• facebook
  • whatsapp
  • telegram

గిరిజన సామాజిక వ్యవస్థ, లక్షణాలు (గోత్రం-టోటెమ్‌-బంధుత్వం)

సనాతన సమూహాల సమున్నత బంధాలు!

ఒక సామాజిక వ్యవస్థ ఏర్పడేందుకు, అది సజావుగా కలిసికట్టుగా సాగేందుకు కొన్ని విధానాలు, విశ్వాసాలు ఉండాలి. నిర్ణీత మానవ సమాజాన్ని నియమబద్ధ విధానంలో ఉంచిన భావనలు ఆదిమ సమాజంలోనే ఆవిర్భవించాయి. తెగలుగా మనుగడ సాగించేందుకు గోత్ర వ్యవస్థ ఉపకరిస్తే, ఐకమత్య జీవనానికి బంధుత్వాలు దోహదపడ్డాయి. ప్రగాఢ నమ్మకాలే మతంగా మార్పు చెందాయి. ఆధునిక సమాజంలో పాటిస్తున్న ఆచార వ్యవహారాలకు కూడా అవే మూలాలు. ఈ పరిణామాల గురించి అర్థం చేసుకోడానికి దేశంలో గిరిజన సమాజంలో ఉన్న మౌలిక లక్షణాలు, ముఖ్యాంశాలను పోటీ పరీక్షల అభ్యర్థులు అర్థం చేసుకోవాలి. గోత్రం, టోటెమ్, బంధుత్వాల ప్రాధాన్యాన్ని వివరంగా తెలుసుకోవాలి.

 

ఆదిమ తెగ సామాజిక వ్యవస్థాపనలో గోత్రం, బంధుత్వం, టోటెమ్‌లకు ప్రాముఖ్యత ఉంది. ప్రతి ఆదిమ తెగ కొన్ని గోత్రాలుగా విభజితమై ఉంటుంది. ప్రతి గోత్రానికి ఒక అధిపతి ఉంటాడు. వివిధ గోత్ర అధిపతులు ఆదిమ తెగ అధిపతి ఆధ్వర్యంలో పరిపాలన కొనసాగిస్తుంటారు. వివాహపరమైన నిషేధాలకు గోత్రమే ప్రధాన ఆధారం. గోత్రం అంటే రక్త సంబంధాలతో నిర్మితమైన కొన్ని వంశానుక్రమాల సమూహం.


* మజుందార్, మదన్‌ అభిప్రాయాల ప్రకారం ‘‘ఒకే పితృస్వామ్యం నుంచి జన్మించామని విశ్వసిస్తూ, కలసిమెలసి జీవించే కొన్ని వంశాను క్రమాల సమూహాన్ని గోత్రం’’ అని చెప్పవచ్చు.


గోత్రం- రకాలు:  గోత్రం ఏకపక్ష నిర్మాణం. పూర్తిగా తల్లి తరఫున గానీ లేదా పూర్తిగా తండ్రి పక్షాన గానీ నిర్మితమై ఉంటుంది. ఇది రెండు రకాలు. 


1) మాతృస్వామిక గోత్రం: ఈ రకమైన గోత్రంలో తల్లి సంతానం, ఆమె సోదరులు, వారి కుటుంబసభ్యులు, సహోదరులు ఉంటారు. సహోదరుల పిల్లలు మాత్రం ఉండరు.


2) పితృస్వామిక గోత్రం: ఇందులో తండ్రి, అతడి సంతానం, సోదరులు, వారి సంతానం, సహోదరులు ఉంటారు. సోదరిల సంతానం ఉండదు.


గోత్రం-పేర్లు: గోత్రం పేర్లు వివిధ అంశాల ఆధారంగా, వివిధ రకాలుగా ఉంటాయి. అవి 

1) సత్పురుషులు 

2) టోటెమ్‌లు 

3) భౌగోళిక ప్రాంతం

గోత్రం ప్రకార్యాలు: గోత్రం పలు రకాల ప్రకార్యాలను కలిగి ఉంటుంది. 


1) ఒకరికొకరు సహాయం, భద్రత కల్పించుకోవడం: ‘గోత్రంలోని సభ్యులు తామంతా ఒకే పితృస్వామ్యం నుంచి జన్మించామని విశ్వసిస్తారు. ఆ విధంగా వారిలో రక్త సంబంధ మైన ‘మేము’, ‘మాది’ అనే భావనలు ఉంటాయి. ఒకరి కోసం ఒకరు ప్రాణత్యాగానికైనా వెనుకాడరు. 

2) మత ప్రకార్యాలు: గోత్ర సభ్యులంతా కలిసి మతపరమైన కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఒక్కొక్క గోత్రానికి ఒక రకమైన మతాచారం ఉంటుంది. గోండు తెగలో ఒక గోత్రం వారంతా ఉత్సవాలను సమష్టిగా చేస్తారు.


3) రాజకీయ ప్రకార్యాలు: ప్రతి గోత్రానికి సహజంగా పెద్ద వయస్కుడు గోత్రాధిపతిగా వ్యవహరిస్తాడు. ప్రతి ఆదిమ తెగలో ఇలాంటి గోత్రాలు కొన్ని ఉంటాయి. గోత్ర అధిపతికి గోత్ర సభ్యులపై సంపూర్ణ అధికారం ఉంటుంది. వివిధ గోత్ర అధిపతులు ఆదిమ తెగ అధిపతి ఆధ్వర్యంలో, తెగ రాజకీయ పరిపాలనను నిర్వహిస్తూ ఉంటారు.


4) ఆస్తి ప్రకార్యాలు: వ్యవసాయం ముఖ్యవృత్తిగా ఉన్న గ్రామాల్లో గోత్రం వ్యవసాయ భూమిపై హక్కులను కలిగి ఉంటుంది. గోత్ర అధిపతి ఆ భూమిని గోత్ర సభ్యులకు పంచిపెడతాడు. సభ్యులకు భూమిపై అధికారం ఉండదు. సాధారణంగా పురుషులకు బల్లేలు, బాణాలను, స్త్రీలకు గాజులు, పూసలను ఆస్తులుగా పరిగణిస్తారు.


5) బాహ్య వివాహం: ఒకే గోత్ర సభ్యులకు వివాహం జరగకుండా నిషేధాలు విధించి, బయట వారితో వివాహాలు నిశ్చయిస్తుంది. ఈ విధంగా ఇతర గోత్రాల వారితో సంబంధాలు ఏర్పరుస్తుంది.


గోత్రం-లక్షణాలు: గోత్రం పలు రకాల లక్షణాలు కలిగి ఉంటుంది. 


బాహ్య వివాహ సమూహం: గోత్రం అంతర్వివాహ సమూహం కాదు. అంటే ఒకే గోత్రానికి చెందిన స్త్రీ పురుషుల మధ్య వివాహం నిషేధం. ఇతర గోత్రాలతోనే వివాహం జరగాలి.


ఒకే పితృస్వామ్యం: గోత్రంలోని సభ్యులందరూ తామంతా ఒకే మూలపురుషుడి నుంచి జన్మించామని విశ్వసిస్తారు. ఆ భావనలో రక్త సంబంధీకులమన్న విశ్వాసంతో కలసిమెలిసి జీవిస్తారు.


ఏకపక్ష నిర్మాణం: గోత్ర వ్యవస్థ ఏకపక్షంగా నిర్మాణమవుతుంది. అంటే పూర్తిగా తల్లి తరఫున గానీ లేక తండ్రి తరఫున గానీ గోత్ర వ్యవస్థ ఏర్పడుతుంది. తల్లిదండ్రులతో కలిసి గోత్ర నిర్మాణం జరగదు.


వీటితోపాటు గోత్రం మరికొన్ని లక్షణాలు కూడా కలిగి ఉంటుంది. అవి-

* టోటెమ్‌కు దగ్గరి సంబంధం కలిగి ఉండటం 

* బంధుత్వం అనే లక్షణం

* ప్రతి గోత్రానికి ఒక పేరు. భారత సమాజంలోని అన్ని ఆదిమ తెగల్లో గోత్ర సమూహాలున్నాయి.

* భిల్‌ తెగలో 24 గోత్రాలు. 

సంతాల్‌ తెగలో 100 గోత్రాలు.

ముండా తెగలో 50 గోత్రాలున్నాయి.

గోత్ర కూటమి: రెండు లేదా అంతకుమించిన గోత్రాల కలయికను గోత్ర కూటమి అంటారు.

ద్విశాఖ గోత్ర కూటమి: ఆదిమ తెగలోని సభ్యులు రెండు బంధు సమూహాలుగా ఏర్పడి ఉంటే ఆ సమూహాలను ద్విశాఖ సమూహాలు అంటారు. ఈ రకమైన ద్విశాఖ గోత్ర కూటమి తోడా తెగలో ఉంది. ఒకే గోత్రానికి చెందిన వారు వేర్వేరు ప్రాంతాల్లో నివసిస్తున్నప్పుడు ఆ సమూహాన్ని సిబ్‌ అంటారు. ఒక్క నివాసంలో తప్ప, మిగతా లక్షణాల్లో గోత్రానికి, సిబ్‌కు భేదం లేదు.

టోటెమ్‌-వివరణలు: ఆదిమ మానవుడు ప్రకృతిలో పుట్టి, ప్రకృతిలో పెరిగి, ప్రకృతిలోనే మరణించాడు. తన చుట్టూ ఆవహించి ఉన్న ప్రకృతి రహస్యాలను అవగాహన చేసుకోలేకపోయాడు. కురిసే వర్షాన్ని, అడవిని దహించివేసే అగ్నిని, ప్రకృతిలో ఉన్న పర్వతాలను, సముద్రాలను చూసి అవన్నీ ప్రకృతి శక్తులని భయపడ్డాడు. వాటికి సాగిలపడి పూజించడం మొదలుపెట్టాడు. ప్రకృతిలోని ప్రతి వస్తువు వెనుక అతీతమైన శక్తులు దాగి ఉన్నాయని విశ్వసించాడు. ఆదిమ తెగలో మతానికి కూడా విశిష్టమైన ప్రాధాన్యం ఉంది. టోటెమ్‌ భావన మతపరమైనది.


ఇ.ఏ. హోబెల్‌ అభిప్రాయంలో టోటెమ్‌ అంటే ఒక జంతువు లేదా వృక్షమై ఉండవచ్చు. ప్రకృతిలోని ఏ వస్తువైనా కావచ్చు. దాని వెనుక ఉన్న ప్రకృతి అతీతమైన శక్తి తమను కాపాడుతుందని విశ్వసించి, పూజించే వస్తువే టోటెమ్‌. ఆ టోటెమ్‌కు తమకు మధ్య భావోద్రేకపూరితమైన సంబంధం ఉందని నమ్ముతారు.


థర్‌స్టన్‌ అభిప్రాయం ప్రకారం భారత సమాజంలోని ఆదిమ తెగల టోటెమ్‌ పట్టికలో దాదాపుగా అన్ని రకాల జంతువులు, వృక్షాలు ఉన్నాయి. ప్రతి ఆదిమ తెగ టోటెమ్‌ అధారంగా అనేక భాగాలుగా విభజితమై ఉంటుంది. టోటెమ్‌ పుట్టుపూర్వోత్తరాలు ఏ విధంగా ఉన్నప్పటికీ ఒక్క భారతదేశంలోనే కాకుండా, ప్రపంచంలోని అన్ని దేశాల ఆదిమ తెగల్లో, వాటి మత వ్యవస్థల్లో టోటెమ్‌ ప్రముఖ భాగంగా కనిపిస్తోంది. 

బంధుత్వం - వివరణ:  ఆదిమ తెగ ప్రజలు కలిసి మెలిసి ఐకమత్యంతో జీవించడంలో బంధుత్వ వ్యవస్థ ఎంతగానో తోడ్పడుతుంది. ప్రతి సమాజ సంస్కృతిలో బంధువులను, బంధుత్వాన్ని గుర్తించేందుకు నిర్దిష్టమైన పదాలను వాడుతుంటారు. హిందూ సమాజంలో భార్య చెల్లిని మరదలు అని, భర్త తండ్రిని మామ అని వ్యవహరిస్తుంటారు. 


డబ్ల్యూ.ఆర్‌.హెచ్‌ రివర్స్, క్రామర్‌ల అభిప్రాయం ప్రకారం సామాజిక ప్రకార్యాలు నిర్వహించడాన్ని బట్టి ఒకరి నుంచి మరొకరిని వేరుగా అర్థం చేసుకోడానికి బంధుత్వంలోని పేర్లు ఉపయోగపడతాయి.


డిక్షన్రీ ఆఫ్‌ ఆంత్రోపాలజీ ప్రకారం బంధుత్వం అంటే సామాజికంగా వివిధ వ్యక్తుల మధ్య ఏర్పడిన సంబంధాలను గుర్తించడం ద్వారా నిర్మాణమైన ఒక వ్యవస్థ.


డాక్టర్‌ డి.ఎన్‌. మజుందార్‌ అభిప్రాయం ప్రకారం సమాజంలోని ప్రజలు కొన్ని బంధాల ఆధారంగా ఒకరితో ఒకరు సంబంధాలు పెట్టుకుంటారు. ఈ రకమైన బంధాలు ప్రత్యుత్పత్తి ద్వారా గాని, దగ్గర మానవ సంబంధాల ద్వారా గాని ఏర్పడి ఉంటే దాన్ని బంధుత్వం అనవచ్చు. పిల్లలు కావాలనే కోరిక రెండు బంధాలను ఏర్పరుస్తుంది. భర్త -భార్య అనుబంధం; రెండోది తండ్రి-తల్లి-సంతానం అనే బంధం.


 

- రచయిత: వట్టిపల్లి శంకర్‌రెడ్డి

 

 

Posted Date : 21-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌