• facebook
  • whatsapp
  • telegram

సామాజిక మిన‌హాయింపు

   ప్రపంచంలోని పురాతన, ఆధునిక సమాజాల్లో ఎక్కడా కనిపించనిది.. కేవలం మన దేశంలోనే కనిపించేది కులం, కులవ్యవస్థ. ఈ సామాజిక స్థితి శాపమా? వరమా? - అసలిదెలా వచ్చింది? విభిన్న సిద్ధాంతాలు ఏవిధంగా ఆవిర్భవించాయి? శాస్త్రవేత్తలు దీనిపై ఏమంటున్నారు? - ఉస్మానియా విశ్వవిద్యాలయం సమాజశాఖ విభాగాధిపతి, టీఎస్‌పీఎస్సీ సిలబస్ కమిటీ సభ్యులు ఆచార్య గణేశ్ విశ్లేషణ 'ఈనాడు ప్రతిభ'కు ప్రత్యేకం.
    భారతీయ సమాజ ప్రత్యేక లక్షణాల్లో కులం ఒకటి. కులవ్యవస్థ భారతదేశంలోని సామాజిక స్తరీకరణ (సోషల్ స్ట్రాటిఫికేషన్)ను సూచిస్తుంది. చాలా సమాజాలు అసమానత ప్రాతిపదికపై ఆధారపడి ఉంటాయి. ఇలాంటి అసమానత ప్రాతిపదికగా సమాజాన్ని వివిధ సమూహాలుగా విభజించే ప్రక్రియను సామాజిక స్తరీకరణ అంటాం. ఒక్కో సమాజంలో ఒక్కో రకమైన స్తరీకరణ వ్యవస్థ ఉంటుంది. ఉదాహరణకు అమెరికా సమాజాన్ని తీసుకుంటే అక్కడ ఆర్థిక స్థితి ఆధారంగా, జాతి ఆధారంగా (నల్లవారు, తెల్లవారు) స్తరీకరణ ఉంటుంది. మన దేశంలో ప్రజలను వివిధ సామాజిక వర్గాలుగా విభజించడమే కాకుండా వారందరినీ ఓ క్రమానుగత శ్రేణిలో అమర్చిన వ్యవస్థనే కులవ్యవస్థ అంటాం. ఈ కులవ్యవస్థలో అన్ని కులాలకు సంబంధించిన వాళ్లూ సమానం కాదు. కులవ్యవస్థ అనేది అసమానత ప్రాతిపదికగా ఏర్పడిన వ్యవస్థ. వాస్తవికంగా చెప్పాలంటే ఇది వర్ణవ్యవస్థ నుంచి ఏర్పడిన వ్యవస్థ.
   హిందూ సమాజం మొదట నాలుగు వర్ణాలుగా (బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు) విభజితమైంది. ఈ క్రమానుగత శ్రేణిలోనే.. నాలుగు వర్ణాల నుంచి వందలాది కులాలు, ఉపకులాలు ఆవిర్భవించాయి. వర్ణవ్యవస్థ నుంచి కులవ్యవస్థలోకి ఎప్పుడు మారామనడానికి స్పష్టమైన ఆధారాలు లేనప్పటికీ కులవ్యవస్థ ప్రస్తావన, లక్షణాలు మనుస్మృతి, తర్వాతి కాలం నుంచి కనిపిస్తున్నాయి.
ప్రపంచంలో కులం లాంటి వ్యవస్థలున్నాయి (వృత్తుల ఆధారంగా) తప్ప.. మనలాంటి కుల వ్యవస్థలు లేవు. భారత సమాజానికున్న విలక్షణత కుల వ్యవస్థ. భారత్‌లో వ్యక్తిగత అంతస్తు పుట్టుక(జన్మ)తో ఏర్పడుతుంది. చాలామంది సామాజిక శాస్త్రవేత్తలు కులం లక్షణాల గురించి ప్రస్తావించారు. ఇందులో భారతీయ శాస్త్రవేత్తలను తీసుకుంటే - జి.ఎస్. ఘుర్యే, ఎం.ఎన్. శ్రీనివాస్, కేట్కర్, జి.హెచ్. హట్టన్ లాంటివారు కులవ్యవస్థకున్న సాధారణ, సాంప్రదాయిక లక్షణాలను చెప్పారు.

 

కులవ్యవస్థ ఎలా పుట్టింది?

కులవ్యవస్థ పుట్టుకకు సంబంధించి కొన్ని సిద్ధాంతాలున్నాయి. ఇందులో ఆరు ప్రధానమైనవి. ఈ సిద్ధాంతాలపై సామాజిక శాస్త్రవేత్తల మధ్య, వివిధ కాలాల్లో చర్చ జరిగింది.
1. దైవాంశ సంభూత సిద్ధాంతం
2. వృత్తిపరమైన సిద్ధాంతం
3. జాతి సిద్ధాంతం
4. సాంస్కృతిక సిద్ధాంతం
5. హట్టన్ మాన సిద్ధాంతం
6. బ్రాహ్మణీక సిద్ధాంతం

 

దైవాంశ సంభూత సిద్ధాంతం

దీని ప్రకారం.. మొదట చాతుర్వర్ణాలు భగవంతుడి నాలుగు వేర్వేరు భాగాల నుంచి ఉద్భవించాయి. అందులో బ్రాహ్మణులు భగవంతుడి ముఖ భాగం నుంచి, క్షత్రియులు భుజాల నుంచి, వైశ్యులు ఉదరం నుంచి, శూద్రులు పాదాల నుంచి పుట్టారు. ఆయా శరీర భాగాలకున్న ప్రాధాన్యాన్ని బట్టి బ్రాహ్మణులు పౌరోహిత్యం చేయడం, జ్ఞానాన్ని సముపార్జించడం, అలా సముపార్జించిన జ్ఞానాన్ని సమాజానికి పంచడం చేయాలి. భుజాల నుంచి వచ్చిన క్షత్రియులు ధైర్యానికి ప్రతీకలు. వీరు దేశరక్షణ, ప్రజారక్షణ చేయాలి. వైశ్యులు వ్యాపార వాణిజ్య బాధ్యతలు.. వ్యవసాయ రంగం నుంచి వచ్చిన ధనధాన్యాలను అన్నిరంగాల ప్రజలకందేలా ప్రయత్నం చేయాలి. పాదాల నుంచి వచ్చిన శూద్రులు వ్యవసాయం, ఇతర సేవలు చేయడం. ఈ వర్ణవ్యవస్థ నుంచి కులాలు వచ్చాయి. కాబట్టి ఈ వర్ణం, కులాలు అనేవి సామాజిక ఆర్థిక, శ్రమ విభజనను సూచించే వ్యవస్థలు. ఎవరు ఏ రకమైన పనులు చేయాలనే వివరణ ఈ దైవాంశసంభూత సిద్ధాంతం చెబుతుంది. దీని ప్రస్తావన విష్ణుపురాణం, రుగ్వేదంలోని పురుషసూక్తంలో ఉంది. చాలామంది సామాజిక శాస్త్రవేత్తలు దీన్ని అంగీకరించలేదు. అశాస్త్రీయమైనదని ఖండించారు.
 

వృత్తిపరమైన సిద్ధాంతం

నెస్‌ఫీల్డ్ అనే సామాజిక శాస్త్రవేత్త దీన్ని ప్రతిపాదించారు. కులవ్యవస్థ వృత్తి ప్రాతిపదికన ఏర్పడిందనేది ఆయన భావన. పూర్వకాలంలో ఒకే వృత్తి చేసేవారంతా కలసి ఒక సంఘంగా ఏర్పడ్డారు. కాలక్రమేణా వంశపారంపర్యంగా అదే వృత్తిని స్వీకరించడం వల్ల వృత్తులను బట్టి వేర్వేరు కులాలు ఏర్పడ్డాయి. ఇలా వంశపారంపర్యంగా స్వీకరించి పాటించడం వల్ల ఆ సమూహం నిర్దిష్ట సమూహంగా మారి.. కాలక్రమేణా కులాలుగా రూపాంతరం చెందాయి. ఈ వృత్తి సమూహాల్లోని వారు అదే సమూహాల్లోని వారిని పెళ్లిచేసుకోవడం వల్ల కులం అనేది అంతర్వివాహ సమూహంగా మారింది. ఒకే వృత్తి సమూహాల వారు వారి వృత్తులను, ఆచార వ్యవహారాలను కాపాడుకునే క్రమంలో కులాలు బలోపేతమయ్యాయి. కొంతవరకు ఈ సిద్ధాంతం వాస్తవానికి దగ్గరగా ఉన్నట్లు చెబుతారు.
 

జాతి సిద్ధాంతం

దీని గురించి ప్రధానంగా చర్చించింది హెర్బర్ట్ రిస్లే. ఆయన రాసిన 'పీపుల్ ఆఫ్ ఇండియా' గ్రంథంలో కులవ్యవస్థకు సంబంధించిన జాతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. కులవ్యవస్థ అనేది జాతి, కొన్ని ప్రత్యేక సంస్కృతులు పాటించే ప్రజా సమూహాల నుంచి ప్రారంభమైంది అంటారు రిస్లే. ఈ సిద్ధాంతం ప్రకారం ఒకే రకమైన శారీరక లక్షణాలున్న జాతి, ఒకే రకమైన సాంస్కృతిక లక్షణాలున్న వారంతా కలసి కాలక్రమంలో ఒక కులంగా ఆవిర్భవించారు. జాతి లక్షణాలను కాపాడుకోవడానికి కులంగా మారడంతోపాటు, కొన్ని ఆంక్షలు కూడా విధించుకున్నారు. వారిపైనా, ఇతరులపైనా ఆంక్షలు విధించారు. తద్వారా జాతి వ్యత్యాసాలు, కులవ్యత్యాసాలుగా రూపాంతరం చెందాయనేది రిస్లే భావన. అయితే దీనిపై చాలా విమర్శలు వెలువడ్డాయి. ఎందుకంటే జాతి అనేది ప్రధానంగా వ్యక్తుల శారీరక లక్షణాలను సూచించేది. ఒక కులానికి సంబంధించిన వారికి ఒకే రకమైన జాతి లక్షణాలుండాలి. కానీ మన దేశంలో అలా లేవు. ఒకే కులానికి సంబంధించిన వారిలో వివిధ జాతి లక్షణాలు కనిపిస్తున్నాయి. అందుకే ఈ సిద్ధాంతాన్ని చాలామంది వ్యతిరేకించారు.
 

సాంస్కృతిక సిద్ధాంతం

ఎస్.సి.రాయ్ అనే సామాజిక శాస్త్రవేత్త దీన్ని ప్రతిపాదించారు. తమ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవడానికి ఒక సమూహంలోని ప్రజలు, తమ సమూహాన్ని కులంగా మార్చుకున్నారు.
 

హట్టన్ 'మాన' సిద్ధాంతం

ఆదిమ జాతులు, తెగలకు సంబంధించిన వారి దృష్టిలో - ప్రకృతి అతీత శక్తులు కలిగినదాన్ని 'మాన' అంటారు. ఆదిమ జాతుల్లో ఒక్కో సమూహానికి ఒక్కో 'మాన' ఉండేది. ఒకేరకమైన ప్రకృతి అతీత శక్తులను విశ్వసించేటటువంటి సమూహం కాలక్రమంలో కులంగా ఆవిర్భవించింది. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు వివిధ రకాల వృత్తుల్ని ఆచరించేవారు. వృత్తులతోపాటు ప్రజల విశ్వాసాలు కూడా చాలా ప్రధానం. వీటిలో ప్రకృతి అతీతశక్తులే ఎక్కువ. వీటిని ఆరాధించడం ఒక్కో ఆదిమ జాతిలో ఒక్కోరకంగా ఉండేది. ఉదాహరణకు ఒకరు సూర్యుడిని ఆరాధిస్తే, మరొకరు నీటిని, చెట్టును, అగ్నిని.. ఇలా ఇష్టమొచ్చినట్లుగా ఆరాధించేవారు. ఇలా ప్రకృతి అతీతశక్తి కలిగిన ప్రతీక(మాన)ను విశ్వసించే సమూహం ఒక కులంగా ఆవిర్భవించి, వారి భయభక్తుల మేరకు ఆంక్షలు ఏర్పరచుకున్నారనేది హట్టన్ 'మాన' సిద్ధాంతం. భారత్‌లో కులవ్యవస్థ పుట్టుకకు సంబంధించిన లక్షణాలు ఆర్యుల రాకకు ముందే ఉన్నాయని, ప్రకృతి అతీత శక్తుల పట్ల ఆదిమ జాతులవారికున్న భయభక్తుల మూలంగా కుల ఆంక్షలు ఏర్పడ్డాయనేది హట్టన్ అభిప్రాయం.
 

బ్రాహ్మణీక సిద్ధాంతం

అబ్బే డ్యుబాయిస్ ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. తాము ఇతరులకంటే అధికులమని భావించిన బ్రాహ్మణులు తమ స్వప్రయోజనాలను కాపాడుకోవటానికి ఏర్పరచిన కృత్రిమ వ్యవస్థే ఈ కులవ్యవస్థ అనేది ఈ సిద్ధాంతం చెబుతుంది. బ్రాహ్మణులు ఈ హిందూ సమాజంపైన తమ ఆధిపత్యాన్ని కాపాడుకోవడం కోసం కొన్ని పూజాపునస్కారాలను, ఆచార వ్యవహారాలను సృష్టించి, వాటికి కుల నియమావళులను ఏర్పరచి, సమాజంపై రుద్దారు. ఈ నియామాలను ఉల్లంఘించేవారిపై ఆంక్షలు విధించాలి, లేదా కులవ్యవస్థ నుంచే బహిష్కరించాలనే పద్ధతిని బ్రాహ్మణులు సృష్టించారనేదే ఈ బ్రాహ్మణీక సిద్ధాంతం వాదన.
 

నెస్‌ఫీల్డ్ వృత్తి సిద్ధాంతం

అనేక సిద్ధాంతాల్లో ఒక్కో రకమైన ప్రతిపాదనలున్నా నెస్‌ఫీల్డ్ ప్రతిపాదించిన వృత్తి సిద్ధాంతం చాలామేర ఆమోదయోగ్యంగా పేరొందింది. భారత్‌లోని చాలా ప్రాంతాల్లో వివిధ వృత్తుల్ని పాటించేవారు ఆ వృత్తుల్ని వారసత్వంగా కొనసాగించటమే కాకుండా వాటికి సంబంధించిన పరిశుద్ధతను కాపాడుకోవడానికి రకరకాల ఆంక్షల్ని విధించుకున్నారు. ఆ క్రమంలో ఒక కులం వేరే కులం నుంచి వేరుపడటం; ఆయా కులాలకున్న ప్రాధాన్యతను బట్టి క్రమానుగత శ్రేణి ఏర్పడిందని, కులాల స్తరీకరణ జరిగిందన్నది సామాజిక శాస్త్రవేత్తల అభిప్రాయం.
స్పానిష్ భాషలోని కాస్టా అనే పదం నుంచి కాస్ట్ అనేది ఏర్పడింది. కాస్టా అంటే జాతి. నిర్దిష్టమైన వారసత్వ లక్షణాలున్న సమూహాన్ని పోర్చుగీసువారు కాస్టా అంటారు. అదే క్రమంగా కాస్ట్‌గా మారింది. పోర్చుగీసువారు భారత్‌కు వచ్చినప్పుడు ఇక్కడి కుల వ్యవస్థకు, తమ దేశంలోని జాతి లక్షణాలకు సామీప్యత ఉన్న కారణంగా ఈ కాస్ట్ అనే పదాన్ని పెట్టారు.

 

కులం లక్షణాలు

హట్టన్ ప్రకారం..

* కులం అంతర్ వివాహ సమూహం.. అంటే ఒక కులానికి చెందిన వ్యక్తి అదే కులంలో ఒకరిని వివాహం చేసుకోవడం.
* వివిధ కులాల మధ్య సహపంక్తి భోజనం, పానీయాల సేకరణపై ఆంక్షలుంటాయి. అంటే ఎవరు ఎవరి నుంచి భోజనం, పానీయాలు స్వీకరించవచ్చు లేదా స్వీకరించరాదనే ఆంక్షలుంటాయి.
* కులాలు స్తరీకరణ చెంది ఉన్నత, మధ్యస్థ, నిమ్న కులాలుగా క్రమశ్రేణిలో అమర్చి ఉంటాయి. ఈ కులశ్రేణి చాలా ప్రధానమైంది. వీటన్నింటికీ సాంప్రదాయికమైన వృత్తులున్నాయి. ఇవి వారసత్వంగా వచ్చే వృత్తులు. ఒక కులంలో పుట్టిన వ్యక్తి ఆ కులవృత్తిని అనుసరించాలనే నియమం కులవ్యవస్థలో ఉంది.
* కుల స్తరీకరణలో ఉన్నత స్థానంలో ఉన్న కులాలకు కొన్ని ప్రత్యేక నియమాలుంటే, నిమ్నస్థితిలోని కులాలకు కొన్ని అనర్హతలున్నాయి. ఉన్నత కులాల వృత్తులు, ఆచారాలను ఉన్నతమైనవిగా.. నిమ్నకులాల వృత్తులు, ఆచారాలను తక్కువగా భావించడం.
* కులవ్యవస్థలో పరిశుద్ధత, అపరిశుద్ధత అని ఉంటాయి. ఉన్నత కులాల్లోని (బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య) వారిని ద్విజులంటారు. నిమ్నకులాల వారిని ద్విజేతరులంటారు. ఈ రెండింటి మధ్య ఉండే వ్యత్యాసాన్ని పరిశుభ్రత, అపరిశుభ్రతల ఆధారంగా విభజించడం.. ద్విజుల ఆచార వ్యవహారాలు పరిశుభ్రమైనవని, ద్విజేతరులవి అపరిశుభ్రమైనవనే భావన హిందూ కుల వ్యవస్థలో కనిపిస్తుంటుంది. దాన్ని ఆధారంగా తీసుకునే అంటరానితనం ఆరంభమైంది.
* కుల అంతస్తు అనేది పుట్టుకతోనే నిర్ధారితమవుతుంది. ఒక వ్యక్తి ఒక కులంలో పుడితే ఆ కులం అంతస్తు ఆ వ్యక్తికి ఆపాదితమవుతుంది. కులమనేది ఆపాదిత అంతస్తు.
* ప్రతి కులానికీ కుల పంచాయతీ ఉంటుంది. ఈ కుల పంచాయతీ అనేది దాదాపు సమాంతర న్యాయవ్యవస్థలా పనిచేస్తుంది. గ్రామాల్లో ఒక కులానికి చెందిన వ్యక్తుల మధ్య కలహాలు, సంఘర్షణలు, వివాదాలు, నేరప్రవృత్తి అంశాలు కుల పంచాయతీల్లోనే పరిష్కరిస్తారు. కుల పంచాయతీ తీర్పును అంతా గౌరవించాలనేది ఓ కట్టుబాటు.

 

ఘుర్యే ఏమన్నారంటే..

కుల వ్యవస్థ లక్షణాలను జి.ఎస్. ఘుర్యే కూడా వివరించారు. ఘుర్యే హిందూ సాంప్రదాయకవాది. హిందూ సాంప్రదాయిక కోణంలోంచి కులవ్యవస్థ లక్షణాలను వివరించారు. కాస్ట్ అండ్ క్లాస్ ఇన్ ఇండియా (భారతదేశంలో కులం, వర్గం), కాస్ట్ అండ్ రేస్ ఇన్ ఇండియా అనే రెండు పుస్తకాలు రాశారు. ఆయన అభిప్రాయం ప్రకారం..
* కుల వ్యవస్థ హిందూ సమాజాన్ని విభిన్న అంతస్తుల సమాజాలుగా విభజిస్తుంది. కులవ్యవస్థలో వ్యక్తుల అంతస్తు ఆపాదిత అంతస్తు. జన్మను బట్టి ఇది నిర్ధారితమవుతుంది.
* స్తరీకరణలో ఒక్కో కులం ఒక్కో స్తరంలో ఏర్పడ్డాయి. ఈ స్తరీకరణలో కొన్ని కులాలు అగ్రస్థానంలో ఉంటే మరికొన్ని నిమ్నస్థానంలో ఉన్నాయి. కులం అంతర్వివాహ సమూహం. ఒక కులంవారు ఆ కులంలోని వారినే పెళ్లి చేసుకోవాలనేదే ఈ అంతర్వివాహం. హిందూ కులవ్యవస్థలో గోత్రాలనేవి కూడా ఉన్నాయి. గోత్రం కులంలో భాగం. కులం అంతర్వివాహ సమూహమైతే, గోత్రం బహిర్వివాహ సమూహం. ఒక గోత్రానికి సంబంధించిన వ్యక్తులు అదే గోత్రానికి చెందినవారిని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఒక గోత్రం వారంతా ఒకే పూర్వీకుల నుంచి ఉద్భవించినవారనే భావన ఉంది. అంటే స్వగోత్రీకులంతా రక్తబంధువులని, కాబట్టి స్వగోత్ర వివాహం నిషిద్ధమని కులవ్యవస్థ భావన.
* ప్రతి వ్యక్తికి అనువంశికత అనేది ఉంటుంది. అనువంశికతకు రెండు ప్రాతిపదికలు. తల్లిద్వారా (మాతృస్వామిక వ్యవస్థ) లేదా తండ్రిద్వారా (పితృస్వామిక వ్యవస్థ). పితృస్వామిక వ్యవస్థలో గోత్రాన్ని తండ్రి ద్వారా స్వీకరిస్తారు. మాతృస్వామిక వ్యవస్థలో తల్లి ద్వారా స్వీకరిస్తారు. ఒక కులంలో చాలా గోత్రాలుండొచ్చు.
* ప్రతి కులానికీ కులవృత్తి ఉంటుంది. ఆ కులానికి చెందినవారు తప్పనిసరిగా ఆ వృత్తిని చేపట్టాలి. అంటే సంప్రదాయ కులవ్యవస్థలో ఓ వ్యక్తి జీవనోపాధి, జీవనాధారం తన జన్మసిద్ధంగానే నిర్ధారితమవుతుంది. కులానికి చెందిన వ్యక్తి ఆ వృత్తినే చేపట్టాలనేది నియమం.
* ఆహార పానీయాలకు సంబంధించిన కట్టుబాట్లు.. కులవ్యవస్థలో ద్విజులు శాకాహారాన్ని స్వీకరించాలి. ద్విజేతరులు శాకాహారం, మాంసాహారాన్ని స్వీకరించవచ్చు. ఒకరి నుంచి వేరొకరు ఆహారం స్వీకరించే విషయంలో.. ప్రతి వ్యక్తి తన కులం వారి నుంచి లేదా తన కంటే ఎక్కువ కులం వారి నుంచి మాత్రమే ఆహారాన్ని స్వీకరించవచ్చు.

 

విధి - నిషేధాలు

* ఉన్నత కులాలకు ప్రత్యేకమైన అర్హతలు, గౌరవ మర్యాదలుంటే మిగతా కులాలకు చెందినవారికి కొన్ని అనర్హతలు, ఆంక్షలు కనిపించేవి. ఉన్నత కులస్థుల వృత్తులను కూడా గౌరవప్రదంగా చూసేవారు.
* ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వీధులు కులాల వారీగా ఏర్పాటై ఉండేవి. ఒక కులానికి చెందినవారు ఒకే వీధిలో నివసిస్తుంటారు. ఇది సంప్రదాయ భారత గ్రామీణ వ్యవస్థలో కనిపిస్తుంది.
* నిమ్న కులస్థుల వృత్తులను చిన్నచూపు చూసేవారు. ఉదాహరణకు ఒకప్పుడు మహారాష్ట్రలో దళిత కులాలవారు గ్రామాల్లో నివసించడానికి వీల్లేదు. గ్రామాల బయట నివసించాలి. సూర్యుడు ఉదయించకముందు, సూర్యుడు అస్తమించిన తర్వాతనే గ్రామంలోకి రావాలి. వీధుల్ని శుభ్రపరచడం, పారిశుధ్య పనులు చేయాలనే నిబంధన ఉండేది. దళితుల నీడ కూడా ఉన్నత కులాలవారిపై పడితే వారు మలినం చెందుతారనే భావన ఉండేది. అందుకే సూర్యుడు ఉదయించినప్పటి నుంచి అస్తమించే దాకా ఊర్లోకి రానిచ్చేవారు కాదు.
కేరళను ఉదాహరణగా తీసుకుంటే - షాణార్లు, ఏజవా (కల్లుగీత కారులు)ల పట్ల అంటరానితనం ఉండేది. వారు ఒక అంతస్తుకు మించి ఇల్లు కట్టుకోకూడదనే నిషేధం అమల్లో ఉండేది. అంటే సాధ్యమైనంత వరకు పూరి గుడిసెలు, పెంకుటిళ్లలో మాత్రమే ఉండాలనే నియమాన్ని ఈ కులవ్యవస్థ వారిపై విధించింది.
* వస్త్రధారణ విషయంలోనూ చాలా నియమ నిబంధనలుండేవి. ముఖ్యంగా నిమ్న కులస్థులు నడుం పైభాగంలో దుస్తులు కట్టరాదనే నిషేధం కేరళ, తమిళనాడుల్లో కనిపించేది. గౌరవప్రదమైన జీవితం గడిపే అవకాశం నిమ్న కులాలకు సాంప్రదాయిక కులవ్యవస్థలో ఉండేది కాదు.
* ఉన్నత కులాల వృత్తులు పరిశుద్ధ వృత్తులు. నిమ్నకులాల వృత్తులు అపరిశుద్ధమైన వృత్తులనే భావన ఉండేది.

Posted Date : 02-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌