• facebook
  • whatsapp
  • telegram

సామాజిక మినహాయింపు, సమకాలీకరణ

అసమానతలు వదిలి.. అవకాశాలు పెంచి!

 

మానవ సమాజంలో అభివృద్ధి ఒకే విధంగా ఉండదు. వర్గాలు, కులాలు, జాతులవారీగా సామాజిక ప్రగతిలో వైరుధ్యం కనిపిస్తుంది. సాంఘిక అసమానతలు, దుర్విచక్షణల కారణంగానే ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా అసంతృప్తులు, అస్థిర పరిస్థితులు తలెత్తుతున్నాయి. అంతిమంగా అందరి సంక్షేమాన్ని హరించే అసమానతలకు కారణాలు, వాటి మూలాలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. ఏయే కొలమానాలు, భౌతిక అంశాల రూపంలో ఈ అసమానతలు స్థిరపడ్డాయి, సామాజికాభివృద్ధికి ఏవిధంగా గొడ్డలిపెట్టుగా మారాయనేది అర్థం చేసుకోవాలి. మన దేశంలో ఈ సమస్య స్వరూప స్వభావాలపై అవగాహన పెంచుకోవాలి.

 

ప్రజలు సామాజిక, ఆర్థిక, రాజకీయ సాంస్కృతిక కార్యకలాపాల్లో పాల్గొనలేని స్థితిని, అందుకు దారితీసే ప్రక్రియను సామాజిక మినహాయింపుగా అర్థం చేసుకోవచ్చు. సామాజిక మినహాయింపు భావనకు, అభివృద్ధికి మధ్య అవినాభావ సంబంధం ఉంది. ఈ రెండు అంశాలు సామాజిక మానవాభివృద్ధిని కచ్చితంగా ప్రభావితం చేస్తాయి.

ఆదాయం, ఉపాధి, భూమి, ఇల్లు, విద్య, వైద్య సేవలన్నీ మానవ సంక్షేమానికి పునాదులు. ఈ భౌతిక వనరులు ప్రజలకు అందుబాటులో లేకపోతే సమాజ ప్రగతి, కార్యకలాపాల్లో వారి భాగస్వామ్యంపై ప్రభావం పడుతుంది. ప్రజలు తమ ఆందోళనను తెలియజేయడానికి పరస్పరం మాట్లాడుకునే అవకాశం ఉండాలి. వారి హక్కులు, హోదాకు సమానమైన గౌరవం, రక్షణ ఉండాలి. అవి లేకపోతే వారి భాగస్వామ్యం పరిమితమవుతుంది. సామాజిక మినహాయింపులో భౌతిక వనరుల నిరాకరణ మాత్రమే కాకుండా, ముఖ్య నిర్ణయాలపై అదుపు లేకపోవడం, న్యూనతాభావం కలిసి ఉంటాయి. దాదాపు అన్ని దేశాల్లో వయసు భేదాలు, వైకల్యం, జాతి, మతం, వలస, హోదా, సామాజిక ఆర్థిక స్థాయి, నివాస స్థలం, లైంగిక ధోరణి, లింగ గుర్తింపు లాంటివి కాలక్రమేణా సామాజిక మినహాయింపునకు కారణమయ్యాయి.

* 1970లో సాంఘిక బహిష్కారం అనే పదాన్ని ఫ్రాన్స్‌లో ఉపయోగించారు.

* 1974లో సామాజిక మినహాయింపు అనే పదాన్ని మొదటిసారిగా ఫ్రాన్స్‌ సామాజిక విభాగ మాజీ కార్యదర్శి రీన్‌లెనోయిర్‌ ప్రయోగించారు.

* 2010 సంవత్సరాన్ని ‘దారిద్య్రాన్ని ఎదుర్కొనే సామాజిక మినహాయింపు ఏడాది’గా యూరోపియన్‌ యూనియన్‌ పేర్కొంది.


సామాజిక మినహాయింపు రకాలు:  1) రాజకీయ మినహాయింపు 2) ఆర్థిక మినహాయింపు 3) సాంస్కృతిక మినహాయింపు 4) వృత్తిపర మినహాయింపు


అసమానత్వం - రూపాలు: 1) లింగ అసమానత్వం  2) జాతి అసమానత్వం  3) కుల అసమానత్వం  4) ఆరోగ్య అసమానత్వం  5) వయసు అసమానత్వం


అమర్త్యసేన్‌ భావన: సామాజిక మినహాయింపును అమర్త్యసేన్‌ రెండు రకాలుగా వర్గీకరించారు.


1) పూర్తిస్థాయి సామాజిక మినహాయింపు: సమాజంలో పేదరికం, వలస లాంటి కారణాలను చూపిస్తూ హక్కులు, రక్షణలు పొందలేని పరిస్థితి.


2) పాక్షిక స్థాయి సామాజిక మినహాయింపు: కొన్ని వర్గాలకు హక్కులు, రక్షణలు, భాగస్వామ్యం కల్పించినట్లయితే దాన్ని పాక్షిక సామాజిక మినహాయింపు అంటారు.


సామాజిక మినహాయింపు నష్టాలు:  * సామాజిక మినహాయింపు వల్ల విలువైన మానవ వనరులను వినియోగించలేకపోతున్నారు. * సామాజిక మినహాయింపు పాటించే దేశాలు ప్రపంచ ర్యాంకింగ్‌లో వెనుకబడతాయి, అక్కడ పెట్టుబడులు మందగిస్తాయి. ఫలితంగా ఆర్థిక వెనుకబాటుతనం ఏర్పడుతుంది. * దండేకర్, నీలకంఠరత్‌లు ‘పావర్టీ ఇన్‌ ఇండియా’ గ్రంథంలో పేదరికాన్ని విశ్లేషిస్తూ ‘‘గ్రామీణ ప్రాంతంలో పేదరికం అధికమై నగరాల్లోకి తరలి వెళుతోంది’’ అని పేర్కొన్నారు.


నిర్వచనాలు: 

* అసమానత్వ శక్తి సంబంధాల్లో కొనసాగుతున్న ప్రక్రియే సామాజిక మినహాయింపు - డబ్ల్యూహెచ్‌ఓ వెబ్‌సైట్‌

* బహుళ కోణాల్లో కొన్ని సామాజిక సమూహాలకు సరైన, సమానమైన అవకాశాలను నిరాకరించడం ద్వారా సమూహంలోని ప్రజలు సమాజ ప్రాథమిక, రాజకీయ, ఆర్థిక, సామాజిక కార్యాచరణలో పాల్గొనలేని స్థితికి దారితీసేదే సామాజిక మినహాయింపు - సుభ్‌దేవ్‌ ధోరట్‌

* ‘దారిద్య్రానికి భిన్నంగా, బహుకోణీయ, సంబంధిత, శక్తిశీలమైన లక్షణం ఉన్నదే సామాజిక మినహాయింపు’ - రూధ్‌ లెవిటోస్, ఇతర సామాజికవేత్తల నివేదిక (2007).

* సామాజిక మినహాయింపు అనేది నిరుద్యోగం, నైపుణ్యలేమి, అల్పాదాయం, సరైన గృహవసతి లేకపోవడం, అధిక నేరాలు, అనారోగ్యం, కుటుంబ విచ్ఛిన్నతలతో కూడుకుని ఉంటుంది. సమాజంలో పూర్తిగా పాల్గొనలేక లేదా ఇమడలేక ఒంటరిగా మిగిలిపోయే వర్గాలనే సామాజిక మినహాయింపు బాధితులుగా భావించవచ్చు. సామాజిక మినహాయింపు బహుకోణీయతతో కూడుకున్నది. ఇది ఆదాయం, దారిద్య్రం, నిరుద్యోగం, అందుబాటులో విద్య, సమాచారం, పిల్లల సంరక్షణ, వైద్య, ఆరోగ్య వసతులు, నివాస పరిస్థితులు, ఇంకా సామాజిక భాగస్వామ్యంతో కలిసి బహుళ దశల్లో ఉంటుంది.

సామాజిక సమకాలీకరణ (సోషల్‌ సింక్రనైజేషన్‌) కొలతను ప్రమాణీకరించడానికి యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) సామాజిక మినహాయింపు సూచికలను స్వీకరించింది. వీటిని ‘లెకెన్‌ సూచికలు’గా పిలుస్తారు. ఈ 18 గణాంక సూచికలు, సామాజిక మినహాయింపు 4 కోణాలైన ఆర్థిక దారిద్య్రం (ఆదాయం), ఉపాధి (కార్మిక మార్కెట్‌), ఆరోగ్యం, విద్యకు వర్తిస్తాయి. సామాజిక మినహాయింపును తరచుగా మూడు భాగాలైన నిరుద్యోగం, దారిద్య్రం, సామాజిక ఒంటరితనంతో కూడిన విషవృత్తంగా భావిస్తారు.

* ‘బ్రూస్‌ హెడీ’ జీవన కార్యాచరణ విధానంలో సామాజిక మినహాయింపునకు సంబంధించిన కొలతను అభివృద్ధి చేశాడు. దీన్ని మెల్‌బోర్న్‌ సంస్థ నివేదిక ‘ఆస్ట్రేలియాలో దారిద్య్రం అంచనా, నిరుపయోగం, తక్కువ సామర్థ్యాలు (2006)’లో పొందుపరిచారు.

సామాజిక మినహాయింపును కొలవడానికి ఏడు జీవన పరిధులున్నాయి. అవి భౌతిక వనరులు, ఉపాధి రంగం, విద్యా నైపుణ్యాలు, ఆరోగ్యం-వైకల్యం, సామాజికం, సముదాయం, వ్యక్తిగత భద్రత.

1) భౌతిక వనరులు: ఇందులో గృహ ఆదాయం, గృహం విలువ, గృహ వినియోగపు ఖర్చు, ప్రభుత్వం నుంచి దీర్ఘకాలిక ఆదాయ సహాయం, నిర్వాసితుల ఖర్చు, ఆర్థిక వేదనలు, వ్యక్తిగత పేదరికం లాంటివన్నీ కలిసి ఉంటాయి.

2) ఉపాధి రంగం: ఇది ఆర్థిక ప్రయోజనాలతో సంబంధం లేకుండా సామాజిక సమలీకరణలో కీలకమైంది. ముఖ్యంగా నిరుద్యోగం వల్ల ఆదాయం లేకపోవడంతోపాటు మరిన్ని దుష్పలితాలున్నాయి. ఈ రంగంలో వేతనానికి పని, వేతనం లేకుండా పని, ఇతరుల సంక్షేమం లాంటివి కొలమానాలుగా పేర్కొనవచ్చు.

3) విద్యా నైపుణ్యాలు: ఇది వ్యక్తి మానవ మూలధనానికి సంబంధించిన సమాచారాన్ని ఇస్తుంది. మినహాయింపు కోణం వరకు అక్షరాస్యత, విద్యాస్థాయి, సామాన్య నైపుణ్యాలను కొలవడానికి కావాల్సిన వాటిని నిర్మిస్తుంది.

4) ఆరోగ్యం, వైకల్యం: ఇవి సామాజిక మినహాయింపునకు ఉత్పత్తులు. ఇందులో శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం; వైకల్యం ఇమిడి ఉంటాయి.

5) సామాజిక రంగం: ఇది కుటుంబం, స్నేహితులు, సమాజం నుంచి మద్దతు తీసుకుని ప్రతిస్పందిస్తుంది.

6) సముదాయంలో పాల్గొనడం: ఇందులో ప్రజా మౌలిక వసతులు, న్యాయపర హక్కులు, రక్షణ, ఓటింగ్‌ హక్కుల ఉనికి, వినియోగం, చట్టాల అమలు, ప్రజా వినోద వసతులున్నాయి. సామాజిక రంగంతో సమానంగా సముదాయ రంగంలోని అనేక అంశాల లక్ష్యాలను కొలవడం అసాధ్యం.


7) వ్యక్తిగత భద్రత: ఒక మనిషి ఆర్థిక, సామాజిక, పౌర లేదా రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనడంపై ప్రభావం చూపిస్తుంది.


సామాజిక మినహాయింపు - అభివృద్ధి: మానవాభివృద్ధి విధానం విద్య, సరిపడినన్ని సామాజిక సేవలు, సామాజిక రక్షణ, పర్యావరణ స్థిరత్వం, లింగ సమానత్వం, మానవ రక్షణ, వ్యక్తి హక్కులకు గౌరవం లాంటి వాటి ప్రాముఖ్యతను పేర్కొంటుంది. సామాజిక మినహాయింపు వ్యక్తుల అవకాశాలను, ఉన్నతి మార్గాలను నాశనం చేసింది. తద్వారా మానవాభివృద్ధి క్షీణించింది. సామాజిక మినహాయింపు ఇలానే కొనసాగితే ఒక దేశం, అధిక మానవ సామాజికాభివృద్ధి రేటును సాధించడం కష్టమవుతుంది.


సామాజిక సమకాలీకరణ:

ప్రపంచ బ్యాంకు ప్రకారం: వ్యక్తులు, సమూహాల సామర్థ్యం; అవకాశం, ప్రజల గౌరవం, గుర్తింపు ఆధారంగా వెనుకబడిన వారిని పెంపొందించే ప్రక్రియతో సమాజంలో పాలుపంచుకునే విధంగా అభివృద్ధి చేసే ప్రక్రియ.

యూరోపియన్‌ యూనియన్‌ కమిషన్‌ ప్రకారం: దారిద్య్రం, సామాజిక మినహాయింపు ప్రమాదం ఉన్నవారు ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక జీవనంలో పాల్గొనడానికి అవకాశాలు, వనరులను పొందడంతోపాటు ప్రామాణిక జీవనాన్ని ఉత్సాహంగా గడుపుతూ సమాజంలో సాధారణంగా నివసించే ప్రక్రియ.

ప్రొఫెసర్‌ టి.కె.ఊమెన్‌: 'Social Inclusive in Independent India': Dimensions & Aprochesలో ప్రచురించిన పుస్తక సమీక్షలో మన్‌జీత్‌ సింగ్‌ ప్రస్తుత భారతదేశంలో వారిని సామాజికంగా లేదా రాజకీయంగా లేదా ఆర్థికంగా బహిష్కరణకు గురైన ప్రజలు 9 వర్గాలుగా ఉంటారని పేర్కొన్నాడు. 1) దళితులు 2) ఆదివాసీలు 3) ఇతర వెనుకబడిన తరగతులు 4) సాంస్కృతిక అల్పసంఖ్యాకులు 5) మతం 6) భాషారంగం 7) స్త్రీలు  8) శరణార్థులు/విదేశీయులు/ బయటివారు  9) ఈశాన్య భారతదేశంలో పేదరికం/ వైకల్యం ఉన్నవారు.

 


మాదిరి ప్రశ్నలు

సామాజిక సమస్యలు

1. మనం ఏ హక్కులను అనుభవిస్తున్నామో, ఇతరులు కూడా అనుభవించేలా చూడటం సమాజంలోని ప్రతి పౌరుడి కనీస విధి అని పేర్కొనదెవరు?

1) థామస్‌ పెయినీ 2) రీన్‌ లెనోయిర్‌ 3) లెస్లీవైట్‌ 4) టేలర్‌ 

 

2. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ అక్షరాస్యత, రాష్ట్రాలకు సంబంధించి సరైన వాక్యాన్ని ఎన్నుకోండి.

ఎ) భారత అక్షరాస్యత - 74.04%    బి) మహిళల అక్షరాస్యత - 65.46% 

సి) పురుషుల అక్షరాస్యత - 80% 

డి) 100% అక్షరాస్యత రాష్ట్రం కేరళ. దీని తర్వాత గోవా, త్రిపుర, మిజోరం, హిమాచల్‌ప్రదేశ్, మహారాష్ట్ర, సిక్కిం వరుసలో ఉన్నాయి.

ఇ) అత్యల్ప అక్షరాస్యత బిహార్‌లో నమోదైంది.

1) ఎ, బి, సి     2) సి, ఇ    3) ఎ, బి, సి, డి, ఇ     4) ఏవీకావు

 

3. నిరక్షరాస్యతకు ప్రధాన కారణాలు గుర్తించి, సరైన సమాధానాన్ని ఎన్నుకోండి.

1) పేదరికం    2) లైంగిక అసమానతలు    

3) వయసు, భౌగోళిక అంతరాలు   4) పైవన్నీ

 

4. సామాజిక అసమానత్వానికి సంబంధించి సరికానిది గుర్తించండి.

ఎ) 1970లో సాంఘిక బహిష్కరణ అనే పదాన్ని తొలిసారిగా ఫ్రాన్స్‌లో వాడారు. 

బి) సామాజిక అసమానత్వం అనే పదాన్ని రీన్‌లెనోయిర్‌ మొదటిసారిగా ఉపయోగించాడు (1974). 

సి) 1883లో కులాల సంఖ్య గురించి వివరించారు.

డి) సామాజిక మినహాయింపు అనే భావనను మొదటిసారిగా వాడినవారు అమర్త్యసేన్‌.

1) ఎ, బి, సి    2) సి, డి  

3) ఎ, డి, సి    4) పైవేవీకావు

 

5. ‘పావర్టీ ఇన్‌ ఇండియా’ అనే గ్రంథకర్త?

1) దండేకర్‌     2) గుహా    3) అమర్త్యసేన్‌    4) రిస్లీ
 

6. అమర్త్యసేన్‌ ప్రకారం సామాజిక మినహాయింపు ఎన్ని రకాలు?

1) 2     2) 3     3) 4     4) 5

 

7. జతపరచండి.

గ్రూపు - ఎ         గ్రూపు - బి

1) హరిజన్‌ సేవక్‌ సంఘ్‌ ఎ) వెనుకబడిన కులాలు, బహుజనులుగా పేర్కొంది

2) నర్సింగ్‌ మెహతా     బి) మహాత్మాగాంధీ 

3) గౌతముడు             సి) హరిజనులుగా పేర్కొంది

4) మండల్‌ కమిషన్‌     డి) బహుజన అనే పదాన్ని ఉపయోగించాడు

1) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ     2) 1-బి, 2-డి, 3-సి, 4-ఎ 

3) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి     4) 1-ఎ, 2-డి, 3-బి, 4-సి

 

8. చాతుర్వర్ణ వ్యవస్థే కులవ్యవస్థ ఏర్పడటానికి ప్రధాన కారణం అని పేర్కొన్నది?

1) రజని కొఠారీ 2) కూలే 3) కేట్కర్‌ 4) ఆచార్య సుశీల్‌ చంద్ర

 

9. ఎన్‌సీఆర్‌బీ ప్రకారం దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీలపై జరిగిన నేరాల సంఖ్య?

1) 47,064    2) 57,064    3) 67,064    4) 80,064

 

10. కిందివాటిని జతపరచండి. 

గ్రూపు - ఎ            గ్రూపు - బి 

1) ఆర్టికల్‌ 15(1)            ఎ) అంటరానితనం నిషేధం 

2) ఆర్టికల్‌ 16(1)            బి) మతం, కులం, గ్రామం, లింగం లాంటి వాటిలో వివక్ష చూపడం 

3) ఆర్టికల్‌ 17            సి) మానవ అక్రమ రవాణా, వెట్టి నిషేధం 

4) ఆర్టికల్‌ 23            డి) పౌరులందరికీ సమాన అవకాశాలు

1) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ 2) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి   

3) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి     4) 1-డి, 2-బి, 3-ఎ, 4-సి

 

సమాధానాలు

1-1, 2-3, 3-4, 4-4, 5-1, 6-1, 7-1, 8-4, 9-1, 10-2.
 

రచయిత: వట్టిపల్లి శంకర్‌రెడ్డి 

 

 

Posted Date : 25-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌