• facebook
  • whatsapp
  • telegram

భారత రాజ్యాంగ సవరణ విధానం

ప్రగతి సాధక మార్పు మంచిదే! 

 


చట్టాలు దేశ ప్రగతికి సాధనాలుగా ఉపయోగపడాలి. ప్రజాస్వామ్య పరిణామాలకు, నిబద్ధతకు ప్రతిబింబాలుగా నిలవాలి. రాజ్యాంగ ప్రాథమిక సూత్రాలను పాటిస్తూ సమకాలీన సామాజిక, రాజకీయ గతిశీలతకు అనుగుణంగా ఉండాలి. అభివృద్ధికి అవరోధాలుగా మారకూడదు.  ఈ లక్ష్యంతో అసలు సవరించకపోతే సమస్యలు ఎదురవుతాయి, మారుస్తూ కూర్చుంటే మౌలిక స్వరూపమే మారిపోవచ్చనే ఆందోళనల మధ్య సమర్థ సవరణ విధానాలను భారత రాజ్యాంగ నిర్మాతలు నిర్దేశించారు. పౌరుల హక్కులు, ప్రయోజనాలను కాపాడుతూ స్థిరత్వం, పురోగతి మధ్య సమతౌల్యతను సాధించే విధంగా వాటిని రూపొందించారు. ఈ అంశాలను సంబంధిత ఆర్టికల్స్, సుప్రీంకోర్టు తీర్పులతో సహా అభ్యర్థులు తెలుసుకోవాలి. ప్రజల అవసరాలకు ప్రతిస్పందించగలిగినట్లుగా ప్రస్తుతం అనుసరిస్తున్న రాజ్యాంగ సవరణ ప్రక్రియను తీర్చిదిద్దిన తీరును అర్థం చేసుకోవాలి.

 

‘‘ ఒకవేళ మనం భారత రాజ్యాంగాన్ని సవరించడానికి వీలు లేని విధంగా తయారు చేస్తే, అది జాతి అభివృద్ధిని, ప్రజల జీవన విధానాన్ని అడ్డుకోవడమే అవుతుంది. ప్రపంచం కాలానుగుణ మార్పులకు తగినట్లుగా పరుగు పెడుతుంటే, మనం సంప్రదాయ సమాజంలోనే ఆగిపోయే అవకాశం ఉంది. ఈ రోజు రూపొందించిన ఈ రాజ్యాంగం భవిష్యత్తు తరాల అవసరాలను తీర్చలేకపోవచ్చు. అందువల్ల రాజ్యాంగాన్ని సరళంగా, కాలానుగుణంగా సవరించే అవకాశం ఉండాలి. ’’

- జవహర్‌లాల్‌ నెహ్రూ (నాటి రాజ్యాంగ పరిషత్తు చర్చలో) 



ఆధునిక యుగంలో భారత ప్రజల ఆకాంక్షలకు తగినట్లుగా రాజ్యాంగాన్ని సవరించే సర్వాధికారం రాజ్యాంగ నిర్మాతలు పార్లమెంటుకు అప్పగించారు. అందుకోసం సవరణ విధానాలను, ప్రక్రియలను, నియమాలను నిర్దేశించారు.



రాజ్యాంగ వివరణ :  భారత రాజ్యాంగంలోని 20వ భాగంలో ఆర్టికల్‌ 368లో భారత రాజ్యాంగాన్ని సవరించే విధానాన్ని వివరించారు. సంబంధిత బిల్లులను పార్లమెంటు ఉభయ సభల్లో ఎక్కడైనా ప్రవేశపెట్టవచ్చు. వాటిని ఆమోదించే క్రమంలో లోక్‌సభ, రాజ్యసభల మధ్య అభిప్రాయ భేదాలు వస్తే ఆ బిల్లులు వీగిపోతాయి. రాజ్యాంగ సవరణ బిల్లులను పార్లమెంటు ఆమోదిస్తే, అనంతరం రాష్ట్రపతి ఆమోద ముద్రతో చట్టాలుగా అమల్లోకి వస్తాయి. 

1971లో 24వ రాజ్యాంగ సవరణ చట్టం, 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం రూపొందాయి. వీటి ద్వారా ఆర్టికల్‌ 368లో మార్పులు, చేర్పులు జరిగాయి.

రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి రాష్ట్రపతి పూర్వానుమతి అవసరం లేదు.

రాజ్యాంగ సవరణ బిల్లులను పార్లమెంటు ఉభయ సభలు విడివిడిగా ఆమోదించాలి. ఈ బిల్లుల ఆమోద విషయమై ఉభయ సభల మధ్య అభిప్రాయ భేదాలు వస్తే ఉభయ సభల సంయుక్త సమావేశానికి అవకాశం లేదు.

రాజ్యాంగ సవరణ బిల్లులను రాష్ట్రపతి పునఃపరిశీలనకు పంపడం, తిరస్కరించడం కుదరదు. తప్పనిసరిగా ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది.



దృఢ, అదృఢ లక్షణాల సమ్మేళనం :  రాజ్యాంగాన్ని సవరించే విధానం కఠినంగా ఉంటే దాన్ని దృఢ రాజ్యాంగం అంటారు. ఉదా: అమెరికా రాజ్యాంగం. అక్కడ రాజ్యాంగాన్ని సవరించాలంటే ఆ దేశ శాసన వ్యవస్థ (కాంగ్రెస్‌) 2/3వ వంతు మెజార్టీతో తీర్మానాన్ని ఆమోదించడంతో పాటు, ఆ దేశంలోని 3/4వ వంతు రాష్ట్రాల ఆమోదం తప్పనిసరి.

 రాజ్యాంగాన్ని సవరించే విధానం సులభంగా ఉంటే అది అదృఢ రాజ్యాంగం. ఉదా: బ్రిటన్‌ రాజ్యాంగం. బ్రిటన్‌ దేశంలో పార్లమెంటు సాధారణ మెజార్టీ పద్ధతి ద్వారా ఎలాంటి అంశాన్నయినా సవరిస్తుంది.  

 రాజ్యాంగ పరిషత్తులో భారత రాజ్యాంగం ఏవిధంగా ఉండాలనే అంశంపై విస్తృతమైన చర్చ జరిగింది. గోపాలస్వామి అయ్యంగార్‌ నేతృత్వంలోని కొంతమంది సభ్యులు దృఢ రాజ్యాంగం ఉండాలంటే, జవహర్‌లాల్‌ నెహ్రూ నేతృత్వంలోని కొంతమంది సభ్యులు అదృఢ రాజ్యాంగం ఉండాలని సూచించారు. చివరకు రాజ్యాంగాన్ని దృఢ, అదృఢ లక్షణాల సమ్మేళనంగా రూపొందించారు.

‣ రాజ్యాంగాన్ని సవరించే విధానాన్ని దక్షిణాఫ్రికా నుంచి గ్రహించారు.



గోల్డెన్‌ మిడిల్‌ పాత్‌ :  మన రాజ్యాంగ సవరణ ప్రక్రియ దక్షిణాఫ్రికా అంత సరళం కాదు. అమెరికా తరహాలో అత్యంత దృఢమైన విధానం కాదు. ఆ రెండింటిని దృష్టిలో పెట్టుకుని గోల్డెన్‌ మిడిల్‌ పాత్‌ను అనుసరించారు.

 సవరణ విధానం దృఢంగా ఉంటే కాలమాన పరిస్థితులకు వీలుగా మార్పులు కుదరవు. అదృఢంగా ఉంటే రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలుగుతుంది.



సవరణ పద్ధతులు : రాజ్యాంగాన్ని ఆర్టికల్‌ 368 ప్రకారం మూడు రకాల పద్ధతుల ద్వారా పార్లమెంటు సవరిస్తుంది.


1) సాధారణ మెజార్టీ పద్ధతి: సాధారణ మెజార్టీ అంటే సభకు హాజరై ఓటు వేసిన వారిలో సగానికంటే ఎక్కువ మంది (50% +) ఆమోదంతో రాజ్యాంగంలోని కొన్ని అంశాలను సవరించవచ్చు. అవి

ఆర్టికల్‌ 3- రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ ప్రక్రియ

ఆర్టికల్‌ 100 (3)- పార్లమెంటు సమావేశాల నిర్వహణకు కోరంలో మార్పులు, చేర్పులు

ఆర్టికల్‌ 102- పార్లమెంటు సభ్యుల అర్హతలు, అనర్హతలు నిర్ణయించడం.

ఆర్టికల్‌ 105- పార్లమెంటు సభ్యుల సభా హక్కులు.

ఆర్టికల్‌ 106- పార్లమెంటు సభ్యుల జీతభత్యాలు.

ఆర్టికల్‌ 120- పార్లమెంటులో ఆంగ్ల భాష వినియోగం.

ఆర్టికల్‌ 169- రాష్ట్ర శాసనసభలో విధాన పరిషత్తు ఏర్పాటు/రద్దు.

2వ షెడ్యూల్‌లో పేర్కొన్న రాజ్యాంగ ఉన్నత పదవుల జీతభత్యాలు.

5వ, 6వ షెడ్యూళ్లలోని షెడ్యూల్డ్‌ జాతులు, షెడ్యూల్డ్‌ తెగల పరిపాలనాంశాలు.

 3వ షెడ్యూల్‌లోని రాజ్యాంగ ఉన్నత పదవుల ప్రమాణ స్వీకారం.

 2వ భాగంలోని పౌరసత్వ విషయాలు.

 ఆర్టికల్‌ 82- నియోజక వర్గాల పునర్‌వ్యవస్థీకరణ

 ఆర్టికల్‌ 124 (1)- సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య.

 ఆర్టికల్‌ 239 (ఎ)- కేంద్రపాలిత ప్రాంతాల్లో శాసనసభ, మంత్రిమండలి ఏర్పాటు.

 ఆర్టికల్‌ 343-కేంద్రం అధికార భాషను నిర్ణయించడం.


2) ప్రత్యేక మెజార్టీ పద్ధతి: ఉభయ సభలు వేర్వేరుగా సమావేశమై, ఓటు వేసిన వారిలో 2/3వ వంతు ఆమోదిస్తే రాజ్యాంగ సమాఖ్య లక్షణాలను సవరించవచ్చు. అవి

రాజ్యాంగం 3వ భాగంలో ఆర్టికల్‌ 12 నుంచి 35 మధ్య ఉన్న ప్రాథమిక హక్కులు.

రాజ్యాంగం 4వ భాగంలో ఆర్టికల్‌ 36 నుంచి 51 మధ్య ఉన్న ఆదేశిక సూత్రాలు.

 రాజ్యాంగ 4(ఎ) భాగంలో ఆర్టికల్‌ 51 (ఎ)లోని ప్రాథమిక విధులు.ః మొదటి, మూడు పద్ధతుల్లో పేర్కొననివి.


3) ప్రత్యేక మెజార్టీ, రాష్ట్రాల ఆమోదం: పార్లమెంటు ఉభయ సభలు వేర్వేరుగా 2/3వ వంతు ప్రత్యేక మెజార్టీతో తీర్మానం ఆమోదించడంతో పాటు దేశంలోని సగానికంటే (1/2వ వంతు) ఎక్కువ రాష్ట్రాలు కూడా అంగీకరించాలి. ఇది దృఢ రాజ్యాంగ లక్షణం.. ఈ పద్ధతి ద్వారా పలు అంశాలను సవరించే వీలుంది.అవి -

ఆర్టికల్‌ 54 - రాష్ట్రపతి ఎన్నిక

ఆర్టికల్‌ 55 - రాష్ట్రపతి ఎన్నిక విధానం

 ఆర్టికల్‌ 73 - కేంద్ర కార్యనిర్వాహక వర్గ అధికార పరిధిలో మార్పులు, చేర్పులు

 ఆర్టికల్‌ 162 - రాష్ట్ర కార్యనిర్వాహక వర్గ అధికార పరిధిలో మార్పులు, చేర్పులు.

 ఆర్టికల్‌ 241 - కేంద్రపాలిత ప్రాంతాల్లోని హైకోర్టుల అంశాలు.

 ఆర్టికల్‌ 137 - సుప్రీంకోర్టు తీర్పులపై పునఃసమీక్ష.

 11వ భాగంలోని కేంద్ర, రాష్ట్ర సంబంధాలు (శాసన, పరిపాలన సంబంధాలు)

 ఆర్టికల్‌ 131 - సుప్రీంకోర్టు ఒరిజినల్‌ అధికార పరిధిలో మార్పులు, చేర్పులు.

ఆర్టికల్‌ 368- రాజ్యాంగ సవరణ విధానంలో మార్పులు, చేర్పులు.

 4వ షెడ్యూల్‌లో రాజ్యసభలో రాష్ట్రాలకు ప్రాతినిధ్యం కల్పించే అంశాలు.

 7వ షెడ్యూల్‌లోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన మూడు రకాల అధికారాల విభజన.ః 11వ షెడ్యూల్‌లో పంచాయతీరాజ్‌ వ్యవస్థకు బదిలీ చేయాల్సిన అధికారాలు, విధులు.

 12వ షెడ్యూల్‌లోని పట్టణ, స్థానిక సంస్థలకు బదిలీ చేయాల్సిన అధికారాలు, విధులు.


గోలక్‌నాథ్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ పంజాబ్‌ కేసు (1967): ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు లేదని, రాజ్యాంగాన్ని సవరించాలంటే పార్లమెంటు కొత్తగా రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేయాలని పేర్కొంది.

 గోలక్‌నాథ్‌ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అధిగమించేందుకు అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం 1971లో 24వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం ప్రకారం రాజ్యాంగంలోని ఆర్టికల్స్‌ 13, 368లను సవరించారు. ఆర్టికల్‌ 13కి క్లాజు (4)ని చేర్చారు. ప్రాథమిక హక్కులతో సహా రాజ్యాంగంలోని ఏ భాగాన్ని అయినా సవరించే అధికారాన్ని పార్లమెంటుకు అప్పగించారు. రాజ్యాంగ సవరణ బిల్లులను రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాలని నిర్దేశించారు.


కేశవానంద భారతి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ కేసు (1973): ఈ కేసులో 24వ రాజ్యాంగ సవరణ చట్టంపై సుప్రీంకోర్టు తీర్పునిస్తూ రాజ్యాంగ సవరణపై పార్లమెంటుకు ఉన్న అధికారాలపై హేతుబద్ధమైన పరిమితులను పేర్కొంది. ప్రాథమిక హక్కులతో సహా రాజ్యాంగంలోని ఏ భాగాన్ని అయినా సవరించే అధికారం పార్లమెంటుకు ఉందని, అయితే అది రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విఘాతం కలగకుండా జరగాలని చెప్పింది. ఆ సందర్భంగా అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఎమ్‌. సిక్రీ రాజ్యాంగ మౌలిక స్వరూపంలో సార్వభౌమాధికారం, ప్రజాస్వామ్యం, గణతంత్ర వ్యవస్థ, స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం అంతర్భాగమని పేర్కొన్నారు. ః ఎస్‌.ఆర్‌. బొమ్మై కేసు (1994)లో సుప్రీంకోర్టు లౌకికవాదం అనేది భారత రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగమని పేర్కొంది.


రాజ్యాంగ సవరణ బిల్లులు వీగిపోతే : రాజ్యాంగ సవరణ బిల్లులు ఏవైనా 2/3వ వంతు మెజార్టీతో ఆమోదం పొందాలి. ఈ బిల్లులు లోక్‌సభలో వీగిపోతే ప్రభుత్వం రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. కానీ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో సాధారణ మెజార్టీ కూడా సాధించడంలో విఫలమైతే ప్రభుత్వం తప్పనిసరిగా రాజీనామా చేయాలి.


రచయిత: బంగారు సత్యనారాయణ 

Posted Date : 02-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌