• facebook
  • whatsapp
  • telegram

 జాతీయ పర్యావరణ పరిరక్షణ చర్యలు 

 ప్రకృతి సంరక్షణకు ప్రభుత్వం సంసిద్ధం! 


 

  అధిక జనాభా, నాగరిక జీవనం, విచ్చలవిడిగా వనరుల వినియోగం, ఆధునిక సాంకేతికత తదితరాల కారణంగా సహజ పర్యావరణం రోజురోజుకు క్షీణిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా నాగరికత విస్తరిస్తున్న ప్రతిచోటా నీరు, గాలి నాణ్యత తగ్గిపోతోంది. ఆ పరిస్థితిని, అలాంటి మానవ కార్యకలాపాలను నియంత్రించేందుకు, అభివృద్ధి ఏదైనా పర్యావరణహితంగా సాగే విధంగా చేసేందుకు చట్టబద్ధమైన యంత్రాంగాలు, నిబంధనలు అవసరమవుతాయి. ప్రకృతి సమతౌల్యాన్ని, వన్యప్రాణుల మనుగడను కాపాడటంతో పాటు నష్టాలను సాధ్యమైనంత మేర నివారించాలి. ఈ లక్ష్యాలతో దేశంలో చేసిన పర్యావరణ పరిరక్షణ చట్టాలు, ఏర్పాటు చేసిన సంరక్షణ కేంద్రాలు, వాటి ఉద్దేశాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్న అధికారాలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి.


 


మానవుడు భూమిపై ఆవిర్భవించిన తర్వాత కొన్ని మిలియన్ల సంవత్సరాల పాటు ప్రకృతికి అనుగుణంగానే జీవించాడు. గత కొన్ని శతాబ్దాల నుంచి మానవ నాగరికత అభివృద్ధి చెందే క్రమంలో ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక అవసరాల కోసం ప్రకృతిని తనకు అనుకూలంగా మార్చుకొని జీవనం సాగించడం ప్రారంభించాడు. దాంతో ప్రకృతి వనరులు దెబ్బతినడం, తరిగిపోవడం మొదలైంది. శీతోష్ణస్థితిలో మార్పులకు కారణమైంది. పర్యావరణ సమస్యలు ఒక ప్రాంతానికి పరిమితం కావు. అవి జనబాహుళ్యానికి, జీవజాతుల మనుగడకు హాని కలిగిస్తాయి. అందువల్ల పర్యావరణ సమస్యల నివారణకు అంతర్జాతీయ స్థాయిలో సమావేశాలు, సదస్సులు, ఒప్పందాలు జరుగుతూనే ఉన్నాయి. వీటిలో భాగంగానే మన దేశంలో జాతీయ స్థాయిలో కొన్ని చట్టాలు చేశారు.


1972లో స్టాక్‌హోంలో ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో మొదటిసారి జరిగిన ‘మానవుడు - పర్యావరణం’ సదస్సు తర్వాత భారత ప్రభుత్వం రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 253ని అనుసరించి కొన్ని సవరణలు, చట్టాలు చేసింది. అందులో భాగంగా ప్రభుత్వం పర్యావరణాన్ని పరిరక్షించడానికి కృషి చేయాలని, అడవులు, వన్యప్రాణులను రక్షించాలని ఆర్టికల్‌ 48(ఎ) ద్వారా ఆదేశించింది. దేశంలోని ప్రతి పౌరుడు సహజ పర్యావరణాన్ని రక్షించాలని, అడవులను, వన్యప్రాణులను ఆదరించాలని ఆర్టికల్‌ 51(ఎ) చెబుతోంది. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా 1980లో పర్యావరణ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారు. 1985లో దీన్ని పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖగా మార్చారు.


వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972:  ఈ చట్టాన్ని భారత పార్లమెంటు 1972లో ఆమోదించింది. 2002లో సవరణలు చేశారు. దీని ప్రకారం ‘జాతీయ వన్యప్రాణి ప్రాధికార సంస్థ (నేషనల్‌ వైల్డ్‌ లైఫ్‌ అథారిటీ)’ అనుమతితో జాతీయ పార్కులు, వన్యప్రాణి సంరక్షణా కేంద్రాలు, బయోస్పియర్‌ రిజర్వులు ఏర్పాటు చేసి వాటి సరిహద్దులు నిర్ణయిస్తారు. వన్యప్రాణులు, పక్షుల వేటను నియంత్రించడం; వాటి ఉత్పత్తులతో జరిగే వాణిజ్యంపై నియంత్రణ; నిబంధనలను అతిక్రమిస్తే తగిన జరిమానాలు, శిక్షలు విధిస్తారు. రాష్ట్రాల్లో వన్యప్రాణి పరిరక్షణ సలహా బోర్డులను ఏర్పాటు చేస్తారు. ఈ చట్టం కింద మొదటగా అంతరించి పోతున్న మొక్కలతో పాటు జీవజాతుల జాబితాను సిద్ధం చేశారు. దాంతోపాటు పులిని జాతీయ జంతువుగా ప్రకటించారు. 1973 నుంచి పులుల సంరక్షణ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది.


జలకాలుష్య నియంత్రణ చట్టం-1974: దీని ప్రకారం నీటి స్వచ్ఛతను మెరుగుపరచడం కోసం కేంద్ర, రాష్ట్ర స్థాయుల్లో కాలుష్య నియంత్రణ బోర్డులను ఏర్పాటు చేయవచ్చు. 1988లో సవరణలు చేసి మరింత బలోపేతం చేశారు. కాలుష్య నియంత్రణలు, ప్రమాణాలు పాటించని పరిశ్రమలను మూసివేసే అధికారాలను ఈ చట్టం రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డులకు కల్పించింది.

 

అటవీ పరిరక్షణ చట్టం-1980: స్థానిక గిరిజనులు కలపను పొందే హక్కులను హరిస్తూ, అటవీ ఉత్పత్తులను సేకరించుకోవడాన్ని నిషేధిస్తూ, పోడు వ్యవసాయం విధానాలను కట్టడి చేస్తూ బ్రిటిష్‌ ప్రభుత్వం 1927లో అటవీ చట్టాన్ని చేసింది. దీనికి సంస్కరణలు చేస్తూ భారత ప్రభుత్వం 1980లో అటవీ పరిరక్షణ చట్టాన్ని తీసుకొచ్చింది. 1988లో మరోసారి సవరించింది. దీని ప్రకారం కేంద్రం అనుమతి లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిధిలోని అడవుల అభివృద్ధి కార్యకలాపాలను అడ్డుకోకూడదు. గనుల తవ్వకాలు చేపట్ట కూడదు. అరణ్యాలను అభివృద్ధి కార్యకలాపాలకు వినియోగిస్తే ఆ మేరకు అటవీ విస్తీర్ణం పెంచాలి. అటవీ భూములను కాఫీ, తేయాకు, సుగంధద్రవ్యాలు, కొబ్బరి, ఔషధ మొక్కలు, ఉద్యాన పంటల కోసం ఉపయోగించకూడదు. వీటితోపాటు అటవీ వనరులను అవసరం మేరకు వాడుకుంటూ, దుర్వినియోగాన్ని అరికట్టి సుస్థిరతను పెంచే విధంగా అనేక నిబంధనలను చట్టంలో పొందుపరిచారు.


వాయుకాలుష్య నియంత్రణ చట్టం-1981: ఈ చట్టం ప్రకారం రాష్ట్రస్థాయి జలకాలుష్య నియంత్రణ బోర్డుల పరిధిని పెంచి, వాయుకాలుష్య నియంత్రణను కూడా అందులో  చేర్చారు. అంతేకాకుండా జలకాలుష్య నియంత్రణ బోర్డులు లేని రాష్ట్రాల్లో వాయుకాలుష్య నియంత్రణ బోర్డులను కొత్తగా ఏర్పాటు చేశారు. ఇవి వాయు ప్రమాణాలను మెరుగుపరచడం, వాయుకాలుష్య నిర్మూలనను చేపట్టడం తదితర విధులు నిర్వహిస్తాయి. 1987లో చట్టాన్ని సవరించి శబ్ద కాలుష్యాన్ని కూడా వాయుకాలుష్యంలో భాగంగా పేర్కొన్నారు.


పర్యావరణ పరిరక్షణ చట్టం-1986:  1986లో ఈ చట్టం చేశారు.  మనదేశంలో పర్యావరణ పరిరక్షణకు విశేష కృషి చేసిన మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి నవంబరు 19 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. 1986లో జరిగిన భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటనను దృష్టిలో ఉంచుకొని, పర్యావరణ పరిరక్షణ కోసం అప్పటివరకు రూపొందించిన చట్టాలు, వ్యవస్థల్లో ఉన్న లోపాలను సవరిస్తూ,  రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 253ని అనుసరించి చట్టాన్ని తీసుకొచ్చారు. పర్యావరణ పరిరక్షణకు, మెరుగుకు చర్యలు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వానికి, ఆ చర్యలను సమన్వయపరచడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ చట్టం అధికారం కల్పించింది.


పర్యావరణ పరిరక్షణకు, పర్యావరణ నాణ్యతను మెరుగుపరిచేందుకు, కాలుష్యాన్ని నివారించేందుకు ఈ చట్టంలోని షెడ్యూళ్లు 1-4 ప్రకారం కొన్ని నిబంధనలు రూపొందించారు. ఇవి విసర్జిత వ్యర్థపదార్థాలు, ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటాయి. ఉదాహరణకు నీటిలోకి వదిలిన వ్యర్థ పదార్థాల గరిష్ఠ పరిమితి 30 PPM ఉండాలి. ఒకవేళ తూముల్లోకి వదిలితే 350 PPM ఉండవచ్చు. భూతలంపై లేదా కోస్తా ప్రాంతానికి వదిలితే 100 PPM ఉండవచ్చు. ఈ చట్టం ప్రకారం పర్యావరణ పరిరక్షణకు కొన్ని ముఖ్య నిబంధనలను ప్రవేశపెట్టారు. అవి * ప్రమాదకర వ్యర్థాల నిర్వహణ నిబంధనలు - 1989 

 

* ప్రమాదకర రసాయనాల ఉత్పత్తి, నిల్వ, దిగుమతులపై నిబంధనలు - 1989 

 

* హానికర సూక్ష్మజీవులు/జన్యుపరంగా అభివృద్ధి చేసిన జీవులు, కణాల ఉత్పత్తి, వాడకం, దిగుమతి, ఎగుమతి నిల్వలపై నిబంధనలు - 1989 

 

* జీవ, వైద్య సంబంధిత వ్యర్థాల నిర్వహణ కలిగి ఉండటంపై నిబంధనలు - 1998 


* రీ సైకిల్డ్‌ ప్లాస్టిక్‌ ఉత్పత్తి వాడకంపై నిబంధనలు - 1999  * మున్సిపల్‌ ఘన వ్యర్థపదార్థాల నిర్వహణ చట్టం - 2000


ఎకో మార్క్‌-1991: దీన్ని బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్‌ సంస్థ ఏర్పాటు చేసింది. పర్యావరణానికి హాని కలిగించని ఉత్పత్తులకు ఎకో మార్క్‌ సర్టిఫికెట్‌ను ఈ సంస్థ జారీ చేస్తుంది. పర్యావరణంపై ప్రభావం చూపించే ఉత్పత్తులకు అనుమతులు ఇవ్వదు.


జాతీయ పర్యావరణ ట్రైబ్యునల్‌ చట్టం-1995:  వాణిజ్య, ఆర్థిక కార్యకలాపాలు జరిపేటప్పుడు వ్యక్తులు/ఆస్తులు/పర్యావరణానికి నష్టం జరిగితే తగిన పరిహారం ఇప్పించేందుకు ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చారు.


జీవవైవిధ్య చట్టం-2002: అంతర్జాతీయ జీవవైవిధ్య కన్వెన్షన్‌ 1992, జూన్‌ 5న యూఎన్‌ఓ ఆధ్వర్యంలో బ్రెజిల్‌లోని రియో డి జెనీరొలో జరిగింది. ఈ కన్వెన్షన్‌లో భాగంగా భారత ప్రభుత్వం 2000లో జీవవైవిధ్యంపై జాతీయ విధానాలను, కార్యాచరణ వ్యూహాన్ని విడుదల చేసింది. దీని అమలు కోసం 2002, డిసెంబరులో జీవవైవిధ్య చట్టాన్ని చేసింది. దాని ప్రకారం కేంద్ర, రాష్ట్ర, స్థానిక బోర్డులతో కూడిన మూడంచెల వ్యవస్థ ఏర్పాటైంది. జీవవైవిధ్యాన్ని పరిరక్షించడం; జీవచౌర్యాన్ని అరికట్టడం; వృక్ష, జంతు జాతుల జన్యు వనరుల దోపిడీని నియంత్రించడం దాని ముఖ్య విధులు.


షెడ్యూల్డ్‌ తెగల అటవీ హక్కుల గుర్తింపు చట్టం-2006: గిరిజనులకు అటవీ ఉత్పత్తులపై హక్కులు కల్పిస్తూ, అటవీ వనరుల సంరక్షణ, గిరిజన తెగల జీవన చర్యలను సమీకృతం చేయడం దీని ప్రధాన ఉద్దేశం. సహజ వనరులను సంరక్షిస్తూ, గిరిజన సమాజాల్లో పేదరిక నిర్మూలన, అభివృద్ధి కార్యకలాపాలను చేపట్టడం ద్వారా వారి జీవన విధానాన్ని పెంపొందిస్తారు.


నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ బిల్లు-2010: పర్యావరణ న్యాయస్థానాలను ఏర్పాటు చేయమని 2003, సెప్టెంబరులో భారత న్యాయ వ్యవహారాల కమిషన్‌ తన 186వ నివేదికలో కోరింది. ఆ మేరకు ఈ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీని ప్రధాన కార్యాలయం భోపాల్‌లో ఉంది. పర్యావరణ చట్టాలను అమలు చేయడానికి, ప్రజలందరికీ పర్యావరణ హక్కులను కల్పించడానికి దీన్ని రూపొందించారు. పర్యావరణ కాలుష్యంతో హాని జరిగిన ఏ వ్యక్తికైనా హాని కలిగితే ఈ ట్రైబ్యునల్‌ ద్వారా పరిహారం పొందొచ్చు.


పర్యావరణ ప్రభావ మదింపు (ఎన్విరాన్‌మెంటల్‌ ఇంపాక్ట్‌ అసెస్‌మెంట్‌- ఈఐఏ): బహుళార్థ సాధక ఆనకట్టల నిర్మాణం, భారీ పరిశ్రమల ఏర్పాటు లాంటి పర్యావరణ కార్యక్రమాల వల్ల అడవుల నిర్మూలన, జంతువులు నశించడం; నేల, నీరు, వాయు కాలుష్యాలు ఏర్పడి సహజ పర్యావరణం దెబ్బతింటుంది. అందువల్ల అలాంటి పర్యావరణ భారీ మార్పును ఈఐఏ విధానం ద్వారా బేరీజు వేసుకుని,  ప్రభావాల ఉద్ధృతిని తగ్గించి, పర్యావరణ సమతౌల్యతకు, జీవ నాణ్యత విలువలు పెంచడానికి ప్రత్యామ్నాయ మార్గాలు రూపొందించడానికి వీలవుతుంది. పర్యావరణ ప్రతికూల పరిస్థితుల తీవ్రతను తగ్గించడానికి ముందుగానే అనుకూల మార్గాలు ఏర్పాటు చేసుకోవచ్చు. అమెరికా 1970లోనే జాతీయ పర్యావరణ విధానాన్ని చట్టబద్ధం చేసి మొదటిసారిగా అమలుచేసింది. ఈ విధానం నేడు ప్రపంచానికే మార్గదర్శకంగా మారింది. భారతదేశం ఈఐఏ విధానాన్ని 1994 నుంచి రూపొందించినప్పటికీ, 1986లోనే పర్యావరణ చట్టం చేసినప్పటి నుంచి ప్రాజెక్టుల నిర్మాణానికి, ప్రణాళికల రూపకల్పనకు ముందస్తు అనుమతి తీసుకోవాలనే షరతును అమలుచేస్తోంది.

 

రచయిత: జల్లు సద్గుణరావు


 

 

Posted Date : 03-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌