• facebook
  • whatsapp
  • telegram

కాలుష్యం

యావత్తు భూమండలం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో కాలుష్యం ఒకటి. మానవ జీవనం ప్రశాంతంగా సాగిపోవడానికి తోడ్పడే ప్రకృతిని దారుణంగా దెబ్బతీస్తున్న కాలుష్యం ఫలితంగా ఎన్నో దుష్ప్రభావాలు కనిపిస్తున్నాయి. ప్రధాన జీవాధారాలైన గాలి, నీరు, పర్యావరణం తీవ్రంగా కలుషితం అవుతున్నాయి. ఇందుకు దారితీసిన పరిస్థితులు, అనంతర పరిణామాలపై టీఎస్‌పీఎస్సీ అభ్యర్థుల కోసం అందిస్తున్న అధ్యయన సమాచారం..


భూగోళం నాలుగు ఆవరణాలతో కూడి ఉంది. అవి శిలావరణం, జలావరణం, వాతావరణం, జీవావరణం. ఈ ఆవరణాలన్నింటిని కలిపి పర్యావరణం అంటారు. ఒక జీవి చుట్టూ ఉండే భౌతిక, రసాయనిక, జీవ పరిస్థితులను పర్యావరణం లేదా పరిసరాలు అని చెప్పవచ్చు. ఈ పర్యావరణాన్ని అనేక రకాల కాలుష్యాలు దెబ్బతీస్తున్నాయి.


కాలుష్యం అంటే..?
భౌతిక, థర్మల్, జైవిక, రేడియోధార్మిక ధర్మాల్లో సంభవించే మార్పులు జీవుల ఆరోగ్యం, భద్రతకు హాని కలిగించే విధంగా ఉంటే దాన్ని కాలుష్యంగా పరిగణిస్తారు. ప్రస్తుత సమాజంలో వేగంగా విస్తరిస్తున్న ఆరోగ్య సమస్యలకు కాలుష్యమే ప్రధానమైన కారణం. కాలుష్యానికి గురవుతున్నవారిలో మహిళలు, పిల్లలే ఎక్కువ. 1972 జూన్ 5న స్టాక్‌హోంలో ప్రపంచ పర్యావరణ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె చేసిన ప్రసంగంలో పర్యావరణ ప్రాధాన్యాన్ని వివరించారు. ప్రకృతి, పర్యావరణం గురించి చర్చించిన అధర్వణ వేదంలోని కొన్ని అంశాలను ప్రస్తావించారు. పూర్వీకులు ప్రకృతిని ఆరాధించేవారని.. భూమి, గాలి, నీరు, ఆకాశం, అంతరిక్షం - వీటిలోని సమస్త జీవ జాతులన్నింటిలోనూ శాంతి పరిఢవిల్లాలని ప్రార్థించేవారని తన ప్రసంగంలో పేర్కొన్నారు. పర్యావరణం కలుషితం కాకుండా చూడాలని, ప్రకృతి సమతౌల్యం సాధిస్తేనే భూమండలంపై ఉన్న సమస్త జీవులు సురక్షితంగా ఉండగలుగుతాయని పిలుపునిచ్చారు.


కాలుష్య కారకాలు
జనాభా విస్ఫోటమే అన్ని రకాల కాలుష్యానికి ప్రధాన కారణం. తారు, చెత్త లాంటి వ్యర్థ పదార్థాలు; సల్ఫర్ డై ఆక్సైడ్, కార్బన్ డై ఆక్సైడ్, అమ్మోనియం, ఫ్లోరిన్, క్లోరిన్, హైడ్రోజన్ లాంటి వాయువులు; ఫ్లోరైడ్ లాంటి రసాయన పదార్థాలు; సీసం, ఇనుము, జింకు, పాదరసం లాంటి మూలకాలు; హెర్బిసైడ్లు, క్రిమిసంహారక మందులు, కృత్రిమ ఎరువులు, రేడియో ధార్మిక పదార్థాలు, శబ్దం, అధిక ఉష్ణం.. ఇవన్నీ కాలుష్య కారకాలే. జనాభా విపరీతంగా పెరగడంతో నీటి వినియోగం కూడా ఎక్కువైంది. ఇది కూడా కాలుష్యానికి కారణమవుతోంది.


జల కాలుష్యం
సమస్త జీవులకు నీరు ప్రాణాధారం. తాగడానికి, పంటలకు, వ్యవసాయానికి, పరిశ్రమలకు, మానవ నిత్యావసరాలకు నీరు చాలా అవసరం. జల కాలుష్యంతో నీటి స్వభావం మారిపోతోంది. ఉపయోగానికి పనికి రాకుండా పోతోంది. అంతేకాదు దాని ఉపయోగం ప్రమాదకరం కూడా. అన్ని ప్రాంతాల్లో కావాల్సినంత పరిమాణంలో మంచినీరు లభించడం లేదు.


ప్రాణకోటికి ప్రమాదకరమైన అదనపు పదార్థాలు నీటిలో కలవడాన్ని జల కాలుష్యంగా నిర్వచించవచ్చు. ఇది జీవరాశులకు తీవ్రమైన హాని కలిగిస్తుంది. స్వచ్ఛమైన నీటిలో ఆక్సిజన్, హైడ్రోజన్, సేంద్రీయ సమ్మేళనాలు, ఫాస్ఫేట్‌లు, ఒండ్రుమట్టి, సూక్ష్మజీవులు లాంటివి కలిసి ఉంటాయి. కాలుష్యం వల్ల వీటి మధ్య సమతౌల్యం దెబ్బతింటుంది.


జల కాలుష్య కారకాలు
1) మురుగు వ్యర్థ పదార్థాలు
2) అంటు వ్యాధుల ఏజెంట్లు
3) విదేశీ సేంద్రీయ రసాయనాలు
4) రసాయనిక ఖనిజ పదార్థాలు, సమ్మేళనాలు


పర్యావరణ సమస్యలు
పరాన్నజీవులు, సూక్ష్మజీవులను తనలో ఇముడ్చుకుని నీరు కలుషితమవుతుంది. వాస్తవానికి ఎన్నో వ్యాధులు, ఇతర పర్యావరణ ప్రమాదాల కంటే నీటి కాలుష్యమే ప్రధానమైంది. విపరీతంగా పెరుగుతున్న జనాభా, పారిశ్రామికీకరణ వల్ల స్వచ్ఛమైన నీటికి కొరత ఏర్పడుతోంది. కలుషిత నీరు వివిధ రోగాలకు కారణమవుతోంది. భారతదేశంలో 80 శాతం వ్యాధులు జల కాలుష్యం వల్ల సంభవిస్తున్నాయి.


నీటి కాలుష్య దుష్ఫలితాలు
* కలరా, టైఫాయిడ్, విరోచనాలు లాంటి వ్యాధులు సంక్రమించడం.
* జలచరాలు.. ముఖ్యంగా చేపలు చనిపోవడం. దాంతో జల ఆహార నిల్వలు తగ్గిపోవడం.
* నీటిలో ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా ఉన్న సందర్భాల్లో దంతాలపై ఉండే ఎనామిల్ ఊడిపోవడం, గారకట్టడంతోపాటు ఎముకలు దెబ్బతినడం.
* నైట్రేట్‌లు ఎక్కువగా ఉంటే చిన్నపిల్లల రక్తం నీలిరంగులోకి మారి ఒక రకమైన వ్యాధి బారిన పడటం.
* నీటిలో ఫాస్ఫేట్‌లు ఎక్కువై జలచరాలు చనిపోవడం.
* నీటిలో కొన్నిరకాల విష రసాయనాల ప్రమాణం ఎక్కువైన సందర్భాల్లో పిల్లలు కురూపులు, వికలాంగులుగా జన్మించడం.


నివారణ చర్యలు
* పారిశ్రామిక మురుగులో సేంద్రీయ పదార్థాలైన కర్బనం, నత్రజని, గంధకం, సీసం, పాదరసం లాంటి రసాయనాలు ఉంటాయి. ఈ మురుగు సహజ నీటివనరుల్లో కలిస్తే అవి కలుషితం అవుతాయి.
* పరిశ్రమలు విడుదల చేసే మురుగును శుద్ధిచేసే బాధ్యతను ఆయా పారిశ్రామిక యాజమాన్యాలే నిర్వహించి, మురుగు శుద్ధి కర్మాగారాలను నెలకొల్పాలి.
* ఇళ్లలోని మురుగుకోసం ఆక్సిడేషన్ సాండ్స్, సెప్టిక్ ట్యాంకులను ప్రతి ఇంటిలో నిర్మించుకోవాలి. మురుగునీటిని శుద్ధి చేయకుండా వదలడం శిక్షార్హమైన నేరం.
* కాలుష్య నియంత్రణ పట్ల ప్రజల్లో అవగాహన కలిగించాలి.
* కాలుష్య నివారణకు దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందించి అమలు చేయాలి.


ధ్వని కాలుష్యం
మనం వినగలిగే శబ్దాల మోతాదుకు మించి వినే శబ్దాన్నే ధ్వని కాలుష్యం అనవచ్చు. వాహనాలు, పరిశ్రమలు, లౌడ్ స్పీకర్లు వంటివి ధ్వని కాలుష్య కారకాలు.
బహిరంగ ప్రదేశాల్లో ఉదయం 50 డెసిబుల్స్‌కి మించని ధ్వని ఆరోగ్యకరమైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) నివేదికలు తెలుపుతున్నాయి. పర్యావరణ నిపుణులు ధ్వని కాలుష్యం సుమారు 70 డెసిబుల్స్ స్థాయిని మించి ఉండరాదని చెబుతున్నారు. వివిధ పట్టణాలు, నగరాల్లో రద్దీ సమయాల్లో ప్రధాన రహదారుల్లో ధ్వని కాలుష్యం 90 నుంచి 110 డెసిబుల్స్ వరకు ఉంటోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన ప్రమాణాలు, పరిమితుల ప్రకారం.. ధ్వని తీవ్రత పారిశ్రామిక వాడల్లో రాత్రి 65 డెసిబుల్స్, పగలు 75 డెసిబుల్స్; నివాస ప్రాంతాల్లో రాత్రి 45 డెసిబుల్స్, పగలు 55 డెసిబుల్స్; ఆస్పత్రుల వద్ద రాత్రి 45 డెసిబుల్స్, పగలు 50 డెసిబుల్స్ మించి ఉండకూడదు.
* రైల్వేలు, పరిశ్రమలు, నిర్మాణ రంగ కార్యకలాపాలు, ప్రజా సమూహాలు, లౌడ్ స్పీకర్‌లు.. ఇవన్నీ ధ్వనిని వ్యాప్తి చేస్తాయి. ధ్వని ఎక్కువగా ఉన్నప్పుడు పర్యావరణంలో అసమతౌల్యం ఏర్పడుతుంది. ఇలా నిరంతర ధ్వని కాలుష్య ప్రభావం వల్ల శ్రామిక సామర్థ్యం, వారి వృత్తిపరమైన పనితీరు క్షీణిస్తుంది.


ధ్వని కాలుష్య సమస్యలు
* నిద్రలేమి
* తొందరగా అలసిపోవడం
* వికారం, అధిక రక్తపోటు
* అల్సర్లు, రక్తహీనత, నరాలపై తీవ్ర ప్రభావం
* తలనొప్పి, శ్వాస సంబంధ వ్యాధులు, వినికిడి సమస్యలు
* మెదడు, నాడీ వ్యవస్థ క్రమంగా దెబ్బతిని, చికాకు పెరగడం.


వాయు కాలుష్యం
వాతావరణంలో వాయువులు సాధారణ నిష్పత్తిలో ఉన్నంత వరకు కాలుష్యం ఉండదు. కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డై ఆక్సైడ్, నైట్రోజన్ డై ఆక్సైడ్, ధూళి కణాలు, పొగ, పొగమంచు లాంటివి గాలిలో అధికంగా చేరడం వల్ల వాయు కాలుష్యం ఏర్పడుతుంది.


వాయు కాలుష్య కారణాలు
* నిబంధనలను పాటించని వ్యవసాయ కార్యకలాపాలు
* పదార్థాల దహనం
* యంత్రాల సహాయంతో జరిగే ఉత్పత్తి ప్రక్రియలు
* ద్రావణాల ఉపయోగం
* అణుధార్మిక పదార్థాల వినియోగం


దుష్ప్రభావాలు
వాయు కాలుష్యం మానవుడి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఇది శ్వాస, రక్త ప్రసరణ వ్యవస్థల మీద ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.
* కార్బన్ మోనాక్సైడ్ రక్తంలోని హిమోగ్లోబిన్‌తో కలిసిపోయి శరీరానికి తగినంత ఆక్సిజన్ అందకుండా చేస్తుంది.
* సల్ఫర్ డై ఆక్సైడ్ ఊపిరితిత్తులపై ప్రభావాన్ని చూపుతుంది. ఆస్తమాకు కారణమవుతూ, మరణాల రేటును పెంచుతుంది.
* నైట్రోజన్ డై ఆక్సైడ్ - బ్రాంకైటీస్, ఆస్తామా వ్యాధులను కలిగిస్తుంది.
* గాలిలో అధిక పరిమాణంలో ఉన్న సీసం ఎముకలు, కాలేయం, గుండె, మూత్రపిండాల పనితీరుపై చెడుప్రభావాన్ని చూపుతుంది.
* శిలాజ ఇంధనం అధికంగా వాడటం వల్ల గాలిలో కార్బన్ డై ఆక్సైడ్ శాతం పెరిగి హరితగృహ ప్రభావానికి దారితీస్తుంది.


నివారణ చర్యలు
* వాయు కాలుష్యాన్ని నివారించేందుకు బ్యాగ్ ఫిల్టర్స్, ఎలక్ట్రోస్టాటిక్ ప్రెస్పిటేటర్స్ లాంటి నియంత్రణ పరికరాలను ఉపయోగించాలి.


రేడియో ధార్మిక కాలుష్యం
రేడియేషన్‌కు గురికావడం ప్రకృతి సహజమే అయినా అణువిద్యుత్తు, అణ్వస్త్రాల ఉత్పత్తి భారీస్థాయిలో చేపట్టడం వల్ల మానవులు భారీ పరిమాణంలో రేడియేషన్‌కు గురవుతున్నారు. ఆయా సంస్థలు, పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు, ఉద్యోగులు ప్రత్యక్షంగా రేడియో ధార్మికతకు గురవుతున్నారు. ఫలితంగా క్యాన్సర్, జన్యు సంబంధ వ్యాధులబారిన పడుతున్నారు. పిల్లలు అనారోగ్యంతో జన్మిస్తున్నారు.


ముఖ్యాంశాలు
* ప్రపంచం మొత్తం ఆందోళన చెందుతున్న ప్రధాన సమస్యల్లో పర్యావరణ కాలుష్యం ఒకటి.
* ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహించిన ఒక సర్వేలో తేలిందేమిటంటే.. ఒక్క భారతదేశంలోని ఆరు ప్రధాన నగరాల్లోనే ఏటా సుమారు 40-50 వేల మంది కాలుష్యం వల్ల చనిపోతున్నారు.
* భారతదేశంలోని సహజ నీటి వనరుల్లో సుమారు 80 శాతం నీరు కలుషితమై.. మనుషులు, జంతువులు, పశుపక్ష్యాదులకు కూడా తాగడానికి పనికిరావడం లేదని ఇటీవల ఒక సర్వేలో తేలింది.
* తెలంగాణలో గోదావరి నదీతీరం వెంబడి ఉన్న సిర్‌పూర్‌లో కాగితపు వ్యర్థాలు, అక్కడి ప్రజలు గోదావరిలోకి వదిలే కాలుష్యాలు ఏటూరునాగారం ప్రజలపై ప్రభావం చూపిస్తాయి. ఈ రెండు ప్రాంతాల కలుషితాల ప్రభావం భద్రాచలం మీద ఉంటుంది.
* ప్రపంచం మొత్తం వాతావరణ కాలుష్యంలో సగానికి పైగా కాలుష్యానికి ఒక్క అమెరికాయే కారణమవుతోంది.


అత్యంత కలుషితమై'నది' గంగా
భారతదేశంలోని గంగానది సుమారు 1760 కి.మీ.ల మేర కలుషితమై ప్రపంచంలో అత్యంత పొడమైన కలుషిత నదిగా మారడంతో.. ఈ పరిస్థితిని నివారించేందుకు ఎన్‌డీఏ ప్రభుత్వం రూ. 10 వేల కోట్లను కేటాయించింది. 'గంగానది ప్రక్షాళన' పేరుతో కేంద్ర జలవనరుల సంఘం నివారణ చర్యలు చేపడుతోంది. దీనికి ప్రధాన కారణం.. దేశ విస్తీర్ణంలో గంగానది పరివాహక ప్రాంతం 8.61 లక్షల చదరపు కిలోమీటర్లు (1/4వ వంతు) ఉండి.. 45 కోట్ల మంది ప్రజలు జీవిస్తుండటమే.

Posted Date : 08-12-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌