• facebook
  • whatsapp
  • telegram

భారతదేశంలో జనాభా తీరుతెన్నులు

* ఒక ప్రదేశంలో నివసించే జనసంఖ్యను జనాభా (Population) అంటారు. ఒక ప్రదేశంలో ప్రతీ చదరపు కిలోమీటరు విస్తీర్ణంలో నివసించే జనసంఖ్యను జన సాంద్రత  (Density) అంటారు.
* మరణాల రేటు తగ్గుతూ, జననాల రేటు పెరుగుతుండటం వల్ల మొత్తం జనాభాలో పెరుగుదల కనిపిస్తుంది. ఇలా జనాభా పెరగడాన్ని ‘జనాభా విస్ఫోటనం’ (Population Explosion) అంటారు. 
* ఆర్థికాభివృద్ధి అనేది భౌతిక, సహజ వనరులపైనే కాకుండా మానవ వనరులపై కూడా ఆధారపడుతుంది.
* మానవ వనరులు అంటే ముఖ్యంగా దేశంలోని జనాభా, వారి విద్యా ప్రమాణాలు, ఆరోగ్యం, పౌష్ఠికాహార విధానాలు, నిరుద్యోగం, పేదరికం, ఆర్థిక అసమానతలు, ఆదాయ పంపిణీ మొదలైనవి.
* మానవ వనరుల్లో ముఖ్యమైంది జనాభా.
* ఒక దేశంలోని జనాభా గుణాత్మకత  (Quality) అంటే జనాభా పరిమాణం, పెరుగుదల తీరు, పెరుగుదల రేటు అభివృద్ధి ప్రక్రియను ప్రభావితం చేస్తాయి. అందుకే జనాభా పెరుగుదలను ఒక దేశ అభివృద్ధిని నిర్దేశించే అంశంగా పేర్కొంటారు.  
* ఒక దేశ జనాభా అభిలషణీయ స్థాయి  (Optimum) కంటే తక్కువగా ఉంటే జనాభా పెరుగుదల ఆ దేశ ఆర్థికాభివృద్ధికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. జనాభా అభిలషణీయ స్థాయిని దాటి ఇంకా పెరిగితే అది అభివృద్ధికి ఆటంకంగా మారుతుంది. సాధించిన ఆర్థికాభివృద్ధి పెరుగుదలనూ హరించివేస్తుంది.
* జనాభా పెరుగుదలకు సంబంధించి పలువురు ఆర్థికవేత్తలు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు. 
* ‘భూమిపై పుట్టే ప్రతి బిడ్డ ఒక అభివృద్ధి కారకం అవుతాడు’ - ఎడ్విన్‌ కానన్‌
* ‘భూమిపై పుట్టే ప్రతి బిడ్డ నరకాన్ని పెంపొందిస్తాడు’ - మాల్థస్‌
* 1798లో థామస్‌ రాబర్ట్‌ మాల్థస్‌ రాసిన “An Essay on the Principle of Population” గ్రంథంలో  మొదటిసారి శాస్త్రీయ జనాభా సిద్ధాంతాన్ని వివరించారు.
* ఆహార పదార్థాల సప్లయ్‌ వృద్ధికి, జనాభా వృద్ధికి మధ్య ఉన్న సంబంధాన్ని మాల్థస్‌ సిద్ధాంతం వివరిస్తుంది.
* జనాభా గుణశ్రేణిలో  (Geometric progression) పెరుగుతుందని, దీన్ని అరికట్టకుంటే ప్రతీ 25 ఏళ్లకు జనాభా రెట్టింపవుతుందని, ఆహార పదార్థాల ఉత్పత్తి నెమ్మదిగా అంకశ్రేణిలో పెరుగుతుందని మాల్థస్‌ సిద్ధాంతం పేర్కొంది. 
* మన దేశంలో జనాభా పెరుగుదలను అరికట్టేందుకు మొదటి ప్రణాళికా (1951-56) కాలంలో 1952లో కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. ప్రపంచంలోనే జనాభా నియంత్రణ విధానాన్ని ప్రవేశపెట్టిన తొలి దేశంగా భారత్‌ గుర్తింపు పొందింది.
* మరణాల రేటు క్రమంగా తగ్గుతూ, జననాల రేటు పెరగడం వల్ల భారతదేశంలో జనాభా పెరుగుతోంది. ఇది జనాభా విస్ఫోటనానికి దారితీసింది.


దేశ జనాభా వేగంగా పెరగడానికి కారణాలు
* ఒక దేశ జనాభా వేగంగా పెరిగేందుకు మూడు కారణాలు ఉన్నాయి. అవి;
1. ఎక్కువ జననాల రేటు
2. సాపేక్ష అల్ప మరణాలు రేటు
3. వలస రావడం (భారతదేశ జనాభా వృద్ధిపై వలస ప్రభావం లేదు.)

మరణాల రేటు తగ్గడానికి కారణాలు:
* కరవులను నివారించడం. 
* రోగాల నియంత్రణ.   
* ఇతర కారణాలు
ఉదా: తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, పరిశుభ్రత, విద్యా, వైద్య సౌకర్యాలను మెరుగుపరచడం.

 

అధిక జననాల రేటుకు కారణాలు:
జననాల రేటు పెరగడానికి రెండు రకాల కారణాలు -
1. ఆర్థిక కారణాలు    2. సాంఘిక కారణాలు


ఆర్థిక కారణాలు
1. వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం 
2. నగరీకరణ
3. పేదరికం


సాంఘిక కారణాలు
1. వివాహానికి సర్వజన అంగీకారం 
2. చిన్న వయసులో వివాహం 
3. మతపరమైన సాంఘిక మూఢనమ్మకాలు
4. ఉమ్మడి కుటుంబం
5. నిరక్షరాస్యత
6. గర్భ నిరోధక పద్ధతులను పరిమితంగా ఉపయోగించడం


జాతీయ గణాంక సంస్థ నివేదిక
* జాతీయ గణాంక సంస్థ (National Statistical Office n- NSO), భారత ప్రభుత్వ కార్యక్రమాల అమలు, గణాంకాల మంత్రిత్వశాఖ (Ministry of Statistics and Programme Implementation Government of India - MOSPI) ఉమ్మడిగా ‘భారతదేశంలో మహిళలు, పురుషులు (Women and Men in India) - 2020 నివేదికను 2021, మార్చి 26న విడుదల చేశాయి.
* 2021లో మనదేశంలో మొత్తం జనాభా 136.13 కోట్లు ఉందని, స్త్రీ జనాభా శాతం 48.65%గా ఉన్నట్లు ఎన్‌ఎస్‌ఓ ప్రకటించింది. దేశంలో సగటు వార్షిక జనాభా వృద్ధిరేటు 2011లో 1.63% ఉండగా 2016 నాటికి 1.27 శాతానికి, 2021 నాటికి 1.07 శాతానికి తగ్గినట్లు పేర్కొంది.  
* ప్రతీ 1000 మంది పురుషులకు ఉన్న స్త్రీల సంఖ్యను తెలిపేది స్త్రీ - పురుష నిష్పత్తి. దేశవ్యాప్తంగా 2001లో స్త్రీ - పురుష నిష్పత్తి 933గా నమోదైంది. 2011 నాటికి 943కి, 2021 నాటికి 948కి పెరిగింది. 
* ప్రసవ సమయంలో పౌష్ఠికాహార లోపం వల్ల, వైద్య సదుపాయాలు లేక అనేకమంది స్త్రీలు మరణిస్తుంటారు. ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్యసేన్‌ వీరిని ‘మిస్సింగ్‌ ఉమెన్‌’గా పేర్కొన్నారు.
* 2011లో స్త్రీ - పురుష నిష్పత్తికి సంబంధించి దిల్లీలో 5.7%, చండీగఢ్‌లో 5.3%, అరుణాచల్‌ ప్రదేశ్‌ లో 5% పెరుగుదల నమోదైంది. డామన్‌ డయ్యూలో స్త్రీ, పురుష నిష్పత్తి 13 శాతం తగ్గింది.
* 2011లో 0 నుంచి 19 ఏళ్ల వారిలో స్త్రీ-పురుష నిష్పత్తి 908గా ఉంది. 15 - 59 మధ్య వయసువారిలో ఈ నిష్పత్తి 944  కాగా 60 కంటే ఎక్కువ వయసు ఉన్నవారిలో స్త్రీ-పురుష నిష్పత్తి 1033గా నమోదైంది.
* శాంపుల్‌ రిజిస్ట్రేషన్‌ సిస్టమ్‌ (SRS) ప్రకారం 2015-17లో స్త్రీ, పురుష నిష్పత్తి 896గా, 2016-18లో 899గా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ నిష్పత్తి 2015-17లో 898 కాగా, 2016-18లో 900కి పెరిగింది. పట్టణాల్లో 2015-17లో 890 ఉండగా, 2016-18 మధ్య 897గా ఉంది.
* దేశంలో స్త్రీల వివాహ వయసు 2018లో 22.3 సంవత్సరాలుగా ఉంది. 2017 నుంచి 0.2 సంవత్సరాలు పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో స్త్రీల వివాహ వయసు 2017 నుంచి 2018 వరకు 0.1 సంవత్సరం; పట్టణాల్లో 0.3 సంవత్సరాలు పెరిగింది.


ప్రపంచ జనాభా స్వరూపం
* 1830 నాటికి ప్రపంచ జనాభా 100 కోట్లు (ఒక బిలియన్‌). 1930 నాటికి ఇది రెట్టింపైంది. 1960 నాటికి ప్రపంచ జనాభా 3 బిలియన్లకు (300 కోట్లు) చేరగా, 1975 నాటికి 4 బిలియన్లకు (400 కోట్లకు), 1987 నాటికి 5 బిలియన్లకు (500 కోట్లు) పెరిగింది. 5వ బిలియన్‌ చివరి శిశువు 1987, జులై 11న యుగోస్లేవియాలో జన్మించాడు. అందుకే జులై 11ను ప్రపంచ జనాభా దినోత్సవంగా పరిగణిస్తారు.
* యూఎన్‌పీఎఫ్‌  (United Nations Population Fund - అంతకు ముందు దీన్ని యూఎన్‌ ఫండ్‌ ఫర్‌ పాపులేషన్‌ యాక్టివిటీస్‌గా (UNFPA) పిలిచేవారు.) నివేదిక ప్రకారం 1999, అక్టోబరు 12 నాటికి ప్రపంచ జనాభా 6 బిలియన్లకు (600 కోట్లు) చేరింది. దీన్ని పురస్కరించుకుని ఐక్యరాజ్యసమితి ఆ రోజును 6వ బిలియన్‌ రోజుగా ్బ (6th day of Billion)  ప్రకటించింది. 2011 నాటికి ప్రపంచ జనాభా 700 కోట్లకు చేరింది.
* యునైటెడ్‌ నేషన్స్‌ పాపులేషన్‌ ఫండ్‌ (UNPF) స్టేట్‌ ఆఫ్‌ వరల్డ్‌ పాపులేషన్‌ - 2021 నివేదిక ప్రకారం 2021, ఏప్రిల్‌ నాటికి ప్రపంచ జనాభా 787.5 కోట్లకు చేరింది. ఈ నివేదిక ప్రకారం 2021 నాటికి చైనా జనాభా 144.42 కోట్లు, భారత్‌ జనాభా 139.34 కోట్లు. యూఎస్‌ఏ జనాభా 33.29 కోట్లు, ఇండోనేసియా జనాభా 27.64 కోట్లు, పాకిస్థాన్‌ జనాభా 22.52 కోట్లకు చేరింది. నేషనల్‌ స్టాటిస్టికల్‌ ఆఫీస్‌ (NSO) 2021, మార్చి 26న విడుదల చేసిన  ‘భారత్‌లో మహిళలు, పురుషుల నివేదిక - 2020’ ప్రకారం 2021 నాటికి భారతదేశ జనాభా 136.13 కోట్లు.
* 1921కి ముందు మనదేశంలో జనాభా పెరుగుదల చాలా స్వల్పంగా ఉండేది. కరవులు, అంటువ్యాధుల కారణంగా 1911-21 దశాబ్దంలో జనాభా తగ్గింది. అందుకే 1921ని ‘గొప్ప విభాజక సంవత్సరం’గా పేర్కొంటారు.

 

దేశంలో మతాలవారీగా  స్త్రీ, పురుష నిష్పత్తి (2011)

హిందువులు 939
ముస్లింలు 951
క్రిస్టియన్లు 1023
సిక్కులు 903
బౌద్ధులు 965
జైనులు 954

ఆధారం: ఎన్‌ఎస్‌ఓ ‘భారతదేశంలో మహిళలు, పురుషులు - 2020’ నివేదిక.


జనాభా పెరుగుదల నిర్మూలన చర్యలు
జనాభా పెరుగుదలను నివారించడానికి మూడు రకాల చర్యలు అవసరం. అవి;
1. ఆర్థిక చర్యలు     2. సాంఘిక చర్యలు  
3. కుటుంబ నియంత్రణ పథకం


ఆర్థిక చర్యలు
* పారిశ్రామిక రంగ విస్తరణ
* ఉద్యోగ అవకాశాల కల్పన
* సమానత్వంతో కూడిన ఆదాయ పంపిణీ, పేదరిక నిర్మూలన.


సాంఘిక చర్యలు
* జనాభా విస్ఫోటనం ఆర్థిక సమస్యతో పాటు సాంఘిక సమస్య కూడా. జననాల రేటును తగ్గించడానికి సాంఘిక దురాచారాలను రూపుమాపాలి.
* విద్య నీ స్త్రీల హోదా నీ వివాహ వయసును పెంచడం

 

కుటుంబ నియంత్రణ పథకానికి ప్రాధాన్యం
* ప్రభుత్వ సమాచార పథకం
* ప్రోత్సాహకాలు, నిరుత్సాహకాలు
* కుటుంబ నియంత్రణ కేంద్రాలు

 

ఆరోగ్య గణాంకాలు

(Health Statistics)


* ఏడాదిలోపు వయసున్న ప్రతీ 1000 మంది శిశువుల్లో మరణించే వారి సంఖ్యను తెలిపేదే శిశుమరణాల రేటు (Infant Mortality Rate – IMR). 2014లో ఈ రేటు 39 ఉండగా, 2018 నాటికి 32కి తగ్గింది. పౌష్ఠికాహార సమస్యలు, మెరుగైన ఆరోగ్య, వైద్య సదుపాయాలు లేకపోవడం వల్ల శిశు మరణాలు సంభవిస్తున్నాయి.

* ఒక దేశంలో ఏటా ప్రతీ లక్షమంది తల్లులకు (ప్రసవ సమయంలో) మరణించే తల్లుల సంఖ్యను మాతా, శిశుమరణాల రేటు (Maternal Mortality Rate – MMR) అంటారు. 200709 మధ్య ఈ రేటు 212 ఉండగా, 201618 మధ్య 113గా ఉంది. 

* ఏదైనా దేశంలో ఒక మహిళ తన జీవిత కాలంలో ఎంతమంది పిల్లలకు జన్మనిస్తుందో తెలిపే సంఖ్యను సంతాన ఉత్పత్తి రేటు (Total Fertility Rate – TFR) అంటారు. 2018లో గ్రామీణ ప్రాంతాల్లో ఈ రేటు 2.3 ఉండగా, పట్టణ ప్రాంతాల్లో 1.7 గా ఉంది.

* ఒక వ్యక్తి సగటున ఎన్ని సంవత్సరాలు జీవిస్తాడో తెలిపేది సగటు జీవిత కాలం. 202125 మధ్య మనదేశంలో స్త్రీల సగటు జీవితకాలం 72.66 సంవత్సరాలు ఉంటుందని, పురుషుల సగటు జీవితకాలం 69.37  సంవత్సరాలు ఉంటుందని అంచనా. 203136 మధ్య స్త్రీల సగటు జీవిత కాలం 74.66 సంవత్సరాలుగా, పురుషుల సగటు జీవితకాలం 71.17 సంవత్సరాలుగా ఉంటుందని అంచనా. 

* స్టేట్‌ ఆఫ్‌ వరల్డ్‌ పాపులేషన్‌ ‘యునైటెడ్‌ నేషన్స్‌ పాపులేషన్‌ ఫండ్‌’ 2021, ఏప్రిల్‌లో విడుదల చేసిన నివేదిక ప్రకారం 2021లో మనదేశంలో సంతాన ఉత్పత్తిరేటు 2.2 గా ఉంది. పురుషుల సగటు జీవితకాలం 69 సంవత్సరాలు, స్త్రీల సగటు జీవితకాలం 71 సంవత్సరాలుగా ఉంది.

విద్యారంగం - అక్షరాస్యత 

1951లో మనదేశంలో మొత్తం అక్షరాస్యత రేటు 18.3%. ఇందులో స్త్రీల అక్షరాస్యత 8.9% కాగా పురుషుల అక్షరాస్యత 27.2%. 

* 2011 గణాంకాల ప్రకారం మనదేశ మొత్తం అక్షరాస్యత రేటు 73%. ఇందులో స్త్రీల అక్షరాస్యత రేటు 64.6%, పురుషుల అక్షరాస్యత 80.9%గా ఉంది. ‘జాతీయ గణాంక సంస్థ (ఎన్‌ఎస్‌ఓ) రూపొందించిన 'Women
and Men in India-2020' నివేదిక ప్రకారం 2017 నాటికి మనదేశ మొత్తం అక్షరాస్యత రేటు 77.7%. ఇందులో స్త్రీల అక్షరాస్యత రేటు 70.3%, పురుషుల అక్షరాస్యత రేటు 84.7%గా ఉంది.  

* 1951లో మొత్తం గ్రామీణ అక్షరాస్యత రేటు 12.1%గా ఉంది. ఇందులో గ్రామీణ స్త్రీల అక్షరాస్యత రేటు 4.9%, గ్రామీణ పురుషుల అక్షరాస్యత రేటు 19%గా ఉంది. 2011లో మొత్తం గ్రామీణ అక్షరాస్యత రేటు 66.8%. ఇందులో గ్రామీణ స్త్రీల అక్షరాస్యత 57.9%, గ్రామీణ పురుష అక్షరాస్యత 77.2%గా ఉంది.

* 2017లో మొత్తం గ్రామీణ అక్షరాస్యత 73.5% గా ఉంది. ఇందులో గ్రామీణ స్త్రీల అక్షరాస్యత 65%, గ్రామీణ పురుషుల అక్షరాస్యత 81.5% గా ఉంది.

* 1951లో మనదేశంలో మొత్తం పట్టణ అక్షరాస్యత 34.6%గా ఉంది. ఇందులో పట్టణ స్త్రీల అక్షరాస్యత రేటు 22.3%, పట్టణ పురుష అక్షరాస్యత రేటు 45.6% గా ఉంది.

* 2011లో మనదేశంలో మొత్తం పట్టణ అక్షరాస్యత 84.1%. ఇందులో పట్టణ స్త్రీల అక్షరాస్యత 79.1%, పట్టణ పురుష అక్షరాస్యత 88.8% గా ఉంది.

* 2017లో మొత్తం మనదేశంలో పట్టణ అక్షరాస్యత 87.7%. ఇందులో పట్టణ స్త్రీల అక్షరాస్యత 82.8% కాగా, పట్టణ పురుషుల అక్షరాస్యత రేటు 92.2%గా ఉంది.

* ఎన్‌ఎస్‌ఓ - 2020 నివేదిక ప్రకారం 2017 నాటికి మనదేశంలో అక్షరాస్యత రేటు అధికంగా ఉన్న రాష్ట్రాలు వరుసగా కేరళ (96.2%), ఉత్తరాఖండ్‌ (87.6%), హిమాచల్‌ప్రదేశ్‌ (86.6%), అసోం 

(85.9%), మహారాష్ట్ర (84.8%). 

* 2017 నాటికి మనదేశంలో అక్షరాస్యత ఎక్కువగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం - దిల్లీ (88.7%).

* 2017 నాటికి తెలంగాణలో మొత్తం అక్షరాస్యత 72.8% గా ఉంది. ఇందులో స్త్రీల అక్షరాస్యత 65.1%, పురుషుల అక్షరాస్యత 80.5% గా ఉంది. 

* 2017 నాటికి అతి తక్కువ అక్షరాస్యత ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ ్బ66.4%్శ. ఇందులో పురుషుల అక్షరాస్యత రేటు 73.4%గా, స్త్రీల అక్షరాస్యత రేటు 59.5%గా ఉంది.

* జాతీయ గణాంక సంస్థ 2021 నివేదిక ప్రకారం 2018 నాటికి మనదేశంలో ప్రతీ 1000 మంది శిశువుల్లో 32 మంది మరణించారు.

* 2011 నాటికి మనదేశ మొత్తం అక్షరాస్యత రేటు 73% కాగా 2017 నాటికి 77.7 శాతానికి పెరిగింది. 

* 2017 నాటికి మనదేశంలో అత్యధిక అక్షరాస్యత ఉన్న రాష్ట్రం కేరళ. తక్కువ అక్షరాస్యత ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌.

* ప్రతీ 1000 మంది పురుషులకు ఉన్న స్త్రీల సంఖ్యను తెలిపేది స్త్రీ పురుష నిష్పత్తి.

* మరణాల రేటు తగ్గి, జననాల రేటు పెరగడాన్ని జనాభా విస్ఫోటనం అంటారు.

మాదిరి ప్రశ్నలు

1. జాతీయ గణాంక సంస్థ (ఎన్‌ఎస్‌ఓ) వెలువరించిన ‘భారతదేశంలో మహిళలు, పురుషుల నివేదిక - 202021’ ప్రకారం 2021 నాటికి భారతదేశ జనాభా ఎంత?

1) 136.13 కోట్లు       2) 143.13 కోట్లు  

3) 121.13 కోట్లు       4) 128.13 కోట్లు

2. ఎన్‌ఎస్‌ఓ - 2021 నివేదిక ప్రకారం కిందివాటిలో మనదేశంలో దశాబ్ద జనాభా వృద్ధిరేటుకు సంబంధించి సరైంది ఏది? 

1) 2011 నాటికి 1.63% వృద్ధి నమోదైంది.   

2) 2016 నాటికి 1.27% వృద్ధి నమోదైంది.

3) 2021 నాటికి 1.07 శాతం తగ్గింది.     

4) పైవన్నీ

3. ఎన్‌ఎస్‌ఓ - 2021 నివేదిక ప్రకారం 2021 నాటికి మనదేశంలో ప్రతీ  1000 మంది పురుషులకు ఉన్న స్త్రీల సంఖ్య ఎంత? (2011 నాటి జనాభా లెక్కల ప్రకారం ఇది 943 గా ఉంది.)

1) 946    2) 947    3) 948  4) 949

4. అంతర్జాతీయ జనాభా దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?

1) జులై 10       2) జులై 11   

3) జులై 12       4) జులై 13

5. యునైటెడ్‌ నేషన్స్‌ పాపులేషన్స్‌ ఫండ్‌ ‘స్టేట్‌ ఆఫ్‌ వరల్డ్‌ పాపులేషన్‌ - 2021’ నివేదిక ప్రకారం 2021, ఏప్రిల్‌ నాటికి మొత్తం ప్రపంచ జనాభా ఎంత?

1) 787.5 కోట్లు       2) 790 కోట్లు   

3) 1000 కోట్లు       4) 900 కోట్లు

6. యునైటెడ్‌ నేషన్స్‌ పాపులేషన్స్‌ ఫండ్‌ ‘స్టేట్‌ ఆఫ్‌ వరల్డ్‌ పాపులేషన్‌ - 2021’ నివేదిక ప్రకారం అధిక జనాభా ఉన్న దేశాల వరుసక్రమం ఏది?

1) చైనా, భారత్, అమెరికా, ఇండోనేసియా, పాకిస్థాన్‌

2) చైనా, భారత్, ఇండోనేసియా, అమెరికా, పాకిస్థాన్‌

3) చైనా, భారత్, బ్రిటన్, అమెరికా, ఇండోనేసియా

4) చైనా, బ్రిటన్, బంగ్లాదేశ్, పాకిస్థాన్, అమెరికా

7. ఒక ప్రదేశంలో ప్రతీ చదరపు కిలోమీటరు విస్తీర్ణంలో నివసించే జనసంఖ్యను ఏమంటారు?

1) జనాభా               2) జనసాంద్రత  

3) జనాభా విస్ఫోటనం   4) పైవన్నీ

8. ‘భూమిపై పుట్టే ప్రతీబిడ్డ ఒక అభివృద్ధి కారకం అవుతాడు’ అని పేర్కొన్నది ఎవరు?

1) థామస్‌ రాబర్ట్‌ మాల్థస్‌    2) ఎడ్విన్‌ కానన్‌ 

3) మాలిని బాలసింగం       4) పై అందరూ

9. ‘భూమిపై పుట్టే ప్రతిబిడ్డ నరకాన్ని పెంపొందిస్తాడు’ అని నిర్వచించింది ఎవరు?

1) మార్షల్‌       2) థామస్‌ రాబర్ట్‌ మాల్థస్‌   

3) లార్డ్‌ రిప్పన్‌   4) ఎడ్విన్‌ కానన్‌

10. 1798లో 'An Essay on the Principles of Populatione' అనే గ్రంథంలో తొలిసారి శాస్త్రీయ జనాభా సిద్ధాంతాన్ని వివరించింది ఎవరు?

1) థామస్‌ రాబర్ట్‌ మాల్థస్‌  2) ఎడ్విన్‌ కానన్‌ 

3) జేఎమ్‌ కీన్స్‌          4) మాలిని బాలసింగం

11. మనదేశంలో కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్నిFamily Planning Programme) ఏ సంవత్సరంలో ప్రారంభించారు?

1) 1951   2) 1952   3) 1953   4) 1954

12. ప్రపంచంలో జనాభాపరంగా రెండోస్థానంలో ఉన్న దేశం?

1) భారత్‌  2) ఇండోనేసియా 3) అమెరికా 4) బ్రెజిల్‌ 

 

సమాధానాలు

1-1, 2-4, 3-3, 4-2, 5-1, 6-1, 7-2, 8-2, 9-2, 10-1, 11-2, 12-1.

 

Posted Date : 03-09-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌