• facebook
  • whatsapp
  • telegram

జడ వాయువులు - ఉత్కృష్ట వాయువులు

ఆవర్తన పట్టికలోని చివరి గ్రూపు అంటే 18వ గ్రూపు మూలకాలను ‘జడ వాయువులు’ అంటారు. రసాయనికంగా చర్యాశీలత లేనందువల్ల వీటిని ‘ఉత్కృష్ట వాయువులు’ లేదా ‘జడ వాయువులు’ అంటారు.

* 18వ గ్రూపు మూలకాలు: హీలియం, నియాన్‌,  ఆర్గాన్‌, క్రిప్టాన్‌,  గ్జినాన్‌, రేడాన్‌.

* 18వ గ్రూపులో కొత్తగా చేర్చిన మూలకం ఓగెనెస్సాన్
* ఉత్కృష్ట వాయువుల్లో రేడాన్‌ మినహా మిగిలినవి వాతావరణంలో లభిస్తాయి. వాతావరణంలో ఆర్గాన్‌ 0.93% లభిస్తుంది. వీటిని గాలి నుంచి సంగ్రహిస్తారు కాబట్టి ‘ఏరోజన్లు’ అని కూడా అంటారు.
* హీలియం మినహా 18వ గ్రూపు మూలకాల సాధారణ ఎలక్ట్రాన్‌ విన్యాసం  ns2 np6. హీలియం వాయువు ఎలక్ట్రాన్‌ విన్యాసం 1s2.
* 18వ గ్రూపు మూలకాల బాహ్య కర్పరంలో ఆర్బిటాళ్లు ఎనిమిది ఎలక్ట్రాన్‌లతో పూర్తిగా నిండి ఉండటం వల్ల రసాయనిక జడత్వాన్ని ప్రదర్శిస్తాయి.
* వాతావరణంలో అత్యల్ప పరిమాణంలో లభించడం వల్ల వీటిని ‘విరళ వాయువులు’ అని కూడా అంటారు. జడ వాయువుల సంయోజకత సున్నా.

* స్థిరమైన అష్టక ఎలక్ట్రాన్‌ విన్యాసాన్ని కలిగి ఉండటం వల్ల ఈ వాయువులకు అత్యధిక అయనీకరణ శక్తి ఉంటుంది. ఎలక్ట్రాన్‌ను గ్రహించే స్వభావం ఉండదు.
* ఉత్కృష్ట వాయువులన్నీ ఏకపరమాణుక వాయువులు. వీటికి రంగు, రుచి, వాసన ఉండదు. గ్రూపులో హీలియం నుంచి రేడాన్‌ వరకు పరమాణు వ్యాసార్ధాలు పెరుగుతాయి.
* ఉత్కృష్ట వాయువులు చాలా తక్కువ ద్రవీభవన, బాష్పీభవన స్థానాలను కలిగి ఉంటాయి.
కారణం: ఇవి ఏక పరమాణుక వాయువులు కాబట్టి వీటి మధ్య బలహీన విక్షేపణ బలాలు మినహా ఏ ఇతర అంతర పరమాణుక బలాలు ఉండవు.


హీలియం: 
* ఇది జడ వాయువుల్లో మొదటిది. హైడ్రోజన్‌ తర్వాత అత్యంత తేలికైన వాయువు హీలియం.
* ఇది ఆవర్తన పట్టికలో రెండో మూలకం. దీని పరమాణు సంఖ్య 2, ద్రవ్యరాశి సంఖ్య 4.
* 1868లో పి.జాన్సెన్, ఎన్‌.లాక్యర్‌ అనే శాస్త్రవేత్తలు సూర్యుడిపై అధ్యయనం చేయడం ద్వారా హీలియం వాయువును కనుక్కున్నారు.
* హీలియోస్‌ అనే గ్రీకు పదం నుంచి హీలియంకు ఆ పేరు పెట్టారు. (హీలియోస్‌ అంటే సూర్యుడు).
* సూర్యగోళంలో కేంద్రక సంలీన చర్య ద్వారా హీలియం ఏర్పడుతుంది.
* హీలియం మండే స్వభావం లేని, తేలికైన వాయువు. కాబట్టి దీన్ని వాతావరణ పరిశోధనలకు ఉపయోగించే బెలూన్లలో నింపడానికి వాడతారు.
* ఇది గాలి కంటే తేలికైంది కాబట్టి దీన్ని విమానాల టైర్లు, ఎయిర్‌షిప్‌లలో ఉపయోగిస్తారు.
* సముద్రాల్లో చాలా లోతుకు వెళ్లే గజ ఈతగాళ్లు కృత్రిమ శ్వాస కోసం ఉపయోగించే పరికరాల్లో గాలి స్థానంలో హీలియోక్స్‌ను ఉపయోగిస్తారు. హీలియోక్స్‌ అనేది హీలియం, ఆక్సిజన్‌ల మిశ్రమం.

* ఆస్తమా వ్యాధి ఉన్నవారు ఉపశమనం కోసం ఆక్సిజన్, హీలియం మిశ్రమాన్ని ఉపయోగిస్తారు.
* ద్రవ హీలియంను తక్కువ ఉష్ణోగ్రతల వద్ద ప్రయోగాలు చేసేందుకు, అల్ప ఉష్ణోగ్రతలను సాధించే క్రయోజెనిక్‌ కారకంగా వాడతారు.
* ద్రవ హీలియంను అణు రియాక్టర్లలో శీతలీకరణిగా ఉపయోగిస్తారు. అయస్కాంత అనునాద ప్రతిబింబ స్కానింగ్‌ వ్యవస్థలో ముఖ్య భాగమైన బలమైన అతివాహక అయస్కాంతత్వాన్ని ఉత్పత్తి చేయడంలో ద్రవ హీలియంను వాడతారు.
* అల్ప ఉష్ణోగ్రతలను కొలవడానికి వాడే అయస్కాంత థర్మామీటర్లలో ద్రవ హీలియంను ఉపయోగిస్తారు.
* హీలియం మరిగే స్థానం -268.9 కంటే కింద,  -270.9 ఉష్ణోగ్రత కంటే పైన, ఇది హీలియం-I  అని పిలిచే ద్రవస్థితిలో ఉంటుంది.
* - 270.9 ఉష్ణోగ్రతల కంటే కింద హీలియం అసాధారణ లక్షణాలు ప్రదర్శించే హీలియం-II అని పిలిచే ద్రవస్థితిలో ఉంటుంది. దీనికి ఉష్ణవాహకత అధికంగా, స్నిగ్ధత చాలా తక్కువగా ఉంటుంది. ఇది సాధారణ ద్రవాల లాగా కిందికి ప్రవహించడానికి బదులు పాత్ర గోడలపైకి ఎగబాకుతుంది.
* అధిక చర్యాశీలత ఉన్న లోహాల సంగ్రహణంలో, జడ వాతావరణాన్ని కల్పించేందుకు హీలియం వాయువును ఉపయోగిస్తారు.


నియాన్‌: 
* నియాన్‌ అంటే ‘కొత్త’ అని అర్థం.
* దీన్ని రామ్సే, ట్రావెర్స్‌ అనే శాస్త్రవేత్తలు కనుక్కున్నారు.
* అల్ప పీడనాల వద్ద నియాన్‌ బల్బులు నారింజ - ఎరుపు రంగు కాంతినిస్తాయి. కాబట్టి పొగమంచు, దుమ్ము ధూళి కణాల నుంచి కూడా చొచ్చుకొని పోయి చూడటానికి నియాన్‌ బల్బులు ఉపయోగపడతాయి.
* నియాన్‌ బల్బులను ప్రకటన దీపాలుగా, సిగ్నల్‌ లైట్లలో, ఓడరేవుల్లో, విమానాశ్రయాల్లో దారి చూపే దీపాలుగా ఉపయోగిస్తారు.


ఆర్గాన్‌:
* ఆర్గాన్‌ అంటే సోమరి అని అర్థం.
* దీన్ని హెన్రీ కావెండిష్‌ కనుక్కున్నారు. రేలి, రామ్సే అనే శాస్త్రవేత్తలు స్వచ్ఛమైన గాలి నుంచి అంశిక స్వేదనం ద్వారా ఆర్గాన్‌ను వేరు చేశారు.
* ఆర్గాన్‌ వాయువును లోహాలను వెల్డింగ్‌ చేసేటప్పుడు, సాధారణ టంగ్‌స్టన్‌ ఫిలమెంట్‌ బల్బుల్లో జడ వాతావరణాన్ని కల్పించేందుకు ఉపయోగిస్తారు.


క్రిప్టాన్‌: 
* క్రిప్టాన్‌ అంటే ‘దాగి ఉన్న’ అని అర్థం.
* దీన్ని రామ్సే, ట్రావెర్స్‌ అనే శాస్త్రవేత్తలు కనుక్కున్నారు.
* దీన్ని గనుల్లో పనిచేసే కార్మికులు ధరించే టోపీలైట్లలో ఉపయోగిస్తారు.
* క్రిప్టాన్‌ లైట్లు తెలుపు రంగు కాంతినిస్తాయి.
* వాణిజ్య ప్రకటనలకు ఉపయోగించే రంగురంగుల లైట్లలో మెర్క్యురీ బాష్పంతో పాటు నియాన్, క్రిప్టాన్‌లను ఉపయోగిస్తారు.


గ్జినాన్:
* గ్జినాన్‌ అంటే ‘పరిచయం లేనిది’ అని అర్థం.
* దీన్ని రామ్సే, ట్రావెర్స్‌ అనే శాస్త్రవేత్తలు కనుక్కున్నారు.
* దీన్ని ఫొటోగ్రాఫిక్‌ ఫ్లాష్‌లైట్లలో ఉపయోగిస్తారు.
* దీన్ని వాయువును మత్తుమందుగా కూడా ఉపయోగిస్తారు. కాకపోతే ఇది సంప్రదాయ మత్తుమందు కంటే ఖరీదైంది.


రేడాన్‌:
* రేడాన్‌ రంగు, వాసన లేని రేడియోధార్మిక వాయువు. దీన్ని రూథర్‌ఫర్డ్, రాబర్ట్‌ ఓవెన్స్‌ అనే శాస్త్రవేత్తలు కనుక్కున్నారు.
* రేడియోధార్మికతను ప్రదర్శించే కారణంగా దీన్ని రేడియోథెరపీలో ఉపయోగిస్తారు.

Posted Date : 15-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌