• facebook
  • whatsapp
  • telegram

ఐక్యరాజ్య సమితి

రెండో ప్రపంచయుద్ధం తర్వాత 1945, అక్టోబరు 24న ‘ఐక్యరాజ్యసమితి’  (United Nations Organisation) ఏర్పడింది. ఏటా ఇదే రోజున ఐక్యరాజ్యసమితి ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచశాంతి పరిరక్షణ, అంతర్జాతీయ సహకారం, ప్రపంచ దేశాల మధ్య సమన్వయం, వివిధ సమస్యలను శాంతియుతంగా, చర్చల ద్వారా పరిష్కరించుకోవడం దీని ప్రధాన లక్ష్యాలు. 


నేపథ్యం
* ఐక్యరాజ్యసమితి ఏర్పాటుకు ‘అట్లాంటిక్‌ చార్టర్‌’ కారణం. దీనిపై 1941, ఆగస్టు 14న అప్పటి బ్రిటన్‌ ప్రధాని విన్‌స్టన్‌ చర్చిల్, అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్‌ డి.రూజ్‌వెల్ట్‌ సంతకాలు చేశారు.
* యునైటెడ్‌ నేషన్స్‌ అనే పదాన్ని 1942లో ఫ్రాంక్లిన్‌ డి.రూజ్‌వెల్ట్‌ సూచించారు.
* 1944లో ‘డంబర్టన్‌ ఓక్స్‌’ వద్ద జరిగిన సమావేశంలో అమెరికా, బ్రిటన్, రష్యా, చైనా దేశాల ప్రతినిధులు విస్తృత సంప్రదింపులు జరిపిన అనంతరం ‘ఐక్యరాజ్యసమితి’ అనే అంతర్జాతీయ సంస్థను నెలకొల్పాలని నిర్ణయించారు.
* 1945, జూన్‌ 26న శాన్‌ఫ్రాన్సిస్కోలో 50 దేశాలు సమావేశమై ఐక్యరాజ్యసమితి చార్టర్‌ను రూపొందించి, సంతకాలు చేశాయి. ఇందులో పోలెండ్‌ పాల్గొన లేదు. తర్వాత చార్టర్‌పై సంతకం చేసి, 51వ సభ్యదేశంగా చేరింది. భారత్‌ 1945 నుంచి ఇందులో సభ్యదేశంగా కొనసాగుతోంది.
* ఐక్యరాజ్యసమితిలో స్విట్జర్లాండ్ (190); తూర్పు తైమూర్‌ (191) వ సభ్యదేశంగా  చేరాయి. 2006, జూన్‌ 28న మాంటెనిగ్రో (192); 2011, జులై 9న దక్షిణ సూడాన్‌ 193వ సభ్యదేశంగా చేరాయి. 
* ఐక్యరాజ్యసమితిలో వాటికన్‌ సిటీ, తైవాన్‌లకు సభ్యత్వం లేదు.
* ఐక్యరాజ్యసమితి సాధారణ సభ  (General Assembly) తొలి సమావేశం 1946, జనవరి 10న లండన్‌లో జరిగింది.
* ఐక్యరాజ్యసమితి రాజ్యాంగంలోని ప్రవేశిక ముసాయిదాను దక్షిణాఫ్రికా దేశానికి చెందిన జాన్‌ క్రిస్టియాన్‌ రూపొందించారు.
* ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం  అమెరికాలోని న్యూయార్క్‌లో ఉంది. దీని  నిర్మాణానికి అవసరమైన భూమిని జాన్‌.డి.రాక్‌ఫెల్లర్‌ సమకూర్చారు.
* ఐక్యరాజ్యసమితి అధికార భాషలు ఇంగ్లిష్, ఫ్రెంచ్, రష్యన్, అరబిక్, స్పానిష్, చైనీస్‌.


జెండా
* ఐక్యరాజ్యసమితి జెండాను 1947, అక్టోబరు 20న సాధారణ సభ ఆమోదించింది.  జెండా వెనుకభాగం మొత్తం లేత నీలంరంగులో ఉండి, దానిపై తెల్లరంగు గ్లోబు ఉంటుంది. గ్లోబుకు రెండువైపులా శాంతికి చిహ్నమైన రెండు ఆలివ్‌కొమ్మలు ఉంటాయి. జెండా పొడవు, వెడల్పుల నిష్పత్తి 3 : 2.
* 2001లో ఐక్యరాజ్యసమితికి, దాని సెక్రటరీ జనరల్‌ కోఫీ అన్నన్‌కు నోబెల్‌ శాంతి బహుమతి లభించింది.


ప్రధాన అంగాలు
ఐక్యరాజ్యసమితిలో ప్రధాన అంగాలు 6. అవి:
1) సాధారణ సభ    2) భద్రతా మండలి 
3) ఆర్థిక, సామాజిక మండలి 
4) ధర్మకర్తృత్వ మండలి 
5) అంతర్జాతీయ న్యాయస్థానం 
6) సచివాలయం


సాధారణ సభ: ఐక్యరాజ్యసమితిలోని సభ్యదేశాలన్నీ సాధారణ సభలో సభ్యదేశాలుగా కొనసాగుతున్నాయి. ప్రతి సభ్యదేశం ఈ సభకు అయిదుగురు ప్రతినిధులను పంపుతుంది. కానీ తీర్మానాలపై ఓటింగ్‌ సమయంలో దేశానికి ఒకే ఓటు ఉంటుంది. సాధారణ సభ సమావేశాలు ఏటా సెప్టెంబరు మూడో మంగళవారం ప్రారంభమవుతాయి. భద్రతామండలి సిఫార్సుల మేరకు  సాధారణ సభ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేస్తారు. దీని అధ్యక్ష, ఉపాధ్యక్షుల పదవీకాలం ఒక సంవత్సరం. 
* సాధారణ సభకు అధ్యక్షురాలిగా వ్యవహరించిన తొలి భారతీయ మహిళ విజయలక్ష్మి పండిట్‌. ఈ సభలో ఏదైనా కీలక తీర్మానం ఆమోదం పొందాలంటే 2/3 వంతు ప్రత్యేక మెజారిటీ అవసరం.


సాధారణ సభ - అధికారాలు, విధులు
* యూఎన్‌ఓ చార్టర్‌లోని అన్ని అంశాలను చర్చించడం, బడ్జెట్‌ను ఆమోదించడం.
* యూఎన్‌ఓలో నూతన సభ్యదేశాలను చేర్చుకోవడం.
* యూఎన్‌ఓ ద్వారా ఏర్పాటైన వివిధ కమిటీలు ఇచ్చే నివేదికలను పరిశీలించి, వాటిని ఆమోదించడం.
* ప్రపంచ సమస్యలపై వచ్చే ఫిర్యాదులను పరిశీలించి, పరిష్కరించడం.
* అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తుల నియామకానికి సిఫార్సులు చేయడం.
* భద్రతామండలికి తాత్కాలిక సభ్యదేశాలను ఎన్నుకోవడం.
* ప్రపంచ పార్లమెంట్‌గా వ్యవహరించడం.


భద్రతామండలి (Security Council): 
భద్రతామండలిలో మొత్తం 15 సభ్య దేశాలుంటాయి. వీటిలో శాశ్వత సభ్యదేశాలు అయిదు. అవి: అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా. ఈ దేశాలకు వీటో అధికారం ఉంటుంది. మిగిలిన 10 తాత్కాలిక సభ్యదేశాలు. వీటిని రెండేళ్ల పదవీకాలానికి 2/3 ప్రత్యేక మెజార్టీతో   సాధారణ సభ ఎన్నుకుంటుంది.
* తాత్కాలిక సభ్యదేశాల్లో ఆసియా, ఆఫ్రికా నుంచి అయిదు, లాటిన్‌ అమెరికా నుంచి రెండు, పశ్చిమ యూరప్‌ నుంచి రెండు, తూర్పు యూరప్‌ నుంచి ఒక దేశాన్ని ఎంపిక చేస్తారు. ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకు సమాన ప్రాతినిధ్యం కల్పిస్తారు.
* భద్రతామండలి అధ్యక్ష పదవిని సభ్యదేశాలు ఆంగ్లవర్ణమాల ప్రకారం రొటేషన్‌ పద్ధతిలో నెలకోసారి నిర్వహిస్తాయి.
* 1988లో భద్రతామండలికి నోబెల్‌ శాంతి బహుమతి లభించింది.
* భారతదేశం భద్రతామండలిలో 1951, 1967, 1972, 1977, 1984, 1991, 2011, 2021లో తాత్కాలిక సభ్యదేశంగా ఎన్నికైంది.


ఆర్థిక, సామాజిక మండలి  (Economic and Social Council): ఇందులోని సభ్యదేశాలు 54. వీటిని సాధారణ సభ 2/3వ వంతు ప్రత్యేక మెజారిటీతో ఎన్నుకుంటుంది. వీటి పదవీకాలం మూడేళ్లు. ఏటా 1/3వ వంతు సభ్య దేశాలు పదవీ విరమణ చేస్తాయి.
* ఆర్థిక, సామాజిక మండలి సంవత్సరానికి కనీసం మూడుసార్లు సమావేశాన్ని నిర్వహిస్తుంది. ఇవి న్యూయార్క్, జెనీవా నగరాల్లో జరుగుతాయి.
* ఈ మండలి పేదరికం, నిరక్షరాస్యత నిర్మూలన; అంతర్జాతీయ ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, విద్య, ఆరోగ్య వ్యవహారాలకు  సంబంధించి సాధారణసభకు బాధ్యత వహిస్తుంది.
* ఆర్థిక, సామాజిక మండలి తన కార్యకలాపాల నిర్వహణకు కొన్ని ప్రాంతీయ కమిషన్లను ఏర్పాటు చేసింది. అవి:
* జెనీవా ప్రధాన కార్యాలయంగా యూరప్‌ ఆర్థిక కమిషన్‌  (ECF). 
* బ్యాంకాక్‌ ప్రధాన కార్యాలయంగా ఆసియా, పసిఫిక్‌ దేశాల ఆర్థిక, సామాజిక కమిషన్‌ (ESCAP).
* శాంటియాగో (చిలీ) ప్రధాన కార్యాలయంగా లాటిన్‌ అమెరికా, కరేబియన్‌ దేశాల ఆర్థిక కమిషన్‌  (ECLAC). 
*  అడీస్‌ అబాబా (ఇథియోపియా) ప్రధాన కార్యాలయంగా ఆఫ్రికా ఆర్థిక కమిషన్‌ (ECA). 
* అమ్మాన్‌ (జోర్డాన్‌) ప్రధాన కార్యాలయంగా పశ్చిమాసియా ఆర్థిక సామాజిక కమిషన్‌ (ESCWA). 


ధర్మకర్తృత్వ మండలి (Trusteeship Council): 
* ఇతర దేశాల పాలన కింద కొనసాగే భూభాగాల ప్రయోజనాలను పరిరక్షించే ఉద్దేశంతో ఈ మండలిని ఏర్పాటు చేశారు. సంబంధిత భూభాగాలకు స్వాతంత్య్రం కల్పించడం లేదా వాటిని స్వపరిపాలనకు సిద్ధం చేసేందుకు ఇది కృషి చేస్తుంది. 1994 నాటికి దీని పర్యవేక్షణలోని సుమారు 11 భూభాగాలు స్వతంత్రంగా మారాయి లేదా ఏదో ఒక స్వతంత్ర దేశంలో విలీనమయ్యాయి. దీని ఫలితంగా ప్రస్తుతం ఈ మండలి నామమాత్రంగా మిగిలింది. ఇందులో ఎలాంటి సమావేశాలు జరగడం లేదు.


అంతర్జాతీయ న్యాయస్థానం  (International court of Justice): 
* ఐక్యరాజ్యసమితి చార్టర్‌ను అనుసరించి 1945లో అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఏర్పాటు చేశారు. దీని ప్రధాన కార్యాలయం ది హేగ్‌ (నెదర్లాండ్స్‌)లో ఉంది. ఈ న్యాయస్థానంలో  15 మంది న్యాయమూర్తులు ఉంటారు. వీరి పదవీకాలం తొమ్మిదేళ్లు. న్యాయమూర్తులను సాధారణ సభ, భద్రతామండలి ఎన్నుకుంటాయి. ప్రతి మూడేళ్లకోసారి 1/3వ వంతు న్యాయమూర్తులు పదవీ విరమణ చేస్తారు. అంతర్జాతీయ న్యాయస్థానం అధ్యక్ష, ఉపాధ్యక్షులను మూడేళ్ల పదవీకాలానికి ఎన్నుకుంటారు.
* అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తి పదవి చేపట్టిన భారతీయులు నలుగురు.
1) బెనగళ్‌ నరసింగరావు       2) కె.నాగేంద్రసింగ్‌
3) రఘునందన్‌ స్వరూప్‌ పాఠక్‌ 
4) దల్వీర్‌ భండారీ (ప్రస్తుతం కొనసాగుతున్నారు.)
* అంతర్జాతీయ న్యాయస్థానానికి తొలి మహిళా అధ్యక్షురాలు: రోజాలిన్‌ హిగ్గిన్స్‌ (బ్రిటన్‌).
* అంతర్జాతీయ న్యాయస్థానానికి భారత్‌కు చెందిన కె.నాగేంద్రసింగ్‌ అధ్యక్షులుగా, రఘునందన్‌ స్వరూప్‌ పాఠక్‌ ఉపాధ్యక్షులుగా వ్యవహరించారు.
* అంతర్జాతీయ న్యాయస్థాన అధికారిక భాషలు: ఇంగ్లిష్, ఫ్రెంచ్‌
* ప్రపంచంలోని వివిధ దేశాల మధ్య తలెత్తే న్యాయ సంబంధ సమస్యలను విచారించి, అంతర్జాతీయ న్యాయస్థానం కీలక తీర్పులు ఇస్తుంది. ఈ తీర్పులను అంతిమంగా పరిగణిస్తారు. వీటిపై అప్పీలు చేసుకునే అవకాశం ఉండదు. అయితే కొన్ని ప్రత్యేకాంశాల విషయంలో తీర్పు వచ్చిన పదేళ్లలోపు పునఃపరిశీలనకు నివేదించవచ్చు.


సచివాలయం  (Secretariat):
* ఇది ఐక్యరాజ్యసమితి పాలనా కేంద్రం. సెక్రటరీ జనరల్‌ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. సచివాలయానికి ముఖ్య కార్యనిర్వాహకులు సెక్రటరీ జనరల్‌. వీరి పదవీకాలం అయిదు సంవత్సరాలు. భద్రతామండలి సిఫార్సుల మేరకు సాధారణ సభ సెక్రటరీ జనరల్‌ను నియమిస్తుంది.


డిప్యూటీ సెక్రటరీ జనరల్‌:  యూఎన్‌ఓ డిప్యూటీ సెక్రటరీ జనరల్‌ పదవిని 1998లో ఏర్పాటు చేశారు. తొలి డిప్యూటీ సెక్రటరీ జనరల్‌గా కెనడా దేశానికి చెందిన లూయిస్‌ ప్రిచెట్టి ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఈ పదవిలో నైజీరియా దేశానికి చెందిన అమీనా జె మహ్మద్‌ కొనసాగుతున్నారు.


సెక్రటరీ జనరల్స్‌

పేరు దేశం పదవీకాలం
1. ట్రిగ్వేలి నార్వే 1946 - 1953
2. దాగ్‌ హమ్మర్‌షీల్డ్‌ స్వీడన్‌ 1953 - 1961
3. యుథాంట్ మయన్మార్ 1961 - 1971
4. కుర్దు వాల్దీమ్‌ ఆస్ట్రియా 1972 - 1982
5. జేవియర్‌ పెరేజ్‌ డిక్యులర్ పెరూ 1982 - 1992
6. బౌత్రోస్ ఘలీ ఈజిప్ట్‌ 1992 - 1997
7. కోఫీ అన్నన్‌ ఘనా 1997 - 2007
8. బాన్‌కీ మూన్‌ దక్షిణ కొరియా 2007 - 2017
9. ఆంటోనియో గుటెరస్‌ పోర్చుగల్ 2017 నుంచి కొనసాగుతున్నారు.

 

ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థలు
ప్రపంచశాంతి, ప్రగతి సాధన కోసం వివిధ దేశాల్లోని ఆయా అంశాలను సమన్వయం చేసేందుకు ఐక్యరాజ్యసమితి అనేక అనుబంధ సంస్థలను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలను నిర్దిష్ట ప్రణాళికలతో పరిష్కరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.


ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ బాలల నిధి (United Nations International Children’s Fund - UNICEF) 
రెండో ప్రపంచయుద్ధం తర్వాత బాలలకు అన్ని రకాలుగా సహకరించే లక్ష్యంతో 1946లో ‘ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి’ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దీన్ని ‘ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ బాలల నిధి’గా పిలుస్తున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని బాలల సమగ్రాభివృద్ధికి ఇది కృషి చేస్తోంది. అనేక వర్థమాన దేశాల్లో బాలల ఆరోగ్య సంరక్షణ, పోషకాహారం అందించడం, రోగ నియంత్రణ లాంటి కార్యక్రమాలను చేపడుతోంది. బాలలను ఎదుగుతున్న పౌర సమాజంగా అభివృద్ధి చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాలల స్థితిగతులపై యునిసెఫ్‌ ఏటా ఒక నివేదికను ప్రచురిస్తుంది. దీనికి 1965లో నోబెల్‌ శాంతి బహుమతి లభించింది. దీని ప్రధాన కార్యాలయం న్యూయార్క్‌లో ఉంది.


ఐక్యరాజ్యసమితి విద్యా, వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ  (United Nations Educational Scientific and Cultural Organisation - UNESCO) 
యునైటెడ్‌ కింగ్‌డమ్, ఫ్రాన్స్‌ దేశాలు విద్యా, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థను స్థాపించేందుకు 1945లో సమావేశమయ్యాయి. దీని ఫలితంగా 1946, నవంబరు 4న యునెస్కో ఏర్పడింది.  దీన్ని 1946, డిసెంబరులో ఐక్యరాజ్యసమితి ప్రత్యేక సంస్థగా గుర్తించింది. యునెస్కో విద్యా, సైన్స్, సమాచార ప్రసారాలు, సాంస్కృతిక రంగాల్లో సహకరించడం ద్వారా అంతర్జాతీయ సమన్వయాన్ని సాధించి, ప్రపంచ శాంతికి కృషిచేస్తోంది. ఇది మేధోపరమైన సహకారాన్ని పెంపొందించేందుకు అనేక ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలకు ఆర్థిక సహకారాన్ని అందిస్తోంది.

* అందరికీ ప్రాథమిక విద్యను అందించడం; ప్రాథమిక విద్యా వ్యాప్తికి చేసే సాయాన్ని విస్తరించడం, ప్రాథమిక విద్యా ప్రమాణాలను విస్తరించడం, పెంపొందించడం; 21వ శతాబ్దానికి సార్వజనీన విద్యను సాధించడం యునెస్కో లక్ష్యాలు.
* అంతర్జాతీయ విద్యా ప్రణాళిక సంస్థ (IIEP), అంతర్జాతీయ విద్యా బ్యూరో  (IBE) , యునెస్కో పరిధిలో విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నాయి. శిక్షణ, పరిశోధనా రంగాల అభివృద్ధి కోసం 1963లో పారిస్‌ కేంద్రంగా ఐఐఈపీ ఏర్పడింది. ఐబీఈ 1969లో యునెస్కోలో అంతర్భాగమైంది.
* శాస్త్ర, సాంకేతిక రంగాల్లో సహకారం అందించేందుకు యునెస్కో కైరో, జకార్తా, నైరోబీ, వెనిస్, న్యూదిల్లీలో తన కార్యాలయాలను ఏర్పాటు చేసింది. దీని ప్రధాన కార్యాలయం ఫ్రాన్స్‌లోని పారిస్‌లో ఉంది.
* యునెస్కోలో జనరల్‌ కాన్ఫరెన్స్, ఎగ్జిక్యూటివ్‌ బోర్డులు కీలకమైనవి. ఎగ్జిక్యూటివ్‌ బోర్డులోకి 58 దేశాలను 4 సంవత్సరాల పదవీ కాలానికి జనరల్‌ కాన్ఫరెన్స్‌  ఎన్నుకుంటుంది. జనరల్‌ కాన్ఫరెన్స్‌లో యూఎన్‌ఓలోని సభ్యదేశాలన్నీ సభ్యులుగా ఉంటాయి.

 

ఐక్యరాజ్యసమితి పారిశ్రామిక అభివృద్ధి సంస్థ (United Nations Industrial Development Organisation - UNIDO) 
పారిశ్రామిక, అభివృద్ధి రంగాల్లో యూఎన్‌ఓ కార్యక్రమాలను సమన్వయపరచి, సమీక్షించడానికి 1967, జనవరి నుంచి యూఎన్‌ఐడీఓ తన పనిని ప్రారంభించింది. ఈ సంస్థ 1985లో యూఎన్‌ఓ ప్రత్యేక అనుబంధ సంస్థగా గుర్తింపు పొందింది.
* యూఎన్‌ఐడీఓలో జనరల్‌ కాన్ఫరెన్స్, ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు “ (IDB) ప్రోగ్రాం అండ్‌ బడ్జెట్‌ కమిటీ  (PBC), సెక్రటేరియట్‌ ప్రధానమైన విభాగాలు.  జనరల్‌ కాన్ఫరెన్స్‌ ఈ సంస్థ విధివిధానాలను నిర్ణయిస్తుంది. 
* దీనికి ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు విధానాలను సమీక్షించే అధికారం ఉంది. దీనిలో 53 దేశాలు సభ్యులుగా ఉంటాయి.  వీటిలో అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి 33, అభివృద్ధి చెందిన మార్కెట్‌ ఆర్థిక వ్యవస్థ ఉన్న దేశాల నుంచి 15, ఈశాన్య యూరప్‌ దేశాల నుంచి 5 ఎన్నికవుతాయి. ఈ దేశాలను నాలుగేళ్ల పదవీ కాలానికి జనరల్‌ కాన్ఫరెన్స్‌ ఎన్నుకుంటుంది.
* ప్రోగ్రాం అండ్‌ బడ్జెట్‌ కమిటీలో 27 సభ్యదేశాలు జనరల్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా రెండేళ్ల పదవీకాలానికి ఎన్నికవుతాయి.
* యూఎన్‌ఐడీఓ ప్రధాన కార్యాలయం వియన్నా (ఆస్ట్రియా)లో ఉంది.

 

ఆహార వ్యవసాయ సంస్థ  (Food and Agriculture Organisation - FAO) 
* 1946, డిసెంబరు 14 నుంచి ఆహార వ్యవసాయ సంస్థ  (FAO) ఐక్యరాజ్యసమితి ప్రత్యేక అనుబంధ సంస్థగా గుర్తింపు పొందింది. వివిధ దేశాల్లో పౌష్టికాహారం, ప్రజల జీవన ప్రమాణాల స్థాయులను పెంచడం; అన్ని రకాల  వ్యవసాయ, ఆహార ఉత్పత్తుల దిగుబడులను, పంపిణీ రంగాలను అభివృద్ధి పరచడం; గ్రామీణ ప్రజల జీవన పరిస్థితులను మెరుగుపరచడం ద్వారా ప్రపంచ ఆర్థికాభివృద్ధికి ఎఫ్‌ఏఓ కృషి చేస్తోంది.
* ఇందులో జనరల్‌ కాన్ఫరెన్స్, కౌన్సిల్, సెక్రటేరియట్‌ అనే విభాగాలు ఉంటాయి. జనరల్‌ కాన్ఫరెన్స్‌లో సభ్యదేశాల ప్రతినిధులు ఉంటారు. ఇది రెండేళ్లకోసారి సమావేశమవుతుంది. కొత్త దేశాలను జనరల్‌ కాన్ఫరెన్స్‌ 2/3వ వంతు మెజార్టీతో ఆమోదిస్తే ఎఫ్‌ఏఓలో సభ్యత్వం లభిస్తుంది.
* ఎఫ్‌ఏఓ కౌన్సిల్‌లో 49 మంది సభ్యులుంటారు. వీరిని మూడేళ్ల పదవీకాలానికి జనరల్‌ కాన్ఫరెన్స్‌ ఎన్నుకుంటుంది. దీని ప్రధాన కార్యాలయం రోమ్‌ (ఇటలీ)లో ఉంది. 

 

ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organisation - WHO) 
* ప్రపంచ ఆరోగ్య సంస్థ  (WHO) 1947, నవంబరు 15 నుంచి ఐక్యరాజ్యసమితి ప్రత్యేక సంస్థగా గుర్తింపు పొందింది. అన్నివర్గాల ప్రజలకు అత్యుత్తమ ఆరోగ్య సదుపాయాలు కల్పించడం దీని లక్ష్యం. మశూచి (స్మాల్‌పాక్స్‌) నిర్మూలనలో ఈ సంస్థ కీలకపాత్ర పోషించింది.
* హెచ్‌ఐవీ/ ఎయిడ్స్‌పై ఐక్యరాజ్యసమితి ఉమ్మడి కార్యక్రమం 1996లో ప్రారంభమైంది. గుండెపోటు, క్షయ, ఎయిడ్స్, డయేరియా, క్యాన్సర్‌ మొదలైన ప్రాణాంతక వ్యాధుల నియంత్రణకు విశేష కృషి జరిగింది.
* ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన కార్యాలయం జెనీవా (స్విట్జర్లాండ్‌)లో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్‌ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం; మే 31న పొగాకు వ్యతిరేక దినోత్సవం; డిసెంబరు 1న ఎయిడ్స్‌ వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.


WHO ప్రాంతీయ కార్యాలయాలు:
* ఆగ్నేయాసియా - న్యూదిల్లీ (ఇండియా)
* ఈశాన్య మధ్యధరా ప్రాంతాలు- అలెగ్జాండ్రియా (ఈజిప్ట్‌)
* పశ్చిమ పసిఫిక్‌ ప్రాంతం - మనీలా (ఫిలిప్పీన్స్‌)
* అమెరికా - వాషింగ్టన్, డి.సి.
* ఆఫ్రికా - బ్రజెవిల్లే (కాంగో)
* యూరప్‌ - కోపెన్‌హెగన్‌ (డెన్మార్క్‌)


అంతర్జాతీయ కార్మిక సంస్థ (International Labour Organisation ILO) 
* 1919, ఏప్రిల్‌ 11న నానాజాతి సమితికి అనుబంధంగా స్వయం ప్రతిపత్తి ఉన్న సంస్థగా అంతర్జాతీయ కార్మిక సంస్థను (ILO) స్థాపించారు. ఇది 1946లో ఐక్యరాజ్యసమితికి ప్రత్యేక అనుబంధ సంస్థగా మారింది.
* కార్మికుల స్థితిగతులు, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, అంతర్జాతీయంగా ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు ఈ సంస్థ పాటుపడుతోంది. కార్మికుల సంక్షేమం, అభిలషణీయమైన కార్మిక చట్టాల రూపకల్పనలో ఇది ఎనలేని కృషి చేస్తోంది.
* ఈ సంస్థలో శాశ్వత సభ్య దేశాలు 10. 
* దీనికి 1969లో నోబెల్‌ శాంతి బహుమతి లభించింది. దీని ప్రధాన కార్యాలయం జెనీవా (స్విట్జర్లాండ్‌)లో ఉంది.


ఐక్యరాజ్యసమితి పర్యావరణ సంస్థ (United Nations Environment Programme - UNEP) 
* యూఎన్‌ఓ 1972లో స్టాక్‌హోం (స్వీడన్‌)లో పర్యావరణంపై నిర్వహించిన సమావేశం ఫలితంగా ఐక్యరాజ్యసమితి పర్యావరణ సంస్థ ఏర్పడింది. దీని ముఖ్య ఉద్దేశం ప్రపంచ పర్యావరణ పరిరక్షణ; పర్యావరణానికి సంబంధించిన అన్ని విషయాల్లో అంతర్జాతీయ సహకారం; పర్యావరణ సమస్యలపై ప్రభుత్వాలు దృష్టిసారించేలా చూడటం; పర్యావరణానికి సంబంధించిన విజ్ఞానాన్ని అంతర్జాతీయ సమాజం పరస్పరం మార్చుకోవడానికి కృషి చేయడం.
* వివిధ స్వచ్ఛంద సంస్థల సహకారంతో పర్యావరణ పరిరక్షణ ఉద్యమంలో ప్రజలను భాగస్వాములను చేసి, అవగాహనను పెంపొందించేందుకు ప్రయత్నించడం.
* ఐక్యరాజ్యసమితి పర్యావరణ సంస్థ ప్రధాన కార్యాలయం నైరోబి (కెన్యా)లో ఉంది.


ఐక్యరాజ్య సమితి విశ్వవిద్యాలయం (United Nations University) 
* ఐక్యరాజ్యసమితి సాధారణ సభ 1972, డిసెంబరు 11న చేసిన తీర్మానం ద్వారా ఈ సంస్థ ఏర్పడింది. అభివృద్ధి, సంక్షేమం, మానవ ప్రగతి, మనుగడ విషయాల్లో పరిశోధనతో పాటు శిక్షణ ఇస్తుంది. ఈ విశ్వవిద్యాలయ కౌన్సిల్‌ ముఖ్య విభాగాల్లో వివిధ దేశాలకు చెందిన విద్యావేత్తలు, యూఎన్‌ఓ సెక్రటరీ జనరల్, యునెస్కో డైరెక్టర్‌ తదితరులు ఉంటారు.
* ఈ విశ్వవిద్యాలయం ప్రపంచశాంతి సాధన, గ్లోబల్‌ ఎకానమీ, సాంఘిక, సాంస్కృతిక ప్రగతి, బయోటెక్నాలజీ మొదలైన విషయాల్లో పరిశోధనలు నిర్వహిస్తుంది. 
* దీని ప్రధాన కార్యాలయం టోక్యో (జపాన్‌)లో ఉంది.


అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (International Atomic Energy Agency - IAEA)
* 1953లో అప్పటి అమెరికా అధ్యక్షుడు డ్వైట్‌ ఐసన్‌హోవర్‌ ఐక్యరాజ్యసమితి సాధారణ సభను ఉద్దేశించి ప్రసంగించారు. అణుశక్తిని శాంతియుత ప్రయోజనాలకు వినియోగించేందుకు ఒక అంతర్జాతీయ సంస్థ అవసరమని ప్రతిపాదించారు.
* అణుశక్తిని శాంతియుత ప్రయోజనాలకు ఉపయోగించడమెలా అనే అంశంపై 1956లో న్యూయార్క్‌లో జరిగిన సదస్సులో 70 దేశాల ఆమోదముద్ర ఫలితంగా అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) చట్టరూపం దాల్చింది.
* ఈ సంస్థ 1957, జులై 29 నుంచి తన కార్యకలాపాలను ప్రారంభించింది. ఇది యూఎన్‌ఓలో ప్రత్యేక సంస్థగా కాకుండా స్వయం ప్రతిపత్తి గల సంస్థగా పేరొందింది.
* అణుపరిజ్ఞానాన్ని శాంతియుత, అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించేలా కృషి చేయడం; అరాచక శక్తులు, ఉగ్రవాదుల చేతుల్లోకి అణు పరిజ్ఞానం వెళ్లకుండా నిరంతర పర్యవేక్షించడం దీని ప్రధాన విధి.
* ఐఏఈఏలో జనరల్‌ కాన్ఫరెన్స్, బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్స్, సెక్రటేరియట్‌లు ప్రధాన విభాగాలు. జనరల్‌ కాన్ఫరెన్స్‌లో ఐఏఈఏలోని సభ్య దేశాలన్నింటికీ సభ్యత్వం ఉంటుంది.
* బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్స్‌ సాధారణంగా సంవత్సరానికి నాలుగుసార్లు సమావేశమవుతుంది. దీనిలో ఉన్న 22 మంది సభ్యులను జనరల్‌ కాన్ఫరెన్స్‌ ఎన్నుకుంటుంది. 13 మంది సభ్యులను (అణుశక్తి రంగంలో ప్రసిద్ధులైన వారిని) బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్స్‌ నియమిస్తుంది.
* సెక్రటేరియట్‌కు డైరెక్టర్‌ జనరల్‌ అధ్యక్షత వహిస్తారు. ఈయన్ను అయిదేళ్ల పదవీకాలానికి బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్స్‌ నియమిస్తుంది.
* గవర్నర్ల బోర్డ్, డైరెక్టర్‌ జనరల్‌కు శాస్త్ర సాంకేతిక రంగాల్లో సాయపడేందుకు 1958లో శాస్త్రీయ సలహా మండలిని ఏర్పాటు చేశారు. 1975లో అణు సలహా సంఘం ఏర్పడింది. దీనిలో 138 దేశాలకు సభ్యత్వం ఉంది.
* అణ్వస్త్రవ్యాప్తిని నిరోధించడానికి చేసిన కృషికి 2005లో ఐఏఈఏకి, దాని అధ్యక్షుడు మహ్మద్‌ అల్‌ బరాదీకి నోబెల్‌శాంతి బహుమతి లభించింది. దీని ప్రధాన కార్యాలయం వియన్నా (ఆస్ట్రియా)లో ఉంది.
* 1970 మార్చిలో అణ్వస్త్ర విస్తరణ నిరోధక ఒప్పందం  (NPT); 1996, సెప్టెంబరు 10న సమగ్ర అణుపరీక్షల నిషేధ ఒప్పందం (CTBT) అమల్లోకి వచ్చాయి.

Posted Date : 20-04-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌