• facebook
  • whatsapp
  • telegram

సామాజిక మినహాయింపు-నేపథ్యం

వ్యక్తులను వెలివేసి... హక్కులను హరించి!

 

సమాజంలో అందరు వ్యక్తులు, అన్ని వర్గాల మధ్య సమానత్వం కనిపించదు. సమాజ పరిణామ క్రమంలో ఏర్పడిన అనేక సాంఘిక నిర్మితుల వల్ల ఈ అసమానతలు రూపుదిద్దుకొని పాతుకుపోయాయి. ఫలితంగా వ్యక్తులు, వర్గాలు వెలికి గురి కావాల్సి వచ్చింది. వారి హక్కులు హరించుకుపోయాయి. దీన్నే సామాజిక మినహాయింపుగా నిపుణులు నిర్వచించారు. ఈ పరిస్థితుల నుంచి ఆధునిక ప్రపంచం బయటపడేందుకు ప్రయత్నిస్తోంది. గ్రూప్స్‌ సహా ఇతర పరీక్షల్లో ‘సామాజిక మినహాయింపు, హక్కులు, సమ్మిళిత విధానాలు’ ప్రశ్నలు అడుగుతున్నారు. అభ్యర్థులు ఈ మినహాయింపుపై అవగాహన పెంచుకోవాలంటే ముందుగా నేపథ్యాన్ని తెలుసుకోవాలి. 

  సామాజిక అసమానత్వం అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించిన మానవ సమాజ శాస్త్రవేత్త రీన్‌లెనోయిర్‌ (ఫ్రాన్స్‌). సామాజిక మినహాయింపు అనే పదం యూరప్, అమెరికా దేశాల్లో వాడుకలో ఉంది. సామాజిక బహిష్కరణ లేదా సామాజిక మినహాయింపును (సోషల్‌ ఎక్స్‌క్లూజన్‌) మొదటిసారి 1970లో ఫ్రాన్స్‌లో ప్రయోగించారు. ఆ తర్వాత కొద్ది కాలంలోనే సాంఘిక బహిష్కరణ అనే పదాన్ని విస్తృతంగా ఉపయోగించారు. సామాజిక మినహాయింపు అనే పదాన్ని మొదటిసారిగా 1974లో ఉపయోగించారు.

  టాల్కట్‌ పార్సన్స్‌ అనే సామాజిక శాస్త్రవేత్త పారిశ్రామికీకరణ, నగరీకరణ సమాజంలో ఒక విధమైన కొత్త పరిస్థితులను సృష్టించి సామాజిక మినహాయింపునకు దారి తీశాయని పేర్కొన్నారు. భారతదేశంలో కులం, మతం, తెగ, లింగ భేదం, ప్రాంత భేదం, వైకల్యం, వృద్ధాప్యం లాంటి సాంఘిక నిర్మితుల వల్ల సమాజం నుంచి వెలికి గురైనవారు సరైన హక్కులను పొందలేక పోతున్నారు. మానవ పరిణామక్రమంలో భాగంగా సమాజంలో అధికారం, హోదా, సంపద పంపిణీలో కొన్ని వర్గాల పట్ల వివక్ష చూపారు. ఫలితంగా ఈ వర్గాలు తీవ్రంగా వెనుక పడిపోయాయి. భారతదేశంలో సామాజిక మినహాయింపునకు ప్రధాన కారణం కులం. మనదేశంలో ఈ భావనను మొదటిసారిగా ప్రవేశపెట్టిన సామాజిక శాస్త్రవేత్త అమర్త్యసేన్‌.  

 

అమర్త్యసేన్‌ భావన

అమర్త్యసేన్‌ అభిప్రాయం ప్రకారం సామాజిక మినహాయింపు రెండు రకాలు.

1) పూర్తిస్థాయి సామాజిక మినహాయింపు: సమాజంలో పేదరికం, వలస లాంటి విభిన్న కారణాలను చూపిస్తూ పూర్తిగా హక్కులు, రక్షణలు పొందలేని పరిస్థితిని పూర్తిస్థాయి సామాజిక మినహాయింపు అంటారు.

2) పాక్షిక స్థాయి సామాజిక మినహాయింపు:  వెలికి గురైన వర్గాలకు హక్కులు, రక్షణలు, భాగస్వామ్యం కల్పించినట్లయితే దాన్ని పాక్షిక స్థాయి సామాజిక  మినహాయింపు అంటారు.

 

మినహాయింపు పలు రకాలు

1) వ్యక్తిగత మినహాయింపు: బహిష్కరణకు గురైన వ్యక్తి సమాజంలో అర్థవంతమైన భాగస్వామి కాలేడు. ప్రస్తుత కాలంలో మహిళలు సామాజిక బహిష్కరణను ఎదుర్కొంటున్నారు.

ఉదా: పశ్చిమ దేశాల్లో స్త్రీవాద ఉద్యమానికి కారణం మహిళలను సమాజం తక్కువగా చూడటం, శ్రామిక శక్తుల నుంచి వారిని బహిష్కరించడం అని మూస - మిథ అనే సామాజికవేత్త పేర్కొన్నారు. స్త్రీ, పురుషులు పనిలో సమానంగా భాగస్వాములు కావాలనేది స్త్రీ వాదుల వాదన.

* వైకల్యం ఉన్నవారికి ఉద్యోగ వసతి కల్పిస్తే ఉత్పాదకత దెబ్బతింటుదని, పని ప్రదేశాల్లో ప్రమాదాలు పెరుగుతాయని యజమానులు భావిస్తారు. వైకల్యం కలిగిన వారికి ఉపాధి కల్పించడం ఖర్చుతో కూడుకున్న అంశమని యజమానులు అనుకుంటారని కాంటర్‌ పేర్కొన్నారు.

2) బహిష్కరణ: జాతి కారణంగా అనేక సమాజాలు బహిష్కరణను ఎదుర్కొంటున్నాయి. 

ఉదా: నలుపు, అంటరానితనం, దిగువ కులాలు లేదా దళితులు. 

* ఆస్ట్రేలియాలోని ఆదిమ తెగల ప్రజలు ఇలాంటి బహిష్కరణకు గురవుతున్నారు. తెగల వలసవాదం వల్ల స్థానిక వ్యవసాయ భూమిని, సంస్కృతి విలువలను పూర్తిగా కోల్పోయారు. 

* నల్లమల అటవీ ప్రాంతంలో నివసించే చెంచు తెగవారు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు.

3) వృత్తిపరమైన మినహాయింపు: వృత్తుల ఆధారంగా కూడా ప్రజలు మినహాయింపునకు గురవుతున్నారు. ఈ రకమైన మినహాయింపు దళితులు చేసే కొన్ని రకాల వృత్తుల్లో కనిపిస్తుంది. 

4) రాజకీయ మినహాయింపు: రాజకీయ ప్రక్రియలు లేదా హక్కుల నుంచి కొంత మంది లేదా వర్గాలను దూరం చేశారు. కొన్ని వర్గాలు మాత్రమే రాజకీయంగా ముందు ఉంటున్నాయి. దీనివల్ల మినహాయింపునకు గురైనవారిలో వెనుకబాటుతనం అధికమై ఉద్యమాలకు దారితీస్తోంది.  

ఉదా: ఆస్తి, కులం వయసు, చదువు

5) ఆర్థిక మినహాయింపు: సమాజంలో అన్ని ఆర్థిక ప్రక్రియల నుంచి నెట్టివేయడం. అంటే ఆర్థిక వనరులపై నియంత్రణ, నిషేధం.

6) సాంస్కృతిక మినహాయింపు: ఆచార వ్యవహారాలు, సంస్కృతి సంప్రదాయాల విషయంలో మినహాయింపు ప్రపంచ వ్యాప్తంగా అనేక రూపాల్లో కనిపిస్తుంది.

 

భారతదేశంలో 

భారత్‌లో తెగ, లింగ భేదం, మతం, కులం, వైకల్యం లాంటి అనేక అంశాలు సామాజిక మినహాయింపునకు కారణాలుగా కనిపిస్తున్నాయి. 

తెగ: సమాజం నుంచి దూరంగా వెలికి గురైన వాళ్లకి విద్య, ఉపాధి, ఉత్పత్తి రంగాల్లో తగిన భాగస్వామ్యం లేకపోవడంతో మినహాయింపు బారిన పడ్డారు.

ఉదా: రాజస్థాన్‌లోని భిల్లులు, పశ్చిమ బెంగాల్‌లోని సంతాల్‌లు కొన్ని రకాల మినహాయింపులకు గురయ్యారు.  

లింగ భేదం: లింగ భేదం వల్ల సమాజంలో మహిళలు మినహాయింపు పాలయ్యారు. నియమాలు, సాంఘిక పరిస్థితుల పేరుతో రాజకీయ, సామాజిక, ఆర్థిక వ్యవస్థలో మహిళల భాగస్వామ్యం లేకుండా పోయింది. 

మతం: కొన్ని సందర్భాల్లో మెజార్టీ ప్రజలు మైనార్టీలను మినహాయింపునకు గురి చేస్తున్నారు. జాతి, మత, భాష విషయాల్లో మైనార్టీలను కొన్ని సామాన్య అంశాల నుంచి వేరు చేస్తున్నారు. దీనివల్ల ఆ వర్గాలు హక్కులు, రక్షణలు కోల్పోతున్నాయి.

కులం: సమాజంలో కొన్ని కులాల వారికి మాత్రమే హోదా, అధికారం, హక్కులను కల్పించి మరికొన్ని కులాల వారికి అవకాశం లేకుండా చేశారు. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, గుర్తింపు పొందిన కొన్ని వర్గాలు కులం కారణంగా వేల సంవత్సరాలుగా రాజకీయ, సాంఘిక, ఆర్థిక హక్కులకు దూరమయ్యాయి.  

వైకల్యం: సామాన్య మానవుడికి లభించే అన్ని రకాల హక్కులు, రక్షణలు, భాగస్వామ్య వ్యవస్థలు వైకల్యం కలిగిన వారికి లభించడం లేదు. దీనివల్ల వారు అనిశ్చితికి గురవుతున్నారు. 

 

నష్టాలు

* సామాజిక మినహాయింపు వల్ల విలువైన మానవ వనరులను పూర్తిస్థాయిలో వినియోగించుకోలేక పోతున్నారు. 

* వ్యక్తులు అసంతృప్తికి గురై ఉద్యమాలు, తిరుగుబాట్లు, విప్లవాలు వచ్చి అనిశ్చితి నెలకొంటోంది. 

* సామాజిక మినహాయింపు పాటించే దేశాలు ప్రపంచ ర్యాంకింగ్‌లో వెనుకబడి ఉంటాయి. అక్కడ పెట్టుబడులు మందగిస్తాయి. ఫలితంగా ప్రపంచీకరణలో వెనుకబాటుతనం ఏర్పడుతుంది.

* ‘పావర్టీ ఇన్‌ ఇండియా’ అనే పుస్తకంలో పేదరికాన్ని విశ్లేషిస్తూ ‘గ్రామీణ దారిద్య్రం అధికమై నగరాల్లోకి పొంగి ప్రవహిస్తుంది’ అని దండేకర్‌ పేర్కొన్నారు. 

 

మనుధర్మ శాస్త్రంలో 18 పాదాల మినహాయింపు 

1) యజమానికి తెలియకుండా స్థలం అమ్మడం

2) భాగస్వామ్యం   

3) దూషించడం

4) హింస  

5) అప్పులు చెల్లించనివారు

6) జీతాలు ఇవ్వకపోవడం   

7) ఒప్పందాల ఉల్లంఘన  

8) జూదం

9) పందేలు    

10) వంశాల తగాదాలు

11) లైంగిక హింస    

12) కొట్టుకోవడం 

13) భార్యాభర్తల తగాదాలు  

14) ధనంతో కూడిన మోసం

15) భూ సరిహద్దు తగాదాలు 

16) బహుమానాలు/మోసాలు

17) పనివారు - యజమానులు

18) అమ్మకాల నిలిపివేత

 

ఐఎల్‌ఓ ప్రకారం వివిధ దేశాల్లో మినహాయింపు 

అంతర్జాతీయ లేబర్‌ ఆర్గనైజేషన్‌ (ఐఎల్‌ఓ) వివిధ దేశాల్లోని మినహాయింపులను పరిశీలించి నిర్వచించింది.

భారత్‌: సామాజిక మినహాయింపు అంటే ఏదైనా సమూహాలకు ప్రాథమిక, సంక్షేమ పరమైన హక్కులను తోసిపుచ్చి సాంఘిక, సామాజిక జీవన విధానంలో సముచిత స్థానం కల్పించకపోవడం.

పెరూ: ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ కార్యక్రమాల్లో సరైన ప్రాతినిధ్యం లేకపోవడం ఇక్కడి సామాజిక మినహాయింపు.

థాయ్‌లాండ్‌: పౌరహక్కులు, జీవన విధానాలు, జీవన ప్రమాణాలను గుర్తించకపోవడం.

రష్యా: సామాజిక మినహాయింపు జీవుల గుణాత్మక, క్రియాత్మక విషయాలతో కూడిన దృగ్విషయం.

యెమెన్‌: జాతీయ లేదా స్థానిక స్థాయుల్లో ఏదైనా ఒక సమూహం, జాతికి గుర్తింపు లేకపోవడం.

 

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

 

1. కిందివాటిలో సాంఘిక బహిష్కరణ రూపం ఏది?

1) వివక్ష       2) అంటరానితనం      3) వెలి       4) అన్నీ

 

2. ‘సామాజిక వెలి’ అనే పదాన్ని మొదట ఏ దేశ పరిస్థితులను ఉదహరించడానికి ఉపయోగించారు?

1) ఫ్రాన్స్‌      2) అమెరికా       3) బ్రిటన్‌      4) భారత్‌

 

3. సామాజిక బహిష్కరణ/మినహాయింపును మొదట ప్రయోగించిన దేశం?

1) ఆస్ట్రేలియా       2) భారత్‌      3) ఫ్రాన్స్‌      4) రష్యా

 

4. కిందివాటిలో లింగ వ్యత్యాసాలు దేనిలో కనిపిస్తాయి?

1) విద్య      2) ఉద్యోగం       3) ఆరోగ్యం      4) అన్నీ

 

5. సామాజిక అసమానత్వం లక్షణం?

1) వృత్తిపరమైన వైవిధ్యం

2) మేధాపరమైన అసమానత్వం

3) జాతిపరమైన అసమానత్వం

4) అంతస్తు, అధికారాల అసమానత్వం

 

సమాధానాలు

1-4,    2-1,    3-3,    4-4,    5-4.

 

రచయిత: వట్టిపల్లి శంకర్‌రెడ్డి

Posted Date : 21-04-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌