• facebook
  • whatsapp
  • telegram

సౌర కుటుంబం

అంతరిక్షంలో ఆదిత్య పరివారం! 

 


 


భూమిపై సృష్టికి, జీవుల మనుగడకు మూలం సూర్యుడు. స్వయంప్రకాశక వాయు గోళమైన సూర్యుడి గురుత్వశక్తి పరిధిలో భూమి, ఇతర గ్రహాలు సహా అనేక ఖగోళ వస్తువులు తిరుగుతున్నాయి. ఈ సౌరవ్యవస్థ రూపురేఖలు, ఇందులోని గ్రహాల అమరిక, వాటి పరిమాణం, స్వభావం, భ్రమణ - పరిభ్రమణాలపై పోటీ పరీక్షార్థులకు సమగ్ర అవగాహన ఉండాలి. విశ్వంలో ఒక మధ్యస్థాయి అరుణ మహాతారగా వెలుగుతున్న సూర్యుడి పుట్టుక, భౌతిక నిర్మాణం, అంతర్గతంగా, ఉపరితలంపై ఉండే ఉష్ణోగ్రతల వైవిధ్యం, సౌరజ్వాలల్లో జరిగే మార్పుల పరిణామాల గురించి శాస్త్రీయంగా తెలుసుకోవాలి.

 

కేంద్రక స్థానంలో ఉన్న సూర్యుడితోపాటు చుట్టూ పరిభ్రమించే గ్రహాలు, ఉపగ్రహాలు, లఘుగ్రహాలు, ఉల్కలు, తోకచుక్కలు, అంతర గ్రహ ధూళి అనే ఖగోళ స్వరూపాల సముదాయాన్ని సౌరకుటుంబం అంటారు.


సూర్యుడు: సూర్యుడు ఒక మధ్యస్థ స్థాయి నక్షత్రం. వయసు 5.5 బిలియన్‌ సంవత్సరాలు. భూమి కంటే సూర్యుడి పరిమాణం 1.3 మిలియన్ల రెట్లు ఎక్కువ. భానుడి కాంతి భూమిని చేరడానికి పట్టే కాలం 8 నిమిషాలు. సూర్యుడు తన చుట్టూ తాను తిరగడానికి పట్టే కాలం 25 రోజులు. సూర్యుడు పాలపుంత కేంద్రకం చుట్టూ తిరగడానికి పట్టేకాలం 250 మిలియన్‌ సంవత్సరాలు. దీనినే కాస్మిక్‌ సంవత్సరం అంటారు. సూర్యుడికి, భూమికి మధ్య సగటు దూరం 149.5 మిలియన్‌ కిలోమీటర్లు లేదా 1 ఆస్ట్రోనామికల్‌ యూనిట్‌.భూమికి సూర్యుడి తర్వాత అతి సమీపంలో ఉన్న రెండో నక్షత్రం ప్రాక్జిమా సెంటారియా.


సూర్యుడి నిర్మాణం: సూర్యుడిలో 71% హైడ్రోజన్, 26.5% హీలియం, మిగిలిన 2.5% ఇనుము, సిలికాన్, కార్బన్, ఆక్సిజన్‌ లాంటి పదార్థాలున్నాయి. సూర్యుడి దేహ నిర్మాణాన్ని అంతర నిర్మాణం, ఉపరితలం అని రెండు భాగాలుగా విభజించవచ్చు.


ఎ) సూర్యుడి అంతర నిర్మాణం: ఇది మళ్లీ 3 భాగాలుగా ఉంటుంది. 


1) కేంద్రక భాగం (Core Area): ఇది సూర్యుడి అంతర్భాగంలో శక్తి జనక కేంద్రం. ఇక్కడ ఉష్ణోగ్రత 15 మిలియన్‌ డిగ్రీల కెల్విన్‌ వరకు ఉంటుంది.


2) విద్యుదయస్కాంత ప్రాంతం (Radio Active Zone): కేంద్రక భాగంలో పుట్టిన శక్తి విద్యుదయస్కాంత తరంగాల రూపంలో సూర్యుడి ఉపరితలం వైపు, ఫోటాన్ల రూపంలో ఉష్ణ సంవహన ప్రాంతం వైపు కదిలే ప్రాంతం.


3) ఉష్ణసంవహన ప్రాంతం (Convection Zone): ఈ ప్రాంతం నుంచి శక్తి ఉష్ణసంవహన వాయుప్రవాహాలుగా, బుడగల రూపంలో వేగంగా సూర్యుడి ఉపరితలాన్ని చేరుతుంది.


బి) సూర్యుడి ఉపరితలం: ఉష్ణోగ్రత వ్యత్యాసం ఆధారంగా ఇది మూడు భాగాలుగా ఉంటుంది.


1) ఫొటోస్ఫియర్‌ లేదా కాంతిమండలం: ఇది మనకు పగటి సమయంలో ప్రకాశవంతంగా కనిపించే సూర్యుడి ఉపరితలం. ఇందులో ఉష్ణోగ్రత 6000 డిగ్రీల సెం.గ్రే. ఉంటుంది. ఈ ప్రాంతంలోని నల్లటి మచ్చలను సూర్యాంకాలు/సన్‌ స్పాట్స్‌/బ్లాక్‌ స్పాట్స్‌ అంటారు. సూర్యాంకాల్లో పరిసర ప్రాంతాల కంటే ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి (1000-1500 డిగ్రీల సెం.గ్రే.). సూర్యాంకాల నుంచి   వెదజల్లే ఆవేశపూరిత విద్యుత్తు కణాల సమూహమే ‘సౌరజ్వాలలు’. ప్రతి 11 ఏళ్లకు ఒకసారి సూర్యాంకాల నుంచి అత్యధిక పరిమాణంలో సౌరజ్వాలలు విడుదలవుతూ ఉంటాయి. వీటినే సౌర సునామీలు లేదా సౌర తుపానులు అంటారు. ఇవి భూవాతావరణంలోని థర్మోస్ఫియర్‌ ప్రాంతంలోకి ప్రవేశించినప్పుడు అక్కడున్న ఎలక్ట్రోమ్యాగ్నటిక్‌ రేడియేషన్‌ వితరణం చెంది భూమిమీద సమాచార, ప్రసార వ్యవస్థల్లో అంతరాయాలు కలుగుతాయి. బ్యాంకింగ్‌ ఖాతాలు తారుమారుకావడం, విద్యుత్తు గ్రిడ్లు విఫలమవడం, వాతావరణంలో ఆక్సిజన్‌ పరిమాణం తగ్గడం లాంటి ఊహించని పరిణామాలు ఏర్పడి భూమిపై మానవ   మనుగడ ప్రశ్నార్థకమవుతుంది.


సూర్యుడి ఫొటోస్ఫియర్‌ ప్రాంతంలో న్యూట్రాన్‌    అణువుల ఉద్గారం తక్కువ స్థాయిలో జరిగితే వాటిని సౌరపవనాలు అంటారు. ఇవి భూవాతావరణంలోకి వచ్చినపుడు అక్కడున్న దుమ్ము, ధూళి కణాలపై పడి వివర్తనం చెంది ఉత్తర, దక్షిణ ధ్రువాల వద్ద ఎరుపు, నారింజ, ఆకుపచ్చ వర్ణపు పట్టీలు ఏర్పడతాయి. వీటినే ‘అరోరాలు’ అని పిలుస్తారు. ఉత్తరార్ధ గోళంలో వీటిని ‘అరోరా బోరియాలసిస్‌’ అని, దక్షిణార్ధ గోళంలో ‘అరోరా ఆస్ట్రలిస్‌’ అని పిలుస్తారు.

 

 


భూ ఉపరితలం నుంచి దాదాపు 64 వేల కి.మీ. ఎత్తులో ఉన్న ఆవరణాన్ని ‘అయస్కాంత ఆవరణం’ లేదా ‘వాన్‌ అలెన్‌ వికిరణ మేఖల’ అని పిలుస్తారు. ఈ అమరికే సూర్యుడి వాతావరణం నుంచి వెదజల్లే సౌరజ్వాలల నుంచి భూవాతావరణాన్ని కాపాడుతుంది. సూర్యుడిపై పరిశోధన కోసం ఇస్రో ప్రయోగించిన కృత్రిమ ఉపగ్రహం ‘ఆదిత్య’. సమాన సూర్యకాంతిని పొందే ప్రదేశాలను ‘ఐసోహెల్స్‌’ అంటారు.


2) క్రోమోస్ఫియర్‌ లేదా వర్ణావరణం: ఇది ఫొటోస్ఫియర్‌ పైన ఎరుపు, నారింజ రంగుల్లో ఉండే భాగం. ఇక్కడ ఉష్ణోగ్రతలు 32000 డిగ్రీల సెం.గ్రే. వరకు ఉంటాయి. ఈ ప్రాంతం సూర్యోదయం, సూర్యాస్తమయ సమయాల్లో మాత్రమే కనిపిస్తుంది. ఈ ప్రాంతంలో మూలకాల ఉనికిని తెలియజేసే నల్లటి రేఖలు ఏర్పడి ఉంటాయి. వీటిని ‘ప్రాన్‌ హూపర్‌ రేఖలు’ అంటారు.


3) కరోనా (సూర్యకాంతి పరివేశం): క్రోమోస్ఫియర్‌ పైభాగంలో అత్యధిక ఉష్ణోగ్రతలున్న ప్రాంతం. ఇది గ్రహణ సమయాల్లో మాత్రమే కనిపిస్తుంది.  సూర్యుడిలోని థర్మోన్యూక్లియర్‌ చర్యలన్నీ ఇందులోనే జరుగుతాయి. ఇక్కడ ఉష్ణోగ్రత 1,72,000 డిగ్రీల సెంటీగ్రేడ్‌ వరకు ఉంటుంది.


సౌరకుటుంబ పరిధి: దీన్ని గ్రహాల పరిధి, కూపియర్‌ బెల్ట్, ఊర్ట్‌ క్లౌడ్‌ రీజియన్‌ అని మూడు భాగాలుగా విభజించవచ్చు.


1) గ్రహాల పరిధి: ఇందులో గ్రహాలు, ఉపగ్రహాలు, ఆస్టరాయిడ్లు ఉంటాయి.


గ్రహాలు: తమ ఊహాత్మక అక్షంపై ఉండి, సూర్యుడి చుట్టూ తిరుగుతూ, సూర్యుడి నుంచి వెలుతురు, వేడిమిని పొందే ఖగోళ స్వరూపాలే గ్రహాలు. ప్రస్తుతం సౌరకుటుంబంలోని గ్రహాల సంఖ్య 8 మాత్రమే. 9వ గ్రహంగా భావిస్తూ వచ్చిన ప్లూటోకు గ్రహ స్థాయి లేదని నిర్ణయించి, మరుగుజ్జు గ్రహాల జాబితాలో చేర్చారు. 2006, ఆగస్టు 24న చెక్‌   రిపబ్లిక్‌ రాజధాని ఫ్రేగ్‌లో జరిగిన ఐఏయూ (ఇంటర్నేషనల్‌ ఆస్ట్రోనామికల్‌ యూనియన్‌)   సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 


2) కూపియర్‌ బెల్ట్‌: నెప్ట్యూన్‌ గ్రహ కక్ష్యకు అవతల ఉన్న సౌరకుటుంబంలోని ప్రాంతాన్ని ‘కూపియర్‌ బెల్ట్‌’ అంటారు. ఇందులో తోకచుక్కలు, మరుగుజ్జు గ్రహాలు ఉంటాయి. 


3) ఊర్ట్‌ క్లౌడ్‌ రీజియన్‌: కూపియర్‌ బెల్ట్‌కు   అవతల ఉన్న ప్రాంతం. అక్కడ తోకచుక్కలు ఉంటాయి. దీంతో సౌరకుటుంబ పరిధి ఆగిపోతుంది.


గ్రహాలు రెండు రకాలు: భూకక్ష్యను ఆధారంగా చేసుకుని గ్రహాలను రెండు రకాలుగా విభజించవచ్చు. 


1) నిమ్నత గ్రహాలు: ఈ గ్రహాలు భూకక్ష్యకు లోపల, సూర్యుడికి దగ్గరగా ఉంటాయి. అవి బుధుడు, శుక్రుడు.


2) ఉన్నత గ్రహాలు: వీటి కక్ష్యలు భూకక్ష్యకు ఆవల ఉంటాయి. అవి అంగారకుడు, బృహస్పతి, శని, ఇంద్రుడు, వరుణుడు, యముడు. గ్రహాల భౌతిక, రసాయన ధర్మాల ఆధారంగా రెండు రకాలు. 


1) అంతర/భౌమ/టెరెస్ట్రియల్‌ గ్రహాలు. ఇవి శిలానిర్మితాలు. పరిమాణంలో చిన్నవిగా, అధిక   సాంద్రత, ఉష్ణోగ్రతలతో ఉంటాయి.


ఉదా: బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు


2) బాహ్య గ్రహాలు/జోవియస్‌ గ్రహాలు: ఇవి హైడ్రోజన్‌ లాంటి అనేక వాయువులు ద్రవీభవించడం వల్ల ఏర్పడినవి. తక్కువ సాంద్రత,     ఉష్ణోగ్రతలతో ఉంటాయి. ఉదా: బృహస్పతి, శని, ఇంద్రుడు, వరుణుడు.


గ్రహాలు-కనుక్కున్న శాస్త్రవేత్తలు:

1) శని - గెలీలియో

2) వరుణుడు - విలియం హర్షల్‌

3) ఇంద్రుడు - జోహన్‌ గాల్, ఆడమ్స్, లీ-వెరియర్‌ 

4) ప్లూటో - క్లయిడ్‌ టామ్‌ బాగ్, పెర్శి వాల్‌ లోవెల్‌ 

 


1) బుధుడు (గాడ్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ సిల్క్, ఉపగ్రహాలు లేవు.) 2) శుక్రుడు (గాడ్‌ ఆఫ్‌ స్ప్రింగ్‌ అండ్‌ లవ్, ఉపగ్రహాలు లేవు.) 3) భూమి (ఒక ఉపగ్రహం) 4) అంగారకుడు/కుజుడు (గాడ్‌ ఆఫ్‌ వార్‌ - 2 ఉపగ్రహాలు) 5) బృహస్పతి/గురుడు (రూలర్‌ ఆఫ్‌ గాడ్స్‌ అండ్‌ హెవెన్‌ - 79) 6) శని (గాడ్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ - 82) 7) వరుణుడు  (గాడ్‌ ఆఫ్‌ స్కై - 27) 8) ఇంద్రుడు (గాడ్‌ ఆఫ్‌ సీ - 14).


పరిమాణం పరంగా గ్రహాల అవరోహణ క్రమం:    


1) బృహస్పతి 2) శని 3) వరుణుడు 4) ఇంద్రుడు  5) భూమి 6) శుక్రుడు 7) అంగారకుడు 8) బుధుడు.


తూర్పు నుంచి పడమరకు (ఎడమ నుంచి కుడికి) సవ్యదిశలో భ్రమణం చేసే గ్రహాలు - 1) శుక్రుడు  2) వరుణుడు. 

 గ్రహాల ఆత్మభ్రమణ కాలాల అవరోహణ క్రమం- 1) శుక్రుడు 2) బుధుడు 3) అంగారకుడు 4) భూమి 5) ఇంద్రుడు 6) వరుణుడు 7) శని 8) బృహస్పతి. 

 సూర్యుడి నుంచి గ్రహాల దూరం పెరిగే కొద్దీ వాటి కక్ష్య పరిమాణాలు పెరుగుతూ, కోణీయ వేగాలు తగ్గుతాయి.


 

రచయిత: జయకర్‌ సక్కరి 

Posted Date : 30-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌