• facebook
  • whatsapp
  • telegram

తెలంగాణ రాష్ట్ర సరిహద్దులు

భారతదేశంలో 29 వ రాష్ట్రంగా తెలంగాణ 2014 జూన్ 2 న ఆవిర్భవించింది. పది జిల్లాలతో ఏర్పడిన ఈ రాష్ట్ర వైశాల్యం 114840 చ.కి.మీ. ఇది దేశంలో 12 వ అతి పెద్ద రాష్ట్రం. 2011 లెక్కల ప్రకారం దీని జనాభా 35286757 (3.52 కోట్లు). ఈ రాష్ట్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం..
తెలంగాణ రాష్ట్రానికి ఉత్తరాన మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలు; దక్షిణం, తూర్పున ఆంధ్రప్రదేశ్, పడమరన కర్ణాటక రాష్ట్రం సరిహద్దుగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం మొత్తం నాలుగు రాష్ట్రాలతో సరిహద్దును కలిగి ఉంది. ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేయడం వల్ల ఒడిశా రాష్ట్రంతో సరిహద్దు లేదు. హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడే నాటికి కేవలం తొమ్మిది జిల్లాలే ఉన్నప్పటికీ 1978 ఆగస్టు 15 న రంగారెడ్డి జిల్లాను ఏర్పాటు చేయడం వల్ల మొత్తం పది జిల్లాలయ్యాయి. ఇవి... మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ, వరంగల్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్.
* జిల్లాలవారీగా విస్తీర్ణం ప్రకారం మహబూబ్‌నగర్ 18432 చ.కి.మీ.తో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉంది. 217 చ.కి.మీ. విస్తీర్ణంతో హైదరాబాద్ చివరి స్థానంలో ఉంది.

* జనసాంద్రత పరంగా హైదరాబాద్ మొదటి స్థానంలో, ఆదిలాబాద్ చివరి స్థానంలో ఉన్నాయి.
* పరిపాలనా సౌలభ్యం కోసం 10 జిల్లాలను 42 రెవెన్యూ డివిజన్లుగా, 464 రెవెన్యూ మండలాలుగా, 10761 రెవెన్యూ గ్రామాలుగా విభజించారు. రాష్ట్రంలో మొత్తం 6 మున్సిపల్ కార్పొరేషన్లు, 9 జిల్లా పరిషత్‌లు, 38 మున్సిపాలిటీలు ఉన్నాయి.

నైసర్గిక స్వరూపం
     తెలంగాణ రాష్ట్రం భారతదేశ పీఠభూమి అయిన దక్కన్‌లో విస్తరించి ఉంది. ఇది 15
o 55' నుంచి 19o 55' ఉత్తర అక్షాంశాల మధ్య, 77o 22' నుంచి 81o 2' తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది.
* తెలంగాణ పీఠభూమి అంతటా పురాతన ఆర్కియన్ శిలలను గ్రానైట్, నైసిస్ రూపంలో చూడొచ్చు.
* ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో దిగువ గోదావరి నది వెంబడి అనేక ముడతలుపడిన గోండ్వానా శిలలు బొగ్గు ఖనిజాలతో ఉన్నాయి. ఈ పీఠభూమి ఉపరితలాన్ని పరిశీలిస్తే ఎర్రటి ఇసుక రేణువులతో చాలా పెద్ద మొత్తంలో గోధుమ వర్ణపు కొండలతో, రుతుపవన సంబంధ నదీ ప్రవాహాలతో, చెరువులతో ఉంటుంది.
* ఏడాదిలో ఎక్కువ భాగం ఎండిపోయే వాగులు, నదులు చిన్న చిన్న లోయలు ఈ పీఠభూమిలో ఉన్నాయి.
* తెలంగాణ పీఠభూమి పశ్చిమ భాగంలో బసాల్ట్ శిలలను అధికంగా చూడొచ్చు. ఈ ప్రాంతంలో 'లావా' ద్రవం పొరలు పొరలుగా భూ ఉపరితలంపై ప్రవహించి ఘనీభవించి దక్కన్ నాపలుగా ఏర్పడింది(Deccan Traps).
* ఈ నాపలను వికారాబాద్, పశ్చిమ తెలంగాణ అంతటా చూడొచ్చు. ఇక్కడ నల్లరేగడి నేలలు ఈ లావా ప్రవాహ ఫలితమే.
* ఈ పీఠభూమి సముద్ర మట్టానికి 500 - 600 మీటర్ల ఎత్తులో ఉంది. హైదరాబాద్ - వరంగల్ మధ్య దీని ఎత్తు సుమారు 700 మీ. వరకు ఉంటుంది.
* దక్షిణాన కృష్ణా - తుంగభద్ర మధ్యన దీని ఎత్తు 300 - 400 మీటర్లు. అంటే ఈ పీఠభూమి తూర్పునకు వాలి ఉంది. కాబట్టే గోదావరి, కృష్ణా, తుంగభద్ర నదులు తూర్పునకు ప్రవహిస్తున్నాయి.
* ఈ ప్రాంతంలో కొన్ని గుట్టలు వ్యాపించి ఉన్నాయి. వీటిని వివిధ జిల్లాల్లో వివిధ పేర్లతో పిలుస్తున్నారు.
* ఈ పీఠభూమి మధ్య భాగంలో హైదరాబాద్ నెలకొని ఉంది. దీని ఎత్తు సుమారు 600 మీటర్లు.


తెలంగాణలోని గుట్టలు:
* ఆదిలాబాద్ - నిర్మల్ గుట్టలు
* కరీంనగర్ - రాఖీ గుట్టలు
* వరంగల్ - కంగల్ గుట్టలు
* ఖమ్మం - రాజుగుట్టలు, యల్లండ్లపాడ్
* నిజామాబాద్ - సిర్నపల్లి పంక్తులు
* మహబూబ్‌నగర్ - షాబాద్ గుట్టలు, అమ్రాబాద్ గుట్టలు.

Posted Date : 18-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌