• facebook
  • whatsapp
  • telegram

భారత్‌లో అణువిద్యుత్తు

ఖర్చు ఎక్కువ కాదు.. కాలుష్యం లేదు!

 

ఏ దేశం అభివృద్ధి చెందాలన్నా శక్తివనరులు ముఖ్యం. విద్యుచ్ఛక్తి అందుబాటులో ఉంటే పరిశ్రమలు నిరంతరం పనిచేస్తాయి. ప్రగతి సాధ్యమవుతుంది. కానీ విద్యుదుత్పత్తి వ్యయంతో కూడుకున్న వ్యవహారం. పైగా కాలుష్యం. ప్రధానమైన ఈ రెండు ఇబ్బందులను అధిగమించేందుకు అణువిద్యుత్తుపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. పలు అటామిక్‌ పవర్‌ ప్లాంట్లను స్థాపించింది. మరిన్నింటిని అందుబాటులోకి తీసుకురాబోతోంది. పెద్ద ఎత్తున అణువిద్యుత్తు ఉత్పత్తిని పర్యావరణ హితంగా సాగిస్తోంది. ఈ అంశాలన్నింటినీ అభ్యర్థులు పోటీ పరీక్షల కోణంలో తెలుసుకోవాలి.

 

 

భారతదేశంలో అణువిద్యుత్తు ఉత్పత్తి న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎన్‌పీసీఐఎల్‌) అధీనంలో ఉంటుంది. అణువిద్యుత్తు కేంద్రాల నిర్మాణం, రూపకల్పన, నిర్వహణలను ఈ సంస్థే పర్యవేక్షిస్తుంది. మన దేశంలో ప్రస్తుతం 22 అణువిద్యుత్తు రియాక్టర్లు వాణిజ్యపరంగా విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నాయి. వీటి మొత్తం అణువిద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం 6,780 మెగావాట్లు. వీటిలో 18 రియాక్టర్లు ప్రెషరైజ్డ్‌ హెవీ వాటర్‌ రియాక్టర్లు, రెండు బాయిలింగ్‌ వాటర్‌ రియాక్టర్లు, మిగతా రెండు వొడా-వొడా ఎనర్జో రియాక్టర్లు.


వాణిజ్యపరంగా..

 

తారాపుర్‌ అటామిక్‌ పవర్‌ స్టేషన్‌ (టీఏపీఎస్‌) (బోయిసర్, మహారాష్ట్ర): ఇక్కడ మొత్తం 4 అణువిద్యుత్తు రియాక్టర్లు ఉన్నాయి. వీటిలో మొదటి 2 రియాక్టర్ల సామర్థ్యం ఒక్కొక్కటి 160 మెగావాట్లు. ఇవి రెండూ బాయిలింగ్‌ వాటర్‌ రియాక్టర్లు. వీటిని 1969, అక్టోబరు 28న వాణిజ్య  పరంగా ప్రారంభించారు. మిగతా రెండు రియాక్టర్ల విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం ఒక్కొక్కటి 540 మెగావాట్లు. ఇవి ప్రెషరైజ్డ్‌ హెవీవాటర్‌ రియాక్టర్లు (పీహెచ్‌డబ్ల్యూఆర్‌). వీటిలో  మూడో రియాక్టరును 2006, ఆగస్టు 18న, నాలుగో రియాక్టరును 2005, సెప్టెంబరు 12న ప్రారంభించారు. ఇక్కడున్న అన్ని యూనిట్ల సామర్థ్యం 1400 మెగావాట్లు.

 

రాజస్థాన్‌ అటామిక్‌ పవర్‌ స్టేషన్‌ (ఆర్‌ఏపీఎస్‌) (కోటా, రాజస్థాన్‌): ఇక్కడ 6 రియాక్టర్లు ఉన్నాయి. అన్నీ ప్రెషరైజ్డ్‌ హెవీవాటర్‌ రియాక్టర్లు (పీహెచ్‌డబ్ల్యూఆర్‌). వీటిలో మొదటి యూనిట్‌ సామర్థ్యం 100 మెగావాట్లు. దీన్ని 1973, డిసెంబరు 16న ప్రారంభించారు. రెండో యూనిట్‌ సామర్థ్యం 200 మెగావాట్లు. దీన్ని 1981, ఏప్రిల్‌ 1న ప్రారంభించారు. మిగతా యూనిట్ల సామర్థ్యం ఒక్కొక్కటి 220 మెగావాట్లు. వీటిలో మూడో యూనిట్‌ను 2000, జూన్‌ 1న; నాలుగో యూనిట్‌ను 2000, డిసెంబరు 23న; అయిదో యూనిట్‌ను 2010, ఫిబ్రవరి 4న; ఆరో యూనిట్‌ను 2010, మార్చి 31న ప్రారంభించారు. వీటన్నింటి సామర్థ్యం 1180 మెగావాట్లు.

 

మద్రాస్‌ అటామిక్‌ పవర్‌ స్టేషన్‌ (ఎమ్‌ఏపీఎస్‌) (కల్పకం, తమిళనాడు): ఇవి రెండు ప్రెషరైజ్డ్‌ హెవీ వాటర్‌ రియాక్టర్లు. దీని మొత్తం సామర్థ్యం 440 మెగావాట్లు (ఒక్కోటి 220 మెగావాట్లు). వీటిలో 1వ యూనిట్‌ను 1984, జనవరి 27న; 2వ యూనిట్‌ను 1986, మార్చి 21న ప్రారంభించారు.

 

కైగా జనరేటింగ్‌ స్టేషన్‌ (కేజీఎస్‌) (కైగా, కర్ణాటక): ఇక్కడ నాలుగు న్యూక్లియర్‌ రియాక్టర్లు పనిచేస్తున్నాయి. అన్నీ ప్రెషరైజ్డ్‌ హెవీవాటర్‌ రియాక్టర్లు (పీహెచ్‌డబ్ల్యూఆర్‌). దీని మొత్తం సామర్థ్యం 880 మెగావాట్లు. (ఒక్కోదాని సామర్థ్యం 220 మెగావాట్లు). వీటిలో మొదటి యూనిట్‌ను 2000, నవంబరు 16న; రెండో యూనిట్‌ను 2000, మార్చి 16న; మూడో యూనిట్‌ను 2007, మే 6న; నాలుగో యూనిట్‌ను 2011, జనవరి 20న ప్రారంభించారు.

 

నరోరా అటామిక్‌ పవర్‌ స్టేషన్‌ (ఎన్‌ఏపీఎస్‌), (నరోరా, ఉత్తర్‌ ప్రదేశ్‌): ఈ ప్రదేశంలో రెండు న్యూక్లియర్‌ రియాక్టర్లు ఉన్నాయి. దీని మొత్తం సామర్థ్యం 440 మెగావాట్లు (ఒక్కోదాని సామర్థ్యం 220 మెగావాట్లు). ఇవి ప్రెషరైజ్డ్‌ హెవీవాటర్‌ రియాక్టర్లు. వీటిలో మొదటి యూనిట్‌ను 1991, జనవరి 1న, రెండో యూనిట్‌ను 1992, జులై 1న ప్రారంభించారు.

 

కాక్రపార్‌ అటామిక్‌ పవర్‌ స్టేషన్‌ (కేఏపీఎస్‌) (గుజరాత్‌): ఇక్కడ రెండు రియాక్టర్లు పనిచేస్తున్నాయి. దీని మొత్తం సామర్థ్యం 440 మెగావాట్లు (ఒక్కోదాని సామర్థ్యం 220 మెగావాట్లు). ఇవి ప్రెషరైజ్డ్‌ హెవీవాటర్‌ రియాక్టర్లు. వీటిలో మొదటి యూనిట్‌ను 1993, మే 6న; రెండో యూనిట్‌ను 1995, సెప్టెంబరు 1న ప్రారంభించారు.

 

కుడంకుళం న్యూక్లియర్‌ పవర్‌ స్టేషన్‌ (కేకేఎన్‌పీఎస్‌) (కుడంకుళం - తమిళనాడు): ఇక్కడ రెండు న్యూక్లియర్‌ రియాక్టర్లు పనిచేస్తున్నాయి. ఇవి రష్యా తయారుచేసిన వొడా వొడా ఎనర్జో రియాక్టర్లు (వీవీఈఆర్‌). దీని మొత్తం సామర్థ్యం 2000 మెగావాట్లు (ఒక్కోదాని సామర్థ్యం 1000 మెగావాట్లు). మిగతా అన్ని రియాక్టర్ల కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న రియాక్టర్లు ఇక్కడ ఉన్నాయి. ఇవి ప్రెషరైజ్డ్‌ వాటర్‌ రియాక్టర్లు.

 

నిర్మాణంలో.. ప్రారంభ దశలో..


కాక్రపార్‌ అటామిక్‌ పవర్‌ ప్లాంట్‌ (3, 4 యూనిట్లు): ఇవి ప్రెషరైజ్డ్‌ హెవీవాటర్‌ రియాక్టర్లు. వీటి అణు విద్యుత్తు సామర్థ్యం ఒక్కొక్కటి 700 మెగావాట్లు. వీటిలో 3వ యూనిట్‌ త్వరలో విద్యుత్తు ఉత్పత్తిని ప్రారంభించే దశలో, 4వ యూనిట్‌ నిర్మాణ దశలో ఉన్నాయి.

 

గోరఖ్‌పుర్, హరియాణా అణువిద్యుత్తు పరియోజన: హరియాణాలోని గోరఖ్‌పుర్‌లో ఉంది. ఇక్కడ ఉన్న రియాక్టర్లు 4. ఇవన్నీ ప్రెషరైజ్డ్‌ హెవీవాటర్‌ రియాక్టర్లు. ఒక్కో రియాక్టరు సామర్థ్యం 700 మెగావాట్లు. వీటిలో 1, 2 యూనిట్లు నిర్మాణ దశలో ఉండగా 3, 4 యూనిట్లు స్థల సేకరణ, నిర్మాణపరమైన అనుమతుల దశలో ఉన్నాయి.

కైగా అటామిక్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ (5, 6 యూనిట్లు): వీటి సామర్థ్యం ఒక్కొక్కటి 700 మెగావాట్లు. ఇవి ప్రెషరైజ్డ్‌ హెవీవాటర్‌ రియాక్టర్లు. వీటికి నిర్మాణపరమైన అనుమతులు ఇచ్చారు.

 

కుడంకుళం న్యూక్లియర్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ (3, 4, 5, 6 యూనిట్లు): ఇవన్నీ ప్రెషరైజ్డ్‌ వాటర్‌ రియాక్టర్లు. ఒక్కో రియాక్టర్‌ సామర్థ్యం వెయ్యి మెగావాట్లు. వీటిలో 3, 4 యూనిట్లు నిర్మాణ దశలో ఉండగా, 5, 6 యూనిట్లకు నిర్మాణపరమైన అనుమతులు ఇచ్చి నిధులు కేటాయించారు.

 

మహి భన్స్‌వార అణు విద్యుత్‌ రియాక్టర్లు, రాజస్థాన్‌: ఇక్కడ 4 యూనిట్లకు నిర్మాణపరమైన అనుమతులు ఇచ్చి నిధులు కేటాయించారు. వీటి అణు విద్యుత్తు సామర్థ్యం ఒక్కొక్కటి 700 మెగావాట్లు.

 

రాజస్థాన్‌ అటామిక్‌ పవర్‌ప్లాంట్, రావత్‌భాటా: ఇక్కడ 7, 8 యూనిట్లు నిర్మాణ దశలో ఉన్నాయి. ఒక్కోదాని సామర్థ్యం 700 మెగావాట్లు.

 

చుట్క అణు విద్యుత్‌ పవర్‌ ప్లాంట్, మధ్యప్రదేశ్‌: ఇక్కడ రెండు అణు విద్యుత్తు రియాక్టర్ల నిర్మాణానికి అనుమతిచ్చి, నిధులు కేటాయించారు. వీటి సామర్థ్యం ఒక్కోటి 700 మెగావాట్లు.

 

భవిష్యత్తులో..


జైతాపుర్‌ (మహారాష్ట్ర): ఇక్కడ ఫ్రాన్స్‌ సహకారంతో 6 రియాక్టర్లు నిర్మించాలనుకుంటున్నారు. వీటిలో ఒక్కో రియాక్టరు సామర్థ్యం 1650 మెగావాట్లు.

 

కొవ్వాడ అణు విద్యుత్తు రియాక్టర్లు (ఆంధ్రప్రదేశ్‌): ఇక్కడ అమెరికా సహాయంతో 6 న్యూక్లియర్‌ రియాక్టర్లు నిర్మించాలనుకుంటున్నారు. ఒక్కోదాని సామర్థ్యం 1208 మెగావాట్లు.

 

ఛాయామిథివిర్ధి న్యూక్లియర్‌ పవర్‌ ప్లాంట్‌ (గుజరాత్‌): ఇక్కడ  అమెరికా సహాయంతో 6 రియాక్టర్లు నిర్మించాలనుకుంటున్నారు. ఒక్కోదాని సామర్థ్యం 1000 మెగావాట్లు.

 

హరిపుర్‌ న్యూక్లియర్‌ పవర్‌ ప్లాంట్‌ (పశ్చిమ బెంగాల్‌): రష్యా  సహకారంతో ఆరు రియాక్టర్లు నిర్మించాలని భావిస్తున్నారు. వీటిలో ఒక్కో రియాక్టరు సామర్థ్యం 1000 మెగావాట్లు.

 

భీమ్‌పుర్‌ న్యూక్లియర్‌ పవర్‌ప్లాంట్‌ (మధ్యప్రదేశ్‌): ఇక్కడ భారతదేశం సొంత పరిజ్ఞానంతో 4 ప్రెషరైజ్డ్‌ హెవీవాటర్‌ రియాక్టర్లు (పీహెచ్‌డబ్ల్యూఆర్‌) నిర్మించాలని భావిస్తోంది. ఒక్కోదాని సామర్థ్యం 700 మెగావాట్లు.

 

                                                                                                                                                                                                                                                                                                                                                           

Posted Date : 09-02-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌