• facebook
  • whatsapp
  • telegram

కాకతీయుల కాలంలో తెలంగాణ ఖ్యాతి

  తెలంగాణ చరిత్రలో కాకతీయుల పాలనాకాలానికి ఎంతో విశిష్టత ఉంది.. సాహిత్యం, లలిత కళలకు విశేష ఆదరణ లభించింది. అద్భుతరీతిలో ఆలయాలను నిర్మించారు. సంగీతం, నృత్య కళలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. ప్రఖ్యాత కవులు అగస్త్యుడు, తిక్కన.. వేయి స్తంభాల గుడి, రామప్ప గుడి లాంటి అద్భుత ఆలయ నిర్మాణాలు.. పేరిణీ నృత్యం.. ఇవన్నీ కాకతీయుల కాలంనాటి సాహితీ వైభవానికి మచ్చుతునకలు.
కాకతీయుల కాలంలో సాహిత్యం విశేషంగా అభివృద్ధి చెందింది. వీరు నిర్మించిన దేవాలయాలు తెలంగాణ అంతటా ఉన్నాయి. సంగీతం, నృత్యం, చిత్రలేఖనం లాంటి కళల్లో విశేష కృషి జరిగింది. కాకతీయుల కాలంలో సంస్కృతం, తెలుగు భాషల్లో సాహిత్యాభివృద్ధి జరిగింది.

 

సంస్కృత సాహిత్యం

కాకతీయ పాలకుడైన రుద్రదేవుడు స్వయంగా కవి. ఆయన నీతిసారం అనే గ్రంథాన్ని రచించాడు.

 

అగస్త్యుడు

ఇతడు ప్రతాపరుద్రుడి ఆస్థాన కవి. సంస్కృత భాషలో 75 గ్రంథాలు రచించాడు. నలకీర్తి కౌముది (ఖండ కావ్యం), బాలభారత కావ్యం, కృష్ణచరిత అనేవి ఇతడి ముఖ్య రచనలు.

 

శాకల్య మల్లభట్టు

ఇతడు ప్రతాపరుద్రుడి ఆస్థాన కవి. ఉదాత్తరాఘవం, నిరోష్ఠ్య రామాయణం రచించాడు.

 

విద్యానాథుడు

ఇతడు ప్రతాపరుద్రుడి ఆస్థాన కవి. 'ప్రతాపరుద్ర యశోభూషణం' అనే అలంకార శాస్త్ర గ్రంథాన్ని రచించాడు. ఇందులో ప్రతాపరుద్రుడి ఘనతను కీర్తించాడు. నరసింహకుడు అనే కవి కాదంబరి కళ్యాణం (నాటకం), కాకతీయ చరిత్ర, మలయవతి అనే గ్రంథాలను రచించాడు. కొలని రుద్రదేవుడు అనే కవి రాజారుద్రీయం అనే గ్రంథాన్ని రాశాడు.

 

జాయప సేనాని

ఇతడు గణపతిదేవుడి ఆస్థానంలో గజషాహిణి (ఏనుగుల దళానికి అధిపతి). ఇతడు గీత రత్నావళి, వాద్య రత్నావళి, నృత్త రత్నావళి అనే గ్రంథాలను రచించాడు.

 

అప్పయార్యుడు

ప్రతాపరుద్రుడి ఆస్థాన కవి. ఇతడు జైనుడు. జినేంద్ర కళ్యాణాభ్యుదయం (1320) అనే గ్రంథాన్ని రచించాడు.

 

రావిపాటి త్రిపురాంతకుడు

ప్రేమాభిరామం అనే వీధి నాటకాన్ని రాశాడు.

 

తెలుగు సాహిత్యం

భాస్కర రామాయణం అనే గ్రంథాన్ని మల్లికార్జున భట్టు, కుమారదేవుడు, భాస్కరుడు, హుళక్కి భాస్కరుడు, అయ్యలాచార్యుడు అనే అయిదుగురు కవులు రచించారు.

 

తిక్కన

నిర్వచనోత్తర రామాయణం, కృష్ణశతకం, ఆంధ్ర మహాభారతం అనే ఉత్తమ సాహిత్య గ్రంథాలను రచించాడు.

 

మారన కవి

తెలుగులో మార్కండేయ పురాణం అనే మొదటి పురాణాన్ని రచించాడు.

 

మంచన కవి

కేయూర బాహుచరిత్రను రాశాడు.

 

నన్నెచోడుడు

ఇతడు రచించిన 'కుమార సంభవం' తెలుగు కావ్యాల్లో ఉదాత్తమైంది.

 

గోన బుద్ధారెడ్డి

రంగనాథ రామాయణాన్ని రచించాడు. ఇది తెలుగు ద్విపద కావ్యాల్లో గొప్పది.

 

రాజనీతి గ్రంథాలు

శివదేవయ్య రాసిన పురుషార్థసారం; మడికి సింగన రచించిన సకలనీతి సమ్మతం, కాసె సర్వప్ప రచించిన సిద్ధేశ్వర చరిత్ర కాకతీయుల కాలం నాటి ముఖ్య రాజనీతి గ్రంథాలు.

 

పాల్కురికి సోమనాథుడు

ఇతడి జన్మస్థలం పాలకుర్తి (జనగాం సమీపం). శైవ కవి. ప్రతాపరుద్రుడి ఆస్థాన కవి. ఇతడు బసవపురాణం, పండితారాధ్య చరిత్ర, అనుభవసారం (పద్య కావ్యం), వృషాధిప శతకం అనే గ్రంథాలను రచించాడు.

 

వినుకొండ వల్లభార్యుడు

ఇతడు క్రీడాభిరామం అనే వీధి నాటకాన్ని రాశాడు. ఇది హనుమకొండ ప్రజల సాంఘిక జీవితాన్ని తెలుపుతుంది.

 

నాట్యం, సంగీతం, చిత్రలేఖనం

నిర్వచనోత్తర రామాయణం, రంగనాథ రామాయణం, నృత్త రత్నావళి తదితర గ్రంథాలు నృత్య గీత వినోదాలను, తంత్ర వాయిద్యాలను వివరిస్తున్నాయి. జాయప సేనాని రచించిన 'నృత్త రత్నావళి' కాకతీయుల కాలం నాటి మార్గ, దేశీ నృత్యాలను తెలిపే గ్రంథం. ఇది నాటి భారతీయ నాట్యశాస్త్ర గ్రంథాల్లో ఉత్తమమైంది.

 

పేరిణి నృత్యం

ఇది కాకతీయుల కాలం నాటి ముఖ్యమైన నృత్యం. వీరులు యుద్ధభూమికి వెళ్లేటప్పుడు దీన్ని ప్రదర్శించేవారు. తమ శరీరంలోకి శివుడు ఆవహించాడని భావించేవారు. కాకతీయుల అనంతరం ఈ నాట్యం మరుగున పడిపోయింది. ప్రముఖ నాట్యాచార్యుడు నటరాజు రామకృష్ణ రామప్ప దేవాలయంలోని నృత్య శిల్పాలను, నృత్త రత్నావళిలోని నాట్య పద్ధతులను పరిశీలించి, పరిశోధించి పేరిణి నాట్యాన్ని తిరిగి వెలుగులోకి తెచ్చారు.
రామప్ప దేవాలయంలోని శిల్పాలు, నాట్య చిత్రాలు నృత్త రత్నావళి ఆధారంగా నిర్మించినవే. జాయప తన 'గీత రత్నావళి' అనే సంగీత గ్రంథంలో గీతాన్ని నృత్యానికి ఉపాంగంగా వర్ణించాడు. పానుగల్లు, రామప్ప, పిల్లలమర్రి, చేబ్రోలు, మల్కాపురం, ధర్మసాగర్ శాసనాల్లో నాట్యగత్తెలు, వాయిద్యకారుల ప్రస్తావన ఉంది. ఈ కాలంలో రాజాస్థానాలు, దేవస్థానాల్లో నాట్యం, సంగీతాలకు మంచి పోషణ లభించింది. ముఖ్యంగా వేశ్యలు (కళావతులు) ఈ విద్యల్లో నిష్ణాతులు. వారు గజ్జె కట్టనిదే ఏ శుభకార్యమైనా జరిగేది కాదు.

 

చిత్రలేఖనం

నాటి స్త్రీలు చిత్రలేఖనంలో ప్రసిద్ధులు. రామ, కృష్ణావతార గాథలను తెలిపే చిత్రపటాలను గృహాల్లో అలంకరించుకునేవారని పల్నాటి వీరచరిత్ర ద్వారా తెలుస్తోంది. ఓరుగల్లులో 1500 మంది చిత్రకారుల కుటుంబాలు ఉండేవని 'ప్రతాప చరిత్ర' తెలిపింది. ప్రజల సర్వసాధారణమైన వినోదం తోలు బొమ్మలాట.

 

వాస్తుశిల్పాలు

చాళుక్య శిల్పసంప్రదాయమైన 'వెసరా'శైలిని కాకతీయులు అనుసరించారు. వీరు అనేక దేవాలయాలను నిర్మించారు. తొలి కాకతీయలు జైనాలయాలను నిర్మించారు. హనుమకొండలోని పద్మాక్షి దేవాలయం జైనాలయంగా ఉండేది. ప్రోలరాజు కాలంలో హనుమకొండలో సిద్ధేశ్వరాలయం, పద్మాక్షి ఆలయం; ఓరుగల్లులో స్వయంభూ ఆలయాలను, కేశవ ఆలయాలను నిర్మించారు.

 

రుద్రేశ్వరాలయం (వేయిస్తంభాల గుడి)

ముఖ్యమైన కాకతీయ నిర్మాణాల్లో మొదటిది వేయి స్తంభాల గుడి. దీన్ని రుద్రదేవుడు తనను స్వతంత్ర ప్రభువుగా ప్రకటించుకున్న సందర్భంలో క్రీ.శ. 1163లో నిర్మించాడు. ఇది శివుడు, విష్ణువు, సూర్యుడు లాంటి దేవతలున్న త్రికూట ఆలయం.

 

రామప్ప దేవాలయం

గణపతిదేవుడి సేనాని రేచర్ల రుద్రుడు పాలంపేటలో క్రీ.శ. 1213లో రామప్ప దేవాలయాన్ని నిర్మించాడు. ఈ దేవాలయం పైకప్పులో రామాయణం, మహాభారత శిల్పాలను చెక్కారు. ఏ వైపు నుంచి చూసినా ప్రేక్షకుల వైపే చూడటం రామప్ప దేవాలయంలోని నంది ప్రత్యేకత. ఈ ఆలయంలో నాలుగు శిల్పాలున్నాయి. వీటిలో మూడు నాట్యగత్తెలవి, ఒకటి నాగినిది. యవ్వన ఉద్వేగంలో తాళం ప్రకారం కదులుతున్న నాట్యగత్తె మనోభావాలను శిల్పి చిత్రించాడు.

 

ఆలయ వైభవం

పిల్లలమర్రిలోని ఎరుకేశ్వర, నామేశ్వర దేవాలయాలు నాటి చిత్రలేఖన నైపుణ్యానికి నిదర్శనాలు. గణపతిదేవుడు ఓరుగల్లు, పిల్లలమర్రి, పాలంపేట, కొండపర్తి, నాగులపాడు తదితర ప్రాంతాల్లో దేవాలయాలను నిర్మించాడు. ఓరుగల్లు కోటకు నాలుగువైపులా నాలుగు శిలానిర్మిత కీర్తి తోరణాలు ఉండేవి. ఇంకా వీరు నిర్మించిన ఆలయాల్లో ఘనపురంలోని శివాలయం, కృష్ణపట్నంలోని సిద్ధేశ్వరాలయం, మంథనిలోని గౌతమేశ్వరాలయం ముఖ్యమైనవి. కాకతీయుల ఆలయాలు పానగల్లు, భువనగిరి, చందుపట్ల, పెరూరు, గొడిశాల, గణపవరం, జలాలుపురం, బూరుగుగడ్డ, నగునూరు, అత్తిరాల, బెజ్జంకి తదితర ప్రాంతాల్లో ఉన్నాయి.
 

Posted Date : 18-02-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌