• facebook
  • whatsapp
  • telegram

తెలంగాణ భావన

తెలంగాణ ఉద్యమ చరిత్ర అధ్యయనం చేసేటప్పుడు మొదట తెలంగాణ అనే భావన ఎక్కడి నుంచి ప్రారంభమైందో తెలుసుకోవాలి. దాని గురించి అవగాహన చేసుకోడానికి ముందుగా భౌగోళికంగా తెలంగాణ ఏర్పాటు, ప్రత్యేకతలతోపాటు ఆయా ప్రాంతాల్లో ఏర్పాటైన రాజ్యాలు, వాటి పాలన, సంస్కృతి తదితర అంశాలను మౌలికంగా అర్థం చేసుకోవాలి.

హైదరాబాద్ రాష్ట్రం భౌగోళికంగా 15o 10- 20o 40ఉత్తర అక్షాంశాలు, 74o40 - 81o 35' తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉండేది. ఈ రాష్ట్రం వింధ్య పర్వతాలకు దక్షిణాన దక్కన్ పీఠభూమిలో, సముద్ర మట్టానికి 1250 అడుగుల ఎత్తులో ఉండేది. భారతదేశంలోని దేశీయ సంస్థానాలన్నింటిలో హైదరాబాద్ పెద్దది. ఇది 82,698 చదరపు మైళ్ల వైశాల్యంతో, పంచకోణ ఆకృతిలో ఉండేది.

ప్రధాన నదులు గోదావరి, కృష్ణ. ఎత్తయిన పర్వత శిఖరం స్వరూపనాథ్. ఔరంగాబాద్‌కు పశ్చిమోత్తర దిశలో ఉంది. ఇంకా జాల్నా, బాలఘాట్, కందికల్, రాఖీ, అనంతగిరి, నల్లమల, నిర్మల్, రాచకొండ, సహ్యాద్రి పర్వత శ్రేణులు వందల మైళ్లు విస్తరించి ఉన్నాయి. హైదరాబాద్ సంస్థానంలోని భూమి దక్కన్ పీఠభూమికి కేంద్రంగా ఉండేది. ఇక్కడ నల్లరేగడి, ఎర్రనేలలు, ఇసుక, మొరం నేలలు ఉండేవి. 1901 గణాంకాల ప్రకారం సంస్థానంలోని 12,531 చ.మైళ్ల (41.4శాతం) విస్తీర్ణంలో జొన్న పంట పండేది. వరి పండే విస్తీర్ణం 1,358 చ.మైళ్లు (4.5 శాతం). రెండో పెద్ద పంట పత్తి. 3,226 చ.మైళ్ల విస్తీర్ణంలో (10.7 శాతం) పండించేవారు.

 

ఆర్థిక పరిస్థితులు

హైదరాబాద్ సంస్థానంలోని భూమి వివిధ యజమాన్యాల కింద ఉండేది. రాజ్యంలో వ్యవసాయం కింద ఉన్న భూమి మొత్తం 5 కోట్ల 30 లక్షల ఎకరాలు. అందులో 3 కోట్ల ఎకరాలు ప్రభుత్వ భూమి శిస్తు వ్యవస్థ కింద ఉండేది. దీన్నే దివానీ లేదా ఖల్సా ప్రాంతం అంటారు. దాదాపు కోటీ యాభైలక్షల ఎకరాలు జాగిర్దారీ విధానం కింద ఉండేది.

సర్ఫేఖాస్: రాజ్యంలో దాదాపు 10 శాతం భూమి నిజాం సొంత కమతంగా ఉండేది. దీన్నే 'సర్ఫేఖాస్ అనేవారు. ఈ భూమి 8,100 చదరపు మైళ్లలో 18 తాలుకాల్లో విస్తరించి ఉండేది. ఈ భూమి నుంచి వచ్చే ఆదాయాన్ని నిజాంకు చెల్లించేవారు.
జాగీరు ప్రాంతాలు: జాగీరు ప్రాంతాలు మొత్తం సంస్థానంలో 1/30వ వంతు ఉండేవి. ఈ ప్రాంతాల్లో పైగాలు, సంస్థానాలు, జాగీర్దార్లు, ఇజారాదార్లు, మక్తేదార్లు, ఈనాందార్లు, అగ్రహారికులు అనే పేర్లతో వివిధ రకాల భూస్వామ్య వర్గాలుండేవి. వీరిలో కొందరికి పన్నులు విధించి వసూలు చేసేందుకు సొంత రెవెన్యూ అధికారులు ఉండేవారు. ఇవి సంస్థానానికి సామంత రాజ్యాలుగా వ్యవహరించేవి.

పైగాలు: నిజాం రాజ బంధువులకు పైగాలు అనే భూములను ఇచ్చేవారు. వీరు ఈ భూములను అనుభవిస్తూ సొంత సైన్యాలను పోషించేవారు. ఈ సైన్యాన్ని యుద్ధ సమయంలో రాజుకు సరఫరా చేసేవారు.

 

దేశ్‌ముఖ్‌లు, దేశ్‌పాండేలు: వీరు గతంలో ప్రభుత్వం తరపున పన్నులు వసూలు చేసేవారు. సాలార్‌జంగ్ సంస్థాన్ దివాన్ (ప్రధాని) అయిన తర్వాత ప్రభుత్వ యంత్రాంగమే నేరుగా రైతుల నుంచి పన్నులు వసూలు చేసేది. దీంతో ప్రభుత్వం గతంలో వీరు చేసిన సేవకు వతన్లు లేదా మాష్‌ను (ఉద్యోగ విరమణానంతర భృతి) ఇచ్చేవారు. దేశ్‌ముఖ్‌లు, దేశ్‌పాండేలు పన్నులు వసూలు చేసే కాలంలో రైతుల నుంచి అతి సారవంతమైన భూములను వేలాది ఎకరాల ఆక్రమించి రైతులను కౌలుదార్ల స్థాయికి నెట్టేశారు. భూస్వాములు పంటల పేరుతో రైతులకు అధిక వడ్డీకి రుణాలిచ్చారు. అవి తీర్చలేని రైతుల భూములను ఆక్రమించుకున్నారు.

 

పటేల్, పట్వారీ, మాలీ పటేల్: తెలంగాణ గ్రామాల్లో వంశపారంపర్య హక్కులతో పటేల్, పట్వారీ, మాలీ పటేల్ అనే గ్రామాధికారులు ఉండేవారు. వీరిలో ప్రతి ఒక్కరూ అయిదు నుంచి పది గ్రామాలను వతన్‌గా పొందేవారు. ఈ వతన్ గ్రామాల్లో భూస్వాములు తమ గుమాస్తాలు, ఏజెంట్ల (సేరీవార్ల) ద్వారా అధికారం చెలాయించేవారు. వీరికి ప్రభుత్వ అధికారుల్లా అన్ని అధికారాలుండేవి. వీరు రైతుల నుంచి బలవంతంగా పన్నులు వసూలు చేసేవారు. భూస్వామికి తెలియకుండా గ్రామస్థుల మధ్య వివాదాలు కూడా పరిష్కారమయ్యేవి కావు. జాగీర్దార్లు, దేశ్‌ముఖ్‌ల వద్ద ఉండే రైఫిళ్లు, తుపాకులకు లైసెన్స్‌లు ఉండేవి. వారికి సాయుధ, అశ్విక బలగాలు ఉండేవి.
 

దేశ్‌ముఖ్‌లు, దొరలు: జన్నారెడ్డి, ప్రతాపరెడ్డి
ఎర్రపాడు దేశ్‌ముఖ్‌కు 20 గ్రామాల్లో లక్షా యాభైవేల ఎకరాల భూమి ఉండేది. నల్గొండ జిల్లా సూర్యాపేట తాలుకాలోని ఎర్రపాడు గ్రామం నుంచి వరంగల్ జిల్లా కుమ్మరికుంట్ల వరకు అనేక గ్రామాలు ఇతడి అధీనంలో ఉండేవి. ఇతడు ఇకముందు కొత్త భూములను పట్టా చేసుకోకూడదని నిజాం ఫర్మానా జారీ చేశాడు.
కల్లూరు దేశ్‌ముఖ్‌కు (మధిర తాలూకా, ఖమ్మం జిల్లా) లక్ష ఎకరాల భూమి ఉండేది. విసునూరు దేశ్‌ముఖ్‌కు (జనగామ తాలూకా, నల్గొండ జిల్లా) 60 గ్రామాల్లో 40 వేల ఎకరాల భూమి ఉండేది. సూర్యాపేట దేశ్‌ముఖ్‌కు 20 వేల ఎకరాల భూమి ఉండేది.

 

నీటిపారుదల సౌకర్యాలు
కాకతీయులు తెలంగాణలోని ప్రతి గ్రామంలో చెరువులు నిర్మించారు. చెరువుల నిర్మాణాన్ని ఒక పుణ్యకార్యంగా ప్రోత్సహించారు. రామప్ప, పాకాల, లక్నవరం, బయ్యారం చెరువులు నిర్మించారు. తెలంగాణ జిల్లాల్లో కాకతీయులు, కుతుబ్‌షాహీలు వేలాది గొలుసు చెరువులు, కుంటలు నిర్మించారు. వీటిని పరిరక్షించిన అసఫ్‌జాహీ పాలకులు కొత్త చెరువుల నిర్మాణం చేపట్టారు. అసఫ్‌జాహీల కాలంలో మీర్ ఆలం హైదరాబాద్ నగరంలో మీర్ ఆలం తటాకం నిర్మించాడు. చివరి పాలకుడైన ఉస్మాన్ అలీఖాన్ ఉస్మాన్ సాగర్ (గండిపేట), హిమాయత్ సాగర్ చెరువులు నిర్మించి మంచినీటి సరఫరాకు, వ్యవసాయానికి వసతి కల్పించాడు. ఇతడు రూ.7 కోట్ల ఖర్చుతో మంజీరా నదిపై నిజాం సాగర్ ప్రాజెక్టు నిర్మించాడు. నిజాం రాజ్య పాలనలో ఇదే బృహత్తర నిర్మాణం. ఉస్మాన్ అలీఖాన్ కాలంలో వైరా, పాలేరు ప్రాజెక్టులు (ఖమ్మం జిల్లా), కోయిల సాగర్ (మహబూబ్‌నగర్ జిల్లా), రాయపల్లి చెరువు (మెదక్ జిల్లా), బోధన్‌లోని అలీసాగర్ (నిజామాబాద్ జిల్లా) నిర్మించారు. తెలంగాణలో అనేక ఖనిజాలు లభించేవి. సింగరేణి, కొత్తగూడెంలో బొగ్గు గనులు ఉన్నాయి. ఈ గనులు గోదావరి, ప్రాణహిత నదుల మాగాణుల వరకు విస్తరించి ఉన్నాయి. గోదావరి లోయ, తుంగభద్రా నదుల అంతర్వేది, ఆదిలాబాద్ జిల్లాలో ఇనుప గనులు ఉండేవి. జగిత్యాల, నిర్మల్, యెలగర్పు ఉక్కు పరికరాల నిర్మాణానికి ప్రసిద్ధి.

ఖమ్మం మెట్టు                         -          అభ్రకం

పాల్వంచ                                 -         కురువిందం, కెంపురాయి

హసనాబాద్                             -        నల్ల సీసం

వరంగల్                                  -         తివాచీలు, పత్రంజీలు

కరీంనగర్                                -         వెండి, బంగారు తీగ పని

అలంపురం                              -         జంపఖానాలు

పెంబర్తి                                    -         ఇత్తడి పాత్రలు

సిద్దిపేట                                  -         పట్టు వస్త్రాలు

జనగామ                                -         నక్షత్ర కనుమలు

పోచంపల్లి                                -         చిట్టి రుమాళ్లు

ఆర్మూరు, నారాయణపేట         -         సిల్క్ చీరలు

రఘునాథపురం, కార్వాన్        -         అరబ్బు లుంగీలు

గద్వాల్, సిద్దిపేటల్లో నేత పరిశ్రమలుండేవి. నిర్మల్‌లో కుటీర పరిశ్రమలు, సిర్పూరులో కాగితం పరిశ్రమ (కాగజ్‌నగర్), బోధన్‌లోని చక్కెర కర్మాగారం, చార్మినార్ సిగరెట్ ఫ్యాక్టరీ, దివాన్ బహదూర్ రాంగోపాల్ మిల్స్, వరంగల్ లోని అజంజాహీ మిల్లులు ప్రసిద్ధమైనవి.
 

సాంఘిక పరిస్థితులు:

తెలంగాణలోని మొత్తం భూమి వివిధ భూస్వాముల కింద ఉండేది. వీరు బలవంతపు వసూళ్లు చేసేవారు. ప్రజలతో నిర్బంధంగా చాకిరీ చేయించుకునేవారు.

 

వెట్టి విధానం:

వెట్టి విధానం తెలంగాణ అంతటా ఉండేది. ప్రజల్లోని అన్ని వర్గాల వారికి తమ తమ స్థాయుల్లో ఇది వర్తించేది. ప్రతి హరిజన కుటుంబం నుంచి ఒకరిని వెట్టి చాకిరీ చేయడానికి కేటాయించాల్సి ఉండేది. ప్రతి గ్రామంలో ప్రతి ఇంటి నుంచీ ఒకరిని పంపేవారు. వెట్టి చాకిరి రెండు విధాలుగా అమలయ్యేది. మొదటిది అధికారులకు చేసే వెట్టి చాకిరి. రెండోది గ్రామంలోని దొరలు, పటేల్, పట్వారీలకు చేసే వెట్టి చాకిరి. ప్రభుత్వాధికారులు గ్రామంలోకి వస్తే వివిధ వృత్తులవారు వెట్టి చాకిరి చేసి వారికి కావలసిన అవసరాలు తీర్చేవారు. ఇంకా పటేల్, పట్వారీ, మాలీ పటేల్ ఇళ్లలో గృహ సంబంధమైన పనులు చేయడం, పోలీసు, తాలుకా ఆఫీసులకు రికార్డులు మోసుకుపోవడం, గ్రామ చావడి, బందెల దొడ్డికి కాపలా కాయడం రోజువారీ పనిలో భాగంగా ఉండేది.

ఆడపాపలు:

ఇది వెట్టి చాకిరీ పద్ధతిలో దారుణమైంది. భూస్వాముల ఇళ్లలో పని చేయడానికి బానిసలుగా బాలికలను పంపించే పద్ధతి. భూస్వాములు తమ కుమార్తెలకు పెళ్ల్లి చేసినప్పుడు బానిసలుగా ఈ బాలికలను బహుకరించేవారు. వీరు పెళ్లికూతురి అత్తవారింట్లో పని చేయాల్సి ఉండేది.
భూస్వాములు అతిహీన స్థితిలో ఉన్న రైతుల నుంచి పన్నులు వసూలు చేసేవారు. వారి ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా దానికి అయ్యే ఖర్చును రైతుల నుంచి రాబట్టేవారు. 1923 మార్చి 20న తన జన్మదినం సందర్భంగా నిజాం ఉస్మాన్ అలీఖాన్ వెట్టిచాకిరీని నిషేధిస్తూ ఫర్మానా జారీ చేశాడు.

 

చారిత్రక నేపథ్యం

తెలంగాణ ప్రాంతం హైదరాబాద్ సంస్థానంలో భాగంగా ఉండేది. క్రీ.పూ. 6వ శతాబ్దంలో విలసిల్లిన షోడశ మహాజనపదాల్లో ఇదీ ఒకటిగా ఉండేది. తెలంగాణలోని పోడన (బొధన్) రాజధానిగా అస్మక రాజ్యం ఉండేది. శాతవాహనులు కరీంనగర్ జిల్లాలోని కోటిలింగాల రాజధానిగా తమ పాలనను ప్రారంభించారు. వీరి తర్వాత వరుసగా ఇక్ష్వాకులు, వాకాటకులు, విష్ణుకుండినులు, పశ్చిమ, వేములవాడ, ముదిగొండ చాళుక్యులు, రాష్ట్రకూటులు తెలంగాణను పాలించారు. ఈ రాజవంశాల కాలంలో ఫణిగిరి, గాజులబండ, వర్దమానుకోట, నాగారం, ఇంద్రపురి, పాషిగాం, ధూలికట్ట, కొండాపూర్, నేలకొండపల్లి, తంబాలపల్లి, గీసుకొండ మొదలైన ప్రాంతాలు ప్రముఖ బౌద్ధ స్థావరాలుగా విలసిల్లాయి.

క్రీ.శ. 1000 నుంచి 1323 వరకు తెలంగాణ కాకతీయుల పాలనలో ఉండేది. తర్వాత ఢిల్లీ సుల్తాన్‌లు, బహమనీలు తక్కువకాలం తెలంగాణను పాలించారు. కుతుబ్‌షాహీలు గోలకొండ రాజధానిగా క్రీ.శ. 1512 నుంచి 1687 వరకు పాలించారు. వీరి కాలంలోనే హైదరాబాద్ నగరాన్ని నిర్మించారు. అనేకమంది విదేశీయులు, ముస్లింలు హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఫలితంగా హిందూ ముస్లిం సంస్కృతులతో కూడిన మిశ్రమ సంస్కృతి హైదరాబాద్ నగరంలో ఏర్పడి, భిన్న మతాల శాంతియుత సహజీవనం సాగింది. క్రీ.శ. 1724లో హైదరాబాద్ రాజ్యాన్ని స్థాపించారు. 1948లో భారత ప్రభుత్వం పోలీస్ చర్య జరిపి భారతదేశంలో కలిపే వరకు ఇది కొనసాగింది.

హైదరాబాద్ సంస్థానం మొత్తం వైశాల్యంలో 50 శాతం తెలుగు మాట్లాడే ప్రాంతమైన తెలంగాణ ,¸ 28 శాతం మరాఠీ, 11 శాతం కన్నడం మాట్లాడే ప్రాంతాలు ఉండేవి. తెలంగాణ ప్రాంతంలో తెలుగు మాట్లాడేవారు కోటిమంది ఉండేవారు. ఉర్దూ మాట్లాడేవారు 12 శాతం అంటే 21 లక్షల మంది ఉండేవారు. మతపరంగా చూస్తే హిందువులు 88 శాతం, మిగిలిన వారు ముస్లింలు, క్రైస్తవులు తదితరులు ఉండేవారు.

అసఫ్‌జాహీ రాజ్య స్థాపకుడైన నిజాం-ఉల్-ముల్క్ కాలంలో బేరార్, హైదరాబాద్, ఔరంగాబాద్, బీజాపూర్, బీదర్, ఖాందేష్ అనే 6 సుబాలుండేవి. మొత్తం సంస్థానంలోని ప్రజల్లో అక్షరాస్యులు 4.8 శాతం మాత్రమే.

Posted Date : 03-12-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌