• facebook
  • whatsapp
  • telegram

జాతీయాదాయం

* ఆర్థిక వ్యవస్థ పనితీరును తెలిపే ప్రధాన సూచికల్లో జాతీయ ఆదాయం, తలసరి ఆదాయాలు అత్యంత కీలకమైనవి. ఇవి ప్రధానంగా దేశ ఆర్థిక వ్యవస్థ సమర్ధతను తెలుపుతాయి. దేశంలోని అన్ని రంగాలకూ మూలధనం అందించడం అనేది జాతీయ ఆదాయంలో పెరుగుదల, దాని వృద్ధిరేటుపై ఆధారపడి ఉంటుంది. జాతీయాదాయం, నిర్వచనాలు, లెక్కింపు పద్ధతులు, ప్రాధాన్యం, సమస్యలు.. ముఖ్యమైన అంశాలు. టీఎస్‌పీఎస్సీ నిర్వహించే అన్ని రకాల పోటీ పరీక్షల సబ్జెక్టుల్లో ఇండియన్ ఎకానమీ కీలకం. ఇందులో పై అంశాలకు సంబంధించి మంచి అవగాహన సాధించాలి. గణాంకాలను గుర్తుంచుకోవాలి.
 

జాతీయ ఆదాయం అంటే..?
ఒక సంవత్సరంలో దేశంలో ఉత్పత్తి చేసిన అంతిమ వస్తు, సేవల విలువను మార్కెట్ ధరలతో లెక్కించగా వచ్చేదాన్ని జాతీయాదాయం అంటారు. జాతీయ ఆదాయ అంచనాల కమిటీ నిర్వచనం ప్రకారం.. 'ఒక పరిమిత సమయంలో జరిగిన ఉత్పత్తిని రెండుసార్లు లెక్కించకుండా చేసే అంతిమ వస్తు, సేవల మొత్తమే జాతీయ ఆదాయం.


ఎలా లెక్కిస్తారు?
1. ఉత్పత్తి ఆధారంగా లెక్కింపు: దేశంలోని వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల ద్వారా వచ్చే మొత్తం ఉత్పత్తుల విలువ ఆధారంగా జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తారు. దీన్నే నికర విలువ చేర్చిన / నికర ఉత్పత్తి / ఉత్పాదక సేవా పద్ధతి అంటారు.
2. ఆదాయం ఆధారంగా లెక్కింపు: ఉత్పత్తి కారకాల చెల్లింపులు అయిన భాటకం, వేతనం, వడ్డీ, లాభాలు, రాయల్టీల మొత్తాన్ని కలిపి జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తారు. దీన్ని కారకాల చెల్లింపు / వాటా పంపిణీ పద్ధతి అని పిలుస్తారు.
3. వ్యయాల మొత్తం ఆధారంగా లెక్కింపు: దేశ ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని వ్యక్తులు, సంస్థలు సంవత్సరంలో చేసిన వ్యయాల మొత్తం ఆధారంగా జాతీయ ఆదాయం లెక్కించే పద్ధతి.


జాతీయ ఆదాయాన్ని నిర్ణయించే అంశాలు
* సహజ వనరులు
* రాజకీయ స్థిరత్వం
* మానవ వనరులు
* మౌలిక
* సదుపాయాలు
* మూలధన కల్పన
* విద్య, వైద్య సౌకర్యాలు
* ప్రభుత్వ విధానాలు
* రవాణా రంగం
* సాంకేతిక పరిజ్ఞానం
* సమాచార, సాంకేతిక రంగాలు


* లెక్కింపు ఎందుకు?
* ఆర్థిక వ్యవస్థ వృద్ధిని అంచనా వేయడానికి
* ప్రణాళికల రూపకల్పనకు
* ఆర్థిక సమస్యల అధ్యయనానికి
* ఆదాయ అసమానతలు అంచనా వేయడానికి
* వనరుల కేటాయింపు, వినియోగం స్థాయి అంచనాకు
* జీవన ప్రమాణస్థాయిని కనుక్కోవడానికి
* బడ్జెట్ తయారీకి
* ప్రభుత్వ విధానాల రూపకల్పనకు
* ప్రాంతీయ వ్యత్యాసాలు తెలుసుకోవడానికి


సూచికలు / గణాంకాలు
* కేంద్ర గణాంక సంస్థ (సీఎస్‌వో) ఇటీవల జాతీయ ఆదాయం స్థిరధరల్లో లెక్కింపునకు అవసరమయ్యే ఆధార సంవత్సరం 2004-2005ను.. 2011-2012కు మార్చింది. ఈమేరకు ఆధార సంవత్సరం 2011-2012 ప్రకారం..


ఆధార సంవత్సరం మార్పు అంశాలు
* రంగాల వారీ అంచనాల స్థూల విలువ కూర్పు (గ్రాస్ వాల్యూ యాడెడ్-జీవీఏ)ను బేసిక్ ధరల్లో విడుదల చేస్తారు. (ఇంతకు ముందు జీడీపీని, స్థిర ధరలను ఉత్పత్తి కారకాల ధరల్లో విడుదల చేసేవారు)
* ఉత్పత్తి కారకాల ధరల్లో స్థూల విలువ కూర్పు (GVAFC), జీవీఏ ప్రాథమిక ధరలు, జీడీపీ మార్కెట్ ధరలకు మధ్య సంబంధాన్ని కింది విధంగా తెలుసుకోవచ్చు.
1. జీవీఏ ప్రాథమిక ధరలు = ఉద్యోగులు పరిహారం (సీఈ - కాంపెన్సేషన్ ఆఫ్ ఎంప్లాయిస్) + నిర్వహణ మిగులు
(వోఎస్ - ఆపరేటింగ్ సర్ ప్లస్ ) లేదా మిశ్రమ ఆదాయం (ఎంఐ - మిక్స్‌డ్ ఇన్‌క‌మ్) + స్థిర మూలధన వినియోగం (సీఎఫ్‌సీ - క‌న్జమ్షన్ ఆఫ్ ఫిక్స్‌డ్ క్యాపిట‌ల్) + ఉత్పత్తి ప‌న్నులు - ఉత్పత్త స‌బ్సిడీలు.
2. జీవీఏ ఉత్పత్తి కారక ధరలు = జీవీఏ ప్రాథమిక ధరలు - ఉత్పత్తి పన్నులు - ఉత్పత్తి సబ్సిడీలు
3. జీడీపీ = మొత్తం జీవీఏ ప్రాథమిక పన్నులు + ఉత్పత్తి పన్నులు - ఉత్పత్తి సబ్సిడీలు


వివరణలు
1. ఉద్యోగుల పరిహారం
2. నిర్వహణ మిగులు/మిశ్రమ ఆదాయం: వ్యక్తి వేర్వేరు రకాలుగా ఆదాయం పొందడం.
(వ్యక్తి సంస్థకు యజమానిగా ఉండి శ్రామికుడిగా పనిచేస్తూ ఆదాయం పొందడం)
3. స్థిర మూలధన వినియోగం: దీన్ని తరుగుదల అని కూడా అంటారు.(ఇది యంత్రం/ పరికరాల ఉత్పాదక సామర్థ్యం క్రమంగా తగ్గడాన్ని తెలుపుతుంది.)
4. మొత్తం ఉత్పాదక పన్నులు/ సబ్సిడీలు: మొత్తం ఉత్పత్తితో సంబంధం ఉన్న చెల్లింపులు/రాబడులు
* ఇది మొత్తం వాస్తవ ఉత్పత్తికి సంబంధించింది.
మొత్తం ఉత్పత్తి పన్నులు: భూ రెవెన్యూ, స్టాంపు రిజిస్ట్రేషన్ ఫీజులు, వృత్తిపన్నులు
మొత్తం ఉత్పత్తి సబ్సిడీలు: రైతు సబ్సిడీలు, రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీలు, గ్రామాలకు సబ్సిడీలు; చిన్న పరిశ్రమలు, కార్పొరేషన్లు, సహకార రంగాలకు ఇచ్చే సబ్సిడీలు
సగటు ఉత్పత్తి పన్నులు/సబ్సిడీలు (ప్రొడక్ట్ సబ్సిడీలు/పన్నులు)
ఇవి ఒక యూనిట్ ఉత్పత్తికి చేసే చెల్లింపులు/రాబడులు
ప్రొడక్ట్ పన్నులు: ఎక్సైజ్, అమ్మకపు పన్ను, సేవాపన్ను, ఎగుమతి, దిగుమతి సుంకాలు
ప్రొడక్ట్ సబ్సిడీలు: ఆహారం, ఎరువులు, పెట్రోలియం సబ్సిడీలు, కుటుంబాలు, రైతులకు వడ్డీ సబ్సిడీలు, బ్యాంకుల ద్వారా తక్కువ ధరలకే బీమా అందించడానికి ఇచ్చే సబ్సిడీలు.


మాదిరి ప్రశ్నలు
1. జాతీయ ఆదాయాన్ని దేశంలో ప్రథమంగా లెక్కించింది ఎవరు?
జ: దాదాభాయ్ నౌరోజీ


2. 'వెల్త్ & టాక్సెబుల్ కెపాసిటీ ఆఫ్ ఇండియా' అనే గ్రంథ రచయిత -
జ: షా, కంబటా


3. జాతీయ ఆదాయ అంచనా కమిటీ సభ్యులు ఎవరు?
1) గాడ్గిల్     2) వి.కె.కె.వి. రావు     3) షా     4) కంబటా
ఎ) 1, 2     బి) 2, 3     సి) 3, 4     డి) 1, 4
జ: ఎ(1, 2)


4. జాతీయ ఆదాయం అంచనాల కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేశారు?
జ: 1949


5. జాతీయ ఆదాయం అంచనాల కమిటీ అధ్యక్షుడు ఎవరు?
జ: మహలనోబీస్


6. జాతీయ ఆదాయ అంచనాలు లెక్కించే సంస్థ ఏది?
జ: సీఎస్‌వో


7. జాతీయ ఆదాయ గణన ఎప్పుడు ప్రారంభించారు?
జ: 1954


8. దాదాభాయ్ నౌరోజీ జాతీయ ఆదాయం లెక్కించిన సంవత్సరం?
జ: 1868


9. 'సాంఘిక గణన' అనే భావనను తెలిపినదెవరు?
1) మిడ్    2) స్టోన్    3) స్మిత్     4) లూయిస్
ఎ) 1, 2    బి) 2, 3     సి) 3, 4     డి) 4, 1
జ: ఎ(1, 2)


10. తలసరి జాతీయ ఆదాయాన్ని ఎలా పొందవచ్చు?
జ: జాతీయ ఆదాయం
÷ జనాభా

Posted Date : 05-12-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌