• facebook
  • whatsapp
  • telegram

విత్తన భాండాగారం తెలంగాణ

    తెలంగాణ వ్యవసాయ ప్రాధాన్య రాష్ట్రం. అధిక శాతం ప్రజల జీవనాధారం వ్యవసాయం కావడమే కాకుండా సాగుకు సంబంధించిన విశేషాలెన్నో కనిపిస్తాయి. నేలల వైవిధ్యం కారణంగా అన్ని రకాల పంటలకూ అనుకూలమైన భూమి తెలంగాణ సొంతం. విత్తనోత్పత్తికి అత్యంత అనువైన పరిస్థితులు మరో ప్రత్యేకత. ఇలాంటి ఎన్నో విశేషాలున్నప్పటికీ కొన్ని ప్రతికూలతలూ రైతులను ఇబ్బందులు పెడుతున్నాయి. రైతుల సంక్షేమం దిశగా ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. వీటన్నింటిపై అవగాహన కల్పించే తెలంగాణ వ్యవసాయ ముఖచిత్రం ఇది..
వర్షపాతం, నేల స్వభావం, పంట విస్తీర్ణం తదితర అంశాల ఆధారంగా తెలంగాణ రాష్టాన్ని 4 వ్యవసాయ వాతావరణ మండలాలుగా విభజించారు. అవి..
1. ఉత్తర తెలంగాణ మండలం
2. కేంద్ర తెలంగాణ మండలం
3. దక్షిణ తెలంగాణ మండలం
4. ఉన్నత, గిరిజన ప్రాంతాల మండలం
వ్యవసాయ ప్రాధాన్యాలు

భారతదేశంలో తెలంగాణ నేలలకు మురుగునీరు పారే మార్గాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి భూసార పరిరక్షణ నిర్వహణకు చక్కని అనుకూల పరిస్థితులను కల్పిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అన్ని రకాల పంటలకు అనువైన నేలలుండటం మరో ప్రత్యేకత. ఆహార ధాన్యాలు, నూనెగింజలు, పప్పులు, పండ్ల తోటలు, పచ్చిక పొలాలు, అడవుల పచ్చదనానికి ఈ నేలలు అనుకూలమైనవి.
వ్యవసాయ సంబంధ ప్రాధాన్యమున్న సంస్థలు చాలా ఉన్నాయి. వీటిలో ఐసీఏఆర్(ICAR) కు చెందినవి ముఖ్యమైనవి. ఉదాహరణకు డీఆర్ఆర్, డీఓఆర్, ఎన్ఐపీహెచ్ఎం సంస్థలతోపాటు ఎన్ఏఏఆర్ఎం, ఎన్ఐఆర్‌డీ, ఎన్ఎఫ్‌డీబీ, సీఆర్ఐడీఏ, ఎన్ఆర్‌సీఎస్ లాంటి ప్రఖ్యాత సంస్థలు వ్యవసాయం, వాటి అనుబంధ రంగాల వృద్ధికి కృషి చేస్తున్నాయి.
* దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి వృద్ధిరేటు 2.43 శాతం ఉండగా తెలంగాణలో 3.97 శాతంగా ఉంది.

 

వ్యవసాయరంగ ప్రతికూలతలు
రాష్టంలో వ్యవసాయరంగ వృద్ధికి ఎంత అవకాశం ఉందో అదే స్థాయిలో అవరోధాలు కూడా ఉన్నాయి.
* నిలకడ లేని వర్షపాతం, ఆకస్మిక వరదలు వ్యవసాయ ఉత్పత్తులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.
* వర్షపాత లేమి వల్ల నేలల్లో సేంద్రీయ పదార్థ అభివృద్ధి తగ్గి నత్రజని శాతం తగ్గుతోంది.
* వ్యవసాయ భూముల్లో 63 శాతం వర్షాధారమే. దీంతో వ్యవసాయరంగంపై తీవ్ర ప్రభావం పడుతోంది.
* పెరిగిన కూలీల వ్యయభారం, అతి తక్కువ యాంత్రీకరణ కలిసి సేద్యం ఖర్చును విపరీతంగా పెంచాయి. ఇవి ఇతర అనేక ఇబ్బందులకు, ఆర్థిక నష్టాలకు దారితీస్తున్నాయి.
* వ్యవసాయదారుల్లో సుమారు 85 శాతం మంది సన్న, చిన్నకారు రైతులే. వీరంతా నిరుపేద సామాజిక ఆర్థిక వర్గానికి చెందినవారు. దీంతో వ్యవసాయం కోసం రుణాలు చేయడంతో వీరి రుణగ్రస్తత క్రమంగా పెరుగుతోందని చెప్పవచ్చు.

 

సాగు భవితకు మార్గదర్శనం
తెలంగాణ వ్యవసాయ రంగంలో ఎన్నో ప్రతికూలతలు ఉన్నప్పటికీ అందుబాటులో ఉన్న వ్యవసాయ సామర్థ్యాన్ని.. వనరులు, సాంకేతిక విజ్ఞానంతో అభిలషణీయంగా వినియోగించుకోవాలి. వ్యవసాయ ఉత్పత్తికి సంబంధించి భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ వ్యవసాయ దార్శనికతను రూపొందించుకోవాలి. ముఖ్యంగా తెలంగాణ రైతులు విత్తనాల నిర్వహణలో సాధికారత సాధించేలా చూడాలి. సకాలంలో వారికి నాణ్యమైన విత్తనాలను అనువైన ధరలకు అందించాలి.
 

సానుకూలం కావాలంటే..
* వ్యవసాయాన్ని పర్యావరణ హితంగా మార్చేలా రైతుల సాధికారత పెంచాలి.
* హెచ్చుతగ్గులు అధిగమించేలా వ్యవసాయాభివృద్ధికి కొత్త ప్రయత్నాలు చేయాలి.
* బిందు, తుంపర సేద్యాలు వంటి విధానాల ద్వారా సరైన నీటి యాజమాన్య నిర్వహణ పద్ధతులను అవలంబించాలి.
* మార్కెట్ సమాచారం, వాతావరణ సమాచారాలను రైతులకు ఎప్పటికప్పుడు అందించాలి.
* వ్యవసాయ యాంత్రీకరణ అభివృద్ధికి అవసరమైన పరికరాలు, యంత్రాలు అందుబాటు ధరల్లో ఉండేలా చూడాలి.
* స్వల్ప కాలానికి సంబంధించిన వాతావరణ వివరాలను రైతులకు తెలియజేయాలి.
* రైతుల కోసం వివిధ ప్రదర్శనల ఏర్పాటు, శిక్షణ అందించడం, సరైన సమగ్ర పోషక నిర్వహణ ద్వారా ఎరువుల వినియోగ విధానాన్ని తెలియపరచాలి.
* పంటల ఉత్పత్తి, ఉత్పాదకతల్లో వెనుకబడిన ప్రాంతాల్లో సాంకేతిక విజ్ఞానం ద్వారా ఆ లోటును భర్తీ చేయాలి.
* వ్యవసాయంలో సాంకేతిక వినియోగం కోసం రైతులకు సుశిక్షితులైన సిబ్బంది ద్వారా అవగాహన కల్పించాలి.
* సమర్థమైన భూసారం, జలవనరుల నిర్వహణకు వీలుగా భూమిని అభివృద్ధి చేయాలి.
* ఉపరితల, భూగర్భ జల అవకాశాల ద్వారా సేద్యపు భూమి విస్తీర్ణం పెరిగేలా చూడాలి.
* రైతులందరికీ విత్తనాలు, ఎరువులు, రుణాలు, సమాచార సాంకేతిక పరిజ్ఞానం సులభంగా అందుబాటులోకి వచ్చేలా చేయాలి.
* వ్యవసాయాన్ని వాణిజ్యపరంగా గిట్టుబాటయ్యేలా చేయాలి.

 

సంతులిత అభివృద్ధికి ప్రభుత్వ చర్యలు
వ్యవసాయరంగ అభివృద్ధికి ప్రభుత్వం 2014-15లో కొన్ని ముఖ్యమైన చర్యలు చేపట్టింది. అవి..
 

పంట అభివృద్ధి క్షేత్రాలు
* తెలంగాణలో అన్ని ఆహారపంటలు, నూనె గింజలు, పప్పు ధాన్యాల విస్తీర్ణం పెంపునకు.. ఉత్పత్తి, ఉత్పాదకతల వృద్ధికి.. పంటక్షేత్రాల ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేసింది.
* భారతదేశంలో 20 శాతం రైతులు ధ్రువీకృత విత్తనాలు ఉపయోగించగా మిగిలినవారు తమ పంట విత్తనాలనే తిరిగి వినియోగిస్తున్నారు. తెలంగాణలో ధ్రువీకృత విత్తనాలను 70-80 శాతం వరకు వినియోగిస్తున్నారు. ఈమేరకు విత్తన సరఫరా కొరత అధిగమించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
* తెలంగాణలో విత్తనోత్పత్తికి ఎంతో అవకాశం ఉంది. ముఖ్యంగా మహబూబ్‌నగర్ జిల్లాలో సంకర పత్తి విత్తన కార్యక్రమాన్ని ప్రారంభించారు. సంకర వరి విత్తనాలను కరీంనగర్, వరంగల్.. సంకర విత్తనోత్పత్తి కార్యక్రమాన్ని కరీంనగర్, నిజామాబాద్, మొదక్ జిల్లాల్లో చేపట్టారు.
* వరి, ఆముదం, పప్పులు, వేరుశనగ, సోయా, కూరగాయల విత్తనాల కోసం కరీంనగర్, వరంగల్, నల్గొండ, నిజామాబాద్, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో పంట విత్తన ఉత్పత్తికి సువిశాలమైన క్షేత్రాలను ఉపయోగిస్తున్నారు.

 

పది విత్తన క్షేత్రాలు
* వ్యవసాయ ఉత్పాదకత పెంపులో విత్తనానిదే కీలక పాత్ర. ఉత్పత్తి చేసి, సరఫరా చేసే విత్తన నాణ్యత మీదే ఎరువులు, తదితర లవణాల సరఫరాల సామర్థ్యం ఆధారపడి ఉంటుంది. 'దేశానికే విత్తన భాండాగారం'గా తెలంగాణను నిలిపేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
* వరి, మొక్కజొన్న, సోయా, ఆముదం, పత్తి లాంటి అన్ని రకాల పంటలకు అవసరమైన విత్తనాల ఉత్పత్తికి ఇక్కడి నేలలు, వాతావరణ పరిస్థితులు వరంగా మారాయి.
* వివిధ పంటలకు సంబంధించి 37.42 లక్షల క్వింటాళ్ల విత్తనాలను 3.22 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ఉత్పత్తిచేసి 'దేశ విత్తన కేంద్రం'గా తెలంగాణ నిలిచింది. సేద్యానికి ఆమోద యోగ్యమైన 536 హెక్టార్ల విస్తీర్ణంతో రాష్ట్రంలో 10 విత్తన క్షేత్రాలున్నాయి. వీటి ప్రధాన ఉద్దేశం 'సీడ్ విలేజ్ స్కీమ్' ద్వారా విత్తనోత్పత్తి, విత్తన సరఫరా చేయడం.
* రాష్ట్రాన్ని 'విత్తన భాండాగారం' చేయాలన్న ఉద్దేశంతో హైదరాబాద్‌లో 3 రోజుల పాటు 8వ 'జాతీయ విత్తన కాంగ్రెస్' సమావేశాన్ని ప్రభుత్వం నిర్వహించింది.

 

వ్యవసాయ యాంత్రీకరణ
తెలంగాణలో అత్యధికంగా చిన్న కమతాల్లో వ్యవసాయం సాగుతుంది. యంత్రాల వినియోగంతో మరింత భూమిని సాగులోకి తెచ్చి సగటు ఉత్పత్తిని పెంచడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. దీనికోసం పవర్ ట్రాక్టర్లు, పవర్ టిల్లర్‌లను ఉపయోగించుకునేలా రైతులను ప్రోత్సహిస్తోంది.
 

పథకం లక్ష్యాలు:
* ప్రతి గ్రామంలో యంత్ర పరికరాలను అందుబాటులోకి తేవడం
* పొలం పనుల్లో మానవశక్తిని తగ్గించడం
* వ్యవసాయోత్పత్తి, ఉత్పాదకతలను పెంచడం
* వ్యవసాయోత్పత్తుల నాణ్యతను మెరుగుపరచడం
* రాష్ట్రంలో పండించే ప్రధాన ఉత్పత్తుల వ్యవసాయ ఖర్చులు తగ్గించడం
యాంత్రీకరణ ఆధారంగా పెంచే ఉత్పాదకత గ్రామీణ సర్వతోముఖాభివృద్ధికి దోహదం చేసే ఒక ముఖ్య భాగమవుతుంది. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా 'రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (ఆర్‌కేవీవై)' పథకం కింద రూ. 67.40 కోట్ల వ్యయాన్ని ప్రతిపాదించారు. వ్యవసాయ యాంత్రీకరణపై ఉప కార్యక్రమం కింద రూ.23.54 కోట్లు, జాతీయ అహారభద్రత మిషన్ కింద రూ. 9.11 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. వ్యవసాయ విస్తరణకు 100 శాతం కేంద్ర మద్దతుతో నడిచే ప్రధాన పథకంగా 'ఆర్‌కేవీవై'ని చెప్పవచ్చు.

 

వ్యవసాయ పరపతి
* తెలంగాణ వ్వవసాయ వార్షిక పరపతి ప్రణాళిక 2014-15లో రూ. 27,233.59 కోట్లు కాగా రూ. 17,636.44 కోట్లు (65%) పంపిణీ చేశారు.
* పంట రుణాల కేటాయింపు లక్ష్యం రూ. 18,717.95 కోట్లు కాగా రూ. 13,561 కోట్లు (72%) పంపిణీ చేశారు.
* వ్యవసాయ టర్మ్‌లోన్‌ల లక్ష్యం రూ. 6,238.48 కోట్లు కాగా రూ.2,794.15 కోట్లు (45%) పంపిణీ చేశారు.
* అనుబంధ కార్యకలాపాల కింద రూ. 2,277.16 కోట్లు పంపిణీ లక్ష్యం కాగా రూ. 3,132.29 (137%) కోట్లు పంపిణీ అయింది.
* పంటల రుణమాఫీ కింద తొలి విడతగా రూ. 4,250.0 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది.

 

పంటల బీమా
తెలంగాణలో 2014-15 ఖరీఫ్, రబీ సమయంలో 3 పంట బీమా పథకాలను అమలు చేశారు. అవి..
1. జాతీయ వ్యవసాయ బీమా పథకం (ఎన్ఏఐఎస్)
2. వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం (డబ్ల్యూబీసీఐఎస్)
3. మెరుగుపరిచిన జాతీయ వ్యవసాయ బీమా పథకం (ఎంఎన్ఏఐఎస్)

 

జాతీయ వ్యవసాయ బీమా పథకం
ఈ పథకాన్ని 2000 సంవత్సరం ఖరీఫ్ సమయంలో ప్రారంభించారు. ఇందులో వ్యవసాయశాఖకు, బీమా అమలు చేసే సంస్థగా వ్యవసాయ కార్పొరేషన్, సంచాలకులు, అర్థగణాంక శాఖకు ప్రమేయం కల్పించారు. ఈ పథకం కింద ఖరీఫ్‌లో 19 పంటలు, రబీలో 10 పంటలకు రక్షణ కల్పించారు. ప్రీమియంలో చిన్న, సన్నకారు రైతులకు 10 శాతం సబ్సిడీ ఇచ్చారు.
 

వాతవరణ ఆధారిత పంటల బీమా పథకం
దీన్ని 2009 ఖరీఫ్ నుంచి ప్రారంభించారు. వర్షపాతం, తేమ, ఉష్ణోగ్రతల వల్ల పంటలు దెబ్బతిన్న రైతుల కష్టాన్ని తగ్గించడానికి దీన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో సుమారు 900 'అటోమెటిక్ వాతావరణ పరిశీలన కేంద్రాలు' ఉన్నాయి.
 

జాతీయ పంటల బీమా కార్యక్రమం (ఎన్‌సీఐపీ)
ఎంఎన్ఏఐఎస్, డబ్ల్యూబీసీఐఎస్ పథకాలను విలీనంచేసి 2014 ఖరీఫ్ నుంచి 'ఎన్‌సీఐపీ' పథకాన్ని భారత ప్రభుత్వం అమలు చేస్తోంది.
 

మెరుగుపరిచిన జాతీయ వ్యవసాయ బీమా పథకం
ఈ పథకాన్ని వరంగల్ జిల్లాలో 2010-11 రబీ కాలంలో భారత ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది. వడగండ్ల వాన, విత్తు ఆటంకాలు వచ్చినప్పడు నష్టపరిహారం చెల్లిస్తుంది. ఈ పథకం ద్వారా రైతులకు ప్రీమియంలో 40-70 శాతం సబ్సిడీ లభిస్తుంది. ప్రధాన పంట అయిన వరిని ఈ పథకానికి ఎంపిక చేశారు. 2014-15 రబీ నుంచి అన్ని జిల్లాలకు విస్తరించారు.
 

సహకార రంగం
తెలంగాణ రాష్ట్ర మార్క్‌ఫెడ్: రాష్ట్ర విభజన తర్వాత 'తెలంగాణ రాష్ట్ర సహకార మార్కెటింగ్ సొసైటీస్ ఫెడరేషన్ లిమిటెడ్ - హైదారాబాద్‌'ను పునర్‌వ్యవస్థీకరించారు. దీని పరిధిలో 9 సహకార మార్కెటింగ్ సొసైటీలు మిగిలాయి. ఈ సంస్థకు కరీంనగర్‌లో ఒకే ఒక దాణా మిశ్రమ విభాగం, ఆదిలాబాద్‌లో పత్తి వడికే కేంద్రం ఉన్నాయి.
వ్యవసాయ ఉత్పత్తుల విక్రయం: సమగ్రమైన ఆంధ్రప్రదేశ్ (వ్యవసాయోత్పత్తుల, జీవోత్పత్తుల) విపణుల చట్టం 1996 నవంబరు 18 నుంచి అమల్లోకి వచ్చింది. దీన్ని తెలంగాణ కోసం ఆమోదించుకోవాల్సి ఉంది. మద్దతు ధరలు అందేలా చూడటం, వ్యాపారుల నుంచి రైతులను రక్షించడం దీని ప్రధానోద్దేశం.

 

మార్కెట్ కమిటీలు
తెలంగాణ రాష్ట్రంలో 150 వ్యవసాయ మార్కెట్ కమిటీలు.. వాటి పరిధిలో 306 మార్కెట్ యార్డులు నోటిఫై అయ్యాయి. వాటిలో 140 ప్రధాన యార్డులు, 101 ఉప యార్డులు ఉన్నాయి. వీటిలో 150 వ్యవసాయ మార్కెట్ కమిటీలు, 64 ఫంక్షనల్ మార్కెట్లు, 16 సీజనల్ మార్కెట్లు, 19 పాడి పశువుల మార్కెట్లు, 264 చెక్‌పోస్టులు, 26 రైతు బజార్‌లు ఉన్నాయి.
 

రైతుబంధు పథకం
రైతుబంధు పథకాన్ని 1990 నుంచి అమలు చేస్తున్నారు. రుణ పరిమాణాన్ని రూ. లక్ష నుంచి 2 లక్షలకు పెంచి దాదాపు 6 నెలల వరకు ఎలాంటి వడ్డీని ప్రభుత్వం వసూలు చేయదు. ఈమేరకు ఇచ్చే కార్డు కాలపరిమితిని కూడా 3 నుంచి 5 సంవత్సరాలకు పెంచింది. ఈ పథకం కింద 2012-13లో 953 మంది రైతులు, 2013-14లో 1,111 మంది రైతులు ప్రయోజనం పొందారు.
 

రైతు బజార్లు
      తెలంగాణలో 30 రైతుబజార్ల (4 నోటిఫై కానివి) మధ్య అనుసంధానం ఉంది. వీటిల్లో సగటున 3,115 మంది రైతులు, వారానికి 8 వేల లక్షల క్వింటాళ్ల నుంచి 10 వేల లక్షల క్వింటాళ్ల కూరగాయల విక్రయాలు జరుగుతాయి. హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో సంచార రైతుబజార్‌లు కూడా ఉన్నాయి.
 

దేశంలో 60 శాతం విత్తనాలు తెలంగాణ నుంచే సరఫరా అవుతున్నాయి. 14 దేశాలకు ఈ విత్తనాలు ఎగుమతి అవుతున్నాయి. 'సీడ్ విలేజి స్కీమ్' కింద 2015 ఖరీఫ్‌లో 1,458 గ్రామాల ఎంపిక ద్వారా 36,415 మంది రైతులు భాగస్వాములుగా 14,500 హెక్టార్లలో 3.30 లక్షల క్వింటాల విత్తనోత్పత్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

Posted Date : 02-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌