• facebook
  • whatsapp
  • telegram

నిరుద్యోగం

     ఒక దేశ ప్రగతికి అవరోధంగా నిలిచే ప్రధాన సమస్యల్లో నిరుద్యోగం ఒకటి. చేయడానికి పని లేక.. ఉపాధి లేక.. అర్హతలుండి కొందరు, అర్హతల్లేక మరికొందరు నిరుద్యోగితను ఎదుర్కొంటున్నారు. మరెన్నో ఇతర సమస్యలను సృష్టించే ఈ నిరుద్యోగితకు కారణాలనేకం. భారతదేశంలోనూ నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. దీని మూలాలేంటి? ఈ సమస్యకు పరిష్కార మార్గాలేమిటి? మన దేశంలో ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలేవి? నిరుద్యోగితను అంచనా వేసే విధానం, కమిటీలు..

దేశ వర్తమాన, భవిష్యత్తు జీవనాల్ని ప్రభావితం చేసే సమస్యల్లో ప్రధానమైంది నిరుద్యోగం. పలు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో నిరుద్యోగ సమస్య తీవ్రరూపం దాల్చి అనేక కొత్త సమస్యలను సృష్టిస్తోంది. అందుకే నిరుద్యోగం అనేది 'సమస్యల సమస్య. సాధారణంగా పేదరికంతో నిరుద్యోగిత కలిసి ఉంటుంది. మన ప్రణాళికల్లో ఒకవైపు నిరుద్యోగితను తొలగించాలనే లక్ష్యం ఉన్నా.. మరోవైపు ప్రణాళికాయుగం ప్రారంభం నుంచీ ఈ సమస్య మన ఆర్థిక వ్యవస్థను వేధిస్తూనే ఉంది. వస్తుసేవల ఉత్పత్తికి ఇతర వనరులతోపాటు మానవ వనరుల అవసరం కూడా ఉంది. వీటిని పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకపోయినప్పుడు అంటే నిరుద్యోగిత ఉన్నప్పుడు ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక పరమైన సమస్యలే కాకుండా, కొన్ని సాంఘిక, రాజకీయపరమైన సమస్యలు కూడా తలెత్తుతాయి. నిరుద్యోగులు తమ జీవితాలను ఇబ్బందులతో.. అతి కనీస స్థాయిలో గడపాల్సి ఉంటుంది. అందువల్లే ప్రజల శ్రేయస్సు కోరే ఏ రాజ్యంలోనైనా నిరుద్యోగ నిర్మూలన అంశాన్ని ప్రధాన లక్ష్యంగా, తక్షణ కర్తవ్యంగా భావించాల్సి ఉంటుంది.

 

నిరుద్యోగిత-రకాలు
 

     నిరుద్యోగ సమస్య అన్ని దేశాల్లోనూ, అన్ని కాలాల్లోనూ ఒకేలా ఉండదు. అభివృద్ధి చెందిన దేశాల్లో నిరుద్యోగ సమస్య ఒక విధంగా ఉంటే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మరో విధంగా ఉంటుంది. కాబట్టి ఆర్థిక శాస్త్రవేత్తలు నిరుద్యోగితను వివిధ రకాలుగా విశ్లేషించారు. అభివృద్ధి చెందిన దేశాల్లో సంఘృష్ట, చక్రీయ నిరుద్యోగితలు.. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వ్యవస్థాపరమైన నిరుద్యోగిత, ప్రచ్ఛన్న నిరుద్యోగిత, అల్ప ఉద్యోగిత, రుతు సంబంధ నిరుద్యోగిత, సాంకేతిక నిరుద్యోగిత, విద్యావంతుల్లో నిరుద్యోగిత అనే రకాలున్నాయి.
 

సంఘృష్ట నిరుద్యోగిత (ఫ్రిక్షనల్ అనెంప్లాయిమెంట్)
 

* దీన్ని ఒరిపిడి నిరుద్యోగిత / ఒత్తిడి నిరుద్యోగితగా వ్యవహరిస్తారు.
* దేశంలోని శ్రామికులు ఒక వృత్తి నుంచి మరో వృత్తికి లేదా ఒక పరిశ్రమ నుంచి మరో పరిశ్రమకు లేదా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మారే కాలంలో ఏర్పడే నిరుద్యోగాన్ని సంఘృష్ట నిరుద్యోగం అంటారు.

 

చక్రీయ నిరుద్యోగిత (సైక్లికల్ అనెంప్లాయిమెంట్)
* అభివృద్ధి చెందిన దేశాల్లోని వ్యాపార కార్యకలాపాల్లో మందకొడితనం (ఆర్థిక మాంద్యం) వల్ల ఏర్పడేదే చక్రీయ నిరుద్యోగిత.
* ఆర్థిక వ్యవస్థలో మాంద్యం ఏర్పడినప్పుడు వస్తువులకు డిమాండ్ తగ్గి ఉద్యోగిత స్థాయి పడిపోతుంది. ఆర్థిక వ్యవస్థ కోలుకుని ఊర్థ్వస్థాయిలో ఉన్నప్పుడు ఉద్యోగావకాశాలు పుంజుకుంటాయి.
* చక్రీయ నిరుద్యోగిత తాత్కాలికమైంది. సార్థక డిమాండు పెరిగితే చక్రీయ నిరుద్యోగిత అదృశ్యమవుతుంది.

 

నిర్మాణాత్మక నిరుద్యోగిత (స్ట్రక్చరల్ అనెంప్లాయిమెంట్)
* దీన్ని వ్యవస్థాపూర్వక / శాశ్వత / దీర్ఘకాలిక / ప్రత్యక్ష / బహిర్గత / సాధారణ స్థితి నిరుద్యోగితలుగా వ్యవహరిస్తారు.
* ఆర్థిక వ్యవస్థలో శ్రామిక డిమాండ్ కంటే శ్రామిక సప్లయి అధికంగా ఉండటం వల్ల ఏర్పడే నిరుద్యోగాన్ని 'నిర్మాణాత్మక నిరుద్యోగిత' అంటారు.
* ఈ రకమైన నిరుద్యోగిత దీర్ఘకాలిక స్వభావాన్ని కలిగి ఉంటుంది.
* భారతదేశంలో నిర్మాణాత్మక నిరుద్యోగిత ఎక్కువగా ఉంది.
* మనదేశంలో మూలధన కొరత, సాంకేతిక విజ్ఞాన లోపం, మందకొడి వృద్ధిరేటు వల్ల శ్రామికులు పెరిగినంత వేగంగా ఉద్యోగావకాశాలు పెరగడం లేదు. దాంతో నిర్మాణాత్మక నిరుద్యోగిత ఏర్పడుతోంది.

 

రుతు సంబంధ నిరుద్యోగిత (సీజనల్ అనెంప్లాయిమెంట్)
* సంవత్సరంలో కొంతకాలం మాత్రమే పని ఉండి మిగతా కాలంలో పని లేకపోవడాన్ని లేదా కొన్ని రుతువుల్లో మాత్రమే పని ఉండి మరికొన్ని రుతువుల్లో పని లేకపోవడాన్ని రుతు సంబంధ నిరుద్యోగిత లేదా కాలిక నిరుద్యోగిత అంటారు.
ఉదా: భారతదేశంలో గ్రామీణ మెట్ట వ్యవసాయంపై ఆధారపడేవారు; చక్కెర, జనపనార పరిశ్రమల్లో పనిచేసేవారు.

 

ప్రచ్ఛన్న నిరుద్యోగిత (డిస్‌గైజ్డ్ అనెంప్లాయిమెంట్)
* ఏదైనా ఒక పనిలో అవసరానికి మించి అదనపు వ్యక్తులు పనిచేస్తున్నట్లయితే వారిని ప్రచ్ఛన్న నిరుద్యోగులుగా భావించవచ్చు.
* ఆర్థర్ లూయిస్ ప్రకారం ప్రచ్ఛన్న నిరుద్యోగుల ఉపాంత ఉత్పాదకత శూన్యం.
* అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని వ్యవసాయ రంగంలో ఈ రకమైన నిరుద్యోగిత అధికంగా ఉంటుంది.

 

అల్ప ఉద్యోగిత (అండర్ ఎంప్లాయిమెంట్)
* ఒక వ్యక్తి తన సామర్థ్యం లేదా నైపుణ్యం కంటే తక్కువ స్థాయి పనిచేస్తూ ఉండటాన్ని అల్ప ఉద్యోగిత అంటారు.
ఉదా: ఇంజినీరింగ్ చదివిన ఒక వ్యక్తి కార్యాలయంలో గుమాస్తాగా పనిచేయడం..

 

సాంకేతిక నిరుద్యోగిత (టెక్నికల్ అనెంప్లాయిమెంట్)
* ఆర్థిక వ్యవస్థలో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టడం వల్ల శ్రామికులను తొలగిస్తారు. ఫలితంగా ఏర్పడే నిరుద్యోగితను సాంకేతికపరమైన నిరుద్యోగిత అంటారు..

 

విద్యావంతుల్లో నిరుద్యోగిత
* విద్యాబోధనను సమకూర్చిన ప్రభుత్వాలు కొన్ని సందర్భాల్లో వారికి తగిన ఉద్యోగాలు కల్పించడంలో విఫలమవడం వల్ల ఈ రకమైన నిరుద్యోగిత ఏర్పడుతుంది.

 

కొలమానం
నిరుద్యోగితను పరిశీలించడానికి నియమించిన నిపుణుల కమిటీ సలహా మేరకు జాతీయ నమూనా సర్వే వ్యవస్థ (ఎన్ఎస్ఎస్‌వో) మన దేశ పరిస్థితులకు అనుగుణంగా నిరుద్యోగితను 3 విధాలుగా విభజించి అంచనా వేసింది.

 

1. సాధారణ స్థితి నిరుద్యోగిత
(యూజువల్ ప్రిన్సిపల్ స్టేటస్ - యుపీఎస్)
* సర్వే జరిపే సంవత్సరంలో కొద్ది రోజులు కూడా పని దొరకని వారిని ఈ విధమైన నిరుద్యోగులుగా పరిగణిస్తారు.
* సంవత్సరంలో ఏ కొద్ది రోజులు పనిలో ఉన్నా ఈ నిరుద్యోగిత కిందకు రారు.

 

2. వారంవారీ స్థితి నిరుద్యోగిత
(కరెంట్లీ వీక్లీ స్టేటస్ - సీడబ్ల్యూఎస్)
* సర్వే జరిపే వారంలో కనీసం ఒక గంట కూడా పని దొరకని నిరుద్యోగ స్థితి.

 

3. వర్తమాన రోజువారీ స్థితి నిరుద్యోగిత
(కరెంట్లీ డెయిలీ స్టేటస్ - సీడీఎస్)
* సర్వే జరిపే వారంలో మొత్తం శ్రమ దినాల్లో నిరుద్యోగిగా ఉన్న శ్రమ దినాల నిష్పత్తిని రోజువారీ స్థితి నిరుద్యోగిత తెలియజేస్తుంది. ఇందులో 8 గంటల పని కాలాన్ని ఒక శ్రమ దినంగా పరిగణిస్తారు.
* ప్రస్తుతం భారతదేశంలో రోజువారీ స్థితి నిరుద్యోగిత పద్ధతిని(సీడీఎస్) అనుసరించి నిరుద్యోగిత రేటు అంచనా వేస్తున్నారు.

 

భారతదేశంలో అంచనా
 

* భారతదేశంలో నిరుద్యోగాన్ని అధికారికంగా అంచనా వేసే సంస్థ - జాతీయ నమూనా సర్వే వ్యవస్థ (ఎన్ఎస్ఎస్‌వో)
* ఎన్ఎస్ఎస్‌వో అంచనాలను ధ్రువీకరించి ప్రకటించే సంస్థ - నీతి ఆయోగ్ (ప్రణాళిక సంఘం).

 

నిరుద్యోగితపై భగవతి కమిటీ
 

* నిరుద్యోగ సమస్యను పరిశీలించడానికి 1971లో బి.భగవతి అధ్యక్షతన నిపుణల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ అంచనాల ప్రకారం 1973లో నిరుద్యోగుల సంఖ్య 18.7 మిలియన్లు. వీరిలో గ్రామీణ ప్రాంతాల్లో 16.1 మిలియన్లు, పట్టణ ప్రాంతాల్లో 2.6 మిలియన్ల మంది నిరుద్యోగులున్నారు.
* 1973లో మొత్తం శ్రామిక శక్తిలో నిరుద్యోగిత శాతం 10.4. ఇందులో 10.9 శాతం గ్రామీణ ప్రాంతాల్లో, 8.1 శాతం పట్టణ ప్రాంతాల్లో ఉంది.
పట్టిక - 1లో 1983 నుంచి 2011-2012 మధ్య నిరుద్యోగుల సంఖ్య, నిరుద్యోగిత రేట్లు పరిశీలిస్తే.. సంస్కరణలకు (1993-94) ముందు నిరుద్యోగిత తగ్గుముఖం పట్టగా, సంస్కరణల తర్వాత క్రమంగా పెరిగి 2009-10 నుంచి తిరిగి తగ్గుతున్న ధోరణి కనిపిస్తుంది.

 
పట్టిక-2ను పరిశీలిస్తే గ్రామీణ, పట్టణ ప్రాంతాలు రెండింటిలోనూ పురుషుల నిరుద్యోగిత కంటే స్త్రీల నిరుద్యోగిత ఎక్కువగా తెలుస్తుంది.
 

 

12వ ప్రణాళికలో శ్రామికశక్తి అంచనాలు
 

15 సంవత్సరాలు అంతకు పైబడిన వయో వర్గానికి సంబంధించి 12వ ప్రణాళికలో శ్రామికశక్తికి (లేబర్ ఫోర్స్) అదనంగా 24.5 మిలియన్ల మంది తోడు కాగలరని అంచనా వేశారు. 2011లో మొత్తం శ్రామికశక్తి 477.9 మిలియన్లు కాగా, ఇది 2016-17 నాటికి 502.4 మిలియన్లకు పెరుగుతుందని అంచనా.
 

ప్రభుత్వ పథకాలు
 

నిరుద్యోగిత, పేదరికం అనేవి ఒకదానికొకటి సంబంధం ఉన్న సమస్యలు. వీటిని నిర్మూలించడానికి ప్రభుత్వం 1970వ దశకం నుంచి ఎమ్ఎఫ్ఏఎల్ఏ (1973-74), ఎస్ఎఫ్‌డీఏ (1974-75), ఐఆర్‌డీపీ (1978-79), ఎన్ఆర్ఈపీ (1980), ఆర్ఎల్ఈజీపీ (1983), జేఆర్‌వై (1989), జేజీఎస్‌వై (1999), ఎస్‌జేజీఎస్‌వై (1999), బీఎన్‌వై (2005), ఎమ్‌జీఎన్ఆర్ఈజీఎస్ (2006) లాంటి ఎన్నో పథకాల ద్వారా ప్రత్యక్ష చర్యలను చేపట్టింది.
 

'ఉపాధి' హామీ పథకం
 

గతంలో ఉన్న జాతీయ పనికి ఆహార పథకం (ఎన్ఎఫ్ఎఫ్‌డబ్ల్యూపీ), సంపూర్ణ గ్రామీణ రోజ్‌గార్ యోజన (ఎస్‌జీఆర్‌వై) పథకాలను విలీనం చేస్తూ యూపీఏ ప్రభుత్వం 2005, సెప్టెంబరు 7న ఎన్ఆర్ఈజీఎస్ చట్టాన్ని తీసుకువచ్చింది. ఫలితంగా 2006, ఫిబ్రవరి 2 నుంచి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమల్లోకి వచ్చింది. ప్రథమంగా దేశంలో ఎంపిక చేసిన 200 జిల్లాల్లో ప్రవేశపెట్టారు. 2008 ఏప్రిల్ నుంచి దేశంలోని అన్ని జిల్లాలకు విస్తరించారు. పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పడి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 2009లో గాంధీ జయంతి రోజున ఈ పథకానికి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంగా నామకరణం చేశారు. ఈ పథకం లబ్దిదారులకు ఎలాంటి నైపుణ్యం అవసరం లేదు. రోడ్లు, కాలువలు, చెరువుల నిర్మాణం లాంటి పనుల్లో ఉపాధి కల్పిస్తారు. కనీసం 100 రోజుల వేతన ఉపాధిని కల్పించడం ద్వారా గ్రామీణ సామాజిక ఆస్తులను వృద్ధి చేస్తారు. 2013-14లో ఈ పథకానికి రూ. 33 వేల కోట్లు ఖర్చు చేసి 4.78 కోట్ల కుటుంబాలకు 219.72 కోట్ల వ్యక్తిగత పని దినాలు కల్పించారు.
 

నిరుద్యోగానికి కారణాలు
 

* శ్రామిక జనాభా పెరుగుదలకు అనుగుణంగా ఉపాధి అవకాశాలు పెరగకపోవడం
* వ్యవసాయరంగంపై అధికంగా ఆధారపడటం
* ఉపాధిరహిత వృద్ధి
* లోపభూయిష్టమైన విద్యా విధానం
* మూలధన సాంద్రత, ఉత్పత్తి పద్ధతులకు ప్రాధాన్యం పెరగడం
* వివిధ రంగాల మధ్య శ్రామికుల గమనశీలత తక్కువగా ఉండటం
* మానవశక్తి ప్రణాళిక లేకపోవడం
* నూతన ఆర్థిక సరళీకరణ విధాన ప్రభావం
* నైపుణ్యాలను పెంచే శిక్షణ లేకపోవడం.

 

పరిష్కార మార్గాలు
 

* వ్యవసాయ పునర్‌వ్యవస్థీకరణ
* జనాభాను నియంత్రించడం
* శ్రమ సాంద్రత ఉత్పత్తి పద్ధతులను ఎక్కువగా అవలంబించడం
* నైపుణ్యాలను పెంచే విద్యకు ప్రాధాన్యం ఇవ్వడం.
* పారిశ్రామిక వికేంద్రీకరణ, వేగవంతమైన పారిశ్రామికాభివృద్ధి.
* వేతన ఉపాధి పథకాల ద్వారా కమ్యూనిటీ ఆస్తుల కల్పన
* గ్రామీణాభివృద్ధికి అబ్దుల్ కలాం 'పూరా నమూనా'ను అనుసరించడం
* స్వయం ఉపాధి పథకాలు చేపట్టే విధంగా యువతను ప్రోత్సహించడం
* ఉపాధి హామీ పథకం లాంటి కొన్ని ప్రత్యక్ష చర్యల ద్వారా ఉపాధిని కల్పించడం

 

నిరుద్యోగం - ముఖ్య భావనలు
 

1. శ్రామిక వర్గం (లేబర్ ఫోర్స్):
జనాభాలో 15-59 సంవత్సరాల మధ్య వయసు వారిని శ్రామిక వర్గం అంటారు.

 

2. శ్రామిక జనాభా లేదా శ్రామికులు (వర్క్ ఫోర్స్):
జనాభాలో 15-59 సంవత్సరాల మధ్య వయసువారిలో వాస్తవంగా పనిచేస్తున్న వారిని శ్రామికులు లేదా శ్రామిక జనాభా అంటారు.

 

3. ప్రధాన శ్రామికులు:
ఒక సంవత్సర కాలంలో 6 నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఉత్పాదక పనిలో నిమగ్నమైనవారు.

 

4. ఉపాంత శ్రామికులు:
సంవత్సరంలో 6 నెలల కంటే తక్కువ కాలం ఉత్పాదక పనిలో నిమగ్నమైనవారు.

 

5. నిరుద్యోగుల సంఖ్య = శ్రామిక వర్గం (లేబర్ ఫోర్స్) - శ్రామికులు (వర్క్ ఫోర్స్)
 

6. నిరుద్యోగిత రేటు = నిరుద్యోగుల సంఖ్య / శ్రామిక వర్గం x 100
 

7. ప్రామాణిక సంవత్సర ఉద్యోగి (స్టాండర్డ్ పర్సన్ ఇయర్):
ఒక వ్యక్తి రోజుకు 8 గంటలు లేదా సంవత్సరంలో 273 రోజులు పనిచేస్తే అతడిని ప్రామాణిక సంవత్సర ఉద్యోగిగా పరిగణిస్తారు.

 

8. ఫిలిప్స్ రేఖ:
ద్రవ్యోల్బణానికి, నిరుద్యోగితకు మధ్య విలోమ సంబంధం ఉంటుందని ఇది తెలుపుతుంది.

Posted Date : 02-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌