• facebook
  • whatsapp
  • telegram

తెలంగాణలో పాత, కొత్త రాతి యుగాలు  

(చరిత్ర పూర్వయుగం)

తీరాల్లో.. మైదానాల్లో పురాతన ఆవాసాలు!

ఆదిమానవుడు సంచార జీవి నుంచి స్థిర నివాసిగా మారే క్రమంలో వేటను వదిలి వ్యవసాయం నేర్చుకున్నాడు. తొలుత రాతి పనిముట్లు, ఆ తర్వాత లోహపు పనిముట్లతో భూమిని దున్ని పంటలు పండించాడు. ఖాళీ సమయాల్లో కొండ బండలపైనా, గుహల్లోనూ రకరకాల చిత్రాలు గీశాడు. నదీ తీరాలతో పాటు మైదాన ప్రాంతాల్లోనూ నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. కుండల తయారీతో ఆహారం నిల్వలు పెంచాడు. చక్రాల బండ్లను రవాణాకు ఉపయోగించాడు. యుగాల నాటి ఈ పరిణామాలన్నింటికీ తెలంగాణ కేంద్రంగా నిలిచింది. రాతియుగంలో చోటుచేసుకున్న ఆ సంఘటనల వివరాలు, రాష్ట్రంలో నాటి ఆనవాళ్లు  బయటపడిన వివిధ ప్రాంతాల గురించి పోటీ పరీక్షార్థులు సమగ్రంగా తెలుసుకోవాలి. ఆదిమానవుడు ఆధునిక మానవుడిగా మారే క్రమంలో వచ్చిన కాలానుగుణ మార్పులు, ఆయా కాలాల విశిష్ట లక్షణాల గురించి అవగాహన కలిగి ఉండాలి.

తెలంగాణాలో కొన్ని లక్షల ఏళ్ల క్రితం నాటి మానవ జీవిత ఆనవాళ్లు బయటపడ్డాయి. వాటిని పరిశీలించి పలువురు చరిత్రకారులు, శాస్త్రవేత్తలు చరిత్ర పూర్వయుగపు మానవ జీవిత విశేషాలను, వారి    నాగరికత, జీవనశైలిని బహిర్గతపరిచారు.

ఎగువ పాతరాతి యుగం - పనిముట్ల సాంకేతికతలో మార్పు: భౌగోళిక, వాతావరణ పరంగా ఈ యుగం ప్లీస్టోసీన్‌(హిమయుగం) ముగింపు దశను, హోలోసీన్‌(ఉష్ణోగ్రతలు పెరుగుతున్న దశ) ఆరంభ దశను సూచిస్తుంది. ఈ యుగంలో జీవించిన ప్రజలు బ్లేడ్‌పనిముట్లు, పక్క అంచు ఉన్న బ్లేడ్‌పనిముట్లు, కొన్నిచోట్ల ఎముకలతో చేసిన పనిముట్లు వాడారు. రాతి గుహల్లో రంగు బొమ్మలు గీయడం ఈ యుగంలోనే నేర్చుకున్నారు. ఆనాటి మనుషుల స్థావరాలు, పనిముట్లు  తెలంగాణలో కొండదిగువ ప్రాంతాల్లో, నదీతీర పర్యావరణ వ్యవస్థల లోతట్టు ప్రాంతాల్లో వెలుగు చూశాయి. ఆదిలాబాద్‌జిల్లాలోని వాంకిడి, గోదావరి లోయలో ఉన్న చెర్ల, బోర్నగూడెం, లక్నవరం, లింగవరం, పేరవరం, రాయవరం, వీరవరం, ఎల్లవరం; వరంగల్‌జిల్లాలోని ఏటూరునాగారం, పాకాల, కృష్ణానదీ లోయలో ఉన్న ఏలేశ్వరం, నాగార్జునకొండ, చంద్రగుప్త పట్టణం, కదలీవనం, మేడిమాన్‌కల్‌మొదలైన ప్రాంతాల్లో ఎగువ పాత రాతి యుగానికి చెందిన ముఖ్యమైన స్థలాలున్నాయి.

మధ్య రాతియుగం - ప్రగతి పథంలో మరో అడుగు: మధ్య రాతి యుగం భౌగోళిక వాతావరణ పరంగా తొలి హోలోసీన్‌యుగానికి చెందింది. ఆనాటి నుంచి మానవ వికాసానికి ఎక్కువ అనుకూల పరిస్థితులు అందుబాటులోకి వచ్చాయి. ఈ యుగంలో మానవులు అతిచిన్న (సూక్ష్మమైన) రాతి ఆయుధాలు వాడారు. ఈ యుగాన్ని సూక్ష్మరాతి యుగమని కూడా అన్నారు. కేవలం రాతి ఆయుధాలనే వాడిన మానవ యుగాల్లో ఇది చివరిది. దీనితర్వాత వచ్చిన కొత్త రాతియుగంలో రాతితో పాటు, ఎముకలు, లోహపు ఆయుధాలు, పనిముట్లు వాడారు. హైదరాబాద్‌కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రధాన ద్వారం దగ్గర కనిపించే స్మారక శిల వద్ద జరిపిన తవ్వకాల్లో చెర్ట్‌తో చేసిన సూక్ష్మరాతి పనిముట్లు బయటపడ్డాయి. వాటిలో గోకుడు రాళ్లు, బ్యాక్డ్‌బ్లేడ్లు ముఖ్యమైనవి. ఈ ప్రాంతం నదీ తీరంలో లేకపోయినప్పటికీ, మధ్య రాతియుగపు పనిముట్లు దొరికాయంటే, ఆ యుగపు ప్రజలు నదీ తీరాలతో పాటు, విశాలమైన నేలల్లో కూడా నివసించినట్టు తెలుస్తోంది. మధ్య రాతి యుగానికి చెందిన గుహల్లోని రంగు చిత్రాల్లో 150కి పైగా బొమ్మలు కనిపిస్తాయి. వీటిల్లో ప్రధానంగా జింక, చెవులపిల్లి, హైనా, కుక్క, నక్క, తాబేలు, రేఖాగణిత నమూనాలు, ముసుగు ఉన్న మానవాకృతులు, చేతిముద్రలు ఎరుపు రంగులో కనిపిస్తాయి. ఇవి ఎక్కువగా సున్నపురాయి, గ్రానైట్‌రాయి, ఇసుకరాయి కొండ గుహల్లో ఉన్నాయి. ఈ యుగానికి చెందిన మొదటితరం చిత్రలేఖనాలు మహబూబ్‌నగర్‌జిల్లాలోని సంగనోనిపల్లి రాతి గుహల్లో ఉన్నాయి. వాటిల్లో ప్రధానమైనవి జింకల చిత్రాలు. వాటి పరిమాణం పెద్దగా ఉంది. బొమ్మను వేసే కుంచె జింక శిరస్సు నుంచి మొదలై వీపు, పృష్ట భాగం వైపు కదిలినట్లు రంగు క్రమంగా పలుచన కావడాన్ని బట్టి తెలుస్తుంది. ఇదే లక్షణం సంగనోనిపల్లి సమీపంలోని దుప్పడ్‌గట్టు, పోతన్‌పల్లి, మన్నెంకొండ చిత్రాల్లోనూ కనిపిస్తుంది. ఈ యుగపు చిత్రలేఖనాలు రంగారెడ్డి జిల్లాలోని కోకాపేట, కరీంనగర్‌జిల్లాలోని రామగుండం, మెదక్‌జిల్లాలోని హస్తలాపూర్, వరంగల్‌జిల్లాలోని పాండవులగుట్ట, నర్సాపూర్‌లోని రాతిగుహల్లో కూడా ఉన్నాయి.

కొత్త రాతి యుగం- విశిష్ట లక్షణాలు: చెక్కి, తయారుచేసిన రాతిపనిముట్లను, మరో రాతి మీద రుద్ది రుద్ది నునుపుగా చేసుకోవడంతో, ఇలాంటి పనిముట్లు వాడిన మానవుల యుగాన్ని కొత్త రాతియుగమన్నారు. ఈ యుగంలోనే ఎముకలతో కూడిన ఆయుధాలు, పనిముట్లు తయారు చేసుకునేవారు. ఈ యుగం మలిదశలోనే రాగి, కంచు లోహాలతో పనిముట్లు తయారు చేసుకోవడం నేర్చుకున్నారు. వీటి సహాయంతో భూమిని తవ్వి మొక్కలు నాటడం, పెంచడం, పంటలు పండించడం మొదలైంది. పంటలు పండించడం అనే ప్రక్రియ మూడు ముఖ్య పరిణామాలకు దారితీసింది.

1) పంటలు పండే వరకు పంట పొలాల దగ్గరే ఉండాలి. అందుకే అక్కడే ఇళ్లు కట్టుకుని స్థిరనివాసం ఏర్పరచుకోవాల్సి వచ్చింది. ఆ విధంగా కుటుంబం, సమాజం, గ్రామం ఏర్పడ్డాయి.

2) పండిన పంటల నిల్వకు పాత్రలు అవసరమయ్యాయి. అది కుండలు, బానల తయారీకి కారణమైంది. మొదట మట్టితో చేతితోనే కుండలను తయారుచేసి కాల్చి గట్టిపరిచేవారు. తర్వాత కుమ్మరి చక్రం కనుక్కొని, దానిమీద నునుపైన కుండల తయారీ నేర్చుకున్నారు. కుండల తయారీతో నిల్వ ఆలోచన పెరిగి, వ్యక్తిగత ఆస్తి అనే భావన పుట్టింది. దాంతో అంతకుముందున్న సమానత్వ భావన కనుమరుగై, ధనిక - పేద సమాజ ఏర్పాటుకు దారితీసింది.

3) పంటలు పెద్దఎత్తున పెంచడానికి పశువులను మచ్చిక చేసుకున్నారు. పంట ఉత్పత్తుల రవాణాకు చక్రాల బండ్లు అందుబాటులోకి వచ్చి వ్యాపార పుట్టుకకు దారితీశాయి. ఈ విధంగా ఈ యుగంలో మానవులు ఆహార సేకరణ స్థాయి నుంచి ఆహార ఉత్పత్తి స్థాయికి ఎదిగారు. ఈ పరిణామాన్ని ‘గార్డన్‌చైల్డ్‌’ అనే శాస్త్రవేత్త కొత్తరాతి యుగ విప్లవంగా పేర్కొన్నాడు. కొత్త రాతి యుగానికి చెందిన మొదటిదశ ఆవాసాలు గ్రానైట్‌గుట్టలపై లేదా గుట్టల మీదున్న చదునైన ప్రదేశాలపై లేదా లోయల అడుగు భాగాల్లోనో ఉండేవి. కరీంనగర్‌జిల్లాలోని గోదావరి లోయ ప్రాంతంలో పారే మానేరు నదీ తీరంలో తొగర్రాయి, కదం బాపుర్, పెద్ద బొంకూరు లాంటి చాలా ఆవాసాలున్నాయి. ఇదే ప్రాంతంలో పారే పెద్దవాగు తీరంలో కూడా, బుడిగెపల్లి, పాలకొండ, కోలకొండ, దేవరపల్లి లాంటి స్థలాల్లో ఈ కొత్త రాతియుగపు స్థావరాలున్నాయి. తొగర్రాయి ఆవాసంలో పైకి పొడుచుకొచ్చిన గ్రానైట్‌రాతిగుట్టల దగ్గర, పనిముట్లను తయారుచేసే స్థలం లేదా పరిశ్రమ కనిపించింది. కదంబాపూర్‌లో, మహబూబ్‌నగర్‌జిల్లాలో గొడ్డళ్లు సానబట్టే రాళ్లు, మహబూబ్నగర్‌జిల్లాలోని పెద్దరేవళ్ల గ్రామ పరిధిలోని గుట్టపైన ఉన్నాయి. కరీంనగర్‌జిల్లాలోని వెల్గటూరు మండలంలో సానబండ పేరుతో ఒక గ్రామమే ఉంది.


నమూనా ప్రశ్నలు


1. తొలి హోలోసీన్‌యుగం కింది ఏ కాలానికి చెందింది?

1) మధ్య రాతియుగం   2) పాత రాతియుగం   

3) నవీన శిలాయుగం    4) రాక్షసగుళ్ల యుగం


2. ఏ కాలంలో మానవుడు అతిచిన్న రాతి   ఆయుధాలు వాడాడు?

1) ప్రాచీన శిలాయుగం  2) నవీన శిలాయుగం  

3) రాక్షసగుళ్ల యుగం   4) మధ్యరాతి యుగం


3. ఏ యుగంలో ప్రజలు ఎముకల లోహపు ఆయుధాలు వాడారు?

1) పాత రాతియుగం   2) కొత్త రాతియుగం  

3) కాంస్య యుగం    4) రాక్షసగుళ్ల యుగం


4. ఏ కాలానికి చెందిన గుహల్లోని రంగు చిత్రాల్లో రేఖాగణిత నమూనాలు కనిపిస్తాయి?

1) కొత్త రాతియుగం   2) కాంస్య యుగం 

3) అయో యుగం   4) మధ్య రాతియుగం


5. మధ్య రాతియుగానికి చెందిన మొదటి తరం చిత్రలేఖనాలు ఏ ప్రాంతంలో ఉన్నాయి?

1) నేలకొండపల్లి     2) కోటిలింగాల  

3) కొండాపూర్‌     4) సంగనోనిపల్లి


6. ఏ కాలంలో మానవులు స్థిరనివాసం ఏర్పరచుకోవాల్సి వచ్చింది?

1) కాంస్య యుగం    2) అయో యుగం  

3) కొత్త రాతియుగం   4) రాక్షసగుళ్ల యుగం


7. కుమ్మరి చక్రాన్ని ఏ యుగంలో కనుక్కున్నారు?

1) అయో యుగం    2) ఇనుప యుగం  

3) బ్రాంజ్‌యుగం   4) కొత్త రాతి యుగం


సమాధానాలు: 1-1; 2-4; 3-2; 4-4; 5-4; 6-3; 7-4. 


రచయిత: డాక్టర్‌ఎం.జితేందర్‌రెడ్డి  

Posted Date : 10-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌