• facebook
  • whatsapp
  • telegram

వేంగి/ తూర్పు చాళుక్యులు

* బాదామి చాళుక్య వంశం పతనమయ్యాక కూడా తూర్పు చాళుక్యులు స్వతంత్రంగా పరిపాలించారు. వేంగి రాజ్యం కళింగ - నెల్లూరు మధ్య ఉన్న ఆంధ్ర ప్రాంతమంతా విస్తరించింది. వీరికి రాష్ట్రకూటులు, కల్యాణి చాళుక్యులు, చోళులు, గాంగులతో తరచూ యుద్ధాలు జరిగేవి. తూర్పు చాళుక్యులు వీటన్నింటినీ సమర్ధవంతంగా ఎదుర్కొని నాలుగున్నర శతాబ్దాలపాటు రాజ్యపాలన చేశారు.


పాలకులు

కుబ్జ విష్ణువర్ధనుడు (క్రీ.శ.624-642): ఇతడు తూర్పు చాళుక్య రాజ్య స్థాపకుడు. తిమ్మాపురం, చీపురుపల్లి, చేజెర్ల శాసనాల్లో ఇతడి దండయాత్రలు, పాలనా విధానాల గురించి ఉన్నాయి.

కుబ్జ విష్ణువర్ధనుడు తన సామ్రాజ్యాన్ని ఉత్తరాన విశాఖపట్నం నుంచి దక్షిణాన గుంటూరు వరకు విస్తరించాడు. స్థల, జల, వన, గిరి దుర్గాలను జయించడంలో ఇతడు సమర్థుడు. అందుకే కుబ్జ విష్ణువర్ధనుడికి ‘విషమసిద్ధి’ అనే బిరుదు వచ్చింది.

ఇతడు విష్ణుభక్తుడు. ఇతడి భార్య అయ్యణ మహాదేవి. ఈమె జైనుల కోసం విజయవాడలో ‘నెడుంబ బసది’ నిర్మించింది.

జయసింహవల్లభుడు: ఇతడు సుమారు 13 ఏళ్లు రాజ్యపాలన చేశాడు. ఇతడు విష్ణు భక్తుడు. జయసింహవల్లభుడికి ‘సర్వసిద్ధి’ అనే బిరుదు ఉంది. ఇతడి తర్వాత ఇంద్రభట్టారకుడు, రెండో జయసింహుడు, మొదటి విష్ణువర్ధనుడు రాజ్యాన్ని పాలించారు.

మొదటి విజయాదిత్యుడు (క్రీ.శ.753 - 770):  ఇతడు మూడో విష్ణువర్ధనుడి కుమారుడు. ఇతడికి ‘మహారాజాధిరాజ’, ‘పరమేశ్వర భట్టారక’ అనే బిరుదులు ఉన్నాయి. ఇతడి కాలంలో చాళుక్య, రాష్ట్రకూటుల మధ్య వైరం ప్రారంభమైంది. రాష్ట్రకూట రాజు గోవిందుడు వేంగిపై దండెత్తి, విజయాదిత్యుడ్ని ఓడించాడు. విజయాదిత్యుడి తర్వాత నాలుగో విష్ణువర్ధనుడు రాజయ్యాడు. ఇతడు రాష్ట్రకూటులను ఎదుర్కోలేకపోయాడు. దీంతో తన కుమార్తె ‘శీల మహాదేవిని’ రాష్ట్రకూట రాజు ధృవుడికిచ్చి వివాహం చేశాడు. ఇతడి తర్వాత రెండో విజయాదిత్యుడు రాజయ్యాడు.

రెండో విజయాదిత్యుడు: ఇతడు కళింగ గాంగులు, రాష్ట్రకూటులతో 12 ఏళ్లపాటు 108 యుద్ధాలు చేసి, అన్నింటిలో విజయం సాధించాడు. ఇతడు తన విజయాలకు చిహ్నంగా 108 శివాలయాలు నిర్మించాడని వివిధ శాసనాల్లో ఉంది. ఇతడికి కలి విష్ణువర్ధనుడు అనే కుమారుడు ఉన్నాడు.

మూడో గుణగ విజయాదిత్యుడు (క్రీ.శ.849 -892): ఇతడు కలి విష్ణువర్ధనుడి కుమారుడు. తూర్పు చాళుక్య రాజుల్లో గొప్పవాడు. 

* ఇతడు రాష్ట్రకూట రాజు రెండో కృష్ణుడ్ని ఓడించి, అతడి రాజధాని మాన్యఖేటం (మాల్కేడ్‌)ను ధ్వంసం చేశాడు. 

* మూడో గుణగ విజయాదిత్యుడికి గుణకేనల్లాట, పరచక్రరాయ, వల్లభ అనే బిరుదులు ఉన్నాయి.

ఇతడు రెండో కృష్ణుడి బంధువు, కోసల రాజైన సంకిలుడ్ని ఓడించాడు.

* చక్రకుట, కిరణపురం, అచలపురాలను దగ్ధం చేసి, ‘త్రిపుర మర్త్యమహేశ్వర’ అనే బిరుదు పొందాడు. ఈ యుద్ధాల్లో గుణగ విజయాదిత్యుడికి పండరంగడు అనే సేనాని ఎంతగానో సహాయపడ్డాడు.

* గుణగ విజయాదిత్యుడికి సంతానం లేదు. దీంతో తన సోదరుడు విక్రమాదిత్యుడ్ని తన వారసుడిగా ప్రకటించాడు. అయితే విక్రమాదిత్యుడు రాజు కాకముందే మరణించడంతో, అతడి కుమారుడు మొదటి చాళుక్య భీముడు రాజ్యపాలన చేశాడు.


మొదటి చాళుక్య భీముడు (క్రీ.శ. 892 - 921):  మొదటి చాళుక్య భీముడి పాలనా కాలం యుద్ధాలతో గడిచింది. మూడో గుణగ విజయాదిత్యుడి చేతిలో ఓడిన రాష్ట్రకూటులు వేంగిపై దండెత్తారు. వారిని నిరవధ్యపురం, పురువంగూరు యుద్ధాల్లో చాళుక్య భీముడు ఓడించాడు. 

* చాళుక్య భీముడి మనవడు మొదటి అమ్మరాజు మరణించాక రాజ్యం కోసం వారసత్వ యుద్ధం ప్రారంభమైంది. ఈ యుద్ధంలో మొదటి యుద్ధమల్లుడు విజయం సాధించి, వేంగి పాలకుడయ్యాడు. ఇతడికి రాష్ట్రకూటులు సాయం చేశారు. తర్వాతి కాలంలో రెండో చాళుక్య భీముడు రాష్ట్రకూటులను, యుద్ధమల్లుడ్ని ఓడించి సింహాసనం అధిష్టించాడు. తర్వాత ఇతడి కుమారుడు రెండో అమ్మరాజు రాజయ్యాడు. రెండో అమ్మరాజు రాజధానిని వేంగి నుంచి రాజమహేంద్రవరానికి మార్చాడు. అమ్మరాజు సోదరుడు దానర్ణవుడు. ఇతడు అమ్మరాజును చంపి, రాజ్యాన్ని ఆక్రమించాడు. దీనికి ప్రతీకారంగా అమ్మరాజు బావమరిది జటాచోడ భీముడు దానర్ణవుడ్ని వధించి, అతడి కొడుకులైన శక్తివర్మ, విమలాదిత్యలను రాజ్యం నుంచి బహిష్కరించాడు. జటాచోడ భీముడు క్రీ.శ. 973-1000 వరకు రాజ్యాన్ని పాలించాడు. 

* రాజ్యం కోల్పోయిన విమలాదిత్య, శక్తివర్మలు చోళ రాజ్యానికి  పారిపోయి, చోళరాజు మొదటి రాజరాజ సహాయం కోరారు.

* రాజరాజ తన కుమార్తె ‘కుందవ్వ’ను విమలాదిత్యుడికిచ్చి వివాహం చేశాడు. జటాచోడ భీముడ్ని ఓడించి వేంగిని స్వాధీనం చేసుకున్నాడు. రాజరాజ వేంగి సింహాసనాన్ని శక్తివర్మకు అప్పగించాడు. శక్తివర్మ మరణించాక, విమలాదిత్యుడు కొంతకాలం రాజ్యాన్ని పాలించాడు. విమలాదిత్యుడి భార్యలు కుందవ్వ, మేళాంబ. కొడుకులు రాజరాజ నరేంద్రుడు (కుందవ్వ తల్లి), విజయాదిత్యుడు (మేళాంబ తల్లి).

* తండ్రి మరణించాక సోదరుల మధ్య వారసత్వం కోసం పోరు మొదలైంది. మేనమామ రాజేంద్రచోళుడి సాయంతో రాజరాజ నరేంద్రుడు రాజయ్యాడు. రాజేôద్రచోళుడు తన కుమార్తె అమ్మంగ దేవిని రాజరాజ నరేంద్రుడికి ఇచ్చి వివాహం జరిపించాడు.


రాజరాజనరేంద్రుడు (క్రీ.శ. 1022 - 1061):

* ఇతడు విజయాదిత్యుడితో చాలాకాలం వైరం కొనసాగించాడు. ఆ సమయంలో ఇతడి సైన్యం కూడా బలహీనపడింది.

* క్రీ.శ.1030లో కల్యాణి చాళుక్యుల సాయంతో విజయాదిత్యుడు తిరుగుబాటుచేసి వేంగిని ఆక్రమించాడు. ఇతడు క్రీ.శ. 1035 వరకు రాజుగా ఉన్నాడు. రాజేంద్రచోళుడి సాయంతో రాజరాజ నరేంద్రుడు మళ్లీ రాజై కొంతకాలం పాలించాడు. కానీ ఎన్నోసార్లు సింహాసనాన్ని కోల్పోయాడు. రాజేంద్రచోళుడు మరణించాక నరేంద్రుడు కల్యాణి చాళుక్య రాజైన మొదటి సోమేశ్వరుడితో సంధి చేసుకుని సింహాసనాన్ని నిలుపుకున్నాడు. రాజరాజ నరేంద్రుడి అస్థానంలో నన్నయ్యభట్టు ఉండేవారు. ఈయన మహాభారతాన్ని రాశారు. ఈ రచనలో నన్నయ్యభట్టుకి మొదటి సోమేశ్వరుడి ఆస్థానంలో ఉండే నారాయణభట్టు సాయం చేశారు.

* క్రీ.శ. 1061లో రాజరాజ నరేంద్రుడు  మరణించాక, అతడి కుమారుడు రెండో రాజేంద్రుడు రాజయ్యాడు.


ఏడో విజయాదిత్యుడు:

* ఇతడు వేంగి చాళుక్య వంశంలో చివరి రాజు. క్రీ.శ.1076 వరకు రాజ్య పాలన చేశాడు. క్రీ.శ.1076లో రెండో రాజేంద్రుడు కులోత్తుంగ చోళుడి పేరుతో వేంగి రాజ్యాన్ని చోళరాజ్యంలో అంతర్భాగం చేశాడు.


కల్యాణి చాళుక్యులు

కల్యాణి చాళుక్యులు బాదామి చాళుక్యుల శాఖకు చెందినవారు. ఈ వంశ స్థాపకుడు ‘రెండో తైలపుడు’. ఇతడి కంటే ముందు పాలకులు రాష్ట్రకూటులకు సామంతులు. తైలపుడు మాన్యఖేటం రాజధానిగా పాలన ప్రారంభించాడు. ఇతడి సంతతి ‘కల్యాణి’ నగరాన్ని రాజధానిగా చేసుకుని రాజ్యపాలన చేశారు. అందుకే వీరి వంశానికి కల్యాణి చాళుక్యులు అనే పేరు వచ్చింది.  


పాలకులు

రెండో తైలపుడు (క్రీ.శ. 973-997): ఇతడు రాష్ట్రకూట రాజు రెండో కర్ణుడ్ని ఓడించి క్రీ.శ. 973లో మాన్యఖేటాన్ని ఆక్రమించి, స్వతంత్రం ప్రకటించుకున్నాడు. ఇతడికి అహనమల్ల, భువనైకమల్ల, రణరంగభీమ అనే బిరుదులు ఉన్నాయి. మేరతుంగుడి ప్రబంధ చింతామణిలో రెండో తైలపుడు మాళవరాజు (పరమార) ముంజరాజును వధించినట్లు ఉంది. రెండో తైలపుడు దక్షిణాన చోళ రాజ్య విస్తరణను అడ్డుకోవడంతో వారితో వైరం ఏర్పడింది.


సత్యాశ్రయ (క్రీ.శ. 997-1008): ఇతడి కాలంలో చోళులతో వైరం తీవ్రమైంది. చోళరాజు రాజరాజ చోళుడు కల్యాణి చాళుక్యుల అధీనంలోని ముఖ్య ప్రాంతాలపై దాడిచేసినట్లు హోట్టూరు శాసనంలో ఉంది. చోళయువరాజు రాజేంద్ర చోళుడు కూడా చాళుక్య రాజ్యంపై దండెత్తి మాన్యఖేటం, కొలనుపాకలను నాశనం చేశాడు. సత్యాశ్రయుడు వేంగిపై దండెత్తాడు. కానీ జయించలేకపోయాడు. ఇతడి తర్వాత అయిదో విక్రమాదిత్యుడు, రెండో అయ్యన, రెండో జయసింహ రాజ్యపాలన చేశారు.


రెండో జయసింహ వల్లభుడు (క్రీ.శ. 1015-42): జయసింహుడు సేనాని ‘చావర్ణసు’. ఇతడు అనేక దండయాల్లో ముఖ్యపాత్ర షోషించాడు. జయసింహ వల్లభుడు సప్తకొంకణ తీరభాగాలను జయించినట్లు ‘మీరజ్‌’ శాసనంలో ఉంది. జయసింహుడు శైవమతస్థుడు. ఇతడికి ‘జగదేకమల్ల’ అనే బిరుదు ఉంది.


మొదటి సోమేశ్వరుడు (క్రీ.శ. 1042-68):ఇతడ్ని అహనమల్ల సోమేశ్వరుడు అని కూడా అంటారు. ఇతడు ‘కల్యాణి’ని నిర్మించి, రాజధానిని మాన్యఖేటం నుంచి కల్యాణికి మార్చాడు. పరమార భోజుడ్ని ఓడించి ‘ధారా’ నగరాన్ని ఆక్రమించి, ధ్వంసం చేశాడు. బిల్హణుడి ‘విక్రమాంకదేవ చరిత్ర’లో ఈ విషయం ఉంది.

*  క్రీ.శ. 1050లో జరిగిన ‘కోప్పం’ యుద్ధంలో ఇతడు వేంగిరాజు రాజరాజ నరేంద్రుడ్ని ఓడించి, తన సామంతుడిగా చేసుకున్నాడు. కానీ సోమేశ్వరుడు చోళరాజు రాజేంద్ర చేతిలో ‘సంగం యుద్ధం’లో ఓడిపోయాడు. 

*  సోమేశ్వరుడి మంత్రి (మహామాత్య) దెమరస క్రీ.శ. 1057లో హిరేహడగలి (కర్ణాటక) వద్ద కల్లేశ్వర దేవాలయాన్ని నిర్మించాడు. 

*  సోమేశ్వరుడు క్రీ.శ. 1068లో మరణించాడు. ఇతడు శివభక్తుడు. కాకతీయరాజు మొదటి ప్రోలరాజు అనేక యుద్ధాల్లో సోమేశ్వరుడికి సాయం చేశాడు.

*  ఇతడి తర్వాత భువనైకమల్ల సోమేశ్వరుడు, విక్రమాదిత్యుడు రాజ్యపాలన చేశారు.


ఆరో విక్రమాదిత్యుడు (క్రీ.శ. 1076 -1126):

* ఇతడు క్రీ.శ.1076లో చాళుక్య విక్రమ శకాన్ని ప్రారంభించాడు. త్రిభువనమల్ల అనే బిరుదుతో సింహాసనాన్ని అధిష్టించాడు. 

* ‘విక్రమాంక దేవ చరిత్ర’ను రచించిన బిల్హణుడు ఇతడి ఆస్థానంలో ఉండేవారు.

విక్రమాదిత్యుడు చోళరాజు వీరరాజేంద్రుడి కుమార్తెను వివాహం చేసుకుకన్నాడు. 

సింహళరాజు విజయబాహువు ఇతడి మిత్రుడు. ఇతడు సోలంకి, కాలచూరి రాజులను జయించాడు. మొదటి భల్లాలుడు విక్రమాదిత్యుడికి సామంతుడిగా ఉండి, హొయసల రాజ్యాన్ని పాలించాడు. 

* క్రీ.శ. 1084లో విక్రమాదిత్యుడు కాంచీపురాన్ని దోచుకొన్నాడు. కులోత్తుంగ చోళుడు మరణించాక వేంగిని ఆక్రమించాడు. 

* కాకతీయులు ఇతడికి విధేయులుగా ఉండేవారు. ఇతడు మంచి పాలన అందించి, కవిపండితులను పోషించాడు. విక్రమాదిత్యుడికి హొనుంగలుగొండ, వీరగంగ, విజయనోళంబ, సాహసకదంబ అనే బిరుదులు ఉన్నాయి. 


చివరి రాజులు 

* విక్రమాదిత్యుడు మరణించాక మూడో సోమేశ్వరుడు (క్రీ.శ.1126-38), జగదేకమల్లు (క్రీ.శ.1138-50), తైలపదేవుడు (క్రీ.శ.1150-57) పరిపాలించారు. వీరి కాలంలో కాకతీయులు, యాదవులు, హొయసలులు, కాలచూరులు స్వాతంత్య్రం ప్రకటించుకున్నారు. 

*తైలపదేవుడి తర్వాత మూడో జగదేకమల్లుడు (క్రీ.శ.1163-83), నాలుగో సోమేశ్వరుడు (క్రీ.శ. 1184-1200) పరిమిత ప్రాంతాలను పాలించారు.  

Posted Date : 14-07-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌