• facebook
  • whatsapp
  • telegram

 ప్రాంతీయ సంస్థలు

ప్రపంచ దేశాల మధ్య సహకారాన్ని, ప్రాంతీయ సమతౌలత్యను పెంపొందించడానికి, వర్ధమాన దేశాలకు అవసరమైన తోడ్పాటును అందించేందుకు వివిధ ప్రాంతీయ, అంతర్జాతీయ కూటములను ఏర్పాటు చేశారు. ఇవి ఆయా లక్ష్యాలను సాధించేందుకు తమ వంతు కృషి చేస్తున్నాయి. 


జీ-8 దేశాల కూటమి
చమురు ధరలు విపరీతంగా పెరగడంతో నెలకొన్న ఆర్థిక సంక్షోభంపై చర్చించడానికి 1975లో అప్పటి ఫ్రాన్స్‌ అధ్యక్షుడు వెలారీ గిస్కార్‌ డిఎస్టెంగ్, నాటి జర్మనీ ఛాన్సలర్‌ హెల్మట్‌ సిండ్‌ ఫ్రాన్స్‌లో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.  దీనికి కొనసాగింపుగా 1976, జూన్‌లో పోర్టారికోలోని సాన్‌జువాన్‌లో మరో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ఫ్రాన్స్, జర్మనీ, అమెరికా, బ్రిటన్, ఇటలీ, జపాన్, కెనడా దేశాలతో కూడిన ‘జీ - 7’ అధికారికంగా ఏర్పడింది. ఈ కూటమి ప్రపంచ దేశాల ఆర్థికాభివృద్ధి, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, వాణిజ్య సంబంధ అంశాలను చర్చించడంతో పాటు, వర్ధమాన దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు ‘అంతర్జాతీయ వేదిక’గా మారింది. కొంతకాలానికి ఇది అంతర్జాతీయ రాజకీయాలను కూడా చర్చించే వేదికగా మారి, ప్రబలమైన కూటమిగా అవతరించింది.
* 1997లో డెన్వర్‌లో జరిగిన జీ-7 కూటమి సమావేశంలో రష్యాను సభ్యదేశంగా చేర్చుకున్నారు. దీంతో ఇది జీ-8 కూటమిగా మారింది.


దక్షిణాసియా ప్రాంతీయ సహకార మండలి (సార్క్‌)
దక్షిణాసియా దేశాల మధ్య పరస్పర ప్రాంతీయ సహకారాన్ని పెంపొందించాలని బంగ్లాదేశ్‌ మాజీ అధ్యక్షులు జియావుర్‌ రెహమాన్‌ భావించారు. దీనికోసం సార్క్‌ ను ఏర్పాటు చేయాలని ఆయన ప్రతిపాదించారు.
* 1985, డిసెంబరు 8న బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో నిర్వహించిన సమావేశంలో సార్క్‌ను ఏర్పాటుచేశారు.
* ప్రారంభంలో ఇందులోని సభ్య దేశాలు 7. అవి: బంగ్లాదేశ్, భూటాన్, భారత్, మాల్దీవులు, నేపాల్, పాకిస్థాన్, శ్రీలంక.
* 2007, ఏప్రిల్‌లో న్యూదిల్లీలో జరిగిన 14వ సార్క్‌ సమావేశాల్లో ఎనిమిదో సభ్యదేశంగా ఆఫ్గనిస్థాన్‌ చేరింది. ప్రస్తుతం ఇందులో ఎనిమిది సభ్యదేశాలు ఉన్నాయి.
* సార్క్‌ సమావేశాలకు పరిశీలక హోదా ఉన్న దేశాలుగా అమెరికా, చైనా, జపాన్, ఇరాన్, యూరోపియన్‌ యూనియన్‌లకు అవకాశం కల్పించారు.


సార్క్‌ లక్ష్యాలు:
* దక్షిణాసియా దేశాల మధ్య పరస్పర సహకారాన్ని పెంపొందించడం.
* ప్రజల సంక్షేమం, వారి జీవన ప్రమాణాల మెరుగుదలకు కృషి చేయడం.
* ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక, సాంకేతిక రంగాల్లో పరస్పర సహకారాన్ని సాధించడం.
* పేదరిక నిర్మూలన, అక్షరాస్యత పెంపుదలకు కృషి చేయడం.
* సీమాంతర ఉగ్రవాదాన్ని నిర్మూలించి, సుస్థిర ప్రగతి, శాంతిని సాధించడం.


సార్క్‌ దేశాల ప్రాంతీయ కేంద్రాలు

ప్రాంతీయ కేంద్రం ప్రధాన కార్యాలయం
వ్యవసాయ సమాచార కేంద్రం ఢాకా
వాతావరణ పరిశోధక కేంద్రం ఢాకా
ట్యూబర్‌క్యులోసిస్ కేంద్రం కాఠ్‌మాండూ
సమాచార కేంద్రం కాఠ్‌మాండూ
మానవ వనరుల అభివృద్ధి కేంద్రం ఇస్లామాబాద్‌
ఇంధన కేంద్రం ఇస్లామాబాద్
విపత్తు నిర్వహణ కేంద్రం న్యూదిల్లీ
డాక్యుమెంటేషన్‌ కేంద్రం న్యూదిల్లీ
కోస్తా ప్రాంతాల నిర్వహణ కేంద్రం మాల్దీవులు
సాంస్కృతిక కేంద్రం  శ్రీలంక
అటవీ కేంద్రం భూటాన్‌
దక్షిణాసియా విశ్వవిద్యాలయం న్యూదిల్లీ
సార్క్‌ ప్రధాన కార్యాలయం కాఠ్‌మాండూ

 

SAFTA - (South Asian Free Trade Agreement) 
సార్క్‌ సభ్యదేశాలు ‘దక్షిణాసియా దేశాల స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం’ ్బళీతినీగిత్శిను 2006, జులై 1 నుంచి అధికారికంగా అమల్లోకి తెచ్చాయి. దీని ప్రకారం భారత్, పాకిస్థాన్, శ్రీలంక దేశాలు 2013 నాటికి తమ కస్టమ్స్‌ సుంకాలు 0  5 శాతం మధ్యలో ఉండేలా చూడాలి. ఆర్థికంగా వెనుకబడిన బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, మాల్దీవులు 2018 నాటికి తమ కస్టమ్స్‌ సుంకాలను 0  5 శాతానికి తేవాలని నిర్దేశించారు.


సార్క్‌ - ఇతర ప్రత్యేకతలు
* సార్క్‌ ఏర్పడి 2010 నాటికి 25 ఏళ్లు పూర్తయ్యాయి. దీంతో థింపూ(భూటాన్‌)లో సార్క్‌ రజతోత్సవ సదస్సును నిర్వహించారు.
* సార్క్‌ 2007ను హరిత దక్షిణాసియా సంవత్సరంగా ప్రకటించింది.
* 1990 - ఇయర్‌ ఆఫ్‌ గర్ల్‌ చైల్డ్‌
* 1995 - ఇయర్‌ ఆఫ్‌ పావర్టీ ఎరాడికేషన్‌
* 1999 - ఇయర్‌ ఆఫ్‌ బయోడైవర్సిటీ
* 2008 - ఇయర్‌ ఆఫ్‌ గుడ్‌ గవర్నెన్స్‌


జీ-20 దేశాల కూటమి
అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను సుస్థిరం చేసేందుకు అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలను సమన్వయం చేసి ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకు 1999లో ‘జీ-20’ దేశాల కూటమి ఏర్పడింది. దీన్ని ప్రారంభించిన మొదట్లో ఏటా ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకు గవర్నర్ల సమావేశాలు జరిగేవి.
* 2008లో నెలకొన్న ఆర్థిక సంక్షోభం తర్వాత ఇది ఆర్థిక విధానాల్లో సహకారం అందించుకునే దేశాధినేతల వేదికగా మారింది. ఇది నిర్వహించే సమావేశాల్లో ప్రపంచ ఆర్థిక సుస్థిరత, ఆర్థిక ప్రగతి కొనసాగింపునకు అవసరమైన అనేక తీర్మానాలు రూపొందించి అమలు చేస్తోంది.
* 1999 వరకు జీ-8 కూటమిలోని సంపన్న దేశాలు మాత్రమే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గమనాన్ని నిర్దేశిస్తూ వచ్చాయి. జీ-20 కూటమి ఏర్పాటుతో అభివృద్ధి చెందుతున్న దేశాలకు కూడా ఈ వేదికపై ప్రాతినిధ్యం లభించింది.
* అంతర్జాతీయ ఆర్థిక స్థిరత్వ సాధన కోసం కీలక విధానాల రూపకల్పనకు, పారిశ్రామిక దేశాలు, కొత్తగా ఎదుగుతున్న మార్కెట్‌ దేశాల మధ్య చర్చలు, అధ్యయనం, సమీక్షను ప్రోత్సహించడం జీ-20 కూటమి లక్ష్యం. ఇందులో బ్రిట్టన్‌ ఉడ్స్‌ కవలలైన అంతర్జాతీయ ద్రవ్యనిధి, ప్రపంచబ్యాంక్‌ కూడా భాగస్వాములుగా ఉన్నాయి.
* జీ-20 కూటమిలో అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, యూరోపియన్‌ యూనియన్, ఫ్రాన్స్, జర్మనీ, భారత్, ఇండోనేసియా, ఇటలీ, జపాన్, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా, టర్కీ, బ్రిటన్, అమెరికా దేశాలకు సభ్యత్వం ఉంది.


జీ-20 కూటమి 15వ శిఖరాగ్ర సదస్సు
* జీ-20 దేశాధినేతల 15వ శిఖరాగ్ర సదస్సు 2020, నవంబరు 21, 22 తేదీల్లో వర్చువల్‌ విధానంలో జరిగింది. ఈ సమావేశానికి సౌదీ అరేబియా అధ్యక్షత వహించింది.
* ‘21వ శతాబ్దంలో అందరికీ అవకాశాలను గుర్తించడం’ అనే నినాదంతో ఈ సదస్సు  జరిగింది. ఈ సదస్సులో ప్రధానంగా కొవిడ్‌-19 సంక్షోభం, దాని ప్రభావం నేపథ్యంలో అంతర్జాతీయంగా సమ్మిళిత, సుస్థిరత, ఆర్థిక పురోగమనం సాధించడం ఎలా అనే అంశాలపై  చర్చలు జరిగాయి. కొవిడ్‌ లాంటి వ్యాధులను ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలు సంసిద్ధంగా ఉండటం, ప్రజల సంక్షేమం, పరిరక్షణ కోసం ప్రణాళికలు రూపొందించడం, అందుకు అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చుకోవడం మొదలైన అంశాలపై కూడా సమావేశంలో చర్చించారు.


భారత ప్రధాని ప్రసంగం
* 2020, నవంబరు 21న భారత ప్రధాని నరేంద్ర మోదీ జీ-20 దేశాల కూటమి సమావేశంలో ప్రసంగించి, కింది అంశాలను ప్రస్తావించారు.
* రెండో ప్రపంచయుద్ధం తర్వాత భూమి మీద మానవాళి ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు కొవిడ్‌-19.
* జీ-20 దేశాలు అంతర్జాతీయ ఆర్థిక పురోగమన అంశంపైనే కాకుండా భూగోళం పరిరక్షణ, భవిష్యత్తులో మానవుల మనుగడను దృష్టిలో ఉంచుకుని నిర్దిష్ట ప్రణాళికలు రూపొందించాలి.
* కొవిడ్‌-19 అనంతరం ప్రపంచంలో ఒక కొత్త అంతర్జాతీయ సూచీని రూపొందించాలి. ఈ సూచీలో 4 ప్రధానాంశాలు ఉండాలి. అవి:
1. ప్రపంచవ్యాప్తంగా విస్తృతస్థాయిలో ప్రతిభావంతుల బృందాన్ని రూపొందించడం.
2. కొత్త సాంకేతికతలు సమాజంలో అన్ని వర్గాలకూ అందేలా చేయడం.
3. పాలనా వ్యవస్థల్లో పారదర్శకతను సాధించడం.
4. భూగ్రహాన్ని పరిరక్షించే స్ఫూర్తిని అన్ని దేశాలు పెంపొందించడం.


భవిష్యత్తులో జీ-20 సమావేశాలు, వేదికలు
* జీ-20 కూటమి దేశాల సమావేశాలకు 2021లో ఇటలీ; 2022లో ఇండోనేసియా; 2023లో భారత్‌; 2024లో బ్రెజిల్‌ అధ్యక్షత వహిస్తాయి.

Posted Date : 22-04-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌