• facebook
  • whatsapp
  • telegram

ఖనిజ సంపద

ఎన్నో రూపాల్లో.. ఏడు ప్రాంతాల్లో!

  మనుషులు ఖనిజాన్ని ఉపయోగించని క్షణం ఉండదని కచ్చితంగా చెప్పవచ్చు. పండించే పంటలో, తినే తిండిలో, నడిపే వాహనాల్లో, ధరించే ఆభరణాల్లో ఇలా అన్ని విధాలుగా అందరి జీవితాలతో ఆ లోహాల సమ్మేళనం మిళితమైపోయింది. ఆధునిక ప్రగతి మొత్తం దానితోనే ముడిపడి ఉందంటే ఏమాత్రం అతిశయోక్తికాదు. దేశాల ఆర్థిక వ్యవస్థలు సహా అన్ని రంగాల ప్రగతిని శాసించే అనేక రకాల ఖనిజాల విస్తరణ దేశవ్యాప్తంగా ఎలాఉందో పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. 

 

  ప్రకృతిలో దొరికే లోహాల సమ్మేళనాన్నే ఖనిజాలు అంటారు. వాటి ఆవిర్భావం ఆధారంగా ఖనిజాలను కర్బన, మూల కర్బన ఖనిజాలు అంటారు. పెట్రోలియం, బొగ్గును కర్బన ఖనిజాలుగా వ్యవహరిస్తారు. మూల కర్బన ఖనిజాలను లోహ, అలోహ, ఇంధన ఖనిజాలని పిలుస్తారు.  బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువు మొదలైనవి ఇంధన ఖనిజాలు. మనదేశంలో ఖనిజాల లభ్యతను బట్టి మూడు విధాలుగా విభజించారు.

 

అవసరం కంటే ఎక్కువగా ఉండి ఎగుమతి అయ్యే ఖనిజాలు: ఉదా: ఇనుము, మాంగనీసు, మాగ్నసైట్, టిటానియం, థోరియం, బాక్సైట్, అభ్రకం, క్సెనైట్, సిలిమైట్‌

 

దేశీయ ఉపయోగానికి సరిపడినంత ఉన్నవిః ఉదాః బొగ్గు, ఫెల్‌స్పార్, ఫ్లోరైడ్, సున్నపురాయి, డోలమైట్, జిప్సమ్, యురేనియం, బంగారం, విలువైన రంగురాళ్లు.

 

అవసరం కంటే తక్కువగా ఉండి దిగుమతి చేసుకునేవిః ఉదాః రాగి, సీసం, జింక్, టిన్, పాదరసం, వెండి మొదలైనవి ఖనిజాల అందుబాటు ఆధారంగా భారతదేశాన్ని భౌగోళికంగా ఏడు ప్రాంతాలుగా విభజించవచ్చు.


దామోదర్‌ లోయ ప్రాంతం: ఇది పశ్చిమ బెంగాల్, బిహార్, ఒడిశా రాష్ట్రాల మధ్య ఉన్న ప్రాంతం. ఇది ఖనిజాలకు పెట్టింది పేరు. ఇక్కడ బొగ్గు, ఇలిమైట్, డోలమైట్, చైనా బంకమట్టి, క్రోమైట్, ఫాస్ఫేట్, బాక్సైట్, రాగి, ఇనుము, మాంగనీసు, సున్నపురాయి విరివిగా లభిస్తాయి. ఇక్కడ ముఖ్యమైన బొగ్గు ఖనిజ ప్రాంతం రాణిగంజ్‌.


మధ్యభారత ప్రాంతంః ఖనిజ నిల్వల్లో ఈ ప్రాంతానిది రెండో స్థానం. ప్రధానంగా మాంగనీసు, సున్నపురాయి, బాక్సైట్, బొగ్గు లభిస్తాయి. మధ్యప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఈ ఖనిజాలే కాకుండా ఈ ప్రాంతంలో రత్నాలు, ఇనుము, సున్నపురాయి, రాగి, బంగారం, అభ్రకం, డోలమైట్, గ్రాఫైట్, సీసం లభిస్తున్నాయి. భారతదేశంలో అత్యధిక ఖనిజ నిల్వలున్న ‘చోటానాగ్‌పూర్‌ పీఠభూమి’ని భారతదేశ రూర్‌ (రూర్‌ ఆఫ్‌ ఇండియా) అని పిలుస్తారు.

 

కర్ణాటక - తమిళనాడు ప్రాంతంః ఈ ప్రాంతంలో కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లోని కొంత ప్రాంతం ఉంది. బంగారం, ఇనుము, పింగాణి మట్టి, క్రోమైట్, బాక్సైట్, మాంగనీసు, డోలమైట్, క్వార్ట్జ్, సిలికా, సున్నపురాయి, మాగ్నటైట్, మైకా, ఇలిమమైట్, జిప్సం, మాగ్నసైట్‌ మొదలైన ఖనిజాలు లభిస్తాయి. 

 

కేరళ ప్రాంతంః ఈ ప్రాంతంలో క్విలాన్, కల్లాయమ్, ఎర్నాకులం, కన్ననూర్, త్రివేండ్రం, ఇద్దిహి, కులప్పురం ప్రాంతాల్లో గార్నెట్, బాక్సైట్, వివిధ రకాల బంకమట్టి, ఇనుము, గ్రాఫైట్, అభ్రకం, బంగారం, సున్నపురాయి, సబ్బురాయి, రుటైల్‌ మోనాజైట్, ఇలిమైట్‌ ఖనిజాలు దొరుకుతాయి.

 

మధ్య రాజస్థాన్‌ - గుజరాత్‌ ప్రాంతంః ఈ ప్రాంతం నిక్షిప్త ఖనిజాలకు ప్రసిద్ధి. రాగి, సీసం, జింక్, వెండి, యురేనియం, బంగారం, బెరీలియం, అభ్రకం, మాంగనీసు, స్టియటైట్, మార్బుల్, గ్రానైట్, ఖనిజనూనె, సహజ వాయువు, మాంగనీసు, బాక్సైట్, లిగ్నైట్, కాపర్, జిప్సం, ఉప్పు, డోలమైట్‌ మొదలైనవి లభిస్తాయి.

 

హిమాలయ ప్రాంతంః ఈ ప్రాంతంలో రాగి, సీసం, జింక్, బిస్మత్, యాంటీమోని, నికెల్, కోబాల్ట్, టంగ్‌స్టన్, బంగారం, వెండి, రంగురాళ్లు లభిస్తాయి. ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో (డార్జిలింగ్‌ - పశ్చిమ బెంగాల్, రంజితలోయ - అరుణాచల్‌ ప్రదేశ్, కలహల్, యెట్కా, మహగోళ - జమ్ము, కశ్మీర్‌ లోయ) బొగ్గు లభిస్తుంది. సహజ వాయువు, సున్నపురాయి, డోలమైట్, నాణ్యమైన జిప్సం, సున్నపురాయి కూడా ఉన్నాయి.

 

హిందూ మహాసముద్ర ప్రాంతంః ఈ ప్రాంతం అపారమైన పెట్రోలు, సహజ వాయువులకు, మోనోజైట్, టైటానియం ఖనిజాలకు ప్రసిద్ధి.

మన దేశంలో ఖనిజ సంపద కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. బిహార్, ఒడిశాల్లోని ఆర్కియన్‌ శిలాప్రాంతం ఖనిజ సంపదకు ప్రసిద్ధి. గంగా, సింధూ మైదానాల్లోని ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్‌ రాష్ట్రాల్లో ఖనిజాల లభ్యత చాలా తక్కువ. ఇక్కడ దాదాపు లేవనే చెప్పవచ్చు.

 

ఇనుము

భారతదేశం ఇనుప ఖనిజ నిల్వలకు ప్రసిద్ధి. నేటి పారిశ్రామికాభివృద్ధి, ఆర్థికాభివృద్ధికి ఇనుము-ఉక్కు పరిశ్రమ ఎంతగానో దోహదపడుతోంది. హెమటైట్, లిక్రోనైట్‌ రకం ఖనిజాలు దార్వారు, కడప శిలల్లో విస్తారంగా లభ్యమవుతాయి. ఇనుపధాతు ఉత్పత్తిలో ప్రపంచంలో భారత్‌ నాలుగో స్థానంలో ఉంది. మొదటి మూడు స్థానాలు ఆస్ట్రేలియా, బ్రెజిల్, చైనా ఆక్రమించాయి. భారత్‌ నుంచి ఇనుప ఖనిజాన్ని ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్న దేశం జపాన్‌. మన దేశంలో మొదటి ఇనుప ఖనిజ గనిని ౧౯౦౪లో సింగ్బమ్‌ (ఝార్ఖండ్‌)లో కనుక్కున్నారు. ఇనుప ఖనిజ నిల్వలు అధికంగా ఉన్న రాష్ట్రం ఝార్ఖండ్‌. ప్రస్తుతం ఉత్పత్తిలో ముందున్న రాష్ట్రాలు ఒడిశా, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక. దేశంలో అతిపెద్ద ఇనుప గని బైలడిల్లా (ఛత్తీస్‌గఢ్‌).

ఇనుము శాతం ఆధారంగా ఇనుప ధాతువును నాలుగు రకాలుగా విభజించారు.

 

మాగ్నటైట్‌ః ఇందులో ౭2౮౦% ఇనుము ఉంటుంది. నలుపు, గోధుమ రంగుల్లో లభించే దీన్ని లాండ్‌స్టోన్‌ అంటారు. కర్ణాటకలో ఎక్కువగా దొరుకుతుంది. 

 

హెమటైట్‌ః దీంట్లో ఇనుము శాతం ౬0౭౦%. ఎరుపు, బూడిద రంగుల్లో ఉంటుంది. దీన్ని ఇండస్ట్రియల్‌ ఐరన్‌ఓర్‌ అంటారు. అత్యంత నాణ్యమైన ఈ రకం ఒడిశా, ఝార్ఖండ్‌ల్లో ఎక్కువగా లభ్యమవుతోంది. 

 

లియోనైట్‌ః ఇందులో ౫0౫౯% ఇనుము ఉంటుంది. ముదురు గోధుమ, పసుపు రంగుల్లో ఉంటుంది. దీన్ని హైడ్రేటెడ్‌ ఐరన్‌ ఆక్సైడ్‌ అంటారు.

 

సెడరైట్‌ః దీనిలో ౩౦% ఇనుము ఉంటుంది. గోధుమ రంగులోని ఈ ఇనుప ధాతువును కార్బొనేట్‌ ఐరన్‌ అంటారు.

  దేశంలో ఇనుప ఖనిజం ఎక్కువగా ఒడిశాలోని బడంపహర్‌ (మయూర్‌భంజ్‌ జిల్లా), తోడ, కెందుజర్‌ (కియోంజర్‌ జిల్లా); ఝార్ఖండ్‌లోని గయ (సింగ్‌బమ్‌ జిల్లా), నౌమండి, డాల్టన్‌ గంజ్‌ (పలమావు జిల్లా); ఛత్తీస్‌గఢ్‌లోని బైలడిల్లా (బస్తర్‌ జిల్లా), కర్ణాటకలోని కుద్రేముఖ్, కెమ్మంగుడి, చిక్‌మంగళూరు, బాబాబుడాన్‌ కొండలు షిమోగా, చిత్రదుర్గ్, తుమకూరు; మహారాష్ట్రలోని చంద్రాపుర్, రత్నగిరి, ఖాందార్, కొల్లాపూర్‌; ఆంధ్రప్రదేశ్‌లోని ఓబులాపురం, కడప, కర్నూలు, కృష్ణా, అనంతపురం జిల్లాలు; తెలంగాణలోని ఖమ్మం, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్‌ జిల్లాల్లో ఉంది.

 

రచయిత: డాక్టర్‌ గోపగోని ఆనంద్‌ 

Posted Date : 10-12-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌