• facebook
  • whatsapp
  • telegram

జల రవాణా

సరసమైన ధరల్లో సరకుల సరఫరా! 

 

మూడు వైపుల్లో సముద్రం, అంతర్గతంగా నదులు, కాలువలు వంటి విస్తృత జల వనరులు దేశంలో ఉన్నాయి.  అవి పడవలు, ఓడల ద్వారా సరసమైన ధరల్లో రవాణాకు వీలు కల్పిస్తున్నాయి. సరకు రవాణా, వాణిజ్యానికి జలమార్గాలు అత్యంత కీలకమైనవి. ఆర్థికంగా, పర్యావరణానికి అనుకూలమైనవి. దేశంలో జల రవాణా స్వరూపం, తీరుతెన్నులతో పాటు జాతీయ జలమార్గాల అభివృద్ధికి జరుగుతున్న కృషిని పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. సముద్ర రవాణాకు సంబంధించి దేశంలోని ప్రధాన రేవులు, వాటి ప్రత్యేకతలు, సముద్రయానం అభివృద్ధికి ప్రభుత్వపరంగా ఉన్న వ్యవస్థలపై అవగాహన పెంచుకోవాలి.


జలమార్గాల ద్వారా రవాణా అతిచౌకగా జరుగుతుంది. ప్రకృతిసిద్ధంగా ఏర్పడిన  సముద్రాలు, నదులు, కాలువలను జలమార్గాలుగా ఉపయోగించుకోవడంతో నిర్మాణ వ్యయం కూడా ఉండదు. అక్కడక్కడ కొన్ని కాలువలు, మానవ నిర్మితమైనవి ఉంటాయి.ఎక్కువ పరిమాణం, ఎక్కువ బరువైన వస్తువులను, తక్కువ ఖర్చుతో తరలించేందుకు జల రవాణా అనుకూలం. ఇది పర్యావరణానికి హాని కలిగించదు. జలరవాణా రెండు రకాలుగా ఉంటుంది. 


1) లోతట్టు నీటి రవాణా (ఇన్‌ల్యాండ్‌ వాటర్‌ ట్రాన్స్‌పోర్టు) 


2) సముద్ర రవాణా (ఓషన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఆఫ్‌ షిప్పింగ్‌)

 

లోతట్టు నీటి రవాణా: ప్రస్తుతం దేశంలో ఉన్న లోతట్టు జలమార్గాల పొడవు 14,500 కి.మీ. అయితే కాలువలు వెడల్పుగా లేకపోవడం, లోతు తక్కువగా ఉండటం, ఒడ్డు/ తీరం కొట్టుకుపోవడం వంటి సమస్యలతో కొంతమేరకే రవాణాకు ఉపయోగకరంగా ఉన్నాయి. ఇందులో 5,200 కి.మీ. నదీమార్గాలు కాగా, 4,000 కి.మీ కాలువలు. ఇవేకాక నిల్వ నీరు, కయ్యలు, సరస్సులు మొదలైనవి కూడా జలమార్గాలుగా వినియోగంలో ఉన్నాయి. అత్యధిక పొడవైన జలమార్గాలున్న రాష్ట్రాల్లో ఉత్తర్‌ప్రదేశ్‌ది మొదటి స్థానం. ఆ తర్వాతి స్థానంలో పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, అస్సాం, కేరళ ఉన్నాయి.


బకింగ్‌హాం కాలువ: ఇది దేశంలో అత్యంత పొడవైన జలమార్గపు కాలువ. బ్రిటిష్‌ హయాంలో ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ, తమిళనాడులోని విల్లుపురాన్ని కలుపుతూ తూర్పుతీర ప్రాంతానికి దగ్గరగా 796 కి.మీ. పొడవున అనేక దశల్లో ఈ కాలువను నిర్మించారు. కొంతకాలం దీనిని లార్డ్‌క్లైవ్‌ కాలువగా పిలిచారు. 1878 నుంచి అప్పటి మద్రాస్‌ గవర్నర్‌ డ్యూక్‌ ఆఫ్‌ బకింగ్‌ హాం పేరుతో పిలుస్తున్నారు. తూర్పు తీరంలో 1966, 1976లలో ఏర్పడిన తీవ్ర తుపాన్ల వల్ల అనేక చోట్ల ఈ కాలువ పూడిపోయింది. ప్రస్తుతం మరమ్మతులు చేసి తిరిగి ఉపయోగంలోకి తెచ్చే ప్రయత్నం జరుగుతోంది.


కర్నూలు- కడప కాలువ (కేసీ కెనాల్‌):  ఆంధ్రప్రదేశ్‌లో 1863-70 మధ్య సాగునీటి కాలువగా నిర్మించిన కర్నూలు - కడప కాలువ 1933 వరకు జలమార్గంగా కూడా ఉపయోగపడింది. ఇది పెన్నా, తుంగభద్ర నదులను కలుపుతుంది. కర్నూలు వద్ద సుంకేశులలో ప్రారంభమవుతుంది.వాటితో పాటు ఒరిస్సా కాలువ, మడ్నిపూరు కాలువ, దామోదర కాలువ, పశ్చిమతీర కాలువ తదితరాలను జలరవాణాకు ఉపయోగిస్తున్నారు.

 

ఇన్‌ల్యాండ్‌ వాటర్‌ వేస్‌ అథారిటీ: కేంద్ర ప్రభుత్వం 1986, అక్టోబర్‌ 27న ఇన్‌ల్యాండ్‌ వాటర్‌ వేస్‌ ఆథారిటీస్‌ ఆఫ్‌ ఇండియాను ఏర్పాటుచేసింది. దీని ప్రధాన కార్యాలయం నోయిడాలో ఉంటుంది. దేశంలో పలుచోట్ల దీని ప్రాంతీయ కార్యాలయాలున్నాయి. జాతీయ జలమార్గాల అభివృద్ధి, నిర్వహణ దీని బాధ్యత. జాతీయ జలమార్గాలు అనే భావవను 1982లో ప్రవేశపెట్టారు. దేశంలో 111 జాతీయ జలమార్గాలున్నాయి. లోతట్టు జలమార్గాల అభివృద్ధిలో భాగంగా 26 జాతీయ జలమార్గాలకు సరకు రవాణా విషయంలో ప్రాధాన్యత ఇచ్చారు. వాటిలో 14 మార్గాల అభివృద్ధికి చర్యలు ప్రారంభమయ్యాయి. 2020 నుంచి 3 సంవత్సరాలపాటు జలమార్గాల వినియోగ ఛార్జీలకు మినహాయింపు ఇచ్చారు. ఇన్‌ల్యాండ్‌ వెసెల్స్‌ చట్టం- 1917 స్థానంలో 2021లో కొత్త చట్టం రూపుదిద్దుకుంది.

 

జాతీయ జలమార్గం-4:  2008, నవంబరు 24న ఈ జలమార్గాన్ని ప్రకటించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరిలలో 1095 కి.మీ. మేర  జాతీయ జలమార్గం-4 సాగుతుంది. తెలంగాణలోని భద్రాచలం వంతెన వద్ద ప్రారంభమై పుదుచ్చేరిలోని కనగచెట్టికులం వంతెన వద్ద అంతమవుతుంది. ఇందులో కాకినాడ, ఏలూరు, కుమ్మనూరు, బకింగ్‌ హాం కాలువలు అంతర్భాగం. ఈ జలమార్గంలో 690 కి.మీ. పొడవున కాలువ భాగం, 328 కి.మీ. మేర గోదావరి, కృష్ణా నదులు భాగంగా ఉంటాయి.


సముద్ర రవాణా/నౌకా రవాణా:  ఇది 

1) తీరప్రాంత రవాణా 

2) విదేశీ రవాణా అని రెండు రకాలు.


తీరప్రాంత రవాణా: భారతదేశానికి తూర్పు, పశ్చిమ తీరాలు కలిపి 7,517 కి.మీ. సముద్ర తీరం ఉంది. 12 ప్రధాన రేవులు, 205 వరకు చిన్న రేవులు ఉన్నాయి. వాటి ద్వారా జరిగే దేశీయ రవాణాను తీరప్రాంత రవాణా అంటారు. వివిధ దీవులు తీరం వెంట విస్తరించి ఉండటంతో దేశ వాణిజ్యానికి కీలక సహజవనరుగా తీరప్రాంత రవాణా ఉపయోగపడుతోంది. మన ఆర్థిక వ్యవస్థలో ముఖ్యమైన రవాణా రంగంలో భారతీయ నౌకాయాన పరిశ్రమ చిరకాలం నుంచి కీలక పాత్ర పోషిస్తోంది. ఈ మేరకు పరిమాణం రీత్యా సుమారు 95 శాతం, విలువరీత్యా 68 శాతం వరకు వాణిజ్యం సముద్ర రవాణా ద్వారా సాగుతోంది.


విదేశీ రవాణా: అంతర్జాతీయ రవాణాకు జలమార్గాలు ఆయువు పట్టుగా వ్యవహరిస్తాయి. భారతదేశ అంతర్జాతీయ వ్యాపారంలో సరకుల రవాణాలో 95 శాతం, వ్యాపార విలువలో 70 శాతం వరకు నౌకల ద్వారానే జరుగుతోంది. ప్రణాళికా కాలంలో అంతర్జాతీయ నౌకా రవాణాలో భారతీయ నౌకా కంపెనీల వాటా పెరుగుతూ వస్తోంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అధికంగా రవాణా నౌకలున్న దేశాల్లో భారతదేశం ఒకటి. ప్రపంచంలో 16వ స్థానంలో ఉంది.

 

షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా: 1961, అక్టోబరు 2న షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఒక ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీగా ఏర్పాటైంది. 1992, సెప్టెంబరు 10 నుంచి పబ్లిక్‌ లిమిటెడ్‌ కంపెనీగా మారింది. ఇది దేశంలో అతి పెద్ద షిప్పింగ్‌ కంపెనీ. ప్రధాన కార్యాలయం ముంబయిలో ఉంది. 2008, ఆగస్టులో దీనికి నవరత్న హోదా వచ్చింది. ప్రస్తుతం ఈ కంపెనీ మూలధనంలో కేంద్ర ప్రభుత్వ వాటా 75 శాతం. దీని ప్రైవేటీకరణకు 2019, నవంబరులో కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది.


ప్రధాన రేవులు: దేశంలోని తీర ప్రాంతం పొడవునా 12 ప్రధాన ఓడరేవులున్నాయి. తూర్పు, పశ్చిమ తీరాల్లో ఒక్కోవైపు 6 రేవులున్నాయి. విశాఖపట్నం రేవు సహజంగా ఏర్పడింది. లోతైనది, పురాతనమైనది. దీనికి మూడు హార్బర్లు ఉన్నాయి. చెన్నై రేవు కూడా ప్రాచీనమైనదే. దీనిని కృత్రిమంగా ఏర్పాటుచేశారు. దేశంలో ముంబాయి రేవు అతిపెద్దది. ఎక్కువ రద్దీగా ఉంటుంది. కొచ్చిన్‌ రేవు కూడా సహజంగా ఏర్పడింది. జవహర్‌లాల్‌ నెహ్రూ రేవు, ఎన్నూరు రేవులు ఆధునికమైనవి. ఇందులో ఎన్నూరు రేవు ప్రైవేటు యాజమాన్యం కింద ఉంది. కోల్‌కతా, పారాదీప్, విశాఖపట్నం, చెన్నై, ట్యూటికోరిన్, మార్మగోవా, ముంబయి వద్ద నౌక దళాల కేంద్రాలున్నాయి.


సేతు సముద్రం షిప్‌ ఛానల్‌ ప్రాజెక్టు:  పాక్‌ స్ట్రెయిట్, పాక్‌ బే ద్వారా గల్ఫ్‌ ఆఫ్‌ మన్నార్, బంగాళాఖాతాలను కలిపే ప్రాజెక్టు ఇది. దీనివల్ల దేశంలోని తూర్పు, పడమటి తీరాల మధ్య నౌకలు, నిరాటంకంగా నడవటానికి వీలవుతుంది. ఇది ఇంకా పూర్తికావాల్సి ఉంటుంది.

 

సాగరమాల ప్రాజెక్టు: దేశంలో ఓడరేవుల ప్రగతికి పెద్దపీట వేస్తూ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా సాగరమాల కార్యక్రమాన్ని 2003లో ప్రతిపాదించింది. 2015, మార్చి 25న కేంద్ర మంత్రిమండలి ఆమోదించింది. 2015, జులై 15న బెంగళూరులో ఈ ప్రాజెక్టును ఆవిష్కరించారు. దేశంలో 12 ప్రధాన ఓడరేవులను అభివృద్ధి చేయడం, తద్వారా ఆర్థికాభివృద్ధికి సాయపడటం దీని లక్ష్యం. ఓడరేవుల ఆధునీకరణ, వాటి మధ్య అనుసంధానాన్ని పెంచడం, రేవు ఆధారిత పారిశ్రామీకరణకు తోడ్పడటం, తీరప్రాంత సమాజ అభివృద్ధి ఈ పథకంలో భాగాలు. 2035 వరకు 500 ప్రాజెక్టుల్లో అమలు చేయాలని గుర్తించారు.


నౌకాయానం:  నౌకాయానం, రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖను 2009లో విభజించి కేంద్ర నౌకాయాన మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారు. దేశ ఆర్థిక ప్రగతిలో సముద్ర రవాణా రంగం ఒక కీలక మౌలిక సదుపాయం. దీని ద్వారా ప్రగతి వేగం, స్వరూపం, శైలి సానుకూల రీతిలో ప్రభావితమవుతాయి. ఈ మంత్రిత్వ శాఖ పేరును 2020లో ఓడరేవులు - నౌకాయానం - జలమార్గాల శాఖగా మార్చారు.దేశంలో ప్రధాన ఓడరేవులు - నౌకా నిర్మాణం, మరమ్మతులు, దేశీయ జల రవాణా వంటి వాటితో కూడిన నౌకాయాన - ఓడరేవుల రంగం ఈ శాఖ పరిధిలో ఉంటుంది. ఇది నౌకాయానం, సంబంధిత నియమ నిబంధనలు, చట్టాలు రూపకల్పన - నిర్వహణ బాధ్యతలు చూసే అత్యున్నత వ్యవస్థ. ప్రధాన ఓడరేవుల్లో బెర్తులు, సరకు రవాణా, నిర్వహణ సామర్థ్యం ప్రస్తుతం 1617.39 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు. పెరుగుతున్న విదేశీ వాణిజ్య అవసరాల దృష్ట్యా దీన్ని మరింత మెరుగుపరుస్తున్నారు.


సాగరమాల సముద్ర విమాన సేవల ప్రాజెక్టు:  2020, అక్టోబరులో మొదట అహ్మదాబాద్‌లోని కేవడియా-సబర్మతి నదీ తీరంలో సముద్ర విమానసేవ ప్రారంభించారు. దేశవ్యాప్తంగా నిరాటంకంగా, వేగవంతమైన ప్రయాణానికి వీలు కల్పించటం ఈ ప్రాజెక్టు లక్ష్యం. 2021, జనవరిలో దీనిని సాగరమాల సముద్ర విమాన సేవల ప్రాజెక్టుగా ప్రకటించారు. అందుకోసం సాగరమాల అభివృద్ధి కంపెనీ లిమిటెడ్‌ ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టు కింద సేవలకు ఉడాన్‌ రాయితీ పథకం వర్తిస్తుంది.


సాగరమాల అభివృద్ధి కంపెనీ లిమిటెడ్‌:  దీనిని 2016లో నెలకొల్పారు. సాగరమాల ప్రాజెక్టుకు నిధులను సమీకరిస్తుంది. ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, మారిటైం మండళ్లు ఏర్పాటు చేసిన స్పెషల్‌ పర్పస్‌ వెహికల్స్‌కి సహాయం అందిస్తుంది.

 

స్మార్ట్‌ ఓడరేవులు:  దేశంలోని 12 ప్రధాన ఓడరేవుల సమీపంలో నగరాలు నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.5,000 కోట్ల వ్యయంతో ప్రణాళికను సిద్ధం చేసింది. ప్రతి నగరానికి రూ.3,000 కోట్ల నుంచి రూ.4,000 కోట్ల వరకు ఖర్చవుతుంది. ఈ నగరాల్లో ప్రత్యేక ఆర్థిక మండలాలు, ఓడలను విడగొట్టే కేంద్రాలు, ఓడ నిర్మాణ కేంద్రాలను నెలకొల్పుతారు. రేవు వద్ద రేవు వ్యర్థాలతో విద్యుత్తు తయారుచేస్తారు. ఈ పారిశ్రామిక నగరాలు అంతర్జాతీయ ప్రమాణాలను కలిగి ఉంటాయి. మొదట గుజరాత్‌లోని కాండ్లా రేవు వద్ద స్మార్ట్‌ నగరం నిర్మిస్తారు.

 

జలమార్గాల అభివృద్ధి:  దేశంలో లోతట్టు జల రవాణా అనుసంధానానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. అంతకుముందు కేవలం 5 జాతీయ జలమార్గాలు ఉండగా, అదనంగా 106 జలమార్గాలను జాతీయ జలమార్గాలుగా ప్రకటించింది. గంగా-హల్దియా జాతీయ జలమార్గంలో జలమార్గ అభివృద్ధి ప్రాజెక్టు అమలుచేసి, 1500-2000 టన్నుల సామర్థమున్న నౌకలు నడిపే విధంగా వసతులు కల్పిస్తారు.

 

 


 

రచయిత: ధరణి శ్రీనివాస్‌


 

 

Posted Date : 28-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌