• facebook
  • whatsapp
  • telegram

ప్రదర్శన కళారూపాలు

తెలంగాణలో సంగీత, నృత్య సంబంధమైన కళారూపాలే కాకుండా మరెన్నో ప్రదర్శన రూపాలు ఉన్నాయి. ఇవి ఎంతో మంది కళాకారులకు జీవనోపాధిని కల్పించి ప్రజలకు విజ్ఞాన, వినోదాలను అందిస్తున్నాయి. మరికొన్ని సంఘంలోని దురాచారాలను ఎండగడుతూ ప్రజలను చైతన్యవంతులను చేయడంలో తోడ్పడుతున్నాయి.
 

తోలుబొమ్మలాట: 'తోలుబొమ్మలాట' కళారూపం ప్రాచీన కాలం నుంచే ఉన్నట్లు సాహిత్యాధారాలు లభించాయి. శ్రీశైలం శివరాత్రి ఉత్సవాల్లో తోలుబొమ్మలాటను ప్రదర్శించినట్లు పాల్కురికి సోమన 'పండితారాధ్య చరిత్ర'లో పేర్కొన్నారు. శ్రీనాథుడి 'పల్నాటి వీర చరిత్ర', 'భాస్కర శతకం'లో తోలుబొమ్మలాట ప్రస్తావన ఉంది. తోలుబొమ్మలాట సమాహార కళారూపం. సంగీతం, సాహిత్యం, నాట్యం, చిత్రలేఖనానికి సమప్రాధాన్యం ఉంటుంది. ప్రదర్శనకు సిద్ధం చేసిన తోలుబొమ్మలను తెల్లని పారదర్శకమైన తెరవెనుక నుంచి సూత్రాల సాయంతో పట్టి ఉంచి, సన్నివేశాలకు అనుగుణంగా సూత్రధారుడు వాటిని ఆడిస్తాడు. దాదాపు నాటక ప్రదర్శనకు ఉండాల్సిన సర్వహంగులతో కథను నడిపిస్తారు. కుటుంబంలోని సభ్యులే ఆయా పాత్రలకు వాచికం చెప్పి ఆడిస్తారు.
    ప్రధానంగా రామాయణ, భారత కథల్లోని ఘట్టాలనే ప్రదర్శనకు ఎంచుకుంటారు. వాచికానికి ఉపయోగించే సాహిత్యాన్ని యక్షగానాల నుంచి స్వీకరిస్తారు. బొమ్మల తయారీలో దుష్ట పాత్రలకు మేక చర్మాన్ని, మంచి పాత్రలకు జింక చర్మాన్ని ఉపయోగిస్తారు. కథాక్రమాన్ని అనుసరించి పాత్రలను (బొమ్మలను) తెరమీద ప్రవేశపెడతారు. ఆటను గణపతి పూజతో ప్రారంభించడం ఆనవాయతి. గాత్రం, తాళం, హార్మోనియం, మృదంగం వాయించే కళాకారులంతా తెర లోపలే కూర్చొని ఉంటారు. ఇందులో సూత్రధారుడిదే కీలకపాత్ర. జుట్టు పోలిగాడు, బంగారక్క, కేతిగాడు ప్రధాన హాస్యపాత్రలు.

 

బుట్టబొమ్మలాట: బుట్టబొమ్మలను పేడతో తయారు చేస్తారు. పెళ్లి ఊరేగింపులు, జాతర్లు, ఉత్సవాల సందర్భాల్లో 'బుట్టబొమ్మలాట'ను ప్రదర్శిస్తారు. పురుషులు మాత్రమే ఆడించడం ఈ కళారూపం విశిష్టత. పై భాగమంతా బొమ్మతో ఉండి, లోపలి భాగం డొల్లగా ఉంటుంది. బొమ్మ కాళ్లు, నోటి భాగంలో రంధ్రాలు ఉంటాయి. ఆటగాడు బొమ్మల లోపలి భాగంలో దూరి ఆడుతుంటే చూసేవారికి బొమ్మ మాత్రమే నాట్యం చేస్తున్నట్లు కనిపిస్తుంది. బొమ్మల్లో ఒకటి స్త్రీది కాగా మరొకటి పురుషుడిది. కొన్ని బొమ్మలు సింగి, సింగడుగా ఉంటాయి. ప్రజలకు వినోదాన్ని పంచే ఈ కళారూపం ప్రస్తుతం కనుమరుగైంది.
 

చోడిగాని కలాపం: తెలంగాణలో ప్రధానంగా దసరా పండగ సందర్భాల్లో ప్రదర్శించే వేషాల్లో చోడిగాని వేషం ఒకటి. ఈ వేషధారణ హాస్యాన్ని పుట్టిస్తుంది. ముఖం నిండా సున్నం బొట్లు, వాటి మధ్య నల్లటి చుక్కలు, తలకు నల్లని వస్త్రం చుట్టుకొని దాని మధ్యలో కాకి ఈకలు, నడుముకు గోచీ, భుజాన జోలే, చేతిలో దుడ్డుకర్ర పట్టుకొని వీధుల్లోకి ప్రవేశించి హడలెత్తిస్తుంటాడు. తోలుబొమ్మలాటలో జుట్టు పోలిగాడిలా చోడిగాని కలాపంలో చోడిగానిదే కీలకపాత్ర. ఈ పాత్ర కేవలం హాస్యంగానే కాక కథానాయకుడి పాత్రను కూడా పోషిస్తుండటం విశేషం. దైనందిన జీవితంలో బాగా ప్రాచుర్యం పొందిన పాత్ర సోలిగాడు. పనీ పాట లేకుండా గాలి తిరుగుడు తిరిగేవారిని సోడిగాడు, సోలిగాడు అనడం పరిపాటైపోయింది.
 

పగటి వేషాలు: ప్రజలకు విజ్ఞాన, వినోదాలను పంచే కళారూపాలను కేవలం రాత్రి సమయాల్లోనే ప్రదర్శిస్తుంటారు. కానీ వీటిని ప్రదర్శించే కళాకారులు, భిక్షువులు పగటి సమయంలోనే ఈ వేషాలు ధరించి ప్రదర్శిస్తుండటంతో 'పగటి వేషాలు/పగటి వేషగాళ్లు' అనే పేరు వచ్చింది. వీరినే 'బహురూపులు' అని కూడా వ్యవహరిస్తారు. తమ వేషధారణ, పాత్రల ద్వారా సమాజంలో పాతుకుపోయిన మూఢనమ్మకాలు, దురాచారాలను వ్యంగ్యంగా, హాస్య ధోరణిలో వ్యక్తం చేస్తూ ప్రజలను చైతన్యపరిచేవారు. ఎదుటి వారి మనసు నొప్పించకుండా తమ సాహిత్యంతో సమాజంలోని చెడును ఎండగట్టడం వీరి ప్రత్యేకత. పాల్కురికి సోమనాథుడి బసవ పురాణం, పండితారాధ్య చరిత్రల్లో బహురూపుల ప్రదర్శనను ప్రస్తావిస్తూ శ్రీశైలంలోని శివరాత్రి ఉత్సవాల్లో వీటిని ప్రదర్శించే వారని తెలిపారు. యథావాక్కుల అన్నమయ్య సర్వేశ్వర శతకంలోనూ నాటక ప్రదర్శన గురించి చెబుతూ బహురూపులను ప్రస్తావించాడు. కాకతీయుల కాలంలో యుగంధర మహా మంత్రి పిచ్చివాడిగా నటించి 'ఢిల్లీ సుల్తాన్, పట్టుకుపోతాన్' అంటూ పగటి వేషగాడి పాత్ర ద్వారానే విజయం సాధించాడని తెలుస్తోంది. పగటివేషాల్లో ప్రధానమైనవి ఫకీరు, రెడ్డి, పంతులు, పఠాన్, తాగుబోతు, కోమటి, గారడి వేషాలు. పగటివేషాల్లో ప్రసిద్ధి చెందినవి బుడబుక్కల, తహశీల్దార్, పాములవాడు, ఎరుకల, దొమ్మరి, బోగం, కోయ, పిట్టలదొర, భట్రాజు, గొల్లభామ, సింగి - సింగడు వేషాలు మొదలైనవి. పాత్రధారి ఏ వేషం వేస్తే ఆ పాత్రోచిత భాషను ప్రయోగించి, తన హావభావాలతో అలరించి ప్రజలకు వినోదాన్ని పంచడమే ప్రధానంగా కనిపిస్తుంది.
 

దొమ్మరాట: ఇది కూడా ప్రాచీన కాలం నుంచే ప్రచారంలో ఉన్న ప్రదర్శన కళ. దీన్నే 'సర్కస్' అని కూడా అంటారు. జనసమ్మర్థమైన ప్రదేశాల్లో, నాలుగు వీధులు కలిసే చోట ఈ ప్రదర్శనలను నిర్వహించేవారు. ఒక పొడవాటి వెదురుగడను పాతి పురుషుడు డోలు వాయిద్యాన్ని వాయిస్తుండగా, స్త్రీ వివిధ రకాలైన సాహస విన్యాసాలను ప్రదర్శిస్తుంది. పాల్కురికి సోమన రచనల ద్వారా క్రీ.శ.13వ శతాబ్దం నుంచే 'దొమ్మరాట' ప్రదర్శించే వారని తెలుస్తోంది. దొమ్మరిసానులు వెదురుగడలపై ఆకాశంలో అప్సరసలు ఆడుతున్న భ్రమను కలిగించేవారని ఆయన తెలిపాడు.
గారడీ విద్యలు: గారడీ విద్యలు తెలుగునాట పూర్వకాలం నుంచే ప్రచారంలో ఉన్నాయని తెలుస్తోంది. పాల్కురికి సోమన తన పండితారాధ్య చరిత్రలో గారడీవారు మోకులపై ఆడినట్లు ప్రస్తావించాడు. పొడవైన చువ్వను ఆకాశంలోకి విసరగానే అది వెదురుగడలా నిలబడటం, గారడీవాడు తాడు మీద నిచ్చెన ఎక్కినట్లుగా జరజరాపాక్కుంటూ వెళ్లి మాయమై, తిరిగి ప్రత్యక్షమై చిత్ర విచిత్రమైన విన్యాసాలను ప్రదర్శిస్తాడు. నేటికీ పల్లెల్లో ఈ విద్యను ప్రదర్శించే కళాకారులున్నారు. వేపాకులు దూసి తేళ్లను రప్పించడం, అరచేతిలో రూపాయి నాణేలను సృష్టించడం, గొంతు కోసి రక్తం చూపించడం; మన వద్ద ఉన్న వస్తువులు, సొమ్ములను మాయం చేసి మరొకరి జేబులోకి రప్పించడం వంటి అనేక ప్రదర్శనలు గారడీ కళాకారులు చేస్తారు.

 

విప్రవినోదులు: వీరు కూడా ఇంద్రజాల ప్రదర్శన వంటి గారడీ విద్యలనే ప్రదర్శిస్తారు. విప్రులను మాత్రమే యాచిస్తూ జీవనాన్ని గడుపుతారు. ఒక విశాలమైన ప్రాంతంలో నాలుగు వీధులు కలిసే చోట ఒక చిన్న పందిరిలో (శాలువాలతో) ప్రదర్శనను నిర్వహిస్తారు. వీరు రాళ్లు, రప్పలతో దేవతల విగ్రహాలను తయారు చేస్తారు. పందిరిలో ఒక కర్రకు కట్టి ఉంచిన వ్యక్తి, పందిరి తెరను ఎత్తి చూసేలోగా మరో కర్రకు కట్టి ఉన్నట్లుగా దర్శనమిస్తాడు. ఒక ఖాళీ అలమరాను పందిరి లోపల ఉంచి చూపిస్తారు. ముఖ్య కళాకారుడు తాటాకుల గ్రంథంలో తెరల మధ్యలోకి వెళ్లి పావుగంట వరకు లోపలనే ఉంటాడు. ఈలోగా బయట భజన కార్యక్రమం మొదలై, అది పూర్తికాగానే తెరను తొలగిస్తారు. అప్పటి వరకు ఖాళీగా ఉన్న అలమరాలో దేవతల విగ్రహాలు, దీపారాధనతో వెలుగుతున్న జ్యోతులు, పుష్పాలు, ఫలాలు, నైవేద్య ప్రసాదాలు, పిండి వంటలు దర్శనమిస్తాయి. ఇది నిజంగా అద్భుతమైన ప్రదర్శన రూపం. ప్రజలను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంది.
 

గొల్లసుద్దులు: సుద్దులు చెప్పుకుంటూ గొల్లలను యాచించే కళాకారులనే 'గొల్లసుద్దులు' అంటారు. ఇదొక విశిష్టమైన కళారూపం. గొల్ల/యాదవుల చరిత్రకు సంబంధించిన శ్రీకృష్ణుడి లీలలు, కాటమరాజు కథను గొల్లసుద్దులు గానం చేస్తారు. వీరు తమ కథాగానం కోసం కథా వివరాలను చెప్పడానికి పెద్ద వస్త్రాలపై చిత్రించిన బొమ్మలను ఉపయోగిస్తారు.
      ఆధునిక యుగంలో గొల్లసుద్దుల కళారూపం ప్రచార మాధ్యమంగా కూడా పరిణామం చెందింది. చేతిలో కర్ర, భుజాన గొంగడి వేసుకొని సమాజాన్ని పట్టి పీడిస్తున్న దురాచారాలు, మూఢనమ్మకాలను వ్యంగ్యంగా, ఎత్తి పొడుపు ధోరణిలో ప్రదర్శించేవారు. ప్రసార మాధ్యమాలు కూడా ఈ కళారూపానికి విశేషంగా ప్రాచుర్యాన్ని కల్పిస్తున్నాయి. సామాజిక చైతన్యమే పరమావధిగా జన నాట్యమండలి, ప్రజా నాట్యమండలి వంటి వామపక్ష సంస్థలు తమ ప్రచారంలో భాగంగా 'గొల్లసుద్దులను' తిరుగులేని ఆయుధంగా మలచుకున్నాయి.

 

సాధనాశూరులు: వీరు పద్మశాలీలను మాత్రమే యాచిస్తారు. ప్రదర్శన కూడా విప్రవినోదుల ప్రదర్శన మాదిరిగానే ఉంటుంది. ఎదురు రొమ్ము మీద పెద్ద పెద్ద బండలను ఉంచి వాటిని సుత్తెలతో పగలగొట్టడం, బుగ్గల్లో ఇనుప చువ్వలను గుచ్చుకోవడం, ముక్కు ఒక రంధ్రంలోకి నీటిని పంపి మరో రంధ్రంలో నుంచి బయటకు రప్పించడం, చొప్పబెండ్లతో తయారు చేసిన బండెక్కి ఊరేగడం, మనిషి తలపై పొయ్యిని వెలిగించి పిండి వంటలు చేయడం లాంటి విద్యలను ప్రదర్శించేవారు.
 

జంతరు పెట్టె: ఇది మాయల ఫకీరు పెట్టె లాంటింది. జంతరవాడు దీనిలో చేయి పెట్టి అనేక అద్భుతాలను సృష్టిస్తాడు. రకరకాల వస్తువులు, బొమ్మలను ఒకదాని తర్వాత ఒకటి తీస్తూ వాటిని ప్రదర్శిస్తాడు. ఈ విధంగా తెలంగాణలోని ఎన్నో ప్రదర్శన కళలు ప్రజలను రంజింపజేస్తూ, వాటినే వృత్తిగా నమ్ముకొని ఆచరిస్తున్న భిక్షువులకు, జానపద కళాకారులకు వెలుగులు పంచుతున్నాయి.

Posted Date : 19-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌