• facebook
  • whatsapp
  • telegram

తెలంగాణ పదోత్పత్తి - వారసత్వం

విశిష్ట సంస్కృతులతో విలసిల్లిన సపాదలక్ష దేశం!

తెలంగాణకు సుసంపన్న చరిత్ర, సంస్కృతి ఉన్నాయి. శతాబ్దాలపాటు అనేక రాజవంశాల పాలనలో ఇక్కడి సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులతోపాటు కళలు, వాస్తుశిల్పం, సాహిత్యం ప్రభావితమయ్యాయి, అభివృద్ధి చెందాయి. జైన, బౌద్ధ మతాలు విలసిల్లాయి. ఆ వివరాలను ప్రాచీన కాలం నుంచి అందుబాటులో ఉన్న వివిధ ఆధారాల ద్వారా తెలుసుకోవచ్చు. తెలంగాణ పదం ఉత్పత్తిపై అనేక అభిప్రాయాలు ఉన్నప్పటికీ, తెలివాహ నదీ పరీవాహకంలో నివసించే ప్రజల పేరుపైనే ప్రధానంగా వచ్చిందనేదే పలువురి ఆమోదాన్ని పొందింది. తరతరాల గమనంలో ప్రత్యేక సంస్కృతిని సంతరించుకున్న తెలంగాణలో బతుకమ్మ పండుగకూ విశిష్ట చరిత్ర ఉంది. ఈ అంశాలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. చరిత్ర పూర్వ యుగం నుంచి కొనసాగుతున్న వారసత్వం తీరును అర్థం చేసుకోవాలి. 

తెలంగాణకు అత్యంత ప్రాచీనమైన చరిత్ర ఉంది. పలువురు కవులు తెలంగాణ చరిత్ర గురించి తమ  రచనల్లో వివిధ కాలాల్లో ప్రస్తావించారు.

తెలంగాణ పదోత్పత్తి: తెలంగాణ అనే పదం అత్యంత ప్రాచీనమైంది. ఈ ప్రాంతాన్ని త్రిలింగ దేశంగా వ్యవహరించేవారు. తెలంగాణలోని జీవనది అయిన గోదావరిని ‘తెలివాహ నది’గా పిలిచేవారు. తద్వారా, ఈ నదీ పరీవాహక ప్రాంతంలో నివసించే ప్రజలను త్రిలింగులుగా వ్యవహరించి, కాలక్రమంలో ఈ త్రిలింగ పేరే తెలంగాణగా మారిపోయింది. గ్రీకు రచనలు ఇదే పేరును సూచిస్తున్నాయి. రాజ శాసనాల్లో త్రిలింగ, తిలింగ, తెలంగ అనే శబ్దాలను విరివిగా ఉపయోగించారు. తెలంగాణ పదాన్ని సార్థకం చేసి, స్థిరపరిచిన ఘనత కాకతీయానంతర కాల రచయితలకు దక్కుతుంది. కాకతీయుల కాలం నుంచి ఉత్తర భారతదేశం నుంచి, ఢిల్లీ సుల్తాన్‌లు దక్షిణ భారతదేశం మీద చేసిన దండయాత్రలు; ముస్లిం విద్యావేత్తలు, ఆస్థాన రచయితల దృష్టిని తెలంగాణ వైపునకు మళ్లించాయి. 

 ఈ రచనల్లో అనేక చోట్ల ఈ ప్రస్తావన కనిపించి, క్రమంగా ప్రస్తుతం చెలామణిలో ఉన్న తెలంగాణ అనే పేరు స్థిరపడింది. మొగల్‌ చక్రవర్తి అక్బర్‌ కాలం నాటికి తెలంగాణ అనే పేరు వ్యవహారికంగా మారింది. తెలంగాణ అనే పదాన్ని ఉమ్మడి మెదక్‌ జిల్లా సంగారెడ్డిలోని తెల్లాపూర్‌ శాసనం (క్రీ.శ.1417), ప్రతాపరుద్ర గణపతి వెలిచర్ల శాసనం, శ్రీకృష్ణదేవరాయల    తిరుమల, చిన్న కంచి శాసనాల్లో స్పష్టంగా పేర్కొన్నారు. దీనికి తోడుగా కొన్ని    సామాజిక వర్గాల వర్ణనల్లో కూడా    తెలంగాణ వాడుక ప్రభావం ఉంది. కాకతీయుల కాలంలో కొన్ని శాఖల బ్రాహ్మణులను ‘తెలంగాణ్యులు’ అంటే, తెలంగాణకు చెందినవారిగా ప్రస్తావించారు.

చారిత్రక ప్రాముఖ్యత: తెలంగాణ చరిత్రకు విశేష ప్రాముఖ్యత ఉంది. దిగువ పాత రాతి యుగానికి, అషూలియన్‌ సాంకేతిక సంప్రదాయానికి చెందిన పనిముట్లు, ఆవాస స్థలాలు రాష్ట్రంలోని ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని పెద్దపల్లి, రామగుండం, గోదావరిఖని ప్రాంతాల్లో లభ్యమయ్యాయి. మానవ నాగరికతా ప్రగతి పథంలో ప్రధాన భూమిక వహించిన పాత, మధ్య, నవీన శిలాయుగాల సంస్కృతులకు తెలంగాణా కూడా ఒక కేంద్ర బిందువని చెప్పవచ్చు. తెలంగాణలో నాడు ఉన్న అస్మక జనపదం రాజధాని పూతన్‌ (బోధన్‌). దీన్ని సుజాతుడు అనే రాజు పాలించేవాడు. ఈయన గౌతమ బుద్ధుడికి సమకాలికుడు. మౌర్య సామ్రాజ్య కాలంలో వరక్త వ్యాపారాలకు ప్రసిద్ధి చెందిన దక్షిణాపథ వర్తక మార్గాల్లో తెలంగాణకు కూడా ప్రాధాన్యం ఉందని కౌటిల్యుడు పేర్కొన్నాడు. ఆర్థికపరంగా తెలంగాణ శాతవాహనుల సామ్రాజ్యంలో ప్రముఖ పాత్ర పోషించింది. తెలంగాణలోని కొండాపురం, శాతవాహనుల టంకశాల నగరం వరంగల్‌ సమీపంలో సాద్వవాహన పేరుతో నాణేలు లభించాయి. పశ్చిమ చాళుక్యుల కాలంలో ప్రముఖ కవి భవభూతి క్రీ.శ. 7, 8 శతాబ్దాల్లో ఈ ప్రాంతంలోనే వర్దిల్లాడు. ఉమ్మడి ఉత్తర తెలంగాణ జిల్లాలైన నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్‌లను వేములవాడ చాళుక్యులు పాలించారు. ఈ ప్రాంతాన్ని ‘సపాదలక్ష’ దేశమని పిలిచేవారు. కందూరి చోడులు, కల్యాణి చాళుక్యుల కాలంలో సాంస్కృతికంగా, రాజకీయంగా తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందింది. నల్లగొండ దుర్గం, కొలనుపాక, నేలకొండపల్లి ప్రాంతాల ప్రస్తావన వీరి శాసనాల్లో కనిపిస్తుంది. మానవజాతి నాగరికతా సంస్కృతుల అభివృద్ధి క్రమానుగతంగా జరిగింది. ఈ దశకు చేరడానికి ముందు భాష, లిపి లేకుండా అనేక వేల సంవత్సరాలు మానవులు మనుగడ సాగించారు. ఇలాంటి లిపి లేని దశను చరిత్ర పూర్వ యుగంగా వ్యవహరిస్తారు. చరిత్ర ఆధారాలను పరిశీలిస్తే వైదిక, బౌద్ధ, జైన మత గ్రంథాలు; ఆచార్య నాగార్జునుడి రచనలు, వేములవాడ చాళుక్య రాజు రెండో అరికేసరి ఆస్థాన కవి అయిన పంప కవి రచించిన ఆది పురాణం మొదలైనవాటిని మతపర అంశాలుగా పేర్కొనవచ్చు. అలాగే లౌకిక గ్రంథాల ద్వారా ఆనాటి సామాజిక, ఆర్థిక స్థితిగతులు, రాజకీయ పరిస్థితులు, పరిపాలనాంశాలు తెలుస్తాయి. హాలుడు (శాతవాహన రాజు) రచించిన ‘గాథా సప్తశతి’ కొంత శృంగార పూర్వకమైన గ్రంథమైనప్పటికీ సమాజ స్థితిగతులకు దర్పణం పడుతుంది. పంప కవి రచించిన ‘విక్రమార్జున విజయం’, విద్యానాథుడు రాసిన ‘ప్రతాపరుద్ర యశోభూషణం’ ఈ కోవకు చెందినవే. విదేశీ రచనల విషయానికొస్తే క్రీ.శ.తొలి శతాబ్దాల్లో వచ్చిన గ్రీకు రచనలు ప్రత్యక్షంగా, పరోక్షంగానూ తెలంగాణకు సంబంధించిన వివరాలను తెలియజేస్తున్నాయి. ‘ఎర్ర సముద్రపు దినచర్య’ అనే అజ్ఞాత నావికుడు రచించిన గ్రంథంలో తెలంగాణ నుంచి ఆంధ్ర కోస్తా ప్రాంతానికి వస్తువుల ఎగుమతులు, దిగుమతులు ఎలా జరిగేవో పరోక్ష ప్రస్తావన ఉంది. ప్రాచీన తెలంగాణ చరిత్రకు అనేక పురావస్తు ఆధారాలున్నాయి. వీటిని కట్టడాలు, శాసనాలు, నాణేలుగా విభజించవచ్చు. చరిత్ర పూర్వయుగానికి సంబంధించి అనేక ఆధారాలు ప్రాచీన, నవీన శిలాయుగాలకు చెందిన నివాస స్థలాలు, మృణ్మయ పాత్రలు, సమాధులు మొదలైనవాటి ద్వారా లభ్యమవుతున్నాయి. ఇలాంటి ఆధారాలు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని ఆసిఫాబాద్, లక్సెట్టిపేట, ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని ఆమ్రాబాద్, ఉమ్మడి నల్లగొండ జిల్లాలోకి ఏలేశ్వరం, రామగిరి, నార్కట్‌పల్లి, వలిగొండల్లో లభ్యమయ్యాయి. నవీన శిలాయుగానికి సంబంధించిన బూడిద దిబ్బలు, నునుపైన రాతి పనిముట్లు, కుండ పెంకులు తెలంగాణా అంతటా లభ్యమయ్యాయి. బృహత్‌ శిలాయుగం లేదా మెగాలిథిక్‌ కాలానికి చెందిన సమాధులు.. కొండాపూర్, బోయిపల్లి, నల్లగొండ, కరీంనగర్‌లలో లభ్యమయ్యాయి.

తరతరాల సుదీర్ఘ చరిత్రలో తెలంగాణ తనకంటూ ఒక ప్రత్యేకమైన సంస్కృతి వారసత్వాలను సంపాదించుకుంది. తెలంగాణ సంస్కృతిలో ప్రధాన భాగమైన బతుకమ్మ పండగను చేసుకోవడానికి విశిష్టమైన కారణముంది. వేములవాడలోని రాజరాజేశ్వర దేవాలయాన్ని నిర్మించిన చోళరాజైన రాజరాజు వేములవాడ నుంచి బృహత్‌ శివలింగాన్ని అంటే, మహాశివ లింగాన్ని తంజావూరు తరలించి, బృహదీశ్వరాలయంలో ప్రతిష్ఠించాడు. తెలంగాణ ప్రజలు దీనికి బాధపడినా పార్వతీ అమ్మవారిని ఊరడించే ప్రయత్నంలో పూలతో మేరు పర్వతం మాదిరి పేర్చి, దానిపై పసుపుతో గౌరీ దేవిని రూపొందించి, దసరా పండుగ సందర్భంలో ఆటపాటలతో తిరిగి రమ్మని ప్రార్థిస్తూ నీటిలో నిమజ్జనం చేయడం ఈ బతుకమ్మ పండుగ ఉద్దేశం. ఆసఫ్‌ జాహీ వంశస్థుడైన నిజాం సికందర్‌ జా కాలం నుంచి సికింద్రాబాద్‌ లష్కర్‌ వద్ద నిర్మించిన మహంకాళి ఆలయ బోనాలు ఏటా ఆషాఢ మాసంలో జరుగుతాయి. అమ్మవారి సోదరుడిగా పరిగణించే పోతురాజు, రంగం సందర్భంగా భవిష్యవాణిని చెప్పే జోగినీ మొదలైనవి ఈ పండుగ ప్రత్యేకతలు.


మాదిరి ప్రశ్నలు


1. కిందివాటిలో ఏ నదిని ‘తెలివాహ నది’ గా  వ్యవహరిస్తారు? 

1) కృష్ణా   2) మూసి  

3) తుంగభద్ర   4) గోదావరి


2. తెలంగాణను ఏ దేశంగా వ్యవహరించేవారు? 

1) తైలాంగ్‌   2) త్రిలింగ  

3) త్రిలోక   4) తలాంగ్‌


3. తెల్లాపూర్‌ శాసనం ఏ ప్రాంతంలో లభ్యమైంది?

1) కోటిలింగాల  2) కొండాపూర్‌  

3) సంగారెడ్డి   4) కామారెడ్డి


4. కింది ఏ మొగల్‌ చక్రవర్తి కాలం నాటికి    తెలంగాణ అనే పదం వ్యవహారంలోకి వచ్చింది?

1) జహంగీర్‌    2) అక్బర్‌  

3) బాబర్‌   4) షాజహాన్‌


5. అస్మక జనపదానికి రాజధాని ఏది?

1) పూతన్‌ (బోధన్‌)     2) ఇంద్రపాల నగరం  

3) కోటిలింగాల    4) బంకూరు


6. ‘దక్షిణాపథ వర్తక మార్గాల్లో తెలంగాణకు అత్యంత ప్రాధాన్యం ఉంది’ అని పేర్కొన్నవారు?

1) మెగస్తనీస్‌   2) కాళిదాసు  

3) భారవి   4) కౌటిల్యుడు


7. కింది వాటిలో శాతవాహనుల టంకశాల నగరంగా పేరొందింది?

1) కోటిలింగాల   2) కొండాపురం  

3) ప్రతిష్ఠానపురం  4) విజయపురి


8. పాత రాతియుగానికి చెందిన అషూలియన్‌  సాంకేతిక సంప్రదాయ పనిముట్లు ఏ ప్రదేశంలో లభించాయి?

1) సూర్యాపేట     2) నిజామాబాదు  

3) నేలకొండపల్లి    4) రామగుండం


సమాధానాలు 
 

1-4 ; 2-2 ; 3-3 ; 4-2 ; 5-1 ; 6-4  ; 7-2  ; 8-4 

 

రచయిత: డాక్టర్‌ ఎం.జితేందర్‌ రెడ్డి 
 

Posted Date : 23-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు