• facebook
  • whatsapp
  • telegram

ఖనిజాలు - విస్తరణ

కర్ణాటక బంగారం.. రాజస్థాన్‌ రజతం!


ఉపఖండంగా ప్రాచుర్యం పొందిన భారత్‌లో ఖనిజ వనరులకు కొదవ లేదు. పారిశ్రామిక ప్రగతిలో వాటి లభ్యతే కీలకం. ఆభరణాల నుంచి లోహ విహంగాల వరకు అన్నీ రకరకాల ఖనిజాలతో తయారయ్యేవే. వినియోగ వస్తువుల్లో మూలకాలుగా మారి దేశీయ అవసరాలు తీరుస్తున్నాయి. ఎగుమతుల ద్వారా విదేశీ మారక ద్రవ్యాన్నీ సమకూరుస్తున్నాయి. దేశంలో ఉత్పత్తి పరంగా చూస్తే బంగారంలో కర్ణాటక, రజతంలో రాజస్థాన్‌ మొదటి స్థానంలో ఉన్నాయి. వివిధ ఖనిజాలు దేశంలో విస్తరించి ఉన్న తీరు గురించి పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. 

 

 


ప్రకృతిలో దొరికే లోహాల మిశ్రమమే ఖనిజం. పుట్టుక ఆధారంగా వాటిని ప్రధానంగా లోహ, అలోహ ఖనిజాలుగా వర్గీకరించారు. ఇవేకాకుండా ఇంధన ఖనిజాలు కూడా ఉన్నాయి. 2020-21 మైనింగ్‌ మంత్రిత్వ శాఖ రిపోర్ట్‌ ప్రకారం దేశంలో 95 రకాల ఖనిజాలు ఉత్పత్తి అవుతున్నాయి. ప్రపంచంలో ఖనిజ వనరులు సమృద్ధిగా ఉన్న దేశం జర్మనీ (రూర్‌ లోయ ప్రాంతం). మనదేశంలో చోటానాగ్‌పుర్‌ ప్రాంతంలో అత్యధికంగా ఖనిజాలు లభ్యమవుతున్నాయి. 


మాంగనీస్‌: ఇది లోహ సంబంధ ఖనిజం. దీన్ని ముఖ్యంగా ఇనుము-ఉక్కు, విద్యుత్తు పరిశ్రమల్లో; గాజు, బ్లీచింగ్‌ పౌడర్, క్రిమిసంహారక మందులు తయారుచేయడానికి, అనేక ఇతర పరిశ్రమల్లో ఆక్సీకరణ ప్రక్రియలో ఉపయోగిస్తారు. మాంగనీసు నిల్వల్లో మన దేశం ప్రపంచంలో రెండో స్థానంలో (మొదటి స్థానంలో జింబాబ్వే), ఉత్పత్తిలో 7వ స్థానంలో ఉంది.

* దేశంలో మాంగనీసు నిల్వల పరంగా ఒడిశా (44%), కర్ణాటక (22%), మధ్యప్రదేశ్‌ (12%), గోవా, మహారాష్ట్ర (7%), ఆంధ్రప్రదేశ్‌ (4%), ఝార్ఖండ్‌ (2%), రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ బెంగాల్‌ (2%) ప్రధాన రాష్ట్రాలు. ఉత్పత్తి విషయంలో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ వరుస స్థానాల్లో ఉన్నాయి. కొంతకాలంగా ఈ ఖనిజానికి దేశీయంగా డిమాండ్‌ పెరగడంతో ఎగుమతులు తగ్గాయి. ఉన్నత రకం, మధ్యరకం నాణ్యమైన మాంగనీసును దేశీయ అవసరాలకు వినియోగిస్తూ, తక్కువ నాణ్యమైన దాన్ని ఎగుమతి చేస్తున్నారు. ఇక్కడి నుంచి ఎగుమతి అయ్యే మాంగనీసులో 2/3వ వంతు జపాన్‌ దిగుమతి చేసుకుంటోంది.

 

క్రోమైట్‌: ఇది ఇనుము, క్రోమియంల ఆక్సైడ్‌. దీన్ని రసాయనిక, స్టెయిన్‌లెస్‌ స్టీల్, ఖనిజ ఆధారిత పరిశ్రమల్లో వస్తువుల తయారీకి ఉపయోగిస్తారు. యునైటెడ్‌ నేషన్స్‌ ఫ్రేమ్‌వర్క్‌ క్లాసిఫికేషన్‌- 2015 ప్రకారం భారత్‌లో మొత్తం 344 మిలియన్‌ టన్నుల క్రోమియం నిల్వలున్నాయి. దేశంలో సుమారు 96% నిల్వలు ఒడిశాలో, అందులోనూ సుకిందా లోయలోని కియోంజార్, జాజాపూర్‌ జిల్లాల్లోనే ఉన్నాయి. మణిపుర్, నాగాలాండ్, కర్ణాటక, ఝార్ఖండ్, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లోనూ కొద్దిపాటి నిల్వలున్నాయి.

ప్రస్తుతం మన దేశం క్రోమియం ఉత్పత్తిలో 3.93 మిలియన్‌ టన్నుల సామర్థ్యంతో ప్రపంచంలో మూడో స్థానంలో నిలిచింది. దేశంలో ఉత్పత్తి పరంగా ఒడిశా మొదటి స్థానంలో ఉంది. ఈ ఒక్క రాష్ట్రం నుంచే 99 శాతం ఉత్పత్తి జరుగుతోంది. కర్ణాటక రెండో స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా నుంచి కూడా క్రోమైట్‌ ఉత్పత్తి జరుగుతోంది.

 

వెండి: బంగారం తర్వాత అత్యంత ఖరీదైన లోహం వెండి (రజతం) ఇది. దేశంలో బంగారం, రాగి ఖనిజాలతో కలిసి దొరుకుతుంది. దీన్ని నాణేలు, నగలుగా వాడటంతోపాటు, ఫొటోగ్రఫీ, రసాయన పరిశ్రమల్లో ఉపయోగిస్తున్నారు. ఈ వెండి లోహం ముఖ్యంగా అజెంటైన్, స్టెపనైట్, ప్రోస్టేట్‌ మూలకాల నుంచి దొరుకుతుంది. వెండి ఉత్పత్తిలో మెక్సికో అగ్రస్థానంలో ఉంది. భారత్‌లో వెండి నిల్వలు డిమాండ్‌కు సరిపడా లేవు. మన దేశంలో ఈ లోహం ఎక్కువగా రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌ జిల్లా జావర్‌ గనుల నుంచి ఉత్పత్తి అవుతోంది. తర్వాతి స్థానాల్లో కర్ణాటక (కోలార్‌ గనులు), బిహార్‌ (సింగభమ్‌), హిమాచల్‌ప్రదేశ్‌ (సట్లెజ్‌ లోయ)లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని కడప, కర్నూలు, గుంటూరు జిల్లాల్లో కూడా కొద్దిగా వెండి లభిస్తుంది.


రాగి: ఇది సాధారణంగా వెండి, సీసం, ఇనుము లోహాలతో కలిసి దొరుకుతుంది. సల్ఫైడ్‌గా, కార్బొనేట్‌గా ఉంటుంది. దీన్ని ప్రధానంగా విద్యుత్తు పరికరాలు, టెలిఫోన్, మొబైల్‌ ఫోన్ల తయారీకి మిశ్రమ లోహంగా వాడుతున్నారు. దేశంలో రాగి నిల్వలు సుమారు 1,511 మిలియన్‌ టన్నులు ఉన్నట్లు అంచనా. రాజస్థాన్‌ (813 మి.టన్నులతో 53.81%) అగ్రస్థానంలో ఉండగా, ఝార్ఖండ్‌ (295 మిలియన్‌ టన్నులతో 19.54%), మధ్యప్రదేశ్‌ (283 మి.టన్నులతో 18.75%) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, హరియాణా, కర్ణాటక, మహారాష్ట్ర, మేఘాలయ, నాగాలాండ్, ఒడిశా, సిక్కిం, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో కలిపి 7.9% వాటా ఉంది. రాగి ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్‌ (62%) ముందంజలో ఉంది. రాజస్థాన్‌ (29%), ఝార్ఖండ్‌ (8%) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. దేశీయ డిమాండ్‌ ఎక్కువగా ఉండటంతో అమెరికా, కెనడా, జింబాబ్వే, జపాన్, మెక్సికో దేశాల నుంచి భారత్‌ ఎక్కువగా దిగుమతి చేసుకుంటోంది.

బంగారం:  ‘నోబెల్‌ మెటల్‌’గా పిలుస్తారు. మన దేశంలో ఉత్పత్తి అయ్యే బంగారం ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే బంగారంలో ఒక శాతం  కంటే తక్కువ. బంగారం నిల్వలు అత్యధికంగా ఉన్న దేశాలు చైనా, ఆస్ట్రేలియా, రష్యా, అమెరికా, కెనడా కాగా వినియోగంలో చైనా, భారత్‌ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. 2015 లెక్కల ప్రకారం భారత్‌లో బంగారు ఖనిజం నిల్వలు 527.96 మిలియన్‌ టన్నులు ఉన్నట్లు అంచనా. నిల్వల పరంగా బిహార్‌ (44%), రాజస్థాన్‌ (25%), కర్ణాటక (21%), పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్‌ (3%), తెలంగాణ, మధ్యప్రదేశ్‌ (2%), మిగతా నిల్వలు ఇతర రాష్ట్రాల్లో ఉన్నాయి.

* బంగారం ఖనిజంలో బంగారం ఎక్కువ శాతం ఉన్న రాష్ట్రాల్లో కర్ణాటక మొదటి స్థానంలో ఉంది. తర్వాత రాజస్థాన్, బిహార్, ఆంధ్రప్రదేశ్, ఝార్ఖండ్‌ ఉన్నాయి. దేశంలోని ప్రధాన బంగారు గనులు 1. కోలార్‌ బంగారు గని - కర్ణాటక (కోలార్‌), 2. హట్టి బంగారు గని - కర్ణాటక (రాయ్‌చూర్‌), 3. రామగిరి బంగారు గని- అనంతపురం (ఆంధ్రప్రదేశ్‌). దేశంలో బంగారం ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో కర్ణాటకది మొదటి స్థానం కాగా, ఆంధ్రప్రదేశ్‌ది రెండో స్థానం.


సీసం, జింక్‌: వెండి, కాడ్మియం ఖనిజాలు ఒకేచోట దొరికినట్లుగా సీసం, జింక్‌ ఒకేచోట లభిస్తాయి. దీన్ని సంగీత వాయిద్య పరికరాలు, ఆటోమొబైల్స్, విమానాలు, విద్యుత్తు పరికరాల తయారీలో ఉపయోగిస్తారు. జావర్‌ గని, ఉదయ్‌పుర్‌ జిల్లా (ఉత్తర్‌ప్రదేశ్‌); దేహ్రాదూన్‌ లోని పార్వతీ లోయ (హిమాచల్‌ప్రదేశ్‌); కడప, కర్నూలు, గుంటూరు (ఆంధ్రప్రదేశ్‌)ల్లో; ఖమ్మం, నల్గొండ జిల్లాల (తెలంగాణ)నుంచి సీసం, జింక్‌ ఖనిజాలు లభిస్తున్నాయి.


బాక్సైట్‌: ఈ ఖనిజ నిల్వలు భారతదేశమంతటా విస్తారంగా ఉన్నాయి. అల్యూమినియం లోహాన్ని బాక్సైట్‌ ఖనిజం నుంచే తయారుచేస్తారు. దీన్ని ముఖ్యంగా విమానాలు, మోటారు కార్లు, రైల్వేలు, వంటపాత్రల తయారీలో; విద్యుత్‌ వాహకాలుగా, ఇతర ఇంజినీరింగ్‌ పరిశ్రమల్లోనూ ఉపయోగిస్తారు. యూఎన్‌ఎఫ్‌సీ-2015 లెక్కల ప్రకారం మన దేశంలో బాక్సైట్‌ నిల్వలు 3,897 మిలియన్‌ టన్నులు ఉన్నట్లు అంచనా. ఒడిశా, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రల నుంచి ఎక్కువగా బాక్సైట్‌ లభిస్తోంది. దేశం మొత్తం నిల్వల్లో ఒడిశాలోనే 51% నిల్వలున్నాయి. తర్వాతి స్థానంలో ఆంధ్రప్రదేశ్‌ 16%, గుజరాత్‌ 9%, ఝార్ఖండ్‌ 6%, మహారాష్ట్ర 5%, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌ (4%) ఉన్నాయి. మన దేశం నుంచి బాక్సైట్‌ ఎక్కువగా (60%) ఇటలీకి ఎగుమతి అవుతుంది. ఇంగ్లండ్‌ (25%), జర్మనీ (9%), జపాన్‌ (4%) దేశాలకూ సరఫరా చేస్తున్నాం. 


మైకా: ఈ లోహ ఉత్పత్తిలో భారత్‌ మొదటి స్థానంలో ఉంది. ప్రపంచ మైకా నిల్వల్లో మనదేశంలోనే 70 - 80% ఉన్నాయి. దేశంలో మైకా ఉత్పత్తి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో రాజస్థాన్, బిహార్, ఝార్ఖండ్‌ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా గూడూరు, నెల్లూరు జిల్లా ఆత్మకూరు, కావలి ప్రాంతాల్లో మైకా నిల్వలు విరివిగా ఉన్నాయి. తెలంగాణలోని వరంగల్‌ జిల్లా (బైసన్‌ పర్వత పంక్తిలో), ఖమ్మం జిల్లా (మధిర) పరిసర ప్రాంతాల్లోనూ మైకా లభ్యమవుతోంది.


జాతీయ ఖనిజ విధానం

దేశాభివృద్ధిలో ఖనిజాల ప్రాముఖ్యతను గుర్తించి వాటి ఉపయోగం, అభివృద్ధి కోసం 1993లో ప్రభుత్వం ఒక విధానాన్ని రూపొందించింది. 2008, 2019లో దానికి మరికొన్ని అంశాలను చేర్చారు.ఖనిజ సంపద నిర్వహణను దేశ ఆర్థిక విధానంతో సమైక్యపరచడమే ఈ కొత్త విధానం ఉద్దేశం.

* భూభాగం, తీరప్రాంతంలో ఖనిజ సంపదను గుర్తించి అభివృద్ధి పరచడం.

* విదేశీ పెట్టుబడులను ఆహ్వానించి వారి సాంకేతిక విజ్ఞానంతో విలువైన అరుదైన ఖనిజ సంపదను అభివృద్ధి చేయడం.

* గనుల తవ్వకం వల్ల ఏర్పడే దుష్ప్రభావాలను తగిన రక్షణ విధానాల ద్వారా నియంత్రించడం.

* ఖనిజ సంపద అభివృద్ధి కోసం పరిశోధనలను ప్రోత్సహించడం. 

* మైనింగ్‌ ప్రక్రియలో వ్యర్థాలను నివారించడం.

* మైనింగ్‌ అనుమతులు, లీజుల్లో పూర్తి పారదర్శకతను ప్రదర్శించడం.

* మైనింగ్‌ రంగంలో ఏర్పడే సమస్యల సత్వర పరిష్కారానికి ఒక స్వతంత్ర ట్రైబ్యునల్, జీవవైవిధ్య పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ సుస్థిర ప్రణాళికను రూపొందించడం.

* జీఎస్‌ఐ, ఐబీఎం సంస్థలను బలోపేతం చేయడం.

* అక్రమ మైనింగ్‌ నియంత్రణ కోసం ఇస్రో, ఎన్‌ఆర్‌ఎస్‌సీ సహకారంతో దూరదృష్టితో నిర్ణయాలు తీసుకోవడం.

రచయిత: డాక్టర్‌ గోపగోని ఆనంద్‌ 

Posted Date : 12-01-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌