• facebook
  • whatsapp
  • telegram

భారతదేశంలో స్త్రీలు

 దయనీయ దశదాటి.. సాధికారత దిశగా!

 

 

కనీస మానవ హక్కులు లేవు, అనుకున్నది చేసే స్వేచ్ఛ లేదు, ఆర్థిక స్వాతంత్య్రం లేదు, అధికారం అసలే లేదు. జనాభాలో సగం ఉన్నా పీడనలు, దౌర్జాన్యాలకు గురికాక తప్పడంలేదు. అడుగడుగునా ఆంక్షలు, అణచివేతలు, అసమానతలతో అనాది కాలం నుంచి ఆధునిక యుగం వరకు అతివలు అనేక విధాలుగా వివక్షకు గురవుతూనే ఉన్నారు. వేదకాలంలో మహిళలు ఉన్నతమైన గౌరవాన్ని అందుకున్నప్పటికీ, ఇతిహాస యుగాల్లో వారి స్థాయి క్షీణించింది. మధ్యలో కొద్దిగా మార్పు వచ్చినా బ్రిటిష్‌ పాలనలో మళ్లీ దిగజారింది. స్వాతంత్య్రానంతరం రాజ్యాంగ రక్షణలతో పరిస్థితులు మెరుగుపడ్డాయి. ఇప్సుడు స్త్రీలు ఆ దయనీయ దశలను దాటి సాధికారత దిశగా సాగుతున్నారు. ఈ పరిణామాలపై పోటీ పరీక్షార్థులు అవగాహన పెంచుకోవాలి. 

 

చారిత్రక అధ్యయనాలు, పౌరాణిక సాహిత్యాల ప్రకారం వైదిక యుగం తొలి దశలో (క్రీ.పూ. 2000-1000) భారతీయ స్త్రీలకు సమాజంలో ఉన్నత స్థానం ఉండేది. రుగ్వేద కాలంలోనూ సమాజం స్త్రీ, పురుషులకు సమాన హోదా కల్పించింది. అప్పట్లో వివాహం తప్పనిసరి కాదు. కేవలం సామాజిక, మతపరమైన విధి.

పురాణ, ఇతిహాసాల కాలంలో స్త్రీల స్థాయి తగ్గిపోయింది. స్త్రీ, పురుష సమానత్వం లేదు. వైదిక విజ్ఞానం స్త్రీలకు అందుబాటులో లేకుండా పోయింది. సీతాదేవి, సతీ అనసూయ, సావిత్రి, దమయంతి లాంటి ఆదర్శప్రాయమైన స్త్రీలకు గౌరవం లభించింది. బౌద్ధ, జైన మతాలు తొలుత స్త్రీల పట్ల ఉదాసీనత చూపించాయి. బుద్ధుడు మొదట మహిళలను బౌద్ధ మతంలో చేర్చుకోడానికి సుముఖత చూపలేదు. తర్వాత కాలంలో బౌద్ధ, జైన మతాల్లో స్త్రీలకు ప్రాధాన్యం పెరిగింది.

15వ శతాబ్దం నాటికి పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది. భారతీయ సమాజంలో పునరుజ్జీవన ప్రయత్నాలు జరిగాయి. ఈ విషయంలో భక్తి ఉద్యమం ప్రధాన పాత్ర పోషించింది. భక్తి ఉద్యమకారులు స్త్రీ, పురుష సమానత్వాన్ని; స్త్రీలకు పురుషులతో సమాన అవకాశాలు కల్పించడాన్ని తమ రచనల్లో, కార్యక్రమాల్లో ప్రచారం చేశారు. పరిపాలనా రంగంలోనూ అతివలు విజయవంతంగా పాల్గొన్నారు. కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించిన రుద్రమదేవి గురించి మార్కోపోలో తన రచనల్లో పేర్కొన్నాడు.

రజియాబేగం, నూర్జహాన్, మెహరున్నీసా, మాహం అంగా, చాంద్‌బీబీ, తారాబాయి, అహల్యాబాయి వోల్కర్‌ లాంటి స్త్రీలు కూడా రాజ్యాలను పరిపాలించారు. ఆ కాలంలో ప్రసిద్ధి చెందిన వనితల్లో జహనారా, రోషనారా, జేబున్నీసా (ఔరంగజేబు కుమార్తె), జిజియాబాయి (శివాజీ తల్లి) లాంటి వారిని సమర్థ భారత నారీమణులకు ప్రతినిధులుగా ప్రస్తావిస్తారు. 

 

స్త్రీల సాధికారత

సాధికారత అంటే హక్కులను పొందడం, మూర్తిమత్వాభివృద్ధి, స్వయంగా నిర్ణయాలు తీసుకునే ప్రక్రియ. చట్టం ముందు సమానత్వం లేకపోతే సాధికారత ఒక మిథ్యగానే మిగిలిపోతుంది. దేశాభివృద్ధికి స్త్రీల సమానత్వం ఒక మౌలిక అవసరం. మహిళల హోదా దేశ ప్రజాస్వామ్యం, మానవ హక్కుల సక్రమ అమలుకు ఒక సూచిక.

దేశ జనాభాలో సగ భాగం స్త్రీలే. కానీ అక్షరాస్యత రేటు, శ్రామికశక్తి, సహభాగిత రేటు, ఆదాయం లాంటి అంశాల్లో పురుషులతో పోలిస్తే ఎంతో వెనుకబడి ఉన్నారు. భారత ప్రభుత్వం స్త్రీల సామాజిక ఆర్థిక పురోగతి, అభివృద్ధి కోసం వివిధ పథకాలను అమలుచేస్తోంది.

స్త్రీ సాధికారత అంటే స్త్రీలు ఆర్థికంగా, స్వతంత్రంగా ఉండేటట్లు, వ్యక్తిగతంగా ఆత్మవిశ్వాసంతో, ఆత్మగౌరవంతో ఏ క్లిష్ట పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కొనేలా చేయడం. అది ఒక గతిశీల ప్రక్రియ.

స్త్రీల సాధికారత ప్రయత్నాలు/ ఉద్దేశాలు:  1) స్త్రీల హక్కుల పట్ల అవగాహన పెంచడం. 2) జీవన ప్రమాణాలను మెరుగుపరచడం. 3) ఉత్పాదక వనరులను సమానంగా పొందే విధంగా చేయడం. 4) స్త్రీకి, ఆమె పిల్లలకు మెరుగైన ఆరోగ్య సంరక్షణ. 5) అధిక అక్షరాస్యత స్థాయి, విద్య. 6) ఆర్థిక, వాణిజ్య రంగాల్లో భాగాస్వామ్యాన్ని పెంచడం. 7) ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం పెంపు.

స్త్రీల సాధికారతా జాతీయ పథకం-2001: ఈ పథకం ఉద్దేశాలలో ముఖ్యమైనవి. 1) మహిళలు సంపూర్ణంగా అభివృద్ధి చెందేందుకు కావాల్సిన ఆర్థిక, సామాజిక పరిస్థితులు కల్పించడం. 2) స్త్రీల పట్ల అన్నిరకాల వివక్షలను నిర్మూలించేగలిగే విధంగా న్యాయవ్యవస్థను బలోపేతం చేయడం. 3) అభివృద్ధి ప్రక్రియలో లింగభేద కోణాన్ని వెలుగులోకి తీసుకురావడం. 4) స్త్రీలు, బాలికలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న అన్నిరకాల హింసను నిర్మూలించడం.

 

రాజ్యాంగ రక్షణలు

భారత రాజ్యాంగం స్త్రీలకు సమానత్వాన్ని కల్పించింది. మహిళల అనుకూల/పక్షపాత కార్యక్రమాలు చేపట్టే అధికారాన్ని ప్రభుత్వాలకు ఇచ్చింది. 1993లో 73, 74వ రాజ్యాంగ సవరణల ద్వారా స్థానిక పరిపాలనా సంస్థలైన పంచాయతీలు, మున్సిపాలిటీల్లో మహిళలకు మూడింట ఒక వంతు సీట్లు కేటాయించారు.

స్త్రీల హక్కుల రక్షణ కోసం చేసిన కొన్ని చట్టాలు: 1) హిందూ వివాహ చట్టం - 1955 2) హిందూ ఆస్తి సంక్రమణ చట్టం - 1956 3) వరకట్న నిషేధ చట్టం - 1961 4) గర్భస్రావ చట్టం (మెడికల్‌ టెర్మినేషన్‌ ఆఫ్‌ ప్రెగ్నెస్సీ యాక్ట్‌) - 1971 5) సమాన వేతనాల చట్టం - 1976 6) బాల్య వివాహ నిరోధక చట్టం - 1976

స్త్రీ సాధికారత కోసం భారత ప్రభుత్వం చేపట్టిన కొన్ని సంక్షేమ పథకాలు: 1) ఉపాధి శిక్షణ కార్యక్రమం - 1987 2) మహిళా సమృద్ధి యోజన - 1993 3) రాష్ట్రీయ మహిళా కోశ్‌ - 1993 4) ఇందిరా మహిళా యోజన - 1995

* 2001, జులై 12న మహిళా సమృద్ధి యోజన, ఇందిరా మహిళా యోజనలను ఐక్యం చేసి ‘‘స్వయం సిద్ధ’’ అనే స్వయం సహాయక సమూహ కార్యక్రమాన్ని రూపొందించారు.

 

వివిధ మతాల్లో స్త్రీల స్థాయి

హిందూ మతం: 

ఇతిహాస కాలంలో:  రామాయణం, మహాభారతాల్లో స్త్రీల స్థాయిని వివరించారు. శ్రీరాముడి తల్లి కౌసల్య ‘సృష్టి’ యాగం నిర్వహించింది. సీత మంత్రయుక్తంగా సంధ్యావందనం చేసేది. స్త్రీలను గౌరవిస్తే దేవతలను పూజించినట్లేనని భీష్ముడు పేర్కొన్నాడు. వీటిని బట్టి ఇతిహాసం కాలంలో స్త్రీకి ఉన్నత హోదా ఉండేదని అర్థమవుతోంది.

స్మృతుల కాలంలో: ‘మను’ స్త్రీలను గౌరవించాలని పేర్కొన్నాడు. స్త్రీలు సుఖంగా ఉన్నచోట అన్ని రకాల సుఖశాంతులు ఉంటాయని, ఎక్కడ స్త్రీలు బాధపడతారో అక్కడ వినాశనం వాటిల్లుతుందని చెప్పాడు.

వాత్సాయనుడు: స్త్రీకి స్వేచ్ఛ, స్వాతంత్య్రం ఇవ్వకూడదన్నాడు.

గౌతముడు: బాల్య వివాహాలను ప్రోత్సహించాడు.

బౌద్ధం, ఇస్లాం మతాల ప్రభావం: * మనుషులంతా సమానమని ఇస్లాం బోధించింది. * స్త్రీలు, పురుషులు సమానమని బౌద్ధులు భావించారు. బౌద్ధ సన్యాసులుగా ఉండటానికినికి కూడా స్త్రీకి అర్హత లభించింది.* ఇస్లాం ప్రభావం భారతీయులపై అధికంగా పడింది. పర్దా వంటి పద్దతులను హిందూ మహిళలు అలవరుచుకున్నారు.

బ్రిటిష్‌ పరిపాలనా కాలంలో: బ్రిటిష్‌ కాలంలో హిందూ స్త్రీలకు విద్యావకాశాలు చాలా తక్కువ, లేదా అసలు ఉండేవి కావు. సమాజంలో హిందూ స్త్రీ పాత్ర దయనీయంగా ఉండటాన్ని గ్రహించిన వారిలో రాజా రామ్మోహన్‌ రాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, దయానంద సరస్వతి మొదలైన వారున్నారు. వీరంతా సతీసహగమనాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. సమాజంలో స్త్రీ అంతస్తు దిగజారిపోవడానికి కారణం అజ్ఞానమని, ఆ అజ్ఞానాన్ని నిర్మూలించేందుకు స్త్రీలంతా చదువుకోవాలని నొక్కిచెప్పారు.జాతీయోద్యమాలు మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంచి, ధైర్యాన్నిచ్చాయి

స్వాతంత్య్రానంతరం: సమాజంలో స్త్రీల అంతస్తు లేదా స్థాయిని పెంచేందుకు ప్రభుత్వం విశేష కృషి చేసింది. విద్యావకాశాలు పెరిగాయి. విద్యాసంస్థలు, ఉద్యోగాల్లో కొన్ని స్థానాలను స్త్రీలకు కేటాయించారు. ప్రత్యేకంగా మహిళా విశ్వవిద్యాలయాలూ వెలిశాయి.* 1955లో హిందూ వివాహచట్టం ప్రకారం బహు వివాహాలను నిషేధించారు. * 20వ శతాబ్దంలో స్త్రీలు తమ హక్కులు, అధికారాల పట్ల అపూర్య చైతన్యం ప్రదర్శించడం ప్రారంభమైంది. ప్రత్యేక సంఘాలు ఏర్పాటై మహిళా ఉద్యమాలు పెరిగాయి. స్త్రీలు ఆర్థికంగా, రాజకీయంగా ఆధిక్యత సంపాదించారు. పరిపాలన చేపట్టారు. లింగ సమానత్వం భావన దేశంలో విస్తృతమైంది.* 21వ శతాబ్దంలో స్త్రీ విద్యను ప్రోత్సహించారు. తద్వారా హక్కుల పోరాటాలు ఉద్ధృతమయ్యాయి.

* అంతర్జాతీయ మహిళా సంవత్సరం -- 1975

* అంతర్జాతీయ మహిళా దశాబ్దం -- 1975-85

* అంతర్జాతీయ మహిళా సాధికారత సంవత్సరం 2001.

 సాధికారత అంటే పీడన, దౌర్జన్యం లేని స్థితి. అతివలకు స్వేచ్ఛ, నచ్చిన మార్గాన్ని ఎంపిక చేసుకునే అవకాశం ఇవ్వడం. సమాన హక్కులు, అధికారం, గౌరవం వంటివాటిని సమకూర్చడం.

-  సరళా గోపాలన్, కేంద్ర స్త్రీ, శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ మాజీ కార్యదర్శి


 

రచయిత: వట్టిపల్లి శంకర్‌ రెడ్డి

 

Posted Date : 21-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌