• facebook
  • whatsapp
  • telegram

నూతన ఆర్థిక విధానం - మార్పులు

భారతదేశ ఆర్థిక చరిత్రలో 1991లో ఏర్పడిన  ఆర్థిక సంక్షోభం తర్వాత అప్పటి ప్రభుత్వం నూతన ఆర్థిక విధానం, ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టింది. ఇవి దేశ ఆర్థిక అభివృద్ధికి వేసిన పునాదిగా పేర్కొనవచ్చు. అప్పటి ప్రధాని పి.వి.నరసింహారావు, ఆర్థిక మంత్రి మన్మోహన్‌ సింగ్‌లు కలసి దేశ ఆర్థిక ప్రగతికి అనేక సంస్కరణలు చేపట్టారు. వీటినే రావు - మన్మోహన్‌ అభివృద్ధి నమూనాగా పిలుస్తారు.


ఆర్థిక సంక్షోభం 
స్వదేశంలో బడ్జెట్‌ లోటు కారణంగా భారంగా మారిన అప్పులు; అధిక విదేశీ వాణిజ్య లోటు, విదేశీ చెల్లింపులకు సరిపడా విదేశీ మారకద్రవ్య నిల్వలు లేకపోవడం లాంటి సమస్యల ఫలితంగా అంతర్జాతీయంగా దేశ ఆర్థిక పరపతి క్షీణించడాన్ని ఆర్థిక సంక్షోభం అంటారు.


ఆర్థిక సంస్కరణలు 
1991 జూన్‌లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన పి.వి. నరసింహారావు ప్రభుత్వం సామ్యవాద భారత ఆర్థిక వ్యవస్థకు మార్కెట్‌ ఆధారిత పెట్టుబడి వ్యవస్థగా కొత్త రూపాన్ని తీసుకువచ్చింది.కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకుంది. 


దేశం ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితుల నుంచి బయటపడటానికి బ్రెట్టన్‌ వుడ్‌ కవల సంస్థలైన - ప్రపంచబ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ సహాయం తీసుకున్నారు. ఆ సంస్థల  సూచనలతో రెండు రకాల సంస్కరణలు ప్రవేశపెట్టారు. తద్వారా ఆర్థిక స్థూల నిర్వహణ, ప్రభుత్వ పాత్ర, ప్రైవేటు రంగ పరిధి, స్వేచ్ఛ తదితర అంశాల్లో పలు మార్పులు తెచ్చేందుకు ప్రయత్నించారు.


1. స్థూల స్తిరత్వ చర్యలు 
సాధారణంగా ఏ దేశానికైనా విదేశీ చెల్లింపుల సమస్య ఏర్పడినప్పుడు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ కొన్ని షరతులతో ఆర్థిక సహాయం అందిస్తుంది. మన దేశానికి  మొదట స్వల్పకాలంలో చెల్లింపుల సమస్య నుంచి బయటపడటానికి మొత్తం 2.3 బిలియన్‌ డాలర్ల సాయం చేసింది.  ఈ సమయంలోనే దేశీయంగా కింది చర్యలు చేపట్టారు.
* దిగుమతులపై ఆంక్షలు విధించారు. ఎగుమతులకు సులభంగా అనుమతులు మంజూరు చేసేందుకు అనువైన చర్యలు తీసుకున్నారు. 
* 1991 జులై 1, 3 తేదీల్లో మొత్తం రెండు విడతలుగా రూపాయి విలువలో 20% తగ్గింపు ప్రకటించారు. ఫలితంగా రూపాయి విలువ 19.64 డాలర్ల నుంచి 31.24 డాలర్లకు తగ్గింది. నాటి ప్రధాని, ఆర్థిక మంత్రి, రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ - ఎస్‌. వెంకట్రామన్‌ సంయుక్తంగా తీసుకున్న సాహసోపేత నిర్ణయం ఇది. దీంతో ఆర్థిక సంస్కరణలకు అంకుర్పారణ జరిగింది. దీనికి అనే పేరుతో ఒక కోడ్‌ పెట్టుకున్నారు.
* రూపాయి విలువ తగ్గితే విదేశాల్లో మన ఎగుమతుల ధరలు తగ్గి, వాటికి డిమాండ్‌ ఏర్పడి, మన ఆదాయం పెరుగుతుంది. మరోవైపు   మన దేశం చేసుకునే దిగుమతుల ధరలు పెరిగి, వాటికి డిమాండ్, తద్వారా చెల్లింపులు తగ్గుతాయి. ఫలితంగా మన దేశ విదేశీ వాణిజ్య లోటు తగ్గుతుంది. విదేశీమారక ద్రవ్యం పెరుగుతుంది. కాబట్టి రూపాయి విలువ తగ్గింపు అనేది అత్యవసర శస్త్రచికిత్స లాంటిది.  


2. నిర్మాణాత్మక సర్దుబాటు చర్యలు 
* స్వల్పకాలిక చర్యలతోపాటు దేశాన్ని వేగవంతమైన అభివృద్ధి పథంలో నడపటానికి విప్లవాత్మకమైన దీర్ఘకాలిక చర్యలు చేపట్టారు.వివిధ రంగాల నిర్మాణం, పని తీరు, పరిధుల్లో మార్పులు ప్రవేశపెట్టి, ఆర్థిక ఆంక్షలు సడలించి అన్ని రంగాల్లో పోటీ ఏర్పడేలా చేశారు. ఇలాంటి చర్యలతో అభివృద్ధి రేటును పెంచుకునే కార్యక్రమాలను నిర్మాణాత్మక సర్దుబాటు చర్యలు అంటారు.
* 1991 జులై 24 న  ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌లో మన్మోహన్‌ సింగ్‌ నూతన ఆర్థిక విధానాన్ని ప్రకటించారు. ఇందులో ప్రతిపాదించిన కొత్త మార్పులను మూడు అంశాలుగా విభజించవచ్చు.
* ప్రస్తుతమున్న నిబంధనలను, అనుమతులను, చట్టాలను తగ్గించి, సులభతరం చేసి వ్యాపార, పెట్టుబడి రంగాలకు బ్యూరోక్రాటిక్‌ల అనవసర జోక్యం, జాప్యాల నుంచి ఆర్థిక స్వేచ్ఛ కల్పించడాన్ని సరళీకరణ అంటారు. దీని కోసం కింది చర్యలు చేపట్టారు
* ప్రభుత్వం నుంచి తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాల్సిన పరిశ్రమల సంఖ్యను భారీగా కుదించి కేవలం 6 కు పరిమితం చేశారు. ఉదా: మద్యపానం, సిగరెట్లు, రక్షణ సామగ్రి, పారిశ్రామిక పేలుడు పదార్థాలు, మందులు, ప్రమాదకరమైన రసాయనాలు.
* పరిశ్రమలు తమ ఉత్పత్తులను, సామర్థ్యాలను తమకు లాభదాయకమైన రీతిలో విస్తరించుకోవడానికి వెసులుబాటు కల్పించారు. 
* ఏకస్వామ్య, నియంత్రిత వ్యాపార అమలు చట్టాన్ని రద్దు చేశారు. పరిశ్రమల ఆస్తులపై రూ. 100 కోట్ల పరిమితులను ఎత్తివేశారు. అంతకు మించి ఆస్తులు వృద్ధి చేసుకునేందుకు స్వేచ్ఛ ఇచ్చారు. 
* నరసింహం కమిటీ సలహా మేరకు తమ లావాదేవీల్లో వడ్డీలను నిర్ణయించుకునే అవకాశం బ్యాంకులకు కల్పించారు. ఆర్‌బీఐ నియంత్రణను తగ్గించారు. ప్రైవేట్‌ బ్యాంకులను అనుమతించారు. ఇకపై జాతియీకరణ ఉండదు.
* రాజా చెల్లయ్య కమిటీ సిఫారసుల ఆధారంగా, పన్నుల వ్యవస్థను సరళీకరించారు. ఆదాయ పన్ను, కార్పొరేట్‌ పన్నులను తగ్గించారు.
* బడ్జెట్‌ నిర్మాణంలో మార్పులు తెచ్చి, పారదర్శకత పెంచారు. సుఖ్‌మయ్‌ చక్రవర్తి కమిటీ సూచనల మేరకు బడ్జెట్‌ లోటు బదులు విత్తలోటు ప్రవేశపెట్టారు.
* చిన్నతరహా పరిశ్రమల పెట్టుబడుల పరిమితులను రూ. కోటికి పెంచి, వాటి సామర్థ్యాన్ని మెరుగుపరచుకునే అవకాశం కల్పించారు.


ప్రైవేటీకరణ
ప్రభుత్వ రంగ పరిధిని తగ్గించి, ఆ మేరకు అనుమతి ఇచ్చిన అన్ని రంగాల్లో ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించడాన్ని ప్రైవేటీకరణ అంటారు. 1991 నూతన పారిశ్రామిక విధానం దీన్ని అమల్లోకి తెచ్చింది.
* ప్రభుత్వ రంగానికి కేటాయించిన పరిశ్రమల సంఖ్యను బాగా తగ్గించి కేవలం రెండింటికి పరిమితం చేశారు. అవి: రైల్వేలు, అణుశక్తి,మిగతా అన్ని రంగాల్లో ప్రైవేటు వ్యక్తులు/ సంస్థలు సులభంగా పెట్టుబడులు పెట్టవచ్చు.
* ఇప్పటికే ఉన్న ప్రభుత్వ సంస్థల్లో పెట్టుబడులను నిర్దిష్ట శాతం మేర వెనక్కి తీసుకుంటారు. దీన్నే పెట్టుబడుల ఉపసంహరణ అంటారు.
* ప్రభుత్వ సంస్థల్లో అవగాహన ఒప్పందాల ద్వారా ్బలీవీగ్శీ నిర్వహణ స్వేచ్ఛను ఇచ్చి, వాటి పనితీరును మెరుగుపరిచే దిశగా చర్యలు తీసుకున్నారు.
* ప్రభుత్వ సంస్థల్లో ప్రైవేటు యాజమాన్య పద్ధతులను ప్రవేశపెట్టారు.
* నష్టాల్లో ఉన్న ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు విక్రయించి, తద్వారా బడ్జెట్‌పై దీర్ఘకాలంగా ఉన్న భారాన్ని తగ్గించేందుకు ప్రయత్నించారు. వీటి ద్వారా ప్రభుత్వ కంపెనీల ఏకస్వామ్యాలను తొలగించి, పోటీ ప్రవేశపెట్టారు. 
* తర్వాతి కాలంలో లీళిగిశి చట్టం స్థానంలో పోటీ చట్టాన్ని తీసుకొచ్చారు.


ప్రపంచీకరణ
* 1991 నాటికి వచ్చిన మరో కొత్త మార్పు - ప్రపంచీకరణ. పశ్చిమ పెట్టుబడిదారీ దేశాలు, ప్రపంచ బ్యాంక్, అక్కడి ఆర్థికవేత్తలు ప్రపంచ సమస్యలకు పరిష్కారంగా ప్రతిపాదించిందే ఈ ప్రపంచీకరణ భావన. ఆర్థిక, వ్యాపార, వాణిజ్యరంగాల లావాదేవీల్లో ఎలాంటి అడ్డంకులూ లేకుండా ఒక దేశం ఇతర దేశాలతో దగ్గరి సంబంధాన్ని కలిగి ఉండటాన్ని ప్రపంచీకరణ అంటారు. తద్వారా ప్రపంచం అంతా ఒకే మార్కెట్‌లా మారి వస్తువులు, సేవలు, పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం మిగులు దేశాల నుంచి కొరత దేశాలకు స్వేచ్ఛగా సరఫరా అవుతాయి.  ప్రపంచ వృద్ధిరేటు పెరుగుతుంది. ప్రజలు కోరికలు తీరి, సంక్షేమం మెరుగవుతుంది. చివరకు విశ్వగ్రామం రూపొందుతుంది. ఇదే దీర్ఘకాల ప్రధాన లక్ష్యం. ఈ నేపథ్యంలోనే భారతదేశం కూడా ప్రపంచీకరణలో భాగం కావడానికి సమ్మతిస్తూ పలు చర్యలు చేపట్టింది.
* భారతదేశానికి వచ్చే దిగుమతులు, మన దేశం చేసే ఎగుమతులపై వేసే సుంకాలను భారీగా తగ్గించారు. దిగుమతులపై సుంకాన్ని 300% నుంచి 150%కి తగ్గించారు.
* 1992 నుంచి మూలధన, మాధ్యమిక వస్తువుల దిగుమతులపై ఆంక్షలు తొలగించారు. పరిమిత వస్తువులను మాత్రమే ముందస్తు అనుమతి తీసుకోవాల్సిన రుణాత్మక జాబితాలో ఉంచి, మిగతావాటి దిగుమతులకు స్వేచ్ఛ ఇచ్చారు.
* అత్యంత ప్రాధాన్యం, సాంకేతికత అవసరమైన పరిశ్రమల్లో 51% మేరకు ముందస్తు అనుమతి లేకుండా విదేశీ పెట్టుబడులను స్వీకరించడానికి అనుమతి ఇచ్చారు. విదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడానికి సమ్మతించారు.
* ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) సభ్య దేశమైన భారత్, గాట్‌ నిబంధనల చర్చల్లో చురుగ్గా పాల్గొంది. అభివృద్ధి చెందిన దేశాల ప్రయోజనాల పరిరక్షణలో ముందుంటూనే ప్రపంచీకరణకు మద్దతు ప్రకటించింది.
* విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులతోపాటు సంస్థాగత పెట్టుబడులను ఆహ్వానించారు. మూలధన మార్కెట్‌లో మార్పు తెచ్చి, దేశ స్టాక్‌ మార్కెట్‌ మరింత పారదర్శకంగా, చురుకుగా పనిచేసేలా SEBI ని ఏర్పాటు చేశారు. దానికి స్వయంప్రతిపత్తి కల్పించారు.
* కరెంట్‌ ఖాతాలో జరిగే లావాదేవీలకు రూపాయి పూర్తి కన్వర్టబిలిటీ కల్పించి మన దేశం, ఇతర దేశాల మధ్య ఆర్థిక లావాదేవీలు సులభంగా, వేగంగా జరిగేలా ఏర్పాట్లు చేశారు. అంటే RBI నియంత్రణ లేకుండా రూపాయి విలువను మార్కెట్‌ నిర్ణయిస్తుంది. అంతర్జాతీయ పరిస్థితులు కూడా రూపాయి విలువను ప్రభావితం చేసే అవకాశం ఏర్పడింది.
* విదేశీ కరెన్సీ నిర్వహణకు; ప్రజలకు, పెట్టుబడిదారులకు స్నేహపూర్వకమైన వాతావరణం కల్పించడానికి నీనిళితి చట్టానికి బదులు నీనిలీతి చట్టాన్ని ప్రవేశపెట్టారు. క్రమంగా ప్రతి ఏడాదీ మార్పులు చేస్తూ మన దేశాన్ని మరింత ఓపెన్‌ ఎకానమీగా మార్చడానికి ప్రయత్నాలు జరిగాయి. దేశీయంగా శతాబ్దాల లైసెన్స్‌ పర్మిట్‌ రాజ్‌ను తగ్గించి సామ్యవాద ప్రజాస్వామ్య దేశాన్ని మార్కెట్‌ ఆధారిత ఆర్థిక వ్యవస్థగా, అంతర్జాతీయ వేదికలపై చురుకైన గొంతుకనిచ్చే పురోగమన దేశంగా నిలబెట్టేందుకు బలమైన పునాదులు వేయడం జరిగింది. పై మూడు అంశాల కలయికతో ఉండటం వల్లే 1991 నూతన ఆర్థిక విధానాన్ని లిశిబి అభివృద్ధి నమూనా అని కూడా పిలుస్తారు.

Posted Date : 03-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌