణను సహజంగా ఆ ప్రాంత ఉష్ణోగ్రత, వర్షపాతం, నేలలు నిర్దేశిస్తాయి. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని ఉష్ణోగ్రత ఆధారంగా భూమి ఉపరితలాన్ని నాలుగు శీతోష్ణస్థితి మండలాలుగా విభజించారు. అవి 1) అత్యుష్ణ మండలం 2) వెచ్చని సమశీతోష్ణ మండలం 3) చల్లని సమశీతోష్ణ మండలం 4) అతిశీతల ధ్రువ మండలం

భూమి ఉపరితలంపై సుమారు 71% ప్రాంతాన్ని మహాసముద్రాలు, సముద్రాలు, శీతల సమశీతోష్ణ మండలం ఆక్రమిస్తున్నాయి. అందుకే శీతోష్ణస్థితిపై సముద్ర సామీప్యం ఎంతో ప్రభావం చూపుతుంది. ఒక ప్రదేశం సముద్ర తీరానికి దగ్గరగా ఉంటే అక్కడ శీతోష్ణస్థితిని సముద్ర సామీప్య శీతోష్ణస్థితి అని, దూరంగా ఉంటే ఖండాంతర్గత శీతోష్ణస్థితి అని అంటారు. ఈ విధంగా అక్షాంశం, సముద్ర సామీప్యాలను పరిగణనలోకి తీసుకొని ప్రపంచాన్ని దాదాపు ఒకే రకంగా ఉండే అనేక శీతోష్ణస్థితి మండలాలుగా విభజించారు. వీటినే ‘ప్రపంచ ప్రధాన ప్రకృతి సిద్ధ మండలాలు’ అంటారు.

 

భూమి ఉపరితలంపై ఏ ప్రదేశంలోనైతే శీతోష్ణస్థితి, నైసర్గిక స్థితి, సహజవృక్ష సంపదల సంయుక్త ప్రభావమైన మానవ జీవన విధానంలో పోలిక ఉంటుందో ఆ ప్రాంతాన్ని ప్రకృతి సిద్ధ మండలంగా నిర్వచించవచ్చు. ప్రపంచాన్ని వివిధ ప్రకృతి సిద్ధ మండలాలుగా విభజించారు. అవి..

1) భూమధ్య రేఖా శీతోష్ణస్థితి మండలం

2) అయన రేఖా మండల ఎడారులు /ఉష్ణ మండల ఎడారులు

3) మధ్యదరారీతి ప్రకృతి సిద్ధ మండలం

4) సమశీతోష్ణ మండల పచ్చిక బయళ్లు

5) ఉష్ణమండల పచ్చిక బయళ్లు/ సవన్నాలు

6) టైగా శీతోష్ణస్థితి

7) టండ్రా శీతోష్ణస్థితి

 

భూమధ్యరేఖా శీతోష్ణస్థితి మండలం

ఉనికి: ఈ మండలాన్నే ఉష్ణమండల వర్షారణ్యాలు లేదా డోల్‌ డ్రమ్స్‌ అని కూడా పిలుస్తారు. ఇవి 0 డిగ్రీల నుంచి 5 లేదా 10 డిగ్రీల ఉత్తర, దక్షిణ అక్షాంశాల వరకు వ్యాపించి ఉన్నాయి. ఈ మండలం పవనాభి ముఖ దిశలో 15 డిగ్రీల నుంచి 20 డిగ్రీల వరకు విస్తరించి ఉంది.

 

భూమధ్య రేఖా మండలం:

1) దక్షిణ అమెరికా: అమెజాన్, బ్రెజిల్, బొలీవియా, పెరు, ఈక్వెడార్, కొలంబియా, వెనుజువెలా, గయానా, సురినాం, వెస్టిండీస్‌ తూర్పు భాగాలు ఇందులో ఉన్నాయి.

2) ఆఫ్రికా (కాంగో ప్రాంతం): కాంగో, జైరే, సెంట్రల్‌ ఆఫ్రికా, సియర్రా లియోన్, లైబీరియా, ఐవరీకోస్ట్, టాంజానియా, మొజాంబిక్, మడగాస్కర్‌.

3) ఆసియా: మలేసియా, సింగపూర్, శ్రీలంక, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, బ్రూనే, న్యూగినియా.

 

భూమధ్యరేఖా శీతోష్ణస్థితి మండల లక్షణాలు:  రాత్రి, పగటి వేళలు సంవత్సరం పొడవునా సమానంగా ఉంటాయి. ఏడాదంతా అత్యధిక ఉష్ణోగ్రత, అత్యధిక వర్షపాతం ఉండే ఏకైక శీతోష్ణస్థితి ప్రాంతమిది. వార్షిక సగటు ఉష్ణోగ్రతలు 26 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉంటాయి. వార్షిక సగటు ఉష్ణోగ్రత వ్యత్యాసం కేవలం 5 డిగ్రీల సెంటిగ్రేడ్‌ వరకే ఉంటుంది. రోజువారీ ఉష్ణోగ్రతల వ్యత్యాసం 8  డిగ్రీల సెంటిగ్రేడ్‌ వరకు ఉంటుంది. ఈ ప్రాంతాల్లో శీతాకాలం ఉండదు. సంవత్సరమంతా వేసవి కాలమే ఉంటుంది. అందువల్ల ఈ ప్రాంతాల్లోని ప్రజలు రాత్రి సమయాలనే శీతాకాలంగా భావిస్తారు. కారణం పగటి ఉష్ణోగ్రతలతో పోలిస్తే రాత్రి ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు తక్కువగా ఉంటాయి. సంవత్సరం పొడవునా సాయంత్రం వేళలో ఉరుములు, మెరుపులతో కూడిన సంవహన వర్షపు జల్లులు కురుస్తాయి. సూర్యకిరణాలు ఎప్పుడూ 90  డిగ్రీల కోణంలో ప్రసరిస్తాయి. నిర్దిష్టమైన రుతువులు సంభవించవు. వార్షిక సగటు వర్షపాతం 200 - 300 సెంమీ.ల వరకు ఉంటుంది.

* ఈ మండలంలో ఎత్తయిన పర్వత శిఖరం ఆఫ్రికాలోని మౌంట్‌ కేమరూన్‌ (4,070 మీటర్లు). ప్రపంచంలో అత్యధిక వర్షపాతం సంభవించే ప్రాంతాల్లో ఇది నాలుగోది. ఇక్కడ 1016 సెం.మీ. వార్షిక వర్షపాతం కురుస్తుంది.

 

వృక్ష సంపద: వర్షం, ఉష్ణోగ్రత సమృద్ధిగా ఉండటంతో ఈ ప్రాంతంలో సతతహరిత అరణ్యాలు విస్తరించి ఉంటాయి. అమెజాన్‌ పరివాహక ప్రాంతపు సతతహరిత అరణ్యాలను ‘సెల్వాలు’ అంటారు. ఇక్కడి అరణ్యాల్లోని చెట్లు 40 నుంచి 50 మీటర్ల ఎత్తు పెరిగి వెడల్పాటి ఆకులు, గట్టి కలపనిస్తాయి. తీగ మొక్కలు వృక్షాల కాండాలను అటూఇటూ అల్లుకొని ఊయలలా ఉంటాయి. వీటిని ‘లయనాలు’ అంటారు. ఈ ప్రాంతాల్లో పెరిగే చెట్ల అగ్రభాగంలోని ఆకులు ఒకదాంతో మరొకటి పెనవేసుకుని మల్లెపందిరిలా అల్లుకొని ఉంటాయి. దీన్ని కెనోపి అంటారు. ఈ కారణంగా సూర్యరశ్మి నేలను తాకదు. దాంతో ఇక్కడి నేలలు ఎప్పుడూ చిత్తడిగా, బురదతో ఉంటాయి. గడ్డి లాంటి వృక్షజాతులు పెరగవు.

* ఇక్కడి అడవులు భూమధ్యరేఖ వద్ద ఎక్కువ ఎత్తులో ఉండి, ఇరువైపులకు వెళ్లేకొద్దీ క్రమంగా ఎత్తు తగ్గుతుంటాయి. వీటినే మూడంచెల ఉద్భిజ సంపద అంటారు. మహాగని, రోజ్‌వుడ్, సెడార్, ఎబోని, ఎయినీ, తెస్సార్, సింకోనా లాంటి వృక్షజాతులు ఎక్కువగా పెరుగుతాయి. 

* ఈ ప్రాంతంలో అడవులను వంటచెరకు కోసం నరికేస్తుంటారు. ఇలా చేయడాన్ని ‘లంబరింగ్‌’ అంటారు. లంబరింగ్‌కు గురైన మొదటితరం అడవుల్లో తిరిగి మొక్కలు పెరిగి ద్వితీయ శ్రేణి అడవులుగా ఎదుగుతాయి. వీటినే ఇండోనేషియా, మలేషియాలో ‘బెలూకర్‌ ఫారెస్ట్‌’గా పిలుస్తారు. భూమధ్యరేఖా ప్రాంతంలో ఎత్తయిన చెట్ల కింద చిన్నచిన్న మొక్కలు పెరుగుతాయి. వీటిని ‘షెర్బేనియన్‌ షాట్స్‌’ అంటారు. ఈ ప్రాంతంలో అధిక వేడి వాతావరణం, ఆర్ద్రత లక్షణాల కారణంగా మలేరియా, అతినిద్ర వ్యాధి, పచ్చ జ్వరం వంటి ఉష్ణమండల వ్యాధులు ఎక్కువగా ప్రబలుతాయి.

* రబ్బరు శాస్త్రీయనామం ‘హెవియా బ్రిసిల్లస్‌’. దీని జన్మస్థలం ఈ మండలం, బ్రెజిల్‌ పరిధిలోని అమెజాన్‌ అటవీ ప్రాంతం.

 

ముఖ్యమైన అటవీ ఉత్పత్తులు:

* వెస్టిండీస్‌ దీవుల్లో ‘జపోట్‌’ వృక్షాల నుంచి ‘చికిల్‌’ ద్రవం తీసి చూయింగ్‌ గమ్‌ తయారుచేస్తారు.

* సింకో మొక్క బెరడు నుంచి మలేరియా ఔషధమైన ‘క్వినైన్‌’ను తయారుచేస్తారు.

* దక్షిణ అమెరికాలోని ‘కార్నబా’ వృక్షం నుంచి ‘మైనం’ తయారవుతుంది. ‘యోర్బా’ చెట్టు ఆకులతో ‘ఏర్బామేట్‌’ అనే టీ పానీయాన్ని తయారుచేస్తారు.

 

జంతు సంపద: ఈ ఆవరణ వ్యవస్థలో గడ్డిజాతి మొక్కలు పెరగకపోవడంతో పెద్ద శాకాహార, మాంసాహార జంతువులకు తగిన ఆవాసం, ఆహారపు వనరులు ఉండవు. దాంతో అవి ఇక్కడ నివసించవు. తొండలు, పాములు, బల్లులు, గబ్బిలాలు, పక్షులు, ఉడతలు, కోతులు, చింపాంజీలు, గొరిల్లాలు, చేపలు, మొసళ్లు, నీటిగుర్రాలు లాంటి జంతుసంపద ఉంటుంది. ఈ మండలం ప్రధాన విషసర్పం పేరు ‘పెంజేరు’. ఆఫ్రికా ఖండంలోని ‘లయానాల’పై ప్రపంచంలో కెల్లా అతి పొడవైన అనకొండ సర్పాలుంటాయి. పొడవైన నాలుకతో చీమల్ని తినే జంతువులూ కనిపిస్తాయి.

 

వ్యవసాయం:  ఈ ప్రాంతంలో ప్రధానంగా విస్తాపన లేదా మారక వ్యవసాయాన్ని అనుసరిస్తారు. ఇది కొండవాలు ప్రాంతాల్లో గిరిజనులు పాటించే ఒక ప్రాథమిక వ్యవసాయ విధానం. ఈ విధానాన్ని ప్రపంచవ్యాప్తంగా, భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో, వివిధ పేర్లతో పిలుస్తారు. అవి..

బ్రెజిల్‌- రోచా

ఆఫ్రికా (కాంగో)- పాంగ్‌

దక్షిణాఫ్రికా - లోకా

మలేషియా - లడాంగ్‌

ఇండోనేసియా - లడాంగ్‌

వెనుజువెలా- కొనుకో

థాయిలాండ్‌- థమారి

శ్రీలంక- చెన్న

వియత్నాం, లావోస్‌ - రే

అస్సాం, ఇతర ఈశాన్య రాష్ట్రాలు- జూమ్‌

మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ - బేవార్, పెషా, పెండా

రాజస్థాన్‌- వాత్ర

పశ్చిమ కనుమలు - కుమారి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా - పోడు

 

ఈ మండలంలో అధిక వర్షపాతంతో నేలలో సారం కొట్టుకుపోతుంది (క్రమక్షయం కాదు). దీన్నే ‘లీచింగ్‌’ అంటారు. ఇక్కడ వ్యవసాయపరంగా తోటల పెంపకానికి అనుకూలం. పంటల్లో రబ్బరు ప్రధానమైంది. ఈ ప్రాంతాల్లో పండించే ముఖ్యమైన పంటలు 

ఎ) రబ్బరు- థాయిలాండ్, ఇండోనేషియా, మలేషియా, ఇండియా.

బి) చెరకు - బ్రెజిల్, ఇండియా

సి) కాఫీ- బ్రెజిల్‌ (ఇక్కడ కాఫీ తోటలను పజెండాస్‌ అని పిలుస్తారు). కాఫీ ఉత్పత్తిలో భారత్‌ 6వ స్థానంలో ఉంది.

డి) కోకో- ఘనా (ఈ దేశాన్ని కోకో ఎస్టేట్‌ అని పిలుస్తారు)

 

ఖనిజ సంపద: * గంధకం - మెక్సికో (ప్రపంచంలోనే అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం)

* తగరం - మలేషియా (ప్రపంచంలోనే అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం)

 

ఆదిమ తెగలు: ప్రపంచంలో అతితక్కువ జనసాంద్రత ఉన్న ప్రాంతాలు (టండ్రా ప్రాంతాల కంటే తక్కువ) ఇక్కడే ఉంటాయి. కాంగో నది, అమెజాన్‌ నదీ తీరాల్లో జనసాంద్రత చ.కి.మీ.కు 5 కంటే తక్కువ. భూమధ్య రేఖా శీతోష్ణస్థితి పరిధిలో అధిక జనసాంద్రత కలిగిన ప్రాంతం ఇండోనేషియాలోని ‘జావా ద్వీపం’. ఈ శీతోష్ణస్థితి

 

ప్రాంతంలోని ముఖ్యమైన ఆదిమ జాతులు..

అమెజాన్‌ - రెడ్‌ ఇండియన్లు (వీరు వాడే ఊయలలను ‘హమ్మక్‌’ అంటారు.)

మలేషియా - సమాంగ్లు, సకామీలు

సమత్రా - కాబు జాతి

బోర్నియా - దయక్స్‌

న్యూగినియా - పపౌలు

కాంగో హరివాణం - పిగ్మీలు

శ్రీలంక - వెడ్డాలు

* బోర్నియో ద్వీపంలోని దయక్స్‌ను, న్యూగినియాలోని పపౌలను కలిపి హెడ్‌ హంటర్స్‌ అని పిలుస్తారు. రెడ్‌ ఇండియన్లు రెల్లు గడ్డితో ఇంటిని నిర్మించుకుంటారు.

* పిగ్మీలు నల్లగా, పొట్టిగా ఉంటారు. వీరిది సంచార జీవన విధానం. చెట్ల ఆకులు, కర్రలతో నిర్మించిన అర్ధచంద్రాకారపు గుడిసెల్లో నివసిస్తారు. వీరి ప్రధాన వృత్తి వేట, చేపలు పట్టడం.

 

అటవీ ఉత్పత్తుల సేకరణ - సమస్యలు: *భూమధ్య రేఖా ప్రాంత అరణ్యాలు దట్టమైన కీకారణ్యాలవడంతో వీటిలోకి ప్రవేశించడం కష్టం.

* ఒకేజాతి చెట్లు గుంపులు గుంపులుగా కాకుండా చెదురు మదురుగా పెరగడం.

* ఈ అడవుల్లో లభించే కలప వాణిజ్యావసరాలకు ఉపయోగపడని గట్టి కలప రకానికి చెందింది కావడం.

* రవాణా సౌకర్యాలు అభివృద్ధి చెందకపోవడంతో కలప రవాణా కష్టతరం.

* వెనుకబాటుతనం

 

ముఖ్యాంశాలు

* భూమధ్యరేఖా శీతోష్ణస్థితి మండలం ప్రాంతంలో అతిపెద నగరం - సింగపూర్‌

* ఈ శీతోష్ణస్థితి ప్రాంతాల్లో ప్రధాన రవాణా సౌకర్యాలు - నదులు.

* మలేషియాలో పెరిగే గౌణ అడవులను బేలూకార్‌ అంటారు.

* పోడు వ్యవసాయం లేదా కలప కోసం కొట్టేసిన అటవీ ప్రాంతాల్లో పొట్టిగా ఉండే చెట్లు పెరుగుతాయి. వీటినే గౌణ అడవులు అంటారు.

* భూమధ్యరేఖా ప్రాంతంలోని ఆదిమ వాసుల ప్రధాన వృత్తి వేటాడటం, చేపలు పట్టడం.

* ఆదిమజాతి పిగ్మీలు కర్రలతో, చెట్ల కొమ్మలతో అర్ధచంద్రాకారంలో ఇళ్లు నిర్మించుకుంటారు. క్రూర మృగాలున్న ప్రదేశంలో చెట్లపై ఇళ్లు కట్టుకుంటారు.

* సహజ రబ్బరు జన్మస్థలం బ్రెజిల్‌లోని అమెజాన్‌ అటవీ ప్రాంతం.

* ఉష్ణమండల వర్షారణ్యాలను సెల్వాలు అని పిలుస్తారు. వీటినే సతత హరిత అరణ్యాలు అని కూడా అంటారు. ఈ అడవుల్లోని వృక్షాలు వెడల్పు ఆకులతో, గట్టి కలపతో ఎల్లప్పుడూ పచ్చగా ఉండటమే దీనికి కారణం.

* ప్రపంచంలో అత్యల్ప జనసాంద్రత ప్రదేశాలు భూమధ్యరేఖా ప్రాంతాలు.

 

రచయిత: సక్కరి జయకర్‌

Posted Date : 14-01-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌