• facebook
  • whatsapp
  • telegram

మండల పరిషత్‌

 సంక్షేమ పాలనకు సమన్వయ వేదిక!

 

 

మండల స్థాయిలో నిర్వహించాల్సిన అభివృద్ధి, సంక్షేమ పనుల గురించి చర్చించి, సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఏర్పాటైన పంచాయతీరాజ్‌ సంస్థే మండల పరిషత్‌. స్థానిక స్వపరిపాలనలో ఇది కీలక అంచె. గ్రామీణ వ్యవస్థ బలోపేతానికి, అభివృద్ధి కార్యక్రమాల అమలులో గ్రామాల మధ్య సమన్వయానికి కృషి చేస్తుంది. పంచాయతీరాజ్‌ వ్యవస్థలో దిగువ, ఎగువ సంస్థలైన పంచాయతీలు, జిల్లా పరిషత్‌కు అనుసంధాన కేంద్రంగా వ్యవహరిస్తుంది. మండల పరిషత్‌ నిర్మాణం, సభ్యులు, అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నికతో పాటు మండల పాలన జరిగే విధానాన్ని పోటీ పరీక్షార్థులు సమగ్రంగా తెలుసుకోవాలి.

 

మూడంచెల పంచాయతీరాజ్‌ వ్యవస్థలో రెండో అంచె మండల పరిషత్‌. జిల్లా పరిషత్, గ్రామ పంచాయతీకి మధ్య ఉన్న ‘మాధ్యమిక వ్యవస్థ’ ఇది.

నేపథ్యం: 1978లో పంచాయతీరాజ్‌ వ్యవస్థపై అధ్యయనం చేసిన అశోక్‌ మెహతా కమిటీ రెండంచెల పంచాయతీరాజ్‌ విధానాన్ని సిఫార్సు చేసింది. అవి మండల పరిషత్, జిల్లా పరిషత్‌. దీనిలో మండల పరిషత్‌ అత్యంత కీలకమైన అంచె.

* మండల పరిషత్‌ విధానాన్ని అమలు చేసిన తొలి రాష్ట్రం కర్ణాటక (1985, అక్టోబరు 2).

* ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌.టి.రామారావు ప్రభుత్వం 1986లో ‘ఏపీ మండల పరిషత్‌లు, జిల్లా ప్రజాపరిషత్‌లు, జిల్లా ప్రణాళికా అభివృద్ధి సమీక్ష మండలాల చట్టం’ రూపొందించింది. అది 1987, జనవరి 15 నుంచి అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం అప్పటికే రాష్ట్రంలో అమలులో ఉన్న 330 పంచాయతీ సమితులను రద్దు చేసి వాటి స్థానంలో 1104 మండల పరిషత్‌లు ఏర్పాటు చేశారు.

 

వివరణ: ప్రతి జిల్లాను పరిపాలనా సౌలభ్యం కోసం వివిధ మండలాలుగా విభజిస్తారు. మండలానికి సంబంధించిన పరిపాలనా విభాగమే మండల పరిషత్‌.  ప్రతి మండల పరిషత్‌లో సుమారు 35 వేల నుంచి 50 వేల జనాభా, 25 నుంచి 30 గ్రామ పంచాయతీలు ఉంటాయి.

 

ఎంపీటీసీ: 

* ప్రతి మండల పరిషత్‌ను పరిపాలనా సౌలభ్యం కోసం జనాభా ఆధారంగా మండల ప్రాదేశిక నియోజకవర్గంగా (ఎంపీటీసీ) విభజిస్తారు.

* ప్రతి ప్రాదేశిక నియోజకవర్గం నుంచి ఎంపీటీసీ సభ్యుడు/సభ్యురాలిని ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు.

* ప్రతి ఎంపీటీసీ సభ్యుడు/సభ్యురాలు సుమారు 3,500 మంది జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తారు.

* మండల పరిషత్‌లో ఉండాల్సిన కనీస ఎంపీటీసీ సభ్యుల సంఖ్య 7, గరిష్ఠ సంఖ్య 23.

* మండల పరిషత్‌కు మైనార్టీ వర్గానికి చెందిన ఒకరిని కో ఆప్టెడ్‌ సభ్యుడిగా (ఎంపీటీసీ) నామినేట్‌ చేస్తారు.

* ఒక మండల పరిషత్‌లో ఓటరుగా నమోదైన వ్యక్తి ఆ మండల పరిషత్‌లోని ఏ ప్రాదేశిక నియోజకవర్గం నుంచి అయినా పోటీ చేయవచ్చు. కానీ ఒక మండల పరిషత్‌లో ఓటరుగా నమోదైన వ్యక్తి వేరే మండల పరిషత్‌ నుంచి పోటీ చేయకూడదు.

 

ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ ఎన్నిక: ఎంపీటీసీ సభ్యులు తమలో నుంచి ఒకరిని మండల పరిషత్‌కు అధ్యక్షుడిగా (ఎంపీపీ), మరొకరిని ఉపాధ్యక్షుడిగా (వైస్‌ ఎంపీపీ) పరోక్ష పద్ధతిలో చేతులు ఎత్తడం ద్వారా ఎన్నుకుంటారు. మండల పరిషత్, జిల్లా పరిషత్‌ ఎన్నికలు పార్టీల పరంగా జరుగుతాయి.

రిజర్వేషన్లు: 

* ఎస్సీ, ఎస్టీ వర్గాలకు వారి జనాభా ఆధారంగా రిజర్వేషన్లు నిర్దేశించాలి. వారికి కేటాయించిన రిజర్వేషన్లలో ఆ వర్గం మహిళలకు 1/3వ వంతు కల్పించాలి.

* ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి.

* వెనుకబడిన వర్గాల వారికి ఎంత శాతం రిజర్వేషన్లు ఉండాలనేది సంబంధిత రాష్ట్ర శాసనసభలు రూపొందించే చట్టాల ఆధారంగా నిర్ణయిస్తారు.

* ప్రస్తుతం రాష్ట్రంలో ఓబీసీ వర్గాల వారికి 34 శాతం రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి.

ఎన్నికలు: 

* ఆర్టికల్‌ 243(కె) ప్రకారం ఏర్పడిన రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలను నిర్వహిస్తుంది.

* ఎంపీటీసీ ఎన్నికల బ్యాలట్‌ పత్రం రంగు - గులాబీ.

అర్హతలు-అనర్హతలు:

 * ఎంపీటీసీగా పోటీ చేయాలంటే 21 సంవత్సరాలు నిండి ఉండాలి.

* సంబంధిత మండల పరిషత్‌ ఓటర్ల జాబితాలో పేరు నమోదై ఉండాలి.

* దివాలా తీసి ఉండకూడదు.

* స్థానిక సంస్థలకు బకాయిపడిన వ్యక్తి ఎన్నికల్లో పోటీకి అనర్హుడు.

* 1995, మే 30 తర్వాత ఇద్దరి కంటే ఎక్కువ సంతానం కలిగిన దంపతులు పోటీకి అనర్హులు.

కాలపరిమితి: 

మండల పరిషత్‌ కాలపరిమితి 5 సంవత్సరాలు. 

* ఎంపీటీసీ, ఎంపీపీ, వైస్‌ ఎంపీపీల కాలపరిమితి 5 సంవత్సరాలు. 
* ఏదైనా కారణంతో ఎంపీటీసీ, ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ స్థానాలకు ఖాళీ ఏర్పడితే 6 నెలల్లోపు ఉపఎన్నికలు నిర్వహించి, సంబంధిత ఖాళీలను భర్తీ చేయాలి.

రాజీనామా: ఎంపీటీసీలు, కో-ఆప్టెడ్‌ సభ్యుడు, మండల అధ్యక్షుడు (ఎంపీపీ), మండల ఉపాధ్యక్షుడు (వైస్‌ ఎంపీపీ) తమ రాజీనామాలను జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి (జడ్పీ సీఈఓ)కి సమర్పించాలి.

 

మండల పరిషత్‌ నిర్మాణం, సభ్యులు:

* మండల ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు (ఎంపీటీసీలు)

* మండల పరిషత్‌ పరిధిలోని శాసనసభ్యుడు (ఎమ్మెల్యే)

* మండల పరిషత్‌ పరిధిలోని లోక్‌సభ సభ్యుడు (ఎంపీ)

* మండల ఓటర్ల జాబితాలో ఓటరుగా ఉన్న రాజ్యసభ సభ్యుడు (ఎంపీ)

* మండల ఓటర్ల జాబితాలో ఓటరుగా ఉన్న శాసనమండలి సభ్యుడు (ఎమ్మెల్సీ)


మండల పరిషత్‌ సమావేశాలకు శాశ్వత ఆహ్వానితులు:

1) జిల్లా కలెక్టర్‌

2) మండల పరిషత్‌ నుంచి ఎన్నికైన జడ్పీటీసీ సభ్యుడు

3) మండల వ్యవసాయ మార్కెటింగ్‌ కమిటీ ఛైర్మన్‌

4) మండల పరిషత్‌ పరిధిలోని సర్పంచ్‌లు.

 

మండల పరిషత్‌ - అధికారాలు - విధులు:

* గ్రామ పంచాయతీల సాధారణ విధుల నియంత్రణ

* పశు సంపద అభివృద్ధి, చేపల పెంపకాన్ని ప్రోత్సహించడం

* వ్యవసాయోత్పత్తుల గణనీయ పెంపుదలకు కృషి

* ప్రజల సహకారంతో వివిధ సామాజిక అభివృద్ధి కార్యక్రమాల అమలు

* మండల పరిషత్‌ నిధులతో వివిధ రకాల ట్రస్టులను నిర్వహించడం

* రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన గణాంకాలను సమర్పించడం

* గ్రామీణ పారిశుద్ధ్య వసతుల పెంపుదలకు కృషి

* వైద్య, ఆరోగ్య సేవలను ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావడం

* మండల పరిషత్‌ పరిధిలో రవాణా సౌకర్యాల అభివృద్ధికి కృషి

* స్వయంసహాయక పథకాల అమలు, ప్రజల జీవన ప్రమాణాల పెంపు

* ప్రాథమిక పాఠశాలల ఏర్పాటు, పర్యవేక్షణ

* అగ్నిప్రమాదాలు, వరదలు, అంటువ్యాధులు సంభవించినప్పుడు సహాయ కార్యక్రమాల నిర్వహణ

* సమాచార కేంద్రాలు, రైతు కేంద్రాలు, గ్రంథాలయాల ఏర్పాటు

* సహకార రంగ పటిష్టతకు కృషి

* సహకార పరపతి సంఘాలు, నీటిపారుదల సొసైటీలు, వ్యవసాయ సొసైటీల ఏర్పాటు

* మహిళా, శిశు సంక్షేమ కేంద్రాల ఏర్పాటు, నిర్వహణ

* వయోజన విద్యా కేంద్రాల ఏర్పాటు, నిర్వహణ

* అంటరానితనం నిర్మూలన, సాంఘిక దురాచారాల నిర్మూలనకు కృషి

* సాంఘిక సంక్షేమం కోసం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు పథకాలు అమలు పరచడం

మండల పరిషత్‌ అధ్యక్షుడు-అధికారాలు-విధులు

* మండల పరిషత్‌ సమావేశాలకు అధ్యక్షత వహించి, సమావేశాలను సమర్థంగా నిర్వహించడం.

* ఈయన మండల పరిషత్‌కు ప్రథమ పౌరుడు, రాజకీయ అధిపతి.

* మండల పరిషత్‌ రికార్డుల తనిఖీ, పర్యవేక్షణకు సంపూర్ణ అధికారం ఉంటుంది.

* మండల పరిషత్‌ తీర్మానాల అమలులో మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో)పై నియంత్రణ ఉంటుంది.

* ప్రజాసంక్షేమం దృష్ట్యా అత్యవసర పనులు చేపట్టాలని ఎంపీడీఓను ఆదేశిస్తారు.

 

మండల పరిషత్‌ ఉపాధ్యక్షుడు-అధికారాలు-విధులు:

* అధ్యక్షుడు మండల పరిషత్‌కు హాజరుకానప్పుడు ఆ బాధ్యతలను నిర్వహించడం.

* మండలాధ్యక్ష పదవికి ఖాళీ ఏర్పడినప్పుడు నూతన అధ్యక్షుడు ఎన్నికయ్యేంత వరకు తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు నిర్వహించడం.

* అధ్యక్షుడు లిఖితపూర్వకంగా బదిలీ చేసిన అధికార విధులు నిర్వహించడం.

 

అవిశ్వాస తీర్మానం, తొలగింపు:  

* ఎంపీపీ, వైస్‌ ఎంపీపీలను ఎంపీటీసీ సభ్యులు 2/3వ వంతు ప్రత్యేక మెజార్టీ ద్వారా అవిశ్వాస తీర్మానంతో తొలగించొచ్చు.

* మండల పరిషత్‌ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు ప్రభుత్వ ఉత్తర్వులను అమలు చేయకపోయినా, అధికార దుర్వినియోగానికి పాల్పడినా వారిని రాష్ట్ర ప్రభుత్వం తొలగిస్తుంది. ఇలా వైదొలిగినవారు రెండేళ్ల వరకు తిరిగి ఆ పదవులకు పోటీ చేయలేరు.

 

మండల పరిషత్‌ - ఆర్థిక వనరులు:

* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసే నిధులు.

* భూమి శిస్తు, వినోదపు పన్ను.

* ఖాదీ బోర్డు, గ్రామీణ కుటీర పరిశ్రమల బోర్డు మొదలైన సంస్థలు సమకూర్చే గ్రాంట్లు.

* సాముదాయక అభివృద్ధి పథకం కింద ప్రభుత్వం నుంచి లభించే గ్రాంట్లు.

* మండల పరిషత్‌ విధించే ఫీజులు, సెస్సులు.

* గ్రామ పంచాయతీల నుంచి మండల పరిషత్‌ వసూలు చేసే మొత్తం.

* మండల పరిషత్‌లోని జనాభా సంఖ్య లెక్కన ఒక్కో వ్యక్తికి రూ.5 చొప్పున వార్షిక గ్రాంటుని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది.

* జిల్లా పరిషత్‌ ఆదాయం నుంచి మండల పరిషత్‌కు లభించే వాటా.

* మండల పరిషత్‌ విధించే పన్నులు, సర్‌ఛార్జీలు.

* వివిధ వర్గాల నుంచి లభించే విరాళాలు.

* మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ)

* ఎంపీడీఓ మండల పరిషత్‌కు పరిపాలనా అధిపతి. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన గ్రూప్‌-1 స్థాయి అధికారి.

* మండల పరిషత్‌కు ప్రధాన కార్యనిర్వహణాధికారిగా వ్యవహరిస్తారు.

* మండల పరిషత్‌ తీర్మానాలను అమలు చేస్తారు.

* రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, ఉత్తర్వుల అమలు కోసం కృషి చేస్తారు.

* నెలకోసారి మండల పరిషత్‌ సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు.

* మండలంలోని గ్రామ పంచాయతీలపై పర్యవేక్షణాధికారాలు ఉంటాయి.

* మండలాధ్యక్షుడిని సంప్రదించి మండల పరిషత్, మండల మహాసభ సమావేశాలు ఏర్పాటు చేస్తారు.

* మండల పరిషత్‌లోని ఉద్యోగులపై పర్యవేక్షణ, నియంత్రణాధికారాలు కలిగి ఉంటారు.

* మండల పరిషత్‌ సమావేశాలు, చర్చల్లో పాల్గొంటారు. కానీ తీర్మానాల విషయంలో ఓటు హక్కు ఉండదు.

* మండల పరిషత్‌ చివరి సమావేశం జరిగిన తేదీ నుంచి 90 రోజుల్లోపు మరో సమావేశాన్ని ఏర్పాటు చేయకపోతే ఎంపీడీవోపై రాష్ట్ర ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుంది.

రచయిత: బంగారు సత్యనారాయణ

Posted Date : 17-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌