• facebook
  • whatsapp
  • telegram

నియంత్రిత సంస్థ‌లు

ప్రజలకు మెరుగైన సేవలు అందించి, ప్రైవేటీకరణ ద్వారా ఏర్పడే దుష్ఫలితాలను నివారించడానికి, వివిధ సంస్థలు నిర్వహించే కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు భారత్‌లో నియంత్రిత సంస్థలను ఏర్పాటు చేశారు. మనదేశంలో వినియోగదారులు అసంఘటితంగా ఉన్నారు. వారి ప్రయోజనాల పరిరక్షణలో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయి. దేశంలో ఏర్పాటు చేసిన ముఖ్యమైన నియంత్రిత సంస్థలు, వాటి అధికారాలు, విధుల గురించి పోటీపరీక్షార్థులకు అవగాహన అవసరం.
 

అధికారాలు - విధులు
* ఇవి పార్లమెంట్‌ చట్టం లేదా కేంద్ర కార్యనిర్వాహక శాఖ ఉత్తర్వు ద్వారా ఏర్పడతాయి.
* ప్రజలు వివిధ రంగాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థల నుంచి ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి వీటికి ఫిర్యాదు చెయ్యొచ్చు.
* ఇవి వారి ఫిర్యాదులను స్వీకరించి, ఆయా సంస్థల నుంచి సంజాయిషీ కోరుతూ నోటీసులు జారీచేస్తాయి.
* ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ సంస్థలు అందించిన ఆధారాలు, వివరణలు; వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులను విచారిస్తుంది.
* వ్యక్తులు, అధికారుల నుంచి సాక్ష్యాల సేకరణకు వీలుగా తమ ముందు హాజరు కావాలని సమన్లు జారీచేస్తాయి.
* న్యాయ విచారణ అనంతరం అక్రమాల ధ్రువీకరణ జరిగితే జరిమానా విధిస్తాయి.
* ‘నియంత్రిత అథారిటీ’ మార్గదర్శకాలకు లోబడే ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలు ధరలను, విక్రయ పద్ధతులను ప్రకటిస్తాయి.
* పార్లమెంట్‌ రూపొందించిన చట్టాలకు అనుగుణంగా నియంత్రిత సంస్థలు తమ అధికార, విధులను నిర్వహిస్తాయి.
* వివిధ సంస్థల మధ్య అనవసరమైన పోటీని నివారించి వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించి, వస్తు, సేవల నాణ్యత ప్రమాణాలను పర్యవేక్షిస్తూ ధరల స్థిరీకరణకు కృషి చేస్తాయి.

 

ముఖ్యమైన నియంత్రిత సంస్థలు
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా  (TRAI): 
* 1990 దశకంలో వచ్చిన ఆర్థిక సరళీకృత విధానాల ఫలితంగా టెలికాం రంగంలో ప్రైవేట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు వచ్చాయి. దీని ఫలితంగా టెలికాం రంగంలో తప్పనిసరి నియంత్రణ అవసరమైంది.
* 1997లో పార్లమెంట్‌ చట్టం ద్వారా ‘టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా’ను ఏర్పాటు చేశారు. ఇందులో ఒక ఛైర్మన్‌తో పాటు ముగ్గురు సభ్యులు ఉంటారు.
అధికారాలు - విధులు:
* టెలికాం సేవల వినియోగదారుల సమస్యలను పరిష్కరించి, అక్రమాలను నివారించడం. టెలీకమ్యూనికేషన్‌కు సంబంధించిన సర్వీసులను పర్యవేక్షించడం.
* టెలీకమ్యూనికేషన్‌ సేవలు, టారిఫ్‌ల నియంత్రణ, వివిధ సంస్థల మధ్య అభిలషణీయమైన పోటీని ప్రోత్సహించడం.
* టెలికాం ఛార్జీలను క్రమబద్ధీకరించి, వినియోగదారులకు నాణ్యమైన సేవలను అందించడం. 
* వివిధ టెలికాం సంస్థల మధ్య తలెత్తే వివాదాలను పరిష్కరించడం.


ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ ఖీ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా  (IRDAI) 
* పార్లమెంట్‌ చట్టం ద్వారా 1999లో ‘ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా’ని ఏర్పాటు చేశారు. ఇది జీవిత బీమా రంగంలో ప్రజలకు అందిస్తున్న సేవలను సమర్థవంతంగా పర్యవేక్షిస్తుంది. ఇందులో ఒక ఛైర్మన్, కొంతమంది సభ్యులు ఉంటారు. 
అధికారాలు - విధులు:
* భారత్‌లోని దేశీయ, విదేశీ ఇన్సూరెన్స్‌ రంగాలకి సంబంధించిన సంస్థలపై నియంత్రణ కలిగి ఉంటుంది.
* పాలసీదారుల ప్రయోజనాలను పరిరక్షిస్తుంది. బీమా కంపెనీలకు, వినియోగదారులకు మధ్య వచ్చే వివాదాలను పరిష్కరిస్తుంది.
* ఇన్సూరెన్స్‌ కంపెనీలకు, మధ్యవర్తులకు అనుమతులు మంజూరు చేస్తుంది.
* చట్ట నిబంధనలను ఉల్లంఘించిన సంస్థల అనుమతులు/ లైసెన్స్‌లు రద్దుచేస్తుంది, జరిమానా విధిస్తుంది.


కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (Competition Commission of India) 
* భారతదేశ ఆర్థిక వ్యవస్థలో బలమైన మార్కెట్ల అభివృద్ధి కోసం ప్రభుత్వం 1969లో లీళిగిశి చట్టాన్ని రూపొందించింది. 2002లో దాన్ని రద్దుచేసి, పార్లమెంట్‌ కంపెనీల చట్టం ద్వారా ‘కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా’ను ఏర్పాటు చేసింది. ఇందులో ఒక ఛైర్మన్, నలుగురు సభ్యులు ఉంటారు.
అధికారాలు - విధులు:
* మార్కెట్‌ శక్తుల మధ్య ఆరోగ్యకరమైన పోటీని పెంపొందించడం. స్వేచ్ఛా వాణిజ్య నిర్వహణకు అనువైన పరిస్థితులను కల్పించడం.
* వినియోగదారుల ప్రయోజనాలను పెంపొందించి, నూతన వాణిజ్య విధానాలపై అనుసరించాల్సిన విధివిధానాలను ప్రభుత్వానికి సిఫార్సు చేయడం.


సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌
* ఇది విద్యుత్‌ ఉత్పత్తి, విద్యుత్‌ శక్తి వినియోగం మొదలైన అంశాల్లో ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలను పర్యవేక్షిస్తుంది. దీన్ని భారత పార్లమెంట్‌ చట్టం ద్వారా 2003లో ఏర్పాటు చేశారు. ఇందులో ఒక ఛైర్మన్, నలుగురు సభ్యులు ఉంటారు.
అధికారాలు - విధులు:
* విద్యుత్‌ ఉత్పత్తిలో పోటీతత్వాన్ని, పొదుపును పెంపొందించడం.
* విద్యుత్‌ ఛార్జీలను క్రమబద్ధీకరించడం, శాస్త్రీయ పద్ధతిలో వివిధ స్లాబుల ధరలను నిర్ణయించి, ప్రతిపాదించడం.
* విద్యుత్‌ కొనుగోలు, సరఫరా వ్యవహారాలను పర్యవేక్షించడం. విద్యుత్‌ ఉత్పత్తికి సంబంధించిన నూతన పరిశోధనలను ప్రోత్సహించడం. శాస్త్ర, సాంకేతికతను వినియోగించేలా కృషి చేయడం.
* దేశంలోని వివిధ రాష్ట్రాల మధ్య విద్యుత్‌ వ్యవహారాల్లో సమన్వయాన్ని సాధించడం.


సెంట్రల్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ (Central Pollution Control Board) 
* దేశంలో పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రభుత్వం 1974లో కాలుష్య నియంత్రణ చట్టాన్ని రూపొందించింది. దీని ద్వారా ‘‘సెంట్రల్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌’’ ఏర్పాటైంది. దీనిలో ఛైర్మన్, కొంతమంది సభ్యులు ఉంటారు.
అధికారాలు - విధులు:
* జల, వాయు కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవడం. పర్యావరణ పరిరక్షణకు కృషి చేయడం.
* భారీ ప్రాజెక్టుల నిర్మాణ సమయంలో పర్యావరణ సంబంధిత అంశాలను పరిశీలించడం. పచ్చదనాన్ని పెంపొందించేందుకు కృషి చేయడం.
* కాలుష్య నియంత్రణకు వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయాన్ని సాధించడం.

 

సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (SEBI)
* పార్లమెంట్‌ చట్టం ద్వారా 1992లో ‘సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా’ను ఏర్పాటు చేశారు. షేర్‌ మార్కెట్లలో అక్రమ వ్యాపార కార్యక్రమాలను నియంత్రించడం దీని ముఖ్య ఉద్దేశం.
* దీనిలో ఒక ఛైర్మన్, ఏడుగురు సభ్యులు ఉంటారు.
అధికారాలు - విధులు:
* దేశంలో ఆర్థిక కార్యకలాపాలు సాగించే మధ్యవర్తులు తప్పనిసరిగా దీనిలో నమోదు చేసుకోవాలి.
* సెక్యూరిటీ మార్కెట్లో పెట్టుబడిదారుల ప్రయోజనాలు సంరక్షించడం, బ్యాంకేతర ఆర్థిక సంస్థల  (Non Banking Financial Company - NBFC)  కార్యకలాపాలను పర్యవేక్షించడం, నియంత్రించడం.
* సెక్యూరిటీ మార్కెట్లో అక్రమ, మోసపూరిత వ్యాపారాలను అడ్డుకోవడం.
* సంస్థాగత ఇన్వెస్టర్లు, మ్యూచువల్‌ ఫండ్స్, సమష్టి పెట్టుబడిదారులను రిజిస్ట్రేషన్‌ ద్వారా నమోదు చేసుకొని, ఆర్థిక కార్యకలాపాలు సక్రమంగా జరిగేలా చేయడం.

 

బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా
* భారత పార్లమెంట్‌ 1961లో అడ్వకేట్స్‌ యాక్ట్‌ ద్వారా బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాను ఏర్పాటు చేసింది. దేశంలో న్యాయవిద్యను మెరుగుపరచడం దీని లక్ష్యం. ఇందులో ఛైర్మన్, కొంతమంది సభ్యులు ఉంటారు.
అధికారాలు - విధులు:
* న్యాయ వ్యవస్థలో మెరుగైన పనితీరును పెంపొందించేందుకు కృషి చేయడం. న్యాయవాదుల వృత్తికి సంబంధించిన ప్రవర్తనా నియమావళిని రూపొందించడం.
* న్యాయవాదులుగా ప్రాక్టీసు చేయడానికి గుర్తింపు ఇవ్వడం. న్యాయ విద్యను ప్రోత్సహించి మెరుగైన ప్రమాణాలను సాధించడానికి కృషి చేయడం.
* న్యాయవాదుల హక్కులను, ప్రయోజనాలను పరిరక్షించడం.


ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌
* దేశంలో సాంకేతిక విద్యను మెరుగైన రీతిలో నిర్వహించడానికి పార్లమెంట్‌ చట్టం ద్వారా 1987లో ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ను ఏర్పాటు చేశారు. దీనిలో ఛైర్మన్, కొంతమంది సభ్యులు ఉంటారు.
అధికారాలు - విధులు:
* ఇంజనీరింగ్, ఫార్మసీ, కంప్యూటర్‌ విద్య, మేనేజ్‌మెంట్, ఉపాధ్యాయ విద్య మొదలైన వాటికి సంబంధించిన నూతన పరిశోధనల నిర్వహణ, నాణ్యతా ప్రమాణాలను నిర్ధారించడం.
* సాంకేతిక విద్యాసంస్థల స్థాపనకు అనుమతులు మంజూరు చేయడం, గుర్తింపు ఇవ్వడం. సాంకేతిక విద్యలో నూతన పరిశోధనలను ప్రోత్సహించడం.
* నూతన కోర్సుల నిర్వహణకు అనుమతులు ఇవ్వడం, మారుతున్న కాలమాన పరిస్థితులకు తగ్గట్లు సిలబస్‌ను రూపొందించడం.

 

నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా (NHAI)
* ‘నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా’ను  1988లో ఏర్పాటు చేశారు. ఇది దేశవ్యాప్తంగా రవాణా రంగంలో రహదారులను సమర్థంగా నిర్వహించి, పర్యవేక్షిస్తుంది. దీనిలో ఒక ఛైర్మన్, ఆరుగురు సభ్యులు ఉంటారు.
అధికారాలు - విధులు: 
* జాతీయ రహదారుల నిర్మాణం, నిర్వహణ, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి జాతీయ రహదారులను అభివృద్ధి చేయడం. టోల్‌ప్లాజాల నిర్వహణ, ఫీజుల వసూలుకు అవసరమైన మార్గదర్శకాలను రూపొందించడం.
* జాతీయ రహదారులపై ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టడం, రహదారులకు రెండువైపులా చెట్లు పెంచి, సుందరీకరణ కార్యక్రమాలు చేపట్టడం.
* నూతన రహదారుల నిర్మాణంలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి కృషి చేయడం. రహదారుల నిర్మాణంలో వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయాన్ని సాధించడం. నిర్మాణ రంగంలో నూతన పరిశోధనలు చేసి ప్రభుత్వానికి నివేదించడం.

Posted Date : 26-06-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌