• facebook
  • whatsapp
  • telegram

మ‌హాస‌ముద్రాలు-భౌతిక ల‌క్ష‌ణాలు

మహాసముద్రాల లోతు, భౌతిక స్వరూపం ఆధారంగా సముద్ర భూతలాన్ని నాలుగు రకాలుగా విభజించారు. అవి: ఖండతీరపు అంచు, ఖండతీరపు వాలు, అగాధ సముద్ర మైదానం, మహాసముద్ర అగాధం.


ఖండతీరపు అంచు
సముద్రంలో మునిగిఉన్న ఖండం అంచును ఖండతీరపు అంచు అంటారు. ఇది భూభాగానికి, సముద్ర భాగానికి మధ్య ఉండే సంధి ప్రదేశం. సాధారణంగా సముద్ర తరంగాలు, పోటుపాటులు, ప్రవాహాల క్రమక్షయ ఫలితంగా ఖండతీరం కుంగిపోయి ఖండతీరపు అంచుగా మారుతుంది. నదులు, వాటి ఉపనదులు తీసుకొచ్చే ఇసుక, ఒండ్రుమట్టి, చిన్న చిన్న రాళ్లు ఇక్కడే నిక్షేపితమవుతాయి. ఇది తీరం నుంచి దాదాపు 200 మీటర్ల లోతు వరకు ఉంటుంది. మొత్తం సముద్ర భౌగోళిక విస్తీర్ణంలో దాదాపు 7.5% ఆక్రమిస్తుంది. తీరానికి సమాంతరంగా పర్వతాలు ఉన్నచోట ఖండతీరపు అంచు సన్నగా, పర్వతాలు లేనిచోట వెడల్పుగా ఉంటుంది. ఈ ఖండతీరపు అంచు అట్లాంటిక్‌ మహాసముద్రంలో అత్యధికంగా; పసిఫిక్, హిందూ మహాసముద్రాల్లో తక్కువగా ఉంది.


ఖండతీరపు వాలు
ఖండతీరపు అంచునకు, అగాధ సముద్ర మైదానానికి మధ్య నిట్రవాలుగా వ్యాపించి ఉన్న ప్రదేశాన్ని ఖండతీరపు వాలు అంటారు. ఇది ఖండతీరపు అంచు నుంచి వివిధ సముద్రాల్లో కొద్దిపాటి తేడాలతో 5 నుంచి 60 వరకు ఉంటుంది. మొత్తం సముద్ర భౌగోళిక విస్తీర్ణంలో ఖండతీరపు వాలు దాదాపు 8.5% ఆక్రమిస్తుంది. ఇక్కడ సముద్రం లోతు క్రమంగా పెరుగుతూ 200 నుంచి 2000 మీటర్ల వరకు ఉంటుంది. ఈ ప్రాంతం ఏటవాలుగా ఉండటం వల్ల ఇక్కడ ఎలాంటి సముద్ర నిక్షేపాలు ఉండవు.


అగాధ సముద్ర మైదానాలు 
ఖండతీరపు వాలును ఆనుకుని విస్తరించి ఉన్న విశాల సముద్ర మైదాన ప్రాంతాలను అగాధ సముద్ర మైదానాలు అంటారు. సముద్ర భూతలంలో ఈ ప్రాంతం 2000 నుంచి 6000 మీటర్ల లోతులో విస్తరించి ఉంటుంది. ఈ ప్రాంతం మొత్తం సముద్ర భూతల వైశాల్యంలో 3/4వ వంతు (దాదాపు 82.7%) ఆక్రమించి ఉంటుంది. క్రమక్షయ కారకాల వల్ల ఏర్పడే నిక్షేపాలు ఈ ప్రాంతాన్ని చేరవు.


మహాసముద్ర అగాధాలు
 మహాసముద్ర మైదానాల్లో ఒక్కసారిగా లోతు పెరిగి, నిట్రమైన వాలు కలిగి ఉన్న సన్నని, ఎక్కువ లోతైన ప్రాంతాలను మహాసముద్ర అగాధాలు అంటారు. వీటి సరాసరి లోతు 5,500 మీటర్లు. ఇవి సాధారణంగా అగ్నిపర్వత ప్రాంతాలు, భూకంపాలు ఎక్కువగా సంభవించే ప్రాంతాలైన భూపటలంపై రెండు మూడు ప్లేట్లు ఖండించుకునే ప్రాంతాల్లో ఏర్పడ్డాయి. పసిఫిక్‌ మహాసముద్రంలో ఈ అగాధాలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తం సముద్ర భౌగోళిక విస్తీర్ణంలో ఈ ప్రాంతం సుమారు 1.2% విస్తరించి ఉంది.


సమద్రాల లవణీయత 
సముద్రపు నీటిలో అనేక లవణాలు కరిగి ఉంటాయి. వాటిలో ప్రధానమైనవి సోడియం క్లోరైడ్  (77.8%), మెగ్నీషియం క్లోరైడ్‌ (10.9%), మెగ్నీషియం సల్ఫేట్‌  (4.7%), కాల్షియం సల్ఫేట్‌  (3.6%) మొదలైనవి. సగటున 1000 గ్రాముల సముద్ర నీటిలో 35 గ్రాముల లవణాలు ఉంటే దాన్ని సామాన్య  లవణీయత అంటారు. అంతకంటే తగ్గితే అల్ప లవణీయత, పెరిగితే అధిక లవణీయతగా పేర్కొంటారు. భూమధ్యరేఖ ప్రాంతంలో సంవహన వర్షపాతం కారణంగా లవణీయత తక్కువగా; ఆయనరేఖ ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు, బాష్పీభవనం వల్ల లవణీయత అధికంగా; ధ్రువ ప్రాంతాల్లో అల్ప ఉష్ణోగ్రతలు, మంచు కరగడం కారణంగా లవణీయత తక్కువగా ఉంటుంది. 
* సమాన లవణీయత కలిగిన ప్రదేశాలను కలుపుతూ గీసిన రేఖలను ఐసోహెలైన్స్‌ అంటారు.


సముద్ర జలాల కదలిక
సముద్రంలోని నీరు నిలకడగా ఉండకుండా ఎల్లప్పుడూ కదులుతూ ఉంటుంది. ఈ కదలిక మూడు రకాలుగా ఉంటుంది. తరంగాలు, ప్రవాహాలు, పోటుపాటులు. వీటి ఫలితంగా భూగోళంపై ఏర్పడే అత్యధిక, అత్యల్ప ఉష్ణోగ్రతలు ఒకేచోట కేంద్రీకృతం కాకుండా ప్రకృతిసిద్ధంగా విస్తరిస్తాయి.
తరంగాలు: తరంగాల పుట్టుక, పెరుగుదల, నశించిపోవడం అనేది ప్రధానంగా సముద్రాలపై వీచే పవనాలపై ఆధారపడి ఉంటాయి. గాలి శక్తిని అనుసరించి సముద్ర ఉపరితల నీరు శృంగం రూపంలో పైకి, ద్రోణి రూపంలో కిందికి లేచిపడతాయి. వరుసగా ఉన్న రెండు శృంగాలు లేదా ద్రోణుల మధ్య దూరాన్ని తరంగ పొడవు/ తరంగదైర్ఘ్యం అంటారు. 

         మహాసముద్ర అగాధాల్లో పెద్ద భూకంపాలు లేదా భయంకరమైన అగ్నిపర్వతాలు ప్రజ్వరిల్లినప్పుడు వాటి ప్రభావంతో సముద్ర గర్భం నుంచి ఉవ్వెత్తున అలలు పుట్టుకు వచ్చి అవి సముద్ర ఉపరితలం మీద 3040 మీటర్ల ఎత్తువరకు ఎగిసి సమీప తీరప్రాంతాలను ముంచేస్తాయి. వీటినే సునామీలు అంటారు. సునామీ జపాన్‌ భాషా పదం. దీనికి ‘హర్బర్‌లో వచ్చే తరంగాలు’ అని అర్థం. 2004 డిసెంబరులో ఇండోనేసియాలోని సుమిత్రా దీవుల్లో వచ్చిన భూకంపం కారణంగా ఎగిసిన సునామీ అలల పొడవు 160 కి.మీ. వరకూ ఉంది. ఇవి గంటకు 960 కి.మీ వేగంతో ప్రయాణించి భారత్‌తో సహా దాదాపు 12 దేశాల తీరప్రాంతాలను అతలాకుతలం చేశాయి.

        సముద్ర ప్రవాహాలు: సముద్రంలో నీరు అధికమొత్తంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఒక నిర్దిష్ట దశ, క్రమపద్ధతిలో నిత్యం స్థిరంగా ప్రవహించడాన్ని ప్రవాహం అంటారు. ప్రతి ప్రవాహానికి పొడవు, వెడల్పు, లోతు, వేగం, దిక్కు, గుణం లాంటి లక్షణాలు ఉంటాయి. ఇవి సాధారణంగా భూమధ్యరేఖ ప్రాంతం నుంచి ధ్రువాలకు, ధ్రువాల నుంచి భూమధ్యరేఖకు పయనిస్తాయి. ఇవి ఆయా ప్రాంతాల్లో ఏర్పడ్డ అధిక ఉష్ణాన్ని, శీతలాన్ని భూగోళం అంతటా సమానంగా సర్దడానికి ప్రయత్నిస్తాయి.


ముఖ్యమైన సముద్ర ప్రవాహాలు:

ఉష్ణప్రవాహాలు: 
* భూమధ్యరేఖా ప్రవాహం
* ఉత్తర అట్లాంటిక్‌ ప్రవాహం
* ఫ్లోరిడా ప్రవాహం
* గల్ఫ్‌ స్ట్రీం
* నార్వేజియన్‌ ప్రవాహం

 

శీతల ప్రవాహాలు:
* లాబ్రడార్‌ ప్రవాహం
* గ్రీన్‌లాండ్‌ ప్రవాహం
* కానరీ ప్రవాహం


పోటుపాటులు: సాధారణంగా సముద్ర నీటిమట్టం రోజుకు రెండుసార్లు పెరగడం, రెండు సార్లు తగ్గడం జరుగుతుంది. ఇలా సముద్ర నీటిమట్టం పెరగడాన్ని పోటు అని, తగ్గడాన్ని పాటు అని అంటారు.
* ఒక రోజులో పోటు, పాటుల మధ్య కాలవ్యవధి 6 గంటల 13 నిమిషాలు ఉంటుంది.
* మహాసముద్రాలు ఈ పోటుపాటులను కలిగిఉండటానికి ప్రధాన కారణం సూర్యచంద్రుల గురుత్వాకర్షణ శక్తి.
* పోటుపాటుల వల్ల కలిగే నీటిమట్టపు వ్యత్యాసాన్ని ‘వేలా పరిమితి'  (Tidal range) అంటారు.


ప్రవాళ భిత్తికలు  (Coral Reefs):
* ఆయనరేఖా ప్రాంతాల్లో పగడపు పురుగులు లేదా ప్రవాహ కీటకాలు  (Coral polyps) సముద్ర జలాల్లో ఉండే కాల్షియం కార్బొనేట్‌ను గ్రహించి తమ కర్పరాలను (Shells) నిర్మించుకొని గుంపులు, గుంపులుగా ఒకదానినొకటి పెనవేసుకొని పచ్చ, పసుపు, గులాబీ, తెలుపు, ఊదా లాంటి వివిధ రంగుల్లో కాలనీలుగా పెరుగుతూ ఉంటాయి. వీటినే ప్రవాళ భిత్తికలు/ ప్రవాళ ద్వీపాలు అంటారు.
* వీటి పెరుగుదలకు సాధారణంగా ఉష్ణోగ్రత 30ాది వరకు ఉండాలి. అధిక శీతలం, ఉష్ణోగ్రతలు వీటి పెరుగుదలకు ఆటంకాలు.
* సముద్రాల్లో సూర్యరశ్మి, ప్రాణవాయువు 55 మీటర్ల లోతు వరకు మాత్రమే పుష్కలంగా ఉంటుంది. దీంతో వీటి పెరుగదల అంతవరకే పరిమితం.
* ఈ కీటకాలు నివసించడానికి స్వచ్ఛమైన   ఉప్పునీరు అనుకూలం. కాబట్టి నదీ ముఖద్వారాల వద్ద ప్రవాళ భిత్తికలు ఏర్పడవు.
* తమను తాకుతూ దాటివెళ్లే నీటి నుంచి ఇవి ఆహారాన్ని గ్రహిస్తాయి. కాబట్టి వీటికి నీటి చలనం అవసరం.
* సాధారణంగా ప్రవాళభిత్తికలు ఆయనరేఖా ప్రాంతాల్లో ఖండాల తూర్పు తీరంలో కనిపిస్తాయి.
* వీటికి ఉదాహరణ ద గ్రేట్‌ బారియర్‌ రీఫ్‌ ఆఫ్‌ ఆస్ట్రేలియా.
* ప్రస్తుత కాలంలో గ్లోబల్‌ వార్మింగ్, సముద్రాల్లో కాలుష్య కారకాల పెరుగుదల ఫలితంగా ఇవి నశిస్తున్నాయి.
* ఇటీవల ఆస్ట్రేలియన్‌ గ్రేట్‌ బారియన్‌ రీఫ్‌లో శాస్త్రవేత్తలు నూతనంగా 500 మీటర్ల ఎత్తయిన పగడపు దిబ్బను కనుక్కున్నారు.


సముద్రంలో పెట్రోల్‌ ఏర్పడే విధానం
ఏదైనా ఒక జీవి భూమిపై మరణిస్తే అది ఆక్సిజన్‌ వల్ల కుళ్లిపోయి భూమిలో కలిసిపోతుంది. కానీ సముద్రంలో మాత్రం జలచరాలు మరణిస్తే అడుగుభాగానికి చేరుకుంటాయి. ఇలా చనిపోయిన కళేబరాలపై ఇసుక, మట్టి పేరుకుపోయి కొన్ని పొరలుగా ఏర్పడతాయి. అయితే అక్కడ ఆక్సిజన్‌ తక్కువగా ఉంటుంది కాబట్టి చనిపోయిన జంతువులు కుళ్లిపోకుండా కెరోజిన్‌ అనే పదార్థంగా మారతాయి. వీటిపై కొన్ని మిలియన్ల సంవత్సరాల పాటు ఇసుక, బురద క్రమంగా పేరుకుపోవడం వల్ల ఉష్ణోగ్రత, పీడనం పెరిగి కెరోజిన్‌ క్రూడ్‌ ఆయిల్, నేచురల్‌గ్యాస్‌గా మారుతుంది. ఉష్ణోగ్రత 80°-120°C  వరకు ఉంటే కెరోజిన్‌ క్రూడ్‌ఆయిల్‌గా, 120°-150°C వరకు ఉంటే నేచురల్‌ గ్యాస్‌గా మారుతుంది. ఒక జంతువు క్రూడ్‌ ఆయిల్‌గా మారడానికి దాదాపు 22 లక్షల సంవత్సరాల సమయం పడుతుంది. 


సముద్ర నిక్షేపాలు (Ocean deposits)
నేల మీద ఉన్న రకరకాల సేంద్రీయ పదార్థాలు నదులు, గాలి, హిమనీ నదాల ద్వారా సముద్రంలోకి చేరతాయి. వీటిలో జంతు, వృక్ష సంబంధ పదార్థాలతో పాటు నేలమీద క్రమక్షయ ఫలితంగా ఆవిర్భవించే రకరకాల శిలాపదార్థాలు కూడా ఉంటాయి. వీటన్నింటినీ కలిపి సంయుక్తంగా సముద్ర నిక్షేపాలు అంటారు.

భూ ఉపరితలం మొత్తం వైశాల్యం దాదాపు 510 మి.చ.కి.మీ. ఇందులో భూగోళం మీద 148 మి.చ.కి.మీ. ఖండాలు (నేల), 361 మి.చ.కి.మీ. జలభాగం ఆక్రమించి ఉన్నాయి.  భూ ఉపరితలంపై శిలావరణం 29% కాగా, జలావరణం 71%. భూమిపై ఉన్న జలావరణంలో 97.22% ఉప్పునీరే. ఇది మహాసముద్రాలు, సముద్రాల్లో ఉంది. మిగిలిన 2.78% మంచినీరు. ఇది భూ ఉపరితలంపై మంచుగడ్డలు, హిమనీ నదాలు, సరస్సులు, నదులు, కాలువలు, భూగర్భజలాల రూపంలో ఉంది.

 

 

‣ సముద్రశాస్త్రాన్ని ఆంగ్లంలో ‘ఓషినోగ్రఫీ’ అంటారు. ఇది ఒకియానోస్‌ (Okeanos),  గ్రాఫియా (Graphia) అనే గ్రీకు పదాల నుంచి ఏర్పడింది. గ్రీకు భాషలో ఒకియానోస్‌ అంటే ‘సముద్రం’; గ్రాఫియా అంటే ‘వర్ణన’ అని అర్థం.

‣ ఉత్తరార్ధగోళ విస్తీర్ణంలో 61%, దక్షిణార్ధగోళ విస్తీర్ణంలో 81% వరకు మహాసముద్రాలు ఆక్రమించి ఉన్నాయి. అంటే ఉత్తరార్ధగోళంతో పోలిస్తే దక్షిణార్ధగోళంలో జలభాగ విస్తీర్ణం అధికం.

‣ భూమి మీద ఉన్న ఈ అఖండ ఉప్పునీటి జలభాగాన్ని ప్రధానంగా అయిదు మహాసముద్రాలుగా విభజించారు. అవి:

 

పసిఫిక్‌ మహాసముద్రం

‣ పరిమాణం, ఉపరితల వైశాల్యం, లోతు పరంగా ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మహాసముద్రం.

‣ దీన్ని ప్రశాంత మహాసముద్రం అని అంటారు.

‣ ఇది పశ్చిమ ఆసియా, ఓషియానియా (ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పపువా న్యూగినియా మొదలైన దీవులు)లను అమెరికా నుంచి వేరుచేస్తుంది.

‣ పసిఫిక్‌ మహాసముద్ర ఉత్తర విస్తరణ ప్రాంతమైన బేరింగ్‌ జలసంధి ఆసియా, ఉత్తర అమెరికాలను వేరుచేస్తుంది.

‣ ప్రపంచంలో అత్యధిక దీవులు ఈ మహాసముద్రంలోనే ఉన్నాయి.


అట్లాంటిక్‌ మహాసముద్రం

‣ ఇది అమెరికా నుంచి యూరప్, ఆఫ్రికాలను వేరుచేస్తుంది.

‣ అతి పొడవైన తీరరేఖను కలిగి ఉంది.

‣ దీనికి ఖండతీరపు అంచు అత్యధికంగా ఉంది.


హిందూ మహాసముద్రం

‣ దీన్నే అర్ధ మహాసముద్రం అని పిలుస్తారు.

‣ ఇది ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఆసియా ఖండాలకు మూడు వైపులా ఆవరించి ఉంది.

‣ ఇది కలోష్ణ జలాలను కలిగిఉంటుంది.

‣ ఒక దేశం పేరుతో ఉన్న ఏకైక మహాసముద్రం హిందూ మహాసముద్రం.


ఆర్కిటిక్‌ మహాసముద్రం

‣ ఉత్తర అమెరికా, యురేషియా తీరాలను తాకుతూ, ఆర్కిటిక్‌ వలయంలో విస్తరించి ఉంది. 

‣ ఇది పరిమాణంలో అన్నింటి కంటే చిన్న మహాసముద్రం.


అంటార్కిటిక్‌ మహాసముద్రం

‣ అంటార్కిటిక్‌ ఖండాన్ని చుట్టి ఉంటుంది.

‣ దీన్ని పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రాల కొనసాగింపుగా పేర్కొంటారు.

‣ సముద్ర మట్టానికి ఖండాలు ఎంత ఎత్తులో ఉన్నాయి, సముద్రం ఉపరితలం నుంచి దాని అడుగు భాగానికి ఎంత లోతులో ఉందనే విషయాలను తెలుపుతూ గీసిన వక్రరేఖ లేదా గ్రాఫ్‌ను ‘హిప్పోగ్రాఫిక్‌ వక్రం’ అంటారు.

‣ సముద్రాల లోతును ఎకోసౌండింగ్‌ లేదా లూకాస్‌ సౌండింగ్‌ పద్ధతుల ద్వారా కొలుస్తారు.

‣ సముద్రాల లోతును పాంథమ్స్‌లో పేర్కొంటారు.

1 పాంథమ్‌ = 1.829 మీటర్లు

‣ మహాసముద్రాల సరాసరి లోతు 3,800 మీటర్లు.

‣ మహాసముద్రాల్లో దూరాన్ని నాటికల్‌ మైళ్లలో, వేగాన్ని నాట్‌లలో కొలుస్తారు.


మహాసముద్ర రిడ్జ్‌లు (Ocean Ridges)

‣ మహాసముద్రాల అడుగుభాగంలోని భూభాగాల్లో చీలికలు ఏర్పడి ఆ ప్రాంతాల నుంచి లావా బయటకు వస్తుంది. తర్వాతి కాలంలో అది గట్టిపడి ఎత్తయిన ప్రాంతాలను ఏర్పరుస్తాయి. వీటినే ‘రిడ్జ్‌లు’ అంటారు.

‣ టెక్టానిక్‌ ప్లేట్‌ సిద్ధాంతం ప్రకారం ఏ సముద్రాల్లో అయితే ఇలాంటి రిడ్జ్‌లు ఏర్పడతాయో, ఆ సముద్రాలు 2 లేదా 3 ప్లేట్లపై విస్తరించి ఉన్నాయని అర్థం.

‣ అట్లాంటిక్‌ మహాసముద్ర మధ్య భాగంలో, హిందూ మహాసముద్రంలోనూ ఇలాంటి రిడ్జ్‌లు ఉన్నాయి.

‣ ఈ రిడ్జ్‌లలో అతిపెద్దది అట్లాంటిక్‌ మహాసముద్ర మధ్యలో, తీరానికి సమాంతరంగా ్ఞళ్ఠీ ఆకారంలో ఉన్న మధ్య అట్లాంటిక్‌ రిడ్జ్ (Middle Atlantic Ridge)

‣ రిడ్జ్‌లు లేని మహాసముద్రం - పసిఫిక్‌ 

 

ప్రపంచంలోని ప్రధాన సముద్రాలు

కరేబియన్‌ సముద్రం

‣ ఇది దక్షిణ అమెరికా, క్యూబాల మధ్య ఉంది.

‣ ఎక్కువ లవణీయత కలిగి ఉంది.


నార్వేజియన్‌ సముద్రం

‣ ఉత్తర అట్లాంటిక్‌ మహాసముద్రంలో ఉంది.

‣ కాడ్‌ చేపలకు ప్రసిద్ధి.


తెల్ల సముద్రం

‣ ఉత్తర రష్యాలో ఉంది.

‣ శీతాకాలంలో మంచుతో కప్పి ఉంటుంది.


బాల్టిక్‌ సముద్రం

‣ అట్లాంటిక్‌ మహాసముద్రంలో ఉంది.

‣ కీల్‌ కాలువను ఉత్తర సముద్రంతో కలుపుతుంది.


ఆడ్రియాటిక్‌ సముద్రం

‣ ఇటలీ, గ్రీస్‌ మధ్య ఉంది.

‣ మధ్యదరా సముద్ర విస్తరణగా దీన్ని పేర్కొంటారు.


మధ్యదరా సముద్రం

‣ టెథిస్‌ సముద్ర అవశేషంగా దీన్ని అభివర్ణిస్తారు.

‣ ఐరోపా, ఆఫ్రికా, ఆసియాల మధ్య విస్తరించింది.


ఎర్ర సముద్రం

‣ ఆసియా, ఆఫ్రికా మధ్య ఉంది.

‣ అధిక లవణీయతను కలిగి ఉంటుంది.


తూర్పు చైనా సముద్రం

‣ ఆసియా తూర్పు తీర ప్రాంతంలో విస్తరించి ఉంది.

‣ దీన్ని పసిఫిక్‌ మహాసముద్ర విస్తరణగా పేర్కొంటారు.


దక్షిణ చైనా సముద్రం

‣ ఇది ప్రపచంలోనే అతిపెద్ద సముద్రం.

‣ పసిఫిక్‌ మహాసముద్రంలో భాగంగా ఉంది.


అజోల్‌ సముద్రం

‣ నల్ల సముద్రం ఉత్తర విస్తరణగా దీన్ని పేర్కొంటారు.

* సహజవాయు నిక్షేపాలకు ప్రసిద్ధి.


జలసంధులు (Straits)

‣ రెండు పెద్ద జలభాగాలను కలిపే సన్నని జలభాగాన్ని లేదా రెండు పెద్ద భూభాగాలను వేరుచేసే సన్నని జలభాగాన్ని జలసంధి అంటారు.

 

ప్రధాన జలసంధులు - వాటి ప్రత్యేకతలు

పాక్‌ జలసంధి: ఇది మన్నార్‌ సింధు శాఖను - బంగాళాఖాతాన్ని కలుపుతుంది. భారత్‌ - శ్రీలంక మధ్య ఉంది.

మలక్కా: సుమిత్రా దీవి - మలేసియా మధ్య ఉంది.

బాస్‌: ఆస్ట్రేలియా - టాస్మేనియా మధ్య ఉంది.

బేరింగ్‌: పసిఫిక్‌ మహాసముద్రాన్ని - ఆర్కిటిక్‌ మహాసముద్రాన్ని కలుపుతుంది.

మాజిలాన్‌: అట్లాంటిక్, పసిఫిక్‌ మహాసముద్రాలను కలుపుతుంది.

జిబ్రాల్టర్‌: మధ్యదరా సముద్రాన్ని అట్లాంటిక్‌ మహాసముద్రంతో కలుపుతుంది. 

‣ దీన్ని మధ్యదరా సముద్ర తాళంచెవిగా పేర్కొంటారు.

మ‌హాస‌ముద్రం ఆకారం
ప‌సిఫిక్
అట్లాంటిక్‌ S
హిందూ M
అర్కిటిక్‌ O


మహాసముద్ర అఖాతాలు (Trenches)

‣ మహాసముద్ర మైదానాల్లో ఒక్కసారిగా లోతు పెరిగి, నిట్రమైన వాలు కలిగి ఉన్న సన్నని, ఎక్కువ లోతైన లోయ ప్రాంతాలను మహాసముద్ర అఖాతాలు అంటారు.

 

ప్ర‌ధాన అఖాతాలు మ‌హాస‌ముద్రాలు ప్ర‌త్యేక‌త
మేరియానా/ఛాలెంజ‌ర్ ఫ‌సిపిక్ మ‌హాస‌ముద్రం ప్ర‌పంచంలోనే అత్యంత లోతైన అఖాతం
టోంగా ప‌సిఫిక్ మ‌హాస‌ముద్ర -
‌కుర్లిస్ ప‌సిఫిక్ మ‌హాస‌ముద్రం -
ఎలూషియ‌న్‌ ప‌సిఫిక్ మ‌హాస‌ముద్రం -
అట‌కామా ప‌సిఫిక్ మ‌హాస‌ముద్రం -
ప్యుర్టోరికో అట్లాంటిక్ మ‌హాస‌ముద్రం అట్లాంటిక్ మ‌హాస‌ముద్రంలో అత్యంత లోతైన‌ది.
జావా హిందూ మ‌హాస‌ముద్రం హిందూ మ‌హాస‌ముద్రంలో అత్యంత లోతైన‌ది.
నాన్‌సేన్ అర్కిటిక్ మ‌హాస‌ముద్రం అర్కిటిక్ మ‌హాస‌ముద్రంలో అత్యంత లోతైన‌ది.


 

సింధుశాఖ

‣ భూభాగంలోకి ఇరుకైన సముద్రభాగం ప్రవేశిస్తే దాన్ని సింధుశాఖ అంటారు.

ముఖ్య‌మైన సింధుశాఖ విస్త‌రించిన ప్రాంతం
మెక్సికో సింధుశాఖ ప్ర‌పంచంలో అతిపెద్ద‌ది, అట్లాంటిక్ మ‌హాస‌ముద్రంలో ఉంది.
అమండ్ కెన‌డా ఉత్త‌ర ప్రాంతంలో ఉంది.
హ‌డ్స‌న్ ఏడెన్ కెన‌డాలో ఉంది. ఎర్ర స‌ముద్రం, హిందూ మ‌హాస‌ముద్రాల‌ను క‌లుపుతూ మ‌ధ్య‌లో ఉంటుంది. 
క‌చ్ భార‌త్‌లోని గుజ‌రాత్ తీరంలో ఉంది.
కంబాట్ గుజ‌రాత్ ప‌శ్చిమ తీరంలో ఉంది. 
ఒమ‌న్ హార్మూజ్ జ‌ల‌సంధి ద్వారా ప‌ర్షియ‌న్ గ‌ల్ఫ్‌తో క‌లుస్తుంది. 

 

 

మాదిరి ప్రశ్నలు 


1. కిందివాటిలో ప్రపంచంలో అతిపెద్ద మహాసముద్రం ఏది?

1) హిందూ మహాసముద్రం         2) అట్లాంటిక్‌ మహాసముద్రం

3) పసిఫిక్‌ మహాసముద్రం         4) ఆర్కిటిక్‌ మహాసముద్రం 

 

2. తమిళనాడులోని నాగర్‌కోయిల్‌ నుంచి శ్రీలంకను చేరేందుకు కిందివాటిలో దేన్ని దాటి వెళ్లాలి?

1) సుందా జలసంధి        2) మన్నార్‌ సింధూశాఖ

3) పాక్‌ జలసంధి            4) కచ్‌ సింధూశాఖ 


3. ప్రపంచంలో అత్యంత లోతైన ప్రదేశం ఏది?

1) టోంగా కందకం           2) జావా కందకం

3) ప్యుర్టోరికో కందకం       4) మేరియానా కందకం


4. మధ్యదరా సముద్రం ఏ రెండు ఖండాలను వేరుచేస్తుంది?

1) ఆసియా - ఐరోపా         2) ఐరోపా - ఆఫ్రికా

3) ఉత్తర అమెరికా - దక్షిణ అమెరికా     4) ఆసియా - దక్షిణ అమెరికా


5. కిందివాటిలో ప్రశాంత సముద్రం అని దేన్ని పేర్కొంటారు?

1) పసిఫిక్‌ మహాసముద్రం         2) అట్లాంటిక్‌ మహాసముద్రం

3) హిందూ మహాసముద్రం         4) ఏవీకావు


6. ప్రపంచంలో లోతైన కందకం ఏ సముద్రంలో ఉంది?

1) ఉత్తర అమెరికా సముద్రం     2) పసిఫిక్‌ మహాసముద్రం

3) అరేబియన్‌ సముద్రం         4) అట్లాంటిక్‌ మహాసముద్రం


7. నాటికల్‌ కొలత దేన్ని కొలవడానికి ఉపయోగిస్తారు?

1) సముద్రం ఉపరితల దూరం     2) సముద్రాల లోతు

3) నదులు, సముద్రాల ఉపరితల దూరం    

4) సముద్రాలు, నదుల ఉపరితల దూరం, లోతు 


8.  అంటార్కిటిక్‌ మహాసముద్రానికి ఉన్న మరోపేరు?

1) దక్షిణ మహాసముద్రం         2) ఉప్పు మహాసముద్రం

3) ఉత్తర మహాసముద్రం         4) పూర్వ మహాసముద్రం


9. గల్ఫ్‌ ఆఫ్‌ మన్నార్‌ ఎక్కడ ఉంది?

1) గుజరాత్‌కు పడమర దిశలో     2) తమిళనాడు

3) పశ్చిమ్‌బెంగాల్‌         4) ముంబయికి దక్షిణ దిశలో


సమాధానాలు: 1-3; 2-2; 3-4; 4-2; 5-1; 6-2; 7-1; 8-1; 9-2.


రచయిత: మాన్యం మురళి  

Posted Date : 18-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌