• facebook
  • whatsapp
  • telegram

వర్షపాతం - మార్పులు

వాతావరణంలోని నీటి ఆవిరి ద్రవీకరణం (Condensation) చెంది, ద్రవరూపంలో లేదా ఘనరూపంలో ప్రకృతిసిద్ధంగా భూమిని చేరడాన్ని అవపాతం  (Precipitation) అంటారు. నీరు తన స్థితిని అయిదు రకాలుగా మార్చుకుంటుంది. అవి: 
1. ద్రవీకరణ     2. బాష్పీభవనం 
3. ద్రవీభవనం     4. ఘనీభవనం   5. సబ్లిమేషన్‌ 
ఈ ప్రక్రియలు జరుగుతున్నప్పుడు అనేక రకాల అవపాతాలు ఏర్పడతాయి. అవి:
a) వర్షం      b) తుంపర 
c) హిమం (మంచు)   d) హిమశీకరం 
e) వడగళ్లు        f) రైం 
* వర్షపు గాలి నీటి ఆవిరి వల్ల సంతృప్తం చెంది ప్రకృతిసిద్ధంగా పైకి లేచాక చల్లబడి ద్రవీకరణం చెందుతుంది. అప్పుడు 50  100 మైక్రాన్ల వ్యాసంతో చిన్న చిన్న నీటిబిందువులు దగ్గరకు చేరి మేఘాలుగా ఏర్పడతాయి. 
* ఈ సూక్ష్మ నీటి బిందువులు గాలిలో తేలుతూ ఒక్కోసారి భూమిని చేరతాయి. దీన్నే ‘తుంపర’  (Drizzle) అంటారు. దీనిలో నీటి బిందువుల వ్యాసం సుమారు 0.5 మిల్లీమీటర్‌ ఉంటుంది. 
* ఇది సాధారణంగా స్ట్రాటస్‌ (Stratus) అనే మేఘం నుంచి వస్తుంది. దీనికంటే పెద్దనీటి బిందువులు (1 మిల్లీమీటర్‌ నుంచి 5 మిల్లీమీటర్ల వ్యాసం కలిగినవి) భూమిని చేరితే వర్షం అంటారు. ఇది నింబోస్ట్రాటస్, ఆల్టోస్ట్రాటస్, స్ట్రాటోక్యుములస్, క్యుములస్‌ మేఘాల నుంచి వస్తుంది.


వర్షపాతం  (Rainfall) 
వాతావరణంలోని నీటి ఆవిరి ద్రవీకరణం చెందడం వల్ల అవపాత రూపంలోకి మారుతుంది. ఈ మొత్తం ద్రవపదార్థం వర్షమాపకంతో కొలవడానికి వీలుగా ఉంటే దాన్ని వర్షపాతం అంటారు. దీన్ని ‘వర్షమాపకం’ (Raingauge) అనే పరికరంతో కొలుస్తారు. దీని సాయంతో వర్షపాతాన్ని అంగుళాలు, సెంటీమీటర్లు, మిల్లీమీటర్లలో కూడా తెలుసుకోవచ్చు. వర్షపాతం అనేది అవపాతం కాదు. ఇది అవపాతంలో ఒక భాగం మాత్రమే. ఒక రోజులో 2.5 మిల్లీమీటర్లు లేదా అంతకంటే ఎక్కువ వర్షం కురిస్తే ఆ రోజును వర్షపు రోజు (Rain day)  అంటారు. ప్రపంచ వార్షిక సగటు వర్షపాతం 975 మిల్లీమీటర్లు. ఇది భూగోళమంతా ఒకేలా విస్తరించి లేదు. కొన్ని ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదుకాగా, మరికొన్ని చోట్ల అత్యల్ప వర్షపాతం నమోదవుతుంది.
రకాలు: భౌగోళిక ప్రాంతాలనుబట్టి వర్షపాతం మారుతూ ఉంటుంది. అది సంభవించే విధానం ఆధారంగా మూడు రకాలుగా విభజించారు. 
1) పర్వతీయ వర్షపాతం (Orographic Rainfall)
2) సంవహన వర్షపాతం  (Convectional Rainfall) 
3) చక్రవాత వర్షపాతం  (Cyclonic Rainfall)


పర్వతీయ వర్షపాతం: దీన్నే ఓరోజెనిక్‌ వర్షపాతం అని కూడా పిలుస్తారు. గ్రీకు భాషలో ‘ఓరెస్‌’ అంటే పర్వతం అని అర్థం. 
* తేమతో కూడిన గాలి ప్రయాణిస్తున్న దారిలో పర్వతం లేదా ఎత్తైన అవరోధం వల్ల పైకి లేచినప్పుడు ఈ రకమైన వర్షపాతం కురుస్తుంది. 
* ఈ కారణంగానే పర్వతాల్లో గాలికి అభిముఖంగా ఉన్న వాలులపై వర్షాలు బాగా పడతాయి. దీనికి వ్యతిరేకంగా ఉన్న వాలుల మీదుగా గాలి కిందికి దిగే ప్రాంతంలో వర్షం తక్కువగా ఉంటుంది. 
* పర్వత పవనాభిముఖ దిశలో మాత్రమే వర్షం సంభవిస్తుంది. పర్వత పరాన్ముఖ దిశల్లో వర్షం కురవదు. 
* ప్రపంచవ్యాప్తంగా, మనదేశంలోనూ సంభవించే వర్షపాతం ఎక్కువగా పర్వతీయ రకానికి చెందిందే. 
* అరేబియా సముద్రం నుంచి వచ్చే తేమతో కూడిన గాలులు పశ్చిమ కనుమల వద్దకు చేరతాయి. అవి అక్కడ పైకి లేచే క్రమంలో విస్తరించి చల్లబడి వాన కురుస్తుంది. 
* పశ్చిమ కనుమల రెండో వైపున దిగే గాలిలో తేమ ఉండదు. దక్కన్‌ పీఠభూమి మధ్య భాగంలో వానలు తక్కువ కాబట్టి ఈ ప్రాంతం పొడిగా ఉంటుంది. దీన్ని వర్షఛ్చాయ ప్రాంతం (leeward) అంటారు.
* పవన అభిముఖ దిశలో (Windward Direction) భారీగా పర్వతీయ వర్షపాతం కురుస్తుంది. పర్వతాల పైకి వెళ్లేకొద్దీ వర్షపాతం ఎక్కువగా ఉంటుంది.
* ఆరావళి పర్వతాలు అరేబియా శాఖకు చెందిన కొన్ని వాయు ప్రవాహాలకు సమాంతరంగా ఉంటాయి. దీంతో అక్కడి పవనాలు కచ్, థార్‌ ఎడారి ప్రాంతాలను దాటి జమ్మూ-కశ్మీర్‌ ప్రాంతాన్ని చేరతాయి. ఈ వాయుప్రవాహాలకు ఎలాంటి ఆటంకం కలిగించే పర్వతాలు లేదా ఎత్తైన అవరోధాలు లేవు. అందుకే కచ్, థార్‌ ప్రాంతాలు ఎడారిగా మారాయి.

 

సంవహన వర్షపాతం: ఇది భారతదేశంలో వేసవికాలంలో, ప్రపంచంలో భూమధ్యరేఖ ప్రాంతాల్లో సంభవిస్తుంది.
* అధిక ఉష్ణం కారణంగా ఉపరితలంతో పాటు తేమ కలిగిన గాలి కూడా వేడెక్కి పైకి లేస్తుంది. అది చల్లబడటం ద్వారా పడే వర్షాన్ని సంవహన వర్షపాతం అంటారు. 
* ఈ రకం వర్షపాతం తక్కువ ఎత్తుల్లోనూ, ఖండాల లోపలి ప్రాంతాల్లో ఏప్రిల్, మే నెలల్లో కురుస్తుంది. 
* సముద్ర తీర ప్రాంతాల్లో ఇది ఉండదు. 
* సాధారణంగా సంవహన వర్షపాతం, రోజులో బాగా వేడెక్కిన తర్వాత హఠాత్తుగా పెద్ద జల్లులుగా కురుస్తుంది. ఆ సమయంలో ఒక్కోసారి ఉరుములు, మెరుపులు సంభవిస్తాయి.
* మనదేశంలో ఈ వర్షపాతాన్ని ‘రుతుపవన ఆరంభ జల్లులు’ అని కూడా పిలుస్తారు. 
* ప్రాంతాల బట్టి దీని పేరు మారుతుంటుంది. 

రాష్ట్రాలు పేర్లు
ఆంధ్రప్రదేశ్‌ ఏరువాక జల్లులు
తెలంగాణ తొలకరి జల్లులు
కర్ణాటక చెర్రి బ్లాసం
కేరళ, ఈశాన్య రాష్ట్రాలు మామిడి జల్లులు
అసోం నార్వెస్టర్‌
పశ్చిమ్‌ బెంగాల్, ఝార్ఖండ్‌ కాలభైశాఖీలు
ఉత్తర్‌ ప్రదేశ్‌ ఆంధీలు/ గుడ్డిజల్లులు


చక్రవాత వర్షపాతం: ఇది రెండు రకాలు  
1. ఉష్ణ ప్రాంతపు తుపానులు
2. సమశీతోష్ణ ప్రాంతపు తుపానులు

* ట్రోపో ఆవరణంలోని అల్పపీడన ప్రాంతం చుట్టూ అతివేగంగా తిరిగే పవన వ్యవస్థను చక్రవాతం లేదా తుపాన్‌ అంటారు. చక్రవాత కేంద్ర భాగాన్ని చక్రవాత కేంద్రం లేదా చక్రవాత కన్ను అంటారు. ఈ పవనాలు సుడిగుండం మాదిరిగా తిరుగుతూ ఉంటాయి. కాబట్టి వీటిని ‘వాయు గుండాలు’ అని కూడా పిలుస్తారు. 
* చక్రవాతం లేదా సైక్లోన్‌  (Cyclone)  అనే పదం కిక్లాస్‌  (Kyklos) అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. కిక్లాస్‌ అంటే ‘పాము చుట్ట (Coil of a snake) అని అర్థం. 
* సైక్లోన్‌ అనే పదాన్ని 1948లో హెన్రీ పెడ్డింగ్‌టన్‌ అనే నావికుడు ఉపయోగించారు. 
* సమభార రేఖలు గుండ్రంగా ఉంటాయి. ఇందులో బాహ్యపీడనం ఎక్కువగా, లోపలి పీడనం తక్కువగా ఉంటుంది. 
* చక్రవాతంలోని కేంద్రం తుపాన్‌ తీవ్రతను పెంచుతుంది. ఇందులో అల్పపీడనం ఉంటుంది. దీన్ని ఆక్రమించడానికి పవనాలు అధిక పీడన ప్రాంతం నుంచి అతివేగంగా వీస్తూ ఉంటాయి. ఫెరల్‌ సూత్రం (లేదా) కొరియాలీస్‌ ప్రభావం వల్ల ఈ పవనాలు ఉత్తరార్ధ గోళంలో అపసవ్య దిశలో (Anti Clockwise), దక్షిణార్ధ గోళంలో సవ్య దిశలో (Clockwise) తిరుగుతుంటాయి.


రకాలు: చక్రవాతాలను భౌగోళిక అంశాల ఆధారంగా రెండు రకాలుగా వర్గీకరించారు.
1. ఉష్ణమండల చక్రవాతాలు: భూమధ్యరేఖకు రెండువైపులా 6 నుంచి 20 డిగ్రీల వరకు విస్తరించి ఉన్న సముద్రాల్లో ఏర్పడే చక్రవాతాలను ఉష్ణమండల చక్రవాతాలు అంటారు. ఈ తుపాన్‌లను వివిధ ప్రాంతాల్లో వేర్వేరు పేర్లతో పిలుస్తారు.

* హరికేన్లు - పశ్చిమ ఇండిస్‌
* టైపూన్లు - చైనా, జపాన్‌
* టర్నోడోలు, సుడిగాలులు - అమెరికా సంయుక్త రాష్ట్రాలు
* విల్లీవిల్లీలు - ఆస్ట్రేలియా
* తుపాన్‌లు - హిందూమహాసముద్రం
* బగూయియేస్‌ - ఫిలిప్పీన్స్‌


2. సమశీతోష్ణ మండల చక్రవాతాలు: ఇవి సమశీతోష్ణ మండలంలో 20 నుంచి 60 డిగ్రీల ఉత్తర, దక్షిణ అక్షాంశాల మధ్య ఉన్న సముద్రాల్లో ఏర్పడతాయి. 
* విలక్షణాలు కలిగిన రెండు వాయురాశులు ఎదురెదురుగా కలుసుకున్నప్పుడు మాత్రమే ఇవి ఆవిర్భవిస్తాయి.
* భారత్‌ సగటు వర్షపాతం 117 సెం.మీ. 
* భారతదేశంలో అత్యల్ప వర్షపాతం ఉన్న ప్రాంతం జైసల్మీర్‌
* మనదేశంలో అత్యధిక వర్షపాతం నైరుతి రుతుపవన కాలంలో సంభవిస్తుంది. 
* ఈ రుతుపవనాలు భారతదేశ విశిష్ట రూపం కారణంగా రెండు శాఖలుగా విడిపోయాయి. అవి: 1. బంగాళాఖాతం శాఖ,  2. అరేబియా శాఖ 
* ఇవి విడివిడిగా ప్రయాణించి దేశంలో అత్యధిక మొత్తంలో వర్షపాతాన్ని కలిగిస్తున్నాయి. 
* ఈ నైరుతీ రుతుపవనాలు తిరోగమించి, ఈశాన్య రుతుపవనాల రూపంలో తమిళనాడు, ఆంధ్రా తీరానికి అధిక వర్షపాతాన్ని అందిస్తున్నాయి. 
* ఈశాన్య రుతుపవనాల కాలంలో బంగాళాఖాతంలో ఉష్ణమండల చక్రవాతాలు ఏర్పడి, అధిక వర్షపాతాన్ని కలిగిస్తాయి.

భారతదేశంలో రుతువులు వర్షపాతాలు
వేసవికాలం సంవహన వర్షపాతం
నైరుతి రుతుపవనకాలం పర్వతీయ వర్షపాతం
ఈశాన్య రుతుపవనకాలం చక్రవాత వర్షపాతం
శీతాకాలం -


భారతదేశంలో రుతుపవన వ్యవస్థను ప్రభావితం చేసే అంశాలు
* ఎల్‌నినో  (EL NINO) 
* లానినో  (LA NINO) 
* అంతర ఆయనరేఖ అభిసరణ మండలం
* అక్టోబర్‌ హీట్‌  
* దక్షిణ డోలనం 
* వాకర్‌ సర్క్యులేషన్‌


ఎల్‌నినో: ఎల్‌నినో అంటే బాలక్రీస్తు అని అర్థం. దక్షిణ అమెరికా ఖండం, పసిఫిక్‌ మహాసముద్రం దగ్గర్లో ఉండే ‘పెరూ’ దేశ తీరప్రాంతంలో సముద్రనీటి ఉష్ణోగ్రత అనూహ్యంగా పెరిగి అధిక ఉష్ణోగ్రత ఏర్పడుతుంది. దీంతో ఇక్కడ ప్రవహించే శీతల ప్రవాహస్థానాన్ని ఉష్ణప్రవాహం ఆక్రమించి, అధిక స్థాయిలో అల్పపీడనం ఏర్పడుతుంది. దీన్నే ‘ఎల్‌నినో’ అంటారు. ఇది డిసెంబరులో క్రిస్ట్‌మస్‌ రోజుల్లో సంభవిస్తుంది. ఎల్‌నినో ఒక ఉష్ణసముద్ర ప్రవాహం. దీని ప్రభావం వల్ల పెరూ తీరంలో అధిక వర్షపాతాలు సంభవిస్తాయి. భారతదేశంలోకి వీచే నైరుతి రుతుపవనాలు పెరూ తీరం వైపు ప్రయాణించడం వల్ల మనదేశంలో వర్షపాతం తగ్గుతుంది. దీనివల్ల దేశంలో కరవు పరిస్థితులు ఏర్పడతాయి. ఎల్‌నినో వల్ల పెరూలో అత్యధిక వర్షపాతం సంభవిస్తుంది.


లానినో: లాటిన్‌లో లానినో అంటే ఆడశిశువు అని అర్థం. ఇది ఎల్‌నినోకు పూర్తిగా విరుద్దమైంది. పసిఫిక్‌ మహాసముద్రంలో పెరూ తీరం పక్కగా వెళ్లే హాంబోల్ట్‌ శీతల ప్రవాహం మూలంగా ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు తగ్గి అధిక పీడన పరిస్థితులు ఏర్పడుతాయి. దీన్నే లానినో అంటారు. దీని ప్రభావం వల్ల భారతదేశం వైపునకు రుతుపవనాలు అధికంగా వీచి అత్యధిక వర్షపాతాన్ని నమోదుచేస్తున్నాయి. లానినో ఫలితంగా భారత్‌లో వరదలు సంభవిస్తున్నాయి. దీని ప్రభావం వల్ల పెరూతీరంలో వర్షపాతం తగ్గుతుంది.
 

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వర్షపాతం సంభవించే ప్రాంతాలు

ప్రపంచ స్థానం అత్యధికంగా వర్షపాతం సంభవించే ప్రాంతాలు నమోదైన వర్షపాతం (సెం.మీ.లలో)
మొదటి హవాయి దీవుల్లోని కౌవాయి ద్వీపంలోని వయలీలి శిఖరం 1234.4
రెండు భారతదేశ ఈశాన్య ప్రాంతం - ఖాసి కొండల్లోని మౌసిన్రామ్‌ 1141.0
మూడు అసోంలోని చిరపుంజి

1087.4

నాలుగు ఆఫ్రికా ఖండంలోని మౌంట్‌ కెమరూన్‌ శిఖరం 1016
Posted Date : 22-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌