• facebook
  • whatsapp
  • telegram

ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ ప్రభావం

1990వ దశకంలో ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక రంగంలో అనేక మార్పులు సంభవించాయి. అదే సమయంలో భారతదేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన పీవీ నరసింహారావు 1991లో నూతన ఆర్థిక సంస్కరణలను అమలు చేశారు. దీంతో  మనదేశ పాలనా రంగంపై ఉదారీకరణ (Liberalization), ప్రైవేటీకరణ (Privatization), ప్రపంచీకరణ (Globalization) విధానాలు ప్రభావాన్ని చూపాయి.
 

మౌలికాంశాలు
* కఠినమైన పాలనా నిబంధనల సడలింపు, కనిష్ఠరాజ్యం, లైసెన్సింగ్‌ విధానాన్ని సరళతరం చేయడం.
* ప్రభుత్వ గుత్తాధిపత్యాన్ని తగ్గించి, ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులను ఉపసంహరించుకోవడం.
* రూపాయి మారకం విలువను మార్కెట్‌ శక్తులు నిర్దేశించడం.
* పాలనలో ప్రజల భాగస్వామ్యాన్ని, పారదర్శకతను, జవాబుదారీతనాన్ని పెంపొందించడం.
* ప్రభుత్వ నియంత్రణలో ఉండే రవాణా, రక్షణ, సమాచార రంగాల్లో ప్రైవేట్‌ వ్యక్తులకు అవకాశాలు కల్పించడం.
* బహుళజాతి సంస్థల ప్రవేశానికి, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతివ్వడం.
* ప్రపంచబ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, ప్రపంచ వాణిజ్య సంస్థ మొదలైన సంస్థల సూచనలు, సంస్కరణలు అమలు చేయడం.
* సాంకేతిక పరిజ్ఞాన ఆధారిత పాలనకు ప్రాధాన్యం ఇవ్వడం.
* ప్రపంచ దేశాల మధ్య స్వేచ్ఛాయుత వాణిజ్యానికి అవకాశం కల్పించడం.
* సంస్థాగత సర్దుబాట్లను ప్రోత్సహించడం.
* సంక్షేమ రంగంలో విప్లవాత్మక మార్పులు తేవడం, ప్రభుత్వంపై పరిమితులు విధించడం.


ఉదారీకరణ విధానం ప్రభావం
* 1991లో పీవీ నరసింహారావు ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక ఆర్థిక శాఖామంత్రిగా డా.మన్మోహన్‌ సింగ్‌ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ప్రభుత్వం సరళీకృత ఆర్థిక విధానాలకు శ్రీకారం చుట్టింది. దీని ఫలితంగా మనదేశ పారిశ్రామిక, ద్రవ్య విధానాలు ప్రపంచ ధోరణులకు అనుకూలంగా మారాల్సిన అవసరం ఏర్పడింది.
* ప్రభుత్వ నియంత్రణలో ఉండే అనేక పరిశ్రమలు ప్రైవేట్‌ రంగం ఆధీనంలోకి వచ్చాయి. భారత్‌లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పోటెత్తాయి.
* వివిధ పరిశ్రమల స్థాపనకు అవసరమైన లైసెన్సింగ్‌ విధానాలను సరళతరం చేశారు. 
* నష్టాల్లో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్‌పరం చేయడం, ప్రభుత్వరంగ సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ, ప్రభుత్వ ఉద్యోగులకు ‘స్వచ్ఛంద పదవీ విరమణ’ (VRS) మొదలైన సంస్కరణలతో దేశపాలనా రంగంలో గణనీయమైన మార్పులు వచ్చాయి. కార్పొరేట్‌ పాలన అనే నూతన ఒరవడి ప్రారంభమైంది.
* ‘ఆర్థిక వ్యవహారాలు, బడ్జెట్‌ నిర్వహణ బాధ్యతల చట్టం’ (Fiscal Responsibility and Budget Management - FRBM Act)ను రూపొందించి బడ్జెట్, ఆర్థిక నిర్వహణలపై హేతుబద్ధమైన ఆంక్షలు విధించారు. 
* ఈ చట్టం ద్వారా ద్రవ్యలోటును, ప్రణాళికేతర వ్యయాన్ని నియంత్రించి ఆర్థిక క్రమశిక్షణను సాధించే ప్రయత్నం చేశారు. ఈ చట్టం ప్రకారం దేశంలోని వివిధ రాష్ట్రాలు సేకరించే రుణాలు రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 6% మించకూడదని నిర్దేశించారు.
* ఉదారీకరణ విధానం ఫలితంగా దేశంలోకి బహుళజాతి సంస్థలు ప్రవేశించాయి. ఇవి తమ కార్యకలాపాలను విస్తృతం చేశాయి. వీటికి అవసరమైన భూసేకరణను కూడా ప్రభుత్వం సులభతరం చేసింది.


ప్రపంచీకరణ ప్రభావం
* 1991లో సోవియట్‌ యూనియన్‌ విచ్ఛిన్నమైంది. అగ్రరాజ్యాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం ముగిసింది. ఆ సమయంలోనే తూర్పు యూరప్‌లో సామ్యవాదం క్షీణించి ప్రజాస్వామ్య ప్రక్రియలు ప్రారంభమయ్యాయి. అనేక దేశాలు నూతన ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టాయి. ఈ అంశాలన్నీ ప్రపంచీకరణకు దారితీశాయి.
* ప్రపంచీకరణ కారణంగా అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానమయ్యాయి. దీని వల్ల ఎగుమతులు, దిగుమతులు, స్వేచ్ఛా వాణిజ్యం, విదేశీ ఉత్పత్తులు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ఉద్యోగులు, సాంకేతిక నిపుణుల వలసలు విస్తృతమయ్యాయి. ఫలితంగా పాలనలో ఆర్థిక, ద్రవ్య, పారిశ్రామిక, ఎగుమతి, దిగుమతి విధానాల్లో మార్పులు వచ్చాయి.
* ప్రపంచబ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, ఆసియా అభివృద్ధి బ్యాంక్‌ లాంటి సంస్థలు వివిధ దేశాలకు ఆర్థిక సాయం, రుణాలను మంజూరు చేసే సమయంలో కొన్ని షరతులు, నిబంధనలు విధించడం వల్ల ప్రభుత్వాల విధానాలు, పరిపాలనలో అనేక మార్పులు వస్తున్నాయి.
* 1995లో ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO)  ఏర్పాటైంది. ఇది ప్రపంచ దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్యానికి కృషిచేస్తూ, వివిధ దేశాల పాలనా రంగంపై విశేష ప్రభావం చూపుతోంది.
* భారత్‌ 1995లో డబ్ల్యూటీఓలో సభ్యత్వం పొంది, అనేక వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు చేసింది.
* వ్యాపారానికి సంబంధించిన మేధోసంపత్తి హక్కులు (Trade Related Intellectual Property Rights TRIPS) ద్వారా పరిశోధనలు, ఆవిష్కరణలకు రాయల్టీలు చెల్లించాలనే నియమాలు రూపొందించారు. ఇది దేశ పాలనా ప్రక్రియపై ప్రభావం చూపుతుంది.
* ప్రపంచీకరణ ఫలితంగా పాలనలో ‘సుపరిపాలన’ (Good governance) కీలకంగా మారింది. ఇందులో పారదర్శకత (Transparency), జవాబుదారీతనం (Accountability), మానవ హక్కులు(Human Rights), కార్మిక ప్రమాణాలు (Labour Standards), పర్యావరణ అంశాలపై సున్నితత్వం (Environmental Sensitivity) మొదలైనవి అంతర్భాగంగా ఉన్నాయి.
* ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చే వివిధ రకాల రాయితీలను ‘నగదు బదిలీ పేరు’తో (Cash transfer) ఇవ్వడం ప్రారంభించారు. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్‌ ధరలను, రూపాయి మారకం విలువను మార్కెట్‌ శక్తులు నిర్దేశించేలా ప్రభుత్వ పాలనా విధానాల్లో మార్పులు వచ్చాయి.
* కార్పొరేట్‌ పాలన (Corporate governance), ఎలక్ట్రానిక్‌ పాలన (e-governance)లు పాలనలో నూతన మార్పులకు నాంది పలికాయి. 
* పాలనలో లాభార్జన, జవాబుదారీతనం లక్ష్యాలుగా ‘కార్పొరేట్‌ పాలన’ కొనసాగుతోంది.
* ఎలక్ట్రానిక్‌ పాలనలో సాంకేతిక పరిజ్ఞానాన్ని గరిష్ఠంగా వినియోగించి వీడియో కాన్ఫరెన్స్‌లు, ఇంటర్నెట్, ఈ-మెయిల్‌ సేవలను అంతర్భాగంగా కొనసాగిస్తున్నారు.
* ప్రపంచీకరణతో బలమైన పౌరసమాజం అవతరించింది. పౌరులు తమ హక్కుల పరిరక్షణ పట్ల చైతన్యం పొంది, పాలనా విధానాలను నిశితంగా పరిశీలిస్తున్నారు.
* ప్రపంచీకరణ ఫలితంగా వివిధ దేశాల పాలనా రంగాలపై అంతర్జాతీయ ఆర్థిక సంస్థల ప్రభావం పడింది. దీంతో సంక్షేమ రంగానికి ఇచ్చే ప్రాధాన్యం తగ్గింది. వివిధ వర్గాల వారికి ఇచ్చే సంక్షేమ, అభివృద్ధి పథకాలపై సబ్సిడీలను రద్దు చేశారు. ప్రజా పంపిణీ వ్యవస్థ పరిధిని తగ్గించారు. వివిధ రకాల వస్తు ఉత్పత్తులు, సేవలపై ధరల స్థిరీకరణ నిర్ణయాధికారం మార్కెట్‌ శక్తుల చేతుల్లోకి వెళ్లింది. ప్రభుత్వం అనేక ప్రభుత్వరంగ సంస్థల నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకుంది.


 

ప్రైవేటీకరణ ప్రభావం
* స్వాతంత్య్రానంతరం 1948లో మిశ్రమ ఆర్థిక విధానం, 1956లో భారీ పారిశ్రామిక విధానం, 1977లో కుటీర పరిశ్రమల విధానాలను రూపొందించారు. ఇవన్నీ ప్రభుత్వ రంగ ఆధిపత్యాన్ని తెలిపాయి.
* ప్రభుత్వరంగంలో అలసత్వం, లోపభూయిష్ట విధానాలు, జవాబుదారీతనం లేకపోవడం, సరైన పర్యవేక్షణ కొరవడటం లాంటి కారణాల వల్ల ప్రభుత్వరంగ సంస్థలు సంక్షోభంలోకి వెళ్లాయి. దీంతో ఉత్పత్తి, ఉద్పాదకత సామర్థ్యం దెబ్బతిన్నాయి. ఫలితంగా ప్రభుత్వం 1991లో నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రవేశపెట్టి, ప్రైవేటీకరణకు అనుమతిచ్చింది.
* నూతన పారిశ్రామిక విధానం ద్వారా ప్రైవేటీకరణ ప్రక్రియ వేగవంతమైంది. ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణకు ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేశారు. నష్టాల్లో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను గుర్తించి ప్రైవేటీకరించే ప్రక్రియను ఈ శాఖ మొదలుపెట్టింది.
* ప్రైవేటీకరణ ఫలితంగా ప్రభుత్వ నియంత్రణలో ఉన్న పరిశ్రమల సంఖ్య గణనీయంగా తగ్గింది.
* ప్రభుత్వరంగంలో పాక్షిక ప్రైవేటీకరణ ప్రారంభమైంది. ప్రభుత్వ సేవలను ఒప్పంద ఉద్యోగులు, ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీల ద్వారా అందించే ప్రక్రియ మొదలైంది.
* ప్రభుత్వరంగంలోని కంప్యూటర్, సెక్యూరిటీ సేవలను ప్రైవేటీకరించే ప్రయత్నాలు మరింత విస్తృతమయ్యాయి.
* 1969 నాటి ఏకస్వామ్య వ్యాపార నియమాల నిరోధక చట్టం  (MRTP Act) స్థానంలో 2002లో ‘కాంపిటీషన్‌ చట్టాన్ని’ తీసుకొచ్చారు. ప్రైవేట్‌ రంగాన్ని బలోపేతం చేయడం, స్వేచ్ఛా వాణిజ్యాన్ని ప్రోత్సహించడం దీని లక్ష్యం. అందుకోసమే కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ డియా అనే సంస్థను స్థాపించారు.
* దేశీయ ప్రైవేట్‌రంగం విదేశీ పరిశ్రమలతో నేరుగా సాంకేతిక, అవగాహన ఒప్పందాలను కుదుర్చుకునేందుకు అనుమతులు లభించాయి.
* ప్రైవేట్‌రంగ బలోపేతానికి అవసరమయ్యే మూలధన వస్తువులు, యంత్రాల దిగుమతికి సంబంధించి పన్ను రాయితీలు కల్పించారు.
* బ్యాంకింగ్, ఇన్సూరెన్స్‌ రంగాల్లో ప్రైవేటీకరణ ప్రక్రియ మరింత విస్తృతమైంది.
* దేశీయ, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ప్రైవేట్‌ రంగం ద్వారా ప్రభుత్వరంగ వాటాలను కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పించారు. తద్వారా మార్కెట్‌ శక్తుల పోటీకి ప్రభుత్వ రంగాన్ని వదిలి, ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించారు. 

Posted Date : 17-07-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌