• facebook
  • whatsapp
  • telegram

తెలంగాణ‌లో ఆహార ధాన్యాల ఉత్ప‌త్తి, ఉత్పాద‌క‌త

      తెలంగాణ వ్యవసాయ ప్రాధాన్యం ఉన్న ప్రాంతం. ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా ఇక్కడి వ్యవసాయ పరిస్థితులపైనే ఆధారపడి ఉంటుంది. వ్యవసాయానికి ఎక్కువగా వర్షాలే ఆధారం. వర్షాలు తగ్గితే ఆ ప్రభావం ఉత్పత్తులు, ఉత్పాదకతలపైనా పడుతుంది. పంటల సాగు విస్తీర్ణం, వ్యవసాయ ఉత్పత్తులు, ఆహార ధాన్యాల ఉత్పాదకత.. ఇవన్నీ ఆర్థిక వ్యవస్థ, జనజీవన స్థితిగతులపై ప్రభావం చూపుతాయి. వీటి పరిస్థితి తెలంగాణలో ఎలా ఉందో తెలుసుకుందాం!
     ఆహార ధాన్యాల లభ్యత మీదే ఆర్థిక వ్యవస్థల, జీవుల మనుగడ ఆధారపడి ఉంది. ఆహార ధాన్యాల ఉత్పత్తులు, ఉత్పాదకతలు ఆహార భద్రతకు అత్యంత కీలకం. తెలంగాణ రాష్ట్రంలో 55.49 శాతం మంది జీవనోపాధి వ్యవసాయరంగంపైన, వ్యవసాయ ఆధార కార్యకలాపాలలైన ఏదో ఒక రూపంలో ఆధారపడి ఉన్నారు. తెలంగాణలో ఆహార ధాన్యాల ఉత్పత్తి పెంపుదల.. వ్యవసాయ ఆదాయం పెంపుదల.. చాలా కీలకమైన అవసరాలుగా పరిగణలోకి తీసుకోవాలి. ప్రధానంగా వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో.. పంటల సేద్యం (వ్యవసాయం, ఉద్యాన పోషణ కలిపి), జీవోత్పత్తులు, అటవీ సంపద, మత్స్య పరిశ్రమ రంగాలను చేర్చారు. వ్యవసాయ, వ్యవసాయేతర కార్మికుల ఉపాధి పెరగడం అనేది ప్రధానంగా ఆహార ధాన్యాల ఉత్పత్తుల్లో పెరుగుదల, ఆహార.. ఆదాయ భద్రత పెంపుపై ఆధారపడి ఉంటుంది.
   తెలంగాణ ఆర్థికవ్యవస్థలో వ్యవసాయం కీలకపాత్ర పోషిస్తుండటం వల్ల అన్ని వర్గాలను అభివృద్ధి చేయాలంటే వ్యవసాయ రంగంలో మెరుగైన పనితనం చూపించడం అత్యవసరం. ఈ దిశగా - వ్యవసాయం ప్రధాన అర్థిక వ్యవస్థగా.. తెలంగాణ ఇటీవల కాలంలో నిర్మాణాత్మకంగా గణనీయమైన పనితీరు కనబరిచింది. తెలంగాణలో ఎక్కువగా వరి, జొన్నలు, కందులు, పెసలు, మొక్కజొన్న పంటలు పండిస్తారు. వీటితోపాటు పత్తి, మిరప, పసుపు కొమ్ములు, వేరుశనగ, సోయాబీన్, పామాయిల్ లాంటివి సాగు చేస్తారు.

 

ఆహార ధాన్యాలు విస్తీర్ణం, ఉత్పత్తి

   తెలంగాణ రాష్ట్రంలో దశాబ్ద కాలంగా అంటే 2004-05 నుంచి 2013-14 వరకు, తర్వాత 2014-15 ఖరీఫ్ వరకు రాష్ట్రంలో ఆహార ధాన్యాల సాగు విస్తీర్ణం, పండిన పంటలు అనేక ఒడిదొడుకులకు లోనయ్యాయి. క్షామం, వరదలు, భారీ వర్షాలు లాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులే ఇందుకు కారణం. వర్షపాతం తక్కువగా ఉన్న సంవత్సరాల్లోనే నికరంగా పంట వేసిన సాగుభూమి, స్థూలంగా సేద్యపు నీరు అందిన విస్తీర్ణం, ఆహార పంటల సాగు విస్తీర్ణం, ఆహార ధాన్యాల ఉత్పత్తి కూడా చాలా తగ్గిపోయాయి.
 

ఉత్పత్తిలో ఒడిదొడుకులు

   2004-05లో 41.68 లక్షల టన్నుల ఆహారధాన్యాలు ఉత్పత్తి చేయగా 2008-09 నాటికి 82.48 లక్షల టన్నులు ఉత్పత్తిని సాధించింది. 2009-10లో కేవలం 51.89 లక్షల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి సాధనతో ఈ దశాబ్దంలోనే అతి తక్కువ ఉత్పత్తిని సాధించినట్లు అయ్యింది. 2010-11 నాటికి తిరిగి 92.60 లక్షల టన్నుల ఉత్పత్తి సాధించిందని చెప్పవచ్చు. తర్వాత 2011-12 నాటికి 75.01 లక్షల టన్నుల ఉత్పత్తిని సాధించి, 2013-14 నాటికి 107.49 లక్షల టన్నుల ఉత్పత్తిని, 2014-15 ఖరీఫ్ నాటికి 44.30 లక్షల టన్నుల ఉత్పత్తి సాధించింది. దీన్ని కింది పట్టికలో గమనించవచ్చు.
  

పురోగమన, తిరోగమనాలు

   తెలంగాణ రాష్ట్రంలో 2004-05 నుంచి 2014-15 దశాబ్ద కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే రాష్ట్రంలో వర్షపాతం ఆధారంగా ఎక్కువగా సాగుభూమి ఉన్నందున వర్షపాతం తగ్గిన సంవత్సరంలో నికరంగా పంట వేసిన భూమి, ఆహారపంటల విస్తీర్ణం తదితరాలు తక్కువగా ఉన్నాయి, 2004-05లో 24.97 లక్షల హెక్టార్ల సాగు విస్తీర్ణం ఉండగా అది 2008-09 నాటికి 31.72 లక్షల హెక్టార్లకు గరిష్ఠంగా పెరిగి వర్షపాతంలో అనిశ్చితి వల్ల 2009-10 నాటికి 26.49 లక్షల హెక్టార్లకు పడిపోయింది.
2010-11లో 34.43 లక్షల హెక్టార్ల నుంచి 2013-14లో 34.56 లక్షల హెక్టార్లకు పెరిగింది. 2014-15 ఖరీఫ్‌లో 18.05 లక్షల హెక్టార్లుగా ఆహార ధాన్యాల సాగు విస్తీర్ణం ఉంది. వీటిని కింది పట్టికలో చూడవచ్చు.

  

ఆహార ధాన్యాల ఉత్పాదకత

ఆహార ధాన్యాల ఉత్పాతదకత అనేది ఒక హెక్టారు పొలంలో ఎన్ని కిలోగ్రాములు పండింది అనే విషయాన్ని తెలుపుతుంది. ఈ మేరకు రాష్ట్రంలో ప్రధానంగా పండించే వరి, జొన్నలు, కందులు, పెసలు, మొక్కజొన్న, మిరప, పసుపు, వేరుశనగ, సోయా తదితర పంటల ఉత్పాదకతలను పరిశీలిస్తే..
 

వరి

     వరి ఉత్పాదకత తెలంగాణ రాష్టంలో 2009-10 నుంచి 2014-15(ఖరీఫ్) వరకు ఉత్పాదకత దాదాపు నిలకడగా ఉంది. 2013-14లో ఖరీఫ్ పంట డిగుబడి హెక్టారుకు 3,297 కిలోగ్రాములు రాగా, 2014-15 ఖరీఫ్ నాటికి అది 3,054 కిలోగ్రాములుగా ఉంది. వివరాలు పట్టికలో చూడవచ్చు.
  

మొక్కజొన్న

    మొక్కజొన్న ఉత్పాదకత 2009-10లో 2,400 కిలోలు (హెక్టారుకు) ఉండగా 2013-14 నాటికి 4,685 కిలోలుగా ఉంది. 2014-15 ఖరీఫ్‌లో ఉత్పాదకత 2,720 కిలోలు.
 

జొన్నలు

  తెలంగాణలో జొన్న పంట ఉత్పాదకత 2013-14లో 1,015 కిలోలు(హెక్టారుకు) కాగా 2014-15 (ఖరీఫ్) నాటికి అది 1,119 కిలోలుగా ఉంది.
  

పెసలు

   పెసల ఉత్పాదకత 2009-10లో 125 కిలోలు (హెక్టారుకు) ఉండగా 2013-14లో అది 694 కిలోలు, 2014-15 ఖరీఫ్ నాటికి 489 కిలోలుగా ఉంది.
 

కందులు

    కందుల ఉత్పాదకత తెలంగాణలో 380 కిలోలు (హెక్టారుకు) ఉండగా అత్యధికంగా 2012-13లో 554 కిలోలు ఉంది. 2014-15 ఖరీఫ్ నాటికి 441 కిలోలుగా ఉంది.
 
 

వేరుశనగ

   తెలంగాణలో వేరుశనగ ఉత్పాదకత 2009-10లో 1,682 కిలోలు (హెక్టారుకు) ఉండగా 2011-12లో 1,529 కిలోలు. ఇది 2014-15 నాటికి (ఖరీఫ్) 1700 కిలోలు.
 

సోయాబీన్

   సోయా ఉత్పాదకత 2009-10లో 824 కిలోలు (హెక్టారుకు) ఉండగా 2012-13లో 1,818 కిలోలు ఉత్పాదకత సాధించింది. 2014-15 ఖరీఫ్ నాటికి 1,070 కిలోలు.
  

పామ్ ఆయిల్

   పామ్ఆయిల్ ఉత్పాదకత 2009-10 నుంచి పోలిస్తే తక్కువగా ఉంది. 2009-10లో 26,150 కిలోలు (హెక్టారుకు) కాగా 2013-14 నాటికి 12,599 కిలోలకు తగ్గింది. 2014-15 ఖరీఫ్ నాటికి 17,731 కిలోలుగా ఉంది.
 

ఇతర పంటలు
(2013-14 గణాంకాలు, ఉత్పాదకత హెక్టారుకు కిలోల్లో)

శనగలు: తెలంగాణలో శనగలు ఉత్పాదకత 2013-14 నాటికి 1,716 కిలోలు(హెక్టారుకు). అత్యధిక ఉత్పాదకత సాధించిన జిల్లాలు వరుసగా నిజామాబాద్ (2,046), మహబూబ్‌నగర్ (1,842), ఖమ్మం (1,716). అతి తక్కువ ఉత్పాదకత ఉన్న జిల్లాలు.. వరంగల్ (837), కరీంనగర్ (1,352), ఆదిలాబాద్ (1,371).
మిరప: మిరప సగటు ఉత్పాదకత 3,544 కిలోలు (హెక్టారుకు). అత్యధిక ఉత్పాదకత జిల్లాలు వరుసగా ఖమ్మం (4,179), నిజామాబాద్ (3,941), రంగారెడ్డి (3,490). అతి తక్కువ ఉత్పాదకత జిల్లాలు కరీంనగర్ (2,710), ఆదిలాబాద్ (2,386), మెదక్ (800).
పసుపు: పసుపు కొమ్ముల సగటు ఉత్పాదకత 5,078 కిలోలు(హెక్టారుకు). అత్యధిక ఉత్పాదకత జిల్లాలు ఆదిలాబాద్ (6,721), కరీంనగర్ (6,303), ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్గొండ (5,078). అతి తక్కువ ఉత్పాదకత జిల్లాలు మెదక్ (2,869), రంగారెడ్డి (3,216), నిజామాబాద్ (4,178)

  

"వ్యవసాయం అంటే కొందరు అనుకున్నట్లుగా కేవలం పంటలు వేయడం కాదు.. ప్రపంచంలోని భూమి, నీటి నుంచి; ఆహారాన్ని, గ్రాసాన్ని ఉత్పత్తి చేయడం. వ్యవసాయం లేకుండా ఓ నగరం, ఓ స్టాక్ మార్కెట్, ఓ బ్యాంకు, ఓ విశ్వవిద్యాలయం, ఓ ప్రార్థనా మందిరం, సైన్యం.. ఏవీ మనలేవు. నాగరకతకూ, సమస్తమైన సుస్థిర ఆర్థిక వ్యవస్థలకూ వ్యవసాయమే పునాది" - అలన్ శావర్

Posted Date : 02-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌