• facebook
  • whatsapp
  • telegram

భారతదేశంలో రవాణా వ్యవస్థ

రోడ్డురవాణా

దేశ సామాజిక - ఆర్థికాభివృద్ధిలో రోడ్లు కీలకమైన పాత్ర నిర్వహిస్తాయి. కాబట్టి, భారతీయ రవాణాలో ఇవి చాలా ముఖ్యమైనవి. రవాణాలో సరళత, విశ్వసనీయత, వేగం, ఇంటింటికీ సేవలు వంటి ప్రయోజనాలెన్నింటినో ఇవి సమకూరుస్తాయి. ఇతర రకాల రవాణాకు ఇవి పూరకంగా కూడా ఉంటాయి. (ఇవి అన్ని రకాల రవాణా విధానాలనూ అనుసంధానం చేస్తాయి.) కాలం గడుస్తున్నకొద్దీ, సమగ్ర రవాణా నిర్వహణలో రోడ్డు రవాణా వాటా నిరంతరం పెరిగిపోతూ ఉంది. ఇటీవలి కాలంలో రోడ్డు మార్గాల ప్రాధాన్యం గణనీయంగా పెరగడంతో రోడ్ల అభివృద్ధి శీఘ్రంగా జరుగుతోంది. భారతదేశం రోడ్డు రవాణా, రోడ్ల పొడవుకు సంబంధించి ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది. యు.ఎస్.ఎ. 63 లక్షల కి.మీ. పొడవైన రోడ్లతో మొదటి స్థానంలో ఉంది. భారత్ 33 లక్షల కి.మీ. రోడ్ల పొడవుతో రెండో స్థానంలో ఉంది.
         దేశంలోని రోడ్ల పొడవు 1951లో కేవలం 4 లక్షల కి.మీ. ప్రస్తుతం అది 33 లక్షల కిలోమీటర్లకు పెరిగింది. అదే రోడ్ల ద్వారా సరకు రవాణా 1951 నుంచి 2008-09 మధ్యకాలంలో దాదాపు 100 రెట్లు పెరిగింది. ప్రయాణికుల రవాణా దాదాపు 200 రెట్లు, వాహనాల సంఖ్య 300 రెట్లు పెరిగింది. కాబట్టి, దీన్ని బట్టి రోడ్డు రవాణా అభివృద్ధి ఏ విధంగా ఉందో తెలుస్తుంది.
       భారతదేశంలోని రోడ్లను ప్రధానంగా నాలుగు రకాలుగా వర్గీకరించారు. ప్రస్తుతం వీటి మొత్తం పొడవు దాదాపు 33 లక్షల కిలోమీటర్లు. అవి.

 

జాతీయ/ ఎక్స్‌ప్రెస్ రహదారులు 

జాతీయ ప్రాధాన్యం ఉన్న నగరాలు, పట్టణాలు, రాష్ట్ర రాజధానులు, ప్రధాన ఓడరేవులు, పారిశ్రామిక సముదాయాలను అనుసంధానం చేసే రోడ్లనే జాతీయ రహదార్లు అంటారు. వీటినే ట్రంక్ రోడ్లు అని కూడా పిలుస్తారు. ప్రస్తుతం వీటి మొత్తం పొడవు 70548 కి.మీ.  అత్యంత పొడవైన జాతీయ రహదారి ఎన్.హెచ్.7. ఇది వారణాసి నుంచి కన్యాకుమారి వరకూ సాగుతుంది. ఇక నాగపూర్ సమీపంలోని ధూలె నుంచి కోల్‌కతా వరకూ సాగే ఎన్.హెచ్.6 రెండో స్థానంలో ఉంది.
 

రాష్ట్ర రహదారులు 
రాష్ట్రం పరిధిలో ప్రయాణికుల రవాణాకు, వాణిజ్య సరకుల రవాణాకు రాష్ట్ర రహదారులే ప్రధానమైనవి. రాష్ట్ర రాజధాని నగరంతో రాష్ట్రంలోని ప్రతి జిల్లాను, పట్టణాన్ని, జాతీయ రహదారులను, ప్రాంతీయ ప్రాధాన్యం ఉన్న ఇతర పట్టణాలు, నగరాలను ఈ రోడ్లు కలుపుతాయి. వీటి నిర్వహణ బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలదే. ప్రస్తుతం వీటి మొత్తం పొడవు 1,28,000 కి.మీ.

 

జిల్లా రహదారులు
జిల్లాల పరిధిలోని వివిధ పట్టణాలు, పెద్ద గ్రామాలను ఈ రోడ్లు జిల్లా కేంద్రాలతో అనుసంధానం చేస్తాయి. ఇవి చాలా వరకు కచ్చా రోడ్లు. జిల్లా పరిషత్తులు, పి.డబ్ల్యు.డి. ఈ రోడ్ల అభివృద్ధి, నిర్వహణ బాధ్యతలను నిర్వహిస్తాయి. ప్రస్తుతం వీటి మొత్తం పొడవు 4,70,000 కి.మీ.

 

గ్రామీణ రహదారులు
ఇవి గ్రామ పంచాయితీల అధీనంలో ఉంటాయి. కచ్చారోడ్లు వానాకాలంలో బురదమయంగా ఉంటాయి. ప్రస్తుతం వీటి మొత్తం పొడవు 26,50,000 కి.మీ.
      ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన అనే పథకం 2000 సంవత్సరంలో ప్రారంభమైంది. ఈ పథకం ప్రధాన లక్ష్యం మారుమూల గ్రామీణ ప్రాంతాలను జిల్లా, రాష్ట్ర రహదారులతో కొత్తగా నిర్మించి అనుసంధానం చేయడం. ప్రస్తుతం ఉన్న గ్రామీణ రోడ్లను అభివృద్ధి చేయడం కూడా మరో లక్ష్యం. ఈ పథకం ద్వారా ఇటీవలి కాలంలో గ్రామీణ రోడ్ల నిర్మాణం గణనీయంగా కొనసాగుతోంది.
      జాతీయ రహదార్ల అభివృద్ధిని జాతీయ రహదార్ల అభివృద్ధి ప్రాజెక్టు (ఎన్.హెచ్.డి.పి.) ద్వారా భారత జాతీయ రహదారుల సంస్థ (ఎన్.హెచ్.ఎ.ఐ.) నిర్వహిస్తోంది. ఇది ప్రధానంగా కింది రహదారులను నిర్మించింది.

 

స్వర్ణ చతుర్భుజి
స్వర్ణ చతుర్భుజి (Golden Quadrilateral) దేశంలోని నాలుగు ప్రధాన మెట్రోపాలిటన్ నగరాలైన ఢిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతాలను అనుసంధానం చేస్తుంది. దీని పొడవు 5486 కి.మీ.
ఉత్తర - దక్షిణ, తూర్పు - పశ్చిమ కారిడార్
ఉత్తరాన శ్రీనగర్ నుంచి దక్షిణాన కన్యాకుమారి వరకు (4000 కి.మీ.),  పశ్చిమాన  పోర్‌బందర్ నుంచి తూర్పున సిల్చర్ వరకు (3142 కి.మీ.) ఈ రహదార్లను నిర్మించారు. ఈ కారిడార్ మొత్తం పొడవు 7,142 కి.మీ.

       భారతదేశంలో ప్రస్తుతం మొత్తం జాతీయ రహదార్ల సంఖ్య 228. రాష్ట్రాలవారీగా పరిశీలిస్తే ఎక్కువ పొడవున్న జాతీయ రహదారులు ఉండే రాష్ట్రం ఉత్తరప్రదేశ్ - 5874 కి.మీ. ఆ తరువాత స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు వరుసగా మధ్యప్రదేశ్ - 4670 కి.మీ., ఆంధ్రప్రదేశ్ - 4472 కి.మీ., తమిళనాడు - 4462 కి.మీ. అతి తక్కువ దూరం జాతీయ రహదార్లు ఉన్న రాష్ట్రం సిక్కిం - 62 కి.మీ. ఆంధ్రప్రదేశ్ ద్వారా ప్రయాణించే జాతీయ రహదారుల సంఖ్య 15.
      ఈశాన్య రాష్ట్రాల్లో రోడ్ల అభివృద్ధికి ముఖ్యంగా ఈ రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల కేంద్రాలను అనుసంధానం చేయడానికి (Special Accelerated Road Development Programme - SARDP) పథకాన్ని ప్రారంభించి అమలు చేస్తున్నారు.
      ఇటీవలి కాలంలో దేశంలోని జాతీయ రహదారుల విస్తరణ పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పీపీపీ), బిల్ట్, ఆపరేట్ అండ్ ట్రాన్స్‌ఫర్ (బీఓటీ) కింద నిర్మిస్తున్నారు.

 

సరిహద్దు రోడ్ల సంస్థ
సరిహద్దు రోడ్ల సంస్థ (Border Roads Organization) 1960 లో ప్రారంభమైంది. భారత సరిహద్దుల్లో ముఖ్యంగా ఉత్తర, ఈశాన్య సరిహద్దు ప్రాంతాల్లో రక్షణకు, పౌర అవసరాలకు ఈ సంస్థ రోడ్లను నిర్మిస్తుంది. ఇది దేశ భద్రత, దేశ సమగ్రతలను పరిరక్షించడంలో కీలకపాత్ర వహిస్తుంది. ఈ సంస్థ ఇప్పటి వరకు 46,780 కి.మీ. పొడవున సరిహద్దు రోడ్లను నిర్మించింది.

 

జల, వాయురవాణా

రవాణా వ్యవస్థల్లో తక్కువ వ్యయంతో అధిక పరిమాణంలో సరకులను రవాణా చేయడానికి తోడ్పడేది జల రవాణా. దీని వల్ల పర్యావరణానికి హాని జరగదు. ప్రధానంగా సముద్రాలు, నదులు, కాల్వల ద్వారా ఈ రవాణా జరుగుతుంది. దేశంలోని ఓడరేవులను అభివృద్ధి చేయడానికి 2015లో సాగర్‌మాల ప్రాజెక్టును ప్రారంభించారు. నౌకా నిర్మాణంలో భారత్‌ ఆసియా ఖండంలో ద్వితీయ స్థానంలో, ప్రపంచంలో 16వ స్థానంలో నిలిచింది. మన దేశంలో సుమారు 27 షిప్‌యార్డ్‌ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో నాలుగు ప్రధాన నౌకానిర్మాణ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
* హిందుస్తాన్‌ షిప్‌యార్డ్‌ - విశాఖపట్నం: ఇక్కడ ప్యాసింజర్‌ నౌకలు, పెద్ద నౌకలు తయారు చేస్తారు.
* మజగావ్‌డాక్‌ - ముంబయి: యుద్ధ నౌకలు, జలాంతర్గాములు నిర్మిస్తారు. 
* గార్డెన్‌రిచ్‌ షిప్‌యార్డ్‌ - కోల్‌కత: స్టీమర్లు, కార్గో గ్రిగ్గర్లు తయారు చేస్తారు.
* కొచ్చి షిప్‌యార్డ్‌ - కొచ్చిన్‌: నౌకలకు మరమ్మతులు చేయడంతోపాటు పెద్ద నౌకలను నిర్మిస్తారు.


* జల రవాణాను ముఖ్యంగా దేశీయ/ అంతఃస్థలీయ జలమార్గాలు; సముద్ర/ ఓడరేవు జలమార్గాలు అనే రెండు భాగాలుగా విభజించవచ్చు.
దేశీయ/ అంతఃస్థలీయ జలమార్గాలు: దేశంలో నదులు - కాల్వలు,  సముద్ర లోతట్టు కాల్వల ద్వారా విస్తృతమైన జలమార్గాలను ఏర్పాటు చేశారు. స్వాతంత్య్రానంతరం రైలు, రోడ్డు మార్గాల అభివృద్ధి వల్ల జలమార్గాలకు ప్రాధాన్యం తగ్గిపోయింది. అంతఃస్థలీయ మార్గాలను అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం 1986 అక్టోబరు 27 న నోయిడా (ఉత్తర్‌ ప్రదేశ్‌) కేంద్ర ప్రధాన కార్యాలయంగా ఇన్‌లాండ్‌ వాటర్‌వేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాను స్థాపించింది. దీని పరిధిలో మొత్తం 14,500 కి.మీ. మార్గాలు ఉన్నాయి. ఇందులో 5,685 కి.మీ. నదీ మార్గాలు, 400 కి.మీ. కాల్వల మార్గాలు. 
* పార్లమెంట్‌ 2016  మార్చి 25 న నేషనల్‌ వాటర్‌వేస్‌ యాక్ట్, 2016ను ఆమోదించింది. ఈ చట్టంలో 106 అంతఃస్థలీయ జల మార్గాలను గుర్తించి, పూర్వం ఉన్న 5 మార్గాలను విలీనం చేశాక ప్రస్తుతం 111 మార్గాలున్నాయి. దేశంలో తొలి నేషనల్‌ వాటర్‌ వే-1ను అలహాబాద్‌ - హల్దియా మధ్య; చివరి నేషనల్‌ వాటర్‌ వే   -111ను సనోవర్‌డెమ్‌ బ్రిడ్జి - మర్మగోవా పోర్ట్‌ మధ్య ఏర్పాటు చేశారు.


 ప్రధాన జల మార్గాలు
ఎ) నేషనల్‌ వాటర్‌ వే  1: అలహాబాద్‌ - హల్దియా మధ్య ఉంది. గంగా - భగీరథి - హుగ్లీ నదులను కలుపుతూ సాగే ఈ మార్గం పొడవు 1620 కి.మీ. ఇది దేశంలోనే అతి పెద్ద జల మార్గం. 
బి) నేషనల్‌ వాటర్‌ వే  2: సాదియా - దుబ్రి మధ్య ఉంది. బ్రహ్మపుత్ర ఉత్తర పాయ, కుండ్లీ నది, దిగువ సాదియా వద్ద నదీ దీవి అయిన మజులీ వరకు ఉన్న ఈ మార్గం పొడవు 891 కి.మీ.  
సి) నేషనల్‌ వాటర్‌ వే  3: కొల్లాం - కొజికోడ్‌ మధ్య ఉన్న ఈ మార్గం వెస్ట్‌ కోస్ట్‌ కెనాల్, చంపాక్రా, ఉద్యోగ్‌మండల్‌ కెనాల్‌ను కలుపుతుంది. పొడవు 205 కి.మీ. 
డి) నేషనల్‌ వాటర్‌ వే  4: ఈ మార్గం కాకినాడ - పాండిచ్చేరి మధ్య కలువెల్లి చెరువు, నాసిక్‌ నుంచి భద్రాచలం - రాజమండ్రి గోదావరి నది, బ్రిడ్జి గాలంగిలీ - వాజీరాబాద్‌ - విజయవాడ కృష్ణా నది వరకు ఉంటుంది. దీని పొడవు 1095 కి.మీ. 
ఇ) నేషనల్‌ వాటర్‌ వే  5: తాల్చేర్‌ - ధమరా మధ్య బ్రహ్మణి - ఖరుసియా - తండిగై - మాతియ నది, మహానది డెల్టా వరకు 623 కి.మీ. పొడవున ఉంది. 
ఎఫ్‌) నేషనల్‌ వాటర్‌ వే  69: తమిళనాడు మనిముత్తారు-తమిరపరాని నదుల మధ్య కేవలం 5 కి.మీ. పొడవుండే ఈ మార్గం దేశంలో అతిచిన్న జలమార్గం.


సముద్ర/ఓడరేవు జలమార్గాలు
సముద్ర రేవు మార్గాలు విదేశీ వాణిజ్యంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. దేశానికి రెండు వైపులా సముద్రాలు, ఒకవైపు మహాసముద్రం వల్ల 7,516.4 కి.మీ. తీరరేఖ ఉంది. 14 మేజర్‌ రేవులు, 200 చిన్నమధ్య రేవు పట్టణాలను అభివృద్ధి చేశారు. దేశంలో 95% విదేశీ వాణిజ్యం ఈ రేవుల ద్వారా జరుగుతోంది. భారతదేశాన్ని విదేశాలతో కలిపే సింగపూర్‌ మార్గం, కేవ్‌ ఆఫ్‌ గుడ్‌హోప్‌ (దక్షిణాఫ్రికా) మార్గం, సూయజ్‌ కెనాల్‌ మార్గాలు ముఖ్యమైనవి. దేశంలో ప్రధాన రేవు పట్టణ మార్గాలు రెండు రకాలు.
ఎ) పశ్చిమ తీర రేవు పట్టణాలు: పశ్చిమ తీరంలో అరేబియా సముద్రం వద్ద కాండ్లా, ముంబయి, నవసేన, మర్మగోవా, మంగళూరు, కొచ్చిన్‌ ఓడరేవులు ఉన్నాయి.
కాండ్లా: దీన్ని ప్రస్తుతం దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ రేవుగా వ్యవహరిస్తున్నారు. సహజసిద్ధమైన ఈ ఓడరేవు గుజరాత్, కచ్‌ తీరంలోని భుజ్‌కు 48 కి.మీ. దూరంలో ఉంది. టైడల్‌/వేలా తరంగ రేవు పట్టణం. దేశ విభజనకి ముందు కరాచీకి అనుబంధంగా ఉండేది. ఇది ప్రధానంగా దిగుమతి రేవు పట్టణం. 


ముంబయి: దీన్ని గేట్‌ వే ఆఫ్‌ ఇండియాగా (ముఖద్వారం) వ్యవహరిస్తారు. ఇది సహజసిద్ధమైంది. పశ్చిమ తీరంలో అతి పెద్దదైన ఈ రేవులో రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. సుయాజ్‌ కాల్వ ద్వారా లండన్‌కు, ఈ రేవు పట్టణానికి 6,500 కి.మీ. దూరం తగ్గుతోంది. ఇది ప్రధానంగా ఎగుమతి రేవు. ఈ ఓడరేవులో రద్దీని తగ్గించడానికి 1989లో 15 కి.మీ. దిగువన నవసేన వద్ద జవహర్‌లాల్‌ నెహ్రూ ఓడరేవును అభివృద్ధి చేశారు. ఇది అత్యాధునిక సాంకేతిక సౌకర్యాలను కలిగి ఉంది.


మర్మగోవా: గోవా తీరంలో జువారీ నదీ ముఖద్వారం వద్ద ఈ రేవును అభివృద్ధి చేశారు. ఇది సహజసిద్ధమైన రేవు పట్టణం. ఇక్కడి నుంచి  ముడి ఇనుము ఎగుమతి అవుతుంది. కొంకణ్‌ రైలు మార్గాన్ని నిర్మించడంతో ఈ రేవుకు ఎక్కువ ప్రాధాన్యం లభిస్తోంది. 


మంగళూరు: మంగళూరుకు ఉత్తరంగా 10 కి.మీ. దూరంలో న్యూమంగళూర్‌ రేవును అభివృద్ధి చేశారు. ఇది గురువూర్‌ నదీ ముఖ ద్వారానికి సమీపంలో ఉంది.


కొచ్చి: కేరళ రాష్ట్ర తీరంలో వెంబనాడ్‌ సరస్సు ముఖ ద్వారం వద్ద కొచ్చిన్‌ రేవు పట్టణాన్ని అభివృద్ధి చేశారు. సహజసిద్ధమైన  వాతావరణ రేవు పట్టణం. దీన్ని అరేబియా రాణి అని పిలుస్తారు. సుయాజ్‌ కాల్వ - కొలంబో అంతర్జాతీయ సముద్ర వాణిజ్య మార్గానికి సమీపంలో ఉండటంతో కొచ్చిన్‌ రేవు బాగా అభివృద్ధి చెందింది.


బి) తూర్పు తీర రేవు పట్టణాలు: తూర్పు తీరంలో బంగాళఖాతం సముద్రంలో ఉన్న రేవు పట్టణాలు - ట్యూటికొరిన్, చెన్నై, ఎన్నూర్, విశాఖపట్నం, గంగవరం, పారదీప్, హల్దియా.
ట్యూటికొరిన్‌: ఇది కృత్రిమ లోతైన రేవు. ఈ రేవు వద్ద హిందూ మహాసముద్రం, 2 సముద్రాలు కలుస్తాయి. దీన్ని హిందూ మహాసముద్ర తీరంలో నిర్మించారు. జాతీయ రహదారులు, బ్రాడ్‌గేజ్‌ రైలు మార్గాలను ఈ రేవు అంతర్భాగాలతో అనుసంధానించారు. ఇది ప్రధానంగా ముత్యపు చిప్పలవేటకు ఉద్దేశించింది. ఇక్కడ ఆధునిక కంటెనయినర్, కంప్రెస్డ్‌ నేచురల్‌ గ్యాస్‌ టెర్మినల్స్‌ ఉన్నాయి.


చెన్నై: ఇది దేశంలో అతిపెద్ద కృత్రిమ ఓడరేవు. దక్షిణ భారత దేశమంతటా విస్తరించి ఉంటుంది. దేశంలో రెండో పెద్ద, తూర్పుతీరంలో అతిపెద్ద ఓడరేవు ఇది. చెన్నై రేవుపై ఒత్తిడి తగ్గించడానికి 2001లో ప్రయివేటు భాగస్వామ్యంతో ఎన్నూర్‌ పోర్ట్‌ను అభివృద్ధి చేశారు. ఇది కామరాజర్‌ పోర్ట్‌ లిమిటెడ్‌ కింద పనిచేస్తోంది. ఈ పోర్టును కోరమాండల్‌ తీరంలో చెన్నైకి 18 కి.మీ. ఉత్తరాన అభివృద్ధి చేశారు. ఇందులో కేంద్రానికి 50%, కామరాజర్‌ లిమిటెడ్‌కు 27% వాటా ఉండగా, మిగిలిన 23% వాటా చెన్నై పోర్ట్‌ట్రస్ట్‌ది.


విశాఖపట్నం: తూర్పుతీరంలో ఉంది. దేశంలో అతిపెద్ద ఏకైక సహజసిద్ధమైన ఓడరేవు. యారాడ కొండచరియల మధ్య డాల్ఫిన్‌ నోస్‌-రాస్‌ చొచ్చుకుపోయిన ప్రాంతంలో ఏర్పడింది. బైలాదిల్లా గనుల్లో వెలికి తీసిన ఇనుప ఖనిజాన్ని ఈ రేవు నుంచి జపాన్‌కి ఎగుమతి చేస్తారు. 2009లో విశాఖ రేవుపై భారాన్ని తగ్గించడానికి దిగువన 15 కి.మీ. దూరంలో బొర్రమ్మ గెద్ద నది సముద్రంలో కలిసే ప్రాంతంలో గంగవరం ఓడరేవును అభివృద్ధి చేశారు. ఇది దేశంలో లోతైన ప్రైవేటు పోర్ట్‌ (21 మీ.). ఇందులో డీవీఎస్‌ రాజు గ్రూప్‌కి 59%, వార్‌బర్గ్‌ పిన్‌కస్‌కి 30%, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి 11% వాటా ఉన్నాయి.


పారదీప్‌: ఒడిశాలోని కటక్‌కు సమీపంలో ఉంది. ఇది దేశంలోకెల్లా అత్యంత లోతైన రేవు పట్టణం. మహానది ముఖద్వారం వద్ద సగటున గరిష్ఠంగా ్బలివీత్శి 260 మీ. లోతు ఉంటుంది. ఇది తుపాన్ల వల్ల నష్టపోయే ఓడరేవు.


హల్దియా: పశ్చిమ్‌ బెంగాల్‌ రాష్ట్రంలో హల్ది, హుగ్లీ నదులు కలిసే ప్రాంతంలో దీన్ని అభివృద్ధి చేశారు. ఇది ఒక నదీ ఆధారిత ఓడరేవు, డాక్‌ కాంపెక్స్‌. కోల్‌కతకు 148 కి.మీ. దూరంలో హుగ్లీ నది తీరంలో ఉంది. ఇది రెండు భూపరివేష్టిత పొరుగు దేశాలైన నేపాల్, భూటాన్, స్వయం ప్రతిపత్తి ప్రాంతమైన టిబెట్‌కు హంటర్‌లాండ్‌ కలిగి ఉంది.


పోర్ట్‌బ్లెయిర్‌: దక్షిణ అండమాన్‌ జిల్లా పోర్ట్‌బ్లెయిర్‌లో ఈ ఓడరేవును నిర్మించారు. 2010 జూన్‌ 1న కేంద్ర ప్రభుత్వం మేజర్‌ పోర్ట్‌గా ప్రకటించింది. ఇది ఒక సహజ ఓడరేవు.


సేతు సముద్రం ప్రాజెక్టు: పాక్‌ జలసంధి, పాక్‌ అఖాతం ద్వారా మన్నార్‌ సింధు శాఖ, బంగాళఖాతాన్ని కలిపే ప్రాజెక్టు ఇది. ఇందులో పశ్చిమ, తూర్పుతీరాల మధ్య నౌకలు ప్రయాణిస్తాయి.


వాయు మార్గాలు
* 1911 ఫిబ్రవరి 18న మొట్టమొదటి వాణిజ్య పౌర విమానం అలహాబాద్‌లోని పోలో మైదానం నుంచి బయలుదేరి నైని వరకు సుమారు 10 కి.మీ దూరం ప్రయాణించింది. 2018 నాటికి భారతదేశ సివిల్‌ ఏవియేషన్‌ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద పౌర విమానయాన సంస్థ.
* 1932 అక్టోబరు 15న జేఆర్‌డీ టాటా మొదటి ప్యాసింజర్‌ విమానాన్ని జుహు (ముంబయి) నుంచి కరాచీ (పాకిస్థాన్‌) వరకు నడిపారు. 1953లో ఎయిర్‌ కార్పొరేషన్‌ యాక్ట్‌ను ఆమోదించిన భారత పార్లమెంట్‌ ప్రయివేట్‌ ఎయిర్‌లైన్స్‌ను జాతీయం చేసింది. 1953 ఆగస్టు 1న ఇండియన్‌ ఎయిర్‌లైన్, ఎయిర్‌ ఇండియా లిమిటెడ్‌ను ప్రారంభించారు. దీని ప్రధాన కార్యాలయం న్యూదిల్లీ. ప్రస్తుత ముంబయి-దిల్లీ ఎయిర్‌ కారిడార్‌ ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే మార్గాల్లో మూడో స్థానంలో ఉంది. అంతర్జాతీయ ప్రయాణికుల ట్రాఫిక్‌లో అతిపెద్ద ఎయిర్‌లైన్‌ జెట్‌ ఎయిర్‌వేస్‌.
* 1990-91లో ప్రభుత్వం ‘ఎయిర్‌ టాక్స్‌’ పథకం కింద ప్రయివేట్‌ ఎయిర్‌లైన్స్‌ చార్టర్, నాన్‌-షెడ్యూల్‌ సర్వీసులను నిర్వహించడానికి అనుమతి ఇచ్చింది.
* పౌరవిమానయాన మౌలిక సదుపాయాలను సృష్టించడానికి, మెరుగుపరచడానికి, నిర్వహించడానికి ఒక చట్టబద్ధమైన సంస్థ ఏర్పాటు అవసరమని భావించిన కేంద్రం పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ పరిధిలో ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాను స్థాపించింది. 1994 ఏప్రిల్‌ 1న ఏర్పాటైన ఈ సంస్థ 11 అంతర్జాతీయ, 8 కస్టమ్స్, 81 దేశీయ విమానాశ్రయాలు (మొత్తం 125 ఎయిర్‌పోర్ట్‌లను) నిర్వహిస్తోంది. ఇస్రో సాంకేతిక సహకారంతో 2010 ఏప్రిల్‌ 15న జీపీఎస్‌ ఆధారంగా పని చేసే జియో అగ్మెంటెడ్‌ నావిగేషన్‌ సిస్టమ్‌ను ఏఏఐ అమలు చేస్తోంది. ఏఏఐకి అలహాబాద్‌లో ట్రైనింగ్‌ కాలేజీ, దిల్లీలో ఏవియేషన్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్, దిల్లీ, కోల్‌కతలో ఫైర్‌ ట్రైనింగ్‌ కేంద్రాలు ఉన్నాయి.
* ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా పేర్కొన్న సమాచారం ప్రకారం, 2020 మార్చి నాటికి దేశంలో మొత్తం 486 విమానాశ్రయాలు, ఎయిరిప్స్, ఫ్లయింగ్‌ స్కూలు, సైనిక స్థావరాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 131 కార్యాచరణ ఎయిర్‌పోర్టులు, 34 అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులు.
* కేంద్ర ప్రభుత్వం ప్రాంతీయ విమానాశ్రయాలు, మార్గాలను అభివృద్ధి చేయడానికి 2017 ఏప్రిల్‌ 27న దిల్లీ కేంద్రంగా ‘ఉడాన్‌’ను ప్రారంభించింది. దీని మోటో ‘ఉడే దేశ్‌కా ఆమ్‌ నాగరిక్‌’.
* ప్రస్తుతం మన దేశంలో 100 రన్నింగ్‌ విమానాశ్రయాలున్నాయి. 2018 సెప్టెంబరు 24న ప్రధాని నరేంద్ర మోదీ సిక్కింలోని గాంగ్‌టక్‌కు 30 కి.మీ. దూరంలో ఉన్న పాక్యాంగ్‌లో 100వ ఎయిర్‌పోర్టును ప్రారంభించారు. ఇది ఈశాన్య రాష్ట్రాల్లో  ఎత్తైంది, మొదటి గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు. ఇది సముద్ర మట్టానికి 4600 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇక్కడి రన్‌వే పొడవు 1.7 కి.మీ.
* దేశంలో ప్రస్తుతం 45 హెలీపాడ్స్, 1141 దేశీయ హెలికాప్టర్లు, 664 సైనిక హెలికాప్టర్లు ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన హెలీప్యాడ్‌ సియాచిన్‌ హిమనీ నదం లద్దాఖ్‌లో ఉంది.

Posted Date : 18-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌