• facebook
  • whatsapp
  • telegram

భారతదేశంలో జలవనరులు - నీటిపారుదల

భారతదేశం ప్రధానంగా వ్యవసాయ ఆధారిత దేశం. గ్రామాల్లో సుమారు 60% మంది ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. స్థూల జాతీయాదాయంలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాల వాటా 1960-61లో 53.5 శాతం ఉండగా, 2013-14 నాటికి 14 శాతానికి పడిపోయింది. మన వ్యవసాయం ప్రధానంగా నీటి పారుదల మీద ఆధారపడి ఉండటమే దీనికి కారణం.
* వ్యవసాయం ఫలప్రదం కావాలంటే, అన్ని ప్రాంతాల్లో సేద్యపు నీటి వసతి అవసరం. నీటి పారుదల వసతులు ఉన్నట్లయితే సంవత్సరం పొడవునా భూమిని లాభదాయకంగా ఉపయోగించుకోవచ్చు. వ్యవసాయ ఉత్పత్తిని పెంచి అధిక ఆదాయాన్ని సంపాదించవచ్చు. మన దేశంలో సగటు వర్షపాతం సుమారు 116 సెంటీమీటర్లుగా నమోదవుతుంది. ఇంత ఎక్కువ వర్షపాతం ఉన్నప్పటికీ మనకు నీటి వనరుల కొరత ఏర్పడుతూనే ఉంది.
* భారతదేశంలో వర్షపాతం రుతుపవనాలపై ఆధారపడటమే ఇందుకు కారణం. ఈ రుతుపవనాలు సంవత్సరంలో కేవలం 3-4 నెలల వరకే వర్షపాతాన్ని కల్పిస్తున్నాయి. పైగా అన్ని రాష్ట్రాలకు, అన్ని ప్రాంతాలకు సమాన వర్షపాతం ఉండటం లేదు. తూర్పున మాసిన్‌రామ్, చిరపుంజి (మేఘాలయ)లో అత్యధికంగా 1200 సెం.మీ. వరకు వర్షపాతం ఉంటే, పశ్చిమాన రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో 25 సెం.మీ. కంటే తక్కువ వర్షపాతం నమోదవుతోంది. ఇలాంటి వ్యత్యాసాల కారణంగా మనకు నీటి పారుదల వనరులు అవసరమవుతున్నాయి.
* రుతుపవనాలు సకాలంలో రావడం లేదు. మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల రుతుపవనాల గతి తప్పుతోంది. పైగా, ఎల్‌నినో లాంటి సముద్ర నీటి ప్రవాహాల ప్రభావం వల్ల వీటి దిశ మారుతోంది.
* వ్యవసాయ దిగుబడులు పెంచడం ద్వారా ఆహార భద్రతను కల్పించడానికి నీటిపారుదల చాలా అవసరం.
*  భారతదేశ నీటి పారుదల గణాంకాలను పరిశీలిస్తే మొత్తం నికర సాగు భూమి 144 మిలియన్ల హెక్టార్లు కాగా, నికర నీటి పారుదల ఉన్న భూమి కేవలం 56 మిలియన్ హెక్టార్లు మాత్రమే.

 

  భారతదేశంలో వ్యవసాయం ఎక్కువగా అనిశ్చితమైన (uncertain) రుతుపవనాల మీద, అస్తవ్యస్తంగా (uneven) ఉండే వర్షపాతం మీద ఆధారపడి ఉంది. భారతదేశం భిన్న శీతోష్ణస్థితులున్న దేశం. ఈ దేశంలోని రుతువులూ, వాతావరణ పరిస్థితులూ వివిధ రకాలుగా ఉంటాయి. క్షామ, వరద ప్రాంతాలతో పాటు వివిధ రకాల ప్రాంతాలు దేశంలో ఏకకాలంలోనే కనిపిస్తాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎదుర్కొంటున్న వరదలు, కరవులే దీనికి నిదర్శనం. రుతుపవనాల కాలంలోనే ప్రధానంగా వర్షాలు కురుస్తాయి. వార్షిక వర్షపాతంలో దాదాపు 80 శాతం జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నాలుగు నెలల కాలంలోనే నమోదవుతుంది. మిగిలిన 20 శాతం శీతాకాలంలో నమోదవుతుంది. కాబట్టి భారతదేశ వ్యవసాయంలో నీటి పారుదల రంగం ప్రముఖ పాత్ర నిర్వహిస్తుంది. దేశంలో జలవనరులు పుష్కలంగా ఉన్నాయి. అనేక నదులు ప్రవహిస్తూ ఉండటంతో పాటు, భూగర్భ జలాన్ని పట్టి ఉంచే ఒండలి హరివాణాలు కూడా విస్తారంగా ఉన్నాయి. మన జలవనరులను రెండువర్గాలుగా విభజించారు.
అవి: 1) ఉపరితల జలవనరులు, 2) భూగర్బ జలవనరులు. ఇవి హైడ్రోలాజిక్ చక్రం అనే భూ జల ప్రసరణ వ్యవస్థలో భాగమే.


     అందువల్ల అభిలషణీయమైన అభివృద్ధితో పాటు మన జలవనరులను సమర్థంగా వినియోగించుకోవడానికి కూడా ఎంతో ప్రాముఖ్యం ఉంది.
పూర్వపు నీటి పారుదల విభాగం పేరును 1985 అక్టోబర్‌లో జలవనరుల మంత్రిత్వ శాఖగా మార్చారు. జాతీయవనరుగా నీటిని అభివృద్ధి పరచి పరిరక్షించే, ప్రధానమైన పాత్రను ఈ శాఖకు అప్పగించారు. ప్రధానమంత్రి అధ్యక్షతన ఉన్న జాతీయ జల వనరుల మండలి, 1987 సంవత్సరంలో జాతీయ జల విధానాన్ని రూపొందించింది. ప్రాజెక్టుల ప్రణాళిక, రూపకల్పన, అమలుకు సంబంధించి, ఒక సంఘటితమైన అనేక విషయాలతో కూడిన దృక్పథాన్ని అనుసరించాలని ఈ విధానం సిఫార్సు చేసింది. ప్రాజెక్టుల ప్రణాళికకూ, నిర్వహణకూ సంబంధించిన ప్రాధాన్య ప్రాంతాలను కూడా ఇది రూపొందించింది. తాగునీటికి అత్యధిక ప్రాధాన్యమిచ్చారు. ఆ తరవాత వరుసగా నీటి పారుదల, జల విద్యుత్తు, నౌకాయానం, పారిశ్రామిక ప్రయోజనాలు మొదలైనవాటికి ప్రాధాన్యమిచ్చారు. ఉపరితల, భూగర్భజల నాణ్యతను కూడా పర్యవేక్షించాలని ఈ విధానం సిఫార్సు చేసింది.


      1987 తరువాత కేంద్ర ప్రభుత్వం తిరిగి 2002లో జాతీయ జల విధానాన్ని రూపొందించింది. ఇందులోని ప్రధాన అంశాలు 1. అందుబాటులో ఉన్న ఉపరితలజలాలను, భూగర్భ జలాలను అభిలషణీయ స్థాయిలో (Optimum sustainable) వినియోగించుకోవడం, జలవనరుల వినియోగానికి సంబంధించి ఉత్తమ సమాజాల వ్యవస్థను అభివృద్ధి పరచడం, జలవనరులను పరిమాణాత్మకంగా (quantity), గుణాత్మకంగా (quality) అభివృద్ధి పరచడం. అంతేకాకుండా పర్యావరణ పరిరక్షణను దృష్టిలో పెట్టుకొని జలవనరులను వినియోగించుకోవడం జలవనరుల (నీటి) వినియోగంలో , నిర్వహణలో వినియోగదారులను భాగస్వాములను చేయడం. జలవనరుల నిర్వహణలో, అభివృద్ధిలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని అనుమతించడం. నీటి వనరుల వినియోగంలో సేవల, జవాబుదారీతనాన్ని (accountability)  మెరుగుపరచడం మొదలైనవి.


నీటి పారుదల సదుపాయాన్ని పెంపొందించడం (Irrigation Development):
     ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచే ప్రధాన వ్యూహాల్లో, ఇప్పటికే ఏర్పాటుచేసిన వ్యవస్థలను సుస్థిరం చేయడంతోపాటు నీటి పారుదల సదుపాయాన్ని విస్తరించడం కూడా ఒకటి. భారీ, మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టులు, ఆయకట్టు అభివృద్ధి, చెరువులు, భూగర్భ జలవినియోగం వంటి వాటి ద్వారా నీటిపారుదల సదుపాయాన్ని కల్పిస్తున్నారు.


భారీ, మధ్యతరహా, చిన్నతరహా నీటిపారుదల ప్రాజెక్టులు (Major Medium and Minor Irrigation Projects):
   పదివేల హెక్టార్లకు మించిన ఆయకట్టుతో ఉన్న ప్రాజెక్టులను భారీ ప్రాజెక్టులనీ, రెండు వేలకు పైన పదివేల హెక్టార్లకు తక్కువ ఆయకట్టుతో ఉన్న ప్రాజెక్టులను మధ్యతరహా ప్రాజెక్టులనీ, 2000 హెక్టార్లకంటే తక్కువ ఆయకట్టు ఉన్న ప్రాజెక్టులను చిన్నతరహా ప్రాజెక్టులనీ వర్గీకరించారు. దీనికే Culturable Command Area (CCA) అని పేరు.


వాటర్‌షెడ్ నిర్వహణ (Watershed Managemant):
      ఆరో ప్రణాళిక కాలంలో ప్రారంభించిన వర్షాధార ప్రాంతాల వాటర్‌షెడ్ అభివృద్ధి ప్రాజెక్టు ద్వారా వర్షాధార వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడానికి, ప్రధానమైన కార్యక్రమంలో విస్తృత మార్పులు ప్రవేశపెట్టారు. 30శాతానికి తగ్గకుండా నీటిపారుదల సదుపాయాన్ని కల్పించడానికి, తేమను పరిరక్షించడానికి, ప్రతి సమితిలో సూక్ష్మ వాటర్‌షెడ్ కార్యక్రమాలను నిర్వహించాలని వాటర్‌షెడ్ అభివృద్ధి ప్రాజెక్టులో ఉద్దేశించారు. వ్యవసాయయోగ్యం కాని భూములతోపాటు మురుగునీటి కాలువలను కూడా ఒక సమగ్ర విధానం ప్రకారం నిర్వహించాలని భావించారు.
భారీ, మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టుల్లోని నీటిని సక్రమంగా అభిలషణీయ (Optimum) స్థాయిలో వినియోగించుకునేందుకు 5వ పంచవర్ష ప్రణాళిక కాలంలో అంటే 1974-75లో ఆయకట్టు ప్రాంత అభివృద్ధి పథకం (Command Area Development Programme) ప్రారంభించారు.
         భారతదేశంలో ప్రస్తుతం జలవనరుల మొత్తం శక్మ సామర్థ్యం అంటే పొటెన్షియల్ 1929 బిలియన్ క్యూబిక్ మీటర్లు (బి.సి.ఎం.) గా అంచనా వేశారు. వాస్తవానికి ఈ మొత్తం శక్మ సామర్థ్యంలో 1123 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీటి పరిమాణాన్ని వినియోగిస్తున్నారు. ఈ మొత్తం జలవనరుల వినియోగంలో 690 బి.సి.ఎం. ఉపరితల జలాలు కాగా, 433 బి.సి.ఎం. భూగర్భ జలాలు.
           దేశంలో మొదటి పంచవర్ష ప్రణాళిక కాలం నాటికి (1951-52) దేశంలోని అభివృద్ధి చేసిన మొత్తం నీటిపారుదల సామర్థ్యం 22.6 మిలియన్ హెక్టార్లు కాగా, పదో పంచవర్ష ప్రణాళిక చివరి నాటికి (2006-07) ఇది 102.77 మిలియన్ హెక్టార్లకు పెరిగింది. ఇందులో వాస్తవంగా వినియోగించిన భూమి 87.23 మిలియన్ హెక్టార్లు. దేశంలో నీటి పారుదల అభివృద్ధికి మొదటి పంచవర్ష ప్రణాళికా కాలంలో 376 కోట్లు ఖర్చు చేయగా, 10వ పంచవర్ష ప్రణాళికలో 71,213 కోట్లు ఖర్చు చేశారు.
         భారతదేశంలో 2005-06 చివరినాటికి అత్యధికంగానీటిపారుదల సౌకర్యం ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్ కాగా, రెండో స్థానంలో రాజస్థాన్, మూడో స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. ఉపరితల లేదా భూగర్భజలాల లభ్యత వంటి అంశాలకు అనుగుణంగా భారతదేశంలో వివిధరకాల నీటిపారుదల వనరులను వినియోగిస్తున్నారు.

* వీటిని ప్రధానంగా నాలుగు వర్గాలుగా విభజించవచ్చు. అవి: 1) కాలువలు, 2) చెరువులు, 3) బావులు, 4) ఇతర వనరులు.
       పై  నాలుగు రకాల నికర నీటిపారుదల వనరుల కింద ఉన్న సాగుభూమి వివరాలు 2005-06 నాటికి కింది విధంగా ఉన్నాయి.


నీటి పారుదల పద్ధతులు
* బావులు, గొట్టపు బావులు: బావులు ప్రాచీన కాలం నుంచి ప్రధాన నీటి పారుదల వనరులుగా ఉన్నాయి. అందుకే వీటిని నీటి పారుదలకు పర్యాయపదంగా వ్యవహరిస్తారు.
* దేశంలో ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో అధికంగా ఈ రకమైన నీటి పారుదల వసతి ఉంది. ఆయా ప్రాంతాల్లో మెత్తటి నేలలు, భూగర్భ జలాలు సమృద్ధిగా ఉండటమే దీనికి కారణం.
* 1966 లో సంభవించిన ఉత్తర భారతదేశ కరవు తర్వాత గొట్టపు బావుల తవ్వకం అధికమైంది. ప్రభుత్వం అందించే సబ్సిడీ ప్రోత్సాహకాల వల్ల బావుల వాడకం కంటే గొట్టపు బావుల వాడకం ఎక్కువైంది. గుజరాత్‌లో అత్యధిక శాతం సాగుభూమి ఈ రకమైన నీటిపారుదల కింద ఉంది. మొత్తం భారతదేశంలో 56 శాతం సాగుభూమి ఈ రకమైన నీటిపారుదల కింద సాగవుతోంది.
* ఉపయోగాలు: బావులు లేదా గొట్టపు బావులను నీటిపారుదల వనరులుగా వినియోగించడం వల్ల వ్యక్తిగత యాజమాన్యం పెరగడం, సాగునీటి వినియోగం నియంత్రణలో ఉండటం, సకాలంలో నీటి సరఫరాను అందించడం మొదలైన ఉపయోగాలు ఉన్నాయి.
* ఈ రకమైన నీటి పారుదల వల్ల నీటి ఉపయోగిత 85 నుంచి 90 శాతం వరకు ఉంటుంది. కానీ ఈ విధానంలో భూగర్భ జలాలను విపరీతంగా వాడటం, భూగర్భ జలాలను తిరిగి నింపకపోవడం మొదలైన కారణాల వల్ల ప్రకృతి వైపరీత్యాలు, భూసార పర్యవసనాలు లాంటి నష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది.


కాలువలు
భారతదేశంలో ఈ విధమైన నీటి పారుదల సౌకర్యం బ్రిటిష్ పాలకుల వల్ల వాడుకలోకి వచ్చింది. సర్ ఆర్థర్ కాటన్ లాంటి మహనీయులు లండన్‌లోని థేమ్స్ నదీ ప్రవాహ వ్యవస్థ మాదిరిగా భారతదేశంలో కూడా కాలువలు నిర్మించాలని భావించారు.
* భారతదేశంలో అనేక నదీ వ్యవస్థలు ఉండటం వల్ల కాలువల ద్వారా నీటి పారుదల సౌకర్యం కల్పించడానికి వీలవుతోంది. ముఖ్యంగా ఉత్తర భారతం దీనికి అనువైన ప్రాంతం. ద్వీపకల్ప భాగంలోని నదులు వర్షాధారమైనవి కావడం వల్ల, కేవలం అనువైన ప్రదేశాల్లో మాత్రమే నదులకు ఆనకట్టలు నిర్మించారు. ఇక్కడ నిల్వ చేసిన నీటిని కావలసినప్పుడు నీటి ఎద్దడి ఉన్న ప్రదేశాలకు కాలువల ద్వారా సరఫరా చేస్తున్నారు. దేశం మొత్తంమీద నీటిపారుదల కింద ఉన్న భూమిలో కేవలం 34 శాతం మాత్రమే కాలువల కింద సాగవుతోంది.
ముఖ్య పథకాలు: కాలువల విస్తీర్ణం పెంచడానికి కొన్ని పథకాలను ప్రవేశపెట్టారు. అవి..
* దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ (DVC)
* కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్ ప్రోగ్రాం (CADP)
* ఎసిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రాం (Accelerated Irrigation Benefits Programme - AIBP)
* ఒండ్రు నేలలో కాలువల విస్తీర్ణం ఎక్కువ. పంజాబ్, హరియాణాలో ఈ తరహా నీటి పారుదల సౌకర్యాలు అధికంగా ఉన్నాయి. ఉత్తర్ ప్రదేశ్‌లో ఈ పద్ధతిలో సాగయ్యే భూమి అధికం. భారతదేశంలోని అతి పొడవైన కాలువ - ఇందిరా గాంధీ కాలువ. ఇది సట్లెజ్ (Sutlej) నది నుంచి రాజస్థాన్‌లోని ఎడారి భూమికి నీటి సరఫరాను అందిస్తోంది.
నష్టాలు: కాలువల నిర్మాణంలో కొన్ని నష్టాలు ఉన్నాయి. వాటిని కింది విధంగా వివరించవచ్చు.
* అధిక నిర్మాణ వ్యయం
* అత్యల్ప నీటి ఉపయోగిత. ఈ తరహా నీటిపారుదలలో కేవలం 30% - 40% నీరు మాత్రమే ఉపయోగపడుతుంది. అధిక శాతం నీరు ఇంకిపోవడం లేదా ఆవిరై పోవడమే ఇందుకు కారణం.
* ఇది కాలువకు దగ్గరగా ఉన్న రైతులకు, చివర ఉన్న రైతులకు మధ్య ఘర్షణ వాతావరణానికి దారి తీస్తుంది.


చెరువులు
సాధారణంగా ఎక్కడైతే స్థలాకృతి ఎగుడుదిగుడుగా, సహజ పల్లపు ప్రాంతాలుగా, నేలల అడుగున కఠినంగా, ప్రవేశయోగ్యం లేనివిధంగా ఉంటుందో అలాంటి ప్రాంతాలు చెరువుల నిర్మాణానికి అనువైనవి. ఈ పరిస్థితులున్న ప్రాంతాలు దక్కన్ పీఠభూమిలో కోకొల్లలు. కాబట్టి చెరువుల ద్వారా నీటి పారుదల వ్యవస్థ దక్కన్‌లో అధికంగా ఉంటుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ రకమైన వ్యవసాయాన్ని చూడొచ్చు.
* దేశం మొత్తంలో ఈ రకమైన నీటి పారుదల సౌకర్యం కింద ఉన్న భూమి కేవలం 6 శాతం మాత్రమే. బావులు, కాలువల వల్ల పోటీని తట్టుకోలేక అధికశాతం చెరువులు క్షీణిస్తున్నాయి. అంతేకాకుండా హఠాత్తుగా వచ్చే వరదల వల్ల చెరువుల గట్లు కొట్టుకు పోవడం, కొన్ని చెరువులను వ్యవసాయ భూములుగా మార్చడం, మరికొన్నింటిని ఆక్రమించుకోవడం లాంటివి చెరువుల విస్తీర్ణం తగ్గిపోవడానికి కారణమవుతున్నాయి.


నీటి లభ్యత గణాంకాలు
దేశం మొత్తంలో నీటి వనరులు 1800 BCM (బిలియన్ క్యూబిక్ మీటర్లు). మనకున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి కేవలం 1100 BCM నీటిని మాత్రమే అందుబాటులోకి తీసుకురాగలిగారు. ఇందులో 433 BCM భూగర్భ జలాలు కాగా, 690 BCM ఉపరితల ప్రవాహాలు. ప్రస్తుతం నీటి వాడుకను ఇలానే కొనసాగిస్తే నీటి వనరులు 2030 వరకు మాత్రమే మన అవసరాలు తీర్చగలవు. ఆ తర్వాత తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కోవలసి వస్తుంది.


ఇతర నీటి పారుదల సౌకర్యాలు
    సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడం వల్ల కొన్ని రకాల నీటిపారుదల సౌకర్యాలు కొత్తగా అందుబాటులోకి వచ్చాయి. అవి..
1) తుంపర సేద్యం (Sprinklers irrigation),
2) బిందు సేద్యం (Drip irrigation).
ఈ తరహా నీటి పారుదల పద్ధతులను మధ్యదరా సముద్ర వ్యవసాయ పద్ధతి నుంచి భారతదేశంలోకి ప్రవేశపెట్టారు. తుంపర సేద్యం ద్వారా నీటి ఉపయోగిత 95 శాతం వరకు ఉంటుంది. బిందు సేద్యంలో నీటిని నేరుగా మొక్క వేరుకు చేరేవిధంగా చర్యలు తీసుకుంటారు. అందువల్ల ఈ రకమైన సేద్యంలో వంద శాతం నీరు వినియోగితమవుతుంది. భారత ప్రభుత్వం ఈ తరహా నీటి పారుదలకు 90 శాతం సబ్సిడీతో ప్రోత్సాహాన్ని అందిస్తోంది.

 

బహుళార్థసాధక/ భారీ నీటిపారుదల ప్రాజెక్టులు 

         కాలువల ద్వారా జరిగే నీటి పారుదల సౌకర్యాన్ని ప్రధానంగా బహుళార్థ సాధక/ భారీ నీటిపారుదల ప్రాజెక్టులే సమకూరుస్తున్నాయి. బహుళార్థసాధక నదీ ప్రాజెక్టులు (Multipurpose river projects) అంటే కేవలం నీటి పారుదల సౌకర్యాలను కల్పించడమే కాకుండా ఎన్నో ప్రయోజనాలను అందించేవి. జలవిద్యుత్ ఉత్పాదన, వరదలను అరికట్టడం, జల రవాణా, తాగునీటి సరఫరా, పరిశ్రమల అవసరాలు, మత్స్య సంపద అభివృద్ధి, పర్యాటక కేంద్రాలకు ఇవి ఉపయోగపడుతున్నాయి. అందుకే వీటిని బహుళార్థసాధక ప్రాజెక్టులంటారు. వీటిని భారత మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ 'ఆధునిక భారతదేశ దేవాలయాలు'(Temples of modern India)గా అభివర్ణించారు. ఇక భారీ నీటి పారుదల ప్రాజెక్టులంటే 10,000 హెక్టార్లకు (25000 ఎకరాలకు) మించి నీటి పారుదల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులని అర్థం.
అంతర్ రాష్ట్ర నదీ జలాల వివాదాలు: వివిధ నదుల ప్రవాహక (Riparian States) రాష్ట్రాలు, నదీజలాలను వినియోగించుకోవడంలో తరచూ ఏర్పడే వివాదాలను పరిష్కరించుకునేందుకు రాజ్యాంగంలోని 262 ప్రకరణను అనుసరించి పార్లమెంట్ అంతర్ రాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టాన్ని 1956లో రూపొందించింది. దీనిని అనుసరించి రాష్ట్రాలమధ్య ఉన్న నదీ జలాల పంపకాల వివాదాలను పరిష్కరించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ట్రైబ్యునళ్లను ఏర్పాటు చేస్తుంది.

 

ప్రస్తుతం  దేశంలోని ప్రధాన నదీజలాల వివాదాలు 

నది వివాదాలున్న రాష్ట్రాలు
కృష్ణ మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక.
తుంగభద్ర ఆంధ్రప్రదేశ్,  కర్ణాటక
గోదావరి మహారాష్ట్ర,  ఆంధ్రప్రదేశ్,  ఒరిస్సా,  చత్తీస్ గఢ్.
నర్మద కర్ణాటక,  తమిళనాడు,  కేరళ. 
కావేరి పుదుచ్చేరి (కేంద్ర పాలిత),  గోవా, కర్ణాటక. 
మండోలీ ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా. 
వంశధార పంజాబ్, హర్యానా, రాజస్థాన్
రావిబియాస్ జమ్ము - కాశ్మీర్, ఢిల్లీ (కేంద్రపాలిత).
ఉత్తరప్రదేశ్, హర్యనా, హిమాచల్ ప్రదేశ్. 
యమున రాజస్ధాన్ మధ్యప్రదేశ్, ఢిల్లీ (కేంద్ర పాలిత). 

 

కేంద్ర జల సంఘం (Central Water Commission): కేంద్ర జలసంఘాన్ని 1945లో ఏర్పాటుచేశారు. జలవనరుల అభివృద్ధిరంగంలో ఇది దేశంలోనే ప్రధానమైన ఇంజినీరింగ్ సంస్థ, దేశంలోని, భూటాన్, నేపాల్ దేశాల్లోని వరద నివారణకు, జలవనరుల పరిరక్షణ, వినియోగాలకు సంబంధించిన పథకాలను ప్రారంభించడానికి, సమన్వయం చేయడానికి ఈ సంఘం బాధ్యత వహిస్తుంది.


కేంద్ర జల సంఘం (Central Water Commission): కేంద్ర జలసంఘాన్ని 1945లో ఏర్పాటుచేశారు. జలవనరుల అభివృద్ధిరంగంలో ఇది దేశంలోనే ప్రధానమైన ఇంజినీరింగ్ సంస్థ, దేశంలోని, భూటాన్, నేపాల్ దేశాల్లోని వరద నివారణకు, జలవనరుల పరిరక్షణ, వినియోగాలకు సంబంధించిన పథకాలను ప్రారంభించడానికి, సమన్వయం చేయడానికి ఈ సంఘం బాధ్యత వహిస్తుంది.


జాతీయ జల విజ్ఞాన సంస్థ (National Institute of Hydreotogy): జాతీయ జల విజ్ఞాన సంస్థ (ఎన్ఐహెచ్) 1979 నుంచి పనిచేస్తోంది. స్వతంత్రప్రతిపత్తి ఉన్న సంస్థగా దీన్ని భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీని ప్రధాన కార్యాలయం రూర్కీలో ఉంది. భారత ప్రభుత్వంలోని జలవనరుల మంత్రిత్వ శాఖ దీనికి పూర్తిగా ఆర్థిక సహాయం అందిస్తుంది. జలవిజ్ఞానానికి సంబంధించిన అన్నిఅంశాల్లో సైద్ధాంతిక, అనువర్తిత అధ్యయనాలతోపాటు పరిశోధన చేపట్టడం కూడా ఈ సంస్థ ప్రధాన లక్ష్యం.


జాతీయ జల మండలి (National Water Board): ప్రభుత్వం 1990 సెప్టెంబర్‌లో జాతీయ జల మండలిని ఏర్పాటు చేసింది. దేశంలోని జలవనరులను క్రమబద్ధమైన రీతిలో అభివృద్ధి చేయడానికి, జాతీయ జల విధానం అమలు ప్రగతిని సమీక్షించి, జాతీయ జలవనరుల మండలికి నివేదించడానికి దీన్ని ఏర్పాటు చేశారు.


అంతర్జాతీయ నదీ జలాల ఒప్పందాలు (International Agreements)

సింధు జలాల ఒడంబడిక (Indus Waters Treaty): సింధు నదీవ్యవస్థకు చెందిన జలాల వినియోగానికి సంబంధించి, రెండు దేశాల హక్కులను, బాధ్యతలను నిర్ణయించడానికి 1960 సెప్టెంబర్ 19న భారత, పాకిస్థాన్ దేశాలు సింధుజలాల ఒడంబడిక మీద సంతకాలు చేశాయి. దీని ప్రకారం రెండుదేశాలూ సింధూనది, ఉపనదుల జలాల వినియోగానికి శాశ్వత కమిషనర్లను నియమించి, జలాల వినియోగంపై ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతాయి.


భారత్ - బంగ్లాదేశ్ ఉమ్మడి నదుల కమిషన్ (Indo - Bangladesh Joint Rivers Commission): 1972 జులైలో ఏర్పాటు చేసిన భారత - బంగ్లాదేశ్ ఉమ్మడి నదుల కమిషన్, రెండుదేశాలకూ ఉమ్మడి నదీ వ్యవస్థ నుంచి గరిష్ఠ స్థాయిలో ప్రయోజనాలను సాధించడానికి ఫలప్రదమైన ఉమ్మడి ప్రయత్నాలకు వీలు కల్పిస్తుంది. వరదలను ముందుగా పసిగట్టడం, హెచ్చరికలు చేయడం, వరద నివారణ, నదుల అభివృద్ధి వంటి రంగాల్లో పరస్పర ప్రయోజనం కోసం తగిన చర్యలు రూపొందిస్తుంది. గంగ, తీస్తా (బ్రహ్మపుత్ర) నదులతో పాటు ఇతర ప్రధానమైన నదుల ప్రవాహాలను పంచుకోవడానికి రెండు దేశాలూ న్యాయోచితమైన, దీర్ఘకాలికమైన, సమగ్రమైన ఏర్పాటుకు అంగీకరించాయి. పరస్పర చర్చల ద్వారా రూపొందిన ఈ ఒప్పందం ఇరుదేశాల ప్రజల ప్రయోజనాలను ఉత్తమ రీతిలో కాపాడుతోంది.


భారత్-భూటాన్ ప్రాజెక్టులు (Indo - Bhutan Projects): భారత-భూటాన్ దేశాలకు ఉమ్మడి హక్కు ఉన్న నదులకు సంబంధించి ముందుగానే జల వాతావరణాన్ని, వరదలను పసిగట్టే వ్యవస్థ ఏర్పాటుకు, జలవిద్యుత్ అభివృద్ధికి సంబంధించిన పనుల విషయంలో భూటాన్ రాచరికపు ప్రభుత్వంతో సహకారం కొనసాగుతోంది. ఛుఖా (Chukha) II, III దశల ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతోంది. భారత, భూటాన్‌మధ్య 1993 జనవరిలో కుదిరిన ఒప్పందం మేరకు సంకోష్ బహుళార్థసాధక ప్రాజెక్టును చేపట్టింది.

Posted Date : 18-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌