• facebook
  • whatsapp
  • telegram

ప్రాంతీయతత్వం

విడివిడిగా.. కలివిడిగా!భిన్నత్వంలో ఏకత్వం భారత్‌ ప్రత్యేకత. ఎన్నో భాషలు, జాతుల కలయికగా ఈ దేశం వెలుగుతోంది. ఇక్కడ భౌగోళిక వైరుధ్యాలూ ఎక్కువే. ఆర్థిక, సామాజిక వ్యత్యాసాలు ఉన్నాయి. రాజకీయ నాయకుల స్వార్థం, భాషాతత్వం, సాంస్కృతిక ఆధిపత్యం లాంటివన్నీ ప్రజల మధ్య సంకుచిత భావాలను పెంచుతున్నాయి. తమ ప్రాంతం, భాష, సంస్కృతి, ఆచారాలే గొప్పవనే ధోరణిని వృద్ధి చేస్తున్నాయి. అదే ప్రాంతీయతత్వం. దాని వల్ల ఉద్యమాలు పుట్టుకొస్తున్నాయి. విధ్వంసాలు జరుగుతున్నాయి. అందుకే ప్రగతి కోసం ప్రాంతాలుగా విడిపోయినా, జాతీయత కోణంలో కలిసిమెలిసి సమైక్యతతో సాగాల్సిన అవసరాన్ని ప్రచారం చేయాలి. ఈ నేపథ్యంలో ప్రాంతీయతత్వం  పూర్వాపరాలు, అది ప్రబలంగా ఉన్న ప్రాంతాలు, పర్యవసానాలు, పరిష్కార మార్గాల గురించి కాబోయే ప్రభుత్వ ఉద్యోగులు తెలుసుకోవాలి. 


భారతదేశం స్థూలంగా ఎదుర్కొంటున్న సమస్యల్లో ప్రాంతీయతత్వం ఒకటి. 1980వ దశకంలో పంజాబ్‌ ఉద్యమం, 1990లో కశ్మీర్‌ ఉద్యమం, 1970 దశకంతోపాటు 21వ శతాబ్దం తొలిదశకంలో జరిగిన తెలంగాణ ఉద్యమాలు ప్రాంతీయతత్వానికి ఉదాహరణలు.


ఒక ప్రాంతంతో అక్కడ నివసించే ప్రజలకు ఉన్న సంబంధాన్ని లేదా ఆ ప్రాంతాన్ని తమ సొంతంగా భావించే తత్వాన్ని ప్రాంతీయతత్వం అంటారు. ప్రజల ప్రవర్తన, దృక్పథాలు, నమ్మకాల్లో ఈ తత్వం వ్యక్తమవుతూ ఉంటుంది. ప్రాంతీయతత్వం జాతీయతత్వానికి లోబడే ఉండాలి. అయితే ఒక్కోసారి ఇది జాతీయ ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉంటుంది. ఆదివాసీ ప్రాంతాల్లో (గోండు, బోడో, నాగా) ప్రాంతీయతత్వం తలెత్తి శతాబ్దాలు కావస్తోంది.


ప్రాంతీయతత్వానికి కారణాలు:

1) భౌగోళిక తేడాలు: వివిధ ప్రాంతాల్లోని భౌగోళిక భిన్నత్వం ప్రాంతీయతత్వానికి దారితీస్తుంది. ప్రాంతీయత ప్రాతిపదికన వేరుపడాలనే భావన, జీవన విధానం, ఆచారం, ఆదర్శం, విలువలు లాంటి భేదాల ఆధారంగా ప్రాంతీయతత్వం ఆవిర్భవిస్తుంది.


2) చారిత్రక ప్రాతిపదిక: ఉత్తరాది ప్రజలకు వనరులు తక్కువగా ఉన్నాయని, అందువల్లే వాళ్లు దక్షిణాది ప్రజలను జయించి పెత్తనం చెలాయించారని చరిత్ర చెబుతోంది. ఈ ప్రాతిపదికనే ఉత్తర, దక్షిణ ప్రాంతాలు ఏర్పడ్డాయని అంటారు.


3) రాజకీయ ప్రయోజనాలు: రాజకీయ నాయకులు పార్టీల ద్వారా ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొట్టి ప్రయోజనాలు పొందుతుంటారు.

ఉదా: పంజాబ్‌లో ప్రత్యేక పంజాబ్‌ కోసం కొన్ని పార్టీలు ఉద్యమం నడిపాయి.


4) మానసిక పరిస్థితి: ఒక ప్రాంత ప్రజలను దీర్ఘకాలం పాటు పట్టించుకోకుండా ఉంటే వారిలో అసూయ, ద్వేషాలు ఏర్పడతాయి. ఈ పరిస్థితి బాగా ముదిరినప్పుడు ప్రాంతీయతత్వం తలెత్తుతుంది.

ఉదా: ఈశాన్య ప్రాంతంలోని నాగాల్లో 39 తెగలున్నాయి. ప్రతి తెగకు తనదైన విశిష్టత, భౌగోళిక విస్తరణ, ప్రత్యేక భాష ఉండేవి. కొండ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు లేకపోవడంతో, చిన్నచిన్న గ్రామాల్లో నాగాలు నివాసం ఉండేవారు. ప్రతి గ్రామం చుట్టూ బారికేడ్లు, గోడలు, గేట్లు ఉండేవి. బ్రిటిష్‌ హయాంలో వారున్న ప్రాంతంలో రవాణా సౌకర్యాలు కల్పించారు. దీంతో అస్సాంలోని ప్రజలు తరచూ నాగాలున్న ప్రాంతానికి వెళ్లి వారిని దోపిడీ చేశారు. నాగాలంతా కలిసి అస్సాం ప్రజలను ఎదుర్కొన్నారు. ఆ విధంగా వారందరిలో ప్రాంతీయభావం ఏర్పడింది. 

రాజకీయ యంత్రాంగాన్ని రూపొందించుకొని ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటాలు చేశారు. అంటే ప్రాంతీయతత్వం, బాహ్య పరిస్థితుల వల్ల వారిలో నరవర్గ భావన ఏర్పడింది. ఆదిలాబాద్‌లోని గోండులు కూడా ఇదే తరహా ప్రాంతీయతత్వానికి గురయ్యారు. ఆదివాసేతరులు గోండులకు రుణాలిచ్చి వాటిని చెల్లించలేనప్పుడు వారి భూములను స్వాధీనం చేసుకునేవారు. దీనివల్ల గోండుల్లో నరవర్గ భావన పటిష్ఠమై, ప్రాంతీయ భావన బలపడింది. 1941లో కొమురం భీమ్‌ నాయకత్వంలో ప్రత్యేక గోండు రాష్ట్రం కావాలని పట్టుబట్టారు. 1960లో హీరాసింగ్‌ నాయకత్వంలో ‘ఆదివాసీ కల్యాణ సమితి’ ఉద్యమం మొదలై 1965 నాటికి తీవ్రస్థాయికి చేరింది. ఛత్తీస్‌గఢ్‌ ఏర్పాటుతో ఈ ఉద్యమం సద్దుమణిగింది. ఆ విధంగా నరవర్గ భావన, ప్రాంతీయతత్వం ఒకదాంతో మరొకటి ముడిపడ్డాయి.


5) భాషాతత్వం: ప్రాంతీయతత్వం ఏర్పడటంలో భాషాతత్వం ముఖ్య పాత్ర పోషిస్తుంది.

ఉదా: బోడో ఉద్యమం. అస్సాంలోని బోడో కచారి అనే తెగ ఉదయాచల్‌ అనే ఉద్యమాన్ని లేవదీసింది. బోడో భాష ఉన్నతమైందని, అస్సామీలతో కలిసి ఉన్నంత వరకు తమ భాషాభివృద్ధి ఉండదని, సాంస్కృతిక విశిష్టతను కోల్పోవాల్సి వస్తుందని, రాజకీయ మనుగడ కుదరదని భావించి ఈ ఉద్యమాన్ని లేవదీశారు. ఇక్కడ నరవర్గవాదం, భాషాతత్వం, ప్రాంతీయతత్వం మూడూ కలిసి ఉదయాచల్‌ ఉద్యమానికి దారితీశాయి.


6) సాంస్కృతిక తేడాలు: వివిధ ప్రాంతాల్లో ప్రజల సాంస్కృతిక వైవిధ్యం కూడా ప్రాంతీయతత్వానికి మూలమైంది.

ఉదా: ఝార్ఖండ్‌ ఉద్యమం. 1918లో చోటానాగపుర్‌లోని తెగల్లో క్రైస్తవ విద్యాధీకులు చోటానాగపుర్‌ అభివృద్ధి సమాజాన్ని స్థాపించారు. 1938-39 ప్రాంతంలో ఈ ఉద్యమం తీవ్రమై ఆదివాసీ మహాసభగా మారింది. ఇది 1949లో ఝార్ఖండ్‌ పార్టీలో విలీనమైంది. 1952-57 నాటికి ఈ పార్టీ పటిష్ఠమైంది. ఆ తర్వాత 1960 నాటికి బలహీనపడింది. తిరిగి 1967లో ఝార్ఖండ్‌ ముక్తి మోర్చా పార్టీ రూపంలో ప్రత్యేక రాష్ట్రం కోసం పట్టుబట్టింది. ఆదివాసీల సంప్రదాయాలను పునరుద్ధరిస్తూ, అన్యాక్రాంతమైన ఆదివాసీల భూములను తిరిగి కైవసం చేసుకుంటూ ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇదేక్రమంలో చోటానాగపుర్‌లోని ఆదివాసులంతా ఏకమయ్యారు. నరవర్గ భావన వారిలో బలపడింది. పట్టణీకరణ, ఆధునికీకరణ ప్రభావాలు వారిలో ఐకమత్యాన్ని మరింతగా పెంచాయి. ఆదివాసేతరులను ఝార్ఖండ్‌ ప్రాంతం నుంచి పంపిచేయాలని, లేకపోతే తమ ఉనికికే ముప్పు వస్తుందని పట్టుబట్టారు. ఆ విధంగా సాంస్కృతిక, నరవర్గాత్మక, ప్రాంతీయతత్వాలన్నీ కలిసి పనిచేయడంతో ఝార్ఖండ్‌ రాష్ట్రం ఏర్పడింది.ప్రాంతీయతత్వ పరిణామాలు:  ప్రాంతీయతత్వంతో ఎన్నో దుష్పరిణామాలు ఎదురవుతున్నాయి. రాజకీయాలు, ఆర్థికాభివృద్ధి, జాతీయ సమైక్యత దెబ్బతింటున్నాయి.


జాతీయ సమైక్యతకు సవాలు: ప్రాంతీయ భేదాలు సంకుచిత భావాలను సృష్టిస్తాయి. జాతీయ లక్ష్యాలను దెబ్బతీస్తాయి. ఈ పరిస్థితుల్లో సామరస్యం దెబ్బతింటుంది.


ప్రాంతీయ సమూహాల మధ్య ఉద్రిక్తతలు: ప్రాంతీయతత్వం తీవ్రమైనప్పుడు సంబంధిత నాయకులు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి వాళ్ల షరతులు అంగీకరించే విధంగా చేస్తారు. దీనివల్ల ప్రాంతాల మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడి హింసాత్మక సంఘటనలకు దారితీస్తాయి.


స్వార్థ రాజకీయాలు: ప్రాంతీయతత్వానికి ఆజ్యం పోసిన తర్వాత రాజకీయ నాయకులు స్వార్థపూరిత రాజకీయాలు సృష్టిస్తారు. బయటకు మాత్రం ప్రాంతీయ ప్రయోజనాల గురించి మాట్లాడుతూ, లోపల మాత్రం స్వలాభం, రాజకీయ లబ్ధి కోసమే పాకులాడుతారు. దేశ స్వాతంత్య్రానికి ఇది గొడ్డలిపెట్టు లాంటిది.


భాషావాదాన్ని ప్రోత్సహించడం: ప్రాంతీయతత్వ ప్రభావంతో ప్రజలు తమ ప్రాంతం, భాష మాత్రమే ఉన్నతమైనవని, ఉపయోగకరమైనవని భావిస్తారు. అన్యభాషల పట్ల ద్వేషం వ్యక్తం చేస్తారు. పర్యవసానంగా భాషాతత్వం చెలరేగుతుంది.


ఆర్థికాభివృద్ధికి అడ్డంకి: ప్రాంతీయతత్వం ప్రభావంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే నాయకులు తమ ప్రాంతాల్లో పరిశ్రమలకు అనువైన పరిస్థితులు ఉన్నా, లేకపోయినా పరిశ్రమలు నెలకొల్పాలని ఒత్తిడి తెస్తుంటారు. ఈ పరిస్థితి దేశ ఆర్థిక వృద్ధికి ఆటంకమవుతుంది.


సాంస్కృతిక సమైక్యతకు అడ్డంకులు: ప్రాంతీయతత్వం వల్ల ఉత్పన్నమయ్యే సంకుచిత భావాల ప్రభావంతో వివిధ ప్రాంతాల్లోని రేడియో, వార్తాపత్రికలు ఆ ప్రాంతాల్లోని వేషభాషలు, ఆచార వ్యవహారాలే ఉన్నతమైనవని చాటుకుంటాయి. ఈ పరిణామం సాంస్కృతిక సామరస్యాన్ని దెబ్బతీస్తుంది.


పరిపాలనాపరమైన అడ్డంకులు: ప్రాంతీయ భావాల వల్ల ప్రభుత్వ ప్రతినిధులు కేవలం ప్రాంతీయ సమస్యలను, అక్కడి ప్రజాప్రతినిధుల సమస్యలను పరిష్కరించడలోనే నిమగ్నమవుతున్నారు. ఫలితంగా సాధారణ పరిపాలనకు తీవ్ర విఘాతం ఏర్పడుతుంది.


కేంద్ర, రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలు: స్వార్థపరులైన నాయకులు, రాజకీయ నేతలు, వ్యాపారులు తమ ప్రాంతానికే ప్రాధాన్యం ఇచ్చి వాటిని మాత్రమే బాగుచేయాలనే సంకల్పంతో ప్రభుత్వ నిధులు రాబట్టేందుకు ప్రయత్నిస్తుంటారు. ప్రభుత్వం ఒక ప్రాంతం విషయంలో కొంత సడలింపుతో సహాయం చేస్తే, ఇతర ప్రాంతాల్లో అసహనం తలెత్తుతుంది. ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉద్రిక్తతలు సృష్టిస్తుంది.


ప్రాంతీయతత్వాన్ని నిర్మూలించే మార్గాలు: 

1) అన్నిప్రాంతాల ఆర్థికాభివృద్ధిపై దృష్టి సారించాలి. 

2) జాతీయ సమైక్యత గురించి విస్తృత ప్రచారం చేయాలి. 

3) జాతి చరిత్రను ప్రత్యేకంగా నొక్కి చెబుతూ ఉండాలి. 

4) జాతీయ భాషను వ్యాప్తి చేయాలి. 

5) ప్రజలకు సరైన విద్య అందించాలి. 

6) ప్రాంతీయ సమూహాల మధ్య సాంస్కృతిక సంబంధాలు పెంపొందించాలి.

7) కేంద్ర కేబినెట్‌లో వివిధ ప్రాంతాలకు ప్రాతినిధ్యం కల్పించడంలో సమతౌల్యత పాటించాలి. 

8) రోడ్డు రవాణా సౌకర్యాలను విస్తరింపజేయాలి.

9) వివిధ ప్రాంతాల్లో విజ్ఞానయాత్రలు నిర్వహించాలి. 

10) ప్రాంతీయతత్వం ఉన్న రాజకీయ పార్టీలను నిషేధించాలి.


రచయిత: వట్టిపల్లి శంకర్‌రెడ్డి
 

Posted Date : 29-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌