• facebook
  • whatsapp
  • telegram

సహజ వనరులు - పరిరక్షణ

వాడుకుంటూ.. కాపాడుకుంటూ!


ఎంత ఉపయోగించుకున్నా తరగదు గాలి. తవ్విన కొద్దీ తగ్గిపోతుంది బొగ్గు. అవి ప్రకృతి ప్రసాదించిన సహజ వనరులు. జీవుల మనుగడకు మూలాధారాలు. వాటిని సక్రమంగా వాడుకొని ఆదిమానవుడు ఆరోగ్యంగా జీవిస్తే, విచక్షణారహితంగా వినియోగించుకుంటూ ఆధునిక జీవుడు పర్యావరణానికి ప్రమాదకరంగా మారాడు. స్థిరమైన అభివృద్ధికి పర్యావరణ పరిరక్షణ తప్పనిసరని ప్రపంచం గుర్తించింది. అందుకే వనరులను సరైన రీతిలో వాడుకుంటూ, కాపాడుకుంటూ ఉండాలని ప్రకటించింది. పర్యావరణాంశాల అధ్యయనంలో భాగంగా సహజ వనరులు, రకాలు, క్షీణత తదితర అంశాలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి.  
 


మానవుడికి అవసరమైన వస్తుసేవల ఉత్పత్తికి ఉపయోగపడే పదార్థాలు, శక్తి లాంటి వాటిని సహజవనరుల రూపంలో ప్రకృతి ప్రసాదిస్తోంది. ఆవరణ వ్యవస్థలు, జీవ రాశులు తమ విధులను నిర్వహించడానికి, మానవ సమాజాల సాంఘిక, ఆర్థిక నాగరికతల మనుగడకు కావాల్సిన శక్తిని అందించే వనరులనే సహజ వనరులు అంటారు. వివిధ ప్రామాణికతల ఆధారంగా వాటిని విభజించవచ్చు.


లభ్యతను అనుసరించి!

లభ్యతను అనుసరించి వనరులను వర్గీకరించారు. 

జీవ వనరులు: జీవావరణంలో ప్రాణం ఉండే అడవులు, జంతువులు, అనేక జీవజాతులే జీవ వనరులు. వృక్షాలు, జంతువులు మిలియన్ల సంవత్సరాల క్రితం నశించి, రూపాంతరం చెందడం వల్ల ఏర్పడిన బొగ్గు, చమురు, సహజ వాయువు లాంటి శిలాజ ఇంధనాలు జీవ వనరుల తెగకు చెందినవి.

నిర్జీవ వనరులు: జీవం లేని అనుఘటకాలు, సేంద్రియ పదార్థాల నుంచి లభించే వనరులే నిర్జీవ వనరులు. భౌతికపరమైన గాలి, నీరు, నేల లాంటివి ఈ వనరుల కోవకే చెందుతాయి. కాంతి, ఉష్ణం, వర్షపాతం తదితర శీతోష్ణస్థితి సంబంధితాలూ నిర్జీవ వనరులే. సేంద్రీయపరమైన కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్స్, లిపిడ్స్‌ను కూడా జీవరహిత వనరులుగానే పరిగణిస్తారు నిరేంద్రియపరమైన సోడియం, కాల్షియం, ఫాస్ఫరస్‌ లాంటి రసాయనాలు నిర్జీవ వనరుల కిందకే వస్తాయి. 


 పునరుత్పత్తి సామర్థ్యాన్ని బట్టి!

మళ్లీ ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యం ఆధారంగా వనరులను వర్గీకరించారు. 

పునరుద్ధరించగలిగే సహజ వనరులు: వినియోగిస్తున్నప్పటికీ తిరిగి ఉత్పత్తి చెందే సామర్థ్యం ఉన్నవి, మానవ ప్రయత్నాల ద్వారా కొత్తగా ఉత్పత్తి చేయగలుగుతున్న వనరులను పునరుత్పత్తి చెందే సహజ వనరులుగా భావించవచ్చు. ఇవి సాధారణంగా కాలుష్యరహితమైనవి. అందువల్ల వీటిని హరిత ఇంధనాలు అని పిలుస్తారు.

ఉదా: అటవీ వనరులు, పంట పొలాలు, జీవజాతుల ఉత్పత్తి, జలవనరులు, సౌరశక్తి, పవనశక్తి, ఓషన్‌ ఎనర్జీ, జియో థర్మల్‌ ఎనర్జీ, జలవిద్యుత్తు లాంటివి.

పునరుద్ధరించలేని సహజ వనరులు: ఈ వనరులు వినియోగించే కొద్దీ తరిగిపోతుంటాయి. వీటికి పునరుత్పత్తి సామర్థ్యం ఉండదు. మానవ ప్రయత్నం ద్వారా పునరుద్ధరించడం వీలు కాదు. ఇవి కాలుష్య కారకాలు. ప్రస్తుతం ఎక్కువ వినియోగంలో ఉన్నాయి.

ఉదా: శిలాజ ఇంధనాలు (బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువు, సహజ వాయువు రూపాంతరాలైన షెల్‌ గ్యాస్, గ్యాస్‌ హైడ్రేట్స్, కోల్‌బెడ్‌ మీథేన్‌), అణు ఇంధన   వనరులు (యురేనియం, థోరియం, ప్లుటోనియం) ప్రస్తుతం మానవుని జీవన గమనాన్ని యంత్ర శక్తి, సాఫ్ట్‌వేర్‌ సామర్థ్యమే నిర్దేశిస్తున్నాయి. కానీ వాటిని నడిపించడానికి ఇంధనశక్తి తప్పనిసరి. ఆ ఇంధన వనరుల్లో నూతన పోకడలు, విధానాల్లో అనేక మార్పులు కాలానుగుణంగా సంభవిస్తూనే ఉన్నాయి. వినియోగించే కాలం ఆధారంగా వాటిని వివిధ రకాలుగా విభజించవచ్చు.

1) సంప్రదాయ ఇంధన వనరులు: అనాదిగా మానవుడు వినియోగిస్తున్న ఇంధన వనరులివి. ఉదా: బొగ్గు, డీజిల్, సహజ వాయువు ఆధారంగా ఉత్పత్తి చేసే థర్మల్‌ విద్యుత్తు, జల విద్యుత్తు, అణుశక్తి; చోదక శక్తి కోసం వాడే ముడిచమురు, సహజ వాయువు లాంటివి. వీటిలో జల విద్యుత్తు మాత్రమే  పునరుత్పాదక ఇంధన వనరు.

2) సంప్రదాయేతర ఇంధన వనరులు: ఇవి ఇటీవల కాలంలో అభివృద్ధి చేసిన, అధిక ప్రాచుర్యం పొందిన ఇంధన వనరులు. వీటిని మళ్లీ రెండు రకాలుగా పేర్కొంటున్నారు.

ఎ) పునరుత్పాదక ఇంధన వనరులు: సౌర శక్తి, పవన శక్తి, బయో గ్యాస్, బయో డీజిల్, బయోమాస్‌ పవర్, బయో ఇథనాల్, చిన్న  తరహా జలవిద్యుత్తు, బగస్సీ - కోజనరేషన్‌ లాంటి తిరిగి ఉత్పత్తి చేయగలిగే శక్తి వనరులు.

బి) నవీన శక్తి వనరులు: ఇటీవలి కాలంలో సాంకేతిక సామర్థ్యంతో తయారై, వినియోగంలోకి వస్తున్న శక్తివనరులు.

ఉదా: హైడ్రోజన్‌ శక్తి, జియో థర్మల్‌ శక్తి, టైడల్‌ ఎనర్జీ, సీవేవ్‌ ఎనర్జీ, ఓషన్‌ థర్మల్‌ గ్రేడియంట్‌ ఎనర్జీ, షెల్‌ గ్యాస్, కోల్‌బెడ్‌ మీథేన్, గ్యాస్‌ హైడ్రేట్స్, బ్యాటరీలతో నడిచే వాహనాలు వంటివి.


అధిక వినియోగంతో క్షీణత

ఆదిమానవుడు అందుబాటులో ఉన్న సహజ వనరులను సహజ జీవనానికి మాత్రమే వినియోగించుకుని మంచి వాతావరణంలో ఆరోగ్యప్రదమైన జీవితాన్ని గడిపేవాడు. కానీ ఆధునిక మానవుడు అమూల్యమైన సహజ వనరులను విచక్షణారహితంగా వినియోగిస్తూ, ప్రమాదకరమైన వాతావరణంలో దుర్భర జీవితాన్ని సాగిస్తున్నాడు. మానవ కార్యకలాపాల వల్ల ప్రకృతి క్షీణించకుండా పరిరక్షించాల్సిన  ఆవశ్యకతను ఐక్యరాజ్యసమితి ‘వరల్డ్‌ ఛార్టర్‌ ఆఫ్‌ నేచర్‌ 1982’లో గుర్తించింది. వ్యక్తి స్థాయి నుంచి, అంతర్జాతీయ స్థాయి వరకూ అన్ని స్థాయుల్లో పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపట్టాలని చెప్పింది. స్థిరమైన వృద్ధిని సాధించడానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయి చట్టాల్లో పర్యావరణ పరిరక్షణను పొందుపరచాలని ఈ చార్టర్‌ వివరించింది.

సహజ వనరుల పరిరక్షణ విధానాలు: పునరుద్ధరించగలిగిన, పునరుద్ధరించలేని వనరుల వృద్ధి రేటు కంటే వినియోగ రేటు ఎక్కువగా ఉంటే దాన్ని సహజవనరుల క్షీణతగా పరిగణించవచ్చు. అది వ్యవసాయం, చేపల వేట, గనుల తవ్వకం, నీరు, శిలాజ ఖనిజాల వినియోగం లాంటి వాటిల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అందువల్ల వనరుల నిర్వహణలో మూడు ప్రక్రియలు పాటించాలి. 

1) తగ్గించడం (Reduce): వీలైనంత వరకూ సహజ వనరుల వాడకాన్ని తగ్గించాలి. అనవసరంగా వాడకూడదు.

ఉదా: విద్యుత్తు వాడకం, నీటి వాడకం లాంటివి.

2) పునఃచక్రీయం (Recycle): సహజ వనరులపై ఒత్తిడి తగ్గించడానికి అప్పటికే వినియోగించడం ద్వారా లభించిన వేస్ట్‌ పేపర్, ప్లాస్టిక్, గ్లాస్‌ లాంటి పదార్థాలను పునరుత్పత్తి చేసి వినియోగించవచ్చు.

3) తిరిగి ఉపయోగించడం (Reuse): పచ్చళ్లకు, జామ్‌లకు వాడిన గాజు, ప్లాస్టిక్‌ బాటిళ్లను బయట పారేయకుండా తిరిగి వినియోగించవచ్చు. వార్తాపత్రికలను చదివిన తర్వాత ప్యాకింగ్‌ చేయడానికి వాడవచ్చు. ఈ విధంగా వాడిన వస్తువులనే మళ్లీ, మళ్లీ వినియోగించడం వల్ల సహజ వనరుల వృద్ధి, పరిరక్షణ సాధ్యమవుతుంది.


మాదిరి ప్రశ్నలు


1. కిందివాటిలో సంప్రదాయ ఇంధన వనరు కానిది ఏది?

1) బొగ్గు       2) అణువిద్యుత్‌      3) జలవిద్యుత్‌        4) కోల్‌బెడ్‌ మీథేన్‌

జ: 4

 


2. సహజ వనరుల పరిరక్షణ విధానాల్లో వరుస క్రమం ఏది?

  1) రెడ్యూస్‌ - రీసైకిల్‌ - రీయూజ్‌        2) రీసైకిల్‌ - రెడ్యూస్‌ - రీయూజ్‌ 

  3) రెడ్యూస్‌ - రీయూజ్‌ - రీసైకిల్‌        4) రీసైకిల్‌ - రీయూజ్‌- రెడ్యూస్‌ 

జ: 1

 

3. కిందివాటిలో కన్వెన్షనల్‌ శక్తి వనరు ఏది?

  1) జీవ ఇంధనాలు    2) సౌర శక్తి        3) జలవిద్యుత్‌       4) పవన శక్తి 

జ: 3

 

4. కిందివాటిలో సంప్రదాయేతర శక్తి వనరు ఏది?

  1) బయోగ్యాస్‌      2) సౌరశక్తి         3) టైడల్‌ శక్తి      4) పైవన్నీ

జ: 4 

 

5. కిందివాటిలో పునరుత్పాదక శక్తి వనరు కానిది?

  1) సౌర విద్యుత్‌       2) పవన విద్యుత్‌      3) ఓషన్‌ థర్మల్‌ ఎనర్జీ  4) ఏదీకాదు

జ: 4

 

6. సహజ వనరుల క్షీణత అంటే?

1) సహజ వనరుల పునరుద్ధరణ కంటే వాటి  వినియోగం ఎక్కువగా ఉండటం

2) సహజ వనరుల పునరుద్ధరణ కంటే వాటి వినియోగం తక్కువగా ఉండటం

3) సహజ వనరుల వినియోగం కంటే వాటి పునరుద్ధరణ ఎక్కువగా ఉండటం

4) ఏదీకాదు

జ: 1

 

7. కిందివాటిలో నవీన శక్తి వనరు ఏది?

  1) హైడ్రోజన్‌ ఎనర్జీ    2) టైడల్‌ ఎనర్జీ     3) సీవేవ్‌ ఎనర్జీ       4) పైవన్నీ

జ: 4

 

8. కిందివాటిలో సరికానిది?

1) ముడి చమురు సంప్రదాయ, పునరుత్పత్తి చెందని వనరు. 

2) పవన శక్తి సంప్రదాయేతర, పునరుత్పత్తి చెందే వనరు.

3) జియోథర్మల్‌ శక్తి నవీన, పునరుత్పత్తి చెందే వనరు.

4) సహజ వాయువు సంప్రదాయ, పునరుత్పత్తి చెందే వనరు.

జ: 4

 

9. పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని ఎప్పుడు చేశారు?

   1) 1890       2) 1986      3) 1980        4) 1952

జ: 2

రచయిత: జల్లు సద్గుణరావు 

Posted Date : 27-02-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌