• facebook
  • whatsapp
  • telegram

నీరు

జీవకోటికి ప్రాణాధారం!

 

నీరు జీవకోటికి ప్రాణాధారం. భూమిపైన, మనిషి శరీరంలో ఎక్కువ శాతం ఉన్నది నీరే. పెరుగుతున్న జనాభా, మానవ చర్యల కారణంగా గతితప్పుతున్న రుతుపవనాలు, జల కాలుష్యం కారణంగా నీటి కొరత జఠిలంగా మారుతోంది. జనాభా అవసరాలకు తగినట్లుగా తాగు, సాగు నీటి సరఫరా చేయలేక ప్రభుత్వాలు అష్టకష్టాలు పడుతున్నాయి. దేశాలు, రాష్ట్రాలు, ప్రాంతాల మధ్య జల జగడాలు ముదురుతున్నాయి. ఇలాంటి తరుణంలో నీటి అవసరం, లభ్యత, దాని రూపాలు, ప్రధాన జలవనరుల గురించి అభ్యర్థులకు ప్రాథమిక పరిజ్ఞానం ఉండాలి. రుతుపవనాల స్వభావం, నీటికొరతకు కారణాలు, జలసంరక్షణ పద్ధతులు, మురుగునీటిని మంచినీటిగా మార్చే విధానాలపై అవగాహన పెంచుకొని సమస్యకు పరిష్కారాలను తెలుసుకోవాలి.

 

నీటిని ప్రధానంగా ఇంటి/కుటుంబ, వ్యవసాయ, ఇతర అవసరాల కోసం ఉపయోగించుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా 783 మిలియన్ల మందికి పరిశుభ్రమైన నీరు అందుబాటులో లేదు. శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి, ఇతర శారీరక విధులు నిర్వహించడానికి మన శరీరం నీటిని ఉపయోగించుకుంటుంది. సాధారణంగా మనిషికి తాగడానికి రోజుకు దాదాపు రెండు, మూడు లీటర్ల నీరు అవసరం. ఆహారం జీర్ణమవడానికి, శరీరం నుంచి వ్యర్థ పదార్థాలను తొలగించడానికి ఆ నీరు ఎంతో సహాయపడుతుంది. ఇతర ద్రవపదార్థాల మాదిరి నీటిని కూడా లీటర్లు, మిల్లీలీటర్లలో కొలుస్తారు. దైనందిన అవసరాలకు నీరు నదులు, చెరువులు, కుంటల నుంచి లభిస్తుంది. పండ్లు, కూరగాయల్లోనూ నీరు ఉంటుంది. పుచ్చకాయ, బత్తాయి, సొర, దోస లాంటి పండ్లలో నీరు అధికంగా ఉంటుంది. మన బరువులో 70% నీరే.


 భూమిపై అనేక నీటివనరులు ఉన్నాయి. భూగోళం మొత్తంలో 3/4వ వంతు నీటితో నిండి ఉంది. భూమిపై లభించే మొత్తం నీటిలో కేవలం 3% మాత్రమే మంచినీరు ఉంది. డబ్ల్యూహెచ్‌ఓ ప్రకారం ప్రతి మనిషికి రోజుకు కనీస అవసరాలకు 50 లీటర్ల నీరు కావాలి.


మూడు రూపాలు:  ప్రకృతిలో సహజసిద్ధంగా నీరు మూడు రూపాల్లో ఉంటుంది.


ఘన రూపం: నీరు గట్టిగా, గడ్డ కట్టినట్టుగా ఉండటాన్ని ‘మంచుగడ్డ’ అంటారు. మంచు ప్రకృతిలో సహజంగా ఏర్పడుతుంది. శీతాకాలంలో నూనెలు, నెయ్యి గడ్డ కట్టడాన్ని ఘనీభవనం అంటారు.


ద్రవ రూపం: మంచును వేడి చేస్తే నీరుగా మారుతుంది. దీనినే ద్రవీభవనం అని కూడా అంటారు. వేసవిలో ధ్రువ ప్రాంతాల్లో మంచు కరిగి నీరుగా మారుతుంది.


వాయు రూపం: నీటిని వేడి చేస్తే అది ఆవిరిగా మారుతుంది. ఈ దృగ్విషయాన్ని బాష్పీభవనం అంటారు. నీటి వనరుల్లో నీరు సూర్యకిరణాల వల్ల వేడెక్కి ఆవిరిగా, మేఘాలుగా మారడం. మొక్కల్లోని నీరు పత్రరంధ్రాల ద్వారా బాష్పీభవనం చెందడం.


సాంద్రీకరణం: నీటి ఆవిరిని చల్లార్చినప్పుడు నీరుగా మారే ప్రక్రియను సాంద్రీకరణం అంటారు. ఇదొక ఉష్ణీకరణ ప్రక్రియ.


అనువర్తనాలు: 

* శీతాకాలంలో మాట్లాడుతున్నప్పుడు నోటి ముందు పొగలు రావడం.


* గ్లాసు నీటిలో మంచు ముక్కలు వేసిన కాసేపటి తర్వాత దాని చుట్టూ నీటి బిందువులు ఏర్పడటం.


* వేసవిలో షవర్‌ కింద స్నానం చేసినప్పుడు మన శరీరం వెచ్చగా అనిపించడం.


మేఘాలు-వర్షం:   వేసవి కాలంలో నీటి వనరుల్లో నీరు వేడెక్కి బాష్పీభవనం చెంది మేఘాలుగా మారుతుంది. భూమి పైపొరల్లోని చల్లని గాలులు ఇక్కడ ఉన్న మేఘాల మీదుగా వీచినప్పుడు అవి చల్లబడి, నీటి బిందువులుగా మారి వర్షం రూపంలో భూమిని చేరుతుంది. వాతావరణం అత్యంత చల్లగా ఉన్న సందర్భాల్లో చిన్నచిన్న నీటి బిందువులు స్ఫటికాలుగా ఘనీభవించి మంచు కురిసినట్లు కనిపిస్తుంది. మరికొన్ని సందర్భాల్లో పెద్ద పెద్ద నీటి బిందువులు ఘనీభవించి మంచు ముక్కలుగా కింద పడతాయి. వీటినే వడగండ్లు అంటారు. వర్షం, మంచు, వడగండ్లు లాంటివి ఆకాశం నుంచి పడే వాతావరణ పరిస్థితిని అవపాతం అంటారు.


రుతుపవనాలు: 

ఇవి రెండు రకాలు


1) నైరుతి రుతుపవనాలు: జూన్‌ నుంచి సెప్టెంబరు వరకు నైరుతి దిక్కు నుంచి వీచే చల్లని గాలులు వర్షాన్ని కురిపిస్తాయి. ఈ గాలులనే నైరుతి రుతుపవనాలు అంటారు.


2) ఈశాన్య రుతుపవనాలు: నవంబరు, డిసెంబరు మాసాల్లో ఈశాన్య మూల నుంచి వీచే చల్లని గాలులు వర్షాన్ని కురిపిస్తాయి. ఈ గాలులను ఈశాన్య రుతుపవనాలు అంటారు.


ఈ మధ్యకాలంలో రుతువులకు తగినట్లుగా వర్షాలు కురవడం లేదు. దీనికి ప్రధాన కారణం అడవులను నరికివేయడమే.


జలచక్రం: భూఉపరితలం, గాలి మధ్య జరిగే నీటి ప్రసరణను జలచక్రం (హైడ్రోలాజికల్‌ వలయం) అంటారు. ఇందులో 4 ముఖ్యమైన భాగాలు ఉంటాయి.


1) బాష్పీభవనం: ద్రవం వాయువుగా మారడం.


కారణం: సూర్యుడు నీటి వనరులను వేడి చేయడం.


ఫలితం: నీరు.. నీటి ఆవిరిగా మారుతుంది.


2) సాంద్రీకరణం: వాయువు ద్రవంగా మారడం.


కారణం: ఆవిరి గాలిలో పైకి వెళ్లి చల్లబడటం.


ఫలితం: నీటిఆవిరి మేఘాల్లో ద్రవంగా మారుతుంది.


3) అవపాతం: నీరు/గడ్డ కట్టిన నీరు భూమిపై పడటం.


కారణం: మేఘ బిందువులు బరువుగా ఉండి భూమిపై పడటం.


ఫలితం: వర్షం, మంచు, స్లీట్‌ లేదా వడగళ్ల రూపంలో అవపాతం చెందిన నీరు భూమిని చేరుతుంది.


4) సేకరణ, ప్రవాహం: నీరు భూగర్భంలోకి ఇంకడం, ప్రవహించడం.


కారణం: భూమి ఉపరితలంపై నీరు ముందుకు ప్రవహించడం.


ఫలితం: నీరు.. నదులు, సరస్సులు, చెరువుల్లో చేరుతుంది. నదులు ప్రవాహాలుగా మారి సముద్రాల్లో కలుస్తాయి. ఈ జలచక్రంలో అంతరాయం ఏర్పడితే వరదలు, కరవు కాటకాలకు దారితీస్తుంది.


* వర్షాన్ని కొలిచే పరికరం - వర్షమాపకం/ రెయిన్‌ గేజ్‌


* రిజర్వాయర్లలోని నీటిని TMC లలో కొలుస్తారు.


*వరద నీటి ప్రవాహాన్ని క్యూసెక్‌లలో కొలుస్తారు.


* ట్యాంకుల్లో నీటిని లీటర్లలో కొలుస్తారు.


* అడవుల్లో నీటిని నిల్వ చేయడానికి చెక్‌డ్యామ్‌లు, రాతి ఆనకట్టలు నిర్మిస్తారు.

 

నీటి కొరతకు ప్రధాన కారణాలు:

* జనాభా పెరుగుదల 

* అసమాన వర్షపాతం 

* భూగర్భ జలాలు తగ్గిపోవడం 

* నీటికాలుష్యం 

* నీటి అజాగ్రత్త వినియోగం


జల సంరక్షణ పద్ధతులు: జల సంరక్షణ కోసం ప్రధానంగా రెండు పద్ధతులను అనసరించవచ్చు.


1) నీటి నిర్వహణ:  


* వ్యర్థాలను నీటిలోకి వదలడం వల్ల జరిగే చెడు ప్రభావాలపై అవగాహన కల్పించడం.


* కాలుష్యాలను వేరు చేయడం ద్వారా నీటిని పునఃచక్రీయం చేయడం.


* వ్యవసాయంలో రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించడం.


* అటవీ నిర్మూలనను తగ్గించడం.


* వ్యవసాయంలో బిందు సేద్యం, తుంపర సేద్యం అవలంబించడం.


2) వర్షపు నీటి నిర్వహణ:  వర్షపు నీటిని ప్రత్యక్షంగా సేకరించి, వాడటాన్ని వర్షపు నీటి నిర్వహణ అంటారు. వర్షపు నీటి నిర్వహణలో రెండు రకాలున్నాయి.


 ఎ) వర్షపు నీరు పడినచోటు నుంచే సేకరించడం.


బి) ప్రవహించే వర్షపు నీటిని సేకరించడం.


* మార్చి 22న ప్రపంచ జలదినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సభ ప్రకారం 2030 నాటికి నీటి కొరత 40% పెరిగి, ప్రపంచం నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. నీటి నిర్వహణపై మన దృక్పథాన్ని మార్చడం కోసం ఐక్యరాజ్యసమితి 2018-2028 మధ్య కాలాన్ని అంతర్జాతీయ జల దశాబ్దంగా గుర్తించింది. సాధారణంగా భూగర్భ జలాలు నీటిమట్టానికి కింద గట్టి రాతి పొరల మధ్య నిల్వ ఉంటాయి. వీటినే ఆక్విఫర్‌లు అంటారు.


మురుగునీటిని శుభ్రపరిచే దశలు:  ఇల్లు, ఆసుపత్రులు, పరిశ్రమలు, కార్యాలయాల నుంచి విడుదలయ్యే వృథా నీటిని మురుగునీరు అంటారు. నీటిని శుద్ధి చేయడానికి 7 దశలు ఉంటాయి.


దశ-1: మొదటగా నీటిని కడ్డీల తెర ద్వారా పంపి చెత్తాచెదారం, కర్రలు, ఆకులు, ప్లాస్టిక్‌ డబ్బాలను తొలగిస్తారు.


దశ-2: ఈ దశలో నీటిలో ఇసుక, మట్టిని తొలగించడానికి నీటి వేగాన్ని తగ్గిస్తూ ట్యాంకులోకి పంపడం వల్ల అడుగు భాగాన ఇసుక, మట్టి చేరతాయి.


దశ-3: ఈ దశలో నీటిని ఏటవాలుగా ఉన్న ట్యాంకులోకి పంపడం వల్ల ఘనరూపంలోని పదార్థాలు అడుగు భాగానికి చేరతాయి. దీనినే ద్రవరూప మురుగు అంటారు. వీటిని స్క్రాపర్లతో తొలగిస్తారు. నీటిపైన తేలే నూనె, గ్రీజు లాంటి మరకలను తొలగించడానికి స్కిమ్మర్‌లను వాడతారు. ఈ నీటినే నిర్మలమైన నీరు అంటారు.


దశ-4: ఈ దశలో ఉన్న నీటిలోకి అవాయు బ్యాక్టీరియాను పంపి, అందులోని పదార్థాలు కుళ్లిపోయే విధంగా చేసి దాని నుంచి విడుదలయ్యే బయోగ్యాస్‌ నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేస్తారు.


దశ-5: ఈ దశలో ఉన్న నీటిని గాలిలోకి పంపి వాయుసహిత బ్యాక్టీరియాను వృద్ధి చెందిస్తారు. ఈ విధంగా చేయడం వల్ల దీనిలోని వ్యర్థాలను బ్యాక్టీరియా వినియోగించుకుంటుంది.


దశ-6: ఈ దశలో నీటిని కొన్ని గంటల పాటు నిల్వచేస్తే ట్యాంకు అడుగు భాగాన సూక్ష్మజీవులు చేరతాయి. దీనినే క్రియాశీల మురుగు అంటారు.


దశ-7: ఈ దశలో క్రియాశీల మురుగులో దాదాపు 97% నీరు ఉంటుంది. ఈ నీటిలోని మురుగును ఇసుక పర్రలు లేదా యంత్రాలతో తొలగించి పరిశుభ్రమైన నీటిని పొందుతారు.


మాదిరి ప్రశ్నలు


1. ప్రపంచవ్యాప్తంగా ఎంతమందికి పరిశుభ్రమైన నీరు అందుబాటులో లేదు?

ఎ) 783 మిలియన్లు    బి) 1000 మిలియన్లు    సి) 997 మిలియన్లు   డి) 1083 మిలియన్లు

 


2. మానవుడికి సరైన శారీరక పనితీరు కోసం రోజుకు ఎన్ని లీటర్ల నీరు అవసరం?

ఎ) 5 - 6 లీటర్లు  బి) 5 - 10 లీటర్లు     సి) 2 - 3 లీటర్లు   డి) 3 - 8 లీటర్లు

 


3. మన శరీర బరువులో ఎంత శాతం నీరు ఉంటుంది?

ఎ) 80%     బి) 70%   సి) 60%   డి) 50%

 


4. భూమిపై లభించే మొత్తం నీటిలో మంచి నీటి శాతం?

ఎ) 2%   బి) 4%     సి) 5%    డి) 3%



5. రిజర్వాయర్‌లో నీటిని కొలిచే ప్రమాణాలు?

ఎ) క్యూసెక్‌     బి) TMC    సి) లీటర్లు    డి) గ్యాలన్లు

 


6. డబ్ల్యూహెచ్‌ఓ ప్రకారం ప్రతి మనిషికి రోజుకు కనీస అవసరాల కోసం ఎన్ని లీటర్ల నీరు కావాలి?

ఎ) 30 లీ.    బి) 60 లీ.     సి) 50 లీ.    డి) 40 లీ.



7. ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరాన్ని అంతర్జాతీయ జలదశాబ్దంగా గుర్తించింది?

ఎ) 2010 - 20     బి) 2005 - 2015     సి) 2018 - 2028     డి) 2020 - 2030



8. ఏ తేదీన ప్రపంచ జలదినోత్సవాన్ని నిర్వహిస్తారు? 

ఎ) మార్చి 10     బి) మార్చి 22     సి) అక్టోబరు 10    డి) అక్టోబరు 22



9. ఏ దశలో నీటిపై తేలే పదార్థాలను స్కిమ్మర్‌లతో అడుగు భాగాన ఉన్న మురుగును స్కాపర్‌లతో తొలగిస్తారు?

ఎ) దశ-3      బి) దశ-2      సి) దశ-1    డి) దశ-4



10. క్రియాశీల మురుగులో దాదాపుగా ఉండే నీటి శాతం?

ఎ) 90%   బి) 99%     సి) 80%    డి) 97%



సమాధానాలు: 1-ఎ; 2-సి; 3-బి; 4-డి; 5-బి; 6-సి; 7-సి; 8-బి; 9-ఎ; 10-డి.

 

 

రచయిత: చంటి రాజుపాలెం


 

 

Posted Date : 12-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌